విజయవాడ

గడుసు కాకికి గడిచిన గండం! (బాలల కథ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనగా అనగా ఒక ఊరు. ఆ ఊరి చివర ఒక ఇల్లు. దానిని ఇల్లు అనేకంటే తోట అంటే బాగుంటుంది. ఎందుకంటే ఆ ఇంటి చుట్టూ అన్ని రకాల మొక్కలు, చెట్లు ఉన్నాయి. వాటి నిండా రంగు రంగుల పూలు. రకరకాల పండ్లు, పిచ్చుకలు, కాకులు, చిలుకలు, గోరువంకలు, ఇంకా రకరకాల పక్షులు ఆ చెట్లకొమ్మల్లో గూళ్లు కట్టుకొని ఉంటున్నాయి. పక్షులే కాదు ఉడుతలు కూడా సందడి చేస్తుంటాయి. సీతాకోకచిలుకల సంగతి వేరే చెప్పాలా!
ఆ ఇంట్లో, అదే ఆ తోటలో పసి అనే ఓ చిన్న అమ్మాయి ఉంది. రోజూ పొద్దునే్న ఆ పక్షుల కూతలు, అరుపులతోనే పసి నిద్రలేస్తుంది. నిద్రలేచి పక్షుల సందడి వింటూ, ఆనందిస్తూనే కొద్దిసేపు బడిలో చెప్పిన పాఠాలు వల్లెవేస్తుంది. తన పనులన్నీ పూర్తి చేసుకుని బడికి తయారవుతుంది. ఇంతలో పసి నాయనమ్మ అల్పాహారం సిద్ధం చేస్తుంది. పసి దానిని ప్లేటులో పెట్టుకుని ఇంటి పంచలోకి చేరుతుంది. అంతే! ఠంచనుగా రెండు కాకులు వచ్చి పసికి దగ్గరలో వాలతాయి. అప్పుడప్పుడు అతిథిలా మూడో కాకి కూడా వస్తూంటుంది.
పసి తను తినేది ఏదైనా సరే చిన్నచిన్న ముక్కలు చేసి కొన్ని ముక్కల్ని కాకులకు వేస్తుంది. ఇలా చాలాకాలంగా జరుగుతోంది. రెండు కాకుల్లో ఒకటి తనకు అందినది తిని తృప్తిపడేది. రెండో కాకి గడుసుది, ఆశపోతుది. పసి వేసిన ఆహారంలో అధిక భాగం గడుసు కాకి గబుక్కున ముక్కున కరుచుకుని ఎగిరి వెళ్లి అవతల ఎడంగా వాలేది. పసి మరో ముక్క విసరగానే మళ్లీ రివ్వున వచ్చి తన నేస్తం అందుకోబోయే ముక్కనూ టక్కున తానే తన్నుకుపోయేది. పాపం! మొదటి కాకి ఉసూరుమని చూసేది. గోలచేసేది కాదు. పసికి జాలేసి దానికి దగ్గరగా పడేలా మరికొన్ని ముక్కల్ని విసిరేది.
ఇది చూసి పసివాళ్లీ నాయనమ్మ ‘నీకు పెట్టేదే కాస్త. బతిమాలగా బతిమాలగా అందులో నువ్వు తినేది కొద్ది. కాకులకూ, పిట్టలకూ పందేరం జాస్తి’ అని పసిని అరిచేది. ఆమె అరుపులకి పసి పకపక నవ్వేది. వీళ్ల గోలకి బెదిరిన కాకులు ఏ చెట్టు కొమ్మలమీదనో వాలి ఇంకో ముక్క ఎప్పుడు వస్తుందా? అని ఎదురుచూసేవి.
ఇలా జరుగుతుండగా, ఒకరోజు అల్పాహారంలోకి క్యారెట్ కూర చేసింది పసి నాయనమ్మ. అలవాటు ప్రకారం పసి చపాతీ ముక్కలతో పాటు క్యారెట్ ముక్కలు కూడా కాకులకు వేసింది.
