రాజమండ్రి

ఒక మనస్సు (కథానిక)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకాంక్షకు ఉదయ్‌తో రెండు రోజుల క్రితం వివాహమైంది. ఆకాంక్ష బంధువులు అందరితో మాట్లాడుతున్న సమయంలో సూర్య నుండి ఫోన్ వచ్చింది. సెల్‌ఫోన్‌లో సూర్య పేరు చూడగానే ముళ్లకంచె వేసిన ప్రేమ జ్ఞాపకాలు కన్నీరు రూపంలో వచ్చాయి. మర్చిపోయిన సూర్య జ్ఞాపకం తనకి గుర్తొచ్చి తను ఎందుకు ఫోన్ చేస్తున్నాడు. ఏం మాట్లాడతాడు. అప్పటిలా ఇప్పుడు తనతో మాట్లాడగలనా, ప్రేమకు దూరమైన నేను ప్రేమగా మాట్లాడితే తట్టుకోగలనా అనేక సందేహాల మధ్య ఫోన్ ఆన్ చేసింది.
‘ఇద్దరిలో కాసేపు వౌనం’
ఆకాంక్ష ఎలా ఉన్నావు?
బాగానే ఉన్నాను సూర్య. నినే్న నా పెళ్లయింది ఇల్లంతా బంధువులతో నిండిపోయి ఉంది.
సూర్య ఏమి మాట్లాడలేదు. అతని ఏడుపు ఆకాంక్షకి ఫోన్‌లో విన్పించింది.
నీతో చాలా మాట్లాడాలి ఆకాంక్ష.
తప్పకుండా మాట్లాడు కానీ ఇప్పుడు కాదు. ఒక రెండురోజుల తర్వాత అందరూ ఉన్నారు. అర్థం చేసుకో.
అలాగే ఆకాంక్ష. ‘బాధగానే ఫోన్ పెట్టేసింది ఆకాంక్ష’! సూర్య కూడా!
ఆకాంక్ష నైట్ ఫంక్షన్‌కి ఈ ఆకుపచ్చ చీర కట్టుకో చాలా బాగుంటుంది. ఆ చీర చూడగానే సూర్యతో ఉంటున్న జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. అలాగేనమ్మ ఈ చీరే కట్టుకుంటాను అని చెప్పింది.
సూర్యే నా కాబోయే భాగస్వామి అని ఎన్నోసార్లు పుస్తకాలు మీద రాసుకుంది. సూర్యే నా జీవితం, నా లోకం, నా ప్రాణం, నా నీడ, నా చావు అని ఎన్నిసార్లు అనుకుందో లెక్కలేదు.
సినిమాలు, షికార్లు, షాపింగులు, పార్కులు ఎన్ని తిరిగారో లెక్కలేదు. పరఫెక్ట్ మాచింగ్ అని స్నేహితులు అందరూ మెచ్చుకొన్నారు. కానీ భగవంతుడు ఆట ఏవిధంగా ఉంటుందో చెప్పలేము కదా. ఒకరోజు సాయంత్రం భీమిలి బీచ్ ఒడ్డున.
సూర్య మన పెళ్లికి ఇరు పెద్దలు ఒప్పుకొంటారు. కానీ నువ్వు ఎంసిఎ చేశావు. ఏదైనా ఉద్యోగం చేయచ్చు.
నువ్వు తిరుగుతున్నా సినిమా ప్రపంచం ఉన్నతమైనది కాదు, హిట్ వస్తే జేజేలు పలికి ఫ్లాప్ వస్తే ముఖం కూడా చూడరు. చిన్న ఉద్యోగమో పెద్ద ఉద్యోగమో చేరిపో అలా అయితేనే మా వాళ్లు ఒప్పుకొంటారు.
సూర్య కళ్లు పెద్దవి చేసి కోపంగా ఆకాంక్ష నేను ఎంత ప్రేమిస్తున్నానో సినిమాని కూడా అలాగే ప్రేమిస్తున్నాను. ‘ప్రేమించినప్పుడు లేని ఇబ్బంది పెళ్లి చేసుకొనేటప్పుడు ఎందుకు? ఈ రోజు అసిస్టెంట్ డైరెక్టర్‌ని రేపు సినిమా డైరెక్టర్‌ని అవుతాను నిన్ను చాలా ప్రేమగా చూసుకొంటా.
