ఉత్తర తెలంగాణ

ఫేస్ బుక్ ప్రేమ! ( కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘రామ్ భరద్వాజ్’ ఫ్రెండ్ రిక్వెస్ట్ చాలా రోజుల నుండి కనబడుతోంది. పేరు చాలా నచ్చింది. వయా వయా వయా.. ఎవరెవరి ద్వారానో మ్యూచువల్ ఫ్రెండ్.. ప్రొఫైల్ చూసాను. అబ్బాయి చిన్న వయస్సు..ఇరవై నుండి ఇరవై అయిదు మధ్యలో ఉంటుంది వయస్సు..చాలా అందంగా ఉన్నాడు. తెనాలిలో బ్యాంక్‌లో ఆఫీసర్‌గా చేస్తున్నాడు. ఇంకా మంచి మంచి కొటేషన్లు.
‘ఒక ఆలోచన నాటితే అది పనిగా ఎదుగుతుంది..
ఒక పనిని నాటీ అది అలవాటుగా ఎదుగుతుంది
ఒక అలవాటు నాటితే అది వ్యక్తిత్వంగా ఎదుగుతుంది
ఒక వ్యక్తిత్వాన్ని నాటితే అది తలరాతగా మారుతుంది
కాబట్టి మీ తల రాతను సృష్టించుకునేది మీరే.. కలాం గారి కొటేషన్.
‘అందరూ నన్ను ఇష్టపడే వాడిగా, అందరికీ నచ్చే వాడిగా ఉండే వరాన్ని ఇవ్వమని దేవుడిని అడిగాను. దేవుడు నవ్వుతూ ఇలా అన్నాడు. ‘ఇంకా నాకే ఆ వరం దొరకలేదు’ నవ్వుకున్నాను.
‘యత్రనార్యంతు పూజ్యతే రమంతే తత్ర దేవతా..ఆడవాళ్ల పట్ల అతనికి ఉన్న గౌరవానికి ఫిదా అయ్యాను. నాకు నచ్చిన కొటేషన్లు అన్నీ దేవతల ఫోటోలు..్భగా నచ్చాడు. రిక్వెస్ట్ ఆక్సెప్ట్ చేశా..అలా అలా చాటింగ్ కూడా మొదలయ్యింది. వారానికి ఒకసారి నాలుగు రోజులకు ఒకసారి చాటింగ్ చేసుకునే వాళ్లం..క్రమక్రమంగా ఒక్క రోజైనా చేసుకోకుండా ఉండలేని స్థాయికొచ్చేసాం. నాకు తెలీకుండానే పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయాను. క్షణ క్షణానికి అతనిపై ధ్యాసే..చదువుపై ధ్యాస తగ్గిపోయిన సంగతి నిరూపిస్తూ మార్కులు తగ్గిపోయాయి. ఎప్పుడూ కాలేజ్‌లో ఫస్ట్ వచ్చే నేను ఒకింత బాధపడినా అంత సీరియస్‌గా తీసుకోలేదు. ఎందుకంటే ఆ విషయం అతనికి మెస్సేజ్ పెడితే, ‘పిచ్చి మొద్దూ.. నా వలపుల వానలో తడిచిపోక, నీకెందుకీ తలనొప్పులు.. చదువే జీవితం కాదు కదా.. నీకెందుకు నేనున్నాగా.. నా జీతం చాలదూ ఇద్దరికీ.. ఐ లవ్ యు బుద్దూ..అంటూ పెట్టిన దాన్ని చూసి బాగా మురిసిపోయాను. రోజూ ఎంత రాత్రయినా నిద్రేరాదు ఆయన తలపుల మునకలే.. అమ్మకు కొంచెం అనుమానం వచ్చినట్లుంది. ‘అస్తమానం ఏమిటే.. కంప్యూటర్ ముందు కూచుని.. చదువూ సంధ్యా లేవా.. ఇదివరకెంత బుద్ధిగా

