విశాఖపట్నం

కన్నీరు (కథానిక )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘లలితా... లలితా నాన్నగారు ఏదో పనిమీద ఇక్కడికి వస్తున్నారంటా! ఇల్లంతా శుభ్రం చెయ్ ఎందుకంటే నాన్నది పల్లెటూరు వాతావరణం. అక్కడంతా పచ్చగా పరిశుభ్రంగా ఉంటుంది. ఇది టౌన్. అంతా గందరగోళంగా ఉంటుంది’’ అని వరప్రసాద్ చెప్పగానే ‘‘సరేసరే అలాగే నాకు ఆ మాత్రం తెలియదేంటి’’ అని ఇల్లంతా బాగా తుడిచి, బుక్స్ నీట్‌గా సర్ది దుప్పట్లు బాగా మడతపెట్టింది.
రాఘవరావుగారు మరో గంటలో ఇంటికి చేరుకున్నాడు. కొడుకు, కోడలు సాధారణ మర్యాదలు చేశారు. ‘‘పొలం పనిమీద ఇక్కడికి వచ్చాను మీ అమ్మ పోరు పడలేక. బాబుని ఒకసారి చూడమంది. ఎప్పుడో పండుగలకి వస్తారు తప్ప, అసలు మనం వాళ్లని చూడడానికి వెళ్లడం లేదంటే వచ్చాను. అమ్మా లలితా ఒక గ్లాసు మంచి నీళ్లు ఇవ్వమ్మా’’ అన్నాడు. ఆ మాటకి వరప్రసాద్, లలితా ఒకరి ముఖాలు ఒకళ్లు చూసుకున్నారు. ఒక క్షణం గడిచిన తర్వాత లలిత వంటింట్లోకి వెళ్లింది కంగారుగా. కాసేపు తర్వాత రాఘవరావు గారికి గ్లాస్ చేతికిచ్చింది.
‘‘అదేంటమ్మ మంచినీళ్లు ఇవ్వమంటే డ్రింక్ ఇస్తున్నావు’’ అన్నాడు.
‘‘నాన్న! మంచినీళ్లు లేవు. మినరల్ వాటర్ ట్యాంక్ ఖాళీ అయింది. ఫోన్ చేశాను వాళ్లకి. సాయంత్రం తెస్తానన్నారు’’
‘‘అదేంటి ప్రభుత్వం మంచినీళ్లు రెండురోజులకొకసారి ఇస్తుంది కదా’’
‘‘అవి అంతగా బాగోవు నాన్నా. ఎన్నో క్రిమికీటకాలు, దుమ్ము ఇంకా నానా చెత్తా వుంటుంది. అందుకే మేము పట్టుకోం నాన్నా. కూల్‌డ్రింక్‌లు తెచ్చుకుని తాగుతున్నాం’’
ఇంతలో ‘‘నాన్నా’’ అంటూ రాఘవరావుగారి మనవడు మూడు డ్రింక్ బాటిల్స్ పట్టుకుని వచ్చి ‘‘రెండుకొంటే ఒకటి ఉచితం అనగానే కొనేశా’’ అన్నాడు.
‘‘తాతయ్యా ఎప్పుడు వచ్చావ్ బాగున్నావా? ఇదిగో కోకోకోలా తాగు వద్దంటే ఈ పెప్సీ తాగు’’ అన్నాడు.
