రాజమండ్రి

జన్మభూమి ( కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పచ్చిపూల మండపము. వీధి అంతా రంగురంగు దీపాలతో, నాల్గు వీధుల చావడిలో అందంగా పెద్దగేటు కట్టి అలంకరించారు. ఇది రాజకీయ పండగ అయితే రంగు జెండాలు కడతారు. అంత కంటే ఘనంగా ఎంతో అందంగా పూలు, దీపాలు అమర్చారు. సందడంతా ఆ గ్రామంలోనే ఉందా! అనేలా ఉంది.
లయన్స్ క్లబ్ వారు ఆ ఊరి ఆడ పిల్లలకు సైకిళ్లు బహూకరిస్తున్నారట. ప్రత్యేకంగా ఆ ఊరి నుంచి కిలోమీటరు వెడితేగాని స్కూలు లేదు. ఆ గ్రామానికి చెందిన రాజుగారి అబ్బాయి వాళ్ల నాన్నగారి శతజయంతి ఉత్సవాలు చేయాలని డిల్లీ నుంచి వచ్చాడు. వాళ్లు ఐదుగురు అన్నదమ్ములు, ముగ్గురు అక్కాచెల్లెళ్లు. అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల కుటుంబము వెరశి అంతా కలిపి వందమంది పైగా ఉన్నారు.
వారం రోజుల ముందు నిర్వాహకులు అన్ని పట్టణాల నుంచి, దేశాల నుంచి వచ్చారు. ఆ ఊరిలో పెద్దమేడ-ఇరవై గదులు ఉన్నాయి. వారి అన్నదమ్ముల ఇళ్లు ఉన్నాయి. అమెరికాలో కష్టపడి పెద్దపెద్ద ఉద్యోగాలు చేసి స్వంత ఊరిలో ఉన్న ఇళ్లని పొలాల్ని అమర్చి జన్మభూమిని వదలకూడదు అనే భావనతో ఉన్నారు. ఇండియాలో విషయాలు నెట్ ద్వారా తెలుసుకొనేవారు. ఆ ఊరి ప్రెసిడెంట్‌గా గ్రామీణ బ్యాంకు డైరెక్టర్‌గా చేసి మంచిపేరు ప్రఖ్యాతలున్న కుటుంబం. అంతో ఇంతో గ్రామప్రజల కోసం, కష్టసుఖాలు చూసినవాళ్లు. దోసపండు తోటలా, గుమ్మడి పండు తోటలా పిల్లలంతా ఉన్నతంగా ఎదిగారు. ఎదిగిన సొమ్ము సద్వినియోగం చేయడానికి తండ్రి ప్రతిష్ట నిలపడానికి జన్మభూమికి వచ్చి తమవంతు కొంత రుణం తీర్చాలనే నిర్ణయంతో ఒకసారి అమ్మ తరపు, నాన్న తరపు వ్యక్తుల్ని కలవడానికి వచ్చి ఈ శత జయంతి ఉత్సవాన్ని ఏర్పాటుచేశారు. పుట్టాక ఎప్పుడో చిన్నప్పుడు కలిశారు. మళ్లీ ఎన్నో ఏళ్ల తర్వాత ఆ ఊరిలో ఈ ఉత్సవానికి కలిశారు. బంధువులందరికీ కూడా మహా ఆనందం. ఆనాడు నూనుగు మీసాలతో చదువుల సరస్వతిని ఆరాధించి లక్ష్మీదేవిని వరించి జీవన గమనంలో ఎన్నో అవరోధాలు దాటి విజయాల్ని సాధించి మెరుపు, నెరుపు మీసాలతో ఈ కార్యక్రమానికి సీనియర్ సిటిజన్స్‌గా విచ్చేశారు. వాళ్ల అమ్మ మాత్రం ఎంతో ఆనందంగా ఉంది. పిల్లలంతా ఒక్కసారి ఇంటికి వచ్చారు. వారితోపాటు మనుమలు. అందరి చేతుల్లో సెల్‌ఫోన్లు, మెసేజ్‌లు, ఫేస్‌బుక్‌లు. వీటితో బిజీ. ఎవరిని పిలిచినా ఫోన్‌లో ఏవో మాట్లాడుతూనో, ఫేస్‌బుక్‌లు చూస్తూనో, వాట్సప్‌లు పంపుతూనో అరచేతిలో వైకుంఠాన్ని తలపించే టాబ్‌లు పట్టుకుని ఇల్లంతా బిజీబిజీగా ఉన్నారు. వంటవాళ్లు టిఫిన్లు, కాఫీలు, జ్యూస్‌లు వచ్చిన వాళ్లకి ఎప్పటికప్పుడు అందజేస్తున్నారు. మనుమలంతా ఇల్లంతా తిరుగుతుంటే ఆ ఆనందం అంతకంటే ఏముంది? ఒక మనిషితో ఇంకొకరు కాకుండా, లాప్‌ట్యాప్‌లు పుచ్చుకుని ‘వౌనమానుల్లో ఎవరి రీతిన వారు’ వారి ప్రపంచంలో వారు జీవిస్తున్నారు. ‘ముఖపుస్తకం’ చూస్తేగాని ముఖాలు కూడా కడుగరు. బెడ్ కాఫీలు మర్చిపోయి వాట్సప్ కాఫీలు, బ్రేక్‌ఫాస్ట్ మెసేజ్‌లు చాలు. విజ్ఞానం విశాల ఆకాశం చేరింది. ‘ఒరేయ్ నాన్నా... ఇక్కడ ఉన్నప్పుడైనా నాయనమ్మతో మాట్లాడండిరా!’ ఏం చెప్పాలన్నా ఎదురుగా ఉన్నాను.
