రాజమండ్రి

ఆత్మకు హత్యా!? (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నేను ఆత్మహత్య చేసుకుంటాను అంతే! అవును, అంతే! ఈ ఒంటరితనం నేను భరించలేను. అది అనుభవించిన వాళ్లకే అర్థమవుతుంది!’ లోలోన అనుకోవాల్సిన మాటలు పైకే అనేశాడు ధీరేంద్ర. తనలోని మనిషి తనలాంటి మనిషి ఎదురుగా నిలబడ్డాడు. కళ్లు నులుముకుని మరీ చూశాడు. ఏ సందేహం లేదు. అవును అది తనే.. మరి ఇక్కడ ఉన్న నేను.. ఆశ్చర్యంగా చూస్తూ ఎవర్నువ్వు? అన్నాడు.
‘నీకు తెలియదా!’ నేనే అనుకున్నట్టున్నావ్
‘ఈ యక్ష ప్రశ్నలు మాని చెప్పు విసుగ్గా’ త్వరగా ఆత్మహత్య చేసుకోవాలని అతని బాధ. పాలవాడు వచ్చేలోగా అది జరిగిపోవాలి. లేకపోతే రేపటి వరకూ ఎవరూ రారు. ఈమధ్య పని మనిషి కూడా ఇంత దూరం రాలేనని మానేసింది. వీడైనా స్కూటరుంది కాబట్టి వస్తున్నాడు. అందుకే ‘నేనే నీ ఆత్మను. నన్ను చంపాలని అనుకుంటున్నావు!’
‘అవును’ విసుగ్గా ధీరేంద్ర
‘ఆత్మకు చావు లేదనే విషయం తెలుసా నీకు!’
‘ఈ లాజిక్ తనకెప్పుడూ అర్థం కాదు. అవును ఆత్మకు చావు లేనప్పుడు అది ఆత్మహత్య ఎలా అయ్యింది? అయోమయంగా అనుకున్నాడు.
‘నీ పేరేంటో తెలుసా!’
‘ఎందుకు తెలియదు ధీరేంద్ర’
‘దానర్థం ఏమిటి? ధైర్యవంతుడవని కదూ!’
‘ఆ పేరు పెట్టుకున్న వాళ్లు మినహాయించి మిగతా వాళ్లందరూ చేసుకోవచ్చన్నట్లుంది నీ వ్యవహారం’
‘అవును నీ శరీర హత్య’ ఎప్పుడు చేయబోతున్నావ్!’ డబ్బాలో సున్నుండలు తింటూ అడిగింది ఆత్మ.
‘ఇప్పుడే నీవు కాస్త బయటకి వెళితే..’
‘నేను బయటకు వెళితే అది స్వచ్ఛంద మరణం’
‘నీతో నేను చర్చలు జరపడానికి రాలేదు. అసలు నా బాధలు నీకేం తెలుసు. నా పెళ్లాం ఎప్పుడూ అల్లుడింట్లోనే ఉంటోంది. పురుడు పోయడానికని, పిల్లల్ని పెంచడానికని, స్కూల్లో దింపడానికని, ఇప్పుడు కాలేజీ పిల్లలకు వండి వార్చడానికని. నా ఆరోగ్యం పాడైంది. కొడుకూ, కోడలు వృద్ధాశ్రమంలో ఉండమంటున్నారు. కూతురు దగ్గర అమ్మ ఒక్కతే ఉండాలట. ఎందుకంటే నా వలన తనకు ఉపయోగం లేదు.
‘పోనీ నీవు కూడా ఇక్కడున్నట్లే అక్కడ కూడా ఒక రూమ్ తీసుకుని ఉండకపోయావా!
‘ఇక్కడ ఇళ్లూ, పొలాలూ ఏంగానూ’
‘ఇప్పుడు ఛస్తే ఏమవుతుంది!’
‘నీ పెళ్లాం నీ దగ్గర ఉండటం లేదంటే నీపై ప్రేమ లేనట్లేనా. ఈ సందేహం తనకెప్పుడూ రాలేదేంటి?’ అయినా తను చెప్పే కారణాలు తప్పన్నట్టు తనకనిపిస్తుంది. తనపై ప్రేమ లేదనే విషయం తను అస్సలు జీర్ణించుకోలేని విషయం.’