ఎప్పటిలాగే గడుసు ఆశపోతు కాకి హడావుడి చేస్తూ ఆ ముక్కల్ని ఆత్రంగా గబగబా ముక్కున కరుచుకు వెళ్లే ప్రయత్నంలో ఉంది. ఈ తొందరలో క్యారెట్ ముక్కలు గొంతులోకి జారాయి. గొంతులో అడ్డం పడ్డాయి. అంతే! ఆశపోతు కాకి అయోమయంలో పడిపోయింది. కక్కలేదు, మింగలేదు, అరవలేదు, అటు గెంతింది, ఇటు గెంతింది. మెడ సాచి అరవబోయింది. ఏమిచేసినా ఆ ముక్కలు దాని గొంతులోంచి బయట పడలేదు. లోపలికి పోలేదు. దాని నోరు మూత పడలేదు. గిలగిలలాడిపోతోంది.
నేస్తపు కాకి దాని బాధను చూసి తల్లడిల్లిపోయింది. నిలువునా కరిగిపోయింది. దాని చుట్టూ చుట్టూనే తిరుగుతోంది. వాటి భాషలో ఏదేదో చెపుతోంది. పసి కూడా కంగారుగా, ఏమవుతుందోననే ఆందోళనతో వాటినే చూస్తోంది. ‘స్కూల్ టైమ్ అయింది. నీ టిఫిన్ ఎంతసేపు? కానీ తొందరగా. తినకుండా అలా దిక్కులు చూస్తావేం?’ అని గట్టిగా అరుస్తోంది పసి నాయనమ్మ.
‘ఉండమ్మా!’ అన్నదే గాని, పసి చూపుల్ని కాకుల నుండి తిప్పలేదు. ఆ కాకికి ఏమవుతుందోననే పసి ఆందోళన. వాటినే చూస్తోంది.
మొదటి కాకికి చటుక్కున ఒక ఉపాయం తట్టింది. చుట్టూ చూసింది. చివర్న చిన్న వంపు తిరిగిన పొడుగాటి గట్టిపుల్ల ఒకదాన్ని తెచ్చి కాలి కింద పెట్టుకుంది. గడుసు కాకి ఇదేం పట్టించుకునే స్థితిలో లేదు. మొదటి కాకి గడుసు కాకితో గొడవ పెట్టుకుంది. ముక్కుతో పొడిచి, కాళ్లతో తన్నబోతోంది. అమాయకంగా మెత్తగా ఉండే దీని చేష్టలకి గడుసు కాకి ఆశ్చర్యపోయింది. అసలే కిందా మీదా పడుతూ తలకిందులవుతున్న దానికి అంతలోనే బాగా కోపం వచ్చింది. పెద్దగా అరిచేందుకు ప్రయత్నిస్తూ నోరు బాగా తెరచి మొదటి కాకి మీదకు ఎగబడింది. మొదటి కాకి సరైన అదను చూసి కర్రపుల్లను గడుసు కాకి నోట్లోపెట్టి మెల్లిగా నెట్టింది. దాంతో క్యారెట్ ముక్కలు గొంతులోంచి దాని పొట్టలోనికి జారిపోయాయి. అంతే! గడుసు కాకి బాధ చటుక్కున మాయమయింది. మెడ అటూ ఇటూ తిప్పింది. హాయిగా రెక్కలు ఆడించింది. ‘కావ్.. కావ్..’ అని అరిచింది.
అంతవరకూ ఊపిరి బిగపట్టుకొని చూస్తున్న పసి ‘హమ్మయ్య!’.. అంటూ గబగబా తన అల్పాహారం తినడం పూర్తిచేసి స్కూలుకు వెళ్లిపోయింది. తన గడుసుదనం, దురాశ వలన కలిగిన ముప్పును, స్నేహితుని మంచితనం వలన కలిగిన మేలును ఆశపోతు కాకి తెలుసుకుని తన బుద్ధిని మార్చుకుంది. అప్పటి నుండి ఏ ఆహారాన్ని అయినా చెరిసగంగా పంచుకుని హాయిగా, ఆనందంగా తినేవి ఆ రెండు కాకులు.

