దక్షిన తెలంగాణ

డాక్టర్ రూప ( కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్షణం తీరికలేని జీవితం. అలసటలోనే ఆనందం. ఆ సంతోషంలోనే సుఖమూ శాంతీ. శ్రమైక జీవన సౌందర్యాన్ని ఎంతో ఇష్టంగా ఆస్వాదిస్తున్నది డాక్టర్ రూప. ఆమె పేరుకు తగినట్లే చక్కటి రూపంతో పాటు సహనాన్ని సాంతం చేసుకున్న నిరుపేదల పాలిటి ఆరాధ్యదైవం. అవసరమున్నా లేకున్నా అనవసరమైన పరీక్షలు చేయించుకోమనటం, మందులు రాయటం ఆమెకు నచ్చని పని. ఆమె వ్యక్తిత్వాన్ని సహించలేని వారి హేళనలు, వంకరమాటలు పట్టించుకునే తీరిక, కోరిక లేని డాక్టర్ రూప ప్రఖ్యాతి చెందిన గైనకాలజిస్టుగా ఆ చుట్టుపక్కల గ్రామాలన్నిటికి సుపరిచితురాలు.
పాతికేళ్లు పూర్తికావస్తున్నా పదహారేళ్ల ప్రాయంలా కనిపించే డాక్టర్ రూప రోజు లాగానే డ్యూటీ ముగించుకుని గదికి తిరిగి వచ్చింది. తలుపు తీసి లోపలికి వెళ్లేసరికి తలుపు సందులోనుంచి పోస్ట్‌మేన్ వేసిన ఉత్తరం కనిపించింది. ఒక్క నిట్టూర్పు విడిచి ఉత్తరం చించి చదవడం మొదలుపెట్టింది.
ప్రియమైన రూపకి,
అమ్మ దీవించి వ్రాయునది. నిన్ను చూడటానికి పెళ్లి వారొస్తున్నారు. అన్ని విధాల నీకు తగిన సంబంధం. మన తాహతుకు మించినది అయినప్పటికీ నీ గురించి మన కుటుంబం గురించి తెలుసుకొని తమ అంగీకారాన్ని తెలిపారు. అలాగని చులకన చేయకూడదు. అబ్బాయి కూడా డాక్టరే. వారికి హైదరాబాద్‌లో నర్సింగ్ హోం ఉందట. అబ్బాయి నిన్ను మెడికల్ క్యాంపులో చూశాడట. చాలా తొందరపెడుతున్నారు. కావున ఆలస్యం చేయకుండా రాగలవు. వచ్చే శుక్రవారమే నిశ్చితార్థం. ఆ తరువాత నెలలోనే పెళ్లి. కొన్ని విషయాలు ఫోన్లో మాట్లాడటం కంటె ఉత్తరంలో రాయడం వల్లనే ప్రశాంతంగా ఉంటాయి. అందుకే ఈ ఉత్తరం. ఇక ఉంటాను.
మీ అమ్మ
వైదేహి
రూపకి ఒక్కసారి కళ్లలో నీళ్లు తిరిగాయి. తాను ఎంత కష్టపడితే ఈ స్థాయికి వచ్చింది. నిజానికి తనకంటే ఎక్కువ కష్టపడింది అమ్మే. ఊళ్లో ఉంటూ తనకు తెలిసిన సంగీత పరిజ్ఞానంతో పిల్లలకు సంగీతం, ట్యూషన్లు చెపుతూ తన పొట్ట పోషించుకుంటూ ఉన్న కొబ్బరి తోటను, పంట పొలాలను హారతి కర్పూరం చేసి తనను డాక్టర్ను చేసింది. మెడిసిన్ చదివించడమంటే ఈ కాలంలో మాటలు కాదు. డబ్బు మూటలే.
కాళ్లూ చేతులూ కడుక్కొని భోజనం అయిందనిపించి, మంచంపై నడుం వాల్చింది. రేపు ఉదయమే ప్రయాణం. ఏం చేయాలి? పెళ్లి అనేది ఏ ఆడపిల్ల అయినా కోరుకోదగినదే. అలాంటి ఊహలూ, ఆశలూ తనకూ ఉన్నాయి. కానీ తానే సర్వస్వమనుకున్న అమ్మను సంతోషపెట్టాలి. కష్టపెట్టకూడదు. అవసాన కాలంలో ఆమె బాధ్యతను ఆనందంగా స్వీకరించే వ్యక్తి తన జీవిత భాగస్వామి కావాలి. బాగా ఆలోచించి రూప ఒక నిర్ణయానికి వచ్చింది.
