నెల్లూరు

నిర్ణయం (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రమేష్ నెల్లూరులోని ఓ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. కాలేజి హాస్టల్‌లో మెస్ ఫీజు కట్టలేదని ఇంటికి పంపేస్తే సొంతూరు రామాపురానికి వచ్చాడు.
అర్థాంతరంగా ఇంటికి వచ్చిన కొడుకుని చూసి ‘‘కళాశాలకు అప్పుడే సెలవులిచ్చారా.. వచ్చేశావు’’ అడిగాడు తండ్రి రంగనాధం.
‘‘ఆ మీరు పంపించే డబ్బులు ఎక్కువై చదువు చెప్పలేక పంపేశారు’’ కోపంగా రమేష్ అన్నాడు.
‘‘కోపమెందుకురా విషయమేదో సక్రమంగా చెబితే పోదా’’ తల్లి జానకమ్మ అడిగింది.
‘‘మెస్ ఫీజు కట్టకపోతే ఎన్నిరోజులైనా తేరగా తిండి పెడతారా’’
‘‘ఆ మాటే చెప్పచ్చుగా’’
‘‘చెప్పినా ఏ నెలలో సక్రమంగా డబ్బులు పంపించారులే’’
‘‘ఓరేయ్ నువ్వే చూస్తున్నావుగా, గత ఆరేళ్లుగా వర్షాలు సరిగా పడలేదు. గడ్డి లేక ఉన్న నాలుగు ఆవుల్లో రెండు అమ్మేశాము. మిగిలిన రెండింటిని అప్పులోళ్లు తోలుకుపోయారు. మనలాంటోళ్లకు డిగ్రీలు వద్దురా అంటే వినకుండా పోయి నెల్లూరులో చేరావు. దగ్గర్లోని కందుకూరులో చేరమంటే ఆ.. ఊ.. అనేసి వెళ్లిపోయావు’’ అంటూ రమేష్ వైపు చూస్తూ చెప్పాడు రామనాధం.
‘‘ఇవి ఎప్పుడూ ఉండేవే కదా’’ అని రమేష్ చెప్పడంతో
‘‘సరేలే ఊర్లో పోస్టుమాస్టర్ సుబ్బారావును అడిగి అప్పు తీసుకొస్తా’’ అని రామనాధం వెళ్లాడు.
ఇంట్లోకి వెళ్లి మంచినీళ్లు తాగి వెలుపలికి వచ్చాడు రమేష్.
మనవడిని చూస్తూ చంగయ్య ‘‘మా కాలంలో కరువస్తే మేము కలిసి కట్టుగా వెళ్లి రోడ్లు వేయడం, కాలువలు తవ్వడం చేశాము’’ మనవడిని దగ్గర కూర్చోపెట్టుకుని చెప్పుకొచ్చాడు.
‘‘మరి మీ పాత కాలంలో పనులు చేసినందులకు డబ్బులు ఇవ్వలేదా తాతా’’ రమేష్ ఉత్సుకతతో అడిగాడు.
‘‘కూలికోసమే వెళితే కూలీ ఇచ్చేవాళ్లు, లేదంటే సమానంగా మూడుపూటలా అన్నం పెట్టేవారు’’ చంగయ్య సమాధానం చెప్పాడు.
‘‘అవునా’’
‘‘అవును రూపాయి తీసుకొని సంతకు పోతే అక్కడ ఇంటికి కావలసినన్ని కూరగాయలు కొనుక్కొని మిగిలిన దానితో చిరుతిండ్లు తింటూ వచ్చేవాళ్లం. సినిమాకు పోతే ముప్పైపైసలకే మూడు ఆటలు చూసుకొని ఏ అర్థరాత్రికో ఇంటికి చేరేవాళ్లం. దారిలో ఎవరైనా పెద్దరైతు ఇంటికి పోతే అన్నం పెట్టేవారు. ఇప్పుడు అట్లాంటి ఇళ్లు ఎక్కడున్నాయి. వారంతా వెళ్లిపోయి వారి గుర్తుగా ఆ ఇళ్లు మిగిలాయి తెలుసా’’ చెంగయ్య ఆపకుండా వివరించాడు.
రమేష్ ఆశ్చర్యంగా వింటున్నాడు.
మళ్లీ చెంగయ్య మాట్లాడుతూ ‘‘ఒక రూపాయి అంటే ఎంతో విలువ. అయిదు రూపాయలకి సిమెంట్ మూట వచ్చేది. ముప్పై రూపాయలకు ఇంటి జాగా దొరికేది. నలభై రూపాయలకు ఎకరా భూమి వచ్చేది. పది పైసలిచ్చి బస్సులో తిరిగాం’’
‘‘ఇదంతా నిజమేనా తాతయ్యా’’
‘‘అవునురా ఇప్పట్లా అప్పుడు ఆకలి చావులు లేవు. తిండి లేకపోతే ఊర్లో పెద్దమనిషి ఇంటికిపోతే అంత తిండి పడేసి, అక్కడే పని చేసుకోమనే వాళ్లు. మీ కాలేజి వాళ్లు నిన్ను తరిమేసినట్లు తరిమేవాళ్లు కాదు’’
‘‘అది కాదు తాతా’’ అంటూ రమేష్ ఎదో చెప్పబోయాడు.
