రాజమండ్రి

రాకీ (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సర్వీసు ఆటో ముగ్గురు ప్రయాణీకులతో స్పీడుగా గాకుండా మధ్య తరగతి పంథాలో పోతున్నది. ముగ్గురూ ఒకే ప్రదేశంలో ఎక్కలేదు. ఒకరొకచోట, ఇద్దరు కలిసి మరోచోట ఎక్కారు. ఈమధ్య ఆటోల సంఖ్య గణనీయంగా పెరిగిపోవడంతో ఒక్క పాసింజరు కనపడ్డాగాని ఆపి అడిగి మరీ ఎక్కించుకుని తీసుకుపోతున్నారు ఆటోవాలాలు.
కలిసి ఆటో అధిరోహించిన ఇద్దరు సంభాషణ మొదలు పెట్టారు. మూడో వ్యక్తి సీటు వెనక్కి జారబడి కళ్లు మూసుకుని ఉన్నారు. అతడు వౌనంగా సాటి పాసింజర్ల మాటలు వింటున్నాడో, కోడి కునుకు తీస్తున్నాడో ఆటో డ్రైవరుకి మాత్రం తెలుస్తుంది నిత్యానుభవం వల్ల.
‘బావా! మనం చూడబోయే పెద్ద మనిషి మన పని చేసి పెడతాడంటావా? ఏమోరా! ఆయన ముక్కుసూటి మనిషి. నిజాయితీకి పెట్టింది పేరట. అయినా మన ప్రయత్నం మానకూడదని బయల్దేరాం. మనం లేచిన వేళ మంచిదైతే జరగొచ్చు, జరగకపోవచ్చు. అంతా దేవుడి దయ. ఆపైన మన అదృష్టం. అప్పుడు ఆటో డ్రైవరు ఉన్నట్టుండి ‘అంతా రాకీ అంతా రాకీ...’ అంటూ పల్లవో చరణమో అందుకున్నారు.
‘పళ్లు ఫలాలు, కాయలు కసర్లు, స్వీట్లు, హాట్లు దండిగా కొని పట్టుకెళ్లి సమర్పిస్తే...?’
‘స్వీకరిస్తారు. వాటికి ఇంతని ఖరీదు కట్టి అంత డబ్బు ఇచ్చేసి పొమ్మంటాడట. అంతేకాదు. పనికోసం డబ్బివ్వక పోతే ఎడం కాలు చెప్పు తీస్తాడట అని చెప్పుకుంటారు’
‘కాళ్లు, చేతులు పట్టుకుని బతిమాలుకుంటే..?’
‘చీము నెత్తురు సిగ్గుశరం లేని చెత్త మనుషులా మీరని ఛీకొడ్తాడట...’
‘బావా! తిమ్మిని బమ్మిని చేసే ఈ కలికాలంలో ఇలాంటి ఉత్తముడికి...’
నెమ్మదిగా ‘బావా! రాకీ రాకీ అంటే ఏమిటి?’ అని అడిగేడు.
‘ఏమోరా తెలీదు... సినిమా పాట అయ్యింటుంది’
‘బావా! నువ్వు విన్నది నాకు చెప్పావు కాబట్టి వారిని నువ్వు చూడలేదని నాకు అర్థమైంది. సరే అదలా వదిలిపెట్టు... ఆయన పేరయినా తెలుసా నీకు?’
‘అందరూ ఇష్సయ్య గారంటారని తెలుసురా అసలు పేరు తెలీదు’
‘విశే్వశ్వరరావు’ కళ్లు తెరచిన మూడో పాసింజరన్నాడు.
‘తమరెవరు బాబయ్యా?’ ఇద్దరూ ఆత్రంగా అన్నారు.
‘ఇస్సయ్యని’ అంటూ ఆగిన ఆటో నుండి దిగి కిరాయి ఇచ్చేసి ఇంటికి వెళ్లిపోతుంటే వెదకబోయిన తీగ కాలికి చుట్టుకున్నట్టు విశే్వశ్వరరావు ఉరఫ్ ఇస్సయ్య వెంటపడ్డారు ఇద్దరూ, ఆటోకి డబ్బులిచ్చేసి. తర్వాత బరువు చేతుల్తో ఇస్సయ్య ఇంట్లోకి వెళ్లారు.
అర్ధగంట తర్వాత ఖాళీ చేతుల్తో బైటికి వచ్చి ఆటోకోసం అడుగులు వేస్తున్న ద్వయానికి ‘నేతి బీరకాయలు, లేత నేతి బీరకాయలు’ అంటూ కాయగూరలు వాడు ఎదురొచ్చాడు.
గంట క్రితం ఎక్కి దిగిన ఆటో రాగా ఎక్కి కూర్చున్నారు. ఆటో కదిలింది. ‘బావా ఇస్సయ్య గారూ, నేతి బీరకాయా ఒకటే’
‘అవును సార్! మీరు విన్నవన్నీ రంగులు మార్చే ఊసరవెల్లి ప్రచార లక్షణాలు సార్. ఆయనొక చోటా రాకీ (రాజకీయం) నాయకుడు సార్’ అని ఆటోవాలా అనేసరికి.
అప్పుడిద్దరికీ ‘అంతా రాకీ అంతా రాకీ’ గుర్తుకొచ్చి అప్పుడు అర్థం కానిది ఇప్పుడు బాగా అర్థమైనట్టు మొహమొహాలు చూసుకున్నారు. ఆటో యథా ప్రకారం మధ్య తరగతి పంథాలో పోతున్నది!

