విశాఖపట్నం

ధర్మరాజుగారి ధర్మా! (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏనుగుల ఘీంకారాలతో, అశ్వాల సకిలింపులతో, భటుల పదఘట్టనలతో రథాలు కదిలే శబ్దాలు కోట సామ్రాజ్యం దూరంగా జరిగిపోయాయి. కోటను దాటి దూరంగా కారడవిలోకి తరలాడు ధర్మరాజు. తోవ సవ్యంగా లేదు. మార్గం ముళ్లడొంకలమయం. పైగా సాయంకాలం అయింది. తోడుగా ధర్మా ఒక్కడే మిగిలాడు. మూన్నాళ్ల నుండి తిండి లేదు. ఆకలిగా ఉంది. దాహంగా ఉంది. దరిదాపుల్లో దాహార్తికి సమాధానంగా చిన్న నీటిమడుగైనా లేదు. ధర్మరాజు నిస్సత్తువగా ఒక చెట్టు ముందర కూలబడిపోయాడు. అతని పక్కనే ఒదిగిపోయింది ధర్మా. నీరసించి కృశించిన ధర్మా కేసి చూసిన ధర్మరాజు ‘అయ్యో! తిండీతిప్పలు లేక నన్ను అనుసరిస్తున్నాడు ఈ ధర్మాగాడు. మనిషికి ప్రతి ప్రాణికి ఆకలిదప్పులు అత్యంత సహజం కదా. ఈ మూగజీవికి నేనంటే ఎంత ఆపేక్ష. పస్తు పెడుతున్నా నాపై విశ్వాసం కోల్పోని ధర్మా కంటే గొప్పవాళ్లుంటారా?’ అని చింతించాడు ధర్మరాజు. ‘‘నాయనా ధర్మా ఇప్పటికే చిక్కి శల్యమైపోయావు. నన్నొదిలి దూరంగా పోరా. ఎక్కడైనా హాయిగా బతుకు. నా మాట వినరా కన్నా’’ అని ధర్మా చుబుకం పైకెత్తి కళ్లలోకి సూటిగా చూస్తూ ప్రాధేయపూర్వకంగా చెప్పాడు ధర్మరాజు. తల విదిల్చి ధర్మరాజు పాదాన్ని నాకుతూ తోక ఊపుతూ పడుకుంది ధర్మా. ధర్మరాజు నిట్టూర్చాడు. హృదయం మండుతూ చెవులు మూగబోయి నోరు నిశ్శబ్దమై శూన్యాకాశంలోకి చూసాడు ధర్మరాజు. కటిక చీకట్లు ముసుకున్నాయి. కదిలే ఓపిక లేదు. గాలి హోరున వీస్తోంది. నిస్త్రాణంగా ఉండిపోయారిద్దరూ. విమానం వేగంగా వస్తున్న సూచనతో కొంచెం వెలుగు ప్రసరించింది. అది స్వర్గం నుండి పంపబడిన విమానం. ధర్మాత్ములకు పంపబడే దేవరథం. ధర్మరాజు లేచి నిల్చున్నాడు. ధర్మా కూడా లేచి నిల్చుని ఆశ్చర్యంగా చూస్తూనే నీరసంగా ‘్భభౌ’మని అరుస్తోంది. ‘‘్ధర్మా ఊరుకో’’ అని ఆజ్ఞాపించాడు ధర్మరాజు.
ధర్మరాజుకి చేతులు జోడించారు ఇద్దరు స్వర్గలోకపాలకులు. ‘‘తమని స్వర్గలోకానికి తీసుకురమ్మన్న ఆజ్ఞతో వచ్చాం ధర్మరాజా’’ అని విన్నవించారు.
ధర్మరాజు ముఖం విప్పారింది. చిరునవ్వుతో మెరిసింది. అంతలోన చింతగా తన కాళ్ల దగ్గరే పడి ఉన్న ధర్మాని తలొంచి చూశాడు. వంగి రెండు చేతులతో ఎత్తుకున్నాడు. ధర్మా అతని బుగ్గలపై ముద్దులు పెడుతుంది. ‘‘వెళ్లండి ప్రభు’’ అని వేడుకుంటున్నట్లు ఆనందంగా చూస్తూ తోక ఊపుతోంది. ‘‘్ధర్మా’’ అని తన గుండెకు మరింత చేరువగా హత్తుకున్నాడు. ‘‘నాయనా ధర్మా.. ననె్నళ్లమంటున్నావా? ఆకలి దప్పులతో ఒంటరిగా నిన్ను వదిలి దయమాలి నన్ను వెళ్లమంటున్నావా?’’ గద్గద స్వరంతో విలపించాడు ధర్మరాజు.
