విజయవాడ

అందరూ అందరే.. (చిన్న కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అదో చిన్న పల్లెటూరు. ఏకోపాధ్యాయ పాఠశాల వుందా ఊళ్ళో. ఒకటి నుండి మూడు తరగతులకు ఓ యాభైమంది విద్యార్థులున్నారు. శ్యాంసుదర్ ఆ ఊరి బడి ఉపాధ్యాయుడు. ప్యూన్ నుంచి హెడ్‌మాస్టర్ వరకు అన్ని పనులు తానే చేసుకోవాలి. తన హాజరు పట్టిక, విద్యార్థుల హాజరు పట్టిక, తదితర అన్ని రికార్డులు తన సంచిలోనే ఉంటాయి. మధ్యాహ్న భోజనం వండిపెట్టడానికో వంటమనిషి వుంది. శ్యాంసుందర్ ఎప్పుడొస్తాడో, ఎప్పుడు వెళతాడో ఎవ్వరూ పట్టించుకోరు. పిల్లలు బడికి వచ్చి ఆడుకుంటారు. అప్పుడప్పుడూ కొట్టుకుంటారు. శ్యాంసుందర్ వచ్చినరోజు అందరినీ ఒక గదిలో కూర్చోబెట్టి ఏవేవో కథలు చెబుతుంటాడు. పిల్లలు ఆసక్తిగా వింటుంటారు.
ఒకరోజు శ్యాంసుందర్ హడావుడిగా బడికి వచ్చాడు. పిల్లలందరినీ కూర్చోబెట్టి ‘ఏయ్ పిల్లలూ! ఈరోజు జిల్లా విద్యాశాఖాధికారి గారు మన బడికి వస్తున్నారు. నా గురించి ‘రోజూ వస్తున్నారా? లేదా?’ అని అడుగుతారు. మధ్యాహ్న భోజనం బాగుంటోందా? అని కూడా అడుగుతారు. మీరేమని చెప్పాలో తెలుసు కదా!’ అని ప్రశ్నించాడు.
ఇంతకుముందు అనేకసార్లు శ్యాంసుందర్ వాళ్లకు చెప్పిన మాటలు బాగా వంటబట్టాయి. ‘మా సారు రోజూ వస్తున్నారు. చక్కగా పాఠాలు చెబుతున్నారు. భోజనం చాలా బాగా వుంటుంది’ అని పిల్లలు బదులిచ్చారు.
‘గుడ్..గుడ్! ఇలాగే చెప్పండి. రేపు మీ అందరికీ చికెన్ పెట్టిస్తా’.. అని పిల్లల్ని అక్కడే కూర్చోమని చెప్పి, వంటమనిషి దగ్గరకు వెళ్లాడు. ‘ఏమ్మా! ఏం కూర చేస్తున్నావ్?’
‘పప్పుకూరండీ’
‘దాంతో పాటు ఈరోజు తలా వో గుడ్డు ఇవ్వాలి. ఇదిగో ఈ డబ్బులు తీసుకెళ్లి ఐదు డజన్ల గుడ్లు కొనుక్కురా’ అని రెండొందలిచ్చాడు.
మళ్లీ తరగతి గదిలోకి వచ్చి ‘ఆఁ పిల్లలూ! ఈరోజు మనం మహాభారతం చెప్పుకుందాం’ అంటూ తన పని ప్రారంభించాడు. పిల్లలంతా చేతులు కట్టుకుని వినడానికి ఆసక్తిగా కూర్చున్నారు.
‘పూర్వం అయోధ్యా అనే నగరం వుండేది. దానికి రాజు దశరథుడు. ఆయనకు ఎందరు భార్యలు?’ ప్రశ్నించాడు వాళ్లల్లో మరింత ఆసక్తిని కలిగించడానికి.
‘నల్గురు’ ఏకకంఠంతో జవాబిచ్చారు.
‘వెరీగుడ్! వారి పేర్లు కౌసల్య, సుమిత్ర, కైకేయి..ఆఁ..’ చేతివేళ్లు ముడుస్తూ ముగ్గురి పేర్లు చెప్పాడు. నాలుగో పేరు దగ్గర మాట ఆగిపోయింది. మళ్లీ మొదటి నుండి ప్రారంభించి, కౌసల్య.. సుమిత్ర.. కైకేయి.. మళ్లీ మాట ఆగిపోయింది.
