ఉత్తర తెలంగాణ

పశ్చాత్తాపం ( కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఏమిటే.. కామాక్షి.. బావున్నావా.. ఎన్ని సంవత్సరాలయ్యిందే నిన్ను చూసి. నా కొడుకు పెళ్లికి కూడా రాలేదు.. ఆయనకు పక్షవాతం వచ్చిందట.. నీకూ బాలేదట.. అలా చిక్కి పోయావేమిటే..’ ఫంక్షన్‌లో కలిసిన చెల్లెలి వరసయిన కామాక్షిని పలకరిస్తూ అంది పార్వతి.
‘ఆ.. ఏం చెప్పనక్క.. ఆయనకు మాయదారి పక్షవాతమొచ్చింది. మంచం నుండి లేవట్లేదు. ప్రతి ఒక్కటి మంచంలోనే. ఇక అదంతా నాపైనే పడింది. నాకు మోకాళ్ల నొప్పులు, కూర్చుంటే లేవలేను.. లేస్తే కూర్చోలేను. షుగర్.. బిపి.. అన్నీ ఉన్నాయి. లేచి మంచినీళ్లు తెచ్చుకుందామన్నా వొళ్లు సహకరించదు. ఇద్దరికీ చెరో మంచం.. ఇక ఎక్కడికని వస్తాను.. లేనప్పుడు తినడానికి కష్టమయ్యే.. ఇప్పుడు తినడానికున్నా తినే యోగం లేదాయే.. అయినా మనం తింటే ఎంత.. తినకపోతే ఎంత.. తింటే తిన్నారెందుకనీ అడిగేవాళ్లు లేరు. తినకపోతే తినలేదని అడిగే వాళ్లు లేరు. పానం బాలేకపోతే అయ్యో.. ఏమయ్యింది.. ఎలా వున్నావ్.. అనే దిక్కేలేదు..’ అంది కామాక్షి ఆ మాత్రం ఆప్యాయతకి చలించిన కళ్లలో నీళ్లు తిరిగాయ.
‘దర్పంగా, రాచఠీవి ఒలకబోస్తూ ఖంగుమనే కంఠంతో ఎలా ఉండే దానివి.. ఎలా అయిపోయావే.. అయినా కోడలుందిగా.. నీ దగ్గర ఉండట్లేదా..’
‘ఉంటుంది. ఉంటే ఏం లాభం? కనె్నత్తి చూడదు. పనె్నత్తి పలకరించదు. ప్రేమగా మాట్లాడే వాళ్లే కరువయ్యారనుకో.. మాటలకు మొహం వాచి ఉన్నాం. ఏదో అప్పుడో ఇప్పుడో ఎంత బిజీలోనయినా కొడుకే అలా పలకరిస్తాడు. ఇప్పుడీ ఫంక్షన్‌కి రావడానికి ఒక్కో రోజయినా ఆయనను జాగ్రత్తగా చూసుకోవడానికి ఎంతమందిని బ్రతిమిలాడి వచ్చాను. అయినా కోడళ్ల మీది బ్రతుకు ఇలా కాక ఇంకెలా ఉంటుంది. కోడలా.. కోడలా.. వీపు రాయవే అంటే.. అరికాలితో రాచిందట వెనకటెవతో - అనే సామెత వూరికే వచ్చిందా..’
‘నువ్వు తప్పుగా అనుకుంటున్నావు.. నా కోడలు మాత్రం ఆణిముత్యం. ప్రొద్దున్న లేచినదగ్గర్నుండి గిరగిరా పని చేసుకు వెళుతుంది. అంత కష్టమెందుకు.. పని మనిషిని పెట్టుకుందామన్నా వినదు. ‘నీకు తెలీదత్తయ్యా.. సమయానికి రారు. మనలా చేయరు’ అంటుంది. నాకు సరిగ్గా వేళకి అన్నీ అందిస్తుంది. వేళ ప్రకారం మాత్రలు తెచ్చిస్తుంది. కొంచెం ఆరోగ్యం తేడాగా ఉన్నా నా మాట వినక డాక్టర్ దగ్గరకు తీసుకెళుతుంది. నాకేమిష్టమో అడిగి మరీ చేస్తుంది. ఎందుకే ఇంత ప్రేమ అంటే - మీలో మా అమ్మను చూసుకుంటానంటుంది. నా కిష్టమైన రామాయణ, మహాభారతాలు చదివి వినిపిస్తుంది. గుడికి తీస్కెలుతుంది. పూరెళితే మా ఆయన కాళ్లకి, నా కాళ్లకి