రాజమండ్రి

వెలుగుల చీకట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నాకు నీ వాలకం నచ్చటం లేదు’ కోపంగా అన్నాడు శ్రీరాజ్.
‘ఏం నేనేం తప్పు జేశాను’ ఏడుపు ముఖంలో అంది ఉషా సింగ్.
‘నీవు ఫోన్ మాట్లాడేటపుడు స్పీకర్‌లో పెట్టమన్నానా?!’ రౌద్రంగా ఉంది అతని ముఖం.
ఇక్కడ ఉష బుల్లితెర హీరోయిన్. అందరూ ఆమె నటనకు నీరాజనాలు పడతారు. ఆమె నవ్వితే నవ్వుతారు. ఏడిస్తే ఏడుస్తారు. మానసికంగా కుమిలిపోతుంటే అంతే ప్రమాణంలో వీళ్లు ఆవేదన పడతారు. కాని తెరవెనుక ఆమె పడే బాధలు ఎవరికీ తెలియవు.
‘ఏంటాలోచిస్తున్నావ్. పర్ డే లక్షన్నర డ్రా చేస్తున్నావట. ఎవరి ఎకౌంట్‌లోకి వెళ్తుంది?’ అతని స్వరం తీవ్రంగా ఉంది.
‘నా ఎటిఎం నీ దగ్గరే ఉంది కదా రాజ్! అర్ధోక్తితో అంది ఉష.
‘ఒకటి నా దగ్గరే ఉందిలే’ వెయిట్ తిప్పుతూ టేబుల్‌పై పెడుతూ అన్నాడు.
‘అంటే ఏంటి నీ ఉద్దేశం?’
‘సింపుల్ బంగారు. రేపు మనకు పిల్లలు పుట్టాక వారి భవిష్యత్తు కోసం ఏమైనా వేరే అక్కౌంట్ ఓపెన్ చేశావేమోనని’ భుజాలు పట్టుకుని బుగ్గపై ముద్దు పెడుతూ అన్నాడు.
‘అదేం లేదు’ అడ్డంగా తల తిప్పింది. అతని చేతుల్లో ఏం మాయ ఉంది. ఎంత బాధపెడుతున్నాడు. నిన్న బంతిలా విసిరేసి గోడకేసి కొట్టాడు. వేరే అమ్మాయితో ఎంత క్లోజ్‌గా ఉన్నావని అడిగినందుకు మాటా మాటా పెరిగింది. కాని చివరకు అతని కౌగిలిలో అన్నీ మరిచిపోయింది. ఈ జీవితం ముగించేద్దాం అనిపించేంతగా టార్చర్ పెడతాడు. సడన్‌గా ప్రేమ చూపిస్తాడు. పోనీ తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లితేనో... లేదు సహజీవనం కోసం ఇల్లు వదిలి వచ్చేసింది. ఎంతగా నచ్చ జెప్పారు తప్పని. కాని అతని ప్రేమ, ఆకర్షణ, వ్యామోహం తనకు రాజ్ తప్ప ఈ ప్రపంచంలో మరేది ముఖ్యం కాదని అనిపించింది. వాళ్లు ఎంత కట్టడి చేస్తే అంతా అతనికి దగ్గరయ్యింది. చివరకు తల్లిదండ్రుల మీద కూడా రాజ్‌కి ఫిర్యాదు చేసేంతగా దిగజారింది. కాని ఇప్పుడు అనుభవిస్తోంది.
‘ఏంటాలోచిస్తున్నావ్ రా? పిక్చర్‌కి వెళదామా! రెడీ అవ్వు’ అతని మాటలో అభ్యర్థన ఉండదు. అవతలి వాళ్ల అభిప్రాయానికి విలువుండదు. అడగడంలోనే ఆర్డర్ ఉంటుంది.
‘నాక్కొంచెం నీరసంగా ఉంది. రాలేను’
