రాజమండ్రి

మెరుపు - రాజమండ్రి -- కోచ్ కథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘జయంత్ కృష్ణ’ క్రికెట్‌లో ఓ పిడుగు, నిండైన పాతికేళ్ల కుర్రాడు, క్రెకట్‌లో పరుగుల వర్షం కురిపిస్తున్నాడు. అతని ఆటతీరు చూసి ప్రపంచ నలుమూలల అభిమానులు ఒక్కసారిగా పెరిగారు. ‘అతను భారతీయుడు కావడం అదృష్టం’ అని ఎందరో అనుకున్నారు.
అతను తొలిసారి క్రికెట్ ఆడటం కోసం విశాఖపట్నం రానుండటంతో అభిమానులు ఉప్పొంగిపోయారు. అభిమానులతోపాటు డెబ్బై ఏళ్ల విశ్వనాథం కూడా ఆనందించాడు.
విశ్వనాథం ఒక గల్లీ క్రికెట్ కోచ్. వయసైపోవడంతో పదేళ్లుగా కోచ్ బాధ్యతల నుండి పక్కకు తప్పుకున్నారు. ఎందరో పిల్లలకు క్రికెట్ పాఠాలు నేర్పారు. అందులో ఒకరు జయంత్ కృష్ణ.
జయంత్ కృష్ణ పదిహేనేళ్ల క్రితం విశ్వనాథం క్రికెట్ కోచింగ్ సెంటర్ వద్దకు వచ్చి చూసి వెళ్లేవాడు. క్రికెట్ ఆడాలని, నేర్చుకోవాలని ఉన్నా తండ్రిది చదువే లోకం అని ఆలోచించే మనస్తత్వం కావడంతో కృష్ణ ఏడుపు ముఖం పెట్టేవాడు.
ఒకసారి జయంత్ కృష్ణను చూసిన కోచ్ విశ్వనాథం ‘ఏం బాబూ! క్రికెట్ ఆడతావా? అని అడిగాడు. ఏమి చెప్పాలో తెలియక అటు ఇటు తిప్పాడు. అర్థమైంది విశ్వనాథానికి. వాళ్ల తండ్రితో విషయం చెప్పాడు. ‘క్రికెట్టా? ఇది చదువుకునే వయస్సు. అలాంటివి ఆడితే చదువు పోతుంది. ఉద్యోగాలు రావు అన్నాడు’ తండ్రి.
‘మీ బాబు ఆశపడుతున్నాడు. నా మాట వినండి. చదువుకి ఏ లోటూ లేకుండా నేను చూసుకుంటా. ఓ నెల రోజులు చూడండి. మీకు ఇబ్బంది లేకపోతేనే. నేను ఫీజు కోసం ఆశపడను. నాకు టాలెంట్ కావాలి’ అని కోచ్ విశ్వనాథం తెలిపాడు.
జయంత్ కృష్ణ తండ్రి గారు మొదట తటపటాయించినా క్రమంగా ఆలోచించి ‘సరే’ అన్నాడు.
అప్పుడు కృష్ణ, విశ్వనాథం ఒకసారిగా ఆనందించారు’
ఉదయం 5 గంటలకే కోచింగ్ సెంటర్ తీసుకొచ్చేవారు జయంత్ కృష్ణను వాళ్ల తండ్రి.
బ్యాటింగ్, బౌలింగ్, కీపింగ్ నేర్పించారు ముందు పది రోజులూ. బ్యాటింగ్ బాగా ఆడటం చూసి కోచ్ విశ్వనాథం అందులో శిక్షణ ఇచ్చాడు. కోచ్ విశ్వనాథం వద్ద కోచింగ్ తీసుకుంటున్నా మిగతా వాళ్ళ చేత బౌలింగ్ వేయిస్తే బౌండరీలు తరలించేవారు బాల్సన్నీ.!
జయంత్ కృష్ణ కూడా అంత అద్భుతంగా ఆడతారని అనుకోలేదు’ కోచ్. వాళ్ల తండ్రి కూడా కొడుకు బ్యాటింగ్ చూసి మురిసిపోయారు.
కొన్ని రోజుల తర్వాత కృష్ణ తండ్రిగారికి జాబ్ ట్రాన్స్‌ఫర్ రావడంతో ముంబై కుటుంబాన్ని తీసుకుని వెళ్లాల్సి వచ్చింది.
