రాజమండ్రి

శబ్ద చమత్కార కవి... వేంకట కవి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

17వ శతాబ్ది ప్రథమార్ధంలో తంజావూరు రఘునాథ భూపతి ఆస్థానంలో చేమకూర వెంకటపతి అనే కవి వుండేవాడు. ఆయన శృంగార రస ప్రధాన గ్రంథాలు రెండు రాశాడు. మొదటిది సారంగధర చరిత్ర. ఇది ఆయన ప్రథమ ప్రయత్నం అవటం వల్ల అంత బాగా కుదరలేదు. అయినా కొన్ని పద్యాలు అద్భుతంగా వుంటాయి. మచ్చుకొక పద్యం.
కలరా యిలరాయనికిం
కులసతి రత్నాంగి భోగ కుటిల శిరోజా
తిలకము చిత్రాంగియు నన
నెల జవ్వను లిరువు రంబుజేందు నిభాస్యల్.
ఆ రాజుకు కులసతి రత్నాంగి, భోగ కుటిల శిరోజా తిలకము చిత్రాంగి అని ఇద్దరున్నారు. రత్నాంగి భార్య, చిత్రాంగి ఉంపుడుగత్తె. ఇద్దరూ వయస్సులో వున్నవారే. వారు అంబుజేందు నిభాస్య లన్నాడు. ఇది క్రమాలంకారం. రత్నాంగి ముఖం పద్మము వలెనూ, చిత్రాంగి ముఖం చంద్రుని వలెనూ వున్నవని భావం. అంటే వీళ్లిద్దరికీ పడదని తాత్పర్యం. పద్మం వుంటే చంద్రుడుండడు. చంద్రుడుంటే పద్మము వుండదు. ఇదీ కవి చేసిన చమత్కారం. మరొక పద్యం. యువరాజు సారంగధరుడు పావురము నిమిత్తం చిత్రాంగి ఇంటికి వెళ్తాడు. అప్పుడతనిని చూసి ఆమె మోహిస్తుంది. ఇక రెండో గ్రంథం విజయవిలాసము. తెనుగు భాషాభిమానులెవరైనా ఈ పుస్తకాన్ని చదువకుండా విడువరు. ఇందులో వేంకటకవి పద్యాల్ని పట్టాలెక్కించి పరుగెత్తించిన తీరు అమోఘం. ప్రతి పద్యం ఆణిముత్యమే. వ్యంగ్య ప్రధానమే. రసాస్పదమే. శబ్దార్థాలంకార శోభితమే. చదివిన ప్రతిసారి ఆనంద పారవశ్యంలో మునిగి తేలవలసినదే. ఒకసారి గదుడనేవాడు ద్వారక నుంచి ఇంద్రప్రస్థ పురానికి వస్తాడు. కుశల సమాచార సేకరణ పిదప అతడు అర్జునుని విడిగా కలుసుకొని సుభద్రను గురించి చెపుతాడు. ఆ ఘట్టంలోని పద్యం.
కనస్సుభద్రకు న్సమంబుగాగనే మృగీవిలో
కనన్ నిజంబుగాగ నే జగంబునందు జూచికా
కనన్ దదీయ వర్ణనీయ హావభావ ధీ వయః
కనన్మనోజ్ఞ రేఖలెన్నగా దరంబె గ్రక్కునన్
ఈ పద్యానికి ఎన్నుకున్న పదాలు, చెప్పిన పద్ధతి, నడిపించిన తీరు అద్భుతం. ఈ పద్యం పంచచామరము. మరో పద్యంలో గంగానదిని వర్ణించిన తీరు శభాషనిపిస్తుంది.
సునాసీరసూనుండు సూచన్నిమజ్జ
జ్జనౌఘోత్పతత్పంక శంకాకరాత్మో
ర్మి నిర్మగ్న నీరేజ రేఖోన్న మద్భృం
గ నేత్రోత్సవశ్రీని గంగా భవానిన్