‘నేను ఆటో తెస్తున్నా. త్వరగా రెడీ అవ్వు’ వెళ్లాడు. ఫ్రెండ్‌కి ఫోన్ చేసింది.
‘గీతా! నాకు ఓపిక లేకపోయినా సినిమాకు రమ్మంటున్నాడే’ నేను వెళ్లలేక పోతున్నాను’
‘ఉషా వెళ్లవే వెళ్లు, లేకపోతే మరలా దేనికైనా అలవాటుపడతాడు’
ఉషకు విరగబడి నవ్వాలనిపించింది. తన పాత్రల ద్వారా అమ్మాయిలు ఎంత ధైర్యంగా బ్రతకవచ్చో ప్రభావితం చేస్తుంది. ఈ ఇన్ సెక్యూరిటీతో తాను జీవితాంతం బ్రతకాలి. తను అతనిని ఎందుకు వదిలేయ లేకపోతుంది? తనకు అతనంటే ప్రేమ, పోనీ శారీరక వాంఛల కోసమా! దానికంటే అతను వేసే వెధవ్వేషాలు నిలదీసినందుకు తగిలిన దెబ్బలే ఎక్కువ. పోనీ తల్లిదండ్రులు, సమాజం ఎగతాళి చేస్తారనా? తేల్చుకోలేక గబగబా తయారైంది.
‘సినిమాకా ఇంకా టైమ్ ఉంది. టెంపుల్‌కి వెళదామా’ రాజ్ అన్నాడు.
అతని వంక చిత్రంగా జూచింది. తనకు తెలుసు. ఒక బాధ పెట్టిన తరువాత, ఒక బాధ పెట్టబోయే ముందు విపరీతంగా సంతోషంగా ఉంచుతాడు. మరి జరిగిన బాధకు ఫలితమో లేక రేపు ఇంకేదైనా ఉందో ఏదైతేనో గుడికి వెళ్లడం తనకిష్టం. గుళ్లో పూజారి వీరిని భార్యాభర్తలుగా సంకల్పం చదవటం ఉషా సింగ్‌కి ఆనందాన్నిచ్చింది. అతనికి ప్రసాదం పెడుతూ... అడిగింది
‘మనం పెళ్లి చేసుకుందామా’
‘ఏం ఇది నీవు పెళ్లి అని అనుకోవడం లేదా?’ ముంగురులు సవరిస్తూ అన్నాడు.
‘...అనుకో. కాని సమాజంలో అదో గుర్తింపు కదా!’
‘పెళ్లితో విడిపోతే నా ప్రాపర్టీస్ నీకొస్తాయనే. ఆ ఛాన్స్ లేదు. అంతా మా కుటుంబం పేరనే ఉంటుంది.
‘అదేంటి నే నెప్పుడడిగాను’ కన్నీళ్లతో ఉష.
‘మరి పెళ్లి దేనికి? నేను వేరే అమ్మాయిలతో తిరగాలన్నా, ఇవేవి నన్ను కట్టిపడేయలేవు. ఓన్లీ నీ ప్రవర్తనే మన బంధాన్ని నిలుపుతుంది.’
‘అంటే మన బంధం నిలవడానికి, నీ ప్రవర్తన కారణం కాదా?’ రోషంగా అంది.
‘అనేకదా! నిన్న నాకోసం ఎవరో వచ్చారని గొడవ పడ్డావ్. ఆమె నీకంటే నాకు ముందే తెలుసు. నీ అపార్థాలతో నీ జీవితం నువ్వే పాడు చేసుకుంటున్నావ్’
‘అంటే నా జీవితంలో నీ జీవితం లేదా? నీవంత క్లోజ్‌గా ఉండవచ్చా. ఆ అమ్మాయి తొడ మీద చెయ్యివేసి, బ్లౌజ్ బటన్ పెడుతూ.. నీవు తప్పుగా ప్రవర్తించలేదా?’
‘అయితే ఏంటి?’ నిర్లక్ష్యంగా అన్నాడు.
