దక్షిన తెలంగాణ

అశ్రు నివాళి ( మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కవిత్వమంటే...
కర్రు మొనలోంచి మట్టి పలికినట్టుండాలి
చెమట ఆవిరిలోంచి -
మబ్బు పట్టినట్టుండాలని భావించిన...
సినారె...
శ్రమజీవి శే్వద బిందువులో
ఆణిముత్యముందని నిరూపించాడు!
అక్షర చమత్కృతులతో...
ఆకాశాన్ని ముద్దాడాడు!
సినీ వినీలాకాశంలో
ఓ ధృవతారగా వెలుగొందాడు
‘మనిషి నా పల్లవి
మనిషి నా పతాక’ అని నినదించాడు
ఆయన మరణంతో
సాహితీ లోకం చిన్నబోయంది!
అక్షర దీపం ఆరిపోవడంతో
పగలే చీకటిగా మారింది!
ఆయన సొంత ఊరు...
మూలవాగు గలలు
ఆయన పూయంచిన...
నవ పారిజాతాలు
రసరమ్య గీతాలు... మూగబోయనాడు!
ఆనందంతో పరవళ్ళు తొక్కిన
గంగ, యమున, సరస్వతి, కృష్ణవేణి
మోముల్లో...
విషాదఛాయలు అలుముకున్నాయ!
‘వేటకు వచ్చిన కోటలోని మొనగాడు’
కనిపించక...
‘‘వనె్నల దొరసాని’’
ఒంటరైపోయంది!
‘‘నవ్వని పువ్వుతో’’ ఆరంభమైన
ఆయన సాహితీ ప్రస్థానం
‘‘నా రుణం మరణంపైనే’’ అంటూ
ఆగిపోయంది!
ఇప్పుడు మన మధ్య లేకుంటేనేం?
ఆయన రచనలు అజరామరం!
సమర్పిద్దాం...
సినారెకు అశ్రునివాళి అందరం!!

- గంప ఉమాపతి,
కరీంనగర్
9849467551
*
అష్టావధానకేళి
*
ప్రతియక్కరంబును బట్టి నిషేధించు
టన ‘నిషేధాక్షరి’ యనగవచ్చు
పొసగరానట్టిదౌ పొడుపును పూరించు
టన ‘సమస్యాపూర్తి’యనగదనరు
నిర్దిష్ట పదముల నిలిపి పద్యముజెప్పు
టన ‘దత్తపది’యని యనగలెస్స
కోరిన విషయమున్ కొత్తగా వర్ణించు
టనగ ‘వర్ణన’యని యనదగును
ఛందాన బ్రశ్నింప భందమ్ములో బల్కు
టనగ ‘్భందోభాష’యనగ నౌను
అప్రస్తుతాంశమున్ హాస్యాన వాక్క్రుచ్చు
టనగ ‘నప్రస్తుత’ మనగ బ్రియము
అడిగిన విషయమ్ము నాశవుతో బల్కు
టనగ ‘నాశువ’టంచు ననగనౌను
స్వేచ్ఛా కవిత్వమున్ విరివిగా జెప్పుట
యనగ ‘స్వీయకవిత్వ’మనగదగును
ఇట్టి యష్టావధానంబులెన్నో సలిపి
సరసహృదయాలనలరించు చతురమతులు
లోకమందవదానులై శ్లోక్యులైరి
వారి వైదుష్యమున కభివందనమ్ము!
- డాక్టర్ అయాచితం నటేశ్వర శర్మ
కామారెడ్డి, సెల్.నం.9440468557
*
అక్షర తేజం!
*
ఔను..
నాకు నిజాన్ని వెతకాలని ఉంది!
కనిపించే తెరచాటున దానికి
కనిపించని కుళ్లును
కడిగేయాలని ఉంది..!
అడుగడుగునా పేరుకున్న
చెత్తను వడగట్టాలని ఉంది!
సోమరితనాన్ని పెంచి పోషించే
చేతకానితనాన్ని
తరిమి తరిమి వేయాలని ఉంది!
నాలోని ఎగిసిపడే ఆవేశానికి
సత్యం కోసం చేసే నా అనే్వషణకు
ధర్మబద్ధ నా పోరాటానికి
నా కలమే నా ఆయుధం!
నీతి తప్పిన మనుషులపై
చేసే నా పోరాటంలో
నా కలమే జనచైతన్యం
వెలుగు పంచే అక్షర తేజం!

