రాజమండ్రి

పరమగురువు-3 (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాలుగు సంవత్సరాల నుండి నడుస్తున్న క్రిమినల్ కేసుకు రేపే తుది తీర్పు. న్యాయస్థానానికి సాక్ష్యాలే ఆధారం. న్యాయదేవత కళ్లకి నల్లగుడ్డ కట్టుకొని చేతిలోకి త్రాసుతో న్యాయాన్యాయములను తూకం వేస్తుంది. అపరాధిని శిక్షించడానికి కావలసిన సాక్ష్యాల భారం సంతృప్తికరంగా ఉంటే శిక్ష ఖరారు అయినట్లే! అది దొంగ సాక్ష్యమైనా అనవసరం. న్యాయస్థానంలో భగవద్గీత తాకగానే అది పవిత్రమైపోతుంది. వంద మంది నేరగాళ్లకు శిక్షపడ్డా ఫరవాలేదు లేక పడకపోయినా ఫరవాలేదు. ఒక్క నిరపరాధికి శిక్ష పడితే అది న్యాయాధికారి పట్ల తరతరాలకు శాపంగా పరిణమిస్తుంది. తీర్పునిచ్చే న్యాయాధికారుల అంతరాత్మ ఎన్నోసార్లు ఘోషిస్తూనే ఉంటుంది. న్యాయంవారి ఎదుట తరచూ అపహాస్యం పాలగుతూనే ఉంటుంది.
వందకుపైగా సాక్షులను విచారించి తీర్పునివ్వడానికి సంసిద్ధులవుతున్నారు. సీనియర్ జస్టిస్ అశోక్‌వర్మ. రాత్రంతా సరిగా నిద్రపట్టలేదు. హత్యానేరాలలో చాలా కూలంకషంగా ముద్దాయిని, సాక్షులను విచారిస్తారు అశోక్‌వర్మ. న్యాయాధికారి తన మనో నేత్రంతో సాక్ష్యులను పరిశీలించి ముద్దాయికి శిక్ష విధించాలంటారు. ఆయన సర్వీసులో రెండు ఉరి శిక్షలను ఖరారు చేసియున్నారు. అవి రాష్టప్రతి చేత కూడా ఆమోదింపబడి అమలయ్యాయి. తీర్పునిచ్చే ప్రతిసారీ చాలా వత్తిడికి గురయ్యేవారు. తానొక్కడే ఇలా అవుతున్నానా లేక తోటి సహచర న్యాయాధికారులు కూడా ఉరిశిక్ష విధించే ముందు మానసిక వత్తిడికి గురవుతున్నారా? అనే విషయం పంచుకోవడానికి ఒకసారి క్లబ్‌లో చర్చ పెట్టారు వర్మ. ఇంచుమించు అందరూ తీవ్ర మానసిక వత్తిడికి గురయినట్లు వెల్లడించారు. తోటి మనిషి ప్రాణం ప్రత్యక్షంగా కాని, పరోక్షంగా గాని తీయడమనే కార్యరంగంలో మానవీయ కోణం మనిషిని నలిపేస్తుంది. ఉరిశిక్ష విధించే న్యాయాధికారి మనసులో రేగే అలజడి అతనికే తెలుస్తుంది తప్ప ఇతరులకు ఆ భావన అంతుచిక్కదు.
జస్టిస్ అశోక్‌వర్మ విషయంలో తీర్పునిచ్చే ప్రతిసారీ ఒత్తిడికి గురవ్వడానికి కారణం ఒక గాఢమైన గతం.
* * *
అశోక్‌వర్మ తండ్రి శేఖరవర్మ వందెకరాల భూస్వామి. గోదావరి జిల్లాల్లో పేరుమోసిన దాత. ఆయన ఏకగ్రీవంగా రెండు దశాబ్దాలపాటు గ్రామ సర్పంచ్‌గా పనిచేశారు. ఆయనకు పదవి ఉన్నా లేకపోయినా ఆయనే గ్రామ పెద్ద. ఆయన హయాంలో గ్రామంలో పోలీసులు అడుగుపెట్టలేదంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. గ్రామంలో ఏవిధమైన తగువైనా ఆయన దగ్గరకు రావలసిందే. తీర్పు ఇవ్వవలసిందే. నిష్పక్షపాతంగా, నిష్కర్షగా ఆయన ఇచ్చే తీర్పును గ్రామప్రజలు శిరోధార్యంగా స్వీకరించేవారు. ఆయన చదువుకున్నది చాలా తక్కువే అయినా నిరంతరం పుస్తక పఠనం వలన ఆయనొక జ్ఞాన నిధి. ఇంట్లో చిన్న గ్రంథాలయమే ఉండేది. తీర్పుచెప్పే విషయంలో ఆయన చేతిలో ఎప్పుడూ భగవద్గీత ఉండేది. అలా సాగిపోతున్న ఆ గ్రామంలో ఆయనకు కూడా శత్రువులు పుట్టుకొచ్చారు. ధర్మము నాలుగు పాదాలపై నడవడం కంటకింపుగా మారిన ప్రత్యర్థులు దొంగ సాక్ష్యాలు సృష్టించి ఒక అమాయకుడికి ఆయన చేత తప్పుడు తీర్పు ఇప్పించారు. ఆ అవమానం భరించలేక అదే రాత్రి అతడు తీర్పు చెప్పే ప్రదేశంపైన చెట్టుకొమ్మకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
నిజం తెలుసుకున్న శేఖరవర్మ ఆ గ్రామంలో నివసించలేక అయినకాడికి ఆస్తులు అమ్ముకొని కుటుంబంతో మద్రాసు వలస వచ్చేశారు. అప్పటికి అశోక్‌వర్మ వయసు పదిహేను సంవత్సరాలు. తండ్రి కోరిక మేరకు లా చదివాడు.
