విజయవాడ

సంతృప్తి.(కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉపాధ్యాయునిగా నాకిది ముప్ఫై మూడో సంవత్సరం. అందులో తెలుగు భాషా పండితునిగా నా విద్యార్థులకు తగిన తెలుగు పాఠాలతో పాటు, ఆయా సందర్భాలను బట్టి నీతికథలు, సూక్తులు చెబుతుంటాను. ఆరోజు నా పుట్టిన రోజని తెలిసిన నా సహోపాధ్యాయ బృందం శుభాభినందనలు తెలియజేయడం, అందుకు వారికి ధన్యవాదాలు చెప్పటం జరిగింది. ఇక నేను పదో తరగతి గదిలోకి ప్రవేశించి ‘పరోపకారం’ అనే పాఠాన్ని బోధించబోతూ ముందుగా పరోపకార గుణంలో రాణించి, కీర్తిపొందిన శిబి చక్రవర్తి, దధీచి మహర్షి, రంతి దేవుడు మొదలగు వారి జీవిత విశేషాలను తెలియజేశాను. ఇక నేను పాఠం చెప్పబోతుండగా ఇంతలో ‘లోకంలో గల పేదరికాన్నంతా చుట్టబెట్టుకొచ్చాడా’ అన్నట్టుగా సుమారు డెబ్భై ఐదేళ్లు పైబడిన వృద్ధుడు నావైపు దీనంగా చూస్తూ, తగిన సహాయాన్ని అర్థిస్తున్నాడు. నా మనసుకయితే అతణ్ణి చూస్తే బాధ కలిగింది కాని, సహాయం చేయడానికి ఆ మనసే చిత్రంగా ముందుకు రాలేదు. అందుకే, చెప్పడానికి మంచి మాటలయితే చాలా ఉంటాయి, సదాచరణకొస్తే చాలా తేడా ఉంటుంది!
నేను ఆర్తిగా చూస్తూ, సహాయాన్ని అభ్యర్థిస్తున్న ఆ ముసలివాని పరిస్థితిని లెక్కచేయక విద్యార్థులకు పాఠం చెప్పే పనిలో నిమగ్నమయ్యాను. ఇంతలో రాము అనే విద్యార్థి లేచి ‘మాష్టారూ! పాపం ఆ ముసలివానికి వంద రూపాయలు సహాయం చేస్తానండీ’ అంటూ నా అనుమతి కోరటం, సహాయం చేయడమూ జరిగిపోయాయి. మిగిలిన పిల్లలు తమ యథాశక్తి ఆ బిచ్చగాడికి సహాయం చేసి రాములాగే వారి చిన్న వయసులోనే మంచి మనసంటే ఏమిటో చూపించారు. ఒకపక్క నా పాఠ్యాంశ పరంగా ‘పరోపకారం’ పాఠం, మరోపక్క ఆ పాఠానికి తగ్గట్టుగా పరోపకార సన్నివేశం యాదృచ్ఛికంగా జరగడం భలే విచిత్ర మనిపించింది. రాము ఒక్కసారిగా వంద రూపాయలు ఆ పేద వృద్ధునికి సహాయం చేయడంతో నా మనసు ఉండబట్టలేకపోయింది. రాముని లేపి, ‘రామూ! నీకా వంద రూపాయలు ఎలా వచ్చాయి? వంద రూపాయలొక్కసారిగా సహాయం చేశావే? డబ్బంటే లెక్కలేదా?’ అంటూ ప్రశ్నలు కురిపించాను. ‘సార్! నిన్న నా పుట్టినరోజు సందర్భంగా మా అమ్మా నాన్న 100 రూపాయలిచ్చారు. నీ ప్రతి పుట్టినరోజుకీ నీవు పొదుపు చేస్తున్న డబ్బులతో ‘పొదుపు’ అనేదానికి విలువ తెస్తున్నావు. ఈ పుట్టినరోజుకి మాత్రం మేమిస్తున్న ఈ వంద రూపాయలు పొదుపు డబ్బాలో వేయక, నీకు మంచిదనిపించిన పనికి ఈ డబ్బును వాడు’ అని చెప్పారంటూ వివరించాడు. ఈలోపు ఎవరి ఆదరణకూ నోచుకోక, ఇంత పెద్ద వయసులో అడుక్కుంటున్న ఆ ముసలివాణ్ణి చూస్తే నాకు జాలేసింది. ‘అలా ఈ వంద రూపాయలూ సహాయం చేశానండీ!’ అని రాము చెప్పటం, నేను కూర్చోమనడం జరిగిపోయాయి. చిన్నవాడయినా రాము ఓపక్క పొదుపు మంత్రం పాటిస్తున్నాడు. ఈరోజు ఆ డబ్బు దానం చేసి మంచి మనసుతో రాణిస్తున్నాడు. తన తోటివారికి మార్గదర్శిగా నిలుస్తున్నాడు. ముందుగా ఇంత మంచి గుణం నేర్పిన రాము కన్నవాళ్లనూ ఎందుకో నా మనసు నాకు తెలిసో, తెలియకనో అభినందించింది. పిల్లలు చేసిన సహాయానికి ఆ తాత ఆనందంగా వెళ్లడంలో పరోపకారంలో నా శిష్యులు భాగస్వాములయ్యారు.