- మాధవరపు కృష్ణ, కాకినాడ

స్నేహమంటే..?

కాలచక్రం మామూలుగానే తిరుగుతోంది. కానీ మనుషుల్లో విలువలు మాత్రం మారిపోతున్నాయి. కారణాలు అందరికీ తెలిసినా ఎవరూ పట్టించుకోవటం లేదు. ఇంతే అని అదేమిటో తమకు సంబంధం లేనిదిగా కళ్లప్పగించి చూస్తున్నారు. ఇదే కొనసాగితే ఎంతటి సునామీ ఎదురౌతుందో ఎవరికీ అర్థం కావటం లేదని మనసులోనే మధన పడుతున్నాడు విశాల్రావు. అదే సమయంలో ఫోన్ మ్రోగింది. ఎవరై ఉంటారు అని అనుకుంటూ కళ్లజోడు పెట్టుకుంటూనే ఎత్తారు.
అవతలి నుంచి చక్రధర్ గొంతు వినగానే ‘ఓ! నువ్వా! చక్రీ! ఎన్నాళ్లకు గుర్తుకు వచ్చాను. చెప్పరా సంగతులు’ అన్నాడు ఆయన ఆనందంగా!
‘ఏమిటి చెప్పేది? నువ్వేంటో ‘రాళ్లపల్లి’ దగ్గిర వాగావటగా అది తేల్చుకుందామనే చేసాను’.
‘అదా! నువ్వు ఆఫీసులో అవినీతికి పాల్పడుతున్నావని, లంచాలు బాగా తింటున్నావని అన్నాడు. అక్రమంగా సంపాదించిన ఆస్తులు ఎన్నటికీ నిలబడవు అన్నాను. అది లోకం ఎరిగిన సత్యమే కదా! అందులో తప్పేముంది చక్రీ?’
‘చక్రి ఏమిటి? చక్రధర్ గారూ అని పిలుపు. నీ స్టేటస్ ఏమిటి? నా స్టేటస్ ఏమిటి? ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు’.
‘స్నేహితులు మధ్య స్థాయి లేమిటిరా? నువ్వూ, నేను చిన్నప్పటినుంచీ ఫ్రెండ్స్‌కదా’.
‘ఆ! ఫ్రెండ్స్ అంటే ఇంటికి రా టిఫిన్ పెడతాను. తిను వెళ్లు అంతే!’
‘స్నేహం అంటే ఇదా! కష్టంలో సుఖంలో తోడుగా ఉండటం అనుకున్నానే’
‘నువ్వేమన్నా అనుకో, నా ఉద్దేశం ఇదే’ అంటూ ఫోన్ కట్ చేసాడు.
కాలంతో పాటు పదాలకు నిర్వచనాలే మారిపోతున్నాయి. స్నేహానికి వీడు కొత్త భాష్యం చెప్పాడు. ఈ కాలం స్నేహాలు ఇంతే అన్నమాట.
గతం అతని కళ్ల ముందు కదిలింది.
వెక్కి వెక్కి ఏడుస్తున్న చక్రి ప్రక్కన చేరాడు విశాల్.
అతన్ని చూడగానే కావలించుకుని బోరుమన్నాడు.
‘అమ్మా, నాన్న ఒకేసారి నన్ను విడిచి వెళ్లిపోయారురా. ఇక నేనెలా బ్రతకాలి? ఎవరికోసం బ్రతకాలి? ఏడుస్తూనే అంటున్నా అతనితో ‘అదేంటిరా అలాగంటావ్? నీకు నేను లేనా? ఇద్దరినీ నేనే అవుతాను. రా! మా ఇంటికి వెళదాం’ అని తీసుకువచ్చేసాడు.
తమ బిడ్డ పేరులానే విశాల హృదయమని పొంగిపోయారు ఆ తల్లిదండ్రులు. అప్పటి నుంచి తమకు ఇద్దరు బిడ్డలు అనుకున్నారు. తమ కొడుకుతో పాటు ఎంబిఎ దాకా చదివించారు.
ఒకటా..రెండా..ఇరవై ఏళ్ల అనుబంధం తమది. అలాంటిది ఈ రోజు తను ఏమీ కాని వాడయి పోయాడా? వాడిని తను చక్రధర్ గారూ అని పిలవాలా?
ఆ మాటలనటానికి నోరు ఎలా వచ్చింది?
గతంలోంచి వాస్తవంలోకి వస్తే సంతోషమంతా ఒక్కసారి బాధగా మారిపోయింది.
మనుషులింతగా ఎలా మారిపోతున్నారు?
బంధాలకు, అనుబంధాలకు, అనురాగం ఆప్యాయతల కన్నా డబ్బుకీ, పదవులకీ, పరువుకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారే!
ఇదంతా చూస్తుంటే నందనవనం నుంచి ఎడారిలోకి వెళ్లిపోతున్నట్లు తనకి అనిపిస్తోంది!
మరి అందరికీ ఎందుకలా అనిపించటం లేదు?
‘మనసు అద్దంలోకి తొంగిచూసే సమయం ఉండటం లేదు. దాన్ని కూడా యంత్రంలా యాంత్రికంగా తయారు చేస్తే ఇలా కాక ఎలా ఉంటాయి అనుబంధాలు?’
అంతరంగం గబుక్కున బయటకు వచ్చి అర్జునుడికి శీకృష్ణుడు భగవద్గీతను బోధించినట్లు చిటుక్కున చెప్పేసి.. చటుక్కున మాయమయ్యింది.
విశాల్రావు పెదాల మీద ఓ పేలవమైన దరహాసం విరిసి మాయమయ్యింది. చెరుకు పిప్పి స్మరణకు వచ్చింది మరి!
- యలమర్తి అనురాధ
తణుకు, సెల్.నం.924760206