కె శరచ్చంద్ర జ్యోతిశ్రీ,
పెదకూరపాడు, గుంటూరు జిల్లా.
చరవాణి : 9491128554

ఆధ్యాత్మికం

ధర్మ రక్షకుడు.. ఆదర్శ లోకపాలకుడు

రామో విగ్రహవాన్ ధర్మః అంటే ధర్మానికి ప్రతిరూపం సాక్షాత్తూ శ్రీరాముడు అని అర్థం. ఈ మాట అన్నది ఎవరో కాదు, క్రూర రాక్షసుడైన మారీచుడు రాక్షసరాజైన దశకంఠునితో అన్న మాటలివి. రాముడు ధర్మ రక్షకుడు. పితృవాక్య పరిపాలకుడు. సకల సద్గుణాలు కలిగినవాడు కావటం వల్లనే శ్రీరాముణ్ని సకల గుణాభిరాముడు అన్నారు. రామాయణ మహాకావ్యం బహు రమ్యమైనది అయినా రాముని పాత్ర ఆదర్శవంతమైనది కావటం వల్ల నేటికీ రామాయణం ప్రజల గుండెల్లో స్థిరంగా ఉంది. సీతారాములు ప్రజల మధ్యనే ఉన్నారు!
రామాయణ మహాకావ్యాన్ని ఆధ్యాత్మిక దృష్టితో పరిశీలిస్తే రాముడు, సీత, లక్ష్మణ పాత్రలన్నీ దేవీ దేవతల రూపాలతో కనిపిస్తాయి. అదే రామాయణాన్ని సాధారణ దృష్టితో చూస్తే అందులోని పాత్రలన్నీ నిత్యజీవితంలో మనచుట్టూ తిరిగే సంఘటనలను గుర్తుచేస్తాయి. అందుకే రాముడు అవతార పురుషుడయ్యాడు. దశావతారాల్లో ఒక అవతారమైన మానవ జన్మలోని విశిష్టతను ప్రపంచానికి చూపించాడు. మానవుడిగా పుట్టినవాడు ఏదైనా సాధించగలడన్న మాటకు రాముడిని నిదర్శనంగా చూపవచ్చు. శ్రీరాముడు మనకు ఒక పుత్రునిగా, ఒక అన్నగా, ఒక భర్తగా, ఒక మంచి మిత్రునిగా, ఒక పరాక్రమవంతునిగా.. ఇలా అనేక కోణాల్లో కనబడతాడు. ఇన్ని విశేష గుణాలున్న పురుషుడు ఆ యుగం నుండి ఈ యుగం వరకు మరెవరూ పుట్టలేదు. ఇక పుట్టబోరు. అందుకే రాముడు అందరికీ ఆదర్శప్రాయుడయ్యాడు.
రాముడు పుట్టిన రోజున శ్రీరామనవమి జరుపుకుంటాం. ఆ మహావిష్ణువు స్వయంగా మానవ రూపంలో అవతరించినది చైత్రమాసంలోని శుక్లపక్ష నవమినాడు. ఆనాడు ఎవరైతే శ్రీరాముని పూజిస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయి. సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా, సంప్రదాయబద్ధంగా దేశమంతటా జరుపుకుంటాము. ఆరోజు భద్రాచల పుణ్యక్షేత్రంలో సీతా రాముల వివాహాన్ని వైభవంగా జరుపుతారు. శ్రీరామనవమి కల్యాణ మహోత్సవాన్ని వీక్షించటానికి భద్రాచల క్షేత్రానికి ఎవరైతే వస్తారో.. వారు అశ్వమేథ యాగం చేసిన ఫలాన్ని పొందుతారని బ్రహ్మ పురాణం చెబుతోంది. భద్రాచల క్షేత్ర మహత్మ్యమూ దీన్ని తేటతెల్లం చేస్తోంది.
ఈ భూమిపై ఆదర్శ దంపతులు ఎవరు? అని ప్రశ్నిస్తే వచ్చే సమాధానం సీతారాములు. సీత వంటి సహనవతి, రాముని వంటి గుణవంతుడు ఈలోకంలో మరెవరూ లేరు. సీతను రావణుడు అపహరించి లంకలో ఉంచినా.. సీత ఆలోచనలన్నీ రాముడి చుట్టూ తిరిగేవి. రాముని మనస్సులో సీత మాత్రమే ఉండేది. రాముడు ఏకపత్నీ వ్రతంతో బ్రహ్మచర్య విశిష్టతను తెలియజేస్తే, సీత ఎలాంటి వ్యామోహాలకు లొంగక తన ప్రాతివత్యాన్ని లోకానికి చాటింది. అందుకే ఆమె స్ర్తిజాతి గర్వించదగిన స్ర్తిమూర్తిగా నిలిచింది.