ఈ అయితే ఏంటి? అనే పదం విచ్చలవిడితనం బయట పడకుండా జాగ్రత్తపడింది తను ఇన్నాళ్లు. ఈ రోజు అది కూడా అయిపోయింది.
‘నువ్వు ఇలా మాట్లాడగలవని మా ఫ్రెండ్స్ ఎప్పుడో చెప్పారు. నేనే నమ్మలేదు.’ బాధగా ఉష
అతని ముఖంలో రంగులు మారాయి. ‘ఏయ్ పిచ్చీ. జోక్ చేశాను. ప్రేమగా పిక్చర్‌కి తీసుకెళ్లే భర్తను ఇలా ఏడిపించవచ్చా’. భర్త అనే మాట స్ట్రెస్ ఇచ్చి అన్నాడు. అమ్మాయిలు అక్కడే బోల్తా పడేది. ప్రేమగా అతని కౌగిలిలోకి వెళ్లింది. సినిమా చూసి ఇంటికి వచ్చారు. బయట నుండే ప్యాక్ చేసుకొచ్చినవి తిన్నారు. ఉష సెల్ దీసుకుని రిసీవింగ్ కాల్స్ చూస్తున్నాడు రాజ్.
‘ఏంటి చూస్తున్నావ్’ ఉష సెల్ తీసుకోబోయింది.
చూస్తున్న అతని కనులు ముడిపడ్డాయి. ‘ఈ కాల్ మీ అమ్మ వాళ్లదికదూ’
‘అవును’ అంది తలవంచుకుని.
‘శాపనార్థాలు పెట్టారు. బజారుకెళితే ఎవరో నా గురించి కామెంట్ చేశారట’ డైనింగ్ టేబుల్‌పై సర్దుతూ అంది.
‘ఈ రోజు కాల్ చేశారు. రేపు ఇంటికొచ్చేయమంటారు. మరో రోజు ఎవరితోనో పెళ్లి ఫిక్స్ చేస్తారు. అప్పుడు నీకు ఓకేనా!’
‘అలా అనుకుంటే నీతో ఎందుకు ఉంటాను’ ఉష.
‘ఇక నీ సెల్ లోకి ఏ కాల్ వచ్చినా మన ఇద్దరి శవాలు ఫ్యాన్‌కి వ్రేల్లాడతాయ్ జాగ్రత్త!
‘అందులో నా తప్పేం ఉంది’ విరక్తిగా అంది.
‘ఐకాంట్ స్టే వితవుట్ యు’ కౌగిలించుకుంటూ అన్నాడు. అతడు బెదిరించిన తీరుకి, ఈ కౌగిలికి ఎలాంటి సంబంధం లేదు. తనలో భయం ప్రారంభమైంది. ఎప్పుడో విన్నది. పక్షికి రెక్కలు కత్తిరించక్కర్లేదట. నీవు ఎగరలేవు అని బ్రెయిన్ ట్యూన్ చేస్తే చాలట. ఇక్కడ జరిగింది కూడా అదే. తానిక స్విచ్ ఆఫ్‌జేసి పెడుతుంది. అంతే తను తప్పు జేస్తే నాల్గు రోజుల దాకా రాడు. ఎవరితో ఉంటున్నాడోననే భావంతో ఆ నరకం తను అనుభవించలేదు. కాని ఇలా అభద్రతతో ఎంతకాలం? ఎంత కాలం? తనకోసం ఎవరు వచ్చినా అతను పెట్టిన సిఐడీలు అతనికి ఇన్‌ఫర్మేషన్ అంతా ఇస్తారు. ఎందుకు అతను చెప్పినట్టు నడుచుకుంటే పోలా? నిట్టూర్చింది.
ఉదయం రాజ్ వెళ్లాడు. ఇంకా అతను కొట్టిన దెబ్బలు ముక్కుపై, చేతిపై వంకాయ కలర్‌లో అలాగే ఉన్నాయి. అదృష్టం ఈ రెండు రోజులూ షూటింగ్ లేదు. హీరోకి చిన్న యాక్సిడెంట్ వల్ల తన భాగం కూడా వాయిదా పడింది. తలుపుగొట్టిన శబ్దం. కాలింగ్ బెల్ కూడా వినబడనంత నిద్ర తనెలా పోయింది. కిటికీలో నుండి జూచి తలుపు తీసింది. ‘మెరుపు తీగలా ఓ అమ్మాయి. లోనికి రావచ్చా’