చదువులమ్మ తిరునాళ్లు

గ్రంథాలయ ప్రభువులూ... పుస్తకాలు కొనండి!

కొత్త సంవత్సరానికి ప్రతి ఏడాదీ పుస్తకాలు స్వాగతం పలకడం తెలుగువారి అదృష్టం. జనవరి 1 నుండీ బెజవాడలో చదువులమ్మ తిరునాళ్లు జరుగుతాయి. తెలుగునేల నలుచెరగుల నుండీ పుస్తకాల మోజుపరులు తరలిరావటం పాతికేళ్లకు పైబడిన కాలం నుండీ ఒక రివాజు. బెజవాడకు గర్వకారణమైన పుస్తక ఘన మహోత్సవం 27వసారి మళ్లీ మొదలైంది. జనవరి 1న పుస్తక ప్రేమికులు అక్కడ కలుసుకుని కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకొనే ముచ్చటైన సన్నివేశం ఇది. పుస్తక ‘పెరుమాళ్ళు’కు ఈ తిరునాళ్ళు అంకితంగా సాగుతున్నాయి. ప్రముఖ ప్రచురణకర్త, జయంతి పబ్లికేషన్స్ అధినేత దివంగత మువ్వల పెరుమాళ్ళుగారి పేరుని పుస్తక మహోత్సవ ప్రాంగణానికి నామకరణం చేసి ఆయనకు నివాళులర్పిస్తున్నారు.
పుస్తకాలు పండితే, మస్తకాలు నిండుతాయి. లోకానికి అదే సంక్రాంతి.. అదే వెలుగు.. అదే చైతన్యం! 1988లో పుస్తక ప్రచురణ సంస్థ ప్రముఖులు కొందరు కలిసి కలకత్తాలో జరిగే పుస్తక ప్రదర్శనకు వెళ్లి చూసినప్పుడు కలిగిన ఆలోచనకు సాకారమే ఈ పుస్తక మహోత్సవం. నేషనల్ బుక్ ట్రస్ట్ సహకారంతో 1989లో మొదటి మహోత్సవం ఇదే స్వరాజ్య మైదానంలో చిన్నదిగా మొదలయ్యింది. అలా మొదలైన ఈ ప్రస్థానం విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ నేతృత్వంలో అత్యంత పరిణతి కలిగిన నిర్వహణా సామర్థ్యంతో నిరాఘాటంగా సాగుతోంది. మధ్యలో రెండు మూడు దఫాలు భారీ వర్షాలు కురిసి మైదానం జలమయమైనా పుస్తక విక్రేతలు మొక్కవోని దీక్షతో ఈ మహోత్సవాన్ని కొనసాగించగలిగారు. ఏ యేటికాయేడు పుస్తకాల కోసం వచ్చేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. పుస్తకానికి ఆదరణ లేదని, చదువరుల సంఖ్య పడిపోతోందనే అభిప్రాయానికి ఈ గణాంకం ఒక జవాబు. చదివే వారి సంఖ్య కూడా పెరుగుతోందనేది నిజం.
బెజవాడ రాజధాని కావటం దాని చారిత్రక ప్రాధాన్యతని, సాంస్కృతిక వైభవాన్ని దెబ్బతీస్తుందని ముందునుంచీ భయపడుతున్నట్టే ఇక్కడ జరుగుతున్న పరిణామాలున్నాయి. 2014లో రజతోత్సవం జరుపుకున్న ఈ పుస్తక మహోత్సవం ప్రాంగణంలో అత్యధికంగా గత సంవత్సరం 389 స్టాళ్లు ఏర్పరచగలిగారు. కానీ, వాటిలోంచి నూటయాభై స్టాళ్లను ఈసారి తగ్గించాల్సి వస్తోంది. అందుకు రాజధాని నిర్మాణమే ఒక కారణం. కాగా, ప్రభుత్వానికి పుస్తకం పట్ల గౌరవం లేకపోవటం అంతకుమించిన కారణం అవుతోంది. విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ అనే స్వచ్ఛంద పుస్తక సేవా సంస్థ ప్రతి ఏడాదీ నిర్వహిస్తున్న ఈ పుస్తకాల పండుగ ప్రజా సంబంధమైన ఒక సేవా కార్యక్రమం. