ఉత్తర తెలంగాణ

మీరూ రండి..! (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుల మతాల కుంపట్లను
నేను రూపుమాపుతుంటే..
నా లక్ష్యానికున్న వేగాన్ని ఎవరాపగలరు?
మీరూ రండి..
నా లక్ష్యపు దివిటీని పట్టుకోవడానికి!
కుటిల రాజకీయ కుతంత్రాల
కుత్తుకలకు నేను
ధిక్కార స్వరంతో ఉరి బిగిస్తుంటే..
నా ఆరాటపు నైజాన్ని ఎవరాపగలరు?
మీరూ రండి..
నా చైతన్య, స్వరానికి కోరస్ పలకడానికి!
మసకబారుతున్న మానవ సంబంధాలకు
నేను అక్షరాల మెరుగులద్దుతుంటే..
నా కవిత్వానికున్న పదునును
ఎవరాపగలరు?
మీరూ రండి..
నా సంకల్పానికి ఊపిరిలూదడానికి!
నైతిక విలువలతో నవ సమాజాన్ని
నేను అభ్యుదయ తిలకంతో
రూపుదిద్దుతుంటే..
నా భావజాలాన్ని ఎవరాపగలరు?
మీరూ రండి..
నా ఆశయ సాధన యజ్ఞంలో
సమిధవ్వడానికి!
సామాజిక రుగ్మతలపై
నేను కలాన్ని ఎక్కుపెడుతుంటే..
నా పోరాట పటిమను ఎవరాపగలరు?
మీరూ రండి..
నా కలంతో జత కట్టి..
కవితాకాశంలో ధృవతారలుగా
వెలుగొందడానికి
ఆలోచనా తరంగాలు నా అంతరంగపు
అంచులను మీటుతుంటే..
నేను నా కలం నుండి జాలువార్చే
భావతరంగాలను ఎవరాపగలరు?
మీరూ రండి..
నా అక్షరాలను దోసిట్లో పట్టి
ఆస్వాదించడానికి!!

- చిందం సునీత
కోరుట్ల, సెల్.నం.9701075502
**

అమ్మను...

అమ్మ పదంలో ఉంది కమ్మదనం!
అమ్మ పదంలోని రెండక్షరాలు..
దివి నుండి భువికి దిగొచ్చిన
అమృత బిందువులు!
తన ప్రాణాలను ఫణంగా పెట్టి..
నిన్ను ఈ లోకానికి తెచ్చే
త్యాగమయి అమ్మ!
తప్పటడుగులను దిద్ది..
జీవిత పాఠాలను నేర్పేది ఆమె ఒడిలోనే!
ఇదంతా మరిచి..జీవన సంధ్యలో..
ఆమెను అపురూపంగా చూడక..
వృద్ధాశ్రమాలకు నెట్టడం భావ్యమా!
ప్రేమతో.. ఆమెకు
పిడికెడు మెతుకులు పెట్టక..
నిరాదరణకు గురి చేయడం న్యాయమా?
అన్నీ ఇచ్చిన అమ్మను..
ఇకనైనా అనాధ చేయకుమా!

- చిలుకమర్రి విజయలక్ష్మి
ఇటిక్యాల గ్రామం, కరీంనగర్ జిల్లా, సెల్.నం.9493210293
**

వెలుగు రేఖలు

నీ ఆలోచనల మైకానికి
నిద్రమాత్రలు వేసి
నిద్రపుచ్చగలవు
కానీ ఎంతవరకు
మళ్లీ మెలుకువ వచ్చేవరకు!
నీ జీవితంలో ఎన్ని నిద్ర పట్టని
శివరాత్రులు గడిపావో..?
గాజు గోళీల్లాంటి నీ కళ్లు
కార్చిన కన్నీరును
కార్తీక దీపాలకు చమురుగా చేసి
ముల్లోకాలు వెతికిన గానీ
దుఃఖభరితమైన జీవితమే తప్ప..
వేరే ప్రతిబింబాలు కనిపించవు కదా!
అన్ని విధి చేతిలోని వింతలకు వంచినవే!
నీ ముఖ కవళికల్లో వెలుగు రేఖలు లేవు
ఏది ఓదార్పును చెప్పే చిరుస్పర్శ
ఏది నిన్న కురిసిన చిరుజల్లు
ఏవీ నీ బ్రతుకులో అమృతపు ధారలు?
నిరాశ నిస్పృహా భరితమైన
నీ జీవితంలో వెలుగు రేఖలు

ఎప్పుడు విరజిమ్మేను?
- గంప ఉమాపతి, కరీంనగర్, సెల్.నం.9849467551
***

విద్యావినోదం!

