నెల్లూరు

ఖలేజా ముసల్ది ( కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉదయగిరి చుట్టూ ఉన్న కీకారణ్యం ఎన్నో పల్లెలకు జీవనాధారం. ప్రకృతి ప్రసాదించిన ఆ అడవిసంపద ఎన్నో కుటుంబాలను బ్రతికిస్తోంది. అక్కడ చెట్లకు కొదవలేదు. జంతువులకు కొదవలేదు. పక్షులకు కొదవలేదు. పండ్లకు కొదవలేదు. ఆకులకు కొదవలేదు. పల్లెవాసులు కట్టెలు కొట్టుకుని అమ్ముకుంటారు. కుందేళ్లను పట్టుకుని అమ్ముకుంటారు. కౌంజుపిట్టలు, అడవికోళ్లు పట్టుకుని అమ్ముకుంటారు. అలాగే మామిడికాయలు, కుంకుడుకాయలు, ఈతపండ్లు, పాలపండ్లు, కలేపండ్లు, గుంజిపండ్లు లాంటివి కోసుకుని విక్రయిస్తారు. కట్టెలు కొట్టి వాటిని ఎండబెట్టి మోపులు కట్టి అమ్ముతారు. మర్రి ఆకులతో విస్తళ్లు కుట్టి అమ్ముకుంటారు.
అంతేగాక కొండపాదం క్రింద అడవిని నరికి చదును చేసుకుని కొద్దికొద్ది భూముల్లో రాగి, జొన్న, సజ్జ మొదలైన వర్షాధారపు మెట్ట పైర్లు వేసుకుని తమ భుక్తికి పంటలు పండించుకొంటుంటారు. కొండవాగుల ఒడ్డున ఆ నీటి ఆధారంతో కొద్దికొద్ది స్థలాల్లో వంగ, బెండ, చిక్కుడులాంటి కూరగాయల మొక్కలు సాగు చేసి వాటిని అమ్ముకుని బతుకులు వెళ్లదీస్తుంటారు. వీళ్ల వ్యాపారాలన్నిటికి కూడలి ఉదయగిరి గ్రామం.
పిల్లలు లేని పుట్టమ్మకు మొగుడు చచ్చిపోయాడు. పుట్టమ్మ మొగుడు శంకరయ్య చనిపోవడం ఒక విషాదమైన కథ. శంకరయ్య మంచి ఉడుముల వేటగాడు. దుర్గం చుట్టూ ఉన్న అడవిలో రోజుకు నాలుగైదు ఉడుములన్నా పట్టుకుంటాడు. వాటిని కర్రకు తగిలించుకుని వచ్చి, ఉదయగిరి గ్రామంలో అమ్ముకొని వస్తుంటాడు. వాటి ఆదాయంతో అతని కుటుంబం సాఫీగా సాగిపోతోంది. అంతేగాక పుట్టమ్మ ఇంట్లో చాపలల్లడం ద్వారా అంతో ఇంతో సంపాదిస్తోంది.
వర్షాకాలమొస్తే శంకరయ్య పంట పండినట్లే. ఈ కాలమొస్తే ఉడుముల వేట కాస్త ఎక్కువగానే ఉంటుంది. కారణం నేల మీద ఉడుముల జాడ స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కువ ఉడుముల్ని పట్టవచ్చు.
కుక్కలకు చిన్నతనం నుంచీ ఉడుముల వేటలో తర్ఫీదు ఇస్తారు. వీటికి ఉడుము జాడలు చూపించి ‘ఉస్కో’ అంటూ ఉసికొలిపితే, అవి పరుగెత్తుకు వెళ్లి పారిపోతున్న ఉడుముల్ని నోటితో పట్టుకుంటాయి. వేటగాడు వెళ్లి వాటిని విడిపించుకుని తీసుకుంటాడు. అంతేగాక అవి కుందేళ్లులాంటి చిన్నచిన్న జంతువులను కూడా పట్టుకుంటాయి. నేర్పిస్తే ఇవి అడవిలో మేకల్ని కూడా కాపలా కాసి మేపుతాయి.
