విశాఖపట్నం

అనుకున్నదొకటి... (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ప్రసాద్ పంపించేసావా? నినే్న! ఏం ఆలోచిస్తున్నావ్?’’ దగ్గరికి వచ్చి కుదిపితే కానీ పలకలేదు తను.
ఒక్కసారి ఉలిక్కిపడి ‘‘ఆ ఏరా తిరుమలా ఏమిటీ?’’ అంటూ బయట పడ్డాడు ఆలోచనల నుండి.
‘‘అదేమిటీ పట్టపగలే కలలు కంటున్నావా? అంత పరధ్యానమేమిటి? ఫోన్ చేసినా లిఫ్ట్ చెయ్యట్లేదు. ఏమైంది నీకు?’’ అని నవ్వుతూ అడిగాడు తిరుమల.
‘‘ఆ..ఆ ఏమిటంటావ్? అవునవును... అబ్బే అదేంలేదు’’ అన్నాడు ప్రసాద్ తుళ్లిపడుతూ.
‘‘ఏమిటీ? మాధవురావుగారింటికి సరుకు పంపలేదూ?’’ అంటూ గట్టిగా అరిచాడు తిరుమల.
‘‘హా... హా... జస్ట్ పదిమిషాల క్రితం అరిసెలు, మైసూర్‌కోవా, తొక్కుడు లడ్డూ మొత్తం సరుకు పంపించేసాను... ’’ సమాధానమిచ్చాడు ప్రసాద్.
తిరుమలకి ప్రసాద్ వ్యవహారం ఈ మధ్య కొంచెం తేడాగా కనిపిస్తోంది. ప్రసాద్ మిఠాయి తయారీలో సిద్ధహస్తుడు. చుట్టుపక్కల ఊళ్ల వారందరూ పెళ్ళిల్లకి, శుభకార్యాలకి తన దగ్గర మిఠాయిలు ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటూ ఉంటారు. ఈ మధ్య వీర్రాజు ఇంటి గృహప్రవేశానికి వెళ్లి వచ్చిన దగ్గర నుంచీ తనలో ఏదో తెలియని వింత ఆలోచనా ధోరణి పెరిగిపోయింది. వీర్రాజు తన దగ్గర ఐదు సంవత్సరాలు రోజు కూలీకి పని చేసిన వ్యక్తి. సంవత్సరన్నర క్రిందట తన దగ్గర పని మానేసి ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారమనీ, సంతలో వ్యాపారమనీ తిరిగేవాడు. తన దగ్గర పనిచేసే కాలంలో పెద్దపని నేర్పరితనం లేదు. కష్టపడే వాడు కాదు. అలాంటిది అతటి జీవన స్థాయిలో ఎంత మార్పు? పెళ్ళాం వంటినిండా నగలు, పిల్లలకు ఖరీదయిన స్కూల్‌లో చదువు. తన మాటలో దర్పం, దర్జా... ఇల్లు చూస్తే హీనపక్షం డెబ్భై లక్షలు చేస్తుంది. ఒకప్పుడు తన దగ్గర పనివాడు కదా అని చొరవగా ‘ఏరా.. కాదుకాదు... ఏమయ్యా... కాదుకాదు... కనీసం ఏమండీ’ అని పలకరించడానికి కూడా కొంచెం బిడియం అనిపించింది ప్రసాద్‌కి. తాను ఇనే్నళ్లు కష్టపడుతున్నా ఏదో ఓ మాదిరిగా నడుస్తోంది యవ్వారం. కానీ... ఇదేమిటీ సినిమాలో ఒకపాట పూర్తయ్యేలోపు హీరో ఓ గొప్ప వ్యక్తి అయిపోయినట్లు ఇంతగా ధనలక్ష్మీ కటాక్షం అదృష్ట్భాషేకం చేసేసింది?.... అసూయ కాకపోయినా ఆశ్చర్యం అలుముకుంది ప్రసాద్ మనసులో.
‘‘ప్రసాదూ! ఏమిట్రా? ప్రస్తుతానికి పనేమీ లేదు కదా అలా బైటకెళదామా?’’ అన్నాడు తిరుమల. అదికాదు గానోరోయ్ వీర్రాజు గాడు ఒకేసారి అంత గొప్పవాడెలా అయిపోయాడంటావ్?’’ అని ఆత్రుతగా అడిగాడు.
