రాజమండ్రి

తెలుసా మనసా... (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లహరి ఆ రోజు హడావిడిగా బయలుదేరింది. తనకు పెళ్లిచూపులు. ఏంటో ఒక్క సంబంధం కుదిరి చావడంలేదు. ప్రతిసారి స్వీట్స్‌కి, పూలకి, మ్యారేజ్ బ్యూరో వాళ్లకి ఈ ఖర్చులన్నీ పెట్టలేక ఛస్తుంది తను. అవును మధ్య తరగతి వాళ్లు చూడటానికి రిచ్‌గా ఉండేలా కనిపిస్తూ ఉంటారు. ఆ రోజు ఆఫీసుకు రావడానికి కూడా ఛార్జీల వరకే ఉంచుకుని వచ్చేవాళ్లు ఎంతమందో. ఒక్కోసారి ఛార్జీలు కూడా పక్కింటి వాళ్లని అడగవలసి వస్తుంది. ఈ రోజు పెళ్లికొడుకు ఏమంటాడో ఏంటో. తను బాగోదు అంటే - అదేంలేదు చక్కగా ఎంఎస్‌సి కంప్యూటర్స్ చేసింది. కాని చామనఛాయ కనుముక్కు తీరు బాగుంది. కానీ కట్నం కావాలట. లేదా ఈ మధ్య కట్నం అనకుండా గోల్డ్ పెట్టమంటున్నారు. గోల్డ్ కూడా చేయించింది తను. ఏమో ఏమంటాడో. ఎవడో ఒకడితో తాళి కట్టించుకుంటే పోలా... నచ్చాలి అనే కానె్సప్ట్ ఎప్పుడోపోయింది. రెడీ అయ్యి వచ్చింది.
‘ఏం చదువుతున్నారు?’ అని అడుగుతారేమో! ప్రశ్నలకు సిద్ధమవుతూ ఉంది.
‘ఏమైనా మాట్లాడుకుంటారా!’ లహరి నాన్నగారు పెళ్లికొడుకు అనుదీప్‌ని అడిగారు.
‘అవునండీ!..’ అని చెప్పగానే ఇద్దరూ వరండాలోకి వెళ్లారు.
‘నేను మీకు నచ్చానా’ అనుదీప్ అన్నాడు.
లహరి బిత్తరపోయింది. ఇంతవరకూ ఎవ్వరూ ఇలా అడగలేదు. ‘ఆ! అహహ!’ అంది ఏం చెప్పాలో తెలియక.
‘ఏం ఫరవాలేదు. నచ్చినా నచ్చకపోయినా నా భావాలు మీకు చెబుతాను’
‘మీరు ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే నా బాధ్యతలు కొన్ని పంచుకోవడానికి కాదు. మీరు ఎదగడానికి’
‘నేను ఎదిగిన తరువాత ఏం చేయాలి’ ఆమెకు ధైర్యం వచ్చేసింది. ఇతను తన అవసరాలను వాడుకోవడానికి అందంగా ముసుగేస్తున్నాడనిపించింది.
‘మీరు పి.జిలో గోల్డ్‌మెడలిస్ట్ అని విన్నాను. మీరు పిహెచ్‌డి చేయాలి. అవి చేయడానికి నా దగ్గర కొంత ఎవౌంట్ ఉంది. మీరు కూడా సంపాదిస్తే ఆ పర్పస్‌కి వాడవచ్చు. అవన్నీ బ్యాంకులో సేవ్ చేయవచ్చు. ఐ మీన్ ఈ సంబంధం సెటిల్ అయితేనే.
