దక్షిన తెలంగాణ

ఆ నలుగురు...! ( కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిశబ్దం తాండవనృత్యం చేస్తున్న ఆ గదిలో పదవ తరగతి పరీక్ష రాస్తున్నారు విద్యార్థులు. ఇన్విజిలేటర్‌గా పార్థసారథి మాస్టారు, ఆయనకు సహాయంగా గోపాలకృష్ణ మాస్టారు విధులు నిర్వహిస్తున్నారు.
పార్థసారథి మాస్టారు చాలా ఖచ్చితమైన మనిషి, నిజాయితీపరుడు, ఉన్నత విలువల్ని, సత్సంప్రదాయాల్ని అమితంగా ఇష్టపడతారు. తరగతి గదిలో పాఠం చెప్పేటప్పుడు కూడా అంతే, ఒక్కొక్క విషయాల్ని నాలుగైదుసార్లు బాగా అర్థమయ్యేలా రిపీట్ చేస్తూ చెప్పేవారు. తీసుకుంటున్న జీతానికి పూర్తిన్యాయం చేకూర్చాలన్న తపన పెట్టుదల ఆయనలో సదానిండి ఉండేవి.
ఏ విషయంతోనైనా సరే ఆయన విధానమే అంత పరీక్షల నిర్వహణలో కూడా అంతే. కాపీ చేయడమంటే ఆయన దృష్టిలో ఆత్మహత్యా సహృదమే, అందుకే పరీక్ష ప్రారంభానికి ముందే తను విద్యార్థులందరినీ పూర్తిగా చెక్ చేశాడు. విద్యార్థులను మెడలు తిప్పనీయడం లేదు. అందుకే మేష్టారున్న గదిలో ఏ ఒక్కరిద్దరో మినహా ఎవరూ పరీక్ష బాగా రాయడం లేదు. అసలేమీ రాయడం లేదనే చెప్పాలి.
ఉక్రోషం నింపుకున్న కళ్లతో మాస్టారును, బిక్కమొహంతో క్వశ్ఛన్ పేపరును మార్చి మార్చి చూడసాగారు.
మొదటి రోజు పరీక్ష ముగిసింది.
మాస్తారు డ్యూటీ చేసిన గదిలోని విద్యార్థుల్లో నిరాశ, అసంతృప్తి, మిగతా గదుల్లోని విద్యార్థుల్లో సంతోషం, ఉత్సాహం, ప్రకటితమయ్యాయి. అందుక్కారణం వాళ్ల గదుల్లో కాపీ బాగా జరగడమే.
మరునాడు మాస్టారు మరో గదికి వెళ్లారు.
ఆ రోజు ఆ గదిలోని విద్యార్థుల గగ్గోలు. ఆ మరునాడు మరో గదిలో కాపీ జరుగలేదు. మాస్టారు మీద లెక్కలేదన్ని ఫిర్యాదులు అందాయి. హెడ్మాస్టరును, హెడ్మాస్టరు ముందు మాస్టారును గురించి దుర్భాషలాడారు మరో హైస్కూల్లో చదివి ఈ సెంటర్‌లో పరీక్షలు రాస్తున్న విద్యార్థుల తండ్రులు.
మాస్టారన్నా, ఆయన అనుసరించే విధానమన్నా మంచి గురి ఉండడం చేత తనవద్దకు వచ్చిన కంప్లైటుదారులందరినీ శాంతింపచేసి పంపించారు హెడ్మాస్టరు. పంపించాడన్న మాటేగానీ మాస్టారుకేమని చెప్పాలో, ఎలా చెప్పాలో తెలియక మధనపడసాగారాయన.
ఎంతో ఆవేశంగా అరగంట క్రితం ఓ యువకుడు తనను నిలదీసిన వైనం ఎంత ప్రయత్నించినా హెడ్మాస్టరు గారి ఆలోచనల నుండి తొలగిపోవడం లేదు. ఆలోచిస్తే..అతని మాటల్లో కూడా నిజముందేమోననిపిస్తుంది.
దారి మార్చుకోకపోతే బతుకు గోదాం పాలవుతుందని మాస్టారును పరోక్షంగా తన వద్ద హెచ్చరించిన ఓ వ్యక్తి తాలుకు హెచ్చరిక ఆయనె్నక్కువగా కలవరపెట్టసాగింది.
‘పిలిచారుట.. విషయమేమిటో చెప్పండి’ హెడ్మాస్టరు గారి ముందు కూర్చుంటూ అన్నాడు మాస్టారు.