సీతారాముల కల్యాణాన్ని మనం ఆదర్శంగా తీసుకుంటే అది మన హిందూ వ్యవస్థలోని పటిష్టతను, విశిష్టతను తెలియజేస్తుంది. హిందూ వివాహంలో నూతన దంపతులను సీతారాముల్లా అన్యోన్యంగా ఉండమని దీవిస్తారు మన పెద్దలు. తల్లిదండ్రులైతే రాముని వంటి పుత్రుడు, సీత వంటి కుమార్తె కలగాలని దేవుని ప్రార్థిస్తారు. యుక్తవయస్సు వచ్చిన యువకులు సీత వంటి సహనవతి, అందగత్తె భార్యగా లభించాలని, యువతులు రాముని వంటి గుణగణాలు కలిగినవాడు, ఏకపత్నీవ్రతుడు భర్తగా లభించాలని కలలుగంటారు.
సీతారాముల ఆదర్శ దాంపత్యాన్ని మనం రామాయణం చదివి బాగా అర్థం చేసుకుంటే భార్యభర్తల మధ్య విబేధాలు ఏర్పడవు. విడిపోవటం అనే మాటే రాదు. వివాహ జీవితంలో దంపతులు ఎలా ఉండాలి? జీవనం ఏవిధంగా సాగించాలి? వంటివి మనకు తెలుస్తాయి. ఒకప్పుడు మనదేశంలో విడిపోవటం, విడాకులు తీసుకోవటం అనేవి చాలా అరుదుగా కనిపించేవి. భార్యభర్తల మధ్య తేడాలు వచ్చినా పెద్దలు కలుగజేసుకుని సరిచేసేవారు. నేడు విదేశీ సంస్కృతి, సంప్రదాయాల పుణ్యమాని పెళ్లయిన మూడు నెలలకే విడాకులు తీసుకునే సౌకర్యం ‘విడాకుల చట్టం’ ద్వారా లభించింది. ఇది మన వివాహ వ్యవస్థను, దంపతుల జీవితాలను ఛిద్రం చేస్తోంది.
శ్రీరామనవమిలో మరో విశిష్టత ఉంది. సీతారాముల కల్యాణం అనంతరం స్వామికి బెల్లం, మిరియాల పొడి, నీరు కలిపి తయారుచేసిన పానకం, పెసరపప్పును నీటిలో నానపెట్టి తయారుచేసిన వడపప్పును నైవేద్యంగా సమర్పిస్తాం. ఇలా ఎందుకు చేయాలి? అని ఆలోచిస్తే ఇందులో ఒక ఆరోగ్యసూత్రం దాగి ఉంది.
శ్రీరామనవమి మంచి ఎండాకాలంలో వస్తుంది. ఎండ వేడికి శరీరంలో శక్తి తగ్గిపోయి, చెమట వల్ల అధిక నీరు బయటకు పోతుంది. ఫలితంగా సోడియం, పొటాషియం, లవణాలు వంటివి తగ్గిపోతాయి. శ్రీరామనవమి నాడు బెల్లం పానకాన్ని ప్రసాదంగా స్వీకరించటం వల్ల శరీరానికి చల్లదనం కలిగించటమే కాక ఆకలిని పెంచుతుంది. బెల్లంలోని కాల్షియం ఎముకుల బలానికి తోడ్పడుతుంది. అలాగే పెసరపప్పు కూడా చల్లదనాన్ని ఇవ్వటంతో పాటు జీర్ణక్రియకు తోడ్పడుతుంది. ఇలా ఎన్నో ఆరోగ్యపరమైన రహస్యాలు ఈ పండుగలో దాగి ఉన్నాయి.
శ్రీరామ నవమి పర్వదినాన శ్రీ సీతారాముల కల్యాణాన్ని జరిపించినా లేక తిలకించినా ఎంతో పుణ్యం వస్తుంది. అంతేకాదు శ్రీరామనవమి పండుగలోని పరమార్థాన్ని, సీతారాముల దాంపత్య జీవనాన్ని నేటితరం యువ దంపతులు తెలుసుకొని తమ జీవితాలకు అన్వయించుకోవాలి. సీతారాముల కల్యాణం చేశాం, ప్రసాదం తిన్నాం, పండుగ జరుపుకున్నాం.. అనుకుంటే ఈ పండుగలో విశిష్టత ఏమీ ఉండదు. ప్రతిఒక్కరూ శ్రీరామనవమి పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటూ, రామాయణంలో సీతారాముల పాత్రలను ఆదర్శంగా తీసుకొని జీవితాలను చక్కని మార్గం వైపు నడుపుకుంటారని ఆశిద్దాం.

