ఉత్తర తెలంగాణ

విభిన్న భావాల ‘చివురు కోయిల’! (పుస్తక సమీక్ష)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతులకు:
డాక్టర్ తిరునగరి శ్రీనివాస రావు
శ్రీ సాయివాసు ప్రథమ చికిత్సా కేంద్రం
ఇం.నం.6-36, పాండురంగాపురం గ్రామం
బల్లేపల్లి (పోస్టు), జిల్లా ఖమ్మం-507002
సెల్.నం.9394171299
పేజీలు : 126, వెల : 100/-
**
మధ్యతరగతి జీవితాలతో వసంతం అలాగే నిలిచి ఉండాలని ఆశపడే కవయిత్రి యడవల్లి శైలజ ‘చివురు కోయిల’ పేరుతో ఒక కవితా సంపుటిని ప్రకటించి.. ఆమె అంతరంగంలో కదలాడే విభిన్న భావాలను పాఠకులతో పంచుకున్నారు. వృత్తిరీత్యా హిందీ అధ్యాపకురాలైన ఆమె.. రచనా వ్యాసాంగాన్ని ప్రవృత్తిగా మలుచుకుని ఇతరులను మార్చాలని తపన పడటం ఆహ్వానింపదగింది.. మృగం లాంటి మనిషినైనా ఏదో ఒక క్షణంలో.. మానవత్వం తట్టి లేపుతుందని విశ్వసించే ఆమె తెలుగు భాష తియ్యదనం, గొప్పదనం అందరికీ అందించాలని కాంక్షించడం విశేషం!
‘కాలం వెనక్కిపోతే’ కవితలో.. బాల్య మధుర స్మృతులను నెమరు వేసుకుంటూ.. కాలం వెనక్కిపోతే బాగుండు ఎంచక్కా ఆ రోజుల్లో లాగా ఒత్తిడిలేని ఆప్యాయతగల జీవితాన్ని గడిపేయొచ్చునని అభిప్రాయపడ్డారు. ‘మనసు’ కవితలో వలస పోయిన జ్ఞాపకాలు వాన చినుకులా వచ్చి తాకాలని అభిలషించారు.
అలాగే ‘జ్ఞాపకాల లోతుల్లో’ కవితలోను చిన్ననాటి తీపిగుర్తు గుర్తుకు తెచ్చుకున్నారు. కవయిత్రి ‘ప్రియసఖి’ కవితలో ప్రకటించిన భావాలు రమణీయంగా ఉన్నాయి!
‘నీవు నా చెంత లేనప్పుడు.. నా గది మది నిండా నువ్వు పదిలంగా వదిలి వెళ్లిన జ్ఞాపకాలు గిలిగింతలు పెడతాయి’ అన్న పంక్తులు పాఠకులను ఇట్టే ఆకట్టుకుంటాయి.