‘చాలా చిన్న విషయమే. మీమీద ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి. అందువల్ల కాస్త చూసే..చూడనట్లుగా..’
‘చూసీ చూడనట్లుగా పరీక్ష నిర్వహించమంటారా సార్! మీరేనా ఈ మాటలంటున్నది?’
‘అది కాదండీ బెదిరింపులు కూడా వస్తున్నాయి’ ఏం మాట్లాడాలో తోచక తొందరలో అనేశాడు హెడ్మాస్టరు.
‘బెదిరింపులా!? రానీయండి. వాటికి భయపడడం నాకు తెలియదు. అయినా నేను చేస్తున్నదాంట్లో తప్పేముంది!?
‘తప్పని నేననడం లేదు మాస్టారూ. కానీ మీకేమైనా హాని జరిగితే నేను తట్టుకోలేను’.
‘నాపై మీకున్న అభిమానానికి కృతజ్ఞుడిని కానీ నాకు హాని జరిగితే అది నా విధానానికే తప్ప నాకు కాదు. నా విధానం మంచిదైతే చెడునుండి వచ్చే హాని ఎలాంటిదైనా దాన్ని జయించి నిలుస్తుంది. ఆ నమ్మకం నాకుంది’. దృఢంగా పలికింది మాస్టారి కంఠం.
‘మీరు చెప్పేది నూటికి నూరుపాళ్లూ నిజం. కానీ దానికి మీరొక్కరే బలికావడం..’
హెడ్మాస్టరు గారి మాటల్ని మధ్యలోనే అడ్డుకుంటూ ‘మంచికోసం, ఒక విలువైన నీతికోసం బలికావడాన్ని నేనదృష్టంగానే భావిస్తాను సార్. పరిస్థితులకు భయపడి పారిపోవడం నావల్లకాదు’ అన్నాడు పార్థసారథి మాస్టారు.
మాస్టారును మనసులోనే ప్రశంసించాడు హెడ్మాస్టరు.
‘మీ మనసునేమైనా బాధపడితే క్షమించండి’ అని లేచి వెళ్లిపోతున్న మాస్టారును చూస్తూ నిజమైన ఉపాధ్యాయుల్ని చూస్తున్న అనుభూతిని పొందాడు హెడ్మాస్టర్. కావాలనుకుంటే మాస్టారుకు డ్యూటీలేకుండా చేయగలరాయన కానీ ఇప్పటికే అధ్వాన్నంగా, అమానుషంగా నడుస్తున్న పరీక్షలు ఆయనను ఆ పని చేయనీయకుండా నిరోధిస్తుండగా మాస్టారుకే ఆపద రాకుండా కాపాడే భారాన్ని భగవంతునిపై వేసి మంచి జరగాలనే ఆశతో ఆకాంక్షతో ఉండిపోయారు.
హెడ్మాస్టరుగారి ఆశల్ని, ఆకాంక్షల్ని సమాధి చేసేందుకు సమాయత్తమైంది. ఆ మరునాటి పరీక్ష. ఆ రోజు మాస్టారున్న గదిలోని విద్యార్థుల తాలూకు వ్యక్తులంతా (అందులో ఎక్కువశాతం విద్యార్థుల తండ్రులే) పరీక్ష ముగిసిన పదిహేన్నిమిషాలకే ఆఫీస్ రూంలో హెడ్మాస్టరును చుట్టుముట్టారు.
హెడ్మాస్టరు ఎదురుగా మాస్టార్ని బండబూతులు తిట్టారు. ‘విద్యార్థికంటకుడని’ ‘మాపాలిట శనిగా’డని నిందించారు. చదువుకున్న తండ్రులు, వారిని సమాధానపరచడం హెడ్మాస్టరుకు తలకు మించిన పనైపోయింది.
ఆ తరువాత రోజు పరిస్థితులు మరింత విషమించాయి. పరీక్ష ముగిశాక ఇంటికి వెళ్లేందుకై బయటకు వచ్చిన మాస్టారును చుట్టుముట్టారు కొందరు. సమయానికి పోలీసులు రంగంలోకి దిగకపోయుంటే ఆయనకేమయ్యేదో చెప్పడం కష్టం.
మొత్తానికి పరీక్షలు పూర్తయ్యాయి.
***
రాత్రి పదకొండు గంటలు దాటింది.
టక్...టక్...టక్‌టక్...టక్...టక్