ఈ పద్యం భుజంగప్రయాతము. గంగానదిలో స్నానం చేసిన వారి పాపాలు తొలగిపోతాయని, పాపం నల్లగా వుంటుందని ప్రసిద్ధి. ఆ నదిలోని తామర పూవులలో తిరుగాడుతున్న తుమ్మెదలు తరంగాలు తగిలి పైకి లేచిపోతూ వుంటే, అవి స్నానం చేస్తున్న వారి పాపాలా అన్నట్లున్నై. అటువంటి ప్రకృతి సౌందర్యంతో కనువిందు చేస్తున్న గంగానదిని అర్జునుడు చూశాడు. ఇట్లా ఎన్ని పద్యాలనైనా ఉటంకించవచ్చు.
‘నీ పలుకులు నా చెవి ఆనేట్లు చెయ్. అవి నాకు తియ్యగా వుంటయ్. నా చెవులకు విందు చేస్తయ్. నీ దయా రసంలో నన్ను నానేట్లు చెయ్. తలపైకెత్తి చూడు నలినానన’ అంటాడు. పద్మము వంటి గుండ్రని శోభాయమానమైన ముఖం కలదని భావం. ‘ఎందుకింత చిలిపితనం? ఎందుకింత పట్టుదల? నామీద కోపమా? సిగ్గును ఒదిలిపెట్టు? మన్మథుని మీద ఒట్టుపెడుతున్నా’నన్నాడు.
ఈ పద్యంలో కవి ఎనిమిది ‘నాన’లు ఎనిమిది అర్థాలలో వాడాడు. అదీ వెంకటకవి చమత్కారం. ఒక్కమాటలో చెప్పాలంటే ఈతని కవిత్వం సుధారసంతో పెంచిన మామిడి చెట్టుకు కాసిన పండ్లరసంలో తేనె కలిపి తాగుతున్నట్లుంటుంది. మొదటగా ‘కీరవాణీ! నీ పలుకులనే తెనెను నా చెవులకు ఆనేట్లు, అనగా సోకేట్లు’ చెయ్యమన్నాడు. తర్వాత దయారసంలో నానేట్లు చేయమన్నాడు. తదుపరి నన్ను అననమెత్తి చూడమన్నాడు. పిమ్మట నలినానన అని సంబోధించాడు. గోలతనాన - అమాయకంగా - ఎందుకు నీకు నాపై కోపం - లోనాన చలంబు నీకు అన్నాడు. మన్మథునిపై నాన - ఒట్టు అన్నాడు. విడునాన యింకిటన్. ఇక ఇక్కడ సిగ్గుపడరాదు. దాన్ని విడిచిపెట్టమన్నాడు. ఇది శబ్ద చమత్కారం. అసలీ పుస్తకం నిండా అలంకారాలే. ఈ గ్రంథ కృతిపతి రఘునాథరాయలు గొప్ప విద్వాంసుడు. మహాభారత సంగ్రహం, రామాయణ కథాసారం, సంగీతసుధ, సాహిత్యసుధ, భారతసుధ, వాల్మీకి చరిత్ర, రఘునాథ రామాయణం, శృంగార సావిత్రి, నల చరిత్ర మొదలైన గ్రంథాలు ఎన్నో రచించాడు. అటువంటి రాజు ఈ కవిని ఎంతగానో ప్రశంసించాడు. అదీ ఒక పద్యంలో..
‘ప్రతి పద్యమునందు చమ
త్కృతి గలుగం జెప్పనేర్తు వెల్లడ బెళుకే
కృతివింటి మపారముగా
క్షితిలో నీ మార్గమెవరికిన్ రాదుసుమీ’ అన్నాడు.
ఇంతటి మనోహర కవిత్వాన్ని అందించిన వేంకట కవికి కృతజ్ఞతాపూర్వక నమస్కారములర్పిస్తున్నాను.
- ప్రయాగ కృష్ణమూర్తి,
నరసరావుపేట, గుంటూరు జిల్లా.
చరవాణి : 8179063842

- ప్రయాగ కృష్ణమూర్తి,