బస్సులో వెళుతుంటే పంట పొలాల మీదుగా వచ్చే చల్లని గాలి ఎంతో హాయిగా ఉంది. బస్సు దిగి ఇంటికి వెళ్లాలంటే ఫర్లాంగు దూరం నడవాలి. ఆలోచిస్తూ నడుస్తుంటే వాకిట్లోనే అమ్మ ఎదురొచ్చి గట్టిగా పొదుపుకుంది. ఎంతటి ఆత్మీయత. అందుకే ఆ దైవం సైతం జన్మను కోరుకుంటాడేమో అమ్మ ప్రేమకోసం.
ముద్దపప్పు, ఆవకాయ, రసంతో అమ్మ చేతి భోజనం కమ్మగా ఉంది. తర్వాత కబుర్లు మొదలుపెట్టింది రూప.
‘ఈ సంబంధం గురించి నీకెవరు చెప్పారు? ఎలా తెలిసింది?’ అని రూప అడిగింది.
వైదేహి చెప్పడం మొదలు పెట్టింది. ‘అబ్బాయి పేరు నీరజ్. తల్లిదండ్రులకు ఒక్కగానొక్క సంతానం. తల్లిదండ్రులిద్దరూ డాక్టర్లే. గుణవంతురాలైన కష్టమూ, సుఖమూ తెలిసిన అమ్మాయి కోడలుగా రావాలనుకుంటున్నారట. అదృష్టం. నిన్ను వాళ్లబ్బాయి మెడికల్ క్యాంప్‌లో చూడటం, తల్లిదండ్రులతో మాట్లాడటం జరిగిపోయిందట. ఆ వెంటనే మన ఊళ్లోని పంతులుగారికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారట. పంతులు గారు వచ్చి మరీ మరీ చెప్పారు. మంచి సంబంధం కాదనుకోకూడదు’ అని. నీవేదైనా మాట్లాడాలనుకుంటే ఆ అబ్బాయి సెల్ నెంబర్ కూడా ఇచ్చారు. ఫోటో కూడా పంపారు. అంటూ ఫోటో, నెంబర్ చేతిలో పెట్టింది వైదేహి.
***
నీరజ్, రూపల వివాహం బంధుమిత్రుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా జరిగిపోయింది. భర్తతో కలిసి అత్తవారింట్లో అడుగుపెట్టిన రూప సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. ఆ ఉత్సాహంతో కుందనపుబొమ్మలా మెరిసిపోతోంది. అంతటి ఆనందానికి కారణం నీరజ్‌తో పెళ్లికి ముందు మాట్లాడిన సెల్‌ఫోన్ సంభాషణే. ఆ సారాంశాన్ని ఒక్కసారి మననం చేసుకుంది హర్షాతిరేకంతో.
రూపా చాలాకాలంగా నిన్ను గమనిస్తున్నాను. నీ వ్యక్తిత్వం ప్రవర్తన సేవాభావం అమూల్యమైనవి. అలాంటి స్ర్తిని పొందగలగడం అదృష్టం. ఇంతకాలం నువ్వు మాత్రమే మీ అమ్మ గురించి ఆలోచించావు. ఇక మీదట మనమిద్దరమూ ఆమె సంతోషానికి ఆలంబనగా మారదాం. మగపిల్లలు మాత్రమే తల్లిదండ్రుల బాధ్యత తీసుకోవడమనేది గతం. ఆ మాటకొస్తే ఎంత మంది కొడుకులు తమ తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల పాలు చేయడం లేదు. మగపిల్లలు లేరనే అపనమ్మకం, ఆడపిల్లలు వద్దనుకునే అంధ విశ్వాసం మన తరంలో లేకుండా చేద్దాం. ఏమంటావు?