అదే పనిగా మాస్టారింటి తలుపుకొడుతున్నారెవరో నిద్రనుండి లేచివచ్చి తలుపు తీశాడు మాస్టారు. మరుక్షణమే మాస్టారు తలపై పడిందొక దెబ్బ. ఆయన కళ్లముందు నక్షత్రాలు మెరిశాయి. తూలి క్రింద పడబోతుండగా మోకాలుపై పడింది. మరొక దెబ్బ..‘్ఫర్’మంటూ ఎముక విరిగిన చప్పుడు.
మొదలు నరికిన చెట్టులా క్రిందపడిపోయాడు మాస్టారు. రెండు నెలల తరువాత వెలువడ్డ పరీక్షా ఫలితాల్లో మాస్టారు చేసిన పనివల్ల) నలుగురంటే నలుగురు మాత్రమే ఉత్తీర్ణులు’కాగా నలభై నాలుగు మంది ఉత్తీర్ణులు కాలేకపోయారు.
నాలుగు నెలల తరువాత -
అర్ధాంతరంగా అనుబంధాన్ని త్రెంచుకొని వెళ్లిపోయిన కాలుకి బదులుగా రెండు కర్రలను కాళ్లుగా చేసుకొని స్కూలుకు వస్తున్న మాస్టారును చూసి కళ్లు వాచేలా ఏడ్చాయి నీటి, నిజాయితీలు. వలువలు వొలచబడ్డ పాంచాలిలా విలపించాయి విలువలు.
ఆ తరువాతి సంవత్సరం వాటికి ఆ బాధాతప్పింది. వికలాంగుడైన మాస్టారును పరీక్షల నిర్వహణ బాధ్యత నుండి తప్పించారు.
నీతి, నిజాయితీలను పాతిపెట్టి విలువలను తరిమికొట్టి ‘రికార్డుస్థాయి’లో పరీక్షలు వ్రాసిన విద్యార్థులందరూ ఉత్తీర్ణులు కాగా ఘనకీర్తిని మూటగట్టుకుంది ఆ పాఠశాల.
కాలం వయసు మరో పదిహేనేళ్లు పెరిగింది.
అది జిల్లా కమ్యూనిటీ హాలు ఆవరణ...
ప్రతిభావంతుడైన యువకవి సత్యంకు సన్మానం జరుగుతోందక్కడ ఆ కార్యక్రమానికి జిల్లా కలెక్టరు, విద్యాశాఖాధికారి, ప్రజాపరిషత్ చైర్మన్‌లతో పాటుగా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు శివరాం. అసిస్టెంట్ సివిల్ సర్జన్ డాక్టర్ సుందర్‌లు ప్రత్యేకాహ్వానితులుగా విచ్చేశారు.
వర్కింగ్ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి విశ్వప్రభ దినపత్రిక జిల్లా చీఫ్ రిపోర్టరైన విజయ్ కార్యక్రమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు.
ఆహుతుల మధ్యన కూర్చున్న పార్థసారథి మాస్టారు ఆ కార్యక్రమాన్ని ఆసక్తిగా తిలకిస్తున్నారు.
సత్యంను సన్మానించడం పూర్తయ్యింది.
ప్రముఖులంతా అతని ప్రతిభను కొనియాడారు. అనంతరం, తనకు జరిగిన సన్మానానికి కృతజ్ఞతలు చెబుతూ పదిహేను నిమిషాలసేపు అనర్గళంగా కవితా ధోరణిలో సాగిన సత్యం మాటల్లో పార్థసారథి మాస్టారు పేరు ఇరవైసార్లు వినిపించింది.
జిల్లా సాహితీ సంస్థ ఏర్పాటు చేసిన ఆ సభకు విచ్చేసిన వాళ్లంతా వీడ్కోలు తీసుకొని క్రమంగా వెళ్లిపోయారు.
చివరగా బయలుదేరిన కారులో
డ్రైవరు కాకుండా అయిదుగురున్నారు. వాళ్లు పార్థసారథి మాస్టారు. సత్యం, శివరాం, సుందర్, విజయ్‌లు వాళ్లను కూర్చోబెట్టుకున్న కారు విజయ్ నివాసం వైపుకు సాగిపోయింది.
వాళ్లది గురు శిష్యుల సంబంధం.
ఆ నలుగురూ పార్థసారథి మాస్టారు శిష్యులే!
క్లాస్‌మేటైన ఆ నలుగురూ సరిగ్గా పదహారు సంవత్సరాల క్రితం మాస్టారున్న స్కూల్లో ఆ నలుగురు మాత్రమే ఉత్తీర్ణులైన విద్యార్థులు.

