విశాఖపట్నం

మాతృభాష (కథానిక)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘మన స్కూల్లో ఎడ్మిషన్ కోసం వచ్చారట సార్’’ అన్నాడు ప్రిన్సిపాల్‌తో అటెండర్.
‘‘కూర్చోండి’’ మమ్మల్ని చూసి అన్నారు ప్రిన్సిపాల్‌గారు.
‘‘నమస్తే సార్. వీడు మా అబ్బాయి వినీత్’’ అని చెబుతూనే వినీత్ వైపు తిరిగి ‘‘సార్‌కి నమస్కారం చెప్పరా’’ అని చెవి దగ్గర గొణిగాను.
రెండు చేతులూ జోడించాడు వినీత్.
‘‘ఇంతకు ముందు ఏ స్కూల్లో చదివావు వినీత్?’’ నవ్వుతూ అడిగారు ప్రిన్సిపాల్.
‘‘జ్ఞాననిధి ప్రైవేటు స్కూల్లో సార్’’ చెప్పాడు వినీత్.
‘‘ఓహో... అక్కడ తెలుగుకి కూడా ప్రాధాన్యత ఉందని విన్నాను ఔనా?’’ తలపంకిస్తూ అన్నారు.
‘ ఔన’నన్నట్లు తలూపాను.
‘‘మాది ఇంగ్లీసు స్టాండర్డ్‌లో నెంబర్‌వన్ స్కూల్. అయినా సరే మేము మాతృభాషకు ప్రాధాన్యమిస్తూ సెవెంత్ క్లాసు వరకు తెలుగు నేర్పుతున్నాం. అద్సరే మీ వాడికి టెస్టు పెట్టాలిప్పుడు’’ అన్నారాయన.
వినీత్‌ని పరీక్ష రూంలో కూర్చుండబెట్టి నేను బయటికి వచ్చి హాల్లో కూర్చున్నాను. చూడముచ్చటగా ఉన్న ఇద్దరు దంపతులు నాతో పాటు కూర్చున్నారు. వాళ్లసలు తెలుగు వాళ్లు కానట్టు, తెలుగసలు రాన్నట్టు చోద్యంగా ఇంగ్లీషులోనే మాట్లాడుకుంటున్నారు. ఒకటి రెండు సార్లు వాళ్ల చూపులూ, నా చూపులూ కలిసాయి. పలకరింపుగా నవ్వాను.
‘‘ప్లీజ్ టు మీట్‌యు. మైనేమ్ ఈస్ వైభవ్. దిసీజ్ రోజీ మై వైఫ్’’ అన్నాడతను.
నేను నవ్వేసి ఊరుకోలేక ‘‘నా పేరు రాజా. మా బాబు వినీత్ ఆరవ తరగతి ఎంట్రెస్ రాస్తున్నాడు’’ అన్నాను.
మాకు దగ్గగా వచ్చిన అటెండర్ ‘‘సార్ ఈ కవర్ ఎవరిదో చదివి చెప్పండి సార్’’ అంటూ అతనికి ఇచ్చాడు.
కవర్ అటు ఇటు తిప్పి చూసిన అతను ‘‘ఐ డోంట్ నో తెల్గూ. మై రోజీ ఆల్సో’’ అని కవర్ తిరిగి ఇచ్చేసాడు.
ఆ కవర్ని అందుకుని నేను ‘‘కరుణాకర్. తెలుగు సార్’’ అన్నాను.
‘‘తెలుగు పండిట్‌గారా’’ అంటూ వెళ్లిపోయాడు అటెండర్.
పిల్లలు పరీక్ష రాసి తిరిగి వచ్చేశారు.
‘‘ఎలా రాశావు నాన్నా?’’ అడిగాను నేను వినీత్‌ని.
‘‘బాగా రాశాను నాన్నా’’ చెప్పాడు వినీత్.
మా వాడు నాన్నా అని సంబోధించడం, నేను అచ్చమైన తెలుగులో మాట్లాడడం వాళ్లు విచిత్రంగా చూస్తున్నారు. ఆ దంపతుల చూపుల్లో వెటకారం వివరంగా కనిపిస్తుంది.
‘‘హౌ అటెండ్ ఎగ్జామ్ సన్?’’ అని వాళ్లబ్బాయిని అడిగాడు అతను.
‘‘బాగానే రాశాను’’ ముక్తసరిగా చెప్పాడా అబ్బాయి.
‘‘యు డర్టీఫెలో... ఐసే డోంటాక్ తెల్గూ’’ అని పళ్లు కొరికాడు అతను. ఆమె కళ్లెర్ర చేసి ‘‘యు డర్టీ క్రీచర్’’ అని కొడుకుని కుదిపేసింది.
నేనది సహించలేకపోయాను. కల్పించుకోకుండా ఉండలేకపోయాను. వెంటనే ‘‘మీరు తెలుగువారు కాదా అండీ’’ అని అడిగాను.
‘‘టెల్గూ... ఎందుకొచ్చిన టెల్గూ? మావాడు పెద్ద చదువు చదవాలి. ఆమెరికా వెళ్లి అక్కడే ఉండిపోవాలి. టెల్గూ చదవాలా? ఎందుకు?’’ అని కోపంగా నా వైపు చూస్తూ అన్నాడు.
ప్రిన్సిపాల్‌గారు మమ్మల్ని లోపలికి రమ్మన్నారని అటెండర్ చెప్పాడు. వౌనంగా లోపలికి నడిచాం.
‘‘కూర్చోండి’’ అన్నారాయన నావైపు చూస్తూ.
‘‘అన్ని సబ్జెక్టుల్లో రెండేసి ప్రశ్నలిచ్చాను. మీ అబ్బాయి వినీత్ బాగా రాశాడు. అన్నింటిలోను నూటికి నూరు మార్కులు వచ్చాయి. మీరు ఈ రోజే వినీత్‌ని స్కూల్లో జాయిన్ చెయ్యండి’’ అని షేక్‌హ్యాండిచ్చారు ప్రిన్సిపాల్.
నా ఆనందానికి అవధుల్లేవు. వినీత్‌ని పట్టుకుని దగ్గరకు హత్తుకున్నాను.
ప్రాథమిక విద్య మాతృభాషలోనే నేర్పించి వినీత్‌లో మనోవికాసం కలిగించినందుకు నన్ను నేను లోలోపల అభినందించుకున్నాను.
‘‘సారీ వైభవ్‌గారు! మీ అబ్బాయికి అన్నీ జీరో మార్కులే! తెలుగులో జీరో... మిగతా సబ్జెక్టుల్లో పూర్. వెరీవెరీ పూర్. మా స్కూల్లో ఎడ్మిట్ చేసుకోలేం. బాగా కోచింగ్ ఇప్పించి వచ్చే ఏటికి ఎడ్మిషన్‌కి తీసుకురండి’’ అని ముగించారు ప్రిన్సిపాల్‌గారు.
‘‘వియ్ డోంట్ వాంట్ టు ఎడ్మిట్ ఇన్ యువర్ స్కూల్. యు ఆర్ గివింగ్ ఇంపార్టెన్స్ టు టెల్గూ. సో ఇట్స్ ఓకే’’ అనేసి వాళ్లు కోసంగా వెనుదిరగబోయారు.
‘‘మిస్టర్ వైభవ్! మాతృభాషలో విద్యాబోధన పిల్లల మనోవికాసానికి తోడ్పడుతుందని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి...’’ అని చెబుతుంటే వారు వినిపించుకోలేదు.
‘‘డర్టీ స్కూల్... డర్టీ టెల్గూ’’ ఆమె బిగ్గరగా అంటూ కదిలింది. గాబరా గాబరాగా వెళ్లబోతున్న ఆవిడకి అటెండర్ కూర్చునే స్టూల్ కాలికి తగిలింది. జారిన ఊపుకి ఆగలేక బోర్లా పడిపోయింది. ఆమె హైహీల్స్ చెప్పు విసురగా పైకెగిరి ఆమె మొహానికి గట్టిగా తగిలింది. వాళ్లనే చూస్తున్న నాకూ, ప్రిన్సిపాల్‌గారికి దిగ్భ్రాంతి కలిగింది.
‘‘ఓలమ్మో సచ్చిపోనే్న...’’ అని గావుకేక పెట్టిందామె.
ఆ కేక మొత్తం స్కూలు స్కూలంతా మార్మోగింది.