ఇంతలో రామనాథం గొణుక్కొంటూ వచ్చాడు. ‘‘బిడ్డ చదువుకని అప్పు అడిగితే ఆవుకు గడ్డి వేసిరా, ఆ రామన్న వద్దకు పోయి అప్పు వసూలు చేసుకురా అంటూ పంపిస్తారా.. పోతే పోనీ అని పనులు చేస్తే చివరికి రేపురా చూస్తాం అంటాడా’’ అని రమేష్ వైపు తిరిగాడు.
తాత చెప్పిన మాటలు, తండ్రి చెప్పిన మాటలు రమేష్ బేరీజు వేసుకున్నాడు.
‘‘నాయనా నాకేమో చదువుకోవాలని ఉంది. ఏం చేద్దాం మీకేమో నా చదువు కష్టాలు తెప్పిస్తోంది’’ రమేష్ బాధగా చెప్పాడు.
‘‘ఒరేయ్, మీతాత, మీనాయన ఇన్ని చెప్పినారుగా, రెండు రోజులు ఉండు, ఎక్కడో ఓ చోట తెచ్చిస్తాం’’ ఇంటిలో వంట చేస్తూ కొడుక్కి చెప్పింది జానకమ్మ.
‘‘సరే అమ్మా ఇకపై నేను నెల్లూరులో ఎక్కడైనా పని చేస్తూ చదువుకొంటానులే’’
‘‘కోపం వచ్చిందా’’
‘‘లేదమ్మా మీ కష్టాలు చూసి, తాత చెప్పిన అనుభవాలు విని పాత కాలమే బాగుంటుందనుకొంటున్నా. అప్పట్లోలా డబ్బుకు విలువ ఉన్నట్లే నేను కూడా బాగా డబ్బు సంపాదిస్తా. మన ఇంటి వద్దకు ఎవరు, ఎప్పుడొచ్చినా అన్నం పెట్టి వారి ఆకలి తీరుస్తా’’ రమేష్ జానకమ్మతో చెప్పాడు.
‘‘అంత పెద్ద చదువులు చదివించే శక్తి నాకు లేదురా’’ రామనాథం అనడంతో
‘‘ఇప్పుడే చెప్పినా కదా నేను కష్టపడి పని చేస్తూ చదువుతానని’’ రెట్టించాడు రమేష్.
‘‘ఒరేయ్ రమేష్ మన శాంతమ్మ అత్త ఇంటికి నీ కోసం నెల్లూరు నుంచి ఎవరో ఫోన్ చేశారురా నువ్వంట వెళ్లు’’ రమేష్ బాల్య స్నేహితుడు శీను దూరం నుంచి పిలుస్తూ వచ్చాడు.
‘‘ఎవరు చేసింటారబ్బా’’ అనుకుంటూ గబగబా శాంతమ్మ ఇంట్లోకి నడిచాడు.
‘‘అంకుల్ మీకే ఫోన్’’ అంటూ వాకిట్లో నుంచి అరచింది శాంతమ్మ మనమరాలు దీప.
వడి వడిగా ఇంట్లో టీవీ పక్కనున్న ఫోన్ వద్దకు పోయి పక్కనున్న రిసీవర్‌ను ఎత్తి చెవి దగ్గర పెట్టుకొని ‘‘హలో’’ అన్నాడు.
అవతల నుంచి రమేష్ మిత్రుడు శ్రావణ్ లైన్లో ఉన్నాడు. హలో వినపడగానే ‘‘ఒరేయ్ రమేష్ నీకు స్కాలర్‌షిప్ డబ్బు ఈరోజే వచ్చింది. రేపు ఉదయమే వచ్చెయ్’’ అంటూ ఫోన్ కట్ చేశాడు.
ఆ మాటలు వింటున్న రమేష్ ముఖంలో వెయ్యి ఓల్టుల బల్బుల వెలిగినట్లయింది. వెంటనే ఫోన్ పెట్టేసి వెలుపలకు వచ్చాడు. ఫోన్ వచ్చిందనడంతో ఆందోళనతో అక్కడికి వచ్చిన రామనాథం, జానకమ్మ విషయం విని ఆనందపడ్డారు.
‘‘హమ్మయ్య ఈసారికి గండం గడిచింది’’ అని రామనాథం అన్నాడు.
‘‘అమ్మా, నాయనా నేను రేపు తెల్లవారి నాలుగు గంటల బస్‌కు నెల్లూరుకు బయలుదేరుతాను, మూడుగంటలకే నిద్ర లేపండి’’ అంటూ వడి వడిగా అక్కడ నుంచి ఊర్లో మిత్రులని కలిసేందుకు వెళ్లాడు.
శీను కనపడడంతో పక్కనే ఉన్న ఎండిన చెరకు తోటలోకి వెళ్లి చెరకులు విరుచుకొన్నారు. కొరికి చూశారు.
‘‘పర్వాలేదు మెత్తగానే ఉందే’’ అన్నాడు రమేష్
‘‘ ఆ సేద్యం లేరా మొన్నీమధ్య రాత్రి కరెంటుతో నీళ్లు కట్టేందుకు వచ్చిన రామస్వామి చిన్నాయనను పాము కరవడంతో చనిపోయాడు. తెలియదా నీకు’’ శీను బాధతో చెప్పాడు.
మవునంగా చెరకు తింటూ ఇంటికి చేరుకున్న రమేష్ ఆ రాత్రి దృఢ నిర్ణయం తీసుకున్నాడు. ఈ బాధలన్నీ పోవాలంటే తాను బాగా చదివి మంచి ఉద్యోగం చెయ్యాలి, మా అమ్మా నాన్నలకు కష్టం లేకుండా చూడాలి అని’’

కటారి రామయ్య, సదుం చరవాణి : 9704025771