‘‘నాకేం వద్దుగానీ మీ కుటుంబం మొత్తం తాగండి. ఇంతకీ ఎక్కడికెళ్లి వస్తున్నావురా ఎండలు మండిపోతున్నాయి’’ అన్నాడు
‘‘అందుకే కదా తాతయ్యా డ్రింక్‌లు తెచ్చాను’’
‘‘అవునురా నీ పళ్లేంటీ అలా వున్నాయి?’’
‘‘ఏమో తాతయ్యా ఇప్పుడు డాక్టర్‌గారిని కలసి వచ్చాను. ఏవో మందులు రాసి ఇచ్చారు. ఇంకా నయం సరైన సమయానికి వచ్చారు లేకపోతే పళ్లు తీసివేయాల్సి వచ్చేది అని డాక్టర్ చెప్పాడు’’
రాఘవరావుగారికి కోపం వచ్చి ‘‘చాలా బాగుంది. రోజంతా డ్రింక్‌లు తాగితే ఇలాంటి రోగాలే వస్తాయి. ఒక లీటర్ డ్రింక్ బాటిల్ తయారు చేయడానికి 8 లీటర్ల మంచినీళ్లు అవసరమవుతాయి. ఒక డ్రింక్ బాటిల్‌కి 28 రకాల క్రిమిసంహారక మందులు అవసరమవుతాయి. అది మనకి అనవసరం. ఈ కాలం మనుష్యులుకి అన్నీ తెలుసుంటాయి అనుకోవడం భ్రమ.
ప్రభుత్వం ఇచ్చిన మంచినీటికి వంకలు పెట్టి చల్లని కూల్‌డ్రింక్‌లు తాగడం ఎంతవరకు కరెక్టు. నిజానికి ప్రభుత్వాలది కూడా తప్పు ఉంది. రెడ్ కార్పెట్ వేసి డ్రింక్‌ల కంపెనీలను ఆహ్వానిస్తున్నారు. మన మంచినీటిని వాళ్లు వ్యాపారం చేసుకుని మనం మురుగునీరు తాగి రోగాలు తెచ్చుకుంటున్నాం. మనకి త్వరలో కన్నీటి బతుకులు ఖాయం’’ అని చెప్పి అక్కడి నుండి బయలుదేరారు కోపంగా రాఘవరావుగారు.
చేసేది లేక వాళ్లు అతని వైపు చూస్తుండిపోయారు. రాఘవరావుగారు నడుస్తూ వృథాగా పోతున్న కుళాయి నీటిని చూశారు. అలాగే ఎంతో మంది డ్రింక్‌లు తాగడం చూశారు. వాటర్ బాటిల్‌ను, వాటర్ ప్యాకెట్లను కొనడం కూడా చూశారు.
‘అంతా వ్యాపారమే, ఎవ్వరికీ చిత్తశుద్ధి లేదు’ అనుకుంటూ రోడ్డు పక్కన ఉన్న చలివేంద్రం దగ్గర మంచినీళ్లు తాగారు. మనిషికి మేలు చేస్తున్నారనుకుని రెండు వందల రూపాయలు ఆ సంఘానికి ఇచ్చి ఇంకా బాగా చేయండి అని చెప్పి అక్కడి నుండి నిష్క్రమించారు.