ఆ రోజు వర్షం వెలిసిన తరువాత ఉడుముల వేటకు బయలుదేరాడు శంకరయ్య. అతని వెనుకనే కుక్క. తడిసిన నేలమీద ఉడుముల అడుగుజాడలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ అడుగుజాడలు పాముల బొరియలోకి ఉన్నాయి. తమాషా ఏమిటంటే పాములు ఖాళీ చేసిన బొరియల్లో ఇవి నివాసముంటాయి. పుట్ట చుట్టూ తిరుగుతూ కుక్క పెద్దగా అరుస్తూ ఉంది. ఆనందంగా చేయి బొరియలో పెట్టాడు శంకరయ్య. చేతి నిండా దొరికింది ఉడుము నడుము. కాని దాన్ని బయటికి తీయడానికి అతనికి శక్తి చాల్లేదు. ఇతను ఈ ప్రయత్నాల్లో ఉండగా పుట్ట దగ్గరకు చీమల్ని తినడానికి వచ్చిన ఎలుగుబంటు ఇతని మీద దాడి చేసింది. ఆ దాడిలో తీవ్రంగా గాయపడ్డ శంకరయ్య కొద్దిరోజుల్లోనే చనిపోయాడు.
ఇక బతుకుదెరువు కోసం పుట్టమ్మకు నల్లగా మదరమాగిన పండ్లతో కూడిన ఈతచెట్లు కనిపించాయి. గెలలు కిందికి వేలాడుతూ అందుబాటులో ఉన్నాయి. గంప ఒక చెట్టు కింద పెట్టింది.
గంపలో ఉన్న చిన్న బుట్ట తీసుకుని ఈతచెట్టు గెలల నుంచి ఈతపళ్లు కోయసాగింది. చిన్నబుట్ట నిండిన తరువాత గంపలో పోయసాగింది. అదొక చిన్న ఈతతోపు. అయిదారడుగుల ఎత్తున్న ఈతచెట్లు చాలానే ఉన్నాయి. అన్నీ పండ్లతో నిండి ఉన్నాయి.
ఈమెలాగే అడవికి వచ్చిన మల్లమ్మ, నల్లమ్మ మొదలైన ఇతర స్ర్తిలు అక్కడికి కొద్దిదూరంలో, ఎర్రని గుంజిపల్లు కోసుకుని తమ గంపలు నింపుకొంటున్నారు. దూరం నుంచి వాళ్ల కేకలు, మాటలు మాత్రం వినిపిస్తున్నాయి.
పుట్టమ్మ గంప మూడువంతులు నిండింది. ఇంకో నాలుగు బుట్టలు పండ్లు కోస్తే గంప నిండుతుంది. తను పెందలాడే ఇంటికిపోవచ్చు. కాయలు కోయడంలో వేగం పెంచింది. కొద్దిసేపట్లోనే గంప నిండిపోయింది. నల్లగా ఘుమఘుమలాడుతున్న ఈ పండ్లను ఉదయగిరిలోని సాయిబులు, హిందువులు భేదభావం లేకుండా ఎగబడి కొంటారు. ఈ గంపను రాత్రికి ఇంట్లో పెట్టుకుని ఉదయానే్న ఉదయగిరికి తీసుకెళ్లి అమ్ముకురావాలి. ఇప్పటి నుంచే రాబోయే లాభాల గురించి నోరూరసాగింది పుట్టమ్మకు. చిన్న బుట్టను గంపమీద బోర్లించి పెట్టుకుంది.
తను భుజం మీద వేసుకువచ్చిన మెత్తని పాత చీరను చుట్టగా చుట్టుకుని నెత్తిన పెట్టుకుంది. ముందుకు వంగి గంపనెత్తిన పెట్టుకుందామనుకున్న ఆమెకు గంప అలవికాలేదు. ఎత్తుకోలేకపోయింది. గంప నిండా ఉన్న పళ్లలో కొన్ని తీసేస్తే తప్ప గంప స్వయంగా ఎత్తుకోలేదు. కాని తను చేతులారా కోసిన ఈతపండ్లు ఏ కొద్దిగా కూడా వదులుకోవడానికి ఆమె మనసు ఒప్పుకోలేదు. అందుకే పంటి బిగువున గంపనెత్తుకోవడానికి మళ్లీ ప్రయత్నం చేసింది. ఊహు... మేను అలవిగాలేదు. దగ్గరలో ఎవరో వస్తున్నట్లు అనిపించింది. అడవిలో ఎవరో ఒకరు తిరుగుతుంటారు. కట్టెలు కొట్టేవాళ్లు, వేటాడేవాళ్లు, మేకలు మేపేవాళ్లు ఎవరో ఒకరు ఇలాంటి సమయంలో గంపనెత్తి సాయం చేస్తుంటారు. అందుకే ‘గంపనెత్తి సాయం సేయన్నా’ అంటూ అరిచింది. అవతలి వైపు నుంచి ఎలాంటి జవాబు లేకపోయేసరికి చుట్టూ చూస్తున్న పుట్టమ్మకు తనకెదురుగా వచ్చి రెండు కాళ్లమీద నిలబడ్డ ఎలుగుబంటు కనిపించింది. దాన్ని చూసి భయంతో నీలుక్కుపోయింది పుట్టమ్మ. ఉన్నట్లుండి పెద్ద అరుపు అరిచింది ఎలుగుబంటు.