దండం పెట్టనిది పోదు. ఎందుకే ప్రతిసారి అంటే, మన పిల్లలు మనల్ని చూసే అన్నీ నేర్చుకుంటారు. పెద్దవాళ్ల దీవెనలు ఎంత మంచివో.. వాళ్లనెలా గౌరవించాలో తెలుసుకుంటారు. మన సంప్రదాయాలు పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనదే అంటుంది. ఏ నిర్ణయమైనా మమ్మల్ని సంప్రదించకుండా తీసుకోదు. అబ్బాయేదయినా బిజీలో విసుక్కున్నా కోప్పడుతుంది. ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో..’ సంతోషంగా అంది పార్వతి.
‘ఎంత అదృష్టవంతురాలివక్కా.. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నావో..’ అంటుండగానే ‘అత్తయ్యా.. రెండయ్యింది. ఇదిగోండి మీరేసుకోవాల్సిన మాత్ర. ఇది వేసుకుని జీడిపప్పు, వక్కపొడి వేసుకోండి.. చేదు తెలీదు..’ అంటూ కుందనపు బొమ్మలాంటి అమ్మాయి చేతిలోనివి ఇస్తూ మంచినీళ్ల గ్లాసు చేతిలో పెట్టింది. ‘అదిగో నే చెప్పలా.. నా కోడలు లక్ష్మి.. లక్ష్మీ ఈవిడ మా చిన్నమ్మ కూతురు.. నా చెల్లెలు కామాక్షి’.. అంటూ పరస్పర పరిచయం చేసింది పార్వతి.
‘నమస్కారమత్తయ్యా’ ఆ అమ్మాయి వినయంగా చేతులు జోడించింది. ఆమెను చూడగానే నిశే్చష్టురాలైంది కామాక్షి. ఆమె ముందు గతం చక్రంలా తిరిగింది.
‘అమ్మా.. ఈ అమ్మాయి నా క్లాస్‌మేట్. చక్కని చుక్క. మంచి వినయవిధేయతలు గల అమ్మాయి. మన సంస్కృతి సంప్రదాయాలు బాగా తెలుసు.. కానీ పేదవాళ్లు. కట్నం ఎక్కువ ఇచ్చుకోలేరు. కానీ నాకు బాగా నచ్చింది. మన కులమే.. నువ్వు తెచ్చిన సంబంధం వద్దమ్మా.. ఈమెనే చేసుకుంటాను..’ కొడుకు చేతిలోని అమ్మాయి ఫోటో చూపిస్తూ అన్నాడు.
‘ఏంట్రా.. నీకేమయినా బుద్ధుందా.. ఇక్కడ ఈ అమ్మాయి వాళ్లు కోటీశ్వరులు... ఒక్కతే అమ్మాయి.. జీవితాంతం కాలు మీద కాలేసుకు బ్రతకొచ్చు.. ఆమెను చేసుకుంటే ఏముంది బూడిద. జీవితాంతం ఇక అత్తగారింటి మీద ఆశే ఉండదు.. నేను చెప్పినట్లు ఈమెను చేసుకోకపోతే నేను చచ్చినంత ఒట్టే’ హూంకరించింది కామాక్షి.
‘ఏమిటే.. నే చెప్పినట్లు చక్కగా లేదూ..’ పార్వతి మాటలతో ఇహలోకంలోకొస్తూ చాలా బావుందక్కా.. చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా’ అని వూరకే అన్నారా.. అదృష్టవంతురాలివి‘ చేజేతులారా చేసుకున్నదానికి పశ్చాత్తాపపడుతూ అంది కామాక్షి. ఆ రోజు తానా అమ్మాయిని కట్నానికి ఆశపడకుండా చేసుకుంటే ఇప్పుడా అదృష్టవంతురాలు తానే అయ్యేది. నిజంగానే ఆ డబ్బు తానేమైనా చచ్చేప్పుడు వెంట తీసుకెళుతుందా.. అనుకుని నిట్టూర్చింది. కొడుకు చూపించిన ఫోటో లక్ష్మిదేనని వేరే చెప్పక్కర్లేదనుకుంటాను.
- నామని సుజనాదేవి
వరంగల్, సెల్.నం.7799305575
***