- డా. ఎస్.ఎస్.రాజు
కరీంనగర్,
సెల్.నం.9963499137

పుస్తక సమీక్ష

సామాజిక స్పృహ ధార... ‘అక్షర తార’

పేజీలు: 115 - వెల : 80/-
ప్రతులకు: శ్రీమతి సుశీలాదేవి
ఫ్లాట్ నం.204, కమలశ్రీ అపార్ట్‌మెంట్స్
రాజీవ్ కాలనీ, మంకమ్మతోట
కరీంనగర్ - 505001
సెల్.నం.9032742937

‘సిరా చుక్కల్లో
కొంచెం త్యాగ రసం కలుపుకొని
కోట్ల మెదళ్లలో
కొత్త ఆలోచనలు పూయిద్దామన్న’ సంకల్పంతో... కలం పట్టిన భండారి అంకయ్య గారు కవి సమాజ హితైషి అన్న సత్యాన్ని నిజం చేయడానికి ‘అక్షర తార’ అనే కావ్యం ద్వారా కొత్త రాగాన్ని ఆలపిస్తున్నారు. వృత్తిరీత్యా రెవెన్యూ శాఖలో డిప్యూటీ కలెక్టర్‌గా పదవీ విరమణ చేసిన ఆయన రచనా వ్యాసంగాన్ని తమ ప్రవృత్తిగా మలచుకుని తమ సృజనను చాటుకుంటున్నారు.
చైతన్యం కోసం ఆయన కవిత్వం రాయడం స్వాగతించదిగింది. నా ఊహలకు రెక్కలొచ్చినప్పుడు.. నా సంఘర్షణలకు మెరుపులొచ్చినప్పుడు.. నా అనుభవ స్మృతులకు రూపం వచ్చినప్పుడు..నా కలం కదుల్తుందని స్వయంగా ప్రకటించుకున్న ఆయన ఇదివరకే ‘జీవన నానీలు’, ‘రాజ్యాంగ శిల్పి’ గ్రంథాలను వెలువరించారు. ఇప్పుడు ప్రకటిస్తున్న ‘అక్షర తార’ కవితా సంపుటిలో డెబ్బది ఐదు కవితలున్నాయి. వీటికోసం ఆయన ఎంపిక చేసుకున్న కవితా వస్తువులు అత్యంత సామాన్యమైనవి అయినప్పటికీ.. తన అసమాన ప్రతిభతో వాటికి చక్కని రూపునిచ్చారు.. కొన్ని కవితల్లో కవిత్వాంశ పెద్దగా లేదని పాఠకులు నిరుత్సాహ పడ్డట్టప్పటికీ..కవి యొక్క సామాజిక చింతనను అభినందించకుండా ఉండలేరు. కొంత మంది ప్రముఖుల్ని, స్నేహితుల్ని స్మరించుకుంటూ రాసిన కవితలు ఇందులో ఉన్నాయి. ఉగాదికి స్వాగతం పలికే కవితతో పాటు కాళోజీతో ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకునే క్రమంలో రాసిన కవితలూ ఉన్నాయి. కాళోజీ కవితా ధారను తెలిపే కవితలూ ఉన్నాయి! ప్రయోజనంతో నిమిత్తం లేకుండానే ఆత్మతృప్తి కోసం రాసే ఆయన కవిత్వంలో..