విద్యాక్షేత్ర నరాల స్వరాల్లో
వినూత్న రాగఝరుల మలుపులు
నలందా, తక్షశిల సనాతన చైతన్యం
దుమ్ము దులపాలని ఆరాటం
ప్రాథమిక పునాదుల నుండి
స్నాతకోత్తర శిఖరాల దాకా
ప్రయోగాల అద్దకాల హేలా విలాసం
మాతృభాష మహాశయం అడుగున
పలవరింపులు పరుస్తున్న విలువలు..
కాలగతి సుడిగాలుల ఏమవుతాయోనని
అంతుబట్టని ఆత్మవేదన!
స్వయంగా పడిపోతున్న మానవత్వం
భవిష్యత్తు భవనానికి
ఆయిల్ పెయింట్స్ అద్దుతోంది
నేటి బాలలు రేపటి మేధావులంటూనే
నిన్నటి మేధావుల నేటి బాల్య చేష్టలు..
ఏ లక్ష్యానికి మార్గమో? మరి?
దేశ సౌభాగ్యం వెతుకులాటలో
బలిదానాన్ని వలచిన వీరుల
జండాలకు అండదండ లెవరు?
విద్యావేదికపై ఇనుపగజ్జెల సవ్వడుల
పరిణామ దశ అయోమయం!
సాంకేతిక సవ్వడులు
స్టార్ వార్‌లో విజయఢంకా మోగించినా..
తిరోగమన మేధావులు
భావదాస్య సుక్షేత్రంలో
కల్తీ విత్తనాలు అలుకుతూంటే..
భావితరాల ఫలాలెలా గుంటాయో! మరి!
విపణి వీధిలో విద్యాతరంగాలు
కొందరి లాభాలకే ఉద్యమిస్తే..
మానవాళి మనుగడకు దారేది?
దేశోద్ధారక బంధువులారా!
ఆలోచనలోచనాలకు
ఊపిరిలూది ఉద్యమించండి!

- ఐతా చంద్రయ్య
సిద్దిపేట, మెదక్ జిల్లా
సెల్.నం.9391205299
***

నారదాగమనకాంక్ష

త్రిలోకసంచారి నారదుడు
తిరిగి ఒకసారి భువికి రావాలి
భూ లోకవాసుల కష్టాలు
మానవాళికి కలుగుతున్న నష్టాలు
కళ్లారా చూడడానికి
కనికరించి దేవతలను వేడడానికి
బ్రహ్మ సృష్టించిన చరాచరాలు
భగ్గుమనే కాలుష్యానికి బలౌతున్నాయి
సుఖ శాంతులతో ఉండవలసిన ప్రాణికోటి
బ్రతుకుదెరువు కోసమే అల్లాడుతోంది
అకాల మరణాలు
అకాండతాండవం చేస్తున్నాయి
ప్రాణవాయువు కరువవుతోంది
నీరు గగనకుసుమంగా మారింది
వనాల విధ్వంసం
ఎడారులను మిగిలించింది
చల్లదనం ఎండమావి అయింది
స్వార్థం జడలు విప్పి నృత్యం చేస్తోంది
ఈ విలయ పరిణామం
ఈ ప్రపంచ వినాశ విన్యాసం
ఏ పాపానికి ప్రతిఫలం?
ఎవరి శాపానికి పర్యవసానం?
ఎంతో అమూల్యమైన జీవనం
అంతులేని భవితవ్యభావనం
అశాంతితో ముగిసిపోవలసిందేనా?
అగచాట్లకు ఆహుతికావలసిందేనా?
ఒక్కసారి నోరువిప్పు నారదా!
మనిషి ఇక్కట్లను
దేవతలకు విన్నవించు గుణవిశారదా!

- డాక్టర్ అయాచితం నటేశ్వర శర్మ
కామారెడ్డి, సెల్.నం.9440468557
**

చెరువు

చెరువులెండిపోయి బరువయ్యె బతుకులు
నీరు లేక సకల దుర్భరంబు
చెరువు కలిగియున్న చెంత తల్లివిధము
సకల జీవగణము సల్లగుండు
వరుణదేవుడొచ్చి వర్ధంబునివ్వగ
మురిసిపోవు చెరువు నీరుతోటి
కరువుదీరునంటు హర్షంబుతో రైతు
హలము చేతవట్టి పొలము దున్ను
కాకతీయ మిషన్ స్వాగతంబు పలికె
చింతయేల నీకు కదలి రమ్ము
పంట భూములన్ని పచ్చదనముతోటి
పరవశించిపోవు తరుణమచ్చే

- బాలసాని కొమురయ్య
భోజన్నపేట (పెద్దపల్లి), కరీంనగర్ జిల్లా
సెల్.నం.9912657877
***

మేల్కోవాలని ఉంది!