‘పోనీ నీవు పేయింగ్ గెస్ట్‌గా నీ కూతురింట్లో ఉండవచ్చు గదా!’
‘వాళ్లకి డబ్బు తీసుకుని పెడుతున్నారన్న అప్రతిష్ఠ వస్తుంది కాబట్టి వాళ్లు ఒప్పుకోరు. తను... తను మాత్రం ఒప్పుకుంటాడా... ఏదైనా మాట్లాడబోతే మీకు తెలియదు నాన్నా మీరు ఏ జనరేషన్‌లో ఉన్నారు’ అని అల్లుని ముందే అనే కూతురు, ఆమె సంతానం. ఇన్ని అవార్డులు పొందిన మనిషి. రాష్టప్రతి పురస్కారం పొందిన ఉపాధ్యాయుడు. పరువేంగాను. ఒంటరిగానైనా ఉండగలను. వారు లెక్కలేకుండా మాట్లాడితే నేను భరించలేను. అయినా నీకేం తెలుసు నాగొడవ. రచయిత, భావుకుడు అయిన రంగనాథ్ గారి లాంటి వాళ్లకు అర్థమవుతుంది.
‘సరే చచ్చిపోయే ముందు నేనొక చోటికి తీసుకెళతాను వస్తావా? రేపటికి నీ చావు పోస్ట్‌పోన్ చేసుకో..’
‘లేదు. అతికష్టం మీద ఇంత ధైర్యాన్ని కూడగట్టుకున్నాను. ఇప్పుడే చచ్చిపోతాను.’
‘నీవు రాకపోతే నేను ‘రావూరి భరద్వాజ’ గారు చెప్పినట్టు బ్రతికించి చంపుతా ‘జాగ్రత్త’
‘సరే పద!’
ఆత్మ గాలిలో ఎగురుతూ వెళుతుంది. తాను ఆటోలో బయలుదేరాడు ధీరేంద్ర. ఆత్మ ఇచ్చిన సంకేతాల ప్రకారం ఓ భూత్ బంగ్లా లాంటి దాని ముందు ఆగింది ఆటో. డబ్బులిచ్చి పంపేశాడు. ‘ఇంట్లో సుఖంగా పాయిజన్ తీసుకునో, ఉరేసుకునో చావాలనుకుంటే ఈ ఆత్మ మిగలిన ఆత్మలన్నింటితో కలిసి పగతీర్చుకుంటుందా’ అనిపించింది ధీరేంద్రకు.
‘ఆత్మా! ఎక్కడున్నావ్’ అంటూ ఓ గదిలోకెళ్లాడు. అక్కడ ఒక వృద్ధుని కాళ్లకు వేళ్లకు చీము రక్తం కారుతున్నాయి. మరో వృద్ధుడు డెట్టాల్‌తో కడిగి కట్టు కడుతున్నాడు. ఆత్మ ముందుకు నడుస్తుంటే అనుసరిస్తున్నాడు ధీరేంద్ర.
ఒకామె ఆయాసపడుతూ కళ్లు తేలేస్తూ దగ్గుతుంది. అంతలో మరొకామె మందులు, మంచినీళు తెచ్చి ఇచ్చి గుండెలపై బామ్ రాస్తుంది.
‘ఒక రూమ్‌లో తెల్ల కాగితాలపై కవితలు రాస్తూ కొంతమందికి వినిపిస్తుంది ఒక వృద్ధురాలు.
‘మరొక చోట పెరట్లో కూరగాయలు కోసుకొచ్చి అవన్నీ అక్కడ జార విడిచింది మరొకామె. ఒకతను వంట చేస్తున్నాడు. ‘నలభీములు మా వాళ్లే. ఎక్కడా దమయంతి వంట, ద్రౌపది వంట అని చెప్పలేదు సుమీ..’ అన్నాడు నాటకీయంగా.
‘ఓ పెద్ద గొప్ప! మీ అందరికీ జన్మనిచ్చింది ఓ స్ర్తి అని మరచిపోకండి’ చెణుకు విసిరింది ఓ నడివయస్సామె.
