విజయవాడ

పుష్కర కృష్ణవేణి (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగరికతకి ఆధారమైన
జీవకోటికి ప్రాణాధారమైన
మానవ వౌన నేస్తాలు
పవిత్ర నదీనదాలు

అనాదిగా సాగే సంబంధం
విడదీయలేని అనుబంధం
కష్టసుఖాల అనుభవాల సారం
మనిషి చదవాల్సి‘నది’ గ్రంథం

మహారాష్ట్రంలోని
మహాబలేశ్వరంలో పుట్టి
ఆశలెన్నో మూటగట్టుకొని
ఆనందాలతో అడుగులేస్తోంది

అలుపెరగక సాగిపోయే
కృష్ణమ్మ పరవళ్లు
సోయగాల లోగిళ్లు
ప్రకృతి పరవశించే ముంగిళ్లు

తాగునీరు, సాగునీరు అందిస్తూ
బంగారు పంటలను పండిస్తూ
అలల గలగల సవ్వడులు
సంగీత సప్తస్వరాలు

వయ్యారి వనె్నల చినె్నలు
చల్లని సాహితీ సౌరభాలు
అలరు మయూరి నాట్యాలు
కూచిపూడి కులుకులు

నా ఒడిలో ఒక్కసారి
స్నానమాచరించండి
సర్వపాపాల ప్రక్షాళన చేసుకోండి
సమస్త పుణ్యాలను స్వీకరించండి

తెలుగు రాష్ట్రాలు బాగుండాలని
అమరావతి అద్వితీయంగా వెలగాలని
మన సంస్కృతీ, సంప్రదాయాలు
వెల్లివిరియాలని
పచ్చని ప్రగతి పుష్పాలు
పరిమళించాలని

ప్రజలు సుఖశాంతులతో జీవించాలని
నిండు మనసుతో ఆశీర్వాదిస్తోంది
మధురవాణి.. పుష్కర కృష్ణవేణి!

- బత్తుల బ్రహ్మయ్య, జగ్గయ్యపేట, కృష్ణా జిల్లా. చరవాణి : 8885351472
**

నేను రాను పుష్కరాన్కి, నేను రాను బెజవాడకి!

అమరావతి రైతుల ఆక్రందనలు వినలేను
అభాగ్యుల వ్యథలు నా కనులతో చూడలేను
నేను రాను పుష్కరాన్కి, నేను రాను బెజవాడికి!

భరతమాత గుండెలపై విదేశీ సొగసులు కనలేను
తెల్లదొరల పెత్తనాన్ని మరలా భరించలేను
సింగపూరయినా, చైనా అయినా నేనిష్టపడలేను
జపానయినా, రష్యా అయినా నేనొప్పుకోలేను

శనీశ్వరుడినీ, వీరాంజనేయుణ్నీ కూలగొట్టినచోట
చెదిరిపోయిన చిరునామాల్ని నేనూహించలేను
నా నీళ్లు తాగి బతికిన నావాళ్లని వంచించినచోట
బెదిరిపోయిన సామాన్యుల్నీ నేను కాపాడలేను

ఆడపిల్లని చెప్పి పసిప్రాయంలోనే గొంతు నులిమేసినట్లు
ఆనకట్టలతో రాష్ట్రాలు అడుగడుగునా
నన్ను బంధించేస్తుంటే
బిరబిరామంటూ పరుగులిడలేను
ఒక్కడుగు కూడా ముందుకు వేయలేను

నేనిప్పుడు గట్లుతెగ్గొట్టే కృష్ణమ్మను కాను
వట్టిపోయిన కృష్ణవేణిని
పట్టిసీమ సంపులతో చెల్లి గోదారి జలాలతో
బతుకీడ్చనున్న భాగ్యహీన కృష్ణమ్మను..
బతిమిలేని కృష్ణమ్మను!

నేను రాను పుష్కరాన్కి.. నేను రాను బెజవాడకి!!

- ఎంవిజె భువనేశ్వరరావు,
చరవాణి : 9290072130
**

పుష్కర గమనం

బిరబిరా కృష్ణమ్మ
పరుగులేకున్నా, జర..జర.. పారుతుంది
కవి.. పుష్కర.. ప్రభావం.. త్వరమీరలేదు!
సాగే ఏరుకూ, పారే నీరుకూ- మనం
సర్వ పాపాలంటిస్తున్నాం కానీ- పాపం
వాటికేమీ స్పర్థా, భేదం తెలీదు
ఆ దరికి మేలూ, ఈ బరికి కీడూలేదు
ఆ ఘాటుకి ఆటూ లేదు, ఈ ఘాటుకి పోటూలేదు!
సౌకర్యాలని పత్రికల్లో చదవచ్చుగానీ
జర భద్రంగా నేలమీద నడవండి
కాలుజారినా, కొండొకచో నోరుజారినా ప్రమాదమే
పుష్కరంలో వాంఛితం దుష్కరమైపోతుంది!
పుణ్యం కోరితే మరి ఈమాత్రం
నైపుణ్యం నేర్చుకోకపోతే ఎట్టా?!
దిక్కులు చూస్తుంటే చిక్కులు తోసేస్తయ్
వెనకవారికి దారినివ్వండి!
పదండి ముందుకు- పదండి ముందుకు!!
ఎందుకు?- ఎందుకంటే
క్షేమంగా తిరిగి వచ్చేందుకు!

- విహారి, చరవాణి : 9848025600
***

పరుగుల రాణీ..

కృష్ణవేణీ!
ఆనతి లేకుండా
ఎన్ని ఆనకట్టలు కట్టినా
ఎగిరి దూకి పరుగులెత్తే
పరుగుల రాణీ మా కృష్ణవేణీ!
బంజరు భూముల్లో
బంగారం పండించేందుకు
పుడమిని పుత్తడి చేసే
పరుసవేది మా కృష్ణానది
ఎండిన గొంతుల్లో
చల్లని నీళ్లు పోసేందుకు
మహాబలేశు సిగ నుంచి
జాలువారిన పావనగంగ
మా తెలుగింటి కృష్ణమ్మ
పున్నమి వెనె్నల్లో
ఇసుక తినె్నలపై పరుండి
కడలిరాయుని కోసం
నిదుర మాని ఎదురుచూసే
విరాగిణి మా కృష్ణవేణి
ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగీ
సంస్కృతి, నాగరికతలు పెంచి
జగతికి తన జీవితాన్ని
అంకితం చేసేందుకు
హంసలదీవిలో సంగమించిన
దివ్యాంగన మా తృష్ణ కృష్ణవేణీ!

- జి సూర్యనారాయణ,
బందలాయి చెరువు, కృష్ణా జిల్లా.
చరవాణి : 9704784744