- నల్లపాటి సురేంద్ర,
కొత్త గాజువాక,
సెల్: 9490792553.

మినీకథ

సెంటిమెంట్ అప్పు

సాయంత్రం అయిదు అవుతోంది. పని పూర్తి చేసుకుని ఇంటికి బయలుదేరుతూ ఉండగా ‘‘సార్ పిలుస్తున్నారు’’ అన్నాడు అటెండరు ఆదినారాయణ.
‘‘అర్జెంటు ఫైలేదో మళ్లీ పుటప్ చెయ్యమంటాడు కాబోలు’’ విసుక్కుంటూ ఆఫీసర్ గదిలోకి వెళ్లాడు అన్నాజీరావు.
‘‘రావోయ్ అలా కూర్చో’’ అన్నాడు బాస్.
అతని మర్యాదకి ఆశ్చర్యపోతూ ‘‘్ఫర్వాలేదు చెప్పండి సార్’’ అన్నాడు అన్నాజీరావు అత్యంత వినయంగా.
‘‘నువీ నెల పిఎస్ అడ్వాన్స్ అందుకున్నట్లుంది’’
‘‘అవును సార్. మా చెల్లాయి పెళ్లి కోసం చేసిన అప్పు తీరుద్దామని’’
‘‘సరేలే ఏవో అవసరాలు ఉంటాయి. లేకపోతే డబ్బెందుకు? నాకు అర్జెంటుగా ఇరవై వేలు కావాలి సర్దగలవా?’’ అడిగాడు బాస్.
అతడికి ఏ మాట చెప్పలేక బిక్కమొహం పెట్టాడు అన్నాజీరావు.
అన్నాజీరావు అవస్థ గమనించినట్లు గమనించినట్లు ఆఫీసరు ‘‘నా ఎస్‌బి అకౌంటులో అంత బ్యాలెన్స్ లేదయ్యా. ఎల్లుండి ఎలాగూ సాలరీ పడుతుంది కదా! వెంటనే డబ్బు డ్రా చేసి నీకిచ్చేస్తాను. ఎంతో అవసరం పడితే తప్ప ఈ అవసరాలరావు అప్పు జోలికి పోడు’’ అన్నాడు.
ఆఫీసరంతటి వాడు ఒక గుమస్తాని అంత ఇదిగా అర్థిస్తూ ఉంటే ఎలా కాదనగలడు? అందుకే కిమ్మనకుండా ఎటి ఎంలో అవౌంటు డ్రా చేసి ఇచ్చాడు.
ఆ ఎల్లుండి రానే వచ్చింది. ఆఫీసరు పిలుపు కోసం ఎంతగానో ఎదురు చూసాడు అన్నాజీరావు.
ఆ రోజే కాదు నెలరోజులైనా తీసుకున్న సొమ్ము వాపస్ చెయ్యలేదు ఆఫీసరు.
కొంప తీసి తన డబ్బు సంగతి మరిచిపోలేదు కదా అనుకుని ఆ రోజు ‘‘సార్ మీరు నా వద్ద తీసుకున్న ఇరవై వేలు’’ అంటూ గుటకలు మింగాడు అన్నాజీరావు.
‘‘అరెరె నీకు డబ్బులివ్వాలి కదూ! మరిచిపోయానయ్యా. రేపు ఇచ్చేస్తానులే’’ నొచ్చుకుంటున్నట్లు అన్నాడు ఆఫీసరు.
సరే తీసుకున్న సొమ్ము గుర్తుంది కదా అనుకున్నాడు.
అయితే అతగాడికి నిరీక్షణే మిగిలింది.
ఇక లాభం లేదనుకుని బాస్‌తో సన్నిహితంగా తిరిగే పొరుగింటి పుల్లారావుతో తన గోడు వెళ్లబోసుకున్నాడు.
‘‘ఎల్లుండి ఈ పాటికి నీ డబ్బు మీ ఆఫీసరు నీకిచ్చేస్తాడు సరేనా? ఇహ నిశ్చింతగా ఉండు, నాకు చెప్పావు కదా’’ అభయమిచ్చాడు పుల్లారావు.
అతడు చెప్పినట్లుగానే ఆరోజు బాస్ తీసుకున్న సొమ్ము అన్నాజీరావుకి రిటర్న్ అయింది.
సాయంత్రం ఇంటికొచ్చాక పుల్లారావును కలసి ‘‘గురువుగారూ మీరే మంత్రం వేసారో గానీ నా డబ్బు నాకు దక్కింది. మీ మేలు ఈ జన్మలో మరచిపోలేను’’ కృతజ్ఞతలు తెలియజేసుకున్నాడు.
‘‘మంత్రమా పాడా. మీ దగ్గర అప్పు తీసుకుని బాకీ తీర్చని వీర్రాజుకి వాంతులు విరోచనాలు పట్టుకుని సీరియస్ అయిపోయిందన్నాను. అలాగే నీ వద్ద అయిదు వేలు తీసుకుని ఎగ్గొట్టాలనుకున్న శ్రీ్ధర్ బాల్చీ తనే్నసాడని బొంకాను.
అంతే నీకు ఇవ్వవలసిన డబ్బు నీకివ్వకుంటే తనకేం కీడు జరుగుందోనని హడలిపోయి బాకీ తీర్చేసాడు. మన దేశంలో దేనికీ లొంగనివాడు సెంటిమెంటుకి విధిగా లొంగుతాడు. అందుకే ఆ అస్త్రాన్ని సంధించాను’’ అన్నాడు పుల్లారావు.