పుట్టమ్మ కాళ్లు, చేతులు వణుకుతుండగా పరుగెత్తుకెళ్లి ఒక ఈతచెట్టు చాటున దాక్కుంది. ఎలుగుబంటి తాపీగా ముందుకు వంగి చేతులుగా వాడే ముందుకాళ్లతో గంపలోని ఈతపళ్లను పిడికిళ్ల నిండా పట్టుకొని ఆబగా నోట్లో పెట్టుకుని నములుతూ ఉంది. చెట్టు చాటు నుండి చూస్తున్న పుట్టమ్మకు తన కష్టం ఇలా అయ్యేసరికి కడుపు మండిపోయింది. కోపం పట్టలేకపోయింది. అవతలిది అడవి జంతువని, తన కంటే బలవంతుడని కూడా ఆలోచించలేదు. తన మొగుడికి జరిగిన అన్యాయం కూడా గుర్తుకొచ్చింది.
ఒక్క ఉదుటున పరుగెత్తుకొని దాని వెనుకవైపుకు వెళ్లి చిక్కగా ఉన్న దాని తల మీద జుట్టు రెండు చేతులతో గట్టిగా పట్టుకుని వెనక్కి లాగింది. ఊహించని ఈ సంఘటనకు వెల్లకిలా పడిపోయింది ఎలుగుబంటు. ఈ తక్కువ సమయంలోనే ఎక్కడలేని బలం తెచ్చుకున్న పుట్టమ్మ గంప మోకాలిపైకి చేర్చి తరువాత నెత్తిన పెట్టుకుంది. తరువాత అరుస్తూ అడవిలో పరుగెత్తసాగింది.
ఈ హఠాత్సంఘటన నుంచి తేరుకున్న ఎలుగుబంటు కళ్లు నిప్పులు చెరిగాయి. నోట్లోని ఈతపండ్లను ఊసేసింది. చేతుల్లో మిగిలిన ఈత పండ్లు పారేసింది. పల్టీ కొట్టి క్షణంలో బోర్లా తిరిగింది. వెంటనే నాలుగు కాళ్ల మీద దుముకుతూ పుట్టమ్మను తరమసాగింది. పుట్టమ్మ ప్రాణభయంతో పరుగులు తీస్తోంది. కాని నెత్తిమీద గంపను మాత్రం వదల్లేదు. ఆమె కేకలు దూరంగా ఉన్న మిగతా స్ర్తిలకు కూడా వినిపించాయి. పుట్టమ్మ ఏదో ప్రమాదంలో ఉందని గ్రహించారు. ఆమెకు సాయంగా ‘హే...హే...’అని పెద్దగా అరవసాగారు.
కాని చెట్ల మధ్య నల్ల ఏనుగులా దుముకుతూ వస్తున్న ఆ ఎలుగుబంటిని చూసి ప్రాణభయంతో వాళ్లు కూడా పండ్ల గంపలు అక్కడ పడేసి పరుగులు తీశారు. కాని నెత్తిన పండ్ల గంప బరువుతో గంపను పెట్టుకున్న పుట్టమ్మ వాళ్లంత వేగంగా పరుగెత్తలేకపోతోంది. ఎలుగుబంటు క్షణక్షణానికి పెరుగుతున్న బలంతో పుట్టమ్మ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ఉరకలు వేస్తోంది. తనలాంటి బలవంతుడిని చూసి అందరూ భయపడి చస్తూంటే ఒక వృద్ధ స్ర్తి తనను జుట్టు పట్టుకొని పడదోయడమా? అని భావించినట్లుగా ఉంది. ఇద్దరూ చాలాసేపు ఈతచెట్ల మధ్య దొంగ పోలీసు ఆట ఆడుకున్నారు.