- విష్ణ్భుట్ల రామకృష్ణ,
విజయవాడ.
చరవాణి : 9440618122

నివాళి

విశ్వయశస్వికి జేజేలు!

సామాన్య కుటుంబంలో
జర్మనీలో జన్మించి
వినూత్న హోమియో వైద్యాన్ని
ఈ జగతికి ప్రసాదించి
జగద్బంధువైతివయా
ఓ హానిమన్ మహాశయా!

ఔషధ ధర్మాల్ని పరిశోధించేందుకు
మీ ప్రాణాలే ఫణంగా పెట్టి
మీరే వాటిని సేవించి
అవి మీపై చూపిన సకల
మానసిక, శారీరక లక్షణాల
‘మెటీరియా మెడికా ప్యూరా’
గ్రంథంలో మాకందించిన
త్యాగధనులు మీరు!

సోరా, సైకోసిస్, సిఫిలిస్‌లను
మూడు తత్వాలే
బహువ్యాధులుగా రూపుచెంది
మానవాళిని బాధిస్తున్నాయని
రోగి అన్ని లక్షణాల్ని గ్రహించి
ఒక్కొక్కసారి ఒక్కొక్క
ఔషధానే్న ఇవ్వాలని
హోమియో తత్వశాస్త్ర
‘ఆర్గనాను’ గ్రంథరాజంలో
లోకానికి తెలిపినారు

మానవులను ఒదలక
మరలమరల తిరగబెట్టే
దీర్ఘవ్యాధుల్ని నయం చేయాలని
విజ్ఞానవంతులు కావాలని సాహసించి,
పనె్నండేళ్లు పరిశోధించి
‘క్రానిక్ డిసీజెస్’ గ్రంథాన్ని
వైద్యప్రపంచానికి అందించిన
ప్రతిభామూర్తులు మీరు

తరుణ, దీర్ఘ వ్యాధులకు
తీయనైన మందులతో
తక్కువ మోతాదుల్లో
తీర్చే మార్గాన్ని చూపిన
ఆచంద్రతారార్క యశస్వీ
మధుర హృదయ.. మీకు జేజేలు!

- దేశం పాపిరెడ్డి,
గుంటూరు.
చరవాణి : 9849048242

మనోగీతికలు

పక్షపాత పర్వాలు
ఉ॥ పర్వము రాదు మా ముఱికి వాడల వంకకు! మాదు దుర్గతుల్
సర్వమెఱుంగు గాన నొక సారయినన్ మముజూడ రాదు! మా
చేర్వకు వచ్చి మేల్కలుగ జేయు సమర్థత లేక మమ్ము మా
దుర్విధి చేతికే వదలి దూరముగా నడయాడు నిత్యమున్!