- దూరి వెంకటరావు,
దాసన్నపేట,
విజయనగరం-2.
సెల్ : 9666991929.

పుస్తక సమీక్ష

కదిలించే కవితలు
కాకిగోల

అక్షరాలు ఆయుధాలుగా, ఆలోచనల సుడిగుండాలు, అంతరంగాన్ని మధించే వేళ, నా కలం ఆరాటం తీరనిది ఆగనిది అంటూ స్పందించే హృదయంలోంచి, గాయపడ్డ యెదలోంచి నా కవిత్వం పుడుతుందంటూ, మతోన్మాదులు కాదు, మానవతావాదులు కావాలని నినదించే ‘‘కాకిగోల’’ కవితా సంపుటిని తెలుగు పాఠకులకందించిన ప్రతిభాశాలి శ్రీమతి పాలపర్తి జ్యోతిష్మతి. పట్ట్భద్రురాలు, 17 సంవత్సరాలు స్టేట్ బ్యాంకు ఉద్యోగిని, స్వచ్ఛంద పదవీ విరమణ చేసి, సాహితీ వ్యాసంగంలో మునిగి తేలుతూ గత సంవత్సరం ‘‘సుబ్బలక్ష్మి’’ కథలతో తెలుగు సాహితీప్రియుల ప్రశంసలు అందుకున్న రచయిత్రి అద్దంకి (ప్రకాశం) నివాసి.
ప్రముకుల ముందు మాటలతో 37 కవితల సమాహారం. అన్ని కవితలు భావగర్భితంగా ‘‘వ్యానిటీ బ్యాగ్’’ నిండుగా గంభీరంగా ఉందనడంలో కవిత్వం కథంతొక్కింది. భావబంధురంగా భాసిస్తుంది.
అగ్ని దేవుడు ఆగడాలు, తాజ్‌మహల్, అలుపే, అబల, వంటావిడ, దగాపడ్డ ధరిత్రి, కవిత్వమంటే, పనిమనిషి, విషవలయం, కర్మయోగి, మున్నగు కవితలు అలతియలతి పదములలో అనల్పార్థాన్ని భావాన్ని రంగరించిన తీరు రమ్యంగా ఉంది. హృద్యంగా సాగింది.
నా కాళ్లకింద నేల / నాదికాదు / నెత్తిమీద ఆకాశం నాదికాదు / మేడపైకెక్కే మెట్లు నావి కావు / నా ఇరుగు పొరుగుల ముఖాలు నాకు తెలియవు / నేనొక ‘అపార్ట్‌మెంట్’వాసిని / అంటూన్న త్రిశంకు స్వర్గం కవిత వాస్తవానికికద్దంపడుతూ నేటి జీవితాలను కళ్లకు కడుతుంది. ‘‘ఎవరికివారే యమునాతీరే’’ అన్న నానుడి స్మరణకు తెస్తుంది. మానవత్వమనుమాట, మరుగున మగ్గిందన్న సందేశం ధ్వనిస్తుంది.
గడ్డిపోచల్ని తెచ్చి / గూడుకట్టుకుంటే నిర్దయగా పీకిపారేశాడు / కళ్లైనా తెరవని పసికూనల్ని / నిర్దాక్షిణ్యంగా గోడవతలకి విసిరేశాడు / ఆఫ్రికా అడవుల్లో అంతరిస్తూన్న / జంతుజాతిని పరిరక్షిస్తాడట / అన్న పంక్తులు జీవకారుణ్యాన్ని మేల్కొలిపేలా, కనువిప్పు కలిగిస్తాయి ‘‘జీవకారుణ్యం’’ కవితలో.
పెళ్లి తరువాత మారిన ఇంటిపేరు / ఆడదానిపై / అత్తింటి అధికారముద్ర / అనేది భావగర్భితంగా వుంది. అనాదిగా వస్తూన్న పురుషాధిక్యాన్ని పెత్తనాన్ని పైచేయిని ధ్వనింపజేస్తుందీ కవిత.
కొన్ని కవితలు సామాజిక రుగ్మతలను అనాచారాలను ఖండించే దిశలో సాగాయి, మార్పును ఆకాంక్షించాయి. కరెంటు తీగెకు వేలాడుతున్న పిల్లకాకి చుట్టూ తిరుగుతూ, ఆక్రోశిస్తూన్న కాకిమూకను చూసి, స్పందించి మానవుల్లో లేని సమత, మమత, ఐక్యత పక్షులలో ఫరిడవిల్లిందన్న సందేశాన్ని ‘‘కాకిగోల’’ కవితలో కన్పరిచారు. కవితా సంపుటికా పేరునుంచారు. తద్వారా సమాజానికి సమైక్యతా సందేశాన్నందించారు. కావున ‘కాకిగోల’ సముచితంగా ఉంది.
‘బహుకృతవేషం’ కవితలో నిన్నటిదాక / వీధి మొహమెరుగని ఇల్లాలు / గంగా భాగీరధీ సమానురాలుకాగానే / నాయకురాలుగా రాజకీయ రథాన్నధిరోహించడం / అతి విడ్డూరంగా ఉందన్నమాట, నేటి రాజనీతి ధోరణికి దర్పణం పడుతుంది.
గురువును బహుముఖాలుగా చిత్రించి మహనీయతను కళ్లముందుంచిన తీరు గమనార్హము.
రచయిత్రి జ్యోతిష్మతి ప్రథమ కవితా సంపుటిలోనే తనదైన ముద్రను వేసి సుబ్బలక్ష్మి కథలతో ఉత్తమ రచయిత్రిగా సాహితీ లోకానికి పరిచితులై రచనా పరిమళాలనందించారు. వీరిని మనసా అభినందిస్తూ మున్ముందు మరిన్ని రచనాసుమాలతో వాణినర్చించాలని ఆకాంక్షిద్దాం.