ఆ రోజు ఆయనతో విశ్వనాథం, ‘అబ్బాయి క్రికెట్ బాగా ఆడుతున్నాడు. ముంబైలో శిక్షణ ఇప్పించండి!’ కృష్ణతో ‘నాన్నగారు అక్కడ కోచింగ్ ఇప్పిస్తానన్నారు బాగా ఆడు. చదువును నిర్లక్ష్యం చేయకు. నువ్వు టీమిండియాకి సెలక్ట్ అవ్వాలి’ అని దీవించారు. కృష్ణ విశేషాలను ఎప్పటికప్పుడు పత్రికలో చూసేవాడు విశ్వనాథం. వయసు అయిపోవడం క్రికెట్‌కి దూరం అవ్వడంతో ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. కోచ్ వ్యవహారాల వల్ల ఆస్తులు కూడా సంపాదించలేకపోయారు. విశ్వనాథానికి కూతురు ఒక్కతే కావడం, డబ్బు వచ్చే మార్గం లేకపోవడంతో చాలావరకు అప్పులు చేశారు.
జయంత్ కృష్ణ టీమిండియాకి ఎంపికైనప్పుడు వారు ఎంత ఆనంద పడ్డారో తెలియదు గాని విశ్వనాథం చాలా ఆనంద పడ్డారు. వారి శ్రీమతి మాత్రం బయటకు చెప్పుకోలేక నసుగుతూ ఉండేది.’
జయంత్ కృష్ణను కలిసి ‘కోచింగ్ చిన్నప్పడు నేనే ఇచ్చాను. కాస్త సాయం చేయగలవా బతకడానికి చాలా కష్టంగా ఉందని’ చెప్పాలి అనుకున్నాడు విశ్వనాథం.
తప్పుగా అనుకుంటారేమో అని మనస్సులో భావించినా ‘బతకడానికే కదా అడుగుతున్నాను. ఖర్చు పెట్టడానికి కాదు కదా’ అని తనలో తనే ప్రశ్నించుకుని వాళ్ల ఎయిర్ పోర్డు రాడానికి ఒక గంట ముందే చేరుకున్నాడు యాభై రూపాయల ఛార్జీలతో.
నిమిషం నిమిషం అయ్యే సరికి జనం పెరుగుతూ వచ్చారు. ఫ్లైట్‌లో నుండి క్రికెటర్లు రాగానే జనం విపరీతంగా వచ్చారు. వాళ్ల మధ్య ఇరుక్కుపోయాడు విశ్వనాథం.
అందరూ ‘జయింత్ కృష్ణ’ అని అరుస్తూ ఉంటే కన్నీళ్లు వచ్చాయి. విశ్వనాథానికి. నేను నీళ్లుపోసిన మొక్క అని అనుకున్నాడు.
ముఖం క్షణమైనా చూడకుండానే బస్సెక్కి కూర్చున్నాడు జయంత్, నిరాశపడ్డాడు విశ్వనాథం.
మళ్లీ యాభై రూపాయల ఛార్జీతో ఇంటికి చేరుకున్నాడు. మ్యాచ్ టివిలో చూశాడు. జయంత్ కృష్ణ సెంచరీ కొట్టడంలో భారీ విజయంతో గెలిచింది. ఫాన్స్ సంబరాలు చేసుకున్నారు.
ఒరేయ్ బాబు నీకు క్రికెట్ నేర్పించింది మా ఆయన. మాకు ఏమైనా సహాయం చేయ్ అని టివి చూస్తూ చెప్పింది విశ్వనాథం భార్య.
మళ్లీ ఎయిర్ పోర్టుకి వెళ్లడమా అనుకున్నాడు. వంద రూపాయలు దండగ అని భావించాడు విశ్వనాథం.
కానీ హఠాత్తుగా విశ్వనాథం ఇంటికి జనం చాలా మంది వచ్చారు. అర్థం కాలేదు అతనికి. చూస్తుండగానే జయంత్ విశ్వనాథం కాళ్లు మీద పడ్డాడు.
మిమ్మల్ని ఎయిర్‌పోర్టులో చూశా. మీ గురించి ఎంక్వయిరీ చేశా. మీ వల్లే ఈ స్థాయికి ఎదిగాను. మీ వల్లే ఈ హోదా, ఈ డబ్బు అనే సరికి విశ్వనాథానికి కన్నీళ్లు వచ్చాయి. క్రికెట్ సంఘంతో మాట్లాడి పింఛన్‌తోపాటు జయంత్ నెల నెలకి డబ్బు పంపిస్తానని మాటిచ్చాడు. విశ్వనాథం జయంత్‌ని దగ్గరుండి ఫ్లైట్ ఎక్కించారు నిండైన మనస్సుతో. పేపర్‌లో విశ్వనాథం గురించి పెద్ద వార్త వేశారు గొప్ప కోచ్ అని.