ఓ మానవత్వమా నీవు ఎక్కడా? అంటూ ప్రశ్నిస్తూ రాసిన కవిత బాగుంది. బండరాతి గుండెలను కరిగించ.. మంచుబిందువులా చల్లగా మమ్ము తాకుమా! అంటూ ఈ కవితకు చక్కని ముగింపునిచ్చారు. ‘విజయం నీదే’ కవితలో మనసును, వయసును అదుపులో పెట్టుకొమ్మని హితవు పలికారు. ‘రేడియేషన్ భూతం’ కవితలో రేడియేషన్ అనర్థాలను ఏకరువు పెట్టారు. రేడియేషన్ భూతం వల్ల చిగురుకొమ్మలు కనబడక.. పిచ్చుక గొంతు మూగబోయిందని వాపోయారు. ‘చినుకు - చిదానందం’! కవితలో కవయిత్రి వ్యక్తీకరించిన భావాలు పాఠకులను పులకింపజేస్తాయి!
‘వేగుచుక్క పొద్దులో పల్లె’ కవితలో పల్లె అందాలను అందంగా అక్షరాల్లో బంధించారు. ‘జవ్వనమా’ కవితలో చక్కని భావుకతను కవయిత్రి ప్రదర్శించారు. ప్రపంచీకరణ పడగనీడలో.. నవీనం మత్తులో.. ఉరుకుల, పరుగుల జీవనంలో మనిషి భావాలను పాతరేస్తున్నాడని ఓ కవితలో తమ ఆవేదనను వ్యక్తపరిచారు. ఆడ, మగ వివక్ష చూపి.. తక్కెడలో తూకం చేసే బడాబాబులకు గుణపాఠం చెప్పడానికి ‘నీ చేతి పిడికిలి చాలు’ అని ఓ కవితలో మహిళల్ని చైతన్యపరిచారు. మరో కవితలో మహిళను బంధాలకు భాష్యం చెప్పే ప్రియ బాంధవిగా అభివర్ణించారు. మాటలతో యుద్ధం చేయలేనపుడు.. వౌనంతో మమేకం కావాలని ‘వౌనం’ కవిత ద్వారా తెలియజేశారు. ‘ఆమె ఓ ప్రకృతి బొమ్మ’ అంటూ రాసిన కవితలో మాతృత్వపు ప్రాశస్త్యాన్ని వివరించారు. అంతేగాక ఆర్ద్రంగా కవయిత్రి ఆవిష్కరించిన ఆలోచనలు అందరినీ కదిలిస్తాయి! ‘నాలో ఆశలకు ఊపిరిపోసి.. నవ వసంతాన్ని ముగింట నిలువుమని.. చివురు కోయిలను ఆహ్వానించారు. ఎన్నో కవితలు ఈ సంపుటిలో ఉదహరించడానికి యోగ్యంగా ఉన్నాయి. శైలజ గారు ఎంపిక చేసుకున్న కవితా వస్తువులు వైవిధ్యంగా ఉన్నాయి.. శిల్పం పట్ల ఇంకా ఆమె శ్రద్ధ చూపవలసి ఉన్నప్పటికీ.. విభిన్న భావాలతో ప్రకటించిన ఈ గ్రంథంలోని కవిత్వం మున్ముందు ఆమె ఓ మంచి కవయిత్రిగా ఎదగడానికి సూచికలుగా కానవస్తాయి! అభివ్యక్తిలో ఇంకా పరిణతి సాధించడానికి ఆమె అధ్యయనం పట్ల మక్కువ చూపగలరన్న విశ్వాసముంది.
- సాన్వి, కరీంనగర్
9440525544
***