నువ్వు బాగా చూసుకొంటావు సూర్య. నీ ప్రేమ చాలా గొప్పది. అంతకన్నా గొప్పది బాధ్యత. ప్రేమకు కావాల్సింది హృదయం. పెళ్లికి కావాల్సింది బాధ్యత. డైరెక్టర్ అయితే నాకు ఆనందమే కానీ అవ్వలేని పక్షంలో మన మధ్య బేధాభిప్రాయాలు రావచ్చు.
ప్రేమలో ఉన్నంతకాలం ఎవ్వరి జీవితం వారిది. కానీ పెళ్లయి కలిసివుంటే ఇద్దరి జీవితం ఒక్కటే!
ఆకాంక్ష మాటలను మధ్యలోనే ఆపుతూ, నేను గెలవలేనని ముందే ఊహించుకొంటున్నావు. నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు ఆకాంక్ష. నా మనస్సు నిండా నువ్వే ఉన్నావు. నీ మాటలతో నా మనస్సును ముక్కలు చేశావు.
సూర్య నేనిప్పుడు నాకన్నా నీ కోసం ఎక్కువ ఆలోచిస్తా. నీ మనస్సు మంచితనం నాకు తెలియదా? ప్రేమలో బాగానే ఉంటుంది. ప్రేమ పెళ్లి దాకా వచ్చేటప్పుడే అనేక ప్రశ్నలకు సమాధానం ఇచ్చుకోవాలి.
‘ఆకాంక్ష నువ్వు నా చెయ్యి పట్టుకొని నడిపిస్తావు అనుకొన్నాను’. ‘జీవితాంతం, బతుకున్నంత కాలం వదలవు అనుకున్నాను’.
ఉద్యోగం అనే మాట చెప్పి నా కలలను కరిగించేలా మాట్లాడుతున్నావు. నీతో ఇంకా ఉంటే యంత్రంలా మార్చేస్తావు. గుడ్‌బై ఆకాంక్ష ఇక సెలవు అంటూ వెళ్లిపోతున్న సూర్యను సారీ అని వందల సార్లు పిలిచినా సూర్య తన కలల ప్రపంచం కోసం మాయమయ్యాడు. ఆకాంక్ష అక్కడే కన్నీటి పర్యంతమయ్యింది.
ఫేస్‌బుక్‌లో, వాట్సప్‌లో, సెల్‌లో ఎన్నిసార్లు మెసేజ్‌లు పెట్టినా నో రెస్పాన్స్. కాల్ చేస్తే కట్ చేసేవాడు.
ఆరునెలలు గడిచిపోయాయి.
సూర్య విషయం తెలియక ఆకాంక్ష ఒక్కొక్కసారి తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యింది. ఇంక మర్చిపోవడం బెటరని సూర్యని మర్చిపోవడం కోసం అనేక పనులు చేస్తుండేది. యోగా, మెడిటేషన్ కూడా అందులో భాగమైనది. మరో ఆరునెలలు గడిచిన తర్వాత ఉదయ్‌తో సంబంధం నిశ్చయమైంది. ఘనంగా పెళ్లి జరిగింది.
* * *
సూర్య రెండు రోజులు తర్వాత ఆకాంక్షకు ఫోన్ చేశాడు.
సూర్య మళ్లీ అడిగాడు ఎలా ఉన్నావ్ ఆకాంక్ష.
బాగానే ఉన్నాను సూర్య!
ఒక సంవత్సరంలో జీవితాలు ఎలా మలుపు తిరిగాయో చూడు. నాకు డైరెక్టర్‌గా ఛాన్స్ వచ్చిందని ఫోన్ చేస్తే పెళ్లయిందని చెప్పావు. ఒకవైపు ఆనందమైన కన్నీళ్లు, మరోవైపు విషాదకరమైన కన్నీళ్లు. నీ కోసమే గట్టిగా ప్రయత్నించా ఎన్నో నిద్రలు మాని మంచి కథలు రాసి నిర్మాతలకు విన్పించా చివరకి అవకాశం దొరికింది.
ఆకాంక్ష మనస్సులో కూడా ఏదో తెలియని బాధ కలిగింది.
సూర్య కంగ్రాట్స్ అంటూ కన్నీళ్లు ఆపుకుంటూ చెప్పింది.
సినిమా ఈ వారంలోనే ప్రారంభం. నువ్వు నా పక్కన ఉంటావని అనుకున్నాను. కానీ ఇప్పుడు.
పెళ్లికి ఒక నిమిషం ముందు చెప్పినా నేను నీతో వచ్చేదానిని కానీ పెళ్లి జరిగిపోయింది సూర్య.