చివరకు పుట్టమ్మ అలిసిపోయింది. ప్రాణాలుంటే అదే పదివేలు అనే నిర్ణయానికొచ్చింది. గంప క్రిందపెట్టి దూరంగా ఒక ఈతచెట్టు చాటు నిలబడి ఆయాసం తీర్చుకోసాగింది. ఉన్నట్లుండి పుట్టమ్మ కనబడకపోయేసరికి దానికి పిచ్చిపట్టినట్లయింది. చాలా జాగ్రత్తగా గమనించసాగింది. ఒక ఈతచెట్టు చాటు నుంచి పుట్టమ్మ చీర రెపరెపలు కనిపించాయి. ఇక దాని ఆనందానికి అంతే లేదు. తననింత కష్టపెట్టిన పుట్టమ్మను చీలికలు పేలికలుగా చీల్చి చంపి తన రాక్షసానందాన్ని తీర్చుకోవడానికి అదే అదననుకొంది. ఆమె పారిపోవడానికి అవకాశమివ్వకుండా చెట్టు ఇవతల వైపు నిలబడి, చెట్టుకు ఇటొకచేయి అటొకచేయి వేసి పుట్టమ్మను చెట్టుతో సహా పట్టుకుంది. ప్రాణభయం ఎంతకైనా తెగింపజేస్తుంది. క్షణంలో తప్పించుకున్న పుట్టమ్మ, మొరటుగా ఇనుప గోళ్లతో ఉన్న దాని రెండు చేతుల్ని తన చేతులతో పట్టుకుంది.
ఏడడుగుల పొడవున్న ఆ ఈతచెట్టు అయిదడుగుల వరకు ఆకుల మట్టలు రాలి అరడుగు మట్టల అవశేషాలు చెట్టుకు తగులుకొని ఉన్నాయి. ఊహించని విధంగా పుట్టమ్మ దాని రెండు చేతుల్ని చెట్టుకేసి కవ్వంలా చిలకసాగింది. చెట్టుకు అవతల వైపునున్న ఎలుగుబంటుకు ఈ విచిత్ర పరిణామం అర్థంకాలేదు. దాని ఎదురురొమ్ముకు ఈతచెట్టుకు కత్తుల్లా ఉన్న రాలిన ఈత ఆకుల అవశేషాలు రుద్దుకుని కేకలు పెట్టసాగింది. అయినా పుట్టమ్మ చిలకడం ఆపడం లేదు. గింజుకుంటున్న దాని చేతుల్ని వదల్లేదు. ఎలుగుబంటుకు ఎదురురొమ్ము మీద, పొట్ట మీద బొచ్చంతా ఊడిపోయింది. కొద్దిసేపటికి చర్మం ఊడిపోయి రక్తం ప్రవహించసాగింది. దాని ఏడుపులకు, పెడబొబ్బలకు భయపడి పుట్టమ్మ ఏమాత్రం వదల్లేదు. చీకటి పడుతోంది. ఇక చిలకడానికి ఓపిక లేని పుట్టమ్మ ఏదయితే అదవుతుందని ప్రాణాల మీద ఆశలు వదులుకుని దాని చేతులు వదిలేసింది. తనను వదిలిందే చాలనుకుని ఎలుగుబంటు అడవిలోకి పరుగులు తీసింది. ప్రాణాలతో బయటపడ్డ పుట్టమ్మను చూసి పల్లెవాసులు ఆమె అదృష్టానికి అభినందించారు. ఇది జరిగిన మూడురోజుల తరువాత ఎలుగుబంటు అడవిలో శవంగా తేలి, పురుగులు పట్టి ఉండటం అందరూ చూశారు.
*
- పొట్లూరు సుబ్రహ్మణ్యం, నెల్లూరు
చరవాణి : 9491128052
*
కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, సర్వే నెం.527, బురాన్‌పూర్ గ్రామం, చెముడుగుంట (పోస్టు), వెంకటాచలం (మం) నెల్లూరు జిల్లా. ఫోన్ : 0861-2383882 merupunlr@andhrabhoomi.net