మనోగీతికలు

‘సెల్’ సిత్రాలు

సెల్లుఫోను ముచ్చట్లు బహు చిత్రమైనవి
చిన్నగా, సిల్లీగా కనిపించినా
స్లోలీగా జీవితాలను ఆక్రమిస్తోంది
ఏ బుక్కూ చదవని వారిచేత
ఫేసుబుక్కు చదివిస్తున్నది
మేకప్పు లేనివారి చేత
వాట్సప్పు అనిపిస్తున్నది
గులుగులు లేనివానికి
గూగుల్ చేపిస్తున్నది
మేలు బండి తెలువని వాడికి
మెయిల్ పంపడం నేర్పిస్తున్నది
లాగులేసుకునే వానికి
డేటా ఆఫర్లు అందిస్తున్నది
ముసలోల్ల ముచ్చట్లకు దూరం చేసి
బ్రతుకులను బ్లాక్‌మెయిల్ చేస్తూ
మెసేజీలయ్యి తైతక్కలాడుతున్నది
పదిమందిలో ఒంటరిగా నిలబెడుతున్నది
పక్కలో నల్లి అయ్యి నిద్రకు అడ్డవుతున్నది
మగవారికి రెండో భార్య
ఆడవారి పాలిట పోరవుతున్నది
ఎన్నని చెప్పను... సెల్‌ఫోన్ చిత్రాలు

- సూరం అనిల్, వరంగల్, 9059457045

మాతృ నివేదన

పచ్చని చెట్లను నరికి తెచ్చి
పొయ్యంటు పెట్టిన కొడుకా నీ ఆకలి తీర్చాలని
ఆ చెట్ల శాపం కొట్టినేమో
నీకు నా ఆకలి ద్యాసే లేకుండ పోయే!
ఇరుగు పొరుగు వాళ్లు ఆకలితో
అలమటించంగ కూడా ఒక్క ముద్దయినా
దానం జెయ్యక నీకైదాచి పెడితి కొడుకా...
వాల్లగోసగొట్టనేమో
నా సొమ్ము నాకు పెట్టి నీ చేతులెట్ల రాకపాయె
మా పెద్దోళ్లకు రోగమస్తే నీకేడ తలుగుతదోనని
వాళ్లను అరుగంచు తొక్కనీయలే కొడుకా
వాళ్ల ఏడుపు తాకెనేమో లంకంత నీ
ఇంట్ల నున్నటి బండలమీద నడువరాదని
నన్ను అద్దె కొంపల పాలుజేస్తివి!
ఆవు పాలు పితకంగ కొడుకా
దూడ యాదికొచ్చి దాన్ని పాలకొదిలిన
ఆ పుణ్యం పనికొచ్చెనేమో కొడుకా
నా మనమడు నాకు సద్దితెచ్చి ఇచ్చే కొడుకా!
ఎవరికి తెలువకుండా పెడుతడు కొడుకా
తల్లి దీవెనలను అందుకొని కొడుకా
పచ్చని చెట్లను పదిలంగ పెంచు కొడుకా
నే జేసిన తప్పులు నీవుచేయకు కొడుకా!
నా కొచ్చిన కష్టాలు నీకద్దు కొడుకా!
- బి.హరిప్రియా గిరిధర్ రావు
కరీంనగర్, సెల్.నం.9133293384

ఓ రోజా పువ్వా!

ఎంచక్కా ముళ్ల మధ్య
కొలువు దీరిన..
ఓ రోజా పువ్వా!
నీ సొగసు సుందరం!
నీ హొయలు..
అందరికీ పంచుతుంది ఆనందం!
నువ్వు..
ప్రకృతి ప్రసాదించిన జ్ఞాపికవు!
హరివిల్లులోని..
వర్ణాలకు ప్రతీకవు!
- కూర్మాచలం వేంకటేశ్వర్లు
కరీంనగర్, సెల్.నం.7702261031

నీటితోనే!