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం పుస్తక వ్యాపారుల కార్యక్రమంగా చిన్నచూపు చూడటం బాధాకరమైన విషయం. ఎప్పుడూ జరిగే పుస్తక ప్రదర్శన ఈ ఏడాది సగానికి చిక్కిపోవలసి వస్తోందంటే ఇందులో ‘పబ్లిక్ ఇంట్రస్ట్’ అనే మూలసూత్రాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదని అర్థం. అనేక రకాలుగా ఆక్రమణలకు గురైన స్వరాజ్య మైదానంలో తాజాగా ముఖ్యమంత్రి గారి క్యాంపు కార్యాలయం కూడా చేరింది. పండిత జవహర్‌లాల్ నెహ్రూ ఆనాడు ప్రసంగించిన వేదిక ఇప్పటికీ స్మృతి చిహ్నంగా నిలబడి ఉంది. లోకనాయక్ జయప్రకాష్ నారాయణ్, ఆనాటి ప్రధాని మొరార్జీదేశాయ్, ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ప్రభృతులు ప్రసంగిస్తుంటే లక్ష మంది నిలబడి విన్న ఉదంతాలు ఈ స్వరాజ్య మైదాన జ్ఞాపకాల్లో ఇమిడి ఉన్నాయి. ఇంక అంతటి అవకాశం లేదు. రేపెప్పుడైనా అలాంటి మహనీయుడు బెజవాడకొస్తే చాలినంత మైదానాన్ని ఇప్పుడు బెజవాడ కోల్పోయింది. కాబట్టి, మహా పెద్దలారా.. మా ఊరికి రాకండి!
1993లో నాలుగో పుస్తక మహోత్సవం సమయంలో పుస్తక ప్రియుల పాదయాత్రను ప్రారంభించారు. కలకత్తా బుక్‌‘ఫేర్’లో సత్యజిత్ రే నాయకత్వంలో జరిగిన వాక్ ఫర్ బుక్స్ కార్యక్రమం అందుకు ప్రేరణ. ఆ మొదటి పుస్తక ప్రియుల పాదయాత్ర నిర్వహణలో నాక్కూడా భాగస్వామ్యం ఉండటం నాకు గర్వకారణం. ప్రతి ఏడాదీ జనవరి 4న ప్రెస్‌క్లబ్ నుండి పుస్తక ప్రియుల పాదయాత్ర ప్రారంభమై ప్రదర్శనగా మైదానికి చేరుకుంటుంది. పుస్తక ప్రియులు వౌనంగా గవర్నర్‌పేట వీధుల్లో ఊరేగింపుగా వెడతారు. పుస్తక ప్రాధాన్యత గురించిన ప్లకార్డులు పట్టుకుని ఊరేగింపు చేస్తారు. ఈ ఏడాది కూడా యథాతథంగా పుస్తక ప్రియుల పాదయాత్ర ప్రెస్‌క్లబ్ నుండి సాయంత్రం సరిగ్గా నాలుగ్గంటలకు ప్రారంభవౌతుంది. ఇందులో రచయితలు బాధ్యతగా పాల్గొనాలని సాహితీవేత్తలందరికీ విజ్ఞప్తి. పాఠకులు లేని రచనా వ్యాసంగం ప్రజలు లేని రాజ్యం లాంటిది. ఇది ఊరేగింపు కాదు, పాఠక దేవుడికి భక్తితో చేసే ప్రదక్షిణం. పోయిన ఏడాది కేంద్రమంత్రి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు, కేంద్ర హిందీ సంస్థాన్ సభ్యులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఈ పాదయాత్రలో సాహితీవేత్తలతో, పుస్తక ప్రియులతోనూ కలిసి అడుగులు వేశారు.