‘‘బాబూ నాయనా! కొన్నింటిని చూసి ఎంజాయ్ చేయాలి. ఎందుకలా అని శోధించి ఆ పథంలో మనం వెళ్తే మనకు ఆపదలు చుట్టుకొని వేదన మిగులుతుంది’’ అన్నాడు తిరుమల.
‘‘ఏమిటోయి నీ డొంకతిరుగుడు సమాధానం?’’ అని రెట్టించాడు ప్రసాదు.
‘‘తన గురించి చాలా మందికి తెలిసిన విషయమే. ఫేక్ కరెన్సీ వినిమయం, వ్యాపారాల్లో అయోమయం, దొంగదారుల ఉపాయం, అంతా మాయమయం. అడ్డదారుల్లో సంపాదనకు ఏదో ఒకరోజు ఎదురౌతుంది గడ్డు సమయం....’’ అంటూ తిరుమల చెబుతూ ఉండగా ప్రసాద్ ‘‘చాల్లేవోయ్! ఎప్పుడో గడ్డు సమయం వస్తుందని ఇప్పుడెందుకు చేసుకోకూడదు జీవితాన్ని సుఖమయం?’’ అని అడ్డు పడ్డాడు.
‘‘దొంగనోట్ల వ్యాపారం అంటే జనాలనీ, ప్రభుత్వాన్నీ, దేశాన్నీ మోసం చేయడం కాదా! అలాంటి వారు ఎప్పటికైనా పట్టుపడక తప్పదు... లేకపోయినా ఏదో ఒకరీతిలో పాపం వారిని వెంటాడి మూల్యం చెల్లించు కుంటుంది’’ అన్నాడు తిరుమల.
‘అదేం లేదులెద్దూ! లోకంలో చాలా మంది రకరకాల పాపాలు చేస్తున్నారు. వాటితో పోలిస్తే ఇదేమీ పెద్దదేమీ కాదు... నేను వీర్రాజుతో రహస్యంగా దీని కిటుగు గురించి మాట్లాడతాను. నాకు వాడు తప్పక సహాయం చేస్తాడు. నువ్వూ, నేనూ కలిస్తే ఇంకా బావుంటుంది’’ అన్నాడు ప్రసాద్.
‘‘చూడూ నీకు విపరీతమైన ఆలోచనలు వస్తున్నాయి. నీ చేతిలో మంచి విద్య ఉంది. ప్రస్తుతానికి నీ సంపాదన కూడా బాగానే ఉంది. నాకు కూడా భగవంతుడి దయవల్ల ఏలోటూ లేదు. ఇలాంటి వ్యవహారాల్లో దూరి కష్టాలు కొని తెచ్చుకోవద్దు. ఆ ఆలోచన మానేసేయ్... నాకు పనుంది నేను వస్తాను’’ అంటూ వెళ్లిపోయాడు తిరుమల.
ప్రసాద్‌కి పనిపట్ల ఏకాగ్రత లేదు. అత్యాశ అతనిని వీర్రాజుతో భేటీకి పురి గొల్పింది.
ఒకప్పుడు తన గురువు కదా మరి ప్రసాదుకి కాస్తంత వివరంగా వ్యాపార కిటుకును చిటికెలో బోధించాడు.