సకల ప్రాణికోటికి
జీవాదారం నీరు!
నీటితోనే
పుడమితల్లి పులకరింత!
నీటికోసమే..
రైతన్నలు సదా కలవరింత!
ప్రకృతి అందాలకు
రంగులద్దేది నీరే!
సుమాలు..
సుమ గంధాలు వెదజల్లాలంటే..
నీరే మూలాధారం!
నీటితోనే..
మన జీవితాల్లో పన్నీరు!
నీరే లేకుంటే..
ఇక మనకు మిగులుతుంది కన్నీరు!
అందుకే..మిత్రమా!
పసిడి లాంటి ప్రతి నీటి చుక్కను
ఎంచక్కా..ఒడిసిపడదాం!
ఇంటింటా.. ఇంకుడు గుంతలకు
శ్రీకారం చుడదాం!
- ఉట్ల స్వామి, ఆదిలాబాద్
సెల్.నం.9603425710

నా ఆలోచనలకు..

కవయిత్రిగా..
నా ఆలోచనలకు
అక్షర తిలకాన్నద్ది..
సుందర కవితకు ఆకృతినిస్తా!
న అంతరంగ తరంగాలకు
భావుకతను జోడించి..
అందమైన గీతికకు ప్రాణం పోస్తా!
నా హృదయ స్పందనలను
భావోద్వేగంతో
కలంలోకి ఒంపి..
సామాజిక చైతన్యానికి పాటుపడుతా!
నా మనసులో కదలాడే
మంచి భావాలకు
ప్రతీకాత్మక వర్ణనలు జోడించి..
కవితా ప్రతిమలుగా తీర్చిదిద్దుతా!
ప్రకృతి రమణీయతను
అక్షరాల్లో బంధించి..
అందరికీ ఇట్టే అందిస్తా!
- హనుమాండ్ల రమాదేవి, బెల్లంపల్లి, ఆదిలాబాద్ జిల్లా, సెల్.నం.9959835745

చెరువు

నువ్వే పల్లెకు.. ప్రాణదాతవి!
పచ్చదనానికి జీవ నాదానివి!
సకల జీవులకు..
జవ సత్వాలనిచ్చే ఊపిరివి!
మా బతుకు భరోసాల సిరిముల్లెవి!
నిన్ను చూసి..
మేము రేపటి బువ్వ గురించి కలగనే వాళ్లం!
నీ అండతోనే..
గాదెల్ని నిండుగా సింగారించుకునే వాళ్లం
నీ ఆలంబనతోనే..
లేగ దూడలు గంతులేస్తుంటే..
మా రెండు కళ్లు సరిపోయేవి కావు!
నీ గలగలా నవ్వులకు..
నీ రాగాల సవ్వడులకు..
కరువు కనుమరుగయ్యేలా పరుగులు తీసేది!
గట్టుమీద నిల్చుండి..
నీ డాబు, దర్పం వీక్షిస్తుంటే..
ఆకలి దుఃఖం అన్నీ మరిచేవాళ్లం!
ఇప్పుడు నీ ఎండిన కడుపును,
మండుతున్న గాయాల్ని చూస్తుంటే..
గుండె తరుక్కుపోతోంది!
మూతబడ్డ నీ కళ్లను వీక్షిస్తుంటే
నోట మాట రాక తడబడుతోంది!
- డాక్టర్ ఉదారి నారాయణ
ఆదిలాబాద్, సెల్.నం.9441413666

రక్షాబంధాలు

పుడమికి అందం పచ్చని వృక్షం
చెట్లకు బంధం చక్కని పుష్పం
చెట్లే జగతికి జీవాధారం
చెట్లే ప్రతివారికి ప్రాణాధారం
ఆహారాన్నందించే అన్నపూర్ణలు
నీడనిచ్చే ఆత్మీయులు
వర్షాన్ని మోసుకువచ్చే వాహకులు
కాలుష్యాన్ని నివారించే డాక్టర్లు
పరుల కోసం బ్రతుకుతున్న శ్రామికులు
పర్యావరణాన్ని కాపాడుతున్న రక్షకులు
అడగనిదే పెట్టదు అమ్మ
అడగకపోయినా ఇస్తున్నాయి కొమ్మా రెమ్మా
మనకంటే చెట్లెంతో మిన్న
వృక్షాలు మనకు నరాలు
నిత్యరక్షా బంధాలు
చెట్లు నరికితే తప్పని చెప్పు
లేదా మానవాళికే తప్పదు ముప్పు
- కామిడి సతీష్ రెడ్డి
పరకాల, వరంగల్ జిల్లా
అప్రమేయ చిత్రం
తన ప్రమేయం లేకున్నా
విధి ఆడే నాటకంలో
మనిషి నటించవలసిందే!
నటనలో సాఫల్యాలూ, వైఫల్యాలూ
నటుని ఆధీనంలో ఉండవు!
సూత్రధారుడు చెప్పినట్లు
పాత్రధారుడు చేస్తూనే ఉంటాడు!
దేనికీ విరోధించలేని
బలహీనుడు మనిషి నటుడు!
ఇదే జీవనచలన చిత్రం!
హృదయ వినోద విషాదాలకు పాత్రం!!
డాక్టర్ ఆయాచితం నటేశ్వర శర్మ
కామారెడ్డి, సెల్.నం.9440468557
****