- ల్యాదాల గాయత్రి, కాగజ్‌నగర్,
ఆదిలాబాద్ జిల్లా
సెల్.నం.9949431849

పుస్తక సమీక్ష

మన మంచి తెలుగు
ప్రతులకు:
శ్రీమతి ఇస్రత్ సుల్తానా
3-1-257
క్రిస్టియన్ కాలనీ, కరీంనగర్
పేజీలు: 96, వెల: 80/-

శతాధిక గ్రంథకర్త, సాహితీ వేత్త డాక్టర్ మలయశ్రీ తన నూటా ఇరవై ఐదో గ్రంథంగా ‘మన మంచి తెలుగు’ను ప్రకటించి..తెలుగు భాషా పదాలు, రూపభావ పరామర్శ చేశారు. నవ్య సాహిత్య పరిషత్ కరీంనగర్ ఆధ్వర్యంలో వెలువడిన ఈ గ్రంథం తెలుగు భాషా ప్రేమికులకు ఉపయుక్తంగా ఉండేలా రూపుదిద్దుకుంది. ఐదు దశాబ్ధాలకు పైగా రచనా వ్యాసంగంలో వివిధ ప్రక్రియల్లో తమ ప్రతిభను ప్రదర్శించిన డాక్టర్ మలయశ్రీ గారికి తెలుగు భాషపై వున్న అభిమానంతో..తనకు గల అనుభవం, పరిశీలనను జోడించి..శబ్ధ రూప భావాల విషయంలో ఆయనకున్న అవగాహనను మేళవించి..రాసిన వ్యాసాలు ఈ గ్రంథంలో చోటు చేసుకున్నాయి. తెలుగు నాణాల, శాసనాల భాషే మోదటిదనీ..వచన శాసనాల తెలుగు వాక్యాలు మరీ అపరిపక్య దశలో ఉన్నవని ఆయన పేర్కొంటూ రాసిన మొదటి వ్యాసం విజ్ఞాన దాయకంగా ఉంది. మన తెలుగు భాష అస్తిత్వ పోరాటం ఒకవైపు..ప్రామాణిక భాషా స్వరూపలాలస - ప్రాంతీయ మాండలిక భాషా రూపాల ఘర్షణ మరోవైపు..కొనసాగడంతో తెలుగు భాష నిరాదరణకు గురైందని వాపోయారు. మన నాయకులు సైతం తెలుగు భాషా ప్రగతికి పట్టించుకున్న దాఖలాలు తక్కువేనని అభిప్రాయపడ్డారు. సంస్కృత పదాలు లేని తెలుగు వాక్యాలను చూడగలం..కానీ తెలుగు పదం ఒక్కటైనా లేని సంస్కృత పదాల తెలుగు వాక్యం ఉండదనీ..సంస్కృత భాషాభిమానంతో ఎన్నో తెలుగు పదాలు మాయమైనవని తమ ఆవేదన వ్యక్తపరిచారు. జన సంచారాలను బట్టి ఆయా భాషల నూతన పదాలు చేరి స్థానిక భాష అభివృద్ధి చెందగలదని..మారే అవకాశం ఉంటుందని సోదాహరణంగా రచయిత ఈ గ్రంథం ఆరంభంలోనే చర్చించారు.
యతి ప్రాసలు మన తెలుగు భాషకు సహజ అలంకారాలనీ..మన వాళ్ల మాటలు కూడా యతి ప్రాసలతో అందంగా ఉంటాయని వివరించారు. పండితులు మాట్లాడినా..పామరులు మాట్లాడినా..సామెతలు అనుభవ సత్యాలుగా భాసిల్లగలవనీ..అవే భాషకు అందం..్భవానికి జవం-జీవం అంటూ రచయిత కొన్ని తెలుగు సామెతలను ప్రస్తావించిన తీరు ప్రశంసనీయం!
తెలుగు పేర్ల పదాలను పరామర్శిస్తూ..మన తెలుగు వారి పేర్లను సోదాహరణంగా వివరించడంతో రచయిత సఫలీకృతులైనారు.