‘‘ఏం లేదు గురూ! మీరొక లక్ష అసలు నోట్లు ఇస్తే మనకు నాలుగు లక్షలు నకిలీ నోట్లు వస్తాయి. వాటిని మనదగ్గరున్న మరికొన్ని అసలు నోట్ల మధ్య నకిలీలను సర్దేసి వినిమయం చేసేయటమే. ముఖ్యంగా పసువుల సంతల్లో, ఏజన్సీ ప్రాంతాల్లో, రద్దీ ప్రాంతాల్లో సులువుగా మస్కా కొట్టించవచ్చు. కాకపోతే పెట్టుబడి పెట్టాలి. నాలుగు చోట్లకి వెళ్లి ఏదో నాలుగు రకాల వ్యాపారాలు చేస్తున్నట్లుగా వ్యవహారం నడిపించాలి. మీరేమీ భయపడాల్సిన పనిలేదు మన దగ్గర ఐదు వందల నోట్లు, వెయ్యినోట్లూ అసలు నోట్ల కంటే కూడా బావుంటాయి. అంతే కాదు మన వెనుక కొందరు బలమైన పెద్దల అండ కూడా ఉంది. మీరు మాత్రం గుట్టుగా తెలివిగా వ్యవహారం నడిపించుకోవాలి’’ అని వివరించాడు వీర్రాజు. ప్రసాద్‌కి ఆత్రుత, ఆందోళన ఒకేసారి కలిగాయి. సరే ముందు ఓ ఇరవై వేలు తీసుకొని నేను ఎలా వినిమయం చేయగలనో పరీక్షించుకుంటాను అనుకున్నాడు. చాలా సులువుగా నమ్మకమైన వారిని మోసం చేసాక తన మాయతనం మీద నమ్మకం కలిగింది.
తన నమ్మకం హద్దులు దాటి ఆశను అంబరాన్ని తాకించింది. ఒకేసారి పాతిక లక్షలు పోగేసేద్దామని తెగించి తన దగ్గరున్న బంగారం, స్థలం అమ్మాడు పదహారు లక్షలు వచ్చింది. ఎనిమిది లక్షలతో ముఫ్పైరెండు లక్షల రూపాయల నకిలీ నోట్లకు ప్రయత్నాలు చేసాడు. అనుకున్నదే తడవుగా సొమ్ము వచ్చి చేరింది. తన దగ్గరున్న అసలు నోట్లను నకిలీ నోట్ల మధ్య చొప్పించీ నలభై లక్షలు చేసాడు.
‘‘గురూ! ఈ రోజు నవంబర్ ఒకటో తారీఖు. కొత్త సంవత్సరానికి రెండు నెలలే ఉంది. నువ్ జాగ్రత్తగా కష్టపడి ఈ నెలలో ఈ టార్గెట్ పూర్తి చేసి, డిసెంబర్లో ఇంకొక విడతలో చలామనీ చేస్తే ! తస్సాదియ్యా! కొత్త సంవత్సరంలో కోటీశ్వరుడిగా మారిపోతావ్’’ అని వీర్రాజు అనేసరికి ప్రసాద్ ఆనందానికి హద్దులు లేవు. తన ఇల్లాలు తన గంతకు తగ్గ బొంతే మరి చక్కగా ఇద్దరూ కష్టపడి నోట్ల వినిమయ వ్యాపకంలో తలమునకలయ్యారు. వారి చేతి మిఠాయిలకు రుచి తగ్గింది. ఇనే్నళ్ళు నమ్ముకున్న పనిమీద శ్రద్ధ తగ్గింది. కస్టమర్లకు కూడా వీరి పట్ల నమ్మకం తగ్గింది.
అలా వారం గడిచింది. పావు వాటా డబ్బు మారింది. క్యాలెండర్‌లో డేట్ మారింది. ఆరోజు ఏడవ తారీఖు రాత్రి ఏడయింది. భార్య ప్రసాద్‌కు టిఫిన్ పెట్టింది. టీవీ చూస్తూ మొగుడు టిఫిన్ తింటాడని న్యూస్ ఛానల్ ఆన్ చేసింది. అదిగో మోదీ బొమ్మ కనపడింది. హిందీలో ఉపన్యాసం సగమే అర్ధం అయింది. కానీ తెలుగులో కూడా అనువాదం వస్తోంది. న్యూస్‌రీడర్ గొంతు పగిలిపోయేలా పెద్ద నోట్ల గురించి చెబుతోంది. ప్రసాద్‌కి నోట్లో ముద్ద దిగకుంటోంది. వళ్లంతా చెమట పట్టేసింది. తన పెళ్ళాం ఆపకుండా కన్నీరు కారుస్తోంది.
డామిట్ ప్రసాద్ కథ అడ్డం తిరిగింది.

- చావలి శేషాద్రి సోమయాజులు
జి.ప.ఉన్నత పాఠశాల, పాచిపెంట
విజయనగరం జిల్లా.
