రాజమండ్రి

అమ్మ భాష అమృతం.. కాపాడుదాం అందరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భయపడుతున్నారు పిల్లలు తెలుగు నేర్వాలంటే
దండిస్తున్నారు ఉపాధ్యాయులు తెలుగు మాట్లాడితే!
జరిమానాలు విధించి జడిపిస్తున్నారు
తెలుగు శబ్దం వినిపిస్తే!
లక్షలు పోసి చదివిస్తున్నాం కనుక ఆంగ్లభాషే
లక్ష్యమని భావిస్తున్నారు తల్లిదండ్రులు!

బోధపడటం లేదు భాషాభివృద్ధి జరిగేదెలాగో
తెలియడం లేదు తుది శ్వాసతోవున్న
తెలుగు తల్లినెలా రక్షించాలో!
భాషకు ప్రాచీన హోదా తెస్తామన్న
నేతల మాటలు నీటిపై రాతలయ్యాయి!
ప్రభుత్వాల శుష్క వాగ్దానాలతో
అమ్మ భాషా వైభవం క్షీణిస్తోంది!

ప్రపంచంలో ఏమూల కెళ్లినా పొరుగు రాష్ట్రాల వాళ్లు
వారి భాషా సంప్రదాయాల భవిష్యాన్ని రక్షించుకుంటున్నారు!
విదేశీ భాషకు విధేయులమవుతూ మనవాళ్లు
నిష్ణాతులు కాలేని దురదృష్టం ఏ భాషలోనూ!

తెలుగును తక్కువగ చూస్తే
మన సంస్కృతికి తెగులు పట్టినట్టే
అమ్మ భాషపై అలసత్వం చూపితే
ఆత్మ విశ్వాసం కోల్పోయినట్టే!
బతుకు తెరువుకై భాషలెన్ని నేర్చినా
మాతృభాషపై మమకారం వీడితే
తల్లికి ద్రోహం చేసినట్టే!

పాఠశాలల్లో మాతృభాషాభ్యాసం సాగించాలి తప్పక
తెలుగు మాద్యమం విద్యార్థులకు కల్పించాలి ఉద్యోగం విధిగా!
భాషాభిమానులు కొందరు మహానుభావులు మాత్రం
ఉత్కృష్టమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ తెలుగు వెలుగుకై
కృషిసల్పుతున్నారు అనవరతం వారికి ప్రణామం!

తెలుగు భాష సమత మమతల మాన్యం
పరభాషలకన్న మన భాష మధురాతి మధురం!
విశ్వభాషలలో వినుతికెక్కింది తెలుగు
చదువరులకు సంక్రమించు జ్ఞానపు వెలుగు!

సంగీత సాహిత్య నృత్య కళలు
తెలుగు తల్లి కళ్లలో వెలుగు దీప్తిలు!
లేదు జన్మభూమిని మించిన స్వర్గం
మన భాష భాసురంలో దొరుకు సన్మార్గం!

పసిపాప నవ్వులలో పరిమళించు పువ్వులలో
ప్రకాశిస్తుంది తెలుగు,
బావ మరదళ్ల మురిపాలలో ప్రేయసీ ప్రియుల
కౌగిళ్లలో పులకరిస్తుంది తెలుగు!

తేటతెల్లవౌతుంది తెలుగు
మన ఆట పాటల్లో కట్టుబొట్టులో
శిశువు వికాసానికి తల్లిపాలు
మనో వికాసానికి అమ్మ భాష మేలు!

పద్యం తెలుగు వారి భాగ్యం
అష్టావధానం మన భాష అదృష్టం!
పద్య గద్యాల పదాలు పరిఢవిల్లునంత కాలం
జిలుగు వెలుగు తెలుగు వర్ధిల్లుతుంది కలకాలం!

మాతృభాషను ప్రేమించని వాడు
ప్రేమించలేడు దేశాన్ని
తెలుగు భాష తరతరాల నిధి
కాపాడుకోవడం మన విధి!

- మల్లిమొగ్గల గోపాలరావు
రాజమండ్రి, సెల్: 9885743834

మనసు పునర్జీవన మవుతుంది

ఉదయం చెప్పింది
జనన వందనం
ఆహ్లాదంగా

నవ్వు విరిసినట్టు
మురిసింది
చెలి మనసు

నవ్వుల మురిపెంలో
పరవశం చెందిన తనువు
హృదయాంతరాలను చుట్టి
మదికి దాసోహమై పోతుంటుంది

మురిపాల చెల్లింపులో
వలచిన సయ్యాట
పారవశ్యపు మాధుర్యానికి
బదులు పలికింది
ప్రేమకు ప్రతిరూపమయింది
వలపు పంట పసివాడనిదై
మాతృత్వపు సార్థకత నిచ్చింది

