విశాఖపట్నం

నాణేనికి అటూ ఇటూ! (కథానిక)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుభద్రాదేవి చాలా అందగత్తె. చిన్న వయసులోనే వివాహం జరిగింది. భర్త అన్నా, అతని అనురాగమన్నా పూర్తిగా తెలియకముందే ఇద్దరు పిల్లల తల్లైంది. మేనరికం కావడం వల్ల ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు.
ఆమెకు ఇప్పుడు వయసు పెరుగుతోంది. భర్తకు ఆమెకు వయసు అంతరం పదేళ్లు కావడంవల్ల ఆమె మనసు కోరికల్ని అతడి వయసు తీర్చలేకపోతోంది. అలా స్వయంగా సుభద్రే అందరు అమ్మాయిల్లా అనుకుంటోంది.
తెలుగు రాష్ట్రంలో అమ్మాయిల్లో చాలా మంది విషయంలో ఇలాగే జరుగుతుంది. పదో తరగతి స్థాయికి చేరేసరికే కాబోయే భర్త కోసం వెదుకులాట మొదలవుతుంది. ఇంటర్మీడియట్, డిగ్రీ నాటికి వివాహం, సంతానం... క్రమంగా జీవితం నిస్సారం అయిపోతుంది. చదువు పేరిటో, ఇంకా వేరే కారణాలో వాళ్ళ ఆలోచనా ధోరణుల్ని మార్చేసి యాంత్రిక జీవనానికి అలవాటు చేస్తాయి.
ఆ వీధిలోనే ఉండే సుశీల స్నేహం కల్సింది. అది తర్వాత కాలంలో పెను మార్పులకు కారణమై ఆమె మనసును అల్లకల్లోలపరుస్తుందని తెలీదు ఆమెకు అప్పట్లో.
‘సురేష్ నాకీ వాచ్ కొనిచ్చాడు’ అంది సుశీల.
‘ఎవరు సురేష్’ అంది సుభద్రాదేవి.
‘నాకు పరిచయస్తుడ్లే. కాలేజీలో చదువుతున్నాడు’
‘అప్పుడే వెయ్యిపైన ఖర్చు పెట్టగలిగాడు అంటే డబ్బున్న కుర్రాడు అయి ఉండాలి’ అనుకుంది సుభద్రాదేవి. బైటకి మాత్రం ‘సంతోషం’ అంది ముక్తసరిగా!
నెల రోజులు గడిచాయి.
ఒకరోజు కొత్త సైకిల్‌తో వచ్చిందామె.
‘సురేష్ కొన్నాడా?’ ప్రశ్నించింది ఆమె.
‘కాదు గోపీచంద్ ఇచ్చాడు’ అంది సుశీల.
‘ఎవరీ గోపీచంద్?’ మళ్లీ అడిగింది సుభద్రాదేవి.
‘సురేష్‌కన్నా కావాల్సినవాడు’ ముక్తసరిగా జవాబిచ్చింది సుశీల.
‘ఆహా!’
‘వాడే నా బాయ్ ఫ్రెండ్’
‘ఈ కాలం అమ్మాయిలే నయం. బాయ్‌ఫ్రెండ్స్‌ని కూడా మెయిన్‌టైన్ చేస్తున్నారు’ అనుకుంది సుశీల. ‘నేనంటే పడి చస్తాడు తెల్సా’ అంది కళ్ళింతలు చేసుకుని.
‘అంటే’ అంటూ సంభాషణ పొడిగించింది సుభద్రాదేవి.
‘నేనొక్కరోజు కాలేజీకి రాకపోయినా పిచ్చెక్కిపోతాడు తెల్సా’ సంభాషణ ఇలా సాగింది.
‘మరి సురేషో’
‘వాడో మొద్దు’ హేళనగా అంది సుశీల.
‘ఎలా’
‘అమ్మాయికేం కొనాల్సొస్తుందోనని ఎప్పుడూ భయపడ్తాడు వాడు. కొంచెం ఖరీదైన వస్తువు కొనమంటే మొహం గంటు పెట్టుకుంటాడు. గోపీచంద్ అలాక్కాదు. ఏది కావాలంటే అది, అడగడమే ఆలస్యం’.
‘వాళ్లివ్వడమేనా? నువ్వేమైనా ఇచ్చావా?’
‘బర్త్‌డే గిఫ్ట్‌గా వాడికో కిస్, వీడికో హగ్ అంతే’
‘తప్పుకదూ!’
‘మనకొచ్చేవాడు పవిత్రంగానే వస్తాడంటావా?’
‘అలా నమ్మేదే సంప్రదాయం. దానికి రూపమే పెళ్లి’
‘షిట్. మీ రోజుల్లో అలాగేమో! ఇప్పుడు సెల్‌ఫోన్‌లు వచ్చాయి. ఇంటర్నెట్‌లు అన్నీ చూపించేస్తున్నాయి. మనం కాదంటే మరొకరు ఆ అవకాశం ఎత్తుకుపోతారు.’
‘శృంగారం ఒక్కటే జీవితం కాదుకదా!’ అంది సుభద్రాదేవి.
‘ఆ రోజుల్లో నీకెవరూ బాయ్‌ఫ్రెండ్స్ లేరా?’
‘లేరు’
‘లవ్ లెటర్స్ అయినా వచ్చేవా?’