‘నిజమైన ప్రేమ ఎప్పుడూ అందలేనంత ఎత్తులోనే ఉంటుంది’. అదే మన విషయంలో జరిగింది.
మా వారు కూడా చాలా మంచి మనిషి. పేరు ఉదయ్. మంచి మనస్సు ఉన్న వాళ్లకి మంచివారే దొరకుతారు కదా.
అవును ఆకాంక్ష చాలా అదృష్టవంతురాలివి నువ్వు అంటూ ఫోన్ పెట్టేశాడు.
కానీ సూర్య మనస్సు మాత్రం బాధపడింది.
ఛాన్స్ వచ్చినా ఆకాంక్ష ప్రేమంత కాదు అంటూ ఆవేదన చెందాడు.
- నల్లపాటి సురేంద్ర
సెల్: 9490792553
**

కథ
**
అర్ధాంగి
*
రాత్రి పది గంటలవుతోంది.
భర్త ఇంకా ఆఫీసు నుండి కాదు కాదు బారు నుండి రాలేదు. భర్త కోసం ఎదరు చూడడం ఆమెకు ఈరోజే కాదు ప్రతిరోజు అలవాటైపోయింది. ప్రతిరోజు ఆలస్యంగా రావడం అవినాష్‌కి అలవాటు. ఎదురు చూడడం భార్య అవంతికి గ్రహపాటుగా మారిపోయింది.
ప్రతిరోజు పీకలమొయ్య తాగి ఒళ్లు తెలియకుండా తూలుకుంటూ ఇంటికి రావడం, భార్య మీద అయిన దానికి, కాని దానికి కేకలు వేయడం పరిపాటైపోయింది. డబ్బుతో పాటు ఆరోగ్యం, పది మందిలో గౌరవం పోతుందని అవంతి ఎంత ఆరాటపడుతున్నా అవినాష్‌లో మార్పు రాలేదు.
‘‘నేను సంపాదిస్తున్నాను. అందుకే ఖర్చు పెడుతున్నాను. సంపాదించేది ఖర్చు పెట్టడానికే గాని బ్యాంకుల్లో దాచుకోవడానికి కాదు’’ అని వాదిస్తాడు.
‘‘రేపేదైనా జరగరానిది జరిగితే ఉన్న ఒక్కగానొక్క ఆడపిల్ల జీవితం, నాది ఏమవుతుంది?’’ అని వాదిస్తుంది అవంతి.
భయం రోజురోజుకి ఎక్కువ అవుతుందే గానీ భర్తలో ఇసుమంత కూడా మార్పు రాలేదు.
ఒకరోజు తప్ప తాగి రోడ్డు మీద పడి ఉంటే వీధిలో వాళ్లు ఇంటికి తీసుకు వచ్చారు.
అవంతి భయపడి వీధి చివరలో ఉన్న ఆర్ ఎంపి డాక్టర్‌ని తీసుకొచ్చి చూపించింది.
‘‘గుండె బాగా వీక్‌గా ఉంది. జాగ్రత్తగా చూసుకోండి’’ అని చెప్పాడు డాక్టర్ అతన్ని పరీక్షించి.
కళ్ల నీళ్లతో తలూపింది అవంతి.
‘‘డాక్టర్లు అలాగే చెబుతారులే డబ్బుల కోసం. నాకేం కాదు’’ చిరాగ్గా అన్నాడు అవినాష్.
‘‘ఇప్పుడు మీకేం కాలేదు. భవిష్యత్తులో ఏదైనా కీడు జరిగితే’’
‘‘అంటే నీ ఉద్దేశ్యం’’ కోపంగా అన్నాడు అవినాష్.
పాప రుషిక కానె్వంట్‌కి వెళ్లిపోయింది.
ఆరోజు ఒంట్లో బాగులేదని అవినాష్ ఆఫీసుకి సెలవు పెట్టాడు.
భార్య ఇచ్చిన టీ తాగుతూ ఏదో ఆలోచిస్తున్నాడు.
‘‘మీ ధోరణి చూస్తుంటే రోజురోజుకి తాగుడు ఎక్కువ అవుతుందే గానీ తగ్గడంలేదు. నా మాటలే గానీ మీ చేతల్లో మార్పు లేదు. అందుకే నేనొక నిర్ణయానికి వచ్చాను’’ అంది అవంతి.
‘‘ఏమిటి?’’ ఆశ్చర్యంగా అన్నాడు అవినాష్.
‘‘ఇంట్లో పనంతా చేసి చేసి అలసిపోతున్నాను. అందుకే నేను కూడా తాగాలని అనుకుంటున్నాను’’
భార్య మాటలకి పక్కలో బాంబు పడినట్లు ఉలిక్కిపడ్డాడు అవినాష్.