చదువుకునే దానివి.. ఇరవై నాలుగు గంటలూ.. ఆ ఫోన్.. ఆ కంప్యూటర్.. ఏమో.. మాకేమో చదువు రాదాయే.. ఏం చదువు తున్నావో ఏమో.. అయినా తల తాకట్టు పెట్టి నీ కివన్నీ తెచ్చిపెట్టాడు చూడు.. ఆ మీ ‘అయ్య’ను అనాలి.. కోపంగా ధ్వజమెత్తింది అమ్మ!
ఎందుకే ఎప్పుడూ నా కూతుర్ని ఆడిపోసుకుంటావు.. నీకూ నాకే ఎ చదువూ లేదు..అది మన వంశాన్ని నిలబెడుతుంది. అసలు మొన్న దాని మార్కులకి కాలేజ్ ఫస్ట్ వచ్చి పేపర్లో పడితే అంతా..శుభాకాంక్షలు చెబుతూ ఎంత అసూయగా చూసారో తెలుసా..నా బిడ్డ వజ్రమే..దానికి అవన్నీ కొనీయకపోతే..అది కలెక్టర్ ఎలా అవుతుంది..నాకు తెలుసు..అది చాలా తెలివి గలది..ఎదో ఒక రోజు కలెక్టర్ అయి నీ నోరు మూయిస్తుంది! ‘నాన్న నా తలపై చేయివేస్తూ అంటుంటే నాకు భయమేసింది. మొన్నటి సెమిస్టర్‌లో నా మార్కులు వారికి తెలియదు. నాపై నాకే అసహ్యం వేసింది. ఛ.. ఛ.. ఆయన ప్రేమలో ఎంత కూరుకుపోయినా మంచిగా చదవాలి అని నన్ను నేను తిట్టుకున్నాను. వాళ్లని మోసం చేస్తున్నందుకు సిగ్గుతో చితికి పోయాను. కానీ నా సంకల్పం ఆయనతో ఫేస్ బుక్‌లో కల్లగానే నీరు కారుతోంది. ఆ..ఎంత చదివినా నేను పెళ్లి చేసుకుని వెళ్లాల్సిందే కదా.. ఇంకా నాన్న వాళ్లకి కట్నం లేకుండా మంచి ఆఫీసర్‌ని పెళ్లి చేసుకుంటానంటే సంతోషమే కదా అని సర్ది చెప్పుకున్నాను. ప్రేమ గుడ్డిది అని ఇందుకే అంటారేమో..రోజు రోజుకీ ప్రేమ ఎక్కువై పిచ్చిదాన్నయి పోతున్నాను. కలుద్దామని ఆయన్ని బలవంతపెడుతున్నాను. బ్యాంక్‌లో తీరిక లేకుండా పని ఉంటుందని చెప్పాడు. అతని పుట్టిన రోజుకి ఖరీదైన గిఫ్ట్ అతను చెప్పిన అడ్రస్‌కి పంపించాను. థ్యాంక్స్ చెబుతూ, ‘నా ఒంటరితనం మాయమైంది.. నీ తలపుల వల్లనే సుమా.. అన్నాడు. నా పుట్టిన రోజుకి, చాలా బిజీగా ఉండటాన ఏమీ పంపించలేకపోయాను.. క్షమించు’ అన్నాడు. ‘క్షమయా ధరిత్రి’ అని ఆడవాళ్లని ఊరకే అన్నారా, దానికంత మాటెందుకు అంటూ ఓదార్చా..రెండు రోజుల నుండి అతని నుండి ఎలాంటి జవాబు లేదు. ఏమయ్యింది. సిక్ అయ్యాడా.. పిచ్చిదాన్నయి ఎలాగయినా అక్కడికి మర్నాడు వెళ్లాలని నిశ్చయించుకున్నా. తెల్లవారి పేపర్లో వార్త చూసి నివ్వెరపోయా..‘ఫేస్ బుక్‌లో ఆకర్షణీయమైన ఫోటోలు పెట్టి, బ్యాంక్ ఆఫీసర్ అని, ఇంకా మంచి హోదాలతో అందమైన కొటేషన్లతో ఆకర్షిస్తూ ఆడవాళ్లకు టోకరా ఇచ్చి ఇప్పటికే దాదాపు పాతిక మందిని మోసం చేసి వ్యభిచార గృహాలకు అమ్మేసిన ఘరానా మోసగాడు..అంటూ ఇచ్చారు. అతను కావద్దనుకుంటూ వివరాలు చదివా..అన్నీ అతనివే. సరిగ్గా సరిపోయాయి. భూమి బద్ధలు కాలేదు. ఆకాశం వంగిపోలేదు. కానీ నా మనస్సు ముక్కలైంది. ఎంత ప్రమాదం తప్పింది. అమ్మా, నాన్న రాత్రనక పగలనక చెమటోడ్చి తనపై పెట్టుకున్న ఆశలను తానేం చేసింది. ఛీ.. క్షమించమనడానికి అర్హత లేని దాన్ని. వారికిచ్చే ఒకే ఒక దక్షిణ కేవలం బాగా చదువుకుని కలెక్టర్ కావడమే. దృఢనిశ్చయంతో లేచాను!