- స్వీట్ సురేంద్ర
చరవాణి: 9490792553

బాధ వేదన కాదు... సుఖం

జనవాక్యం

బాధలు ఎన్నటికీ శాశ్వతం కాదు... అలాని సుఖాల కూడా ఎప్పటికీ శాశ్వతం కాదు. బాధలు అనేవి మనలోని ఆత్మస్థైర్యానికి పునాదులు. మన జీవితాలకు విజయాలకు చక్కని నాందులు. బాధలు అనేవి ఏ మనిషి ప్రాణం కోరేంత పెద్దవి కావు. మనలో మనోభావాలే మన ధైర్యాన్ని అణిచివేస్తున్నాయ. విద్య మనకి మంచి స్నేహితుడు. దానిని ఆదరిస్తే మన గుండెలకు హత్తుకునే ఆత్మీయులవుతాయ. చదువు బడిలో, చదువు ఒడిలో ర్యాగింగ్‌కు ప్రాణాలు పోస్తున్నాయ..
అయినా యువతులారా... కష్టాల వెనుక ఎప్పుడో ఒకప్పుడు సుఖం ఉంటుంది. ఇష్టంగా బ్రతుకుపై మమత ఉంటే విజయం నీయందు ఉంటుంది. ముళ్లుంటేనే కదా పూల విలువు తెలిసేది. కళ్లుంటేనే కదా విజయాలను చూసేది. ఈ ప్రపంచంలో ఎంతో హాయివుంది. ఈ జగతిలో మరెంతో సుఖం ఉంది. మనకున్న ఏకైక జీవితం మన అమ్మ. తాను నవ మాసాలు మోసి, కని, పెంచిన జీవితం. దాన్ని మన్నుపాలు కానీయకుండా చూడాల్సింది మన యువతరం.
అసహాయత నీ తోడు కానీయకు
అభ్యుదయం నీ నీడ కావాలి
అభ్యున్నతి నీ ఊపిరి కావాలి
అందుకే నీ బాధలే నీ సౌఖ్యమనే ఆలోచన రానీయ్...
నీ బాధలే, నీ బంగారు జీవితానికి పునాదులుగా మార్చెయ్...
జీవితం చాలా విలువైనది కదా యువతులా...!

