నెల్లూరు

నగరానికి ఆవల... (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృష్ణపక్షం.. మసక వెనె్నల.. చీకట్ని మింగిన కొండచిలువలా నగరం అచేతనంగా వుంది. ఎవరూలేని ఏకాంతంలో చీకటి ఎన్నో ఊసులు చెబుతుంది. నిశ్శబ్దంలాగా ఎంతో అందమైనది. రెండు చేతులు ప్యాంటు జేబులో వేసుకొని, అప్పుడప్పుడూ చలికి చేతులు రుద్దుకుంటూ తిరిగి జేబులో పెట్టుకుని విశ్రాంతిగా నడుస్తున్నాడు. ఇంతలో సైరన్ మోగించుకుంటూ పోలీసుజీపు అతనిని దాటుకుంటూ వెళ్లిపోయింది. వాళ్లు తనలా ఏదో ఆలోచిస్తూ వెళుతున్నారేమోనని తనలో తనే గొణుక్కున్నాడు. అలానే నడుస్తూ చిన్న గోతిలో కాలు పట్టుతప్పి తూలి పడబోయి తమాయించుకున్నాడు. నగరానికి ఆవలగా నడక సాగుతోంది. అయినా ఇంకా నగరంలోనే వున్నాడు.
నడుస్తున్న అతనికి ఓవైపు నుంచి సన్నగా ఏడుపు వినిపించింది. చుట్టూ చూశాడు. ఎవరూ కనిపించలేదు. వెన్నులోంచి భయం చరచరా పాకింది. ఒళ్లు జలదరించింది. ఆ రోదన క్రమంగా పెరిగి పెద్దది కాసాగింది. అతడు కళ్లు చికిలించి మరీ చూస్తున్నాడు. ఆ గుడ్డి వెనె్నల్లో ఎవరూ కనిపించట్లేదు. చీకటి నలుపురంగు చీర కట్టుకున్న కనె్నలా బాగుంటుంది కాని, కొన్నిసార్లు బాగా భయపెడుతుంది కూడా అనుకున్నాడు తనలో తనే స్వగతంగా. భయం తాలూకు ప్రకంపనలు అతన్ని అయోమయానికి గురిచేస్తున్నాయి.
తనకు తానే ధైర్యం చెప్పుకుంటూ ఏడ్పు వచ్చే దిశగా వెళ్లాడు. ఎవరూ అంటూ అరిచాడు. ఎటువంటి జవాబులేదు. ఎవరక్కడ అని మళ్లీ తడబడుతూ గట్టిగా అరిచాడు. పొడి దగ్గు వినిపించింది. దగ్గరికెళ్లి చూస్తే ఓ స్ర్తి తలవంచుకుని ఏడుస్తోంది. భయం భయంగా వెళ్లి ‘‘ఎవరండి మీరు? ఎందుకేడుస్తున్నారు?’’ అని అడిగాడు. జవాబు లేదు! మళ్లీ అడిగాడు. ఆమె ఎక్కిళ్లు పెడుతూ ‘‘మీకెందుకు? మీ దారిన మీరు పొండని’’ గదమాయించి పలికింది.
అపనమ్మకంగా, ‘‘ఒకరికొకరు తోడుగా వుండి బాధల్ని పంచుకుంటే బాధలు తగ్గుతాయని’’ అన్నాడు అనునయిస్తున్నట్లుగా? ఏమనుకుందో ఏమో గాని లేచి జుట్టు ముడివేసుకుంటూ అతనితో నడవసాగింది. అతడు ‘‘మీ పేరెంటండీ?’’ అని పొడిగా పలకరించాడు. ఆమె బదులివ్వలేదు. ఇంకా సన్నగా వెక్కిళ్లు పెడుతూనే వస్తోంది. అలా ఇద్దరూ వౌనంగా నడుస్తున్నారు. కొంతసేపటికి ఆమెలో బెరుకు తగ్గిందేమో! ‘‘మీ పేరేంటండీ?’’ అని ప్రశ్నించింది. అతడు చిరాగ్గా ఎటో చూస్తూ నడుస్తున్నాడు. ఆమె మళ్లీ రెట్టించి అడిగింది. అప్పుడు చెప్పసాగాడు.
