విజయవాడ

అనుబంధాలు గుర్తుచేసిన ‘అన్నయ్య’ (పుస్తక పరిచయం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అన్నయ్య
కవితా సంకలనం
పుటలు 64,
వెల రూ. 40.
ప్రతులకు:
- గబ్బిట దుర్గాప్రసాద్,
అధ్యక్షులు, సరసభారతి,
2-405, శివాలయం వీధి,
రాజాగారి బంగ్లా వద్ద,
ఉయ్యూరు, కృష్ణా జిల్లా.
**
ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో తల్లిదండ్రుల తర్వాత అన్నయ్య, అక్కయ్యల పాత్రలే కీలకం. ఆ కాలంలో ఒక్కో కుటుంబం పది, పదిహేను మంది సంతానాన్ని కలిగి వుండేది. వాళ్లల్లో ఇంటికి పెద్దకుమారుడో, పెద్దకుమార్తో ఆ ఇంట్లో తల్లిదండ్రుల తర్వాత ప్రధాన పాత్ర పోషిస్తూ అందరికీ చేయూతనిచ్చి అండగా నిలిచేవారు. కానీ మారుతున్న కాలంలో ఏర్పడ్డ పరిణామాల వల్ల కుటుంబం అంటే ‘మేమిద్దరం - మాకిద్దరు’ అన్నట్లు ప్రభుత్వ ఫ్యామిలీ ప్లానింగ్‌లో కుంచించుకుపోయింది. ఉన్న ఇద్దరు పిల్లల్లో చాలావరకు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి అనే ధోరణిలో కనడం, ఆ తర్వాత తమ జీవిత కాలమంతా హాస్టల్లోనో, ఉద్యోగాల రీత్యా ఇతర ప్రాంతాలలోనో తరలిపోవడం వల్ల అన్నాచెల్లెళ్ళ మధ్య, అక్కాతమ్ముళ్ల మధ్య అనుబంధాలు మృగ్యమయ్యే పరిస్థితికి చేరింది నేటి సమాజం. ఇక, నా విషయానికొస్తే నేనే ఇంటికి పెద్దకొడుకుని. నాకు అక్కలు లేరు, అన్నలూ లేరు. కనుక నేను అన్నయ్య ఆదరణ, అక్కయ్య మమకారం రుచి చూడలేకపోయాను. నా తర్వాత ఇద్దరు చెల్లెళ్లు, ఒక తమ్ముడూ ఉన్నారు. తమ్ముడు దగ్గర్లో ఉండటం వల్ల అనుకుంటా తమ్ముడి కంటే దూరాన ఉన్న ఇద్దరు చెల్లెళ్లపై మమకారం, ప్రేమాప్యాయతలు ఎక్కువగా ఉండేవి. కానీ దీన్ని ప్రేమని అనాలో, మమకారం అనాలో, అభిమానం అనాలో తెలుసుకోలేం. సాధారణంగా ఒక చెల్లో, తమ్ముడో వ్యక్తం చేసే అభిమానం కంటే, అది ఒక కవి గొంతుకతో వింటేనే ఆ మమకారాల రుచి, అభిమానాల శుచి మరింత ఎక్కువగా తెలుస్తుంది. ఇది ఎలా ఉంటుందో ఈ సంకలనంలోని కవితలు చదివిన తర్వాతే నాకు మరింతగా తెలిసింది. దుర్ముఖి నామ సంవత్సర ఉగాది సందర్భంగా కృష్ణా జిల్లా ఉయ్యూరు సరసభారతి వారు ‘అన్నయ్య’పై కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంలో వచ్చిన కవితలతో ప్రచురించిన ‘అన్నయ్య’- కవితా సంకలనం చదివిన తర్వాత అన్నయ్య బాధ్యతలేమిటో, అన్నయ్యపై తమ్ముళ్లు, చెల్లెళ్ల హృదయాంతరాళాల్లో పెంచుకున్న అభిమానం, మమకారం ఏపాటివో అన్నగా చదివి మురిసిపోయాను, పులకించిపోయాను. ఇందులో ప్రచురించిన 35 కవితల స్థాయిల్లో భేదాలున్నా, శైలిలో తారతమ్యాలున్నా, స్థూలంగా అన్నయ్యపై కవులు వ్యక్తం చేసిన అనేక కోణాలు ప్రస్ఫుటమయ్యాయి. ఈకాలం యువతకు అన్నయ్య బాధ్యతలను గుర్తుచేసి, వారిపై మరింత మమకారం పెంపొందించే దిశను ఈ సంకలనం కల్పిస్తుంది. ఈవిధంగా కుటుంబ వ్యవస్థలో కీలక బాధ్యతలు మోసే అన్నయ్య విలువను మరోసారి ఈ సమాజానికి ఉన్నత రీతిలో తెలియపరుస్తూ కుటుంబ వ్యవస్థను పటిష్ఠపరిచేలా ప్రేరేపిస్తున్న ఈ సంస్థ నిర్వాహకులను, అధ్యక్షులు గబ్బిట దుర్గాప్రసాద్ గారిని అభినందించి తీరాలి.