-ఎస్.ఎన్.ఎల్.ప్రసన్న
థర్డ్ బిఎస్పీ (ఎలక్ట్రానిక్స్), రాజమండ్రి

స్మరించుకుందాం
సాహిత్య సంపదే జ్ఞానమన్న ‘కాశీనాథుడు’
ప్రయోజనాలు లేకుండా పనులు ప్రారంభించని ప్రస్తుత కాలంలో స్వప్రయోజనం కన్న సంఘ ప్రయోజనం మిన్ననుకుని ఉత్తమ కార్యాలకు శ్రీకారం చుట్టిన మహనీయులు కాశీనాథుని నాగేశ్వరరావు గారు. పత్రికల స్థాపనంటే వ్యాపారం. అటువంటిది ప్రజలకోసం పత్రికలు నడిపిన వాడు. 1908లో ఆంధ్ర వారపత్రికను బొంబాయిలో స్థాపించినారు. తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన సేవ మరువలేనిది. మరపురానిది. ఆ దిశగానే ఆంధ్ర వారపత్రిక, ఆంధ్రపత్రిక (దినపత్రిక) భారతి పత్రికల్ని స్థాపించి ప్రజలు వాంగ్మయ పోషణకులనటానికి రుజువు పలికారు. ఆధునిక తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన ఎందరినో వందల సంఖ్యలో సాహితీ లోకానికి పరిచయం చేసిన వారు నాగేశ్వరరావు గారు.
సాహితీ సృజన వేరు, సాహిత్య పోషణ వేరు. ముద్రితమైన రచనలతో ప్రజలను ప్రగతి మార్గాన నడిపించడం ఒకటి, ప్రజల్లో చైతన్యంనింపటం కోసం స్వాతంత్య్రేచ్ఛను నింపే వారిని ప్రోత్సహించడం మరొకటి. వీటిని వేర్వేరుగా కాకుండా ఒకే గాటున కట్టి ఆధునికాంధ్ర సాహిత్యానికొక దిశను కల్పించడంతోపాటు అపారంగా విస్తరింప చేసిన ఘనత ఆయనది. గురజాడ అప్పారావు, గిడుగు రామ్మూర్తి, కొమర్రాజు, చిలకమర్తి, పానుగంటి, శ్రీశ్రీ, కొడవటిగంటి, నండూరి, బసవరాజు, జాషువా, రాయప్రోలు, బాపిరాజు, దేవులపల్లి, నాయిని, కొడాలి, మొక్కపాటి, భమిడిపాటి, ఇంకా ఎందరెందరో కవులు, రచయితలు, సాహిత్యకారులు నాగేశ్వరరావు గారి పత్రికల ద్వారా వెలుగులోకి వచ్చిన వారే.
పాత్రికేయుడైనా సాహిత్యాభిలాషి కనుకనే సాహిత్య సంపద లేని జ్ఞానం, జ్ఞానం కాదనే వారు ఆయన. ప్రజా హృదయాల్లో విజ్ఞానం లేకపోతే వికాసం సాధ్యం కాదనేది ఆయన నమ్మకం. అందువల్లే సాహిత్యంలో జనుల హృదయాలను సునాయాశంగా గెలుచుకుని విజయుడైనారు. ఇంకా చెప్పుకోవాలంటే నిష్పక్షపాతంగా ఆలోచించితే ఆయన పేర ప్రత్యేక యుగాన్ని పెట్టాలి. నాగేశ్వరరావు పత్రికల్లో వచ్చి అచ్చైన సాహిత్యాన్ని క్రమబద్ధీకరించ గలిగితే ఆధునిక సాహిత్య ఆధునికాంధ్ర సాహిత్యానికి ఒక వాంగ్మయ సూచికే అవుతుంది.
జర్నలిస్టుగా సాహితీవేత్త సమాజ సేవకునిగా పరిచితుడైన నాగేశ్వరరావు కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా వలమర్రు గ్రామంలో 1862లో జన్మించారు. ఆయనజీవిత చరమాంకం 1938 వరకు సాహితీమతల్లికి ముద్దుబిడ్డగానే ఉన్నారు. ముప్పయ్ సంవత్సరాల సాహిత్య సేవలో ఆయన ఎక్కని మెట్టు, ఎదగని ఎత్తుల్లేవంటే అతిశయోక్తి కాదు. రాయప్రోలు సుబ్బారావు 1914 ప్రాంతంలో కవిత్వం రాస్తున్నప్పుడు వెన్నుతట్టి ప్రోత్సహించిన ఘనత నాగేశ్వరరావు గారిది. రాయప్రోలు వారి ‘తృణ కంకణం’, ‘కష్ట కమల’ను తన పత్రికల్లో ప్రచురించడమేగాక రాయప్రోలు నూతన భావాలు, రచనా శైలి, పదుగురికి ఆదర్శ ప్రాయం కాగలదని ముందే ఊహించి ప్రోత్సహించారు.