‘ఊ.. రండి!’ ఫ్రిజ్‌లో యాపిల్స్, కిస్‌మిస్ ఓ ప్లేట్లో పోసి ముందుకు జరిపింది.
‘అవేం వద్దు. నేను మీకో విషయం చెప్పాలనుకుంటున్నాను. రాజ్ అంటే నాకెంతో ఇష్టం. నేను అతనిని వదిలే ప్రసక్తే లేదు. మీరు కొన్నాళ్లు ఉంటానంటే నాకేం అభ్యంతరం లేదు. ఫైనల్‌గా జీవితం మాత్రం నాదే. ఆమె కళ్లల్లో నమ్మకం, ఆత్మవిశ్వాసం..్ధర్యం. తను ఎందుకు మాట్లాడలేకపోతుంది. నెమ్మదిగానైనా ఎంత అవమానిస్తుంది ఇంటికి వచ్చి. కాని తను తగ్గకూడదు.
‘నిన్న టెంపుల్‌లో రాజ్ పెళ్లి చేసుకుందామన్నాడు’ ఆమె పకపకా నవ్వింది. అప్పుడు తన బుగ్గపైనున్న గాయాలు గుర్తించినట్టుగా మార్చి మార్చి చూసింది. ‘ఈ రెజీనా సంగతి నీకు తెలియదుగాని, అతనికి బాగా తెలుసు’
‘నే వెళ్తున్నా! మీరు ఏ భ్రమల్లో ఉండవద్దు. రాజ్‌కు ఏనాడు ఆమె వార్నింగ్ ఇచ్చిందో బ్రెయిన్ వాష్ చేసిందో తెలియదు. ఈ జీవితం నుండి బయటపడాలి. అమ్మా వాళ్ల దగ్గరికి వెళ్తే రానిస్తారా! గెటవుట్ అంటే. ఇతను కొట్టే దెబ్బలు, బాధలుకన్నా అవేం అవమానం కాదు. అంటే అంటారు. వెళ్లాలి. ఈ బట్టలు ఇవేం తీసుకెళ్లకూడదు. కాని ఆటోకు డబ్బులు కూడా లేవు. అవును పనిపనిషినడగాలి.
‘మీనాక్షి! నాకో రెండొందలిస్తావా? త్వరలోనే ఇస్తా’
‘అదేంటమ్మగోరూ! తీసుకోండి’
‘మొత్తం వెయ్యి అయ్యాయి. రేపు జీతంతో కలిపి నాల్గువేలిస్తాను.’
‘సరేనమ్మ. తీసుకోండి’
రోడ్డు మీదకొచ్చి క్యాబ్ మాట్లాడుకుంది. అడ్రస్ జెప్పింది. ఇంటి ముందుకెళ్లింది. పాపిష్టిదానా! గెటవుట్ ఎక్స్‌పెక్ట్ జేసినవేమీ అక్కడ లేవు. ఎవ్వరూ రమ్మని ఆహ్వానించలేదు. వద్దని పొమ్మన లేదు. అందరి దృష్టి ఆమె బుగ్గలపై, చేతులపై కనబడే గాయాలపై పడ్డాయి. కనబడని గాయాలు ఆమె కళ్లల్లో కనబడ్డాయి. నేరుగా తన గదిలోకెళ్లి కరువుతీరా ఏడ్చింది. నిద్రపోయింది. అమ్మ లేపుతోంది, ‘ముఖం కడుక్కుని స్నానం చేసి భోంచెయ్యి, టేబుల్ మీద అన్నీ ఉన్నాయి’ ఉరితాడుకు వేలాడే ప్రమాదం నుండి తప్పిన ఆడకూతుర్ని జూస్తూ...