‘అవును ఆకాశంలో సగం మేము’ అన్నారు ఒకరు.
‘అసలు ఆకాశమే మీరు’ అన్నాడు మొదటి వృద్ధుడు
‘అవునవును!’ ఆడవాళ్లంతా ముక్తకంఠంతో అన్నారు.
‘పెరట్లో కలుపు తీయడం లేదు మీరు. ఈమధ్య డైలీ సీరియల్స్ ఎక్కువైపోయాయి సుమీ!
‘కేటరింగ్ టెక్నాలజిస్టు గారు’ అలవాటైన ప్రాణాలు కదా మరి! అన్నారిద్దరు.
ఈ ఆశ్రమం ఎవరి ఆధ్వర్యంలో ఉంది’ ఆసక్తిగా అడిగాడు ధీరేంద్ర
‘ఎవరి ఆధ్వర్యమా! పకపకా అందరూ నవ్వారు.
అందులో బోసి నవ్వులు, భోళా నవ్వులు కూడా ఉన్నాయి.
‘చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యం’ ఇంకా వేళాకోళంగా నవ్వారు
‘ఏమిటి? అన్నాడు ఉక్రోషంగా
‘అవును! మా అందరికీ ఇక్కడ వృద్ధాప్యపు, వితంతువుల పెన్షన్లు వస్తాయి. కొన్ని మేం కూరగాయలు పండించి, పేపర్ ప్యాకెట్లు, ప్లేట్లు తయారు చేసి సంపాదిస్తాం’
‘అంటే మీరెవరికీ మరే ఆదాయం లేదా!’
‘ఉన్నా మా కొడుకులు, కోడళ్లు మాకివ్వరు!
‘మా కూతుళ్లు కూడా ఇవ్వరు’
‘మొత్తం ఎంతమంది ఉంటారు’
‘యాభై మంది ఉంటాం. మొనే్న ఒకామె చనిపోయింది. లేకపోతే యాభై ఒక్క మందిమి. ఈ భవనంలో కొన్ని గదులే వర్షం పడవు. ఎవరో వాస్తు బాగోలేదని వదిలేశారట. ఇక్కడే ఉంటున్నాం. కాని ప్రారంభించింది మాత్రం లచ్చమమ్మ, పిచ్చయ్య దంపతులే.
‘వాళ్లేరి?’
‘లచ్చమమ్మ ఉంది. పిచ్చయ్య చనిపోయాడు’
తాను ఎన్నో మాటలు చెప్పాడు. తన విద్యార్థులకు, వారంతా స్ఫూర్తి పొంది మంచి ఉద్యోగాలలో ఉన్నారు. ఒకసారి మాలతి ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని పేపర్లో వస్తే ఆ విద్యార్థి అంటే మీ స్టూడెంట్ మాత్రం అయ్యుండడు మాస్టారూ అంది. మరి తను ఇంత పిచ్చిగా ఎలా నిర్ణయించుకున్నాడు. తను ఆలోచించిన విధానానికి తనకే సిగ్గనిపించింది. తను చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. మళ్లీ మాట్లాడితే ఈ యాభై మందిని తాను పోషించే స్థితిలో ఉన్నాడు. వీళ్లంతా ఎంత ఆనందంగా ఉన్నారు, ఎవరూ ఖాళీగా లేరు. ఎ పనీలేకపోతే ఒంటరితనం అనిపిస్తుంది. ఇప్పుడు తనకు ఇక్కడ చేతినిండా పనుంది. రేపటి నుండి తనకు వీళ్లిచ్చే కళ్లలో మెరుపులు మాటల్లో విరుపులు, ఒక కొత్త జీవితాన్నందిస్తాయి. ఇక తన ఇంటితో తనకవసరం లేదు. పొలాలు అమ్ముకుంటారో ఉంచుకుంటారో వాళ్లిష్టం. తన భార్య లబోదిబో మంటుందేమో. తాను కాపలాగా లేనని. లేదా పరుగెత్తుకొస్తుందేమో ఇక్కడికే
‘ఏం నీ శరీర హత్యకు ముహూర్తం ఎప్పుడు పెడదాం? ఆత్మ ప్రశ్నించింది.