ఉ॥ కుత్సిత బుద్ధిదాల్చి ధనికున్ సుఖబెట్టుచు, పేదనెప్డు బీ
భత్సములైన దుఃఖముల పాతఱలో పడవైచు ఉత్సవం
బుత్సవవౌనె బూటకపు బుద్ధులు జూపెడి బూచిగాక? నే
ఉత్సవమైన నెల్లరికి నుల్లసమందగ జేయగావలెన్!

ఉ॥ పర్వతరాజు మా బ్రతుకు బాధలకొండల యెత్తుజూచి ‘నా
గర్వమడంగెనింక’ ననె, ‘కంధి’యు మా ప్రజశోక నీరధుల్
పర్వులు వెట్టు తీరుగని పల్లటిలెన్! విను మింక పర్వమా!
ఉర్వియు మాదు ఓర్పుగని ‘ఒప్పగు ఓరిమి మీదెలే’ యనెన్!

చ॥ గుడికొని యున్న కష్టముల గూడులు మావి! నిరాశలన్నియున్
జడిగొనుచున్న దుస్థితుల జడ్డలు మావి! విషాదవీచికల్
వడిగొను పాఱు వేదనల వాడలు మావిటుయెట్టి వేడుకల్
అడుగిడవమ్మ పర్వమ! యథార్థమిదే నను విశ్వసింపుమా!

ఉ॥ చూడుము, చూడుచూడు పొగజూరిన గోడల పూరిపాకలన్
జూడుము ఱొచ్చు రోతలకు జోడుగ నుండెడి కీటకమ్ములన్
వాడిన బీద మోములను, వంతలు నిండిన సందుగొందులన్
జూడు, దరిద్రదేవికి ప్రసూతి గృహమ్ముగ మారినట్టి మా
వాడను చూడు, దుఃఖితుల వంశజులియ్యడ పుట్టిగిట్టు ఆ
పోడిమి చూడు, మిద్దరికి పొత్తు కుదుర్చునె ఇట్టి భేద మే
డేడకొ పోయి నీవు సుఖియించుము పర్వమ! రాకు రాకిటన్!

ఉ॥ లచ్చిమి దేవి గజ్జెల ఘలంఘలలుండెడి భర్మహర్మ్యముల్
జొచ్చిన - నీకు కీర్తనలు, చొక్కపు సేవలు, గొప్ప సందడుల్,
వెచ్చని వంటకమ్ములు లభించును పర్వమ! మమ్ము జేరినన్
నొచ్చును నీ మనమ్మిట వినోదము నొక్కటి కానకెయ్యడన్!

ఉ॥ మాయును నీ అలంకరణ, మాయును నీ శుచి, నీదు మంగళ
చ్ఛాయలు మాయు, గౌరవము సన్నగిలున్, మది క్లేశమొందు, - నీ
సోయగమంత శోభచెడి స్రుక్కును గాన మిటారి పర్వమా!
చేయకు సాహసమ్ము మము జేరుటకెన్నడు స్వప్నమందునున్!

చ॥ పనివడగా ఎకాఎకిన పర్వులు వెట్టుచు పర్యటించి మా
జనులను ఉద్ధరింతుమని చాటు ప్రతిజ్ఞులు చాల జేసి, ఆ
పని ముగియంగ చాటుపడు పాలకులుండెడి రాజ్యమందునన్
అణగి మణంగి తల్లడిలు అల్పుల దుర్దశ మారదక్కటా!