- నామని సుజనా దేవి
హుస్నాబాద్, సిద్ధిపేట
సెల్.నం.7799305575
**
పుస్తక సమీక్ష
*
పోరు శతకం..!
*
పేజీలు: 32, వెల: అమూల్యం
ప్రతులకు:
తగిరంచ నర్సింహారెడ్డి
ఫరీదుపేట
సెల్.నం.9912119901
*
‘ఇంగులం’ గ్రంథంతో సాహితీ లోకానికి పరిచయమైన కవి తగిరంచ నర్సింహారెడ్డి ఇప్పుడు సిపిఎస్ ‘కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్’పై ఓ పోరు శతకాన్ని ప్రకటించారు. నూతన (సిపిఎస్) పెన్షన్ విధానం వల్ల ప్రభుత్వ ఉద్యోగులకు ఒనగూరే ప్రయోజనం శూన్యమని, పాత పెన్షన్ విధానానే్న పునరుద్ధరించాలని కోరుతూ నర్సింహారెడ్డి ఓ పద్య కావ్యానే్న వెలువరించారు. సామాజిక అంశాన్ని ఇతివృత్తంగా తీసుకుని.. సమస్య యొక్క తీవ్రతను ప్రస్తావించడానికి పద్య ప్రక్రియను ఎంపిక చేసుకుని పాఠకులను మెప్పించయత్నించిన నర్సింహారెడ్డి అభినందనీయులు. లక్షలాది ఉద్యోగులకు సిపిఎస్ వల్ల వచ్చే కష్టనష్టాలను కవి పద్యాల్లో బంధించారు. సామాజిక భద్రతకు భరోసానిచ్చేది పాత పెన్షన్ విధానమేనని కవి తమ పద్యాల ద్వారా తేల్చి చెప్పిన తీరు బాగుంది!
నర్సింహారెడ్డి తన మిత్రుడు చుక్క కిరణ్ కుమార్ సహకారంతో వెలువరించిన ఈ పుస్తకంలోని పద్యం సామాజిక బాధ్యతను ప్రతిబింబించేలా రూపుదిద్దుకుంది. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడానికి.. అందుకోసం పోరు సలపడానికి ఈ గ్రంథం తెర లేపింది. ‘పాత ఫించనే మనకైతే ప్రాణహితకు మకుటంతో సాగే ఇందలి పద్యాలు పాఠకులను ఇట్టే ఆకట్టుకుంటాయి!
ఆశయమ్ముకై శ్రమియిస్తిననుది నమ్ము
పొందినుద్యోగ మందున బొందికేది!
చిక్కి సీపియస్ వలలోన చిత్రవథలు
పాత ఫించనే మనకైతే ప్రాణహితము!
అంటూ మొదటి పద్యంలోనే సిపిఎస్‌పై కవి తమ కలాన్ని సంధించారు.
‘నుదుటిపై బ్రహ్మరాతల నొప్పిగాదు
చేతిపై గీతలనుకున్న చేయలేవు
పిడికి లెత్తితే సాధ్యమై పీడబోవు
పాత ఫించనే మనకైతే ప్రాణహితము’
అంటూ పాత ఫించన్ కోసం పిడికిలెత్తి పోరుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఇలా ఓ సామాజిక అంశాన్ని పద్యాల్లో బంధించడంలో కవి నర్సింహారెడ్డి సఫలీకృతులైనారు. సమస్యను ప్రస్తావించే క్రమంలో ప్రకటించిన భావాలు పునరావృతం కాకుండా చూస్తే బాగుండేది. అక్కడక్కడ ఛందస్సు పాటించక పోయినప్పటికీ..కవి యొక్క సామాజిక దృక్పథాన్ని అభినందించి తీరుతాం!

- సాన్వి, కరీంనగర్
సెల్.నం.9440525544
**
ఈ శీర్షికకు కవితలు, కథలు, సాహితీ వ్యాసాలు, కొత్త పుస్తకాల సమీక్ష/పరిచయం, కార్టూన్లు ఈ క్రింది చిరునామాకు లేదా ఈ-మెయల్‌కు పంపండి.

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, జగిత్యాల రోడ్, కరీంనగర్. merupuknr@andhrabhoomi.net