విశాఖపట్నం

విజేత! ( మినీకథలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఒరేయ్ విజయ్! ఇది చాలా పెద్ద కంపెనీ. మంచి జీతం. మరిచిపోకుండా ఇంటర్వ్యూకి వెళ్లు. సర్ట్ఫికెట్లు అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో ఒక్కసారి సరిగ్గా చూసుకో’’ గోపాలరావు కొడుక్కి పదేపదే జ్ఞాపకం చేయసాగాడు.
‘‘ ఇంటర్వ్యూలన్నీ అబద్ధాలే నాన్న. ఊరికే ఒక ఫార్మాలిటీ కోసం నడుపుతారు. ఎన్ని ఇంటర్వ్యూలలో చూడలేదు. అంతా అయిన తర్వాత వాళ్లకి కావలసిన వాళ్లకి ఉద్యోగం ఇస్తారు. ఇది అందరికీ తెలిసిందే కదా’’ అన్నాడు విజయ్ ఏమాత్రం ఉత్సాహం చూపించకుండా.
‘‘ ఈసారి వాళ్లకి కావలసినవాడు, రికమెండేషన్ ఉన్నవాడివి నువ్వే’’ అని తండ్రి అనగానే ఒక్కసారిగా షాకయ్యాడు విజయ్.
‘‘అవున్రా ఆ కంపెనీ మేనేజర్‌గా క్లాస్‌మేట్, మంచి ఫ్రెండు. బాగా తెలిసినవాడు. ఆ ఉద్యోగం నీకే అని చెప్పాడు. అందువల్ల ధైర్యంగా వెళ్లు’’ అన్నాడు గోపాలరావు కొడుకు భుజం తడుతూ.
ఆశ్చర్యంగా ఇంటర్వ్యూలో తనకి అన్నీ తెలిసిన ప్రశ్నలే అడిగారు. అందువల్ల అన్నింటికీ టకీమని జవాబులు చెప్పాడు విజయ్.
‘‘యు ఆర్ అపాయింటెడ్ మిస్టర్ విజయ్. ఎప్పుడొచ్చి జాయినవుతారు?’’ అడిగాడు ఆ కంపెనీ మేనేజర్.
‘‘రేపే జాయినవుతాను సార్’’ అని చెప్పి తండ్రి దగ్గరకి వచ్చి ‘‘మీ ఫ్రెండుకి కృతజ్ఞతలు చెప్పండి నాన్నగారు’’ అన్నాడు సంతోషం పట్టలేదక.
‘‘నాకెలాంటి ఫ్రెండూ లేడురా’’ అని తండ్రి చెప్పగానే విజయ్‌కి ఏమీ అర్ధం కాలేదు’’.
‘‘ఇన్ని రోజులూ నువ్వు ఆ ఉద్యోగం నాకెలాగూ రాదు అన్న ఒక అపనమ్మకంతో ఇంటర్వ్యూకి వెళ్లేవాడివి. దానికి తగ్గట్టుగానే సరిగ్గా సమాధానాలు చెప్పలేకపోయే వాడివి. ఈసారి మాత్రం ఆ ఉద్యోగం నీకే అన్న నమ్మకంతో వెళ్లావు. గెలిచావు. నేను అనుకున్నవి కరెక్టే అని నిరూపించావు’’ అని తండ్రి చెబుతుంటే ఆశ్చర్యంతో వినసాగాడు విజయ్.

- వసంతకుమార్ సూరిశెట్టి,
నెల్లిమర్ల, విజయనగరం,
సెల్ : 8297191810.
**

కన్యాశుల్కం (మినీకథలు)