ఇకపోతే నాకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. నేను ఇద్దరు అనాథలను దత్తత తీసుకున్నాను. వాళ్లు సెటిల్ అయ్యే వరకూ ఎంతోకొంత ఎవౌంట్ పంపించాలి. నాకు ఇల్లు తప్ప ఏమీలేదు.
లహరి... మీకు అభ్యంతరమేం ఉండదుగా’
‘మీరు నాకు నచ్చారు’ అప్రయత్నంగా అనేసింది.
తన ఆలోచనలకు ప్రతిరూపంలా ఉన్నాడు.
ఇది ఎంత బాగుంది. ఏనాటి అనుబంధమో
అసలు నచ్చటం అయిపోయాక మాట్లాడే మాటలు ముందే చెప్పేస్తున్నాడు. కొంపదీసి నేను నచ్చానో ఏమో!
‘నేను మీకు నచ్చానా’ అన్నది నసుగుతూ.
‘మీరు నచ్చనివాళ్లు ఎవరుంటారండి!
‘అదేంటి? నేను 32 మంది పెళ్లికొడుకులకి రకరకాల కారణాల వలన నచ్చలేదు’ తెలుసా అంది.
‘ఎవరైనా మైనస్ పాయింట్స్ చెప్తారా!’
‘చెబితే ఏం ఇది 33వది అవుతుంది, అంతే కదా!’
‘నువ్వసలేం మారలేదు’ అన్నాడు అనుదీప్
‘ఏంటి హఠాత్తుగా ఈ ఏకవచన ప్రయోగం’ గట్టిగానే అంది.
‘లహరి నేను దీపక్’ని థర్డ్ నుండీ సెవెన్త్ వరకూ కలసి చదువుకున్నాం వీరులపాడులో కంచికచర్ల మండలంలో గుర్తుందా.
‘కాదు వీరులపాడే మండలం. కంచికచర్ల తాలూకా’ సరిజేసింది.
‘మరి ఈ అనుదీప్ ఏమిటి?’
యండమూరి నవల చదివి పేరు మార్చేశానులే.
‘ఎప్పుడు?’ ఆసక్తిగా అడిగింది.
‘టెన్త్‌లో - నినే్న నినే్న తలచుకుని నిద్దుర పొద్దులు మేలుకొని, ఎన్నో ఏళ్లు, ఎన్నో నాళ్లు ఉన్నా నువ్వే వస్తావని - అని ప్రేమలేఖ రాశావు గుర్తుందా!
లహరి సిగ్గుపడింది.
‘32మంది పెళ్లికొడుకులకు నేను థ్యాంక్స్ చెప్పాలి’ అనుదీప్ కొంటెగా అన్నాడు.
‘నిజమే సుమీ! ఎవరికీ నేను నచ్చలేదు. లేకుంటే నీ వంటి మంచివాడిని దూరం చేసుకునేదాన్ని’ ఆనందంగా అంది.
ఇంతలో లహరి నాన్న, అనుదీప్ అమ్మగారు వచ్చారు.
‘సరే పిల్లలూ ఏం మాట్లాడుతున్నారు’
‘నాన్నా వీరు నాకు తెలుసు’
‘అన్నీ తెలిసే వచ్చాడమ్మ, కానీ కట్నం కూడా వద్దని. తెలుసుకోవటంలో ఆలస్యం నీదే’ ఆనందంగా అన్నారు.
తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో అని కూనిరాగం తీస్తున్నాడు అనుదీప్.