‘‘తన భార్య కువైట్‌లో ఉద్యోగం చేస్తోందని, తాను అక్కడకు వెళ్లే ప్రయత్నాల్లో వున్నానని’’ చెప్పాడు. తనకు పాస్‌పోర్ట్ లేదని దాని కోసం ఇక్కడకు వచ్చానన్నాడు. తనది పెద్ద కుటుంబమని, తనే ఇంటికి ఆధారమని దాని కోసం దేశం కాని దేశం వెళ్లైనా సరే కుటుంబాన్ని నిలబెట్టాలనేదే నా తాపత్రయం అని అన్నాడు.
తాను టైలరింగ్ చేస్తానని టైలరింగ్‌లో మంచి పేరుందని అన్నాడు. ‘‘మీ ఆవిడ వెళ్లి ఎంతకాలమైందని?’’ ఆమె ప్రశ్నించింది. ‘‘సుమారు ఆరు నెలలైంది’’ ముక్తసరిగా జవాబిచ్చాడు. ‘‘మీరేం చేస్తారు?’’ అతడు ఆమెను అడిగాడు. ‘‘నేను హాస్పిటల్‌లో నర్సుగా పనిచేస్తాను’’ అని చెప్పింది. ‘‘మీవారేం చేస్తారు?’’ ఒక్కసారిగా నిట్టూర్చింది. ‘‘ఆయన మిలటరీలో పనిచేసేవాడు. పోయిన ఏడాది బార్డర్‌లో జరిగిన కాల్పుల్లో ఆయన మరణించాడు’’ అంటూ తిరిగి చిన్నగా ఏడుస్తోంది. అతను చిరాగ్గా అటువైపు తిరిగాడు. ‘‘ఇద్దరం ఎవరూ లేని అనాథలం, కష్టపడి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ స్థాయికి వచ్చాం. ఒకరి కోసం మరొకరుగా బ్రతికాం. ఇంతలో ఇలా జరిగింది’’ అన్నది ఆమె. ‘‘విధి క్రూరమైంది. అది బెర్ముడా ట్రయాంగిల్ లాగా మన ఆనందాలన్నింటిని తనలోకే లాగేసుకుంటుంది’’ అన్నాడతను ఆకాశం వైపు చూస్తూ.
ఇంతలో వీళ్ల పక్కగా ఓ లారీ వేగంగా దూసుకుపోయింది. లిప్తపాటులో ఆమె చెయ్యిపట్టుకు పక్కకు లాగాడు. లేకుంటే ఆమెని ఢీకొట్టేది. ఆమె తూలి అతనిపై వాలింది. వెంటనే సర్దుకొని తిరిగి నడవసాగారు. ‘‘బహుశా ఆ డ్రైవర్ బాగా తాగినట్టున్నాడేమో?’’ అంది ఆమె. ‘‘ఉండొచ్చు’’ అన్నాడు ముక్తసరిగా. పక్కన వచ్చే భవనాలు చూస్తూ ముందుకు సాగుతున్నారు.
దారిలో ట్రాఫిక్ ఐలాండ్ పక్కన ఓ పెద్ద హోర్డింగ్ కనబడింది. ఆ హోర్డింగ్‌పై ‘‘ప్రపంచశాంతికై టెన్ కె రన్’’ అని వుంది. దాన్ని ఓ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసింది. దాన్ని చూసి నవ్వుకుంటూ ఇద్దరూ ముందుకు కదిలారు. ‘‘ఆమె నవ్వుతూ ప్రపంచంలో శాంతా? అది సాధ్యమా?’’ అని ప్రశ్నించింది. ‘‘మనిషిలో దురాశ ఆకాశమంతెత్తు పెరిగి ఎప్పుడో మనిషిని మింగేస్తే... పాపం ఆ సంస్థ వాళ్లు ప్రపంచ శాంతికి పాకులాడుతున్నారు’’ అన్నది ఆమె.