- యల్. రాజాగణేష్,
పాతగాజువాక,
విశాఖపట్నం-530026.
సెల్ : 9247483700
***

ఎదగాలంటే ఒదగాలి (మనోగీతికలు)

అతడు అమితమైన హు‘షా’రుతో
తిరుగులేని బావుటా ప్రతి రాష్ట్రంలో
ఎగరేద్దామని ఎడతెరిపి లేని విశ్వాసంతో
పావులు కదుపుతుంటే
ఆవులు అకారణంగా అడ్డొచ్చాయి
కుడి భుజంపై ‘అతి’ భుజంగం
పడగవిప్పి కాటేస్తే
అడగడానికి విపక్షీయులూ
కడగడానికి అవకాశవాదులు
గొంతెత్తి, వింత రీతుల్లో నిరసన
అత్యధిక మెజారిటీ మోదంలో
ప్రమాద ఘంటికలు మోగిన వైనం కానరాక
క్రోధం విభేదమై ఎన్నికల ఫలితాలు ఖేదమై
గెలుపు మత్తుకు ఒక అప్రమత్త కొరఢా
తమలో మతంలో అభిమతంలో
ఒక నిశిత పరిశీలన... విశే్లషణ అవసరమైంది
దేహభాష సందేహ ఘోష అయినప్పుడు
గర్వం సర్వ నాశనానికి మూలమై మొలకెత్తుతుంది
ప్రజా పరిపాలనలో కావల్సినవి
పరమతాల మధ్య సభ్యత
దైనందిన అవసరాల లభ్యత!