రచనలకు ఆహ్వానం

నవ, యువ, ఔత్సాహిక రచయితలూ ఈ పేజీ మీది...
మీ ఆలోచనలకు అక్షర రూపం...
సమాజానికి కావాలి మణిదీపం! మీరు కథలు, కవితలు,
కథానికలు, కార్టూన్లు, జోకులు, పుస్తక
సమీక్షలు, పుస్తకావిష్కరణలు, ఇలా ఏదైనా,
మీరు రాసిన అక్షరానికి అచ్చురూపం ఇచ్చి, ఆవిష్కరించే
అద్భుత అవకాశమే ఈ ‘మెరుపు’.
మీ కలాలకు పదునుపెట్టండి... నిస్తేజంగా ఉన్న భావుకతను
మేల్కొలపండి. ఈ ‘మెరుపు’లో మీరు తళుకులీనండి.
మీ రచనలను కింది చిరునామాకు పంపండి.

ఈ శీర్షికకు కవితలు, కథలు, సాహితీ వ్యాసాలు, కొత్త పుస్తకాల సమీక్ష/పరిచయం, కార్టూన్లు ఈ క్రింది చిరునామాకు లేదా ఈ-మెయల్‌కు పంపండి.
మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, జగిత్యాల రోడ్, కరీంనగర్. merupumbn@andhrabhoomi.net
***

పోత పోసిన అందం (కొత్త పుస్తకం)

పేజీలు: 88 వెల: 100/-
ప్రతులకు:
ఆచార్య కడారు వీరారెడ్డి
ఇం.నం.8-12-20
బృందావన్‌నగర్ రోడ్ నం.8
హబ్సిగూడ, హైదరాబాద్ - 500007
సెల్.నం.7893366363