కొత్త పుస్తకం

అలతి అలతి పదాల్లో ‘్భవతరంగాలు’!

సాహితీవనంలోకి చిగురాకులా వచ్చి, మ్రానులా ఎదిగే కవి గంప ఉమాపతి. ఆయన వ్రాసిన తొలికావ్యం ‘్భవతరంగాలు’లో వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన అంశాలు, కుటుంబం పట్ల అవగాహన, సామాజిక స్పృహ కనిపిస్తాయి.
శారీరక శ్రమ చేయకుండా కాలాన్ని వృధాచేసే సోమరిపోతులకు ప్రపంచంలో కొదువలేదని, ఈ ప్రబుద్ధులు తమ బుద్ధి మార్చుకోవాలని ఉమాపతి ఆశిస్తాడు. మేధకు పదునుపెట్టి మధిస్తే ఆణిముత్యాలు వస్తాయని, మనిషి మూడవకన్ను (జ్ఞాననేత్రం) తెరిస్తే జీవితమనే పుస్తకంలో అన్ని పేజీలు అద్భుతమైనవేనని, ఎవరిముందూ తలవంచకుండా ఉండాలంటే వ్యక్తిత్వం కంచుకోటలా ఉండాలని, జయాపజయాల్ని సమంగా స్వీకరించే స్థితప్రజ్ఞత రావాలని, వేసే తొలి అడుగే అందరికీ ఆదర్శం కావాలని ఉద్బోధిస్తాడు.
‘ఒక సూర్యోదయం
ఓ కొత్త రోజుకు ఆహ్వానం పలికినట్లు
ఒక కొత్త ఆలోచన
ప్రగతి మార్గంలో పయనిస్తే
మనలో నూతనోత్సాహం నిండదా’
‘నా నుండి మనం అన్న ఆలోచన
అంతరంగంలో అంకురించేదాకా
మార్పుకు మార్గం సుగమం కాదు’
వంటి పంక్తులు వ్యక్తిత్వ వికాసానికి సోపానాలు.
‘పరస్పర విశ్వాసమే ఆలంబనగా
ఆత్మవిశ్వాసమే ఆయుధంగా’ జీవిస్తే, ఆలుమగల జీవితం నందనవనవౌతుంటాడు. మన పెద్దలు మనకు వారి జీవితాల్ని పంచారని, వారిని చూడవలసిన బాధ్యత మనదేనని గుర్తుచేస్తాడు. ప్రమాదకరమైన పోకడలలో చిక్కుకోవద్దని, నేటి యువత అప్రమత్తంగా లేకపోతే మిడతల్లా కాలిపోక తప్పదని హెచ్చరిస్తాడు.
తనకు కలత కలిగించే సంఘటనలు ఎన్ని ఎదురైనా, కవి ఉమాపతి సమాజం పట్ల ద్వేషం పెంచుకోడు.
‘ఆశావహ దృక్పథంతో అడుగులేస్తూ
విజయం వరిస్తుందన్న విశ్వాసంతో
ముందుకు సాగాలి’ అని సందేశం ఇస్తాడు.
ధరామండలం దగ్ధం కాకముందే కాలుష్య సమస్యకు, ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతుల సమస్యలకు మూలాలు వెతకాలని, బడ్జెట్ లెక్కలు బాహ్య సౌకర్యాలపై కాకుండా జీవన ప్రమాణాల గురించి చేస్తే పేదల బతుకులు బాగుపడతాయని సూచించడం బాగుంది.
బతుకు బండిని లాగలేక శ్రామికుని ఊపిరి ఆగిపోతే
‘కాల్చడానికి కట్టెలవసరం లేదు
ఆవేదనల నిట్టూర్పులు చాలు’
అని దైన్యపు తీవ్రతను వర్ణించడం ఉమాపతికే చెల్లింది. మనసు గురించి రాస్తూ..
‘మనసు ఊహలకు పుట్టిల్లు
ఆశలకు మెట్టిల్లు / అందినట్టే అంది
అందకుండా పోతుంది
ప్రేమతోనే దాన్ని బంధించగలం’
తొలికావ్యంలోనే తన భావాలను చిన్న చిన్న పదాలలో అందంగా అభివ్యక్తీకరించిన గంప ఉమాపతి అభినందనీయుడు.
- ఎ.గజేందర్ రెడ్డి కరీంనగర్, సెల్.నం.9848894086
***