అబ్బే ఎవరు వింటారు. ఆడపిల్లలూ అంతే. ఏవో పొట్టినిక్కర్లు, బనియన్లు, ముఖ పుస్తకంలో ఏవేవో బొమ్మలు చూసుకుంటూ మాట్లాడుకుంటూ వారి ధోరణిలో వారు ఉన్నారు. ఏ విధమైన స్పందన ఇక్కడి మనుష్యులతో ఉండదు. వారిలోకం వారిదే. మహాజ్ఞానులు. అందులో ఎన్నో రకాల దేశాన్ని ఉద్ధరించే సూక్తులు ఉంటాయి. కాని ఎదురుగా బంధువుల ఉన్నాసరే, మరచిపోయి ‘ముఖ పుస్తకం’లోని వాళ్లకే విలువనిస్తున్నారు. బామ్మ ఆవేదన పడింది. మనుమలకి బంధువుల్ని పరిచయం చేసింది. కాస్త తాతగారి జయంతి రోజైనా పట్టులంగాలు కాకపోయినా మెరిసే గాగ్రాలు కొనుక్కోమని మనవరాలిద్దరికి పదేసి వేలు ఇచ్చింది. కొంతమంది రాలేదు. వాళ్లకి వాట్సప్‌లో ఈ గాగ్రాలు పంపారు. నచ్చితే వారికి కొంటామని లైక్‌లు బాగానే వచ్చాయి. ఉత్సవం ప్రారంభం అయ్యింది. హోమాలు, జపాలు, సూర్యనమస్కారాలు అన్నీ కొడుకులు, కోడళ్లు, అల్లుళ్లు, కూతుళ్లు కూర్చుని ఘనంగా చేశారు. ఎప్పటికప్పుడు విదేశీ మనుమలకి వాట్సప్‌లో పంపించేశారు. షేర్లు, లైకులు వచ్చాయి.
బంధువులంతా వచ్చారు. అహా, ఓహో అనే ఘనాపాఠీలు, పండితులకి పట్టుశాలువాలతో సత్కరించి, కొంత డబ్బు కవర్స్‌లో పెట్టి ఇచ్చారు. చాలా బాగా జరిగింది. బంధువులందరికి ఉప్పాడ చీరలు, వెంకటగిరి చీరలు పెట్టారు. సాయంత్రానికి ఎక్కడి వారు అక్కడికి వెళ్లారు. ఖర్చు మొత్తం అన్నదమ్ములంతా పంచుకుని బిల్లు చెల్లించారు. కొడుకుల పొదుపుకి తండ్రికి చేసిన ఉత్సవానికి ఆ తల్లి సంతోషించింది. ఇనే్నళ్ల తర్వాత మళ్లీ సొంత ఊరు వచ్చి ఆ ఊరి బట్టల కొట్టులోనే బట్టలు, కిరాణా కొట్టులో సామాన్లు ఇత్తడి వెండి కొట్లల్లో బిల్లులు వేలు వేలు ఇచ్చారు. పాలేళ్లకి, రైతులకి బట్టలు పెట్టి జత స్టీలు బిందెలు పంచారు. బంధువులకి ఇత్తడివి, కొంచెం దగ్గర వాళ్లకి వెండివి, ఇంట్లో ఆడపిల్లలకి బంగారు దుద్దులు ఇచ్చారు. రెండురోజులు ఘనంగా జరిగింది. ఆ ఊళ్లో క్యాటరింగ్ వారికి ఉపాధి కలిగింది. ఉన్న ఊరు, ఉన్న మనుష్యుల్ని మర్చిపోకుండా యాభై ఏళ్ల తర్వాత వెనక్కి వచ్చి తండ్రి పేరు నిలబెట్టారు. తల్లి మనస్సు ఎంతో ఆనందపడింది. మనుషులు ఎవరి ఏంచెప్పినా, అలాగే అంటారుగాని, వాళ్ల పద్ధతిలో వాళ్లు ఉంటారు. ఎప్పుడు ఉత్సవం అయిపోతుందా అని ఆవేదన పడుతూ మూడు కాగానే, భోజనాలు అవ్వగానే అమెరిగా డ్రెస్సుల్లోకి వెళ్లిపోయారు. మళ్లీ ఎవరి రీతిన వారు వాట్సప్‌లు, ఫేస్‌బుక్‌లలో లీనమైపోయారు. చెవుల్లో ఇయర్ ఫోన్స్, చిన్న పుస్తకం లాంటి పెద్ద ఫోన్‌లతో ఎవరు ఏం పలకరించినా, చిరునవ్వే సమాధానం. వాళ్ల ప్రపంచం వారిదే! చదువు, మేథాశక్తి వల్ల జాతి మత విభేదాలు లేకుండా ఆ కుటుంబంలోని