విశాఖపట్నం

ఆంతర్యం! (కథానిక)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవంతిక రాజ్యం కార్తికేయ మహారాజు పాలనలో సుఖశాంతులతో సుభిక్షంగా సాగుతూ ఉండేది. కార్తికేయ మహారాజుకు ఒక్కగానొక్క కొడుకు నిత్యయవనుడు. అతను చిన్న నాటి నుండి అతి గారాబంగా పెరిగాడు. తను ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగింది వ్యవహారం. కార్తికేయ మహారాజు తనకు అరవై ఏళ్లు దాటాక సన్యాసం స్వీకరించాలని చాలా కాలం క్రితం నిర్ణయించుకోవడంతో రాజ్యాధికారాన్ని కుమారుడికి అప్పగించి బయలుదేరాడు. నిత్యయవన మహారాజు మంచి శరీర సౌష్టవం, రూపం గల వ్యక్తి. తను దినములో ఎక్కువ భాగం తన వ్యిక్తిగత ఆరోగ్యం, అంద చందాల మీదనే ఎక్కువ ఆసక్తి కనబరిచేవాడు. రాజ్యపాలన గురించి గానీ, ఆర్థికాభివృద్ధి గురించి కానీ ఆలోచించేవాడు కాదు. ఇదే అదును అనుకుని మంత్రులు మొదలుకొని భటుల వరకు అందరూ ప్రజలను మోసం చేస్తూ అక్రమ సంపాదన ప్రారంభించారు. రాజుగారిని పొగిడిన ప్రతి అధికారి మంచివాడి కిందే లెక్క. అయితే రాజావారికి చిన్న వయసులోనే జుత్తు నెరవడం, రాలడం మొదలయింది. ఇదొక పెద్ద సమస్యగా పరిణమించింది రాజావారికి. ఎప్పుడూ జుత్తు కోసం చింతిస్తూ రకరకాల తైలాలు వాడడం మొదలుపెట్టాడు. ఫలితం లేదు సరికదా ఇంకా ఎక్కువగా రాలిపోయేది. జుత్తు రాలుతున్న విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతూ ఉండేవాడు. అరణ్యంలో సన్యాసాశ్రమంలో ఉన్న తండ్రికి తన రాజ్యం దుస్థితి గురించి తెలిసి కుమారుడికి సత్ప్రవర్తన కలిగేలా చేయమని తనకు నమ్మకమైన దూతను రాజ్యానికి పంపాడు. సుభాషితుడు అనే పేరుతో ఆ యతి ఆ రాజ్యంలో అనేక మహిమలు చూపుతూ ప్రాచుర్యం పొందాడు. రాజుగారికి ఈ విషయం తెలిసి యతిని దర్బారుకు రప్పించాడు. సుభాషితుడు లోపలికి అడుగుపెడుతూనే రాజుగారి గురించి అనుకూల వచనాలు పలుకుతూ ‘‘రాజా! నేను తమతో ఏకాంతంగా మాట్లాడాలి. మన మాటలు ఎవరూ వినకూడదు’’ అంటూ అభ్యర్థించాడు.
‘‘సరే’’ అన్నాడు రాజు.
అంతా వెళ్లిపోయాక యతి మాట్లాడుతూ ‘‘అయ్యా! తమరి సమస్య నాకెరుక. తమ జుత్తు సమస్య తీరాలంటే ప్రాత:కాలమునే మన దర్బారుకు నాలుగు మైల్ల దూరంలో కేశరపాడు గ్రామం మధ్యలో ఉన్న నూతిలో నీటితో స్నానం చేసిన యెడల తమకు మంచి కేశసంపదతో పాటు మీ పేరుకు తగ్గట్టుగా నిత్యయవనుడిగా ఉంటారు. కానీ అక్కడికి వెళ్లి వస్తున్నట్లుగా రాజ్యంలో ఎవరికీ తెలియకూడదు’’ అని చెప్పాడు.
రాజుకు చాలా నమ్మకం కలిగింది.
అతను మధ్య రాత్రి లేచి సాధారణ దుస్తులు ధరించి ఎవరికీ కనిపించకుండా దొడ్డిదారిన బయలుదేరాడు. దారిలో దొంగలు ఎదురుపడ్డారు. ఇతగాడి వద్ద విలువైన వస్తువులు లేనందున విడిచిపెట్టారు. రక్షకభటులు ఎవరూ విధులు నిర్వర్తించడంలేదు. రహదారులోల ఎక్కడా వీధి దీపాలు కనిపించడంలేదు. అలా నడుచుకుంటూ కేశరపాడు నూతికి చేరేసరికి ఉదయం నాలుగు గంటలయింది. నీరు చాలా లోతులో ఉన్నాయి. అతికష్టం మీద నీటిని తోడి స్నానమాడాడు. సమయం అయిదు గంటలయింది. ఇంతలో కొందరమ్మలక్కలు వచ్చి ‘‘ ఏమయ్యా మంచినీళ్లు పట్టుకునే నూతి దగ్గర స్నానం చేస్తావా’’ అని చీవాట్లు పెట్టారు. తను రాజు అని ఎవరూ గుర్తించలేదు. ఇక తిరుగు నడక ప్రారంభించాడు. గ్రామాల్లో రచ్చబండల వద్ద ప్రజలు తన తండ్రి గొప్పదనం గురించి చర్చించుకుంటున్నారు. దారి పొడవునా ప్రజల అవస్థలు చూస్తూ నడుస్తున్నాడు. అధికారుల అలసత్వం కొట్టవచ్చినట్లు కనబడుతున్నది. తన తండ్రిని ప్రజలు ఎంత మెచ్చుకుంటున్నారో తనను అంతగా ఛీదరించుకుంటున్నారు. ఇదంతా చూసి చాలా నామోషీగా భావించాడు. కోపంతో నడుచుకుంటూ కోటలోకి ప్రవేశించబోతే లంచం ఇస్తే గానీ లోపలికి పంపనన్నాడు కాపలాదారుడు. తీరా రాజు అని తెలిసాక తెల్లబోయాడు. రాజుగారికి రాజ్యం దుస్థితి పూర్తిగా అర్ధమయింది. వెంటనే సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశాడు. మంత్రులకు, అధికారులకు ఆగ్రహంతో ఊగిపోతూ చెప్పాడు ‘‘రాజ్యంలో ఇక మీదట అవినీతికి ఎట్టి పరిస్థితుల్లోను అవకాశం ఉండకూడదు. బాధ్యతల పట్ల ఎవరూ నిర్లక్ష్యం వహించినా కఠినంగా శిక్షింపబడతారు. అలాగే ప్రజలు మంచీనటికి ఇబ్బంది పడకుండా మంచినీటి నూతులు తవ్విస్తాను. చెరువులు, ఇంకుడుగుంతలు తవ్విస్తాను. ప్రజలు వారి గోడు తెలుపుకునేందుకు ప్రతీ సోమవారం ఫిర్యాదుల స్వీకరణ కేంద్రం ఏర్పాటు చేస్తాను. ధనాగారం లెక్కలు కచ్చితంగా చూస్తాను’’ అంటూ ముగించాడు.
ఆ యతి తనకు చెప్పిన సలహాలో ఆంతర్యం గ్రహించాడు. ఆ క్షణం నుండి రాజ్యపాలన చక్కగా చేసుకుంటూ తండ్రికి తగిన తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు.
- చావలి శేషాద్రి సోమయాజులు,
పాచిపెంట,
సెల్ : 9032496575.

- చావలి శేషాద్రి సోమయాజులు,