- చలపాక ప్రకాష్, విజయవాడ.
చరవాణి : 9247475975

***
సామాజిక చైతన్యానికి గీటురాళ్లు.. వేమన పద్యాలు (వినురవేమ..)

తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన మహాకవుల్లో వేమన ఒకరు. ఈయన 17వ శతాబ్దానికి చెందిన కవి. సాధారణంగా కవి తన రచనల ద్వారా సమాజాన్ని చైతన్యవంతం చేసి, అభ్యుదయ మార్గంలో పయనించేలా చేస్తాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అది ఆ రచయిత తీసుకున్న కథ, నవల, నాటకం.. ప్రక్రియ ఏదైనా రచయిత తన రచన ద్వారా సమాజం ఆలోచించేలా చేస్తాడు. అలాంటి రచయిత్లో వేమన ముందు వరుసలో నిలుస్తాడు. తన శతక రచన ద్వారా ‘విశ్వదాభిరామ వినురవేమ!’ అనే మకుటంతో సమాజంలో మూఢాచారాల మీద, కుల వ్యవస్థ మీద పెద్ద యుద్ధమే చేశాడు వేమన కవి. అటువంటి వేమన పద్యాల్లో మచ్చుకు కొన్నిటిపై విశే్లషణ ఇది.
‘రామనామ జపముచే మున్ను వాల్మీకి
పాపి బోయడయ్యు బాపడయ్యే!
కులము ఘనము గాదు గుణమే ఘనమ్మురా
విశ్వదాభిరామ వినురవేమ!’
కులం కాదు, గుణం ప్రధానమనే విషయాన్ని ఈ పద్యంలో వేమన తెలియజెప్పాడు. రామాయణాన్ని రచించిన వాల్మీకి వృత్తిరీత్యా బోయవాడు. కనుక కులానికి కాదు, గుణానికి ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పాడు వేమన. నేటి 21వ శతాబ్దంలో శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధిలో మనం బుల్లెట్ వేగంతో దూసుకుపోతున్నాం. కానీ సమాజంలో కుల వివక్ష అనేది రాజ్యమేలుతూనే వుంది. కొందరు స్వార్థపరులు తమ స్వప్రయోజనాల కోసం కులాల మధ్య చిచ్చుపెట్టి సమాజ వినాశనానికి కారకులవుతున్నారు. మానవత్వం అనే దాన్ని మరచిపోయి కులాల మురికికూపంలో కూరుకుపోతున్నారు. ఏదిఏమైనా మనమందరం ఒక్కటే.. మనజాతి భారతజాతి.. అనే ఐక్యతతో అందరం కలిసి ముందుకెళ్లాలనే సందేశం పై పద్యంలో కనిపిస్తుంది.
‘తల్లిదండ్రులందు దయలేని పుత్రుండు
పుట్టనేమీ! వాడు గిట్టనేమి!
పుట్టలోన చెదలు పుట్టవా! గిట్టవా!
విశ్వదాభిరామ వినురవేమ!’ అన్నాడు.
మనకు కనిపించే ప్రత్యక్ష దైవాలు తల్లిదండ్రులు. వారిని జీవితాంతం ఆదరిస్తే జీవితంలో అత్యున్నత స్థాయికి వెళ్తామని అనేక వేదాలు, పురాణాలు చెబుతున్నాయి. కానీ నేడు మెజారిటీ పిల్లలు తమ తల్లిదండ్రులను అనేకవిధాల బాధలుపెడుతూ రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారు. తల్లి నవమాసాలు మోసి, కని పెంచి, తండ్రి చెయ్యి పట్టుకుని అభివృద్ధి వైపు నడిపిస్తే వారిని వృద్ధాప్యంలో అనేక సందర్భాల్లో బాధపెట్టడం క్షమించరాని నేరం. కొందరు తల్లిదండ్రులు ‘నా కొడుకు మా ఆస్తి తీసుకుని మాకు కనీసం రోజూ ఒక ముద్ద అన్నం కూడా పెట్టడం లేదం’టూ పోలీసు స్టేషన్లకు సైతం వెళ్లి ఫిర్యాదు చేస్తున్నారంటే మొత్తం సమాజమే సిగ్గుతో తలవంచుకోవాల్సిన దుస్థితి. అలాంటి బిడ్డలకు ఉరిశిక్ష వేసినా తప్పులేదనిపిస్తుంది. కనుక తల్లిదండ్రులను ప్రేమతో ఆదరించాలని ఈ పద్యంలో వేమన చెప్పాడు. తల్లిదండ్రుల బాగోగులు చూడని పిల్లల్ని పుట్టలోని చెదలతో పోల్చాడు. మరొక పద్యంలో,