అనేకానేక సంఘర్షణలు ఆటుపోటులు అక్షరాల్లో కానవస్తాయి! చీలికలు పెంచే మతవైఖరి వద్దనే ఆయన ఐక్యతను పెంచే మనిషితనం కోసం తపనపడే కవితలు ఈ గ్రంథంలో దర్శనమిస్తాయి. ప్రాతః స్మరణీయుడిగా ప్రజాకవి కాళోజిని ఓ కవితలో ఆవిష్కరించిన తీరు బాగుంది. మరో కవితలో కాళోజీని స్థితప్రజ్ఞుడుగా కొనియాడారు. నేటి బాల లోకానికి..ఓ నవ సందేశ పతాక.. ఆమె నారీలోక నీరాజనాలందుకుంటున్న కీర్తి చంద్రిక! అంటూ..మలాల కృషిని కొనియాడుతూ రాసిన ‘అక్షర తార’ కవిత బాగుంది. ఆమె ఆశకు ప్రతిరూపం.. అక్షర యజ్ఞానికే అంకితమని కితాబిచ్చారు.
‘మా అవ్వ యాదిలో’ పేరుతో రాసిన కవిత చదువుతుంటే ప్రతీ ఒక్కరికీ వారి అమ్మ గుర్తుకొచ్చేలా.. బాల్య జ్ఞాపకాలను అక్షరాల్లో బంధించిన అంకయ్య గారు తమ అవ్వపై వున్న గౌరవాన్ని చాటుకున్నారు. మణిపురం ‘ఉక్కు మహిళ’ను ఉన్నతంగా చిత్రీకరిస్తూ.. రాసిన కవితలోని ప్రతి పంక్తీ.. స్ఫూర్తిదాయకంగా ఉంది.. ఛానూ షర్మిల అనుపమాన సాహసానికి అద్దం పట్టేవిధంగా ఈ కవితను రూపొందించారు.
ప్రతిఫలాపేక్ష ఇసుమంతైనా లేక.. ఉద్యమ లక్ష్యానికే అంకితమైన లోక్‌సత్తా రాజవౌళికి ‘అశ్రునివాళి’ సమర్పిస్తూ రాసిన కవిత అందరినీ కదిలిస్తుంది.
భరత జాతి కీర్తి కిరీటంలో సదా మెరుస్తున్న కలికితురాయి.. అజరామరుడైన రాజ్యాంగ శిల్పి అంబేద్కరుకు జోహార్లర్పిస్తూ రాసిన కవితలో.. అసమాన మేధో సంపదను ధారవోసిన ధీరోదాత్త పురోహితుడిగా అభివర్ణించారు. అతి సాధారణ జీవనం గడిపి ఆదర్శుడైన కర్తవ్య పారాయణిడిగా కలాంను స్తుతిస్తూ సలాం సమర్పించారు. ఇలా ఎక్కువ కవితలో గత స్మృతులను నెమరువేసుకుంటూ రాసి కవి అంకయ్య గారు తమ ఉత్తమ వ్యక్తిత్వాన్ని చాటుకున్నారు. అంకయ్య గారు రాసిన ఇందలి కవితల్లో ఆయన సామాజిక బాధ్యత ప్రతిబింబించేలా అక్షరాలు కొలువుదీరాయి! అయితే.. కవిత్వం రాయడంలో ఆయన మరిన్ని మెలకువలు తెలుసుకోవాల్సి ఉంది. మున్ముందు చిక్కని కవిత్వంతో మన ముందుకు రావాలని కోరుకుందాం.. సామాజిక స్పృహతో రూపుదిద్దుకున్న ‘అక్షర తార’కు ఆహ్వానం పలుకుదాం.. అభినందన చందనాలు సమర్పిద్దాం.