- చెళ్ళపిళ్ళ సన్యాసిరావు,
సెల్: 9293327394.

ఆదర్శం
వందమందికి
అన్నం పెడితే మహాపుణ్యం
ఒక్క పేదవాడిని చదివిస్తే జన్మధన్యం
నేటి యువతకి ఉండాలి మంచి గమ్యం
అది మన గురువులతోనే నెరవేరును
ఇది అక్షర సత్యం
చదువే దైవం చదువే ప్రాణం
చదువే నీ జీవితం
చదువుతోనే దక్కును అందలం
సహనం, సౌశీల్యం
ఎవరికైనా ముఖ్యం
నలుగురితో సహజీవనం
అదే మన ఆదర్శం

- నాగాస్త్రం నాగు,
విశాఖపట్నం, సెల్ : 9966023970

అమ్మమ్మ
అందాల కడలిలాంటి
అమ్మ ఒడిలోన నువ్వు
చనుబాలు జూకుతూ
ఊయలలాగుతూ
తప్పటడుగులతోటి
ఉంగా అంటూ
అత్తా అమ్మా అంటూ
చిన్నిచిన్ని ఊసులతో
అందరినీ మురిపిస్తూ
ఓ పాపారుూ
ఎంత దానివైనావే
నువ్వు ఒక పాపనిచ్చి
అమ్మమ్మను నన్ను చేసి
అమ్మవైపోయావే
నీకు ముద్దులీయనా
నీ పాపను ముద్దాడనా
అసలుకన్నా వడ్డీయే
ముద్దు కదా లోకంలో!