- బి.హెచ్.వి.రమాదేవి, సెల్: 9441599321
***

మనోగీతికలు

కావ్యం వాణికి కమనీయం
కావ్యం కమ్మనైనది
వాణికి కమనీయమైనది
మనిషి భారాన్ని తీరుస్తుంది
మనసు కలవరాన్ని పంచుకునేది
కలవరాన్ని ‘కళ’వరంగా మార్చేది
‘కళ’వరాన్ని ‘ఇల’వరంగా కావించేది
ఏ మనసు ముంగిటనైన మురిపించేది
మురిపించిన మనస్సు మన్నన అందుకుంటుంది
కావ్యాన్ని భద్రపరిచిన హృదయం పులకిస్తుంది
కావ్యాన్ని విని పులకించిన మది కవి కాగలదు
కవిగా మారిన హృదయం
కావ్యం అనే గమ్యానికై పరుగులు తీస్తుంది
కావ్యం మనస్సులో భావాన్ని
పెదవుల నుండి ముత్యాలుగా రూపం కావించి
అక్షరాల రత్నాల మూటగా మారుతుంది
కావ్యం మనసున విరిసి జిహ్వమున జన్మించి
జన హృదయమున జీవిస్తుంది
కావ్యం కమ్మనైనది.. వాణికి కమనీయమైనది
- ఎ.్భర్గవి

‘నేనెలా బతకను?’