- గోపీనాథరావు ఎరుకలపూడి,
విజయవాడ,
చరవాణి : 98482 93119

కల్యాణ భోగం - రామద్వయం
నిరాకార, నిర్ణురూపా, లింగాకార, అర్ధనారీశ్వర!
అవతారపురుష, శ్రీ వెంకటేశ! శ్రీనివాస!
నాడు శివపార్వతుల కల్యాణుడిగా, జ్ఞానేశ్వర!
శ్రీ పద్మావతి ప్రియ, కల్యాణ స్వరూప శ్రీ వెంకటేశ! పాహిమాం!!
నేడు తిరుమల కొండ దిగివచ్చిన ఒంటిమిట్ట రామా!
శ్రీరామా, ఆదర్శ పురుష, అవతార పురుష శ్రీనివాస!
సంకటయోచన, ఒంటిమిట్ట రామా! కల్యాణ భోగా!
నేడు నీ కల్యాణ చూడముచ్చట పడ! తరంబ్రాలు
తలనిండా నిన్ను చూడ వచ్చెనయ్య శేషసాయిడు!
ఆనందమాయే, ఒంటిమిట్ట రామ, తరింప నా మోము
చూడ! భక్తులంతా భక్తితో మురిసేనయ్య! ఓ రామయ్య!!
కొండలలోని కోనేటి రాయుడు, కోరికలు తీర్చ
కల్యాణ రామ, కోదండరామ, సీతారామ, భద్రాచల రామ
ఒంటిమిట్ట రామ, అయోధ్య రామయ్య అవతార మూర్తివయ్య!
తిరుమలేశా! చిద్విలాసా! శ్రీ వేంకటేశా! పాహిమాం!!
‘రామద్వయం, కల్యాణ భోగం, నేటి పరమానందం’!
‘రామదాసు, తిరుమల దాసు అన్నమాచార్యులు!
ముకుళిత హస్తాలతో నేడు స్వాగత గీతాలు!!’

- జమలాపురం ప్రసాదరావు, ఖమ్మం.

ఓ దుర్ముఖీ..
కావాలి మాకు సన్ముఖి!
ఓ.. దుర్ముఖి నామ వత్సరమా!
నీకు అక్షర జోతలు
తెలుగు వెలుగు ముఖ మండపాన
కవితా చూత పర్ణ తోరణాలు కట్టి
సాదర స్వాగతం పలుకున్నాను

నీ ముఖారవిందం బాగోలేదని
మానసిక క్లేశంతో
అంతర్ముఖిగా మారి
ఊరి పొలిమేరల్లో ఆగిపోకు!

తెలుగుతల్లిని ప్రాంతీయ
వాటాలు వేసుకున్నాక
తెలుగువారి కోట్ల వదనాలు
హఠాత్తుగా వివర్ణమైపోయాయి!

పాలకుల కుటిల హామీలను నమ్మి
అందలమెక్కించిన ప్రజలకు
నేతల అరచేతిలో వైకుంఠాలు చూసి
సిగ్గుతో తెలుగు ప్రజల ముఖాలు
దుర్ముఖంగా మారాయి!
ప్రకృతి వికృత చేష్టలకు
కరువుల చీడలతో
అరుపుల పీడలతో
మా పరువుప్రతిష్ఠలు పోయి
మా ముఖారవిందాలు కన్పించకుండ
బురఖా వేసుకుని తిరుగుతున్నాం
ఓ దుర్ముఖీ! నీ పేరే దుర్ముఖీ!!
నీ తీరు మాకు సన్ముఖం కావాలి!
అరవదేండ్లకు ఒకసారి వచ్చే
నీ దివ్యమంగళ రూపాన్ని
మరోసారి మాకు చూపించు
తెలుగు జగతికి ఉగాది పచ్చడిని
గోముగా తినిపించు
ఆరు రుచుల్లో
ఆమని కోయిలను పలికించు!

- జి సూర్యనారాయణ,
బందలాయి చెరువు.
చరవాణి : 970478 4744

email: merupuvj@andhrabhoomi.net

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి.

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, ప్లాట్ నంబర్ సి- 3, 4, ఇండస్ట్రియల్ ఎస్టేట్, విజయవాడ - 520 007. vijmerupu@gmail.com

కె శరచ్చంద్ర జ్యోతిశ్రీ