‘చదువుకోవడం తప్ప... వేరేం పనే్లదు అప్పట్లో’
‘నువ్వు చాలా లైఫ్ మిస్సయిపోయావ్’ అదోలా అంది సుశీల.
‘ఏమో! మరి’
‘నీ శృంగార జీవితం బాగుందా?’
‘నాకేం ఇద్దరు పిల్లలు. చక్కగా చదువుకుంటున్నారు. ఆయనది మంచి ఉద్యోగం. జీవితానికేం లోటు లేదు.’
‘సిన్మాలు, షికార్లు వగైరా!’
‘అందరూ బాగుందంటే ఆ సిన్మాకెళ్లేవాళ్లం.’
‘అవునవును, మీ కాలంలో అవే సిన్మాలు కదా!’
సుభద్రాదేవి మరేం మాట్లాడలేదు. మళ్లీ సుశీలే అంది.
‘అందుకే మంచి జీవితం మిస్ అయిపోయావ్ అంటున్నా’
అదీ నిజమేనేమో అన్పించింది.
అవును, తన జీవితంలో భర్త తన ప్రమేయం లేకుండానే వచ్చేశాడు. ఆ రోజుల్లో తాను తండ్రి ముందు ఎంత ఏడ్చిందో చదువుకుంటానని. కట్నాల క్రమంలో తూగలేనని భయంతో తండ్రి మేనరికం చేజారకుండా వివాహం జరిపించేసి బాధ్యత తీరిన తృప్తితో వెంటేసుకున్న అనారోగ్యం తోడు రాగా చనిపోయాడు పెళ్లైన రెండు నెలలకే.
సుశీల జీవితంలోని సుఖసంతోషాలు తనకూ వస్తే బావుణ్ణు అనుకుంది మొట్టమొదటిసారి సుభద్రాదేవి.
తనకెవరైనా లవ్ లెటర్ రాసినా, తనంటే ఇష్టపడి చొరవ చూపినా బావుణ్ణు అనుకుంది ఆమె.
అనుకోకుండా క్లాస్‌మేట్ నగేష్ కలిశాడు. ఆప్యాయంగా పలుకరించాడు. ఇద్దరూ ఫోన్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు.
మెల్లగా మాటలు కలిశాయి. చనువు పెరిగింది. ఏకవచన ప్రయోగాలు మొదలయ్యాయి.
భర్త దగ్గర లభించని ఆప్యాయతేదో నగేష్ దగ్గర లభించినట్లుగా ఫీలయింది. చనువుగా సిన్మాలకు వెళ్లడం, ద్వంద్వార్థ సంభాషణలు క్రమంగా చోటుచేసుకున్నాయి. బాధ్యతలే తప్ప తనపై ఎప్పుడూ ఆప్యాయత చూపించలేని భర్తకన్నా నగేష్ గొప్పవాడిగా కన్పించాడామెకు.
ప్రతి కుటుంబంలోనూ ఇలా జరిగే పరిస్థితో, ప్రమాదమో తప్పదు. ప్రేమ రాహిత్యం స్థానంలో కామ భావనలకు రూపం కలిగే స్థితి మొదలవుతుంది. నగేష్‌తో జీవితం పంచుకుంటే బావుణ్ణు అన్పించింది.
‘నగేష్! నా పిల్లలకు తండ్రివవుతావా?’ అందామె అతడి మనసు తెలుసుకోవాలన్నట్టుగా!
‘మనిద్దరం కొత్త జీవితం మొదలుపెడ్తాం’ అన్నాడు నగేష్.
‘అలాగే ఆలోచిద్దాం. రేపు నా అభిప్రాయం చెబుతా’ అంది సుభద్రాదేవి.
మర్నాడు భళ్ళున తెల్లారింది. కిటికీ నుండి వినిపిస్తున్న అరుపులు ఆమెను అటువైపు లాగాయి.
సంభాషణా సారాంశం ఇలా ఉంది - సుశీల ఎవరితోనో లేచిపోయిందని, కాస్సేపు గడిచాక రెండు వీధుల అవతల ఉన్న నగేష్ సుశీలతో వేకువజామున వెళ్లిపోయాడని.
‘అమ్మో!’ అనుకుంది సుభద్రాదేవి మంగళసూత్రం గుండెలపై బరువుగా కదలగా!
‘అవును. ఈ కాలం సంబంధాల్లో పెద్దల ప్రమేయం లేకుండా జరిగే పెళ్లిళ్ల వంటివి ఎక్కువగా కట్నపు చావులుగానో, కోర్కె తీర్చుకోవడానికో మారిపోతుంటే సమాజంలో నైతిక విలువలెలా నిలబడ్తాయి. ఇంటర్నెట్‌లు చెప్పలేని ప్రశ్నలివి.
సంపాదన లేని నగేష్, బాధ్యత తెలియని సుశీల కాపురం ఎలా ఉంటుంది అన్పించి భయమేసిందామెకు.
‘గుండెల మీద మంగళసూత్రం నేనున్నానంటూ ధైర్యం చెప్పింది’ - సుభద్రాదేవికి.
రాబోయే రోజుల్లో నిశ్చింత జీవితం వైపు ఆలోచన్లతో ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రపోయింది సుభద్రాదేవి. భర్త రూపాన్ని మనసు నిండా నింపుకుని.

- శ్రీనివాసభారతి శ్రీకాకుళం.