**
అర్ధాంగి
*
రాత్రి పది గంటలవుతోంది సమయం.
భర్త ఇంకా ఆఫీసు నుండి కాదు కాదు బారు నుండి రాలేదు. భర్త కోసం ఎదరు చూడడం ఆమెకు ఈరోజే కాదు ప్రతిరోజు అలవాటైపోయింది. ప్రతిరోజు ఆలస్యంగా రావడం అవినాష్‌కి అలవాటు. ఎదురు చూడడం భార్య అవంతికి గ్రహపాటుగా మారిపోయింది.
ప్రతిరోజు పీకలమొయ్య తాగి ఒళ్లు తెలియకుండా తూలుకుంటూ ఇంటికి రావడం, భార్య మీద అయిన దానికి, కాని దానికి కేకలు వేయడం పరిపాటైపోయింది. డబ్బుతో పాటు ఆరోగ్యం, పది మందిలో గౌరవం పోతుందని అవంతి ఎంత ఆరాటపడుతున్నా అవినాష్‌లో మార్పు రాలేదు.
‘‘నేను సంపాదిస్తున్నాను. అందుకే ఖర్చు పెడుతున్నాను. సంపాదించేది ఖర్చు పెట్టడానికే గాని బ్యాంకుల్లో దాచుకోవడానికి కాదు’’ అని వాదిస్తాడు.
‘‘రేపేదైనా జరగరానిది జరిగితే ఉన్న ఒక్కగానొక్క ఆడపిల్ల జీవితం, నాది ఏమవుతుంది?’’ అని వాదిస్తుంది అవంతి.
భయం రోజురోజుకి ఎక్కువ అవుతుందే గానీ భర్తలో ఇసుమంత కూడా మార్పు రాలేదు.
ఒకరోజు తప్ప తాగి రోడ్డు మీద పడి ఉంటే వీధిలో వాళ్లు ఇంటికి తీసుకు వచ్చారు.
అవంతి భయపడి వీధి చివరలో ఉన్న ఆర్ ఎంపి డాక్టర్‌ని తీసుకొచ్చి చూపించింది.
‘‘గుండె బాగా వీక్‌గా ఉంది. జాగ్రత్తగా చూసుకోండి’’ అని చెప్పాడు డాక్టర్ అతన్ని పరీక్షించి.
కళ్ల నీళ్లతో తలూపింది అవంతి.
‘‘డాక్టర్లు అలాగే చెబుతారులే డబ్బుల కోసం. నాకేం కాదు’’ చిరాగ్గా అన్నాడు అవినాష్.
‘‘ ఇప్పుడు మీకేం కాలేదు. భవిష్యత్తులో ఏదైనా కీడు జరిగితే’’
‘‘అంటే నీ ఉద్దేశ్యం’’ కోపంగా అన్నాడు అవినాష్.
పాప రుషిక కానె్వంట్‌కి వెళ్లిపోయింది.
ఆరోజు ఒంట్లో బాగులేదని అవినాష్ ఆఫీసుకి సెలవు పెట్టాడు.
భార్య ఇచ్చిన టీ తాగుతూ ఏదో ఆలోచిస్తున్నాడు.
‘‘మీ ధోరణి చూస్తుంటే రోజురోజుకి తాగుడు ఎక్కువ అవుతుందే గానీ తగ్గడంలేదు. నా మాటలే గానీ మీ చేతల్లో మార్పు లేదు. అందుకే నేనొక నిర్ణయానికి వచ్చాను’’ అంది అవంతి.
‘‘ ఏమిటి?’’ ఆశ్చర్యంగా అన్నాడు అవినాష్.
‘‘ ఇంట్లో పనంతా చేసి చేసి అలసిపోతున్నాను. అందుకే నేను కూడా తాగాలని అనుకుంటున్నాను’’
భార్య మాటలకి పక్కలో బాంబు పడినట్లు ఉలిక్కిపడ్డాడు అవినాష్.
‘‘నీకు మతి ఉండే మాట్లాడుతున్నావా? నువ్వేమిటి మందు తాగడం ఏమిటి?’’ అన్నాడు.
