విజయవాడ

మన కీర్తిపతాక (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమ్మ అనే రెండక్షరాలు
కమ్మదనానికి తియ్యదనానికి
తెలుగుదనానికి వెలుగుదనానికి
ప్రతీకలు కీర్తిపతాకలు
అమ్మ పిలుపులో ఉన్నది మాధుర్యం
అమ్మ చూపులో ఉన్నది ఔదార్యం
అమ్మ ఉన్న ఇంటిలో
లేకుండా ఉండదు సౌకర్యం
బ్రహ్మ చేతిలో అపురూపంగా
రూపుదిద్దుకున్నది బొమ్మ
ఆ బొమ్మే ఈ కలియుగ ఆలయాన
వెలిసింది దేవతగా అమ్మ
అమ్మ ఉంటే వెంట
రాదు కన్నీరు కంట
అమ్మ పేరు వింటే
చిలికెను పన్నీరు ఇంట
అమ్మను ప్రేమిద్దాం
అమ్మ కడుపున పుట్టినందుకు
అమ్మను పూజిద్దాం
అమ్మ మనకు
ఆ దేవుడిచ్చిన
వరమైనందుకు
బతుకంతా ఆనందిద్దాం..!

- మేడూరి సత్యనారాయణ,
తిరువూరు, కృష్ణా జిల్లా.
**

చెణుకులు (మనోగీతికలు)

చిన్న మెదడును
చెకప్ చేయించుకో
ప్రేమ పుట్టలో
పాములుంటాయ్!

మనశ్శాంతికి
ఆటంకమైతే
వదిలెయ్
ప్రాణమైనా?!

పంచ భూతాలు
ప్రాణాధారాలు
ఆలోచనలన్నీ
ఆర్థికపరమైనవే!

చావు
బతుకుల
అర్థం
టెన్షన్.. అటెన్షన్!

జ్ఞానాన్ని
అమ్మేశాడు
ఉల్లిపాయలకు
పుస్తకాలు

ప్రతీ మగాడు
‘స్ర్తి’కి బానిసా?
మూడు ముళ్లు
వేసి చూడు నాయనా?!

గయ్యాళి భార్యతో
వేగలేకున్నా
వెంటనే కలుసుకో
సోక్రటీస్‌ను!

ప్రేమ చిహ్నం
తాజ్‌మహల్
కదులుతున్నాయట
పునాదులు?!

చావకుండా
వుండాలంటే?
పుట్టకుండా
వుండటమే!!

- రాపోలు పరమేశ్వరరావు,
కొత్తరెడ్డిపాలెం, గుంటూరు జిల్లా.
చరవాణి : 99514 16618
**

ఘనీభవించిన ఆలోచనలు (మనోగీతికలు)

వేయి పూలు వికసించవు
మానవజాతి అంతరించే దాకా
వేయి ఆలోచనలు సంఘర్షించవు
సకల జీవజాతులు అంతమయ్యేదాకా
అభివృద్ధిపై వెర్రి వ్యామోహం పెరిగితే
వికసించేవి జన్యుమార్పిడి విత్తనాలే!
ప్రకృతి వ్యవసాయం కాదు
పర్యావరణ విధ్వంస సైన్స్ ఆవహిస్తే
వికసించేది ఆధునిక అజ్ఞానమే!
పురాతన విజ్ఞానం కాదు
ఉత్పత్తి శక్తులే
పర్యావరణ విధ్వంసక
శక్తులైనప్పుడు
వికసించేది వినియోగ బానిసత్వమే!
మరణించేది మానవజాతే
అంతమయ్యేవి సకల జీవజాతులే!!

- అల్ ఫతా, విజయవాడ
**

తొలకరి పిలుపు (మనోగీతికలు)

తొలకరిలో ఓ మబ్బు
తొంగితొంగి చూసింది
మబ్బులో ఓ మెరుపు
మెరిసి, మెరిసి పిలిచింది
నైఋతి ఋతువున
వర్షపు గాలులు సాగి
మండే ఎండలను తోలి
కమ్ముకుని నిలిచాయి
ధరణిపై జీవులు
నింగిలో వంగిన
మేఘమాలను చూసి
నిలువెల్లా నవ్వులతో
ఆనందాల వెల్లువలు
కమ్మని భావనల
కన్నులు వికసించాయి
వృష్ఠ్ధిరల మధ్య
నాట్యాలు సాగాయి
జీవకోటి కోరిందీ
ఆనందాలు ఎన్నో
కమ్మని భావాలు
ఆనందబాష్పాలై నిండాయి
ఏ కొమ్మమీదనో
వాన తాకిన పిదము
గాలివానకు బెదిరి
లేచి ఎగిరింది భయంగా
తొలకరి పిలుపులతో
వాన గాలులు తాకి
పులకించాయి పంటక్షేత్రాలన్నీ!
వర్షపు చలిగాలులకు
భూదేవి మురిసింది
నెర్రలిచ్చిన ధరణి నేర్పుగా నవ్వింది
నెనరూ కూరిమిన నేలంతా నానింది
కదిలేకాలంలో చిత్రమైన పులకింత
జగమంతా నవ్వింది
మధురంగా తొలకరిలో
పరువంగా పరవశించి
పంటల క్షేత్రాలు నవ్వాయి
రైతన్నలు బసవన్నలను
హలాలకు సంధించారు
పదునులు పొందిన
మెరక పొలాలు అదునుగా
నాగలి కొర్రులకు
సాయం అందించాయి
చెలిమి కోరుతూ
ఏవో పిలుపులు ప్రియంగా
పలుకులు ప్రేమగా పదాలు
వృష్ఠ్ధిరలు ధరణికి శక్తి
సకల జీవులకు జీవనధారలు
మెట్ట పంటలకు మేలుకొలుపులు
రైతు సోదరులు
రమ్యమనస్సులతో
నమస్కరించారు ప్రకృతి మాతకు!

- తన్నీరు సీతారామాంజనేయులు,
జగ్గయ్యపేట, కృష్ణా జిల్లా.
చరవాణి : 08654-224726