- సాన్వి, కరీంనగర్
సెల్.నం.9440525544

మనోగీతికలు

సరదాల సంక్రాంతి!
చిరు చీకట్లను చీల్చుకుంటూ..
నులి సిగ్గుల చలిగాలులతో కూడి
భోగిమంటల దీపకాంతుల్లో..
భోగ భాగ్యాల నొసగే సంక్రాంతికి
స్వాగతం పలికే ముత్యాల ముగ్గులు!
శుభకరమైన మామిడాకు తోరణాలు
కుంకుమ బంతుల పసుపు పేరంటాలు
లేలేత హరిత వర్ణాల అరటి ఆకులు
మునివేళ్ల కొసల్లోంచి జాలువారే
ముచ్చటైన రంగవల్లులు!
వరాల నొసగే గొబ్బెమ్మల కొలువులు
పాడి పంటలు, ధన ధాన్యాలు
కొత్త అల్లుండ్ల సందడులు
కొంటె మరదళ్ల సరాగాలు..
వీధి వీధినా గంగిరెద్దుల విన్యాసాలు
హరిదాసుల శ్రీహరి నామ సంకీర్తనలు
పరువాల గాలిపటాలను
ఎగురవేస్తూ యువత పరవళ్లు!
అందమైన ఆట పాటలు!
తీపిదనాల చెఱకు గడలు
నోరూరించే వగరు చింతకాయలు
రేగుపండ్ల పులుపులు
కమ్మనైన పిండి వంటకాలు!
పసిబిడ్డలకు భోగిపళ్లు
వైభోగం కోసం పుణ్యస్ర్తిల నోములు!
సకినాలు, లడ్డూలు, నువ్వుండలు
పులిహోర, దద్దోజనం, బొబ్బట్లు
ఇవీ సరదా సంక్రాంతికి ఆనవాళ్లు!

- పొద్దుటూరి మాధవీలత, ఎడపల్లి, సెల్.నం.7386483664

సంక్రాంతి శోభ!
సంక్రాంతి
రైతుల కళ్లల్లో నింపుతుంది కాంతి!
పేదల మోముల్లో..
వెదజల్లుతుంది నవ జీవన క్రాంతి!
ముంగిళ్లలో..
ముత్యాల ముగ్గులతో సింగారాలు!
హరివిల్లులను తలపించే
రంగవల్లులు..
పంచుతాయి కోటికాంతుల వెలుగులు!
ఇళ్లన్నీ..
ధాన్యరాసులతో కొలువుదీరి..
అందరి వదనాల్లో
ఆనందాన్ని తాండవింపజేస్తాయి!
హరిదాసుల గానంతో..
పరిసరాలన్నీ పులకరిస్తాయి!
బసవన్న రాకతో..
ఇంటికి కొత్త కాంతులు వెదజల్లి
మనసును రంజింపజేస్తాయి!
కోడి పందేలు..
ఊరంతా సందడి చేస్తాయి!
సంక్రాంతి పండుగకు
నిండు శోభను కూరుస్తాయి