- గంజి భాగ్యలక్ష్మి
హన్మకొండ, సెల్.నం.9441993044
*
పూబాట
*
నీతులు చెప్పేవారు
గోతులు తొవ్వుతారు
చిలుక పలుకులు పలుకుతారు
నమ్మిన వారిని నట్టేట ముంచుతారు
కొంప కొల్లేరు చేస్తారు
అది వారికె వెన్నతో పెట్టిన విద్య
ఓట్లతో కోట్లు సంపాదించే విద్యనేర్చారు!
దొరబాబుల్లా తిరుగుతారు
అయినా వారికి కాంట్రాక్టులు
కాని వారికి కాంక్రిట్టులు
అన్యాయాన్ని ఎదిరిస్తే కక్షసాధింపులు
అడుగులకు మడుగులొత్తుతే ఆధరాభిమానాలు
ఆత్మాభిమానం చంపుకోలేను
రాజీపడి జీవించలేను
ఎదురించే సత్తా లేదని భావించకు
ఓటునే ఆయుధం చేస్తాను
గోతులు తొవ్విన వారి గోతిలో
నీతులు చెప్పిన వారికి పాతి పెడతాను!
పడమటి సంధ్యారాగం పాడుతాను
అందరి బాట ఈ పూబాటైతే
అవనికి లేదిక అపజయం!

- జాధవ్ పుండలిక్ రావు పాటిల్
భైంసా, నిర్మల్ జిల్లా
సెల్.నం.9490204424
*

నలుపు
*
నలుపు నలుపంటారు మీరు
నలుపుకున్న విలువేందో తెలుసా మీకు
తలలో ఒక వెంట్రుక తెల్లబడితే
బాధపడే నీకు
నలుపంటే అలుసెందుకు
చీకటిలో నుండి వెలుగులోకి వచ్చిన నీకు
నలుపంటే అలుసెందుకు
తల్లి గర్భమందు
చీకటికాక వెలుతురున్నదా?
చీకటి చాటున జరిగిన క్రియకే కదా
ఈ మానవ రూపం
ఆ చీకటి స్వరూపం నలుపు కాదా
నీ బ్రతుకు అర్థమిచ్చిన అక్షరాలు దిద్దిన
పలక నలుపు కాదా
ఈ సృష్టిని చూడగలిగే
నీ కంటిపాప నలుపుకాదా
ఈ నల్ల రేగడి దున్నితేనే కదా
తెల్ల జొన్నలు పండేవి
ఆ నలుపంటే అలుసెందుకు నీకు
నలుపుకున్న విలువెంతో తెలుసా నీకు

- దాసరి శ్రీనాథ్ గౌడ్
మందమర్రి, మంచిర్యాల జిల్లా
సెల్.నం.9701781690
*

బోరివాలి ఎక్స్‌ప్రెస్!
*
ఇంటి బాధ్యతల్ని, భావోద్వేగాల్ని
ఇల్లాలికి అయిష్టంగానే వదిలిపెట్టే
తన వాళ్ల తనువులను ధనువును చేసి
బతుకు భారాన్ని మోసే తను
వలస శరమై ‘బోరివాళి’ బస్సెక్కుతాడు
ఆప్యాయతలు, అనురాగాల్ని
ఆలింగనంతోనే స్వకాయం చేసుకొని
వేదనాశ్రువుల్ని మాత్రం
నయన నిమీళితం చేసుకుంటాడు
కన్నీటి వీడ్కోలులో మాత్రం..
చివరిగా తనవాళ్ల చిత్తరువుల్ని
గుండెల్లో గుట్టుగా దాచుకుంటాడు!
మూలాల్ని ఎదలోతుల్లోనే దాచి
ముంబయి పురవీధుల్లో
చెమట ముత్యాల్ని గంటల్లో
అమ్ముకుంటాడు
నగరదర్పం కంట్లో నలుసైనా
నగుమోముతో నాల్గన్నం ముద్దల్ని
జ్ఞాపకాల సద్దిగినె్నలో సదిరి
జీవిత ‘అర్థా’నే్వషణ సాగిస్తుంటాడు!
తనను బతకడం కన్నా
తన వాళ్లను బాగా మతికించాలనే
ఈ విలువల వలస కూలీకి
‘బోరివాళి’ కన్నీళ్లను తుడిచే భాగస్వామే!
ఉద్వేగాలు మనుషులకే కాదు
పరేంగిత జ్ఞానం లేని
యంత్రాలకు భావావేశాలుంటాయి
ఇప్పుడు ‘బోరివాళి ఎక్స్‌ప్రెస్’
బంధాలను విడదీయడమే కాదు
తిరుగు ప్రయాణంతో
బాధ్యతల్ని మోసుకొస్తుంది కూడా!
- అశోక్ అవారి,
అనంతగిరి, రాజన్న సిరిసిల్ల జిల్లా
సెల్.నం.9000576581