కానీ, నాకు ప్రతినెలా వచ్చే జీతాన్ని నాకు, నా కుటుంబ ఖర్చులకు, సరదాలకు వినియోగిస్తున్నానే గానీ, ఏనాడూ నా యథాశక్తిగానైనా, ధనాన్ని నా స్వార్ధాన్ని దాటి, సద్వినియోగాలకు ఏమాత్రం వాడలేకపోతున్నాను. నెలకు 60 వేల రూపాయల జీతం తొలుత నా జేబు అనే గూటిలోకో, బ్యాంకు సేవింగ్స్‌లకో పరిమితమవడం తప్ప, పాపం! నా డబ్బుకి సరైనన హుందాతనం ఇవ్వలేకపోతున్నా! కరెన్సీ నోట్లు మూగవి కాబట్టి సరిపోయింది. లేకపోతే ‘మమ్ము నీ స్వార్థానికే తప్ప, ఏ మంచి పనులకూ తగినంత వాడుకోలేవా?’ అంటూ ప్రశ్నిస్తూ ఉండేవి. నా వృత్తిపరంగా నేను చెప్పే పాఠాల్లో ఎక్కువ భాగం మార్కులకు ప్రాధాన్యం ఇవ్వడం తప్ప మానవీయ విలువలు, నా ఆచరణలో మానవతా విలువలు లేకపోవడం ఎంతవరకు న్యాయం? ముందుగా ఇకనైనా నా యథాశక్తి ధనాన్ని పరోపకారానికి వినియోగిస్తూనే, మరోపక్క కుటుంబ ఖర్చులకునూ వినియోగించాలన్న నా దృఢ సంకల్పంతో ఎందుకో నా మనసు ఏదోతెలియని ఆనందంతో, సంతృప్తితో నిండింది. ‘సంతృప్తిని మించిన ఐశ్వర్యం లేదు’ అనే సూక్తికి కట్టుబడింది. తరువాత నేను చెప్పిన ‘పరోపకారం’ అనే పాఠానికీ నిండుదనం వచ్చింది. రాము చిన్నవాడైనా ‘ప్రేరణ’ విషయంలో నాకు పెద్దవాడిగా, గురువులా కనిపించాడు.
*
- గాడేపల్లి మల్లికార్జునుడు,
పిడుగురాళ్ల, గుంటూరు జిల్లా.
చరవాణి : 9000749651

**
చిన్న కథ
*
ఎవరు చేసిన ఖర్మ
వారనుభవించకా..!
*
కొత్త కలెక్టర్ ఆ వూరికి వచ్చి మహిళలకి కుట్టు మిషన్లు, దివ్యాంగులకు చక్రాల కుర్చీలు ఇచ్చి, గ్రామ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. మధ్యమధ్య త్రివిక్రమ్ వంక చూసి చిరునవ్వు నవ్వుతున్నాడు. ఆ నవ్వు బాగా పరిచయమే. గుర్తు తెచ్చుకోడానికి ప్రయత్నిస్తున్నాడు. కార్యక్రమం పూర్తయ్యాక ప్యూన్‌తో కబురంపేడు కలెక్టర్ శ్రీ్ధర్.
ఆ పేరు బాగా పరిచయమే. గుర్తుకొచ్చింది. అంటే, పనిమనిషి కొడుకు శ్రీ్ధర్ ఇప్పుడు కలెక్టర్! తను మైక్ సర్వీసు ఓనర్. చిన్నప్పుడు తాతయ్యతో గొడవపడి ఇంట్లోంచి వెళ్లిపోయి, పద్మనాభ మైక్ సర్వీసులో బాయ్‌గా చేరి, వారి ఏకైక కూతురు అఖిలను ప్రేమించి, పెళ్లాడి ఆ మైక్ సర్వీసుకి ఓనరయ్యాడు. శ్రీ్ధర్‌కి ఆ పేరు పెట్టింది తాతగారే. ఇద్దరూ ఒకేరోజు పుట్టారు. వాడిని తాతగారే చదివించారని చెప్పుకుంటారు. మంచి నడవడిక, పెద్దలపై గౌరవం.. వాడిని ఉన్నత శిఖరాలకి చేరిస్తే, వాళ్లని ఎదిరించి బయటకి వచ్చి తాను ఎలా తయారయ్యాడు?
కారు తాతగారి ఇంటి ముందు ఆగడం, శ్రీ్ధర్ తాతయ్యగారికి నమస్కరించి ఆశీస్సులు పొందడం, తాతగారు అతన్ని కౌగిలించుకుని ఆనందాశ్రువులు రాల్చడం చూస్తూ సిగ్గుతో తలవంచుకున్నాడు త్రివిక్రమ్.
మనవడిని కూడా దగ్గరకి పిలిచి ‘చెప్పిన మాట వినివుంటే నువ్వు కూడా ఇప్పుడు వీడిలా..’ అంటున్న తాతగారితో ‘క్షమించండి తాతయ్యా’ అంటూ పాదాభివందనం చేశాడు త్రివిక్రమ్.
*
- చావలి సూర్యం
మొగల్రాజపురం, విజయవాడ