నాకు అమ్మమ్మ లేదు
నానమ్మా లేదు
నేను ఎలా బతకను?
నా చిన్నప్పుడు వాళ్లిద్దరూ వుండేవారట
నాకు ఉగ్గు పట్టడం
కాళ్ల మీద పడుకోబెట్టుకుని
స్నానం చేయించడం
బుగ్గన చుక్కపెట్టి ఆనందించడం
ఇవన్నీ చేసేవారట!

నేను చిన్న మొగ్గగా వున్నప్పుడు
నా లేలేత పాదాల్ని, నా బోసినవ్వుల్ని
ఆస్వాదిస్తూ తెగ ఆనంద పడేవారట!

కాని నాకు ఇపుడు
కొంచెం రెక్కలొచ్చిన తర్వాత
నా ఊహలు అటూ ఇటూ
ఎగురుతున్న వేళ
వాళ్లిద్దరూ మాయమయ్యారు
నేనెలా బతకను?!

అమ్మా నాన్న ఉన్నారుకాని
వాళ్లు నన్ను అర్థం చేసుకోరు
నా మాటసలే వినరు
ఎవరి గోలలో వాళ్లు బిజీ!
ఏమైనా చెప్తే నాకే మొట్టికాయలు
ఈ ప్రపంచం నాకు పెట్టే మొట్టికాయలకు
తాయిలం రాసి మనసును సేదదీర్చే
అమ్మమ్మ నానమ్మ లేకపోతే
నేనెలా బతకను?!

- డా. మోపిదేవి విజయగోపాల్
సెల్: 9490679570

అమ్మ ఒడి

అమ్మ ఒడిలో హాయి ఏదని
అయ్య గుండెను అడిగినపుడు
రగులుతున్న నాన్న మనస్సు
సెగలు కమ్మి బదులు పలికే

దైవానికి దయలేదని
అమ్మ ధరికి రాలేదని
నిప్పులాండి నిజం నెరిగి
నిలువెల్ల కుమిలిపోయా

అమ్మ ఒడిలో హాయి ఏదని
అయ్య గుండెను అడిగినపుడు
రగులుతున్న నాన్న మనస్సు
సెగలు కమ్మి బదులు పలికే

అమ్మ మనలో దాగుందని
ఆ మాటెవరికి చెప్పొద్దని
చల్లనయిన కబురు తెలిసి
సేదతీరి తేరుకున్నా

అమ్మ ఒడిలో హాయి ఏదని
అయ్య గుండెను అడిగినపుడు
రగులుతున్న నాన్న మనస్సు
సెగలు కమ్మి బదులు పలికే

గుండెలోనే గుడి వుందని
ఆ గుడిలోనే అమ్ముందని
గుట్టుచప్పుడు కాకుండా
గడియ తీసి చూడాలని

అమ్మ ఒడిలో హాయి ఏదని
అయ్య గుండెను అడిగినపుడు
రగులుతున్న నాన్న మనస్సు
సెగలు కమ్మి బదులు పలికే

కంటి పాపలో అమ్మను
కలకాలం నిలపాలని
కాలమెంత కఠినమైనా
కాపాడుతూ ఉండాలని

అమ్మ ఒడిలో హాయి ఏదని
అయ్య గుండెను అడిగినపుడు
రగులుతున్న నాన్న మనస్సు
సెగలు కమ్మి బదులు పలికే
- కోన బాబూరావు
సెల్: 9603880783
***

సంస్కృతి

పుష్కర స్నానం... అనంత పుణ్యఫలం (సంస్కృతి)