‘ఇక్కడ బోధివృక్షం కింద జ్ఞానోదయమయ్యాక కూడానా! నీవు మళ్లీ నాలోనే గమ్మునుండు. నేనిలా కోతి వేషాలు వేస్తే ఈసారి బెత్తం పట్టుకుని వాయించు అన్నాడు ప్రేమగా
‘సరే పద ఇంటికెళ్దాం’ మాయమయ్యింది.
‘అయ్యగారు పాలగినె్న తెండీ’ అదేటి బాబు వంటింట్లో ఆ నిదరేంటి? పక్కన ఆ ఉరి తాడేటి బాబోయ్’ ఏడుపు గొంతుతో అన్నాడు పాలవాడు.
‘లేదురా అబ్బి! పాలు పిల్లి తాగుతోందని ఉట్టి తయారు చేస్తున్నా’
‘మీరు సెప్పేది తాడి సెట్టు ఎందుకెక్కావంటే దూడ మేతకన్నట్టుంది ఆయ్! అన్నాడు పాలుపోస్తూ..
అదేరోజు ఆటోలో ఓ నిధులు అందని వృద్ధాశ్రమాన్ని దత్తత తీసుకున్నాడని తెలిసి అతని భార్య భోరున ఏడుస్తూ వచ్చి వాలింది.
‘నీకిష్టమైతే నీవు కూడా ఇక్కడ ఉండవచ్చు అన్నాడు దృఢంగా ధీరేంద్ర. భవనానికి రంగులు వేయిస్తూ.. సూచనలిస్తూ...

- సుధా శశిరేఖ
సెల్: 94415 99321
పుస్తక పరిచయం

తెలుగు వినువీధిలో కథారామం

ప్రతులకు :
మహీధర రామశాస్ర్తి
2-51-10, శంభునగర్,
మొదటి వీధి,
ఐఎల్‌టిడి రైల్వేగేట్ దగ్గర,
రాజమండ్రి
సెల్ : 98852 67370

కథ లేకుండా బతుకు గాథ జరగదు. జీవితం చుట్టూ జీవితం బయటా జీవనాన్ని అల్లుకుని కథలు ఉంటాయి. కథలు మన జీవితాల్లో భాగం కనుకనే కథ చదవటానికి ఉరకలేస్తుంది. చదివే కథ మనకు అన్వయం కాకపోయినా అనుభవించిన ఘటన ఎక్కడో తారసపడుతుంది. దాని స్పృహలోకి వెళ్లి ఒకసారి దాని బాగోగులు పఠించి వస్తాం. కథ అనుభవజ్ఞ తాలూకా చరిత్ర. మననం చేసుకుంటే కాని మింగుడు పడదు. ప్రతి అనుభవాన్ని గ్రంథస్తం చేయకపోయినా అనుభవంలోని అంతర్లీనతలు ప్రతి స్పందిస్తాయి. వాటి తాలూకా మంచి చెడ్డలు, విచక్షణా విజ్ఞతలు వివేకవంతమైన విషయాలు కథల రూపం దాలుస్తాయి.
