నెల్లూరు

వాచ్‌ఉమన్ (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్యార్థి జీవితానికి పాఠశాల తొలి అడుగు అయితే.. యువత భవితకు కళాశాల మలి అడుగు. వారివారి భవిష్యత్ తీర్చిదిద్దుకునేది ఇక్కడే. అమ్మాయిలకు, అబ్బాయిలకు ఇది టీనేజ్ వయసు. ఎగిసిపడే కడలి కెరటంలా దూకే పరువానికి హద్దులు వేసుకుంటూ.. తమ చదువును సాగించే యువతకు ఇటు చదువులోను, వయసులోను పరీక్షలు అధిగమించాలి. ‘పాస్ - ఫెయిల్’ అనేది వారివారి నడవడికను బట్టి ఉంటుంది.
‘‘ఏమిటి మాట్లాడవు? ఇందాకటి నుంచి నామటుకు నేను అడుగుతూనే ఉన్నాను. ఇదేమంత పెద్దవిషయం.. ప్రాక్టికల్స్ ఉన్నాయని చెప్పు.. ప్లీజ్ లతా.. నా కోసం సినిమాకు రావటానికి నీకు అభ్యంతరం ఏమిటి?’’
అరగంట నుంచి లతను బతిమలాడుతూనే ఉన్నాడు కిరణ్.
‘‘ఊహు.. ప్రాక్టికల్స్ ఉన్నాయని అమ్మానాన్న ఒప్పుకున్నా నీతో సినిమాకు రావటం నాకిష్టం లేదు’’
‘‘చూడు లతా.. మనం ప్రేమించుకోవడం మొదలై ఆరునెలలైంది. ఇంకా భయమెందుకు? నామీద నమ్మకం లేదా?’’ చెప్పాడు నిట్టూరుస్తూ..
‘‘నీ మీద నమ్మకం లేకకాదు.. నీతో సినిమాకు రావటం మా ఇంట్లో ఎవరైనా చూస్తే.. నాకు చదువు ఉండదు. ఈ మాత్రం ప్రైవసీ కూడా ఉండదు. ఇప్పటికే చాలా పొద్దుపోయింది. ఇంట్లో నాకోసం ఎదురుచూస్తూ ఉంటారు, నేవెళుతున్నా..’’
మరోమాటకు అవకాశమివ్వకుండా పుస్తకాలు తీసుకొని చకచకా వెళ్లిపోయింది లత.
వెళ్లిపోతున్న లత వైపు చూస్తూ ఉండిపోయాడు కిరణ్..
మరుసటి రోజు సాయంత్రం కాలేజీ అయిపోయాక లత, కిరణ్ కాలేజీ వెనక చేరి కబుర్లలో మునిగిపోయారు.
ఇలా ప్రతిరోజూ కాలేజీ అయిపోయాక లతా, కిరణ్ కాలేజీ వెనుక చేరి మాట్లాడుకోవడం.. ఆ కాలేజ్ వాచ్‌ఉమన్ గమనిస్తూ ఉండేది.
ఇలా కొద్దిరోజులు గడిచాక వాచ్‌ఉమన్ లీలావతి ఒకరోజు వారి దగ్గరికి వచ్చింది.
లీలావతిని చూడగానే భయపడిన లత లేచి నిలబడింది.
‘‘ఏమిటి లతా.. భయపడుతున్నావా? నేను మిమ్మల్ని రోజూ గమనిస్తున్నాను. మీరేమి అనుకోకపోతే.. నేను మీ తల్లిలాంటి దానిగా ఒక మాట చెపుతాను’’ అంది లీలావతి.
అప్పటి దాకా.. తమను అక్కడ చూసిన ఆమె ఎవరికైనా చెపుతుందో లేక ముఖ్యంగా ప్రిన్సిపాల్ గారికి చెపుతుందేమోనని భయపడ్డారు లతాకిరణ్‌లు..
ఆమె ప్రవర్తనకు కాస్త భయం తగ్గి.. ‘‘రా.. లీలావతమ్మ.. రా.. ఇక్కడ కూర్చో’’ అని బెంచీని చూపించారు.