మానవ నాగరికత, సంస్కృతి అభివృద్ధి చెందుతూ వచ్చింది నదీ తీరాల్లోనే. అందుకే మనకున్న ముఖ్యమైన 12 నదులకు ఒక్కో సంవత్సరం ఒక్కో నదికి పుష్కరం వస్తుంది. గత సంవత్సరం గోదావరి నది పుష్కరాలు జరిగితే, ఈ ఏడాది కృష్ణానదికి పుష్కరాలొచ్చాయి. కృష్ణా పుష్కరాలకు ఓ ప్రత్యేకత ఉంది. అది ఏమంటే?.. మనం ప్రతి నిత్యం స్నానం చేసేటప్పుడు చెప్పుకునే శ్లోకంలో ‘గంగేచ యమునేచైవ’ పఠిస్తాం. అయితే ఈ శ్లోకంలో ఎక్కడా కృష్ణవేణి పేరు లేదు. అయినా మనం కృష్ణానదికి పుష్కరాలు నిర్వహిస్తాం. శ్లోకంలో పేరు లేనంతమాత్రాన ఆ నది గొప్పది కాదని భావించక్కర్లేదు. దేశంలోని అతిపెద్ద రెండో పొడవైన నది కృష్ణానది.
మహారాష్టల్రోని పడమటి కనుమల్లో సముద్ర మట్టం నుండి సుమారు 4385 అడుగుల ఎత్తులో పుట్టి మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పారే కృష్ణానది సుమారు 1400 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. లక్షలాది వ్యవసాయ క్షేత్రాలకు, కోట్లాది జంతు జలాలకు ప్రాణాధారమైన జలాలు అందిస్తూ బంగాళాఖాతంలో కలుస్తుంది. కృష్ణానది సతారా జిల్లాలోని మహాబలేశ్వరంలో జన్మించింది. ఈ నదితో పాటు వేణా, కుకుద్మతి, సావిత్రి, గాయిత్రి అనే నాలుగు నదులు కూడా పారుతున్నాయి. ఈ అయిదు నదులను ‘పంచగంగలు’ అంటారు.
కృష్ణానది అతి పురాతనమైనది. అనాది కాలం నుండి ప్రవహిస్తోందనటానికి అనేక ఆనవాళ్లున్నాయి. అందుకు మనకు బౌద్ధ జాతక కథల్లో ఉదాహరణలు లభిస్తాయి. కృష్ణానదీ తీరంలోని అమరావతి, నాగార్జునకొండ వంటి బౌద్ధ క్షేత్రాలు క్రీస్తు శకారంభంలో, దానికి పూర్వ కాలంలోనూ చాలా ప్రసిద్ధమైనవి. బౌద్ధ జాతక కథల్లో కృష్ణానదిని ‘కన్నా-వెన్నా’ అని ప్రస్థావించారు. కన్నడ శాసనాల్లో హిరె హొళె (పెద్ద ఏరు), పెర్దొరె (పెద్ద ప్రవాహం), కృష్ణవేణ్నా, కృష్ణవేణి అనే పేర్లతో వ్యవహరించారు. దీని ప్రకారం చూస్తే కృష్ణవేణిలో కృష్ణ వేరు, వేణి వేరునా? అనే ప్రశ్న ఉదయిస్తుంది. అసలు ఈ నదికి కృష్ణా అనే పేరెందుకు వచ్చింది?. మనకు స్కాంద పురాణంలో, మహాబలేశ్వర పురాణంలోనూ దీనికి సమాధానం లభిస్తుంది.
కలియుగంలో అధర్మం పెరిగినప్పుడు ఋషులు బాధలు తట్టుకోలేక తమ కష్టాలను నారదమునీంద్రునితో మొరపెట్టుకున్నారు. నారదుడు తన తండ్రి అయిన బ్రహ్మను ఆశ్రయించాడు. అప్పుడు బ్రహ్మ ఎన్నో తీర్థాలను సృష్టించాడు. నారదుడు మళ్లీ నారాయణుని ప్రార్థించినప్పుడు నారాయణుని శరీరం నుండి ఓ నది పుట్టింది. అదే కృష్ణానది అయింది. మనకు లభించిన పురాతన శాసనాలను పరిశీలిస్తే కృష్ణానదిని కన్న-పెన్నా, కృష్ణా-వెంణా అని పిలవటం గమనించవచ్చు. దీంతో