‘తప్పులెన్ను వారు తండోపతండంబు
లుర్వి జనులకెల్ల నుండు తప్పు
తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు
విశ్వదాభిరామ వినురవేమ!’ అన్నాడు.
నేటి సమాజంలో తప్పుపట్టే వారేకాని, తమ తప్పులను తెలుసుకునేవారు కరవయ్యారు. ఏదేని ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు, అదే తప్పును తనూ ఒకానొక సమయంలో చేసినప్పుడు తానొక మహానుభావుడిలా ఆ వ్యక్తికి నీతులు చెప్పకూడదు. ముఖ్యంగా నేటి రాజకీయ నాయకులను చూస్తున్నాం. వారు ఒకరు చేసిన తప్పును మరొకరు వేలెత్తి చూపుతారు. చివరికి అందరూ ఒకటే! కనుక వ్యక్తి తనను తాను సంస్కరించుకుని అప్పుడు సమాజంలోని ఇతరుల గురించి ఆలోచించాలి. సమాజంలో ఎవరూ తప్పులు చేయకుండా ఉండరు. కనుక ఆ తప్పులు మరలా జరగకుండా మనల్ని మనం సంస్కరించుకోవాలి. అంతేకాని ఎదుటి వాడిలో తప్పులు వెదకడమే పనిగా పెట్టుకుంటే నువ్వు సమాజంలో చులకనైపోతావనే విషయాన్ని గ్రహించాలని హితవు పలుకుతాడు వేమన.
‘బంధుజనులజూడు, బాధల సమయాన
భయమువేళ జూడు, బంటుతనము
పేదపడ్డ వెనుక, పెండ్లాము మతి జూడు
విశ్వదాభిరామ వినురవేమ!’
ఈ పద్యంలో వేమన నిజమైన బంధువు, బంటు, భార్య గురించి చెప్పాడు. నేటి సమాజంలో బంధువులు అనేవారు రాబందులుగా మారుతున్న విషయం తెలిసిందే. బంధువులు బాధల్లో ఉన్నప్పుడు నేనున్నానన్న భరోసాని ఇవ్వాలి. అంతేకాని దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఒకవిధంగా, డబ్బులు పోయి కష్టాల్లో ఉన్నప్పుడు ‘మీరెవరో నాకు తెలియదు’.. అనే విధంగా ఉండకూడదు. అలాగే బంటు అన్నవాడు ఏదైనా ప్రమాదం ఎదురైనప్పుడు మనకు ధైర్యాన్ని కలిగించి తన ప్రాణాలను కూడా లెక్కచేయకుండా మన కోసం పోరాడేవాడై వుండాలి. అతడే నిజమైన బంటు. ఇక భార్య అనేక రూపాల్లో భర్తకు సహాయకారిగా ఉంటుంది. భర్తకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ధైర్యం చెపుతూ తన సహాయ సహకారాలు అందిస్తూ చేదోడువాదోడుగా నిలవాలి. అప్పుడే వారు ఆదర్శ దంపతులుగా కలకాలం నిలిచి ఉంటారు. ఈవిధంగా వేమన తన పద్యాల ద్వారా సమాజంలో చైతన్యం తీసుకొచ్చాడు. సాహిత్యం ద్వారా సమాజంలో ఎంతగా చైతన్యం తీసుకురాగలమో తన పద్యాల ద్వారా నిరూపించిన మహాకవి వేమన.

- డా. ఒభిన్ని శ్రీహరి,
నూజివీడు, కృష్ణాజిల్లా.
చరవాణి : 9912393495