- బొమ్మకంటి కిషన్
కరీంనగర్
సెల్.నం.9494680785

మనసా! తెలుసా!
మనసా!
ఈ వయసు సొగసులు చూసి మురిసిపోకు!
మూన్నాళ్ల ముచ్చట సంబరాల కోసం
దుశ్చర్యలకు ఉసిగొల్పకు
అందచందాలపై మెరుగుల
సొగసులే ఈ ఆకర్షణలు!
సుఖానే్వషణకై పరిగెత్తి అలసిపోయి
రోగాల బారినపడకు!
మనిషి మంచి గుణాభిరామునిగా నిలువు!
మనసా!
ఈ మనిషికిన్ని పొగరు చేష్టలెందుకోమరి!
బలమున్నదనీ విర్రవీగితే చతికిలపడిపోతావు
ఈ కాలమానములో వెలసిపోయి
నికృష్ఠంగా మిగలకు!
మనస్సాక్షిని కాదనీ విచ్చలవిడిగా తిరిగితే
హెచ్చరిస్తుంది మనసు!
మనిషికి మనస్సు వుండటం ఓ అద్భుత వరం!
ఈ వరం ప్రాణకోటిలో దేనికి లేదనీ గుర్తించి
జాగ్రత్తగా మసలుకోవాలి మనం!

- ఎన్.జగన్ మాధవరావు
బోయినిపల్లి
సెల్.నం.9491698839

ఒక అసంపూర్ణ వర్ణచిత్రం!
జీవిత వృక్షం గాయాలఫలాల్ని మోస్తూ
విమర్శనల రాళ్ల దెబ్బల రుచి చూస్తున్నా
మనసుకుంచెతో ఆశల రంగుల్ని అద్దుతూనే వున్నా
జీవన చిత్రం ఇంకా అసంపూర్ణంగానే
జ్ఞాపకాల చిరుగుల్ని
ప్రేమదారాల సున్నితపు అల్లికల్తో అతికిస్తున్నా
బాధల సూదిపోట్ల రహస్య దాడి
ఇంకా సాగుతూనే ఉంది.
ఆశల మట్టి ముద్దల బొమ్మల్ని మలుస్తున్నా
చేజారిన బొమ్మరూపం
మళ్లీ మట్టైనా..
అద్దిన రంగులన్నీ వెలిసినా
నా శ్రమైక హస్తాల వేర్లలోంచి
ఆశల సింగిడేదో మొగ్గ తొడుగుతునే వుంది.
నిజానికి - జీవితం - ఆకృతిదాల్చని
అసంపూర్ణ వర్ణచిత్రమే కదా!

- డాక్టర్ కలువకుంట రామకృష్ణ, కరీంనగర్
సెల్.నం.9440152405

అంతా కృత్రిమం !
పురిపడ్డ జీవితపు కొసనుండి
మరో కొసకు పోగుపడే అనుభవాల మూటలు!
తప్పొప్పుల పట్టికలో..
కొన్ని నిజాలు.. కొన్ని నిస్సహాయతలు!
ఒక్కో మలుపులో.. ఒక్కో మజిలీ!
కొన్ని అపరిచిత స్వరాలు..
కొన్ని పరామర్శల పలకరింపులు!
కొంత చీకటి నీడన మిగిలిన జాగాలో..
సర్దుకుపోతున్న రాజీల బతుకుబండి!
రేపటిపై ఆశ చావని ఎదురుచూపుల్లో
కొత్త రెక్కల తరం!
అంబరాన్ని చుంబించాలని
నేలపై ఆనని పాదాలతో..
తలనిండా ఆలోచనలతో స్వాభిమాన శకం!
ముదిమి దేహంలో - మునిమాపు చీకట్లు!
నీరెండ వాగుల్లో - తడిలేని ఆత్మీయ చెలిమెలు!
పొడి పొడి పదాలు - ప్లాస్టిక్ నవ్వులు!
ఒక ఉదయం - ఒక రాత్రి..
వేదన బరువుతో అంతా కృత్రిమం!!

- బి.కళాగోపాల్,
నిజామాబాద్
సెల్.నం.9441631029
email : merupuknr@andhrabhoomi.net

నిర్వహణ : దాస్యం సేనాధిపతి dasyamsenadhipathi10@gmail.com

ఈ శీర్షికకు కవితలు, కథలు, సాహితీ వ్యాసాలు, కొత్త పుస్తకాల సమీక్ష/పరిచయం, కార్టూన్లు ఈ క్రింది చిరునామాకు లేదా ఈ-మెయల్‌కు పంపండి.

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, జగిత్యాల రోడ్, కరీంనగర్. merupuknr@andhrabhoomi.net

- డా. ఎస్.ఎస్.రాజు