లీలావతమ్మ చెప్పటం మొదలుపెట్టింది. ‘‘నేను కూడా మీలాగా టీనేజ్‌లో ఉన్నప్పుడు ప్రేమలో పడ్డాను. ఆ సంగతి మా ఇంట్లో అమ్మానాన్నకు తెలిసింది. నన్ను కట్టడిచేశారు. ఒకరోజు నేను ఇంట్లోంచి పారిపోయి అతనిని పెళ్లిచేసుకున్నాను’’ చెప్పింది లీలావతమ్మ.
‘‘మరి ఇంకేం.. కోరినవాడిని చేసుకున్నావు కదా.. హ్యాపీనేగదా’’ అన్నారిద్దరూ.
‘‘నిజమే.. పెళ్లిచేసుకున్నాను. కొన్ని రోజులు జీవితం బాగానే గడిచింది. కొద్దిరోజుల్లోనే తాగటం మొదలుపెట్టాడు. ఒకరోజు బాగా తాగి వచ్చి ‘ప్రేమించింది నిన్ను కాదు, మీ నాన్న ఆస్తిని. కానీ నువ్వు పారిపోయి వచ్చావు కాబట్టి ఆ డబ్బులు రాలేద’ని కొట్టేవాడు. నా ఒంటిమీద ఉన్న కాస్త సొమ్ము అమ్మి... ఆ డబ్బుతో తాగేవాడు. ఏ పనీ చేసేవాడు కాదు. ఇంటికి వెళ్లి డబ్బులు తెమ్మని హింసించేవాడు. ఒక్క తాగుడే కాదు... ఇంకా చాలా అలవాట్లు ఉన్నాయని రోజులు గడిచేకొద్దీ తెలిసింది. అప్పులవాళ్లు ఇంటికి రావడం మొదలుపెట్టారు. వీలైనప్పుడల్లా ఆయన్ను మార్చటానికి ప్రయత్నించేదాన్ని. ప్రేమించి పెళ్లిచేసుకొని వచ్చిన నా కోసం... ఏరోజైనా మారకపోతాడా... అని ఎదురుచూసేదాన్ని... కానీ ఆయనలో మార్పు రాకపోగా ఇంటికి రావడం మానేసాడు. వేరే ఆడదాని మాయలోపడి ఒకసారి నన్ను సినిమాకు తీసుకువెళుతున్నానని చెప్పి ఊరి చివరికి తీసుకొచ్చి నా గొంతు నులిమి నన్ను చంపబోయాడు. నేను స్పృహతప్పేసరికి చనిపోయాననుకుని చెట్లపొదల్లో నన్ను వదిలేసి వెళ్లాడు. మరుసటి రోజు నా కేకలు వినబడి అక్కడ పొలాల్లో పనిచేసేవారు వచ్చి నన్ను ఆ చెట్ల పొదల్లోనుంచి బయటకి లాగి రక్షించారు. అతని రాక్షస ప్రవర్తన చూశాక మళ్లీ అతని దగ్గరికి వెళ్లాలనిపించలేదు. నా తల్లిదండ్రులకు నా ముఖం చూపించలేక, చావలేక, బతకలేక ఇక్కడ వాచ్‌ఉమన్‌గా పనిచేస్తున్నాను. ఇది ఒక ఆకర్షణ, ప్రేమ కాదు. మీరుకూడా మీ కాళ్లమీద నిలబడి... ఆ తర్వాత మీ ప్రేమను నిలుపుకోండి. కొన్నాళ్లు ఆగండి. అప్పటిదాకా మీ ప్రేమ ఇలాగే ఉంటే అప్పుడు పెళ్లి చేసుకోండి’’ చెప్పింది లీలావతి.
నిజానికి వాచ్‌ఉమన్‌గా పనిచేసే లీలావతికి పెళ్లికాలేదు.
ఓ కథను అల్లి లతాకిరణ్‌కు దిశానిర్దేశం చేసింది. తన జీతంతో చెల్లిని, తమ్ముడిని చదివిస్తూ అనాథలకు చేతనైనంత సహాయం చేస్తుంది. ఆ కాలేజికి వాచ్‌ఉమన్ మాత్రమే కాదు. అక్కడ చదివే యువతను సొంతబిడ్డల్లాగా చూసుకుంటూ, ప్రతి విషయం గమనిస్తూ వారిని సరైన దారిలో పెట్టి వారి భవిష్యత్‌ను పూలబాటగా మలిచేందుకు అనుక్షణం ఓ తల్లిలా వారిని గమనిస్తూనే ఉంది ఏళ్ల తరబడి.

