విశాఖపట్నం

నాడు సాహితీ సౌరభం.. నేడు శిక్షణకే పరిమితం! (గత స్మృతులు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహితీపరులకు చర్చా వేదికై, గొప్ప గొప్ప సాహితీవేత్తలకు స్ఫూర్తినిచ్చి, మహిళల్లో సామాజిక చైతన్యం నింపి, విశాఖపట్నంలో ఓ ‘సాహితీ చిహ్నం’గా నిలిచిన ‘ది హిందూ రీడింగ్ రూం’ (హిందూ పఠన మందిరం) వర్తమానంలో ఏ స్థాయిలో ఉందో గమనించినవారికి ‘ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమ సమూహముల’నే కవి వ్యాఖ్యానం స్ఫురణకు రాకతప్పదు. రావి శాస్ర్తీ, శ్రీశ్రీ, అరుద్ర, కా.రా మాస్టారు, పురిపండ అప్పలస్వామి, భరాగో, చాసో, చందు సుబ్బారావు, గొల్లపూడి వంటి సాహితీ స్రష్టలు ‘నడయాడిన’ సాహిత్యపు రణరంగ వేదిక- ప్రస్తుతం ‘కళవెలిసిన’.. సాహితీ సమరాంగణ వాటిక కావటం విచారించ దగ్గ అంశం. 1917కు పూర్వం నుంచి అత్యంత వేడుకగా ‘సాహితీ సుమసౌరభాల వేదిక’గా, ‘అభినవ భువన విజయము’గా తన అస్తిత్వాన్ని ఘనంగా చాటుకుంది. ప్రస్తుతం వైపుగా చూస్తే గుండె కలుక్కుమంటోందని సాహితీమిత్రులు మదనపడుతున్నారు.
గతమెంతో ఘనం
ఆంగ్లేయుల పాలన అది. 1836 విశాఖపట్నంలోని ప్రధాన రహదారి (నేటి వన్‌టౌన్ రోడ్డు) పక్కన ‘లండన్ మిషన్ మెమోరియల్ చర్చి’ నిర్మించి, బలవంతపు మతమార్పిడులకు పాల్పడ్డారు. స్థానికులకు ఈ వ్యవహారం పుండుమీద కారం చల్లినట్టయింది. చేయి చేయి కలిపారు. సర్ గోడే నారాయణ గజపతిరావు సహకారాన్ని అర్థించారు. గోడే ఆర్థిక సాయంతో అదే చర్చికి ఎదురుగా ‘ది హిందూ రీడింగ్ రూం’ అనే పేరుతో ఒక అమూల్యమైన గ్రంథాలయాన్ని స్థాపించారు. ప్రతీ రోజు పురాణపఠనం లేదా ఆధ్యాత్మిక విషయాలపై ఉపన్యాసాలు, సాహితీ చర్చలు నిర్వహించాలన్న ప్రధాన ఉద్దేశంగా నిర్ణయించారు. అంతేకాకుండా దూర ప్రాంతాల నుంచి వచ్చే పండితులు, పౌరాణికులు కూడా ఆయా కార్యక్రమాల్లో పాల్గొనేలా సౌకర్యాలు కల్పించారు. సంస్కృతాంధ్ర భాషల్లో ఉన్న పురాణాలు, వేదాంత గ్రంథాలు, స్మృతులు, ఆనాటి కవులకృతులు, హిందూ మత ఔన్నత్యాన్ని తెలిపే అమూల్య ఇతిహాసాలను పొందుపరిచారు.
మహానీయుడు సర్ గోడే నారాయణ గజపతిరావు జీవించి ఉన్నంత వరకూ- అంటే 1903 వరకు వసతులు, సభలు జరిగేవి. కవులు, పండితులు, పౌరాణికులతో చర్చా గోష్ఠులు నిర్వహించి జమీందారు గోడే స్వయంగా సత్కరించేవారు.