‘సీత’..! అందుకున్నాడో విద్యార్థి.
‘ఓ.. వెరీగుడ్! సీత!’
ఇంతలో కారు హారన్ వినిపించింది. జిల్లా విద్యాశాఖాధికారి నేరుగా తరగతి గదిలోకి వచ్చాడు. టీచర్, విద్యార్థులు ఒక్కసారిగా లేచి నిలబడి ‘గుడ్ మార్నింగ్ సార్‌’ అంటూ ప్రణామం చేశారు.
‘ఆఁ.. వెరీ గుడ్ మార్నింగ్! ఏం జరుగుతోందిప్పుడు?’ ప్రశ్నించాడు టీచర్ని.
‘మహాభారతం కథ చెబుతున్నా సార్’ అన్నాడు టీచర్.
‘ఓకే! కొన్ని ప్రశ్నలు వేస్తాను. రెడీనా?’ అడిగాడు.
‘అలాగే సార్!’ అన్నారు ఏకకంఠంతో పిల్లలు.
‘ఎవరిని అడిగితే వారే చెప్పాలి. ఆఁ.. నువ్వు చెప్పు బాబూ.. భారతం రాసిందెవరు?’
విద్యార్థులంతా వౌనంగా వున్నారు. నిలబడిన విద్యార్థి బిక్కమొఖం వేశాడు.
‘నీకు తెలీదా?’ ప్రశ్నించాడాయన.
తెలీదని తల అడ్డంగా ఊపాడు విద్యార్థి.
‘నువ్వు చెప్పవోయ్!’ అంటూ మరో విద్యార్థిని అడిగాడు. వాడూ ఏడుపు ముఖం పెట్టి కాస్త ధైర్యంగా ‘నేను రాయలేదు’ అన్నాడు.
‘ఓఁ నువ్వు రాయలేదా? ఓకే’ అన్నాడు డిఇవో.
‘మరి నువ్వు రాశావా?’ మరో విద్యార్థిని ప్రశ్నించాడు.
వాడూ ఏడుస్తూ, ‘సార్! ఇలాంటి రాతలు సోముగాడు చేస్తాడు సార్’ అన్నాడు.
‘ఎవరా సోమూ?’ కోపంగా నటిస్తూ అడిగాడు డిఇవో.
సోము రాగం అందుకున్నాడు.
‘ఏయ్! ఎందుకేడుస్తున్నావ్? నువ్వూ రాయలేదా?’ ప్రశ్నించాడాయన.
‘సరే.. మాస్టరు గారూ! ఇదేంటి?’ అని టీచర్నడిగాడు.
‘లేదండీ! వీళ్లల్లోనే ఎవరో రాసి వుంటారు. నేను తెలుసుకుంటానుండండి’ అన్నాడు చేతిలో కర్ర ఊపుతూ.
అందరూ బిక్కమొకాలేసుకుని దిక్కులు చూస్తున్నారు.
‘సరేగానీ.. మీరు చెప్పండి, మహాభారతం ఎవరు రాశారో?’
‘లేదండీ, వీళ్లతో నిజం చెప్పిస్తాగా!’ అన్నాడు జంకూగొంకు లేకుండా టీచరు.
‘అయ్యో శ్యాంసుందర్! నీకు ఉద్యోగం ఎలా వచ్చిందయ్యా? ఈమాత్రం తెలియకుండా పిల్లలకు పాఠాలేం చెబుతున్నావు?’ వాపోయాడు డిఇవో.
‘రామాయణాన్ని రాముడు రాశాడు. మహాభారతాన్ని భరతుడు రాశాడు. ఈమాత్రం తెలీదా?’ వివరించాడు జిల్లా విద్యాశాఖాధికారి తాపీగా!
***

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, ప్లాట్ నంబర్ సి- 3, 4, ఇండస్ట్రియల్ ఎస్టేట్, విజయవాడ - 520 007. email: merupuvj@andhrabhoomi.net

- మండవ సుబ్బారావు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లా.