విజయవాడ

కఠిన వాస్తవాల్ని కవితలుగా అల్లిన మాధవీలత (పుస్తక పరిచయం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాయాలెన్నైనా.. కవిత్వం
వెల: రూ. 100
పొద్దుటూరి మాధవీలత,
చరవాణి : 9030573354.
ప్రతులకు:
పొద్దుటూరి మాధవీలత,
10-4/1 యెడపల్లి,
సిండికేట్ బ్యాంక్ దగ్గర,
నిజామాబాద్ - 503202.
**
తంగేడు పూలవనంలో, మనస్సు నామి.. అనే కవితా సంపుటాలతో సాహిత్య రంగంలో ఇప్పటికే మంచి రచయిత్రిగా పేరు తెచ్చుకున్న శ్రీమతి పొద్దుటూరి మాధవీలత తన మూడో కవితా సంపుటిగా వెలువరించిన పుస్తకం ‘గాయాలెన్నైనా’. ఇది 82 కవితల పొదరిల్లు.. అందమైన మాలగా అల్లుకున్న పూల గుబాళింపు! కవిత్వం చెప్పిన తీరు, కవితా వస్తువు ఎన్నుకున్న విధానం ఆమె పరిణితిని తెలియచెప్తుంది. పుస్తకం తొలి పేజీలలోనే ‘నా కలంలోంచి ఊపిరి పోసుకొన్న/ ప్రతి అక్షరం సుమాక్షరమై/ మరో వేకువ కోసం నిదుర కాచి/ మామిడాకు తోరణమై స్వాగతిస్తుంద’ని, దీపమై నిశీధిని తరిమివేస్తుందని, మనసును సేదతీరుస్తుంద’ని ఆడతనానికి రక్షణ కవచంగా ఆకాంక్షను వెలిబుచ్చారు.
‘చెదిరిన తలరాతను ఒక్క క్రమంలో సరిదిద్దే వీలులేక జారిపోతున్న అక్షరాలూ వరస మారుతున్నాయి’.. అంటూ తుఫానులో చిక్కిన మనసు కల్లోలాన్ని ఊహించని ఉపద్రవంగా కవిత్వీకరించారు. ‘కాలం పురాతన మైనదే/ మనుషులే కొత్త వాళ్లు’.. అంటూ మనుషుల సరిహద్దులను ఆత్మబలంతోనే అడుగు ముందుకేయమని చెప్పారు. ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్న కోరిక, అవనిని ఆసాంతం సాధించాలన్న తపన ఎనే్నళ్లకైనా సజీవంగా ఉండాలని, దీనికి విజయాలే సాక్ష్యం అంటూ మరో కవితలో ‘కన్నీటి పాయల్లో సాగిపోతున్న నా ఆవేదనల చిల్లుల పడవ తీరం చేరే మార్గం లేదని తెలిసినా నిలువరించలేని ప్రయాణం నిగ్గదీస్తోంది.. ఒక్క క్షణం నిర్లక్ష్యం ఖరీదు పదుల సంఖ్యలో పసిమొగ్గలు పూయకుండానే రాలిపోతున్నాయి. కబళిస్తున్న కాలానికి అంతమెప్పుడే తెలియనిదానితో నేను వేసిన అడుగుల నిండా రుధిరాక్షరాల సంతకాలే’.. ఇలా ఆమె కవితా ఝరి నిలకడగా, సమానంగా సాగింది. అనాథలు, పర్యావరణం, దేశ రక్షణ వంటి అంశాలపై వెలువరించిన కవితలు ఆలోచింపచేయటమే కాకుండా రచయితకు సమాజం మీద వున్న అభిప్రాయాల్ని తెలియజెప్పాయి. ‘కామపిశాచి కోరికలకు బలియైన నాకు నామకరణం కూడా కరువై పోయింది.. ఎదగక తప్పని అనాథ’ను అంటూ అనాథల జీవితాలను అక్షరీకరించారు. ‘పట్టింపుల అరణ్యపర్వంలో పంతాల అగ్నిహోత్రంలో అనివార్యంగా ఆహుతైపోయిన అనాథను నేను.. చనుబాలు అమృతమట కదా అని రుచిచూపకుండానే నన్ను చెత్తపాలు చేశావెందుకమ్మా?’ అని ప్రశ్నిస్తుంది ఆ చిన్నారి.
పర్యావరాణాన్ని గుప్పిట్లో బంధించిన మనిషి తన జీవన పరిణామాన్ని గుప్పెడు స్థానంలోనే కుదించుకుంటున్నాడు. ‘యంత్రాల నడుమ మర మనుషులు తిరిగే ఈ నగరం నాకో పీడకల! పచ్చదనాల ప్రకృతిని తగులపెట్టి ప్రాజెక్టులు కట్టేది ఎవరికాళ్లు కడగడానికో? ఆకాశం అంతు చూడాలన్న అవివేకం నేలతల్లి గుండెలు చీల్చాలనే ఉబలాటం.. మాతృభూమి పరిరక్షణలో.. గాయాలైన గోడలు విలపిస్తున్నాయి’ అంటూ తీవ్రంగా నిరస్తారు. సమాజంలోని అన్ని అంశాలను స్పృసిస్తూనే తనదైన బాణిలో నిలదీసి వీటికి జవాబులేవి అన్నంత గట్టిగా ప్రశ్నించారు. ‘నిలదీస్తున్న కళ్లకు/ అన్యాయపు కళ్లగంతలు కట్టిలేని/ అంధత్వాన్ని నటిస్తున్న న్యాయస్థానం/ మూఢత్వపు పొరలు తొలగించగలిగితే/ అవినీతి సంకెళ్లు తెగిపడక మానవు’ అని నినదిస్తారు. ‘ఆవేదనలతో నిండిన నా గుండెని/ ఆవలి తీరానికి విసిరేసి/ ఆత్మవిశ్వాసపు గవ్వలను నా ఎదనిండా కుప్పపోశాను/ ఒక్కొక్క కన్నీటి బొట్టుకు విలువ కట్టినరోజు/ విలువలకు కట్టిన సమాధులు విచ్ఛిన్నం కావలసిందే’ అని హూంకరిస్తారు. ‘నివారించలేని నివేదనల చిట్టాలో/ లిఖించబడిన చివరి పేజీని నేను/ మార్పు మృగ్యమైన సమాజంలో/ మానవత్వం ఏమూల తలదాచుకుందో?’ అని నిలదీస్తారు. ‘ఎగరడానికి సిద్ధంగా వున్న పక్షుల మధ్య/ రెక్కలు తెగిన పక్షిలా ఆమె’.. ఇలా వ్యక్తపరిచిన అనంత భావాలు రచయిత్రి పరిణితిని తేటతెల్లం చేస్తున్నాయి.