మనకు కృష్ణే గాని కృష్ణవేణి కాదు. మహారాష్టన్రు వదిలి కర్నాటకలో ప్రవేశించిన తరువాత అది ‘కృష్ణవేణి’ అయింది. అంతవరకు అది కృష్ణ మాత్రమే! ఒక నదిలో మరో నది సంగమించటం వల్ల ఆ నదికి మరొక నది పేరు కూడా కలుస్తుంది. ఉదాహరణకు తుంగ, భద్ర నదులు వేరువేరుగా పుట్టి తరువాత కలిసి ప్రవహిస్తున్నాయి. అలా నదుల కలయికలలో ఏది ప్రధానమైనదో దాని పేరు మొదట వస్తుంది. రెండోది తరువాత చేర్చబడుతుంది. తుంగా, భద్రా నదుల్లో ప్రధానమైనది తుంగా నది, భద్రా నది చిన్నది. అందువల్ల కలిశాక అది తుంగభద్ర అయింది. అలాగే ఇక్కడ కృష్ణ ప్రధానమైనది, దానిలో కలిసే పెన్నా చిన్నది. అది కృష్ణలో కలిసిన తరువాత తన పేరును కోల్పోయి కృష్ణా-పెన్నా రెండు కలిసి కృష్ణవేణి అయింది. కాలక్రమంలో కృష్ణవెన్నా కృష్ణవేణిగా మారి ఉంటుంది. ఇదే నేడు కృష్ణవేణిగా వ్యవహారంలో వుంది. ఇదీ కృష్ణానది పుట్టుక కథ.
కృష్ణానదిలో కలిసే ఉప నదుల్లో కర్నాటకలో మొదట కలిసేది దూదగంగ, తరువాత ఆగరణి, మలప్రభ, ఘటప్రభ నదులు కలుస్తాయి. మలప్రభ, ఘటప్రభ కూడా సహ్యాద్రిలో పుట్టినవే. ఘటప్రభ బిజాపురం బీళగి వద్ద కృష్ణలో కలుస్తుంది. అక్కడ నుండి ముందుకు సాగే కృష్ణ హునుగుంద తాలూకా కూడల సంగమంలో మలప్రభను కలుస్తుంది. ఇలా అనేక ఉప నదులు కృష్ణలో కలవటం విశేషం.
కృష్ణానది పుష్కర మహత్మ్యం
‘కలియుగంలో మానవులు తరించే మార్గం తెలుపమని విష్ణువును బ్రహ్మ కోరగా విష్ణువు తన అంశ వలన కృష్ణని అవతరింపజేసెను. ఆమె రూపలావణ్యాది విశేషములు చూసి బ్రహ్మ ఆశ్చర్యం పొంది తనకు పుత్రికగా ఇవ్వమని కోరగా విష్ణువు కృష్ణను బ్రహ్మకు ఇచ్చెను. అప్పటి నుండి కృష్ణ బ్రహ్మ యొక్క పుత్రికగా పిలువబడుచున్నది. కొంతకాలమునకు భూమి మీద పాపాలు పెరగటం గమనించిన విష్ణువు, పాప పరిహారం కోసం తన పుత్రికను తనకు ఇవ్వమని బ్రహ్మను కోరగా బ్రహ్మ విష్ణువుకు ఇచ్చెను. తనవద్దకు వచ్చిన కృష్ణను భూలోకము నందు ఎవరి వద్ద ఉంచాలి? అని దేవేంద్రాది దేవతలను కోరగా, వారు భూలోకమున పర్వత రూపమున నిలిచి తపస్సు చేయుచున్న ‘సహ్యముని’ని విష్ణువుకు చూపిరి. అంతట దేవతలు ఆ ముని వద్దకు వెళ్లి ‘ఓ మునీంద్రా..! ఈ పర్వత రూపమున ఘోర తపస్సు చేయుచున్నావు. కాని భూమిని ఉద్ధరించటానికి శ్రీమహావిష్ణువు తన రూపమగు కృష్ణతో వచ్చియున్నారు. ఆమెను ఏది కోరిన అది తీర్చగలదు’.. అని పలికిరి. దానికి సహ్యముని నేను శ్రీమహావిష్ణువును చేరుటకే తపస్సు చేయుచుంటిని. నా కోరికను తీర్చుటకు విష్ణువు కృష్ణతో రావటంతో నా జన్మ తరించింది. విష్ణువు, కృష్ణతో సహా నాపై మీరు నివశింపుమ’ని విష్ణువును ప్రార్థించెను. అంతట విష్ణువు