‘‘నీకు మతి ఉండే మాట్లాడుతున్నావా? నువ్వేమిటి మందు తాగడం ఏమిటి?’’ అన్నాడు.
‘‘ఏం మీ మగాళ్లే మందు తాగాలేటి? అది రూలా? మీదీ మాదీ శరీరం ఒకటేగా. మరి మీలో ఉన్న ప్రత్యేకత ఏమిటి?’’ ప్రశ్నించింది అవంతి.
ఆమెకి సమాధానం చెప్పలేకపోయాడు అవినాష్.
‘‘అలాంటి ఆలోచనలు మీ ఆడవాళ్లకు రాకూడదు’’ అన్నాడు.
‘‘అయితే మీరు మందు మానేస్తారా? లేకపోతే బారు నుండి వచ్చినప్పుడు నాకూ ఒక సీసా తెస్తారా?’’
‘‘అవంతీ’’ గట్టిగా అరిచాడు అవినాష్.
‘‘ఆపండి మీ అరుపులు, కేకలు. ఇక్కడెవరూ భయపడేవాళ్లు లేరు. భార్యని అర్ధాంగి అంటారు. నేను మీలో సగ భాగం కనుకనే నాకూ మీలా కోర్కెలు జ్వలిస్తున్నాయి. నా మాటకు తిరుగు లేదు. మీరు మందు తేవలసిందే. నేను ప్రతి రోజు తాగాల్సిందే’’ ఖరాఖండిగా అంటున్న భార్య మాటలకి కట్రాటలా అయిపోయాడు అవినాష్.
శరీరమంతా ముచ్చెమటలు పట్టి, మెదడంతా గందరగోళ ఆలోచనలతో పిచ్చివాడిలా తయారయ్యాడు.
‘‘ ఇది నీకు పుట్టిన బుద్ధి కాదు. చెప్పుడు మాటలు వినకు సంసారం, ముఖ్యంగా నీ జీవితం నవ్వులపాలైపోతుంది. బాగా ఆలోచించు’’ సర్ది చెప్పాడు.
అయినా అవంతిలో ఇసుమంతైనా మార్పు రాలేదు.
అవినాష్ గొంతులో తడారిపోయింది. నాలుక పిడచగట్టుకుపోయింది.
వీధిలో వారం రోజుల కిందట జరిగిన సంఘటన గుర్తుకొచ్చి సుడిగాలిలోని కాగితంలా విలవిల్లాడిపోయాడు.
వీధి చివరి భార్యాభర్తలు ఉండేవారు. ఆమె పేరు కాత్యాయిని. భర్త పేరు శ్రీకాంత్. తాగుడికి బానిసై జీతం కాక ఎక్కువ వడ్డీలకు అప్పులు చేసి పీకల్లోతుల వరకు తాగేసేవాడు.
ఆ పాడు అలవాటు మానుకోమని అతని భార్య కాత్యాయిని చెప్పినా వినలేదు. దాంతో ఆమె కూడా తాగడం మొదలుపెట్టింది. బాధల వలనో, మందు అలవాటు కావడం వలనో ఆమె తాగుడికి బానిసైపోయింది.
భార్య ప్రవర్తన మితిమీరిపోవడం, అప్పుల వాళ్ల సూటిపోటి మాటలతో దిక్కు తోచక శ్రీకాంత్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త మరణంతో కాత్యాయిని పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. వీధిన పోయే మగవాళ్లను భర్తనుకుని పిలవడం, వెకిలి చేష్టలు చేయడంతో ఆమె కన్నవారు ఆమెని మానసిక చికిత్సాలయానికి తరలించారు. అక్కడ చేరిన నెల రోజుల్లోనే కాత్యాయిని చనిపోయిందని తెలుసుకున్నాడు అవినాష్. ఆ సంఘటన గుర్తుకొచ్చే సరికి అవినాష్ ఒళ్లంతా భయంతో చెమటలు కారసాగాయి. తన కుటుంబం, పరువు మర్యాదలు, బంధుమిత్రులు అంతా గుర్తుకొచ్చి అతనిలో ఒక దృఢ నిశ్చయం ఆవిర్భవించింది. ఫలితంగా అన్ని వ్యసనాలకు దూరమవడంతో భావి జీవితం మూడు పువ్వులు ఆరుకాయలుగా మారింది.

- కాళ్ల గోవిందరావు, సెల్ : 95504 43449