కొన్ని కొత్త, పాత పాటలను గుర్తు చేస్తూ..ఆ పాటల మాటున దాగి వున్న భావాలను విశే్లషించారు. అలాగే తెలుగునాటి దేవతల పేర్లను ప్రస్తావించారు. కాలదోషం పట్టిన కొన్ని పదాలు-మాటలను సోదాహరణంగా పాఠకులకు రచయిత అందజేసిన తీరు బాగుంది.
కొన్ని వ్యాకరణ అంశాలను ప్రస్తావిస్తూ..మన మాతృభాష తెలుగు పద రూపాలను, వాటి అర్థాలను భావాలను గమనించకుండా విచ్చలవిడిగా మార్చవద్దని హితవుపలికారు.
తెలంగాణ తెలుగు, తెలుగు భాషా బేధాలు, చర్చిస్తూ..మాండలిక భాషలంటే గ్రామ్యం కాదని తేల్చి చెప్పారు.
ప్రముఖ కవులు - రచయితల - భాషారూపాలు - వ్యాసంలో ‘పద కవితా పితామహుడు’ అన్నమయ్య వాడిన పదరూపాలను సమగ్రంగా ప్రస్తావించారీ గ్రంథంలో!
తెలుగులో తొలి చారిత్రక వచన రచన ఏకాంబ్రనాథుని ‘ప్రతాపరుద్ర’లోని పదాలు సరళ గ్రాంధికంగా ఉన్న విషయాన్ని విడమరిచి చెప్పారు. అలాగే క్షేత్రయ్య (మువ్వ వరదయ్య) శృంగార పదాల శబ్ధాలు, భద్రాచల రామదాసు కీర్తనలు, డాక్టర్ దశరథుల బాలయ్య గారి ఎంఫిల్ పుస్తకంలోని పదాలను ప్రస్తావించిన తీరు బాగుంది. త్యాగరాజు కీర్తనల పదాలు, గురజాడ వాడిన పదాలను ముఖ్యంగా గురజాడ రాసిన కథ ‘దిద్దుబాటు’లో వాడిన వ్యవహారిక, గ్రామ్య పదాలను ఈ గ్రంథంలో పొందుపరిచారు. డాక్టర్ సి.నారాయణ రెడ్డి గారి పద ప్రయోగాలను రేఖా మాత్రంగా చర్చించారు.
తమిళనాడులోని కొంగునాడు ప్రాంతపు మన తెలుగును ప్రస్తావిస్తూ..మార్టూరి సంజ్ఞా పద్మంగారి ‘టెంకాయల దొంగ’ కథలోని పదాలను ఈ గ్రంథం ద్వారా తెలుసుకోగలం..
టీవిల్లో తెలుగును గుర్తు చేస్తూ..యాంకర్లు మాట్లాడే తెలుగు భాషా విన్యాసాలను ఎండగట్టారు. ఆధునిక యువతీ యువకులు సైతం తెలుగు భాషపట్ల మక్కువ చూపడం లేదని వాపోయారు. ఇలా ఈ గ్రంథంలో తెలుగు భాషా పదాల, రూప భావాలను రేఖా మాత్రంగా పరామర్శించేందుకు డాక్టర్ మలయశ్రీ చేసిన కృషి స్వాగతించదగింది. ఇది సమగ్రంకాదని మలయశ్రీ గారే స్వయంగా చెప్పారు. కనుక..ఈ దిశలో తెలుగు భాషను కాపాడుకోవడానికి..తెలుగు భాషలోని మంచిని పది మందికి పంచేందుకు తెలుగు భాషా ప్రేమికులు ఈ గ్రంథాన్ని ప్రేరణగా తీసుకుని ముందుకొస్తారని ఆశిద్ధాం..తెలుగు భాష పట్ల రచయిత డాక్టర్ మలయశ్రీ గారికి గల అభిమానాన్ని అభినందిద్దాం..ఈ దిశలో మరింత మార్గదర్శనం ఆయన నుండి పాఠకులకు మున్ముందు లభించగలదని అభిలషిద్ధాం! ఈ గ్రంథం వెలుగులోకి రావడానికి సహకరించిన ఎం.డి.అజ్గర్ హుస్సేన్, ఇస్రత్ సుల్తానా దంపతులను అభినందిద్ధాం.
- సాన్వి, కరీంనగర్, సెల్.నం.9440525544