కొనే్నళ్ళ తర్వాత అంటే, 1909 నాటికి ఈ మందిరం శిథిలావస్థకు చేరుకుంది. విక్రమదేవ వర్మ, మారేపల్లి రామచంద్రకవి, బొడ్డు రామయ్య, మరికొందరు ప్రముఖులు మందిరాన్ని రామచంద్రకవి ధర్మాశ్రమానికి తరలించారు. కొన్నాళ్ళ తర్వాత వారంతా గోడే కుమార్తె సీతాబాయి ఆర్థిక సాయాన్ని ఆర్థించారు. మహారాణి సీతాబాయి సొంత నిధులతో కొత్త భవనాన్ని(అదే ఇప్పటి భవనం) నిర్మించారు. ఈ పనులు 1917 నాటికి పూర్తయ్యాయి. రీడింగ్ రూంను తమ తండ్రి స్మృతి చిహ్నంగా ‘మహరాజా సర్ జి.ఎస్.గజపతిరావు హిందూ రీడింగ్ రూమ్’ అనే పేరుతో వ్యవహరించాలని సీతాబాయ కోరారు. భవనంలో పై అంతస్తు రీడింగ్ రూంగా ఉపయోగించాలని, కింది భాగం సామాజిక, సాంస్కృతిక, హిందూ మతపరమైన సభలకు, సమావేశాలకు ట్రస్ట్‌బోర్డు ఆమోదించిన కార్యక్రమాలకు మాత్రమే ఉపయోగించాలని షరతులు పెట్టారు. రాజకీయ సభలు నిషేధమని నిర్దేశిస్తూ, ఒక ట్రస్టు డీడ్ రాసి 1917 ఏప్రిల్ 13న రిజిస్ట్రర్ చేయించారు. ఒక ట్రస్ట్ బోర్డును నియమించి, నిర్వహణ బాధ్యతలన్నీ ట్రస్టీకు అప్పగించారు. ఈ ట్రస్ట్ బోర్డుకు విశాఖపట్నం కలెక్టర్ చైర్మన్‌గా ఉంటారు. రీడింగ్ రూం దైనందిన వ్యవహారాలు చూడడానికి మేనేజింగ్ కమిటీ ఒకటి ఉన్నప్పటికీ తుది నిర్ణయం ట్రస్ట్ బోర్డుదే.
రెండో ఘట్టం మొదలు..
రీడింగ్ రూం 1917 ఫిబ్రవరి 24న ఆనాటి మద్రాస్ గవర్నర్ ద రైట్ ఆనరబుల్ జాన్ బారన్ పెంట్లాండ్ దొర ప్రారంభించారు. ఇలా.. ది హిందూ రీడింగ్ రూం 1917 నుంచి రెండో ఘట్టం మొదలైందని చెప్పొచ్చు. అనునిత్యం సాహితీ సుగంధాలతో పరిమళభరితం కావాలని ఆశించి, దాతలు, ప్రముఖులు, సాహితీ ప్రియులు సొంత ఖర్చుతో అమూల్యమైన గ్రంథాలను విరాళాలుగా అందజేశారు. అలా హిందూ పఠన మందిరం దినదిన ప్రవర్ధమానం చెందింది. అనంతర కాలంలో ప్రభుత్వం నుంచి నిధులు కూడా రాసాగాయి. తెలుగు గ్రంథాలతోపాటు ఆంగ్ల భాషలో ఉన్న అనేకమైన విజ్ఞాన గ్రంథాలు, నవలలు, నాటకాలు, కవితలు, కథ సంకలనాలు కూడా చేరాయి. సుమారు అరవై ఏళ్ళపాటు స్వర్ణయుగమనే చెప్పుకోవాలి. ఆంధ్రదేశంలో ఎక్కడా లభ్యంకాని అపూర్వ గ్రంథాలు కూడా ఇక్కడ దొరికేవి. స్థానిక ఎయు విద్యార్థులు, పరిశోధకులు, దూరప్రాంతాల పరిశోధకులు వచ్చి, వారాలు, నెలలు తరబడి ఇక్కడ ఉండి, కొన్ని గ్రంథాలకు నకళ్ళు రాసుకుని వెళ్ళేవారంటే, ఇది ఎంత ప్రసిద్ధిచెందినదో అర్థం చేసుకోవచ్చు.
రీడింగ్ రూం పై సెక్షన్‌లో లైఫ్, టైమ్, నేషనల్ జాగ్రఫిక్, రీడర్స్ డైజస్ట్ వంటి విదేశీ పత్రికలు, ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా, ఫిల్మిండియా, కేరవాన్ వంటి మాసపత్రికలు, అనేక తెలుగు పత్రికలు ఉండేవి. ప్రతి నెలా చందా కట్టే సభ్యులు 800 మందికిపైగా ఉండేవారు. క్రైస్తవులు, ముస్లింలు, బెంగాలీలు, ఆంగ్లో ఇండియన్లు కూడా సభ్యులుగా ఉండేవారు.