- సుధా శశిరేఖ, సెల్: 9441599321

---

పుస్తక పరిచయం

చరిత్రను చాటిన
‘శతాబ్దాల రాజమహేంద్రి’

- ప్రతులకు -
ఇండియా ఇండిపెండెన్స్ సెంటర్
ఫ్రీడమ్ పార్కు, పాల్ చౌక్
కోటిపల్లి బస్టాండ్ దగ్గర
రాజమహేంద్రవరం - 533101
సెల్: 9959678792
--
రాజమండ్రి అంటే ఒక గొప్ప సంస్కృతికి రాజధానిగా కీర్తిల్లిన సంగతి తెలుసు. దానికి శతాబ్దాల చరిత్ర ఉంది. రాజమండ్రి నగరం గురించి, అదెందుకు చారిత్రక రాజధాని అయ్యిందో చాలా మందికి తెలియదు. అలాగే రాజమండ్రి ప్రత్యేకత పూర్తిగా తెలియదు. ఈమధ్యనే జరిగిన పుష్కరాల సందర్భంగా రాజమండ్రి పేరుని మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజమహేంద్రవరం అని కూడా నామకరణం చేశారు. ఆ మార్పు నేపధ్యంలో సాహితీ మిత్రుడు ఇచ్చిన చిన్న గ్రంథం నన్నాకర్షించింది. రాజమహేంద్రి అని కొందరు, రాజమహేంద్రవరం అని మరికొందరు రాజమండ్రి పేరు మార్పుకోసం ఉద్యమించిన సంగతి ఉంది. అయితే ఆ విషయాన్ని పక్కనపెట్టి రాజమహేంద్రవరం అయిన రాజమండ్రి గురించి మంచి సమాచారాన్ని అందించిన పుస్తకం ‘శతాబ్దాల రాజమహేంద్రి’ టైటిల్‌తో జమ్మి రామారావు గారు రాసిన పుస్తకం ముఖ్యంగా బాలలకోసం అలాగే యువత కోసం అత్యుత్తమంగా ఉపయోగపడుతుంది. తెలియని వారికోసం తెలుసుకోగోరే వారికి మరింత ప్రయోజనకారి అయ్యే పుస్తకం.
మనం ఒక విషయం గురించి తెలుసుకోవాలంటే చాలా ఎక్కువ పరిశ్రమించాలి. లేదంటే అంతకుముందే ఎవరన్నా దానిపై అధ్యయనం చేస్తే చరిత్ర సంబంధిత విషయాలపై అవగహనతో రాస్తే విలువైన సమాచారాన్ని సులభంగా పొందే అవకాశం కలుగుతుంది. అచ్చంగా అలా రాజమండ్రిని, దాని ఉత్కృష్ట వైభవాన్ని తెలుసుకునే వీలుని ఈ పుస్తకం కల్పించింది. రాజమండ్రి ఎప్పుడు ఎలా నిర్మితమయింది? వంటి విషయాలు చరిత్రకారుల మధ్య భిన్నాభిప్రాయాలున్నా, రాజమండ్రి అనగానే రాజరాజ నరేంద్రుడే జ్ఞప్తికొస్తాడు. అయితే అంతకన్నా ముందే మొదట అమ్మిరాజు, విష్ణువర్ధనుడు, రాజమహేంద్రవర నగర నిర్మాతలని ఆధారాలెక్కువున్నాయి. వైదికులు, బౌద్ధులు, జైనులు, శైవులు, వైష్ణవులు, ముస్లింల పాలన పర చరిత్రలో లిఖించబడ్డా చాళుక్యుల వల్లే ప్రాభవాన్ని సంపాదించుకుందనటంలో సందేహం లేదు. అనేక శాసనాల ద్వారా చాలావిషయాలు బయటపడినప్పటికీ రాజరాజనరేంద్రుని ఆస్థాన ప్రముఖుడైన నన్నయ్య భట్టారకుని వల్లే మన నగర ఖ్యాతి మరింత విస్తారమైంది. ఎలా అంటే నన్నయ తెలుగు లిపి కర్త, తెలుగు వ్యాకరణ కర్తాను. భాషాపోషకుడు రాజరాజనరేంద్రుడు వల్ల భారతాన్ని ఆంధ్రీకరణ చేసిన నన్నయ వారి కీర్తి వల్లే నగరానికి అంత ఖ్యాతి. తూర్పు చాళుక్యులు మూడు వందల ఏళ్లు పాలన చేశారు. అయితే వారిలో వారికి జరిగిన అంతర్గత పోరాటాల వల్ల చోళుల వశమైంది. కాకతీయ గణపతి దేవుని కాలంలో వేణుగోపాల ఆలయాన్ని ఉల్లూఖాన్ 1323లో స్వాధీనం చేసుకుని మసీదు నిర్మించినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. వేణుగోపాలస్వామి గుడి వేంగి చాళుక్యుల కాలం నాటిది. ఆ తర్వాత రెడ్డి రాజులు పరిపాలించారు. వీరి హయాంలోనే శ్రీనాథుడు ‘్భమఖండం’ రాశాడు. ఈ కావ్యంలో రాజమండ్రిపై వర్ణన ఉంది. ఆ తర్వాత గజపతుల పాలనలోకి, తర్వాత మొగలాయిలు, ఫ్రెంచి, ఈస్టిండియా, బ్రిటీష్ విషయాలను చాలా సరళ పర్చి చెప్పారు గ్రంథ రచయిత జమ్మివారు. ఆయన లైబ్రేరియన్ అనుభవం బాగా దోహదపడింది.