అనతి కాలంలోనే కవిత్వాకాశంలోకి దూసుకవచ్చిన కవి ఆచార్య కడారు వీరారెడ్డి. నాలుగు కవితా సంపుటాలను వెలువరించిన వీరు ఐదవ సంపుటిగా దీర్ఘ కవితను వెలువరించారు. ‘అందమా నిను వర్ణింపతరమా’ అనే ఈ కావ్యం వీరి అనుభవసారంగా వెలువడింది. దశాబ్దాల వీరి రసాయనశాస్త్ర ఆచార్య వృత్తి అనుభవము, శాస్త్ర విజ్ఞానము, తార్కిక ప్రతిభ, తత్వ దర్శనము, పరిపాలన అనుభవము, ప్రకృతి ప్రేమ, భావుకత, కవితాసక్తి అన్ని కూడా రంగరించి వెలువరించిన దీర్ఘ కవిత ‘అందమా.. నిను వర్ణింపతరమా!’.
ప్రపంచమే ఓ అనంత గోళం
ఆ గోళంలో / భ్రమణ గోళ గణం
ఒకదానికొకటి తగులని వైనం / అందం
ఇదొక ఖగోళశాస్త్ర దృష్టి. అందానికిచ్చిన నిర్వచనం. ప్రకృతి అనేక మార్పులకు గురి అవుతది. ఆ మార్పులు పదార్థ పరిమాణాన్ని శాసిస్తవి. అలా మారడం ఒక అందం అంటాడు కవి.
ఆకర్షణలో సూదంటు రాయి
కాంతి తరంగాలు కలబోసి మలచిన
వెండి వెనె్నల ముగ్దనీవు
అంటూ అందాన్ని నిర్వచించిండు.
నవ మాసాలు కడుపులో మోసి
ఎన్నో అందాలు కలబోసి, నిండిన కలశం
అందుకే అంటాను..అన్ని అందాలకు
అంతిమ చిరునామా..ప్రేమ.
ప్రతి ఒక్కరికి వారిదైన ఒక ప్రాపంచిక దృష్టి ఉంటుంది. తల్లి ప్రేమ అందమైనది అని చెప్పడమే కవి ఉద్దేశం. ఇది వీరి దృష్టిని పట్టించింది.
వదిలి పోలేవు / ఎల్లప్పుడూ.. ఉండలేవు
వచ్చేదెపుడో? పోయేదెపుడో
కావాలనుకుంటే రావు
వద్దనుకుంటే వదలవు
అంతు చిక్కవు అర్థం కావు
అత్యంత సునిశిత పరిశీలన, అనే భావాలకు చోటు కల్పిస్తుంది. ఆ సమయాన ఎలాంటి నిర్ధారణకు రాలేకపోవడం సహజం. ఇదొక తాత్విక అవస్థ. పై కవితావాక్యాల్లో అది చోటు చేసుకుంది.
చీకటి అందం / నగ్నత్వానికి నల్లని గుడ్డ
పగలంతా తేజస్సు విరజిమ్మే
వెలుతురు వస్త్రం.
పై కవితా వాక్యాలు వీరి భావుకతకు పరాకాష్టగా నిలుస్తవి.
అందానికి గుణాన్ని ఆపాదించడం ఆశ్ఛర్యం గొల్పుతుంది. ఈ విషయాన్ని గూర్చి ఇలా అంటాడు.
‘అందం..పొదగబెడితే ఒదుగుతుంది
అణగ దొక్కితే అమాంతం తిరుగబడి
పొక్కిలై పుక్కిలిస్తుంది’
అందాన్ని మానవీకరించే ప్రయత్నం చేస్తడు. అలా అంటూనే ప్రకృతిలో దాన్ని దర్శింపచేస్తడు. ఈ కింది పంక్తులు అందుకు ఉదాహరణ.
‘నీ నడకను నాగుపామే అనుకరించిందా
నీ కనులను హరిణమే అరువు తీసుకుందా
నీ నయగారాల సోయగాలను నెమలి
పుణికి పుచ్చుకుందా, వలసపోయి
చెట్టు, చేమ, గుట్ట, పుట్టల్లా తీర్చి దిద్దుకున్నావా’
ప్రకృతి రహస్యాలను శోధిస్తూ అందాన్ని దర్శించిన వైనం ఈ విధంగా ఉంది.
‘అది ముమ్మాటికీ అబ్సట్యాట్
కృష్ణబిలం సృష్టి అద్భుతం
అత్యంత గురుత్వాకర్షణ దాని బలం’
తెలంగాణ సాంస్కృతిక ప్రతినిధి బతుకమ్మలో అందాన్ని చూసిన వైనం బాగుంది.
మల్లెల తెలుపు సువాసన నీ అందం!
బతుకమ్మకు బంగారు సొగసులు దిద్దే
గుమ్మడి పూల దళం నీ అందం! అంటాడు
తేలిక కాదు అందుకే...
వెలుతురును
పిడికిట్లో బంధించవచ్చునేమో
ధ్వనిని
పాత్రలో నిలువ చేయవచ్చునేమో
ఆకర్షణ శక్తిని
ఆపు చేయవచ్చునేమో
అందాన్ని ఆమూలంగా వర్ణించడం సాధ్యమా’ అని అంటారు. ఈ విషయానే్న ఆలోచిస్తూ ఇలా అంటాడు
‘ఏ నాటికైనా..అందం / గుట్టు తెలుస్తుందా/ ఐనా... / మనిషి అనే్వషణకు లేదు అంతం / అందం...అనే్వషణ అనంతం
ఇలా అందమైన పదబంధాలు అందించారు. కోర్కెల కొండ, స్వచ్ఛ మనసు, వెలుతురు వస్త్రం, క్షీణాతీతం లాంటి పదాలు కవిత్వ అందాన్ని ద్విగుణీకృతం చేసాయి. ఆచార్య కడారు వీరారెడ్డి గారి కలం ఆగదు. అది మరింత మంచి కవిత్వం ఇవ్వగలనని వాగ్దానం చేస్తుంది.
పేజీలు: 88 వెల: 100/-
ప్రతులకు:
ఆచార్య కడారు వీరారెడ్డి
ఇం.నం.8-12-20
బృందావన్‌నగర్ రోడ్ నం.8
హబ్సిగూడ, హైదరాబాద్ - 500007
సెల్.నం.7893366363
***