అలాంటి వెన్నింటినో కథలుగా లిఖించారు మహీధర రామశాస్ర్తీ. మరాశాస్ర్తీగా తెలుగు పాఠకులకు బాగా పరిచితులైనవారు. ఆయన రాసిన కథల సంకలనమే ‘కథారామం’. మొలేసిన కథలు తోటలుగా పెరిగితే అచ్చంగ వనాలైన కథల సమాహారమే ఈ కథారామం. ఆరామం అంటే వనం. నిజంగా వనంలో పూసిన కథలు ఇవన్నీ పాఠకుడు వేడగాడై వనంలో విహరిస్తూ వేట వస్తువై కథను దక్కించుకోవడమే ఉంటుంది. ఉత్తమాభిరుచులు కథను పట్టడం కొన్ని దక్కించుకోవడం జరుగుతుంది. తార్రోడ్డుపైన రెండెడ్ల టైరుబండి మీద కూచొని నింపాదిగా చదువుకుపోవచ్చు ఆయన కథలు. అంత హాయిగా ఉంటాయి ఆ కథలన్నీ. ఎక్కడో ఊహల్ని తెంపి నాలుగు ఊసులు రాసి మనసును ఒక్క కుదుపు కదిపి నీతి సారాన్ని ఒక పేరాలో ఒలకపోసి కథగా ట్యాగ్ కట్టి వదిలే కథలు కావు ఆయనవి. జీవితంలో తాను చూచినవి తనకు తారసపడినవి ఆయా సంఘటనల్ని కథలుగా మలిచారు. అనువాదకునిగా అనేక కథలు రాసిన ఆయన్ని భార్య సతాయింపుతో కొత్త కథకు చేసే ప్రయత్నం తనకు ఎదురైన సంఘటనను కథగా రాసారు. కథా వస్తువుగా ఏ సంఘటన తీసుకుంటే కథగా తయారువుతోందో కథగా రాసారు మరి..‘కథను వెతుక్కుంటు’ చదువుతుంటే నిస్సారంగా గాకుండా నీతిసారంగా అన్పించేలా కథలు రాయటం అంత సులువుకాదు. అలాంటి లోటును ఏ మాత్రం రానీయకుండా అన్ని కథల్ని అద్భుతంగా ఆవిష్కరించారు. ప్రతి కథలోను మనకు తారసపడే పాత్రలు కొన్ని కనపడతాయి. వాటిని కనుగొని వెతికే లోపుగానే కథను పూర్తిచేసి పాత్ర మీద సానుభూతిని కురిపించి శాంత పడిపోతాం. ‘ఎదర ఇక చావులుండవు’ కథ జీవితాలకు కనువిప్పు కలిగించేంత గొప్పతనం కన్పడుతుంది. గ్రామ రాజకీయాలను చర్చిస్తూ వర్ణవివక్షను స్పర్శిస్తూ రాసిన కథ ‘దంభం’ చక్కని కథా విధానంతో సామాజిక వేదనను రచయత కనపర్చారు. మనసును ద్రవింపచేసే కథ. గ్రామాల దుస్థితికి రాజకీయ నాయకుల కారణాన్ని చురకగా వేశారో చూడండి..‘శయ్యా సుఖానంతరం గోడవైపు తిరిగి, పడుకునే భర్తల్లా నాయకులు ఈ ప్రజల మొహాల కూడా చూడరు’ అంటూ అనే విసురు..ఓట్లు వేయించుకున్న తర్వాత ‘ప్రజల అవసరాలు రాజకీయ నేతలకు కనపడవు’ ఈలాంటి అలంకారికాలు అనేకం కథలో బాగా కనపడతాయి.
రచయత సంప్రదాయవాది అయినప్పటికీ ప్రగతిశీల వాది. సమాజానికి కావల్సిందాన్ని ప్రస్ఫుటపరచడం రచయత విధి. ఆధ్యాత్మికతలో మూఢత్వాన్ని నిరసించడంతోపాటు ఆరోగ్యకర వాతావరణాన్ని అభిలాషించే విషయానే్న ముందుగా అవసరం అని చెప్పిన కథ.. ‘కాలమే నిర్ణయించాలి’.. కథకు సరియైన శీర్షికనిచ్చి మనల్ని ఆలోచనా మడికి తీసుకెళ్ళిపోయారు. ఈమధ్య చాలా మందిలో వాస్తు పాండిత్యం బాగా ముదిరింది. ఎంతెలా అంటే పిచ్చెక్కినంతగా మారిపోయింది. ప్రతి విషయాన్ని అదేదో దోషం కింద లెక్కగట్టి రెమిడీ పేరుతో ఇంటి గుమ్మాలు మార్పులు, వాస్తుదోషాలు సరిచేతలు ఎక్కువైపోయాయి. కథలో చెప్పినట్టు వా.పం వాస్తుపండితునికి మతిపోయినట్టు ముగించారు కానీ..నమ్మే ప్రజలకు మతిపోయేటట్టు చేస్తున్న సందర్భాలే ఎక్కువ. హేతువాద భావాల్ని తుంగలో తొక్కి శాస్త్రం పేరుతో శాస్ర్తియతను అణచివేస్తున్నారు జ్యోతిష్య వాస్తు సిద్ధాంతులు. కొడవటిగంటి కుటుంబరావు ‘గల్ఫికలు’ రాసి ఎంత ప్రసిద్ధులయ్యారో తెలుగు పాఠకులకు తెలియంది కాదు. ఆ కోవలోకి వెళ్లిన కథ ‘కోడు’ ప్రజల్ని చైతన్యపరచటానికి మూఢభావాల్నుంచి చేతను పర్చటానికి ఇటువంటి రచనలు రావలిసిన అవసరం ఉంది.