- ములుగు లక్ష్మీమైథిలి
నెల్లూరు.
చరవాణి : 9441685293
**

మనోగీతికల

కవి హృదయం

వేకువ కిరణాలు విచ్చుకుంటూ
రోజును వెలుగులో నింపుతున్నాయి
సూర్యుని రాకతో మొదలయిన ఉదయం
శుభకరంగా ఉండాలని ఆశిస్తాం!
నిజంగా కొన్ని ఉదయాలు
మనకు చైతన్యస్ఫూర్తులను కలిగిస్తాయి
అప్పుడపుడు పత్రికలలో
అచ్చయిన నా అక్షరాలు
కవితాకృతిగానో, కథగానో దర్శనమిచ్చినప్పుడు
ఆరోజంతా మనసు విహంగమవుతుంది
ఆ ఉదయం
నన్ను నేను పునర్నిర్మించుకునేటట్లు చేస్తుంది
నా అక్షరాలను పదేపదే స్పర్శిస్తాను
ఏదో తెలియని శక్తి నన్ను ఆవహిస్తుంది
కవికి కావలసింది ఈ కలంబలమే
పిడికెడు అక్షరాలు పంచే ఆనందం అనంతం
కవి తన భావసమూహాలను
భాషగా మార్చి రూపాన్ని కలిగించే భావుకుడు
అది రచనగా రంగులద్దుకుని
పత్రికలో అచ్చయినప్పుడు
ఉప్పొంగిన హృదయం
మరికొన్ని కొత్త్భావాలను ఆహ్వానిస్తుంది
వాటికి పురుడుపోయడానికి
మళ్లీ కలం కదులుతుంది!

- పాతూరి అన్నపూర్ణ
చరవాణి : 9490230939
***

కాలాన్ని వేడుకొందాం!

అందరికీ మంచే జరగాలంటారు
చెడు ఎవరికీ జరగకూడదంటారు
ఓ! స్వార్థం.. నిజాయితీ లేని మాటలను
ఎంత బాగా నేర్పుతుందో
***
అందరికీ న్యాయం జరగాలంటారు
అన్యాయం ఎవరికీ జరగకూడదంటారు
ఓ ! సంకుచిత భావం
కళ్లున్న నా కబోదితనాన్ని
ఎంతలా పెంచిపోషిస్తుందో
***
ధర్మాన్ని రక్షించుకోవాలంటారు
అధర్మాన్ని సహించకూడదంటారు
ఓ! ఉదాసీనత
ఔదలించాల్సిన ధర్మాపీఠాన్ని
ఎంతలా కాలదన్నిపోతుందో
***
కోపాన్ని జయించాలంటారు
శాంతిని పరిరక్షించాలంటారు
ఓ మనోదౌర్బల్యం
వ్యక్తిత్వాలను ఎంతగా దిగజారుస్తుందో
***
లింగ వివక్ష పాపమంటారు
ఆడపిల్లే ఇంటికి అందం అంటారు
సమతుల్యతకు అది అవరోధం అంటారు
బ్రతుకు వ్యాపారాల్లో
బాధ్యతల పలాయన చిత్తాలు
వివక్షల పట్ల ఆపేక్షతలను
ఎంతగా ద్విగుణీకృతం చేస్తుందో
***
జీవన పయనంలో బలహీనతల అవరోధాలు
గమ్యం లేని వ్యథాపూరిత వృథాప్రయాణాలు
దారితెన్ను స్పష్టతల మధ్య
దృష్టి మాంద్యపు అవకరాలు
విలువల వెలుగుల నడుమ
అంధకారపు జీవన వలయాలు
సంఘ జీవనపు లాబ్ధికాల కోసం
స్వార్ధపు కోణాల మధ్య వెదుకులాటలు
భూగోళాన్ని అరచేత ఇమడ్చగలం
దిగ్ధంతాలను దరిచేర్చగల ధీశాలురం
అగ్నిశిఖలను గుప్పిట ఆర్పగల నేర్పరులం
సముద్రాలను
ఔపోసన పట్టగల సాహసికులం
ప్రళయ మారుత ఝంఝారావాలనైనా
శ్వాసలో బంధించగల అజేయులు
అద్భుతాల ఆవిష్కరణలకు
పరితపించే నిత్యస్వాప్నికులం
గుప్పెడు మనసుకు
లోకువైన నిష్ప్రయోజకులం
***
మనసును భరిస్తున్న మనిషి
మనిషిని భరిస్తున్న సమాజం
కాలచక్రంలో బందీయై
వికసించని సంధాయక వైఫల్యాలతో
కునారిల్లుతోంది..
కాలగమనంలో
విలువల కిరణాలతో సంస్కరించబడి
విశ్వమానవత కోసం
ఓ శుభోదయాన్ని అనుగ్రహించమని
కాలాన్ని వేడుకొందామా!

కె.రవీంద్రబాబు, పాకాల
చరవాణి : 9052778988