‘‘ ఏం మీ మగాళ్లే మందు తాగాలేటి? అది రూలా? మీదీ మాదీ శరీరం ఒకటేగా. మరి మీలో ఉన్న ప్రత్యేకత ఏమిటి?’’ ప్రశ్నించింది అవంతి.
ఆమెకి సమాధానం చెప్పలేకపోయాడు అవినాష్.
‘‘అలాంటి ఆలోచనలు మీ ఆడవాళ్లకు రాకూడదు’’ అన్నాడు.
‘‘అయితే మీరు మందు మానేస్తారా? లేకపోతే బారు నుండి వచ్చినప్పుడు నాకూ ఒక సీసా తెస్తారా?’’
‘‘అవంతీ’’ గట్టిగా అరిచాడు అవినాష్.
‘‘ ఆపండి మీ అరుపులు, కేకలు. ఇక్కడెవరూ భయపడేవాళ్లు లేరు. భార్యని అర్ధాంగి అంటారు. నేను మీలో సగ భాగం కనుకనే నాకూ మీలా కోర్కెలు జ్వలిస్తున్నాయి. నా మాటకు తిరుగు లేదు. మీరు మందు తేవలసిందే. నేను ప్రతి రోజు తాగాల్సిందే’’ ఖరాఖండిగా అంటున్న భార్య మాటలకి కట్రాటలా అయిపోయాడు అవినాష్.
శరీరమంతా ముచ్చెమటలు పట్టి, మెదడంతా గందరగోళ ఆలోచనలతో పిచ్చివాడిలా తయారయ్యాడు.
‘‘ ఇది నీకు పుట్టిన బుద్ధి కాదు. చెప్పుడు మాటలు వినకు సంసారం, ముఖ్యంగా నీ జీవితం నవ్వులపాలైపోతుంది. బాగా ఆలోచించు’’ సర్ది చెప్పాడు.
అయినా అవంతిలో ఇసుమంతైనా మార్పు రాలేదు.
అవినాష్ గొంతులో తడారిపోయింది. నాలుక పిడచగట్టుకుపోయింది.
వీధిలో వారం రోజుల కిందట జరిగిన సంఘటన గుర్తుకొచ్చి సుడిగాలిలోని కాగితంలా విలవిల్లాడిపోయాడు.
వీధి చివరి భార్యాభర్తలు ఉండేవారు. ఆమె పేరు కాత్యాయిని. భర్త పేరు శ్రీకాంత్. తాగుడికి బానిసై జీతం కాక ఎక్కువ వడ్డీలకు అప్పులు చేసి పీకల్లోతుల వరకు తాగేసేవాడు.
ఆ పాడు అలవాటు మానుకోమని అతని భార్య కాత్యాయిని చెప్పినా వినలేదు. దాంతో ఆమె కూడా తాగడం మొదలుపెట్టింది. బాధల వలనో, మందు అలవాటు కావడం వలనో ఆమె తాగుడికి బానిసైపోయింది.
భార్య ప్రవర్తన మితిమీరిపోవడం, అప్పుల వాళ్ల సూటిపోటి మాటలతో దిక్కు తోచక శ్రీకాంత్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త మరణంతో కాత్యాయిని పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. వీధిన పోయే మగవాళ్లను భర్తనుకుని పిలవడం, వెకిలి చేష్టలు చేయడంతో ఆమె కన్నవారు ఆమెని మానసిక చికిత్సాలయానికి తరలించారు. అక్కడ చేరిన నెల రోజుల్లోనే కాత్యాయిని చనిపోయిందని తెలుసుకున్నాడు అవినాష్.
ఆ సంఘటన గుర్తుకొచ్చే సరికి అవినాష్ ఒళ్లంతా భయంతో చెమటలు కారసాగాయి. తన కుటుంబం, పరువు మర్యాదలు, బంధుమిత్రులు అంతా గుర్తుకొచ్చి అతనిలో ఒక దృఢ నిశ్చయం ఆవిర్భవించింది. ఫలితంగా అన్ని వ్యసనాలకు దూరమవడంతో భావి జీవితం మూడు పువ్వులు ఆరుకాయలుగా మారింది.

- కాళ్ల గోవిందరావు,
ఆమదాలవలస,
శ్రీకాకుళం జిల్లా-532185.
సెల్ : 95504 43449.