అమ్మ బొమ్మ (కథ)

ఉరుకుల పరుగుల జీవితంలో ఉదయం ఎనిమిది అయ్యిందంటే.. సమయంతో కుస్తీ పట్టినట్టుగా స్కూళ్లకీ ఆఫీసులకీ తయారై వెళ్లే బిజీలోనే నిమగ్నమవుతారు. స్కూల్ టైమైందని మనవడిని పిలిచింది మీనాక్షి. అమ్మమ్మ పిలుపు విన్న మిన్ను మంచం మీది నుండి లేస్తూ ఒక్క గంతులో దూకబోయి కిందపడ్డాడు. అంతే నొసటికి దెబ్బ తగిలి రక్తం బొట బొటా కారింది. ‘అమ్మో నా కొడుకు’ అంటూ ఏడుస్తూ వచ్చింది శాంతి!
ఏమి కాదని శాంతికి సర్దిచెప్పి ఆమె భర్త శ్రీకాంత్ పక్కనే ఉన్న హాస్పిటల్‌కు తీసుకెళ్లి ట్రీట్‌మెంట్ చేయించాడు. తలకు గాయమవడం వల్ల నాలుగు కుట్లు పడ్డాయ. మిన్ను అల్లరికి కొదవ లేదు, నడుస్తూనే పడిపోతాడు!
‘ఏం పిల్లలో ఆలోచనా జ్ఞానమే బొత్తిగా లేదు’ అంటూ కూతురిని ఓదార్చింది మీనాక్షి.
కాలం మహిమో, పిల్లల మహిమోగానీ కంప్యూటర్ యుగంలో పుట్టిన పిల్లలు పూర్తిగా కంప్యూటర్‌కే అతుక్కుపోయి సిస్టమ్ ఆన్ చేసి ప్రపంచంలో ఉన్న ఆటలన్నీ వెతికి ఇష్టమైన ఆటలాడుతూ ఒకే డబ్బాలో మూసపోసినట్టు అన్నీ ఆవరణ లోపలి ఆటలే ఆడుకున్నారు! ప్రకృతి ఆటలు లేవు, ఆనందంగా గడిపే ఛాన్స్ అసలే లేదు. ‘బుర్రను తీసి ఇంటర్‌నె’ట్‌కు గిరిని పెట్టినట్టు టెక్నాలజీ మాయలోపడి డబ్బుకోసం శ్రీకాంత్, శాంతి ఉద్యోగాలు చేస్తున్నారు. మిన్నుకు రెండు సంవత్సరాల చెల్లి చెర్రీ ఉంది. అన్నయ్యా అంటూ మిన్ను వెంటే తిరుగుతూ ఆడుతుంది. కానీ చెల్లెల్ని పట్టించుకోడు మిన్ను తన లోకం తనదే తన ఆట తనదేనన్నట్టు ఉంటాడు. చెర్రి పుట్టిన రోజుకోసమని షాపింగ్‌కెళ్తారు. శాంతి శ్రీకాంత్‌తో పాటు మిన్నువాళ్ల పిన్ని ప్రత్యూష కూడా వెళ్లింది. రాత్రి ఎనిమిది గంటలకు గాని షాపింగ్ పూర్తికాలేదు. అక్కడే పక్కనున్న రెస్టారెంట్‌లో డిన్నర్ చేసి ఇంటిదారి పట్టారు.
మిన్ను, చెర్రీ ఆడుతూనే అన్నం తినకుండా అలాగే నిద్రపోయారు. చెర్రీకి జ్వరం వచ్చింది. ఇంటికి రాగానే శాంతి ‘నాన్న, పిల్లలు అన్నం తిన్నారా’ అని మీనాక్షిని అడిగింది. తినలేదని పట్టింపులేనట్టుగా చెప్పింది మీనాక్షి. కూతురు పైనున్న కోపంతో సమాధానం ఆవిధంగా చెప్పిందిగానీ వాళ్ల బాధ్యత పూర్తిగా మీనాక్షిదే. ‘ఇదిగో బొమ్మ’ అని ‘అమ్మ బొమ్మ కొన్నానని’ ఇచ్చింది శాంతి, మీనాక్షి ముందుగా బిగ్గరగా నవ్వింది. ‘నువ్వు ఇవ్వాల్సింది బొమ్మ కాదనీ, వారి ముద్దుమాటలు మిస్సవుతున్నావని’ కూతురిని హెచ్చరించింది. ఉద్యోగం తరువాత చెయ్యొచ్చుగాని పిల్లల్ని మళ్లీ చూసుకోలేవు ఆ పనితనం మళ్లీ రాదని హెచ్చరించింది. శాంతి తల్లి వంక కోపంగా చూసి ‘మేం చేసేది వాళ్ల కోసమేగదా! వాళ్లను రిచ్‌గా పెంచాలి. భవిష్యత్ కోసం బాగా చదివించాలి అందుకే మేమీ కాల్ సెంటర్‌లో రాత్రి డ్యూటీలు చేస్తున్నాము’ అంది. ‘ఏం జరిగిందని’ శ్రీకాంత్ అడిగాడు. సమాధానం చెప్పకుండా సిస్టమ్ ఆన్ చేసింది ‘శాంతి ఏమయ్యింది?’ అని మళ్లీ అడిగాడు ఆమెను సమీపించి. ‘ఉద్యోగానికి రిజైన్ చేస్తున్నా’ అని సీరియస్‌గా అంది శాంతి. ‘ఇక అమ్మ బొమ్మతో అవసరం తక్కువే’ అంది మీనాక్షి చిరునవ్వు నవ్వుతూ!

- హనుమాండ్ల రమాదేవి
బెల్లంపల్లి, ఆదిలాబాద్ జిల్లా
సెల్.నం.9959835745