అవును ఎండమావుల్లో నీళ్లయినా దొరుకుతాయోమో గాని శాంతి అనేది కచ్చితంగా భ్రాంతే అన్నాడతను. ఇంకొంచెం ముందుకెళితే ఓ పెద్ద ఫ్లెక్సీ బోర్డు కనిపించింది. దానిపై ‘‘్భరతదేశం వెలిగిపోతోంది’’ అని వుంది. ఆ ఫ్లెక్సీ కింద కొందరు నిద్రపోతున్నారు. ఓ ముసలి బిచ్చగత్తె చాలీచాలని చీర కప్పుకొని చలికి వణుకుతూ కలత నిద్దట్లో మసులుతోంది. ‘‘ఔను మరి భారతదేశం ఇలా వెలిగిపోతుంది’’ అనుకుంటూ ముందుకెళ్లారు.
అలా అనుకుంటూ ముందుకెళ్తున్నారు. ఉన్నట్టుండి కరెంటు పోయింది. ఆమె భయంతో పక్కకు జరిగింది. అంతలో ఓ మిణుగురు పురుగు అలా ఎగురుకుంటూ ఆమె ముఖం దగ్గరగా వచ్చింది. అంతవరకూ ఆమెను పరిశీలనగా చూడలేదు అతను. అందంగానే వుంది గాని దుఃఖం వల్ల వెనె్నల లేక అలిగి ముడుచుకున్న కలువగా వుంది ఆమె ముఖం. అంతా చీకటి.
‘‘చీకటి బావుంటుంది’’ అన్నాడు.
‘‘ఎందుకు అన్నది?’’ ఆమె.
‘‘వెలుతుర్లో జరిగిన ద్వేషాలు, మోసాల్ని మింగిన చీకటి ఆ విషాలను నల్లగా కక్కుతోంది’’ అన్నాడు. ‘‘పైగా చీకట్లో వాటి ఆనవాళ్లేమీ కనబడవు గదా’’ అన్నాడు. ‘‘అవి కనబడవు గాని గుండెల్లోని దైన్యం, బాధలు వెంటబడే వస్తుంటాయి గదా’’ అన్నదామె. అవును అన్నాడతడు. కాసింత అసహనంగా ఇద్దరూ రోడ్డు దాటి దూరంగా సాగుతున్నారు.
ఇంతలో ఓ కుక్క ‘గయ్’మని అరుస్తూ వీళ్లకేసి దూసుకువస్తోంది. అతడు భయంతో ఆమె వెనుక్కు చేరుకున్నాడు. ‘మీకు కుక్కలంటే భయమా!’ అన్నది ఆమె ఒకింత పరిహాసంగా. కాసింత కోపంగా ‘అవును’ అన్నాడు. ఆ కుక్క వీళ్లను దాటి దూరంగా పోయి ఆకాశం వైపు చూస్తూ మొర ఎత్తి ఈల పెట్టసాగింది. వాళ్లు ముందుకువెడుతున్నారు.
‘‘ఇంకా ఎంత దూరం’’ అన్నది ఆమె.
‘‘ఏమో తెలియదు వెళ్లాలి’’ అన్నాడు అతడు.
అంతలో కరెంటొచ్చింది.
దారిలో ఓ శ్మశానవాటిక కనిపించింది. దాని బోర్డుపై ఓ మత శ్మశానవాటిక అని రాసి వుంది. ఆ బోర్డు పైన ఓ గుడ్డి బల్పు వెలుతురు తడుముకుంటూ ప్రసరిస్తోంది. ఆమెకు భయం వేసి ఒకడగు వెనక్కు వేసింది.
‘‘నీకు శ్మశానమంటే భయమా’’ అనడిగాడు.
‘‘అవును’’ కాసింత ఆదుర్దాగా.
‘‘ఏం ఎందుకని?’’ అనడిగాడు.
‘‘ఏమో!’’ అని ముక్తసరిగా బదులిచ్చింది. ఆమె.
‘‘అయినా మరణం అంటే భయం లేనిదెవరికి?’’ అనడిగింది. అవును ‘‘మరణంతో రణమే’ గదా బ్రతికుంటే’’ అన్నాడతడు.
ఆ బోర్డు వైపు మరోసారి చూసి ‘‘మనిషి మరణించాక కూడా మతం వెంటబడి తరుముతోంది, ఎప్పటికొస్తాయో మానవ శ్మశాన వాటికలు’’ అని నిర్వేదంగా పలికాడు.