మనోగీతికలు

మహారాజు !
అతడు
ప్రపంచానే్న నడిపించే
సృష్టికి మూలాధారుడు
ప్రకృతిలోని రుజుగమనానికి
అనుసంధానుడూ..అతడే
మానవ మనుగడకు అతడు చిరునామా
రాజ్యాలు లేని మహారాజు
ఏ చదువు సంధ్యాలేని
జ్ఞాన సంపన్నుడు..అతడు!
కాని ఆ రాజు
వట్టికాళ్ల నడుస్తడు!
గంజి నీళ్లే తాగుతడు!
ముతక బట్టలే వేస్తడు
కోడి కూతకే లేస్తడు అతడు!
నేలను చదును చేసి
దుక్కిదున్ని సేద్యమే చేస్తడు
విత్తిన మూలానికి
గాలై, నీరై ఫలాన్నిచ్చే పంటకు
ప్రాణమవుతడతడు!
కాలానికి ఏ మాయరోగమొచ్చిందో ఏమో,
ఆ రాజు ఇపుడు
ఆధునికత ముందు
దళారుల ముందు
పాలకుల ముందు
దీనంగ చేతులు
జోడించి నిలుచున్నడు!
దిక్కెవరూ లేరంటు..
గుండె పగిలిన మారాజు
ఉరి కొయ్యల వేలాడితే!
రైతు లేని లోకానికి
నువ్వెందుకు, నేనెందుకు,
రాజ్యాధికారులెందుకు?
అంతా శూన్యమయ్యేదాకా చూస్తారా
చలనంలోకి రండి ప్రజలారా, పాలకులారా!
రైతు పక్షాన నిలబడదాం!
అన్నదాతను కాపాడుకుందాం!

- రామానుజం సుజాత
కరీంనగర్
సెల్.నం.9701149302

నేటి జీవితం
ఇదీ జీవితం - నేటి జీవితం
ఊరించే ఆశలతో
ఊహల ఉయ్యాలలో
ఔషధాల తోటలో
ఎన్ని మూల మలుపులో
ఏ మూల మలుపులో
ఏ ముప్పు పొంచి ఉందో?
అనే ఆందోళనలో జీవితం
ఎవరి చేతి వాటమో
ఎన్నాళ్లిలా సాగినా
ఆఖరు మజిలీ వరకు
ఆ తోటలోనే పచారు
పలు భాషల ఈ దేశంలో
ఊరిళ్ల ప్రయాణం
ఏదో సంపాదించామని
ఎంతో ఎత్తు ఎదిగామని
విర్రవీగుడెందుకో!
నేను అనే అహంతో
గర్వమనే పొగరుతో
ఆటు పోటు లంకెలతో
సగం జీవితం
గడిచింది!

- బోనగిరి రాజారెడ్డి, మంచిర్యాల
ఆదిలాబాద్ జిల్లా, సెల్.నం.9701381944

అవసరాల నేపథ్యంలో..
ఉద్యమ మెప్పుడైనా
నట్టింట్లో జన్మించదు
ఊరు నడిబొడ్డున పురుడు పోసుకుంటుంది!
ఆవేదనలోంచి ఉద్భవించిన ఆర్తనాదం
నడి వీధిలో నినాదవౌతుంది
ఆర్థిక సంబంధాల అసమానతలు
ఆక్రందనలుగా రూపుదిద్దుకుంటాయి!
అవసరాల నేపథ్యంలో
అనుబంధాలకు అర్థం మారిపోతుంది
ఆకలి మంటల నిప్పురవ్వలు
మానవత్వపు విలువలను దహించివేస్తాయి
ఎగదోసే కులాల కుంపట్లు
రగులుతున్న అగ్నిహొత్రంలో
అనుమానాల సమిధలను కుమ్మరిస్తాయి!
అధికారపు విషపు పిడికిలిలో
మానవత్వం నలిగిపోతుంది
అవనిలోని అణువణువునూ ఆక్రమిస్తున్న
భూబకాసురుల భరతం పట్టాలంటే..
అవినీతిని తిప్పికొట్టగల
యువతరం..ఎత్తుకు పై ఎత్తు వేయక తప్పదు!
ఉద్యమకారుల ఆశయాల పోరులో
ఉషోదయాన్ని సైతం సొంతం చేసుకోగలం!!