ఇరవై ఏళ్ల తర్వాత శ్రీరంగం శ్రీనివాసరావు కొత్త ప్రయోగాలతో తెలుగు నేలపై తన సాహితీ బీజాలు వెదజల్లుతున్న క్రమంలో భావ కవుల ప్రతిఘటనల నుంచి సౌహార్ధిక సమర్ధనతో నాగేశ్వరరావు చేసిన చేయూత శ్రీశ్రీకి నూతనోత్తేజాన్నిచ్చిందనే చెప్పాలి.
జాతీయోద్యమంలో సాహిత్యంతో దేశభక్తిని రంగరించిన ధీశాలి. సాహిత్యంతో దేశ ప్రజలకు దేశభక్తిని నూరిపోసిన వాడు భావదాస్య సంకెళ్లు తొలగనిదే నిజమైన విమోచనం కలగదనేది నాగేశ్వరరావు గారి ఆశ. ఆ ఆశయ సాధనకోసం ‘్భరతి’ సాహిత్య పత్రిక స్థాపన. కళ సామాజిక సంస్కృతోద్యమంగా ఈ పత్రికను తీర్చిదిద్దడం వెనుక ఆయన కృషి అనన్య సామాన్యం. భారతి సంచికల్లో కళలు, చిత్రలేఖనం, సాహిత్యం, శాసనాలు ఒకటేమిటి తెలుగు వారి వారసత్వ సంపద కనువిందు చేసేది. ప్రతి ‘్భరతి’ సంచిక ప్రత్యేకతలతోపాటు విజ్ఞాన సర్వస్వంగా వచ్చేదంటే దానికి కారణం నాగేశ్వరరావు గారి లోని కళాతృష్ణ, సాహితీ పత్రికలో అపారంగా ఉండటమే. ఆ రోజుల్లో ‘్భరతి’ పత్రికలో తమ రచన అచ్చుగావడం అంటే సాహితీ లోక గుర్తింపుగా భావించేవారు.
ఆధునికాంధ్ర సాహిత్య చరిత్రలో చెరగని ముద్ర వేసింది భారతి, ఆంధ్ర వారపత్రిక, ఆంధ్రపత్రికలయితే, వాటి సాహితీ సేవలొనర్చింది మాత్రం నాగేశ్వరరావు గారు. ఆయన సాహితీ సేవ ఒక ఎత్తయితే, వివిధ రచయితల రచనలను పుస్తకాలుగా ముద్రించి, ప్రచురించటమనేది ఆయన తెలుగు వారికి ఇచ్చిన కానుకగా చెప్పుకోవాలి. వాటిలో కొమర్రాజు విజ్ఞాన సర్వస్వం ఒకటి. అపూర్వ ప్రయత్నంగా ‘సమగ్ర తెలుగు నిఘంటువు’ నిర్మాణం అయితే చేపట్టారు కాని అది పూర్తికాకపోవడం విచారకరం. గ్రంథాలయ ఉద్యమంలో ఆయనది కీలకపాత్ర. రాష్ట్ర గ్రంథాలయోద్యమంలో ఆయన చేసిన సేవలు మరువలేనివి. ఆయన చేసిన సేవలకు, కృషికి 1924లో కట్టమంచి రామిలింగారెడ్డి అధ్యక్షతన జరిగిన ‘ఆంధ్ర మహాసభల్లో ఆయనకు ‘దేశోద్ధారక’ బిరుదునిచ్చి సత్కరించారు. తదుపరి కాలంలో స్వాతంత్రోద్యమంలో మమేకమై దేశ సేవకు అంకితమయ్యారు. సాహిత్యానికి గాని సమాజానికి గాని చేసిన సేవ ఆయన వ్యక్తిత్వానికి గీటురాయిగా నిలుస్తాయి. సాహితీ లోకానికే కాదు దేశానికే ఆయనో ‘మచ్చు తునక’. ప్రస్తుతం ఆయన లేరు. అలాగే ఆయన నెలకొల్పిన పత్రికలూ లేవు. కానీ ఆధునికాంధ్ర సాహిత్యం ఆయన సేవలను చిరస్మరణీయం చేసుకుంటూ కీర్తిల్లవలసిందే. తెలుగు సాహిత్యం ఉన్నంత కాలం, తెలుగు ఉన్నత పరిచే కాలం వరకు కాశీనాథుని నాగేశ్వరరావు గారు తెలుగు వారి హృదయాల్లో సముచితంగా కొలువు తీరే ఉంటారు.
- అమృత్
9494842274