కీలక తీర్పును ఇచ్చే ప్రతిసారీ చనిపోతూ తండ్రి చెప్పిన మాటలే గుర్తుకువచ్చేవి అశోక్‌వర్మకు. ‘నిర్దోషికి శిక్ష పడకూడదు. దోషిని కూడా అతని కుటుంబ నేపథ్యంను పరిశీలించి శిక్ష విధించాలి’ అని చెప్పారు. తండ్రి మాటలను మననం చేసుకుంటూ రేపు ఇవ్వబోయే తీర్పుపై పీనల్ కోడ్‌లు నోట్ చేసుకుంటున్నారు. మనసు నిగ్రహం కోల్పోతోంది. శిక్ష పడబోయే వ్యక్తి ఒక్కగానొక్క కొడుకు. అతనే కుటుంబానికి ఆధారం. విధి వక్రించి హత్య చేశాడు. సాక్ష్యాలన్నీ బలంగా ఉన్నాయి. నిష్పక్షపాతంగా తీర్పునిచ్చే అశోక్‌వర్మకు ఇది సంకటంగా మారింది. కారణం, ఆ ముద్దాయి తన బాల్య స్నేహితుని కొడుకు. ఉదయం తన ఇంటికొచ్చి కొడుకును కాపాడి కుటుంబాన్ని ఆదుకోమని భోరున విలపించిన తన స్నేహితుని విషాద వదనమే గుర్తుకొస్తోంది. ఎప్పుడూ ఇంత కలత చెందలేదు. పెన్ను కదలడం మానివేసింది. మెదడంతా శూన్యమైపోయింది. అచేతనంగా కుర్చీలో వెనక్కు వాలాడు. ఒకవైపు ధర్మం, న్యాయం. మరొకవైపు స్నేహితుని కుటుంబం. ఆలోచనల వరదతో నిద్ర ముంచుకొచ్చింది. కుర్చీలో అలాగే పడుకున్నాడు. ఉదయం ఐదు గంటలకు అలారం మ్రోగడంతో ఉలిక్కిపడి లేచాడు. కింద పడిపోయిన పెన్నుని తీసుకున్నాడు. ఫైల్ మూసి, పెన్ను టేబుల్‌పై పెట్టి, లైట్ ఆఫ్ చేసి బాత్‌రూమ్ వైపు వెళ్లాడు. తిరిగి వచ్చి తండ్రిని తలుచుకుంటూ కృష్ణ విగ్రహం పక్కనే పెట్టిన నాన్నగారు జీవితాంతం వినియోగించిన భగవద్గీతను రెండుచేతులతో తీసుకొని కళ్లకు అద్దుకొని మధ్యకు తెరిచాడు. పరమ గురువు పరిష్కారం చూపించాడు. తెరచిన పేజీ రెండవ అధ్యాయం, సాంఖ్య యోగంలోని ముప్పది మూడవ శ్లోకము.
అథచేత్త్వ మిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి!
తతః స్వధర్మం కీర్తించ హిత్యా పాప మవా ప్స్యసి!
అర్జునా నీ స్వధర్మము లేక కర్తవ్యమగు ఈ ధర్మయుద్ధమును చేయని యెడల ధర్మహానియే కాక కర్తవ్యతా లోపము వాటిల్లి పాపముతో అపకీర్తి పాలయి నరకమును అనుభవింతువు.
తన మస్తిష్కంలో ఘర్షణ పడుతున్న మిమాంసకు స్వస్తిపలికి గీతకు నమస్కరించి పెన్ను తీసుకున్నాడు అశోక్‌వర్మ. చట్టం ముందు రాగానురాగాలకు తావులేదు. చేసిన పాపం ఈ జన్మలోనే, ఇక్కడే శిక్షా రూపంలో అనుభవించక తప్పదు. న్యాయవాదికి జీవితమే ఒక ధర్మ యుద్ధం. కళ్ల ముందు తెల్లని వస్త్రంతో న్యాయదేవత అభయమిస్తున్నట్లు తోచింది అశోక్‌వర్మకు. హత్యానేరం ఐపిసి 302 ప్రకారం ఉరిశిక్ష విధించడానికి సంసిద్ధులయ్యారు అశోక్‌వర్మ.

- వారణాశి వెంకట సూర్యకామేశ్వరరావు రాజమహేంద్రవరం, చరవాణి: 9491171327