ఇక మనకు 19వ శతాబ్దానికి సంబంధించి జిల్లా కేంద్రంగా రాజమహేంద్రి ఏర్పడింది. 1802లో జిల్లా కోర్టు ఏర్పడితే 1852లో కాటన్ ధవళేశ్వరంపై ఆనకట్ట నిర్మించాడు. 1853లో ఆర్ట్స్ కళాశాల, 1883లో ట్రైనింగ్ కాలేజీలు స్థాపించడం జరిగాయి. అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో మొత్తమీద మూడు కాలేజీలుంటే ఆంధ్రప్రాంతంలో ఉన్న ఒకేఒక్క కాలేజీ రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్. భారతదేశంలో ఆరు ఉపాధ్యాయ శిక్షణా కేంద్రాలుంటే ఒకటి మన రాజమండ్రి ట్రయినింగ్ కాలేజి. మార్కండేయస్వామి ఆలయాన్ని 1410లో కాటయవేముని భార్య మల్లాంబిక కట్టినట్టు తొత్తరమూడి శాసనం చెప్తుంది. ఇలా చాలా విషయాలు పొందుపరిచారు రామారావు గారు. 1760లో మసూచి వ్యాధి సోకి విజయనగరం మహారాజు ఆనంద గజపతి రాజమహేంద్రిలోనే మృతి చెందారు. ఆయన భార్య అతనితో సహగమనం చేశారు. సతీ సహగమనం చేసిన రికార్డు మనకీ ఉంది. వారి సమాధి రామకృష్ణ మిషన్ ఆవరణలో పాలరాతి సమాధిగా కన్పిస్తుంది. అలాగే 1866లో రాజమండ్రి మున్సిపాల్టీగా రూపొందింది. 1881లో కందుకూరి వీరేశలింగం తొలి వితంతువు పెళ్లి జరిపించారు. మరో పదేళ్లకు అంటే 1891లో టౌన్‌హాలుని నిర్మించారు. ఇలా అనేక ప్రత్యేకతల సమాహారాన్ని సులభ శైలిలో రాసిపెట్టారు.
చారిత్రక వివాదాల జోలి వదిలి విషయాలపై మాట్లాడుకుంటే చరిత్ర పరిశోధకుడు, కవి, సినీగేయ రచయితలు ఆరుద్ర - రాజమహేంద్రపురం, రాజమహేంద్రవరం - రాజమహేంద్రం, రాజమందిరి, రాజమండ్రి, రాజమండ్రిగా పిలువబడుతున్న ఈ నగరం అసలు నామం ‘రాజమహేంద్రి’ ఏదిఏమైనప్పటికీ కురచగా, సౌలభ్యంతో పిలుచుకున్న రాజమండ్రి గొప్పగా మహోన్నతంగా రాజమహేంద్రవరం అయ్యింది. పొట్టిగా పిల్చుకున్నా గట్టిగా పట్టుకున్నా దాని పటిష్టతకు పాటుపడే గొప్ప అవకాశాన్ని ప్రజలు తమ చేతుల్లోకి తీసుకుని ప్రశ్నిస్తేనే పాలకులు చెప్పిన ‘వరం’ మన పరం అవుతుంది. చారిత్రక సంపదకు నెలవు మన రాజమండ్రి శిథిల దశకు చేరుకుంటున్న వాటిని సంరక్షించి కాపాడుకొంటే మనదెంత గొప్ప నగరమో భావితరానికి అంత గొప్పగా అందించ గలుగుతాము. ప్రస్తుతం ఉన్న సెంట్రల్ జైల్ డచ్‌వారి కోట. అది అప్పుడు ఆయుధాగారం. అది కాస్తా కారాగారం అయ్యింది. ఇప్పుడు ఆధునిక సొబగులతో స్వాగతిస్తుండటం చూస్తున్నదే. 11వ శతాబ్దం నాటి అపూర్వ దేవాలయం లక్ష్మీనరసింహ దేవాలయం. ప్రస్తుత పెద్ద మసీదు పూర్వం వేణుగోపాలస్వామి గుడి. మూలాంకూరమ్మ కోర్లమ్మ ఎలా అయ్యింది. కొండవీటి రెడ్ల కుల దేవత మన రాజమండ్రి గ్రామ దేవత. వీరేశలింగం గారు నిర్మించిన విద్యా సంస్థలు, టౌన్‌హాలు, జిల్లా కోర్టు, మున్సిపల్ ఆఫీసు, ట్రైనింగ్ కాలేజీల గురించి క్లుప్త పరిచారు. సుబోధకమైన విషయ సమగ్రత ఉంది. రాజమండ్రి గురించి తెలుసుకోడానికి బాగా పనికి వచ్చే చిన్న పుస్తకం పెద్ద అవసరతను తీరుస్తుంది. చరిత్రను రక్షించుకోవాలన్నా సంస్కృతిని సంరక్షించుకోవాలన్నా చరిత్రను చదివి అవగాహన చేసుకోవాలి. సామాజికంగాను, అవగతం చేసుకోవాలి. ఏది ఏమిటో ఎవరు ఏమిటో తెలుస్తుంది కేవలం చదవడం వలనే సుమా. చరిత్రపైన సమాజంపైన సంఘంపైన ఒకింత అభిమానం పెంచుకుంటేనే మనపై ఉన్న బాధ్యత ఇట్టే అర్థమవుతుంది. ఆ దిశగా అడుగులు వేయడమూ పూర్తవుతుంది.
- రవికాంత్
సెల్: 9642489244
----