మనోగీతికలు

నాన్న

వేలు పట్టి తొలి అడుగు వేయించేది
చేసే తప్పులను ఒప్పులుగా సరిజేస్తూ..
నీ జీవిత గమనానికి ఒక దిక్సూచి
నీకు బాధ కలిగితే అతని కళ్ల నుండి
నీళ్లు జాలువారతాయి
నీ సంతోషమే తన సంతోషంగా మార్చుకుని
తన బిడ్డ చిన్న విజయం సాధిస్తే
ప్రపంచానే్న జయించాడని మురిసిపోతూ..
నీ సమస్యను తన సమస్యగా
భావించి
నీ నుండి దానిని దూరం చేస్తూ
ఎదిగే బిడ్డను చూస్తూ..
తన మనస్సులోనే అంతులేని
ఆనందాలను అనుభవిస్తూ
బాల్యంలో తన బిడ్డకు నీడలా
యవ్వనంలో స్నేహితుడిగా... మార్గదర్శిగా
ఉంటూ
నిన్ను ముందుకు నడిపే
శక్తే నాన్న

- చింతా రాంబాబు
కాట్రేనికోన, తూ.గో.జిల్లా

నానీలు

గదిలో కాలం
వౌనం దాల్చింది
మదిలోంచి వేదన
మొరగడం లేదు

తీరిక గోలపెడ్తుంటే
గడియారాన్ని
గోడక్కొట్టాను
గుండె బరువైంది

అలుపులేని
తుంటరి కాలం
గింజుకొని
మరీ తిరుగుతుంది

సంపద
సమయాన్ని కొల్లగొట్టి
కాలం విలువ
హెచ్చిస్తుంది - గడియారం

కాల గమనం
బిక్కు బిక్కుమంటుంది
కలవరం
కాటుకి చిక్కి ఉంటుంది

ఒక రేయికి
పగ’లు పోయింది
మరో రాత్రికి
వగలు రేపింది

- అనంత్
సెల్: 9494842274
కోరుకొండ
తూ.గో.జిల్లా

మనసు మరో మనోజ్ఞలోకంలోకి

మనసు మనసులో లేకుండ
విహరిస్తోంది మరో మనోజ్ఞలోకంలోకి
మల్లెల పొదలలోకి
మొగలిపూల పొదలలోకి
మంచిగంధం చెట్లలోకి
వివిధరకాల పూల పరిమళాల్లోకి
పోయి మత్తుగ వాలిపోతోంది

సెలయేటి సొగసుల్ని వీక్షిస్తూ
సముద్ర కెరటాలకు పొంగిపోతూ
సూర్యోదయ బంగారు కాంతుల్ని పరీక్షిస్తూ
పరువంగ పెరిగిన పచ్చని పైరును తిలకిస్తూ
పర్వత శిఖరాలపైకెక్కి పరవశిస్తూ
పులకించిపోతోంది / ప్రకృతి అందాలకు ప్రణమిల్లుతూ!

నింగిలో వెలిగే వెనె్నల చుట్టూ
నీలిమేఘాల నీడల చుట్టూ
తళతళ మెరిసే తారలచుట్టూ
తిరుగుతోంది తరించిపోతున్నట్టు!

సప్త స్వరాలతో సంయమనమవుతోంది
సరిగమలలో సుమమై వికసిస్తోంది
గానమాధుర్యంలో ఆర్థ్రమై పోతోంది
సాహిత్య గుభాళింపులతో సంగీతవౌతోంది
నర్తించే పాదాలకు నీరాజనాలందిస్తోంది
హావభావాలకు హ్లోదంతో పొంగిపోతోంది!

కలువ కన్నుల చల్లదనానికి
కన్నుల్లో వెలిగే కాంతులకి
ముక్కున మెరిసె ముక్కెర మిలమిలకి
హంసల నడకల సొగసులకు
సహజ సౌందర్యాలకు ధగధగాయమానమై
మది దాసోహమైపోతోంది!

- మల్లిమొగ్గల గోపాలరావు
సెల్: 9885743834

నూతనత్వపు విరిజల్లు

ఆనందంతో విహరించు
ఆద్యంతం జీవించు
కష్టానికి చలించకు
ఇష్టాలను విచలించకు
మధుర స్వప్నాలకీ ఆశపడకు
సుధలు చిందును శ్రమలో వేగిరపడకు
నిండు జీవితాన్ని ప్రేమించు
అండగా ప్రతి వారికి ప్రేమనింపు
మనసున్నందుకే వరించకు చావును
వయసున్నందుకీ అడ్డదారిలో చరించకు
నిలబడు ధైర్యంగా తుపానులు,
వరదలు, ఉత్పాతాలు, పిడుగులు
ఏవైనా భరించు...
నిలకడయున్న జీవితాన్ని వరించు
అప్పుడే నీవు విజేతవు
కాకెన్నడు పరాజితవు

- బిహెచ్‌వి రమాదేవి
సెల్: 94415 99321

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, నేషనల్ హైవే, ధవళేశ్వరం, తూ.గో.జిల్లా.
email: merupurjy@andhrabhoomi.net