- పొద్దుటూరి మాధవీలత
ఎడపల్లి గ్రామం, నిజామాబాద్ జిల్లా
సెల్.నం.9030573354

అమ్మ
‘అమ్మ’ అనే..
రెండక్షరాలు అమృత బిందువులు!
అమ్మా అనే స్వరంలోనే..
నిండి వుంది అనురాగ మాధుర్యం!
జాతికి సజీవ రత్నం..అమ్మా!
అమ్మతోనే..
నడుస్తుంది జగతిన ప్రేమరథం!
అమ్మలేని జీవితం వ్యర్థం!

- కూర్మాచలం వెంకటేశ్వర్లు
కరీంనగర్, సెల్.నం.7702261031

విజ్ఞాన చంద్రికలు
నేను సైతం ప్రపంజోజ్వల
ప్రబల భవితకు తొలియడుగు
వెలుగునవుతాను
నేను సైతం నిత్య యవ్వన చైతన్య
ప్రజ్ఞా పల్లకీకి బోరుూనై
సమస్త మానవాళిని
వికాసవంతమైన ప్రపంచానికి
తీసుకుపోతాను
నేను సైతం హిమగిరి శిఖర
శివతాండవ మృదంగ ధ్వనీ
ప్రవాహ కేళీ తరంగ పదనిసనై
జగతి జనుల జవసత్వాలలో
జీవాన్ని మేల్కొలిపే
విశిష్ట వైదుష్య వైభవోపేత
విజ్ఞాన చంద్రికలను
ప్రసరింపజేస్తాను

- గగనం శ్రీనుకుమార్,
సెల్ : 8008262514.

హాయిని గొలిపే..!
బంతిపూవు చందం...
మగువ అందం!
మల్లెపూవు సొగసు
ఎంచక్కా..అవుతుంది
మహిళా మనసుకు ప్రతిబింబం!
గులాబీలు..
ముద్దుగుమ్మల చెక్కిల్లకు ప్రతీకలు!
కలువ కన్నులు..
తెలియజేస్తాయి బామల హొయలు!
పూబంతులకు, చేమంతులకు
ఇంతులకు..అవినాభావ సంబంధం!
ఆ బంధమే...
ప్రకృతికి
మానవాళికీ..హాయిని గొలిపే..
సుమగంధం!!

- సిహెచ్.ప్రేంసాగర్ రావు
కరీంనగర్
సెల్.నం.9912118554

చిరునవ్వు!
చిరునవ్వుతోనే..
మన మోముకు అందం!
పున్నమి వెనె్నలను
తలపించేలా..
ముఖంపై కొలువుదీరే నవ్వులు
బాధలన్నింటినీ..
చేస్తాయి మటుమాయం!
మల్లె పువ్వుల్లా..
పెదాలపై నాట్యం చేసే నవ్వులు
ఎదుటి వారి ప్రేమను...
చేసుకుంటాయి సొంతం!
చిరునవ్వుతోనే..
జీవితాన్ని..
ఓ నందన వనంలా మార్చుకోవాలి!
దాని అండతోనే..
ఆనందంగా మనం
మనుగడ సాగించాలి!!

-బి.సాయిప్రియ, పోతుగల్, సెల్.నం.8688087788

నిర్వహణ : దాస్యం సేనాధిపతి dasyamsenadhipathi10@gmail.com

ఈ శీర్షికకు కవితలు, కథలు, సాహితీ వ్యాసాలు, కొత్త పుస్తకాల సమీక్ష/పరిచయం, కార్టూన్లు ఈ క్రింది చిరునామాకు లేదా ఈ-మెయల్‌కు పంపండి.

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, జగిత్యాల రోడ్, కరీంనగర్. merupuknr@andhrabhoomi.net

email : merupuknr@andhrabhoomi.net

- ల్యాదాల గాయత్రి