మనోగీతికలు

మలి సంధ్య

అవును
నా జీవిత ప్రయాణంలో
నేనిపుడు అందమైన
ఒక సాయంసంధ్యలోకి అడుగుపెట్టాను
నేనే కాదు,
అందరూ అనివార్యంగా
ఎప్పటికైనా
ఈ మలి సంధ్యలోకి అడుగుపెట్టాల్సిందే.
జీవితంలో
బాల్యం ఒక మేలి పొద్దైతే
వృద్ధాప్యం
ఒక ఆహ్లాదకరమైన సాయం సంధ్య
రెండూ ఇంచుమించు ఒక్కటే
బరువు బాధ్యతలు తెలీని
కల్లాకపటం లేని తొలి సంధ్య బాల్యమైతే
బాధ్యతలన్నీ తొలగి నిర్మలంగా
విశ్రమించే మలి సంధ్య వృద్ధాప్యం.
రోజంతా పనిచేసి అలసి సొలసిన ఈ దేహాన్ని
సాయంత్రపు చల్లగాలి సేదదీర్చినట్లే,
జీవితమంతా ప్రయాణించి
అలసి సొలసిన ఈ ప్రాణాన్ని
వృద్ధాప్యం అనునయిస్తుంది.
ఇంతకాలం,
నేను - నా చదువు
నా ఉద్యోగం - నా కుటుంబం అంటూ
నా బాల్య వనాల
ఉరుకులు పరుగులతో
నాకు తెలీకుండానే
నా జీవితంలోంచి జారిపోయాయి
ఇప్పుడిక సాయం సంధ్య
నా చేతుల్లోనే ఉంది.
దీన్ని ఇంతలో చేజారనివ్వను
ఎందుకంటే, ఈ కాలం
సాయం సంధ్యని ప్రకృతికి,
వృద్ధాప్యాన్ని మనిషికి,
వరంగా ప్రసాదించింది
సాయంకాలం మవటమంటే
అస్తమించటం కాదని
క్రొత్త ఆలోచన ఉదయించటమని,
వృద్ధాప్యమంటే శాపం కాదని
అర్ధం చేసుకొంటే
అదొక జీవన సంధ్య అనీ
జీవిత చరమాంకంలో
నిత్యనూతనంగా, చైతన్యవంతంగా
తాత్త్విక చింతనకీ
సామాజిక సేవకీ
ప్రశాంత జీవనానికి అది
మార్గాన్ని సుగమం చేస్తుందని
నాకు అర్థమయింది.
అందుకే నేను
సాయంకాలాన్ని, వార్ధక్యాన్ని
రెంటినీ మనసారా ఆహ్వానిస్తాను
తనివితీరా ఆస్వాదిస్తాను