అనుగ్రహించి ‘నీ తపస్సు ఫలించినది. నా అంశతో నీపై నివసించెదను. నీ ఉపకారం లోకమునకు పవిత్రత చేకూర్చగలద’ని చెప్పెను. అంతట విష్ణువు శే్వతాశ్వర్థ వృక్షమై అనగా తెల్లని రావిచెట్టుగా మారి సహ్యాద్రి పర్వతముపై నివశించెను. అంత కృష్ణానదియు ఆ వృక్ష అంతర్భాగమున ధవళాకృతి చెంది భూమి మీద ప్రవహించెను. ఈ నది యందు అనేక పుణ్యతీర్థములు కలియుట వలన మిక్కిలి మహత్మ్యము కల్గినదిగా మారెను. కావున కృష్ణానదిలో స్నానం చేసిన అనంత పుణ్యఫలము పొందగలరు’ అని పురాణాలు చెపుతున్నాయి.
12 సంవత్సరాల క్రితం అంటే 2004లో జరిగిన కృష్ణా పుష్కరాలు, గత సంవత్సరం జరిగిన గోదావరి నదీ పుష్కరాలు, అంత్య పుష్కరాల్లోనూ పుష్కర సమయ నిర్ణయంలో పండితుల మధ్య తేడాలు వచ్చాయి. ఈ సమయ నిర్ణయం విషయంలో పండితులు, పంచాంగకర్తల మధ్య వాదోపవాదాలు చోటుచేసుకుంటున్నాయి. కానీ ప్రభుత్వం (ప్రభుత్వ పంచాంగకర్తలు) కృష్ణానదీ పుష్కరాలను 11-8-2016న గురువారం రాత్రి 09-24 ని. గురుడు కన్యారాశిలో ప్రవేశించటం చేత మరునాడు అనగా 12-08-2016 నుండి 23-08-2016 తేదీ వరకు 12 రోజులను కృష్ణా పుష్కరాలుగా నిర్ణయించారు. కనుక భక్తులు తమ మనోభావాలకు తగినట్లు పుష్కర స్నానం చేయవచ్చు. ఏదిఏమైనా పుష్కర సమయం నిర్ణయంలో వాదోపవాదాలు, వివాదాల వల్ల భక్తుల్లో గందరగోళం ఏర్పడుతుంది. కనుక పండితులు, పంచాంగకర్తలు ఒక నిర్ణయానికి వచ్చి పుష్కర ముహూర్తాన్ని నిర్ణయిస్తే బాగుంటుంది. పుష్కర స్నానం అనంతరం పిండ తర్పణం, ద్వాదశ దానాలు, షోడశ మహాదానాలు వంటివి భక్తిశ్రద్ధలతో ఆచరించాలి.
పుష్కరకాలంలో 12రోజులు 12రకాల దానం చేయటం ఎంతో మంచిది. ఇలా 12రోజులు 12దానాలు చేయలేని పక్షంలో మొదటి రోజు హిరణ్య శ్రాద్ధము, 9వ రోజు అన్నశ్రాద్ధము, 12వ రోజు అశ్రాద్ధము ముఖ్యంగా చేయాలి. అలా అని 12 రోజులు చేయవలసిన దానాలు చేయకుండా మానకూడదు. అలా అవకాశం లేనివారు మాత్రమే పై మూడు దానాలు చేయాలి. 12 సంవత్సరాల తరువాత మరలా కృష్ణానదికి పుష్కరాలు వస్తున్నాయి. పుష్కరం ప్రారంభం అయిన రోజు నుండి పనె్నండు రోజులు ప్రతిఒక్కరూ విధిగా తమకు దగ్గరలోని కృష్ణానదిలో స్నానమాచరించి, ఈ పనె్నండు రోజులు చేయవలసిన దానాలను తమ శక్తికొలది పండితులకు దానం చేసి, వారి ఆశీస్సులు అందుకోవాలి. అలాగే పితృదేవతలకు పిండ ప్రదానాలు, స్నాన, జప, శ్రాద్ధ కర్మలూ చరించాలి. కృష్ణానదిలో పవిత్ర స్నానమనంతరం మహిమాన్విత శ్రీ కనకదుర్గమ్మ తల్లిని, పక్కనే వున్న మల్లేశ్వరస్వామిని దర్శించటం మంచిది. ఇతర ప్రాంతాల్లో కృష్ణానది స్నానం ఆచరించినవారు అనంతరం దగ్గరలోని పుణ్యక్షేత్రాన్ని దర్శించటం మంచిది.