పుస్తక సమీక్ష

విలక్షణంగా రూపుదిద్దుకున్న..
‘చామర్తి’ వ్యాసాలు!

పేజీలు: 124, వెల: 100/-
ప్రతులకు: చామర్తి అరుణ,
2-2-143/2ఏ, భద్రకాళీ టవర్స్
నరుూంనగర్, హనుమకొండ,
వరంగల్ జిల్లా
సెల్.నం.9000683826

చిన్ననాటి నుంచే సాహిత్య వాతావరణంలో పెరిగిన శ్రీమతి చామర్తి అరుణ గారు తెలుగు భాష పట్ల వున్న మక్కువతో..ఎంఏ (తెలుగు) పూర్తి చేయాలన్న సంకల్పంతో సాహితీ వ్యాస సృజనకు శ్రీకారం చుట్టారు. ‘లహరి’ పేరుతో ఓ వ్యాస సంపుటిని వెలువరించారు. విలక్షణంగా, వినూత్నంగా వ్యాసాలు రాయాలని ఆరాటపడే అరుణ గారు ఈ గ్రంథంలో పొందుపరిచిన రచనలన్నీ సాహితీ ప్రియులను అలరించేలా వున్నాయి. సాహిత్య పరిశోధకులకు కావలసినంత సమాచారం దొరికేలా కొంత మంది సాహితీ ప్రతిభామూర్తుల జీవన రేఖలను ఇతర సాహితీ సంబంధ వ్యాసాలను చక్కగా ఆవిష్కరించారు. ఈ గ్రంథంలోని 27 వ్యాసాలు ఆమె సృజనాత్మక ప్రతిభను ప్రతిబింబించేలా రూపుదిద్దుకున్నాయి! భావ కవితా రామంలో మలయమారుతం కృష్ణశాస్ర్తీ అంటూ వ్రాసిన వ్యాసంలో..్భవ కవిత్వానికి కృష్ణశాస్ర్తీ ఆద్యులని పేర్కొన్నారు. సినీ కవిగా ఆయన రాసిన పాటలు నాడు, నేడు, రేపు, ఎప్పటికీ మనల్ని పరవశింపజేస్తాయని చెప్పారు. శ్రీశ్రీ గురించి రాసిన వ్యాసంలో శ్రీశ్రీ ప్రస్థానం కేవలం స్వాప్నిక దశలోనే ముగియలేదనీ.. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలని అనుసరిస్తూ ఎప్పటికప్పుడు తన మార్గమేమిటో నిర్ధేశించుకుంటూ ఎదిగాడని కొనియాడారు. ఇంకో వ్యాసంలో..గిడుగు రామమూర్తి పంతులు గారు వ్యవహార భాషావాది మాత్రమే కాదు..సవర భాషకు ఎనలేని కృషి చేశారనీ, కావ్య భాషకు, వర్తమాన భాషకూ మధ్యనున్న అంతరాన్ని తగ్గించారని పేర్కొన్నారు. కవి కోకిలగా దువ్వూరి రామిరెడ్డిని అభివర్ణించారు. విశ్వనాథ సత్యనారాయణపై రాసిన వ్యాసంలో..విశ్వనాథ వారు తన రచనల్లో ప్రదర్శించిన జీవిత దృక్పథానికి మూలం, చాతుర్వర్ణ దృక్పథం, ఆచరణకు నోచుకోని కొన్ని ఆచారాలు, విశ్వాసాలకు తర్కగుణాహితంగా నిరూపించాలని చూశాడని వివరించారు. భావకవి శ్రీ రాయప్రోలు సుబ్బారావు శీర్షికతో రాసిన వ్యాసంలో అరుణ గారు. రాయప్రోలు వారి రచనా వైచిత్రిని విశే్లషించారు. నండూరి సుబ్బారావును వినూత్న కవిగా పరిచయం చేస్తూ రాసిన వ్యాసంలో రచయిత్రి అరుణ గారు నండూరి వారు