ఆరుద్ర, కాళోజీ లాంటి ప్రముఖులెందరో పుస్తక మహోత్సవానికి అతిథులుగా వచ్చి అభిమానులను పులకింపజేశారు. ఈ ఏడాది రాచపాళెం, ఓల్గా ప్రభృతులు వస్తున్నారు. సాహితీవేత్తల శత జయంతిని నిర్వహించటం, వారి సాహితీ సేవను స్మరించుకోవటంతో పాటు శత జయంతి సంవత్సరాన్ని ప్రారంభించే అవకాశం కూడా పుస్తక మహోత్సవానికే దక్కుతుంది. దివంగత సాహితీవేత్తలు, ప్రచురణకర్తలకు నివాళులు సమర్పించుకోవటం ఒక బాధ్యతగా నిర్వాహకులు భావిస్తున్నారు. అందుకు అభినందనలు. ఇది బుచ్చిబాబు గారి శత జయంతి సంవత్సరం, మహాకవి గురజాడ శత వర్ధంతి కూడా! వారిద్దరికీ ఘనమైన సంస్మరణను ఈసారి చూడబోతున్నాం. సాహితీ సభల వేదికపై గ్రంథావిష్కరణలూ, సీడీల ఆవిష్కరణలు, వివిధ అంశాలపై చర్చావేదికలూ జరుగుతాయి. చల్లని సాయంకాలాల్లో అక్కడ సాహిత్యం పరిమళిస్తూ ఉంటుంది. ప్రతిసారీ ప్రతిభ వేదిక మీద విద్యార్థుల కోసం ప్రతిభా పాటవాల పోటీలు నిర్వహించేవాళ్లు. ఈ ఏడాది మైదానం స్థలంలో ప్రభుత్వ కోత కారణంగా అందుకు అవకాశం లేకుండా పోతోంది.
గత మూడేళ్లుగా పుస్తకాల కొనుగోళ్ల కోసం, సైటేషన్ నెంబర్లు ఇచ్చే ప్రక్రియ ఆగిపోయింది. గ్రంథాలయ నిధుల్లో అధిక భాగం పాఠ్య గ్రంథాలకే వినియోగిస్తున్నారు. సృజనాత్మక సాహిత్యాన్నీ, పరిశోధనా గ్రంథాలనూ గ్రంథాలయ సంస్థలు కొనుగోళ్ల విషయంలో చాలా చిన్నచూపు చూస్తున్నాయి. ఈ పరిస్థితి మారాలి. జనవరి 1న మొదలైన పుస్తక మహోత్సవంలో సాహితీ విలువలున్న గ్రంథాలను, కథలు, నవలలను ఇంకా ఇతర సాహితీ ప్రక్రియలకు సంబంధించిన పుస్తకాలను, భాషా సాంస్కృతిక గ్రంథాలను ప్రాధాన్యతనిచ్చి కొనేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని రచయితల సంఘాల పక్షాన కోరుతున్నాము. ఇందుకోసం ఒక కొనుగోళ్ల కమిటీని వేసి మూడేళ్ల లోటునూ తీర్చటం ప్రభుత్వానికి పెద్ద సమస్య కాదు. సంకల్ప బలమే ఇక్కడ ప్రధానం. మంచి సాహిత్యానికి ప్రభుత్వం ప్రోత్సాహం ఇవ్వకపోతే తెలుగులో జ్ఞానపీఠాలు, ఇతర జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలూ ఎలా వస్తాయి? రచయితలు ‘రాయని భాస్కరులు’ కాకముందే పుస్తకాల పట్ల వివక్ష ఆపగలగాలి. పుస్తక మహోత్సవాన్ని చూడటం, పుస్తకాలు కొనటం అనేవి ప్రజలు కూడా చేసుకోవలసిన మంచి అలవాట్లు.