పతనం మొదలు..
హిందూ రీడింగ్ రూంలో స్వార్థపరులు అడుగుపెట్టారు. బైలాస్‌ను అనుకూలంగా మార్చుకున్నారు. కొత్త సభ్యులు చేరడానికి వీలు లేకుండా డిపాజిట్ మొత్తాన్ని, నెల చందాను అమాంతం పెంచేశారు. ఫిక్సెడ్ డిపాజిట్లను భవన మరమ్మతుల పేరిట ఖర్చు చేసేశారు. జూదశాలగా మార్చి ప్రతిరోజూ వేల మీద ఆర్జన వచ్చేలా వ్యవహారం నడిపారు. లోగడ కొందరు పోలీసు ఉన్నతాధికారులు జూదాలను నిలుపుచేశారు. ఆ అధికారులకు బదిలీ అయిన వెంటనే మళ్ళీ పేకాట చప్పుళ్ళు మొదలయ్యేవి. 2005లో కూడా కొత్త పోలీస్ కమిషనర్ దాడులు చేయించారు. జూదరులను అరెస్టు చేశారు. గ్రంథాలయం క్షీణించిపోయింది. బీరువాలకు చెదలు పట్టాయి. ఫర్నీచర్‌తో సహా ఎవరికి కావలసిన పుస్తకాలు వారు పట్టుకుపోయారు. రీడింగ్ రూం ముద్రతో ఉన్న పుస్తకాలు అనేకం సెకండ్‌హ్యాండ్ పుస్తకాల షాపుల ద్వారా అమ్ముడయ్యాయని అంటారు.
వర్తమానంలో కొంత మెరుగు...
సాహితీ సుగంధాలు కోల్పోయిన ది హిందూ రీడింగ్ రూంలో అసాంఘిక కార్యకలాపాలు పెచ్చుమీరాయి. అరకొరగా ఉన్న తలుపులు, ద్వారాలు, కిటికీలకు చెదలు పట్టాయి. చెడు వాసనలు భరించలేని శ్లాబు పెచ్చులూడడం మొదలెట్టింది. విశాఖ సాహితీ సౌధం ఇలా కూలిపోతుండడాన్ని జీర్ణించుకోలేని స్థానిక ప్రముఖులు, దాతలు దీనిని నిలబెట్టేందుకు, తమ శక్తియుక్తులు ధారపోశారు. కలెక్టర్‌కు వివరించి కమిటీని వేయించేందుకు పూనుకొన్నారు. అలా.. కమిటీ ఏర్పడింది. మరమ్మతులకు కోసం నిధులు అవసరమయ్యాయి. అప్పటి ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్‌ను సంప్రదించి రూ. 50 లక్షలు మంజూరు చేయించారు. భవనంలోని కొంతమేర మరమ్మతులు చేయించి, ఒక రూపం తెచ్చారు. కమిటీకి అధ్యక్షుడిగా తమ్మిరెడ్డి శివశంకరరావు, కార్యదర్శిగా సింహాద్రి సూరిబాబు ఉన్నారు. ఇతర కార్యవర్గాన్నీ ఎనుకున్నారు. కింది భాగంలో ఉన్న విశాలమైన మందిరాన్ని ప్రజలకు అద్దెకు ఇస్తున్నారు. ఇలా వచ్చిన నిధులను భవనం మరమ్మతులకు, ఇతర నిర్వహణ ఖర్చులకు వినియోగిస్తున్నారు. పేద విద్యార్థులకు ఉచితంగా విద్యా, క్రీడల్లో శిక్షణ ఇచ్చేలా మేడపైన ఉన్న మందిరాన్ని శివశంకరరావు తీర్చిదిద్దారు. ఈయనకు అలిండియా సంఘమిత్ర స్పోర్ట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు పాండ్రంగి రుక్మాకరరావు, ఇతరులు సాయాన్ని అందిస్తున్నారు.
*
- గున్న కృష్ణమూర్తి, 9493802010

- గున్న కృష్ణమూర్తి, 9493802010