- విష్ణ్భుట్ల రామకృష్ణ, 9440618122
***

పుస్తక సమీక్ష

సమ్మోహనం.. ‘అక్షర వేదం’

దేవులపల్లి వారి భావుకతకు వారధి కడుతున్న భావకుడు. రాయప్రోలు రసికతకు చేవ్రాలుగా కవితను చెక్కుతున్న మోహనుడు. ఆయనే యార్లగడ్డ మోహనరావుగారు. ఆయన కలం నుంచి వచ్చిన మరో కవితా కావ్యం ‘అక్షర వేదం’. మునుపెన్నడో మూడు కావ్యాలల్లిన సీనియర్ కవి మరియు విశ్రాంత ప్రధానోపాధ్యాయుడును.
తెగనాడటం ఒకింత బాధ అయినా తెంపరుల భరతం పట్టకపోతే కవి అంతర్లీనత కనుమరుగైపోయి కలత చెందిస్తుంది. ఎందుకో ప్రచారాల బద్దుకతకు కట్టుబడిపోయి కవితనల్లారు పుష్కరాల మీద. వైఫల్యతను విస్మరించి తెగ పొగిడారు. ప్రణయ రాగాలు పల్లకి మోతలు తప్పితే నడి బజారులో ఈడొచ్చిన పిల్లల గావుకేకలు, అంగడిబొమ్మ ఆడదనే మకిలి చూపుల చప్పుళ్లు ఎప్పుడూ కానరాలేదా?
చిరిగిన గుడ్డల్లో చింపిరి జుత్తుతో రోడ్ల మీద నర్తించే ఈ దేశ ధార్మికత ప్రతిబింబాలు అగుపడితే రెక్కలు వాల్చుకుని ఆవహించే రసికత దీనజన చూపుల్లోని ఆకలి ఆత్రం కనపడదు. ‘కార్తీక సుందరి’ అంటూ సురభళించు గంధ ఫలివా / మదన మరుూఖవా! / రుతురాగ మాలికవా’ అంటూ వగర్చుతారు. ‘ఈ పుష్కరం చరిత్రలో శాశ్వతంగా నిలుస్తుంది / భవిష్యత్తున బంగారు బాటలు వేస్తుందేమో!’ అని చక్కగా వాకృచ్చేరు. కానీ, గోదావరి పుష్కర ప్రారంభ వేళ జరిగిన ‘తొక్కిసలాట కళంకం’ ఎప్పటికీ వదిలిపోదు. మోక్షపు వెర్రిని ముక్తి మొర్రిని ఊదరగొట్టి ముప్ఫై మందికి పిండం పెట్టి మరీ చంపేశారు. ఈ ఘోరకలి, బాధితుల ఆక్రందనలు కవి గారికి వినిపించకపోవడం బాధాకరమే.
ప్రళయ గర్జనలతో వివిధ సమస్యలు ఉరుముతుంటే ఇంకా ప్రణయ కవిత్వాన్ని కొంతైనా వదలకపోతే ఎలా? ప్రౌఢ కవిగా మీ రచనల్లోని పొహళింపులు పదవిరుపులు లాలిత్యపు మేళవింపులు.. పుష్కలం. అవి కవితా మాధుర్యాన్ని పెంచుతాయి. సమకాలీన సమస్యలపై దృష్టి పెంచితే కవి అంతర దృష్టిమీద గౌరవం పెరుగుతుంది. మరో పది కాలాలు బాధాసర్పద్రష్టుల గుండెల్లో నిలిచిపోతారు. ‘తెలియని అనుభవం’ శీర్షికన కవి అనుభవాన్ని తేటతెల్లం చేశారు. ‘అనుభవాల ఆటుపోటులతో / నలిగిపోయిన జీవిత శ్రమలను / పడుతూ... లేస్తూ సరిచేసుకుంటూ / విసిగి వేసారిన మలి వయసుకు / నిస్సత్తువగా నెట్టుకొస్తున్న / వృద్ధాప్యం ఓ చేదు అనుభవం’ పదాల మృదు మధురిమలతో అలరింపచేసిన కవిత. అలా యాభై మూడు కవితల్ని సంపుటిగా అక్షర వేదంగా పుస్తకీకరించారు. ఆచార్య ఎన్ గోపి అన్నట్టు పదవీ విరమణ చేసారు కాని పెదవీ విరమణ చేయని రీతిలో రాసారు. చదువుకోవాలే గాని ప్రణయత్వంలో జోలపాటల జాలి గుండెను పట్టిస్తాయి. మనసును హాయిగా పవళింప చేస్తాయి. ‘వెచ్చని ఊపిరిలో’ ఎలా గునుస్తున్నారో చూడండి. ‘పండులా ఒలుచుకు తినాలని / బిగిసిపోయిన ముడి విప్పాలని / మధురాధరాలను ఆస్వాదించాలని / తెలియని లోకంలో విహరించాలని’ తెగ ఆశ పెడతారు. ఇంకా మేలి ముత్యాల్లాంటి కవితా పాదాలు ఉన్నాయి. ‘అది బాపు బొమ్మ’లో ‘సుమధుర స్నేహానికి ప్రతీక బాపు / భాషా భారతికి హారతి లెత్తిన కాపు’ అంటారు.
ప్రణయ కవిత్వం మీద కుతి చల్లారనట్టు ఈ పుస్తకం వచ్చింది కాని దీనికి ముందు రాగ సంహిత, నీలోత్పల, నీలలోచన పుస్తకాలొచ్చాయి. కాలగమనంలో వస్తున్న మార్పులు గమనించాలి. దానికి తగిన వస్తువుని ఎంచుకొని స్పందించాలి. కాలానుగుణతకు తగినంతగా కవి గాని రచయిత గాని అప్‌డేట్ అవ్వాలి. పాత వాసనల్ని పట్టుక్కూర్చుంటే మరింత పాతబడే ప్రమాదం ఉంది. చివరగా కవి మోహనరావుకు అక్షరం మీద ఎంత మమకారమో అంత ప్రేమ.
‘అక్షరానికున్న అందం - భావం - ఏ ముద్దుగుమ్మకుంటాయి’ అన్నది ఆయన విశ్వాసం. పుస్తకంలో హృద్యంగా రసదాయకం చేసిన ఎన్నో కవితలు మనల్ని గుబాళింపు చేస్తాయి. ఈ పుస్తకానికి అక్షర వేదం అని నామకరణం చేశారు కాని వాస్తవానికి కవి అక్షర నివేదన చేశారు. ఓసారి తప్పక చదవాల్సిందే.

- అంజలి, రాజమహేంద్రవరం
***

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, నేషనల్ హైవే, ధవళేశ్వరం, తూ.గో.జిల్లా. email: merupurjy@andhrabhoomi.net