ఈ పుస్తకం చదువుతుంటే భావసాంద్రత కలిగిన పంక్తులు రచయిత్రిలోని కవితా వేశాన్ని, కవి హృదయాన్ని, లక్ష్యాన్ని ప్రస్ఫుటంగా తెలియపరుస్తాయి. ‘అమ్ముకోడానికి సిద్ధపడ్డప్పుడు/ కన్నీళ్లతో సహా ఏదైతేనేం/ పెట్టుబడిదారుల అంగట్లో/ అమ్మపాలతో సహా అన్నీ సిద్ధంగా వున్నాయి’ అనీ, ‘కాలంలో దాగున్న కన్నీళ్ల రుచి/ కాగితం అనుభవిస్తున్నప్పుడు/ ఒత్తిళ్ల పొత్తిళ్లలో నలిగి నలిగి/ ఆనవాళ్లు కోల్పోయిన చెక్కిళ్లు/ బతుకుబొంతలోని విరిగిన అద్దాలను ప్రదర్శిస్తున్నాయి/ కనిపించని అనురాగాల వలలు ఉరితాళ్ల కన్నా ప్రమాదకరమైనవని’ అనీ, ‘అనర్థాల పచ్చికట్టెల పొయ్యి/ అబద్ధాల పొగను విశ్వవ్యాప్తం చేస్తుంది/ అనుభవాల శిలలను కాలం ఉలితో చెక్కుతున్నప్పుడు పురుడు పోసుకున్న అక్షర దీపాలు శిలలను సైతం కరిగిస్తాయి/ రేయంతా చుక్కల దుప్పటి కప్పుకొని/ కమ్మని కలలను కంటున్న ఆకాశం/ వేగుచుక్క పిలుపుతో మేలుకొని మరో ఉదయాన్ని కనేందుకు సిద్ధపడ్డవేళ’.. అంటూ ప్రకృతిని బొమ్మ కడతారు కవయిత్రి. ‘అంతిమయాత్రలో నావెంట నడవపోయినా/ నా అవయవదానానికి ఏర్పాట్లు చేస్తావు కదా’ అని తనలోని సామాజిక స్పృహను తెలియజెపుతారు. ‘చలించని శిలాఫలకాలపై వేలాడుతున్న సామాన్యుని కోరికలు/ అడుగంటిన ఆశలపై అత్తరు జల్లుతున్నాయి/ ఉదయాన్ని అస్వాదించాలంటే రాత్రిని వేటాడక తప్పదు’ వంటి కవితా పాదాలు ఆమె కవిత్వంలోని గాఢతకు అద్దంపడుతున్నాయి.
నిబద్ధత, మనసుకు శక్తీ వుంటే ఎంతటి సమస్యనైనా అధిగమించవచ్చునంటూ సాగిన కొన్ని కవితల్లో రచయిత్రి అంతరంగం ఆవిష్కృతమయింది. ‘ముళ్లబాటలో ఒంటరి ప్రయాణం తప్పనప్పుడు నీడకు కూడా భయపడితే గమ్యం వెక్కిరిస్తుంది. అనుభవమే పాఠమైన రోజు ఆచార్యులే అవసరం లేదు. లక్ష్యాన్ని ఛేదింగలమనే నమ్మకం ముందు నిర్లక్ష్యం చేతులు కట్టవలసిందే! గాయపరుస్తున్న ముళ్లను ఎదకు హత్తుకుని ఎదగడమే లక్ష్యంగా పెట్టుకున్న సంకల్పాన్ని విషపు బాణాలు సైతం ఏం చేయగలవ్’.. అంటూ ఆత్మవిశ్వాసపు బావుటాను ఎగురవేశారు మాధవీలత.
పుస్తకం మొత్తం భావయుక్తమైన కవిత్వం అందించటమే కాకుండా సామాజిక అంశాలను విశే్లషిస్తూ, శబ్ద విన్యాసపు వాక్యాలతో లోతైన భావాలతో నిండిన ఈ కవితా సంపుటి చదువరుల మనసు దోచుకుంటుంది. మంచి పుస్తకం చదివిన గాఢానుభూతినిస్తుంది. పెద్దలు సినారే, గోపి, సిధారెడ్డిగార్ల ముందుమాటలు, కవయిత్రి మాట పుస్తకానికి పరిపూర్ణతనిచ్చాయి. ముఖచిత్రం, ముద్రణ బాగున్నాయి. ఈ కవయిత్రి సాహితీ ప్రస్థానం మరింతగా వెలుగులీనాలని ఆశిద్దాం.

- ఆచార్య మక్కెన శ్రీను, విజయవాడ. చరవాణి : 9885219712