- డా. జి.వి. పూర్ణచందు,
ప్రధాన కార్యదర్శి, కృష్ణా జిల్లా రచయితల సంఘం,
విజయవాడ. చరవాణి : 9440172642

మనోగీతాలు

సంక్రాంతి ముగ్గు
తెలుగింటి
సంక్రాంతి వెలుగు
గుమ్మం ముందు ముగ్గు
సౌందర్యం
మంచు చలిలో
కాలం స్ర్తిలు వెనె్నల్లో
క్రొత్త తీపి జ్ఞాపకాలను
వెదజల్లిన దృశ్యం
చిగురిస్తోంది వౌనంగా
ప్రకృతికే అందం
ఆమె వేసిన ముగ్గు
సింగారంతో సిగ్గులు చెక్కిలిమీద
చిగురు పాదముద్రలు
కాంతిలో
గాజుల గలగలల మధ్య
ముగ్గు నా గుండె లోతుల్లో
విశ్వమంత వెలుగులో
ప్రకాశిస్తోంది
నిశ్శబ్దంగా మందార పువ్వు నవ్వులా
ఆమె కళా హృదయానికి
ముగ్గు సాక్షి
అందుకే ఆమెను కంటి రెప్పలమీద
నిలుపుకున్నా
సీతాకోక చిలుక ముగ్గుపై
ఆనందం నవ్వుల్లో
శిశువుగా మారి కేరింతలు కొట్టి
ఉత్సాహంగా
ఆకాశాన్ని తాకాలని వుంది
చెట్టులా

- నల్లా నరసింహమూర్తి, అమలాపురం, చరవాణి-92475 77501

సింహావలోకనం
గోడకున్న కాలెండర్ సూచించింది
నూతన ఆంగ్ల వత్సర ఆగమనం గురించి
గుచ్చిగుచ్చి అదేపనిగా పదేపదే ప్రస్తావిస్తోంది
గత సంవత్సర జయాపజయాలు ఏమిటని
అగ్నితప్తమైన గతాన్ని నెమరువేశాను
అవాక్కై ఆలోచనల బురదలో జారిపడ్డ నన్నుచూసి
జాలిగా గేలిచేస్తోంది ఓ దృశ్యమాలిక ఇలా..
‘ఊహల ఊయలలో అనుక్షణం ఆదమరచి ఊగావు
కార్యశూన్యుడవైనా ఫలితం కోసం ఎదురుచూశావు
కుదురు కోల్పోయి నిదురమత్తులో కర్తవ్యాన్ని మరిచావు’
సరే నిన్నటి తప్పొప్పుల మాట ఇప్పుడెందుకుగానీ
నీ గుప్పిటిలో ఉన్న సరికొత్త వత్సర కాలనిధిని
అమూల్య సువర్ణ పారిజాత కుసుమములా భావించు
పంచేంద్రియాలను నిరంతరం జ్ఞానపథమున నడిపించు
సత్కార్యాల తోటలో సదా విహరించ సంకల్పించు
వివేక విచక్షణా శృతి సమన్విత గీతాన్ని ఆలపించు
చిత్తశుద్ధి నీపరమైతే కార్యసిద్ధి నీకు వరమవుతుంది
స్వయంకృషి నీ బలమైతే జీవితం స్వర్ణమయమవుతుంది