- విద్వాన్ ఆండ్ర కవిమూర్తి, అనకాపల్లి,
సెల్ : 924666658

స్వాగతం
ఇది నీకు తెలుసా?
నీ ప్రతి వచనం ఓ మంగళం
ప్రతి పలుకు వేద సాహిత్యం
ప్రతి వాక్యం సత్యకావ్యం
నీ దరహాసం వంద నందనాలు
విరబూసినట్టుంటుంది
నీ పలుకులు
పారిజాతాలు నవ్వినట్టుంటాయి
నీ మధుర భాషణం
ఆత్మానందం కలిగిస్తుంది
నీ ఆగమనమే ఓ సుధా స్రవంతి
నీ సహవాసంతో
గండశిలల వంటి
గుండెలు సైతం
కరుణాపూరితమై కరిగిపోతాయి
నీవు నా భావికో పిలుపువి
జీవితానికో మలుపువి

- శివాని, శృంగవరపుకోట.

మీలోకి తొంగి చూచుకోండి
అన్నీ మన కళ్ల ముందరే దృశ్యాలౌతాయి
కొన్ని మేడిపండు అందాన్ని ప్రదర్శిస్తాయి
లోపల ఉన్నవి పురుగులేనని తెలిసినా
దృష్టి మరల్చనివ్వని ధ్యాస
శృంగార సౌఖ్యాన్ని తలపిస్తుంది
మధువిప్పుడు ప్రాచీన సంప్రదాయపు
ఆనవాళ్లని అనుసరిస్తూ అహంకారంతో
పరవళ్ళు త్రొక్కుతున్న సముద్రం
ఎందరు ఇష్టపడి క్రీడించినా
పొంగుకొచ్చే వరదాయని
మనిషి జీవన రేఖలో భాగమైంది
ఒకప్పుడు తాగే వాళ్ల సంఖ్య లెక్కకి దొరికేది
ఇప్పుడు తాగని వాళ్లని లెక్కించడమే తేలిక
వీధి వీధిన విస్తరించిన వాణిజ్యమైంది
చీప్ లిక్కర్ సేవిస్తున్న వాళ్ళు
దేశం పాలన సాగడానికి
మేలిమి రాజబాటను నిర్మిస్తున్నారు
ఖరీదైన మద్యాన్ని సేవించే వాళ్ళు
బాటకిరువైపులా వజ్రాలు పొదుగుతున్నారు
నిర్మాణ వ్యయాన్ని సమకూరుస్తున్న వాళ్ళకి
అనారోగ్యపు ముళ్ళు గుచ్చుకుని
అందమైన కుటుంబ చిత్రం నలిగి
వాళ్ళ చేతుల్లోనే చిరిగిపోతుంది
ఆర్థిక అలజడి, నిప్పురవ్వలు పడి
తగల బడి పోతుంటే-
ఓర్వలేని స్థితి శిలగా నిలుచునుంది
త్రాగుబోతుల్లారా ఇటు చూడండి
ఒక్కసారి మీ బ్రతుకుల్లోకి తొంగి చూసుకోండి
తియ్యటి ఊహల మధు మంటల్లో
ఆహుతి అవుతున్న
కుటుంబ చిత్రం కనిపిస్తుంది
భార్యా పిల్లల దైన్యం కనిపిస్తుంది
అవయవాలు ఒక్కొక్కటిగా
కరిగిపోవడం కనిపిస్తుంది
చూచి తట్టుకుంటే రాక్షసుడివి
అల్లాడిపోతే మనిషివి

-ఎస్.ఆర్. పృథ్వీ, రాజమండ్రి

email: merupuvsp@andhrabhoomi.net

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) ఎడిటర్, మెరుపు, ఆంధ్రభూమి దినపత్రిక, సెక్టర్-9, ఎం.వి.పి.కాలనీ, విశాఖపట్నం-17. అనే చిరునామాకు పంపండి. email: merupuvsp@andhrabhoomi.net ఇ-మెయల్‌కు పిడిఎఫ్‌లో పంపించవచ్చు.

- నల్లపాటి సురేంద్ర