మనుమల పెళ్లిళ్లు జరిగిపోతాయి. విద్యే వీళ్లకి పతనాన్ని ఇస్తోందా? ప్రగతినిస్తోందా? కుటుంబాలు కుటుంబాలు విదేశాలకు వలసపోతున్నాయి. ఇక్కడ ఆర్థిక స్తోమత ఉన్నా సరే విదేశాలకి డాలర్ల పరుగు. స్వదేశంలో భూములమ్మి చదువులు, కన్నతల్లిదండ్రుల్ని వదలి పరుగు. ఈ దేశంలో ఏముంది??? విదేశాల్లో గొప్పలున్నాయి. తెల్లారుతోనే మంచాలెత్తి చిన్నాపెద్ద తారతమ్యంలేని ఉద్యోగాలు చేస్తున్నారు. మేం పెద్ద చదువులు చదివాము మా మేధావితనం అమెరికాలోనే! ఇండియా కాదు అని నొక్కివక్కాణించి తమ తోటలు, కొంత పొలాలు అమ్మి పరుగులు తీశారు. అయితే కొంతమందికి ఇండియా డబ్బు అంతా తీసుకెళ్లడానికి వీలులేదు. ట్రస్టు పెట్టి ఆర్థిక ఇబ్బంది ఉన్న విద్యార్థుల్ని చదివించడానికి అన్నదమ్ములు మాట్లాడుతున్నారు. వారి బంధువుల్లో ఆర్థిక ఇబ్బంది ఉన్నవారిని ఎంపిక చేసుకున్నారు. కన్నతల్లికి, ఉన్న గ్రామానికి గుర్తింపు కోసం కొంత ఉపకారం చేయాలనే తపన ఉన్నందుకు సంతోషించారు. గ్రామ ప్రెసిడెంట్‌ను కూడా పిలిచి, ఆయన్ను సత్కరించారు.
ఆ గ్రామంలో ఓ పది రోజులు ఆనందంగా అందరికి ఏదో ఒక తరహాగా కార్యక్రమాలు నిర్వహించారు. పిల్లలకి పాటలు, ఆటలు, పెద్దలకి ముగ్గులు, వంటలు, మగపిల్లలకి సైకిల్ పోటీలు, బ్యాడ్మింటన్, కబడ్డీ గ్రామీణ ఆటల్ని ప్రోత్సహించడమే కాక వీడియోతీసి యూట్యూబ్‌లో పెట్టారు. విదేశంలో తమ గొప్పతనం చెప్పుకోవడానికే అంటారు.
ప్రతీ వంశము ఒక చెట్టు లాంటిది, ఆ చెట్టు నుంచి ఎన్నో కొమ్మలు చాలా దూరం వ్యాపిస్తాయి. పుష్పాలు, ఫలాల్ని ఇస్తాయి. అయితే వ్రేళ్లు మాత్రం భూమిలోనే ఉంటాయి. మనుష్యుల జీవితాలు కూడా గ్రామాల్లో వేళ్లల్లో పాతుకుపోయి ఉంటాయి. చదువుకుని విద్యావంతులుగా విదేశాల్లో జయకేతనం ఎగురవేస్తారు. అంతమాత్రాన వ్రేళ్లను వదులుతాయా! కుటుంబ వ్యవస్థ అంతే. ఎక్కడో పెరిగి, ఎక్కడో చదివి ఎక్కడో ఎదిగినా కన్నతల్లిని, భూమిని మరువలేరు - మరువకూడదు కూడా! ఈ నీతిని అందరికి బోధించాలన్నదే వారి ధ్యేయము. వెయ్యి కుటుంబాలుపైగా విదేశాల్లో ఉన్నా సొంత ఊరిలో పూర్వపు ఇళ్లు రీమోడలింగ్ చేయించామని, ఏడాదిలో శీతాకాలం మూడునెలలు వచ్చి గ్రామంలో ఉండి నోములు, పూజలు, పుణ్యక్షేత్రాల దర్శనం, చుట్టాల పెళ్లిళ్లకు హాజరై ఈతరం యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. మన తల్లిదండ్రులు, పూర్వీకులు భూమిని నమ్మారు, ఇప్పుడు మంచిని నమ్ముకుంటున్నారు. కాని కాల చక్రంలో మార్పు సహజం. కొందరయినా పుణ్యభూమిని, జన్మభూమిని తరింపచేస్తారు. జై జన్మభూమి! అని ఆశిద్దాము!
*

- నారుమంచి వాణీప్రభాకరి తణుకు, సెల్: 9849481823