కమ్మని ఊసులకు
జోల పాడ లేదు
కలబోసిన కబుర్లకి
ఊయల ఊపలేదు
అనురాగాల ఆలోచనలో
ఆత్మీయత పరాధీనమయింది
ఆశ చిగురు తొడిగే చిన్న కోరికను
నిర్లక్ష్యంగా కాలం చిదిమేసింది

చెలి బంధనాలన్నీ తెంపి
స్వాంతనతో చెంత నిలిచి
రమ్యభరితంగా రవళిస్తుంటే
ఒంటరిదైన మనసును
అపరాహ్న వేళ
వేదనగా వేగిరిపరిచేస్తుంది

ఊపిరి సలపనివ్వని
వేడి ఊహలు
గాఢంగా నిట్టూర్చాయి
శిబిరాన్ని కమ్ముకొచ్చిన కాస్త హాయి
మాఘ మాసాన్ని మోసపుచ్చి
సందె పొద్దు చాటున
తీరం దాటిపోయింది

మదిని పునఃస్మరణ చేసే కొలది
ఆత్మ అజరామరం అవుతుంది
కాంతిలోకి తనువు ప్రస్థానమైపోయి
మనసులోంచి మనలోకి
పునర్జీవన మవుతుంది.

- అమృత్,
సెల్: 9494842274

మానవతా సదనం

సమతుల్య సమన్విత ప్రేమపూరిత పలుకు
సుమసౌరభ రసభరిత నెయ్యమును కలుపు
సాత్వికత రహిత వాచాలత కయ్యము నుసిగొలుపు
అవాకు చవాకులు వాద వివాదములకు పిలుపు
కనుక కవిగా నేపలికే పలుకు నీకు అమూల్య కానుక

సాటి వారితో సదా కావాలి మన సంభాషణం
ఛీత్కారానికి దారితీయని చమత్కార తోరణం
అపహాస్యం చేయని తీయని హాస్యరసావిష్కరణం
ఉగ్ర ఆగ్రహానికి చోటీయని అమూల్య నిగ్రహ భూషణం
ఆ దైనందిన జీవితం నవరస ప్లవితి నివేదనం
కాదు కాదు బ్రతుకు వేదనారోదనల కదన సంబంధనం
అది ప్రసాదిత ధగధగాయమాన మానవతా మందిరం
చేయి చేయి కలిపి సంరక్షించుకుందాం మనమందరం

- చాగంటి సుబ్రహ్మణ్యం
అనపర్తి, తూ.గో.జిల్లా, సెల్: 9573386124

మధువు - నేను

నువ్వూ, నేనూ అల్లిన బంధం ఈనాటిదా?
దశాబ్ధాల పైమాటే

ఎవరిలో ఎవరు చేరామో గుర్తులేదుగాని
నీ స్పర్శ తగిలిన నా ప్రతి కణం
మొద్దుబారుతూనే వుంటుంది అప్పుడప్పుడూ

అయినా విడిచిపెట్టలేని నీటి బంధంగా
నా కళ్ళముందు ప్రవహిస్తూ వుంటావు.

ఆ చెమ్మను దాటగలిగితే
నేనిక నిజమైన మనిషిగా మిగులుతాను
నా పరివారానికి.

నీలో కలిపిన హిమపు ముక్కలా
నా ఉనికి కోల్పోదలుచుకోలేదు

నువ్వు ప్రవహించే నదికి
నా దేహాన్ని మధుశాలగా మార్చలేను
ఇక శెలవు నీకు!

- గుబ్బల శ్రీనివాస్
గుడిమూల - 9502276777
సఖినేటిపల్లి మండలం

ఎండాకాలం

ఎండాకాలం
మండుతున్న జీవితం
ఆకాశాన్ని ముద్దాడుతున్న
ఎండలు
చల్లదనం కోసం
పరుగులు తీస్తున్న జనం
రోడ్లు పక్కన చెట్లు కనిపించడం లేదు
అపార్ట్‌మెంట్ల సిమ్మెంట్ వేసి
గొంతు తడి చేసుకోడానికి
మున్సిపల్ టాప్‌లో చుక్క నీరు కరువు
రోడ్ల మీద మద్యం ప్రవహిస్తోంది
నీరే కరువు
గొంతెత్తి పాడాలన్నా
నాలుకకు తడి లేదు
నీటి పాట నగ్న సత్యం
ఎవ్వరికీ వినిపించడం లేదు
విద్యుత్ కోతతో
జనరాతలు కనిపించడం లేదు
కాలం చెక్కిన లేడి శిల్పం
మండే తపస్సమాధి

- నల్లా నరసింహమూర్తి
అమలాపురం, చరవాణి: 9247577501

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి
email: merupurjy@andhrabhoomi.net