‘‘పసిమొగ్గపై పైశాచికత్వం’’ నిత్యం దినపత్రికల్లో పతాక శీర్షికలు చదివి పళ్లు నూరాడు సత్యం.
వివరాలోకి వెళితే అమ్మాయిని మానభంగం చేసి అత్యాచారం చేశారు. ఆపైన నీళ్లట్యాంక్‌లో ముంచి చంపేసిన కామాంధుడు అంటూ వార్త. అది ఫొటోలతో పేపర్లో వచ్చింది.
అలాగే మరిన్ని క్రైం వార్తలు కనిపించాయి.
మహిళల మెడల్లో గొలుసు తెంచుకుపోయిన వార్త, ఇళ్లలో కన్నాలు వేసిన వార్త, చిట్‌ఫండ్‌ల మోసం, బ్యాంకులో తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించి లోన్లు కాజేసిన వైనం, భూతగాదాలు, కబ్జాలు ఇలా అనేక వార్తలు వచ్చాయి. అందులో కొన్నిచోట్ల నేరస్తుల ముఖాలకు నల్లటి ముసుగులు వేసిన ఫొటోలు ఉన్నాయి. ఇలా ముసుగులు వేయడం వల్ల ఎవరికి ఉపయోగం? నేరస్తులు తమ గుర్తులు తెలియకుండా జాగ్రత్తపడడం, తర్వాత మళ్లీ నేరాలు చేయడం పరిపాటిగా మారిపోవడానికేనా? అనుకున్నాడు సత్యం.
ఆ రాత్రి సత్యానికి నిద్రపట్టలేదు.
ఆలోచనలు ముప్పిరిగొంటున్నాయి.
ఆధార్‌కార్డు నెంబరు బట్టి వ్యక్తుల వివరాలు నమోదు చేయడం భారతదేశమంతటా ఊపందుకుంది.
నేరగాళ్లకు ఇచ్చిన ఆధార్ కార్డు నెంబర్‌ను శాశ్వతంగా నిషేధించి, వాళ్లకి ఏ సౌకర్యాలు లేకుండా శిక్షిస్తే సమాజం బాగుపడుతుందేమో అనిపించింది సత్యానికి.
ప్రభుత్వపరంగా అందే సౌకర్యాలన్నీ నేరం చేసిన రుజువైన వాళ్లకి తీసేస్తూపోతే వాళ్లు నేరం చేసేందుకు భయపడే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు బయటికి వచ్చేటప్పుడు ఆధార్‌కార్డు నెంబరు కలిగి ఉండడం, కుటుంబ వివరాలు తెలియపరిచే విధంగా సాఫ్ట్‌వేర్ రూపొందించగలిగితే నేరాల్ని అదుపు చేయగలగడం సులువవుతుందని అనిపించింది సత్యానికి.
అలా ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకున్నాడు.
కొంతసేపటి తర్వాత మెలకువ వచ్చింది.
అరగంట సేపు వౌనంగా కూర్చున్నాడు.
తర్వాత మాగన్నుగా నిద్రపట్టింది.
మళ్లీ మరొక కల.
అమ్మాయిలు పుట్టడం మానేసి దాదాపు ఆరేళ్లవుతోంది. అమ్మాయిలు చాలక అబ్బాయిలు తమలో తామే పోటీ పడుతున్నారు. ఇంటర్నెట్‌లో అసభ్యకర చిత్రాలు, విషయాలు, ఫేస్‌బుక్, ట్విట్టర్లు అన్నీ మాయమైపోయాయి. అమ్మాయిల్ని తమ జీతంతో, ఆస్తులతో ఇంప్రెస్ చేయాలని అబ్బాయిలు తంటాలు పడుతున్నారు.
అబ్బాయిలు వందమందికి అమ్మాయిలు కేవలం నలభై మందే ఉంటున్నారు.
కన్యాశుల్కం మళ్లీ కొత్తగా పురుడు పోసుకుంది.
హఠాత్తుగా మెలకువ వచ్చింది సత్యానికి.
రాబోయే కొద్ది రోజుల్లో జరగబోయే వాస్తవం కళ్ల ముందు ప్రత్యక్షం అయినట్లు అనిపించింది.
‘దేవుడా! ఇలాగైనా నా దేశాన్ని బాగుపడనివ్వు’ అనుకున్నాడు సత్యం.

- శ్రీనివాస్‌భారతి,
శ్రీకాకుళం.