- జోగారావు గుండాన, శ్రీసాయినగర్ కాలనీ,
సింహాచలం పోస్టు, విశాఖపట్నం - 530028.
సెల్ : 9490185708.
***

బాలకార్మికుడు (మనోగీతికలు)

పేదరికమో, పరిస్థితుల ప్రభావమో
కారణం తెలియదు కానీ
పుట్టుకొస్తాడు బాలకార్మికుడు
బడిలో ఉండాల్సిన వయసులో
బాలలు పనిలో ఉండడం
సిగ్గుచేటు విషయం
బాలకార్మిక వ్యవస్థను
సమూలంగా నిర్మూలించాలి
ఆ దిశగా పోరాటం సాగిస్తున్న
కైలాష్ సత్యర్థి మనందరకు
స్ఫూర్తి కావాలి
ఒక్కరే పోరాడితే గెలవలేం మనం
సంఘటితంగా యుద్ధం చేస్తే
గెలుస్తాం ఇది నిజం

- నాగాస్త్రం నాగు,
వడ్లపూడి, విశాఖపట్నం.
సెల్ : 99660 23970.
***

ఓ నా అందాల భరిణ! (మనోగీతికలు)

చక్కనైన ముఖారవిందం ఆకట్టుకుంది నన్ను అమితంగా
కలువలాంటి కనులు దేదీప్యమానంగా వెలుగుతూ
ఆకర్షించాయి నన్ను అలవోకగా
విల్లంబుల వోలె ఒంగిన అధరాలు రారమ్మని
నను ఆహ్వానించాయి గాఢ ఛుంబన కోసం
మంచువోలె ముత్యాంలా మెరిసే నునువైన చెక్కిళ్లు
స్పర్శించమంటూ తహతహలాడుతున్నాయి
గాఢ పరిష్వంగన కోసం మనసు ఉవ్విళ్లూరుతోంది
అందాలలొలికే నీ నడుము దగ్గరకు తీసుకోమంటుంది
ఆప్యాయతల సందడి చేయమంటోంది
అందమైన నీ సోయగాలు ఊరిస్తున్నాయి నన్ను
నీ ప్రేమ ఆప్యాయతలు చేరువ కమ్మంటున్నాయి
నీ జ్ఞాపకాలు ఉత్తేజాన్ని ఇస్తున్నాయి
నీ సన్నిధే నాకు పెన్నిధి అని
మేని పులకిస్తోంది

- మల్లారెడ్డి రామకృష్ణ, బుడితి-532427,
సారవకోట మండలం, శ్రీకాకుళం జిల్లా.
సెల్ : 8985920620.
***

వృథా వద్దు! (మనోగీతికలు)

నాటికీ నేటికీ ఏ నాటికీ
ముమ్మాటికీ నానాటికీ
నీటి కోసం కటకటలు
నీటి కోసం విధ్వంసాలు
జలవనరులకై కొట్లాటలు
బోరుబావులతో
భూమాత హృదయానికి తూట్లు
ఎడాపెడా ఎగాదిగా
నీరు పారబోసే వృథా వద్దే వద్దు
తరువులను పెంచు
ఒక్కొక్క వర్షపు చుక్క
ఒడిసి పట్టుట ముద్దు
భావితరాలకై దాచుట కద్దు!

- కొంకేపూడి అనూరాధ,
విజయనగరం.
సెల్ : 9618425243
***

ప్రేమా! వర్ధిల్లు (మనోగీతికలు)

ప్రేమా... నీకో నమస్కారం!
నువ్వు వరిస్తే పెద్దల నుండి వస్తుంది తిరస్కారం
అయినా నువ్వంటే మమకారం
ఏమిటో ఎవరికీ అంతుపట్టదు నీ వ్యవహారం
సృష్టించిన బ్రహ్మనీ, జన్మనిచ్చిన వారిని
ఎదిరించేలా చేస్తావు!
ఆకలి, నిద్ర, రంగు, రుచి, రేయి, పగలు, గాలి, వాన
వేటికీ తలవంచవు... మంచిచెడ్డలు ఎంచవు!
సంతోషాన్ని ఇస్తావు సమస్యలను సృష్టిస్తావు!
యుద్ధాలు, మారణహోమాలకు నీవు ఆలవాలం
అయినా నీపై తగ్గదు ఎవరికీ వ్యామోహం!

- కాళ్ల గోవిందరావు,
జె. నాయుడు కాలనీ,
ఆముదాలవలస-532185.
సెల్ : 9550443449.