ఇద్దరూ అలా ముందుకు సాగుతున్నారు. కాసేపు ఎవరు ఎవరితో మాట్లాడుకోలేదు. వౌనం వాళ్లిద్దరి మధ్య రాజ్యమేలింది. ఎవరి ఆలోచనల్లో వాళ్లుండి అలానే నడుస్తున్నారు. పక్కనున్న తాటిచెట్ల తోపును దాటారు. దూరం నుంచి సముద్రపు హోరు నెమ్మదిగా వినబడుతోంది.
‘‘అదిగో మనం బీచ్ దగ్గరకు వచ్చినట్లున్నాం’’ అన్నాడు. ‘‘అక్కడ టీస్టాల్ పెడుతున్నట్లున్నారు’’ అందామె. అవును ‘నాయర్ టీస్టాల్’ అని బోర్డుంది. స్టౌపై పాలు మరుగుతున్నాయి. విచిత్రమైన శబ్దంతో నాయర్ షాపు ముందు నీళ్లు చిమ్ముతున్నాడు. ఇంకా చీకట్లు తొలగలేదు. నెమ్మదిగా జన సంచారం మొదలౌతుంది. ‘‘బీచ్ రోడ్డులో జాగింగ్ చేసే వాళ్లొస్తున్నట్టున్నారండీ’’ అంది ఆమె.
బీచ్ రోడ్డులో అటూ ఇటూ తిరిగే వాళ్లు, నెమ్మదిగా జాగింగ్ చేసేవాళ్లు, నడవలేక నడుస్తున్న ముసలివాళ్లు, బిగ్గరగా నవ్వుతూ నడిచే మధ్య వయస్కులు. కబుర్లు చెప్పుకుంటూ ఉల్లాసంగా నడిచే ఆటగాళ్లు, చల్లగాలికి సేదతీరే వాళ్లు కొందరు. అవును అదో ప్రపంచం మరి!
క్రమేణా అక్కడి వాతావరణంలో కోలాహలం పుంజుకుంది. అయితే ఎవరి పనుల్లో వారు బిజీ.
కొంత నడక అనంతరం నాయర్ దగ్గర టీ తాగి సేదదీరే వాళ్లు. అక్కడ కూర్చొని లోకాభి రామాయణం సాగించేవాళ్లు. పేపరు కోసం ఎదురుచూసే పెద్దవాళ్లు.
‘‘ఈ సమయంలో టీ తాగితే బాగుంటుంది కదా’’ అన్నాడు.
‘‘చాలా బాగుంటుంది’’ అన్నది ఆమె
‘‘అయితే వెళ్దాం రండి!’’ అంటూ కలిసి వెళ్లారు.
నాయర్‌ని అందరిలాగే టీ అడిగారు.
నాయర్ అందరికి టీ ఇస్తున్నాడు! కాని వీళ్లకివ్వట్లేదు. కనీసం వీళ్ల వైపు కనె్నత్తి చూడట్లేదు. కనీసం పలకరించలేదు.
‘ఎంతసేపిలా..?’ అన్నది ఒకింత అసహనంగా.
‘‘ఔను ఏమిటో ఇతగాడి పొగరు’’ అన్నాడు కళ్లు చికిలిస్తూ.
‘ఎన్నిసార్లడగాలో మరి?’ అని విసుక్కొంటూ సముద్రం వైపు సాగుతున్నారు.
తూరుపు దిక్కున వేగుచుక్క పొడుస్తోంది..
అంతే..
ఏమైందో గాని..
ఉన్నట్టుండి వాళ్లు సముద్రం వైపు పోసాగారు. ఏదో శక్తి గుంజుతున్నట్టుగా అయస్కాంత పర్వతం ఇనుపమేకును లాగుతున్నట్టుగా వాళ్లు వెనక్కి తిరిగి హాహాకారాలు చేస్తున్నారు. అయినా ఫలితం లేకపోయింది. వాళ్ల ఆర్తనాదాలు ఎవరికి వినిపించట్లేదు, ఎవరి పనుల్లో వాళ్లున్నారు.
అలా అలా వెళుతూ.. వెళుతూ..
గాల్లోకి లేచి అనంతం వైపు సాగుతున్నారు.
వాళ్లిద్దరూ నిన్న జరిగిన వరుస బాంబు పేలుళ్లలో మరణించారు. ఉగ్రవాదానికి బలైన వాళ్లు.
అయినా అలాగే ఈ మమకారంలో వుండిపోయిన వాళ్లు.
దేహంపై భ్రాంతితో అలా.. అలా.. వుండి, అనంతం వైపు సాగిపోయారు.