కథ చదివాక మనల్ని ఆలోచనలోకి నెట్టేస్తేనే అది కథ అవుతుంది. అలాంటి కథ ‘ఆలోచన’ సగటు మనుషుల మనస్తత్వాన్ని విశే్లషించటం బావుంది. ముగింపునెందుకో పేలవం చేశారు. చివర్న చక్కని ఉపమానాలు మనసును చిక్కపరుస్తాయి. మనకు తెలిసినవాళ్లు మన మధ్య మసలే వాళ్లు మరాశాస్ర్తీ కథల్లో పాత్రలుగా కన్పిస్తారు. వీళ్లను ఎక్కడో ఒకప్పుడు తారసపడ్డట్టే ఉంటారు. నోరున్నోడిదే రాజ్యం అన్నట్టు ఉండే వీళ్లు క్రమబద్ధమైన పద్ధతులకు లోబడరు. వాళ్ల సౌఖ్యం కోసం స్వార్థం కోసం ఎంతకైనా తెగిస్తారు..అవతలి వాళ్లను నొప్పించైనా సరే. అలాంటి కథే ‘రాజ్యం పర భోజ్యం’ కాకినాడ - రాజమండ్రి నాన్‌స్టాప్ బస్‌లో ప్రయాణిస్తూ తనకు ఎదురైన సంఘటననే ఈ కథలో వివరించారు రచయత.
రూర్కెలా ఉక్కు కర్మాగారంలో పనిచేసిన కాలంలో ఎదురైన సంఘటనలు ఉద్యోగ విరమణ అనంతరం రాజమండ్రిలో స్థిరపడిన తర్వాత అనుభవాల నేపథ్యంలో వచ్చిన కథలు వివిధ పత్రికల్లో అచ్చై పాఠకుల్ని అలరించి అబ్బురపరిచినవే. ఇప్పుడు వాటన్నింటిని గుదిగుచ్చి కథా సంకలనంగా తెచ్చారు. ‘ఆబ’ కథా సంకలనం తర్వాత వచ్చిన రెండో కథ సంకలనాన్ని మరాశాస్ర్తీ గారు తేవడం ఆనందించతగ్గ విషయం. కథ ఆలోచించటానికే కాదు..ఆత్మ విమర్శ చేసుకోవటానికి ఆచరణాత్మకం చేసుకోవటానికి కూడా ఉపయోగపడుతుంది.
మనుషులకు నైతికత, విలువలు, కారుణ్యం, మానవత్వం లాంటి విషయాలు మృగ్యమైపోతున్న వేళ వాటి అవసరత ఏమిటో తప్పక చర్చిస్తారు మరాశాస్ర్తీ తన కథల్లో. దానికిదే రుజువు. మొత్తం పదిహేడు కథలు పుస్తకంలో నిక్షిప్తం చేశారు.
దీంట్లో ఎక్కువ కథలు ఆంధ్రభూమి దినపత్రిక ‘మెరుపు’లో తన పాఠక జనాన్ని సమ్మోహన భరితం చేసినవి కావడం పాఠకులకు గర్వకారణం. అలాగే వివిధ పత్రికలలో ఆయా కథలు అచ్చుకు నోచుకుని పాఠకుల ప్రశంసలు అందుకున్నాయి. వాటిని మళ్లీ పునశ్చరణ చేసుకుని చదువుకుని భద్రపరుచుకోటానికి వీలవుతుంది.

- రవికాంత్, 9642489244

మనోగీతికలు

అమ్మ మనస్సు!
శారదమందలి వెనె్నల్లో!
హేమంతమందలి చామంతుల్లో!
గ్