ఆనాటి కాలంలో సాహసంతో జానపద శైలికి, జానపద నాయికకు కావ్య గౌరవాన్ని కల్పించిన మహానీయుడని వర్ణించారు. జానపదుల మాకోరాధన - ఒక పరిశీలన వ్యాసం విజ్ఞానదాయకంగా ఉంది. ‘జాంబ పురాణం - డక్కలి ప్రాశస్త్యం’ పేరుతో అరుణ గారు ఓ వ్యాసాన్ని రాశారు. వీరి కథలు అగ్రవర్ణాల వారిని ధిక్కరించినట్లు అనిపించినా..అందులో గాఢమైన పురాణ సంప్రదాయ ప్రియత్వం, ఆత్మగౌరవాన్ని మనం గుర్తించాలని పిలుపునిచ్చారు. ‘వరంగల్ జానపద గాయక భిక్షకుల కథలు’ పేరుతో రాసిన వ్యాసంలో..జానపద గాయక భిక్షకులను సాహిత్య సంరక్షకులుగా మన ముందు నిలిపారు. మల్హర విజయం - పెఱిక వారి ప్రస్థావన, కులోద్భవం శీర్షికతో రాసిన వ్యాసంలోని అంశాలు పరిశోధనాత్మకంగా వున్నాయి! ‘జానపద కళ - యక్షగానం’ వ్యాసంలో..జానపద కళను ప్రదర్శించే యక్షగాన కళాకారులు పాటించే నిష్టను కొనియాడారు. దాశరథి కృష్ణమా చార్యులు గారిని శాంతి విప్లవ వాదిగా అభివర్ణించారు. ‘గ్రామ దేవత ఎల్లమ్మ జమదగ్ని భార్య రేణుక ఒకరేనా?’ వ్యాసం ఆలోచనాత్మకంగా ఉంది. అవధాన ప్రక్రియలో చెళ్లపిల్ల దివాకర్ల వార పాత్రను ఒక వ్యాసంలో అరుణ గారు చక్కగా ఆవిష్కరించారు. రాళ్లబండి కవితా ప్రసాద్ గారిని అష్ట, ద్విశత అవధానిగా తమ వ్యాసం ద్వారా పరిచయం చేశారు. బమ్మెర పోతనను సహజ కవి పండితునిగా పేర్కొన్నారు. ‘అభివృద్ధికి నోచుకోని గిరిజన తెగ - చెంచులు’ పేరుతో రాసిన వ్యాసంలో వారి వ్యధలకు అద్దం పట్టారు. వచన కవితా పితామహుడిగా కుందుర్తిని అభివర్ణించారు. శేషేంద్ర శర్మ గారిని వచన శిల్పిగా మన ముందు నిలిపారు.
కొర్రాజుల పుట్టుక - జీవన విధానాన్ని పద్మనాయక వృత్తాంతం మరో వ్యాసంలో పొందుపరిచారు.
ఇలా.. సాహితీ దిగ్గజాలతో పాటు.. సాహితీ సంబంధ అంశాలతో వ్యాసాలను పాఠకలోకానికి అందించిన చామర్తి అరుణ గారిని అభినందిద్దాం. మున్ముందు మరిన్ని మంచి రచనలు ఆమె కలం నుండి జాలువారాలని కోరుకుందాం!

- సాన్వి, కరీంనగర్, సెల్.నం. 9440525544
***
ఈ శీర్షికకు కవితలు, కథలు, సాహితీ వ్యాసాలు, కొత్త పుస్తకాల సమీక్ష/పరిచయం, కార్టూన్లు ఈ క్రింది చిరునామాకు లేదా ఈ-మెయల్‌కు పంపండి.
మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, ఎస్.ఎస్.గుట్ట, ప్రభుత్వ ఆసుపత్రి వెనుక, మహబూబ్‌నగర్ - 509 001. merupumbn@andhrabhoomi.net