- డాక్టర్ జోశ్యుల కృష్ణబాబు
పెద్దాపురం, సెల్: 9866454340

---
వికసించే పువ్వు

చెట్టు హృదయం
వికసించే పువ్వు
అందమైన పాఠాల కళ్లను
మోస్తున్న మట్టి చైతన్యం
కాలంతో కరిగిపోయే
పువ్వు అందం
కనిపించి
కనిపించని క్షణంలో
ఒక దుఃఖం
గుండెలో నుచ్చెనవవుతుంది
మళ్లీ
ఉదయం మరో పువ్వు వికసిస్తుంది
ఉదయానికి రాత్రికి
ఆరంభం, ముగింపు ఆట
దృశ్యంగా కొనసాగుతోంది
ప్రకృతి నిరంతర ప్రవాహ నది
ఆ క్షణంలో
నిన్ను నేను మరచిపోతాను
నా హృదయం వీణను
పువ్వునవ్వు సుతారంగా
తీగెను మీటుతుంది వౌనంగా
సీతాకోక వచ్చాక
చెట్టు చెట్టుగా బతుకుతుంది
కొత్త ఊపిరి పోసుకుంటుంది

- నల్లా నరసింహమూర్తి
అమలాపురం
చరవాణి: 9247577501

---
అమ్మ కోసం

అమ్మ అనుకొని ఆశపడ్డ
అమ్మ కాదని దిగులుపడ్డ
అమ్మ లేదని అమ్మ రాదని
అదిరిపడి నే బెదురుతున్న

అయ్య చెప్పిన అమ్మ మాటలు
ఆలకించానట
ఆటపాటలలోన నే పడి
అమ్మ వూసే ఆదమరిచా

అమ్మ అనుకొని ఆశపడ్డ
అమ్మ కాదని దిగులుపడ్డ

ఈడుజోకు బాలలంతా
చేరి పరుగున అమ్మ ఒడికి
దిక్కులేని బిడ్డనైనే
బిక్కు బిక్కున నాన్న కడకి

అమ్మ అనుకొని ఆశపడ్డ
అమ్మ కాదని దిగులుపడ్డ

అశ నిండిన కాలమంతా
బోసి నవ్వున కరిగిపోగా
ఒంటిగా నేనింటి గుమ్మిట
కంటతడినే పెట్టుకొంటూ

అమ్మ అనుకొని ఆశపడ్డ
అమ్మ కాదని దిగులుపడ్డ

పండగైనా పబ్బమైనా
అమ్మ పాటే నోట నాకు
పదిలపరిచిన బరువు గుండెకు
పలకరింపే కరవు నాకు

అమ్మ అనుకొని ఆశపడ్డ
అమ్మ కాదని దిగులుపడ్డ

- కోన బాబూరావు, సెల్:9603880783

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, నేషనల్ హైవే, ధవళేశ్వరం, తూ.గో.జిల్లా. ళ్ఘౄజ: ౄళూఖఔఖూకబ్ఘశజ్ద్ఘూఇ్ద్య్యౄజ.శళఆ