‘‘ప్రభూ మీ కుక్కకి భోజనం తినిపించండి’’ అంటూ ఒక పాత్రతో పాయసం, మరో పాత్రతో పక్వం చేసిన మాంసంతో నిండిన అన్నం, మరో పాత్రతో మంచినీరు అందించారు స్వర్గ ద్వారపాలకులు. ధర్మరాజు ఆ పాత్రల ముందర ధర్మాని దించాడు. ధర్మా ఆహారాన్ని వాసన చూడలేదు. ముట్టుకోనూలేదు. తను ముందు తినందే ధర్మా ఆహారం తినదన్న సంగతి అర్ధమైన ధర్మరాజు కొంచెం పాయసం తాగి మాంసం అన్నం మూడు ముద్దలు తిని నీరు తాగాడు. అప్పుడు ధర్మా కడుపు నిండా ఆహారం తిని నీరు తాగాడు. ‘‘ప్రభూ ఇక వాహనం పైకి రండి’’ అన్నారు స్వర్గ ద్వారపాలకులు. ఒకసారి చుట్టూ చూసి తలపంకించి ధర్మా కేసి చూసాడు ధర్మరాజు. తోడబుట్టిన తన అన్నదమ్ములు కాలం చేశారు. కట్టుకున్న భార్య ద్రౌపది కూడా కాలం చేసింది. కానీ వీడిపోతున్న ధర్మా విశ్వాసం అతడిని కలచివేస్తుంది. ‘‘నాయనా ధర్మా’’ అని మరింత ఆత్రంగా ఎత్తుకుని గట్టిగా పొదివి పట్టుకుని నుదుట ముద్దుపెట్టాడు ధర్మారాజు. ధర్మా గింజుకుంటూ కిందకి దిగిపోవాలని ప్రయత్నించాడు. ‘‘నన్ను విడిచిపెట్టండి ప్రభూ! నా దారి నేను చూసుకోగలను. మీరు వెళ్లండి. వెళ్లిపోండి’ అంటున్నట్లు ప్రేమపూర్వకంగా చూస్తూ అరుస్తుంది. ఎలా వెళ్లను ధర్మా అని కన్నీరుమున్నీరు అయ్యాడు ధర్మరాజు.
‘‘్ధర్మరాజా సమయం మించిపోతోంది రండి’’ అన్నారు స్వర్గ ద్వారపాలకులు.
‘‘నాతో పాటు ధర్మాని కూడా తీసుకుని రానివ్వండి’’ అభ్యర్థించాడు ధర్మరాజు.
‘‘అది అసాధ్యం ప్రభూ... కుక్కకి కర్మానుసారం స్వర్గలోక ప్రాప్తిలేదు’’
‘‘ఈ భూమి వృక్ష, పక్షి, జంతు, మానవ ప్రాణ సముదాయాలతో పండే ప్రేమ కన్నా స్వర్గం గొప్పదా? ఒకవేళ గొప్పదే అయినప్పటికీ నాకు స్వర్గం కంటే భూలోకమే గొప్పది. ఎందుకంటే ఇక్కడ ఒక ప్రాణితో మరొక ప్రాణికున్న అనుబంధం వేటికీ సాటిరావు కాక రావు. ధర్మాన్ని కూడా నాతో రానివ్వనిచో నేను రాను. రాలేను. ధర్మాతో పాటుగా నరకానికి ఆనందంగా వెళతాను’’
‘‘సరే ప్రభూ! మమ్మల్ని వెళ్లిపోమంటారా?’’ అని శెలవు తీసుకోబోయారు స్వర్గద్వారపాలకులు. ధర్మా సౌందర్యరాశి అయిన స్ర్తిమూర్తిగా రూపాంతరం చెందింది. ‘‘ఆగండాగండి’’ అని అరిచింది. ధర్మరాజుతో పాటు స్వర్గ ద్వారపాలకులు నిశే్చష్టులయ్యారు.
‘‘్ధర్మరాజా నేను ధర్మం నాలుగు పాదాల నడిపించే వారిని అంటిపెట్టుకుని ఉంటాను. నేను ధర్మదేవతను. సమస్త ప్రాణి సమధర్మం పాటించడంలో మీకు మీరే సాటి. అందుకే మీవెంటే ఇన్నాళ్లూ ఉన్నాను. సృష్టిలో ప్రతి ప్రాణి మరో ప్రాణిపై పెంచుకున్న ప్రేమానుబంధాలతో నిండిన ఈ భూలోకాన్ని మించిన లోకం లేదు. వృక్ష, పక్షి, జంతుజాలాలకు చేటు చేస్తున్నందు వల్లనే మానవజాతికి విపరిణామాలు దాపురిస్తుంటాయి. నేడు ధర్మాధర్మ విచక్షణ కోల్పోయి చెలరేగుతున్న వారందరికీ నీ నడవడి తెలిసి తీరాలి. ధర్మరాజా... సృష్టిలో అన్ని ప్రాణుల పట్లా సమదృష్టి ఉంచాలని శ్రీకృష్ణ పరమాత్మ ఉవాచ. ఇదే శ్రీకృష్ణ పరమాత్మ గీతా సందేశం. కృష్ణం వందే జగద్గురుం! ఇది గతానికే కాదు వర్తమానానికి భవిష్యత్తుకు శ్రీకృష్ణగీత! భవిష్యత్తు సౌభాగ్యానికి సుస్వాగతం!!

***

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) ఎడిటర్, మెరుపు, ఆంధ్రభూమి దినపత్రిక, సెక్టర్-9, ఎం.వి.పి.కాలనీ, విశాఖపట్నం-17. అనే చిరునామాకు పంపండి. email: merupuvsp@andhrabhoomi.net ఇ-మెయల్‌కు పిడిఎఫ్‌లో పంపించవచ్చు.

- యల్. రాజాగణేష్, చైతన్యనగర్, పాతగాజువాక, విశాఖపట్నం-530026. సెల్ : 9247483700.