- కె.రవిశేఖర్, నాయుడుపేట
చరవాణి : 9849388182
***

మనోగీతికలు

హోదా కోసం...
ఏ గోదాలోకైనా దిగుదాం
తెలుగు నేలను నిలువునా చీల్చి
తెలుగు జాతిలో విద్వేషాల్ని రగిల్చి
మన అరువదేళ్ల కష్టార్జితం.. మన కలల సౌధం..
విశ్వనగరి..్భగ్యనగరిని పెరికి వేసి..
ఆంధ్రులకు చిమ్మచీకట్లు మిగిల్చిన
రాక్షస రాజకీయమా!
నీకు నా శతకోటి ప్రణామాలు..
సీట్ల కోసం.. ఓట్ల కోసం..
నోట్ల కోసం..
అణచివేత కోసం..
అధికారం కోసం..
ఆధిపత్యం కోసం..
దేనికైనా తెగించే.. నీ చరిత్రకు..
ముగింపు తప్పదు..!

మనకిప్పుడు..కావాల్సింది
ఢిల్లీ పెద్దలు ‘అమరావతి’ గల్లీకి విదిల్చిన
గుప్పెడు మట్టి.. చెంబుడు నీళ్లు కాదు

ఇప్పుడు.. మనకి కావల్సింది
ధీరుడాంధ్రకేసరి పోరాట పటిమ..
అల్లూరి ధీరత్వం.. శ్రీరాములు త్యాగం
ఏదైనా సాధిస్తామనే.. తెలుగువాడి తెగువ..
పార్లమెంట్ సాక్షిగా.. తిరుపతి వెంకన్న సాక్షిగా
నిజంగా.. మనకు రావల్సిన..
నిఖార్సుగా.. మనకు కావల్సిన..
ఖచ్చితంగా వచ్చి తీరాల్సిన ప్రత్యేక హోదా
విభజించినవారు చట్టంలో పెట్టలేదంటారు..
ఇచ్చేవారు ఆర్థిక సంఘం
అనుమతివ్వలేదంటారు..
ఆంధ్రజాతితో ఆడుకుంటే తెరమరుగు కాక తప్పదు
ఈ హోదా కోసం.. ఏ గోదాలోకైనా దిగేందుకు
ఆంధ్రులందరు.. సమర సింహనాదం చెయ్యాలి..
జెండాలను పాతరేసి..‘ప్రత్యేక’ అజెండాను ఎగురవేయాలి
ఢిల్లీ గుండెలదిరేలా..జన ప్రభంజనమై ఎగసిపడాలి..!

కుర్ర ప్రసాద్‌బాబు, ఒంగోలు
చరవాణి : 9440660988

మనోగీతికలు

మోదీజీ..
హోదా రొద ఎన్నాళ్లు?
నవీనాంధ్రలో ఉద్యమాలు ఉప్పెనలా
పెల్లుబుకుతున్నా..
రచ్చలు, రావిళ్లతో ఆంధ్రావని అట్టుడుకుతున్నా..
ధర్నాలతో ఊరు, వాడ దద్దరిల్లుతున్నా..
రాస్తారోకోలతో జన జీవనం
అస్తవ్యస్తమవుతున్నా..
ఆందోళనలు, నిరసనల జోరుతో
హోరెత్తుతున్నా..
సభ్యుల నినాదాలతో చట్టసభలు స్తంభిస్తున్నా..
రాజధాని లేక నడిరోడ్డుపై జనం
పడిగాపులు కాస్తున్నా..
బంద్‌ల గందరగోళంతో ప్రజానీకం
ఇక్కట్లు పడుతున్నా
స్పందించరేం మోదీ సాబ్..!
భావితరాల భవితను
ఛిద్రం చేయడం భావ్యమా?
ఓట్ల కోసం హామీల ఫీట్లు చేయడం తగునా?
తెలుగు దేశంతో మీ మిత్రత్వానికి బీటలు వారడం సమంజసమా?
ఏ.పి.పై కోపం చూపడం సబబా?
పునర్విభజన చట్టాన్ని అభాసుపాల్జేయడం
ఎంతవరకు న్యాయం?
చట్టసభలో నాటి ప్రధాని ప్రకటనకు,
హామీకి విలువే లేదా?
ఆనాటి కేబినెట్ ఆమోద ముద్ర
మీకు ఆమోద యోగ్యం కాదా?
సాక్షాత్తు తిరుపతి శ్రీవారి సన్నిధిలో
మీ హామీని విస్మరించారా?
విభజన పాపంలో మీ పార్టీకి అంటుకున్న
మకిలీని తుడుచుకోరా?
నాడొక మాట, నేడొక మాటతో
రెండు నాల్కల ధోరణి అనుసరణీయమా?
ప్రశాంతతను భగ్నం చేస్తూ అశాంతిని
రగల్చడం ధర్మసమ్మతమా?
ప్రత్యేక ప్రతిపత్తి అంశాన్ని
పరిశీలిస్తున్నామంటారో మంత్రి..
ప్యాకేజీపై కసరత్తు చేస్తున్నామంటారు
మరో మంత్రి
హోదా బదులు సాయమంటారు ఇంకో మంత్రి
పొంతనలేని ప్రకటనలతో
ఈ వంచన ఇంకెంతకాలం?
ఇకనైనా మీ నిబద్ధతను నిరూపించుకోండి..
మీరిచ్చిన హామీకి బద్ధులుకండి..!
ప్రత్యేక హోదా ప్రకటించి
మీ ప్రభుత్వ స్టేటస్ పెంచుకోండి..
ప్రధాన్‌మంత్రిజీ..!

- సింగంపల్లి వెంకటకృష్ణ ప్రసాద్
చరవాణి : 9949843105