- చాగంటి సుబ్రహ్మణ్యం
అనపర్తి, తూ.గో.జిల్లా, 95733 86124

కాల్‌సర్పం
అభాగ్యుల హద్దుమీరిన కోరికలను
అనుకూల పుట్టలుగా మలచుకుని
సగటు మనిషి స్వేద రుధిరాలను
క్షీర సమానముగా తలచి పీల్చుకుని
కాలయముని చందాన
ఆబాలగోబాలాన్ని
కబళించి తెగబలిసిన
కాల్‌మనీ సర్పం
రాజకీయ వృక్షశాఖలను
ఆద్యంతం ఆసరాగా చేసుకుని
ఆకసానికి ఎగబ్రాకుతూ
ప్రదర్శిస్తున్నది తన దర్పం
చట్టాల కట్టెలకు సైతం
ఈ విషపన్నాగం దడవని వైనం
ప్రమాదం పొంచి ఉన్నదని పసిగట్టి
తమాషాగా విదేశీయానం..

ఎవడో ఏదో చేస్తాడని నమ్ముకుంటే
అవని జనులకు మిగిలేది శూన్యం
ఆమ్యామ్యాలకు
ఆలవాలమైన ఈ దేశంలో
అమాయకుల బ్రతుకులు దైన్యం.
- అల్లాడి వేణుగోపాల్

నీరాజనం
కొండల్లో కోనల్లో
ముళ్ల బాటల్లో
రాళ్ల దారుల్లో
కాలినడకన
మాకోసం శ్రమిస్తూ...
ఆకలి నిద్రలు లేక కర్తవ్యాన్ని
ఉచ్ఛ్వాశ నిశ్వాసలుగా మలచుకొని
త్యాగాలే ఊపిరిగా
సరిహద్దుల్లో సింహాల్లా,
అలసట లేని మీ పోరాటం!
శుత్రుకూటములను
హతమారుస్తూ
మా భద్రత మీ జీవితాలైతే
సాహసులారా,
మీ ఉనికి ఆకాశమంత!
మీ స్మృతులు మా జీవితమంత!
మా ఆశలు మీరే! మా ఊపిరి మీరే!
మా జీవన వికాసానికి
విధాతలు మీరే!!

- శృంగారం ప్రసాద్,
శ్రీకాకుళం

తాగాలి మరి...!
అగ్గిలోన దూకినా
వలువలన్ని జారినా
యముని తోటి పోరినా
మగని మనసు మారునా?
బొమ్మలాట కాదురా మనసంటే
బ్రహ్మ ఆట ఆడునా మనసుంటే
బతుకేంటో, బాధేంటో తెలియాలంటే
అమ్మతత్వం ఎరగాలి
ఆ అమృతత్వం తాగాలి!
- చావలి శేషాద్రియాజులు,
సెల్ : 9032496575

చెట్టు
మనిషి బతికేది
కొందరి కోసం
చెట్టు బతికేది
అందరి కోసం
నీటిబొట్టుకు నేస్తం
నీ గుండె నడకకు ప్రాణం
శక్తి సడలి వంగిపోయిన వేళ
ఊతకర్రగా నిలుస్తుంది
కన్నబిడ్డలు కసాయిలైతే
కడదాకా తోడుగా ఉంటుంది!

- హృషీకేశం, సెల్ : 8790455653.

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి
email: merupurjy@andhrabhoomi.net

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, నేషనల్ హైవే, ధవళేశ్వరం, తూ.గో.జిల్లా. email: merupurjy@andhrabhoomi.net

- మాధవరపు కృష్ణ