కనురెప్ప చాటున దాగున్న ప్రపంచం
తనను కనుమరుగు చేయక ముందే
కన్న కలలు కన్నీరుగా మారక ముందే
మేల్కోవాలని ఉంది..ఓ సారి
ఈ ముసిరిన ముబ్బులను తరుముటకై..
లేత ప్రాయం మొగ్గ తొడగక ముందే
కామాంధుల వలలో చిక్కుకోక ముందే
బాల్యపు భారం నా మీద పడక ముందే
మేల్కోవాలని ఉంది..ఓ సారి
ఈ బానిస సంకెళ్లు తెంచటానికై..
పసిమనసు పాలేరుగా మారకముందే
చదువుకు హద్దులు గీయక ముందే
హరివిల్లుకు పాశం వేయక ముందే
మేల్కోవాలని ఉంది..ఓ సారి
ఈ నింగిలో స్వేచ్ఛగా ఎగరటానికై..
కుంల కుళ్లు అంటక ముందే
అంటరానితనం వెంటాడక ముందే
వెట్టిచాకిరి చేసే
మరమనిషిగా మారక ముందే
మేల్కోవాలని ఉంది.. ఓసారి
ఈ సమాజానికి నాగరికత నేర్పటానికై..

- దరిపెల్లి స్వరూప లక్ష్మణ్
మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లా
సెల్.నం.9912965549
**

ఒంటరితనం!

గుండెల్లో గూడుకట్టుకున్న దుఃఖం
కళ్లల్లో సుడులు తిరుగుతుంటే
మసక బారిన దారుల్లో
మనసు గతితప్పిన ప్రయాణంలో
తీరం చేరేవరకు ఒంటరితనమే
తిమిరం తాకేవరకు ఓదార్పులేని దేహమే
అడుగులు కదిపిననాడు
ఆశల రెక్కలు అంబరాన్ని తాకిననాడు
వాన చినుకు నేలను ముద్దాడినవాడు
వసంతాలు విరబూసినప్పుడు
ప్రకృతి వికసించినప్పుడు
ప్రాణం పరవశించినప్పుడు
లేని ఒంటరితనం
నేడెందుకో మొగ్గ తొడిగింది
రుతువులు మారినాక
మేఘాలు వౌనం వహించినాక
ఆశల చినుకెక్కడినుండి కురుస్తుంది
ఒంటరితనం తప్ప
ఆర్తిగా చూసే నేలెక్కడి నుండి తడుస్తుంది
ఓదార్పులేని కన్నీళ్లతో తప్ప
ప్రాణం పోయాలనే ఆశ చచ్చిపోయాక
పగుళ్లు పరిన నేలైన
జీవించాలనే ఆశ చచ్చిపోయాక
జీవకళ లేని జీవితమైన ఒక్కటే
ఆత్మీయులు దూరమయ్యాక
అనుబంధాలు భారమయ్యాక
గుండెలపై దిగులు కూర్చున్నాక
గుళ్లోని దేవుడైన
గుట్టల్లోని రాళ్లైన ఒక్కటే
పల్లకి మోయటమైన
పాడె ఎత్తటమైన ఒక్కటే
నిలువెల్లా ఒంటరితనం పరుచుకున్నాక
నిల్చున్న కూర్చున్న
నిద్రోయిన, మేలుకువలో ఉన్న
సమూహంలో ఉన్న
సాహిత్యంలో ఉన్న
ఓదార్పు పొందేవరకు
ఓదార్పును ఇచ్చేవారు వచ్చేంతవరకు
ఒంటరితనమే!
ఐనా సమూహంలో ఒంటరవ్వటం కంటే
ఒంటరితనంలో
సమూహమవ్వటమే నయం!

- సతీష్‌కుమార్ బొట్ల
కరీంనగర్, సెల్.నం.9985960614
***

వృక్ష సందేశం!

వినరా.. వినరా.. ఓ నరుడా!
నీకన్నీ సమకూర్చే...
తల్లి కరువును నేనేనని
తెలుసుకోరా పామరుడా!
కులమతాల భేదాలసలే లేవు నాకు..
పెరుగుతున్న నా మేను.. పనులన్నీ
నీకు చేసి పెట్టుతుంది!
కొమ్మలు..కొమ్మలుగా కొలువుదీరి..
చల్లదనాన్ని కూడబెడుతుంది!
పళ్లు ఫలాలతో కడుపునింపుతుంది!
కాలం కలిసి రాకున్నా..
కరువు కరాళ నృత్యం చేసినా..
నేను సదా నీ క్షేమానే్న కాంక్షిస్తా!
నా కాయమంతా నీకే అంకితం..
కాలి బొగ్గయ్యాక.. కూడా
వివిధ రూపాల్లో నీకు సేవలందిస్తా!
పచ్చికుంటే.. పచ్చగుంటే..
పళ్ల పుల్లనవుతా!
మందుకొరకు మాత్రనవుతా!
వానొస్తే గొడుగునై నిన్ను కాపాడుతా!
ఎండొస్తే నీడనవుతా!
చలివేస్తే దుప్పటినవుతా!
ఉక్కపోస్తే వింజారమనవుతా!
అందుకే..ఇకనైనా తెలుసుకో
నేను అన్నింటికీ ఆధారమనీ!
నాతోనే..
నీ జీవన యానానికి మార్గదర్శనమనీ!!

- ఎం.రామచంద్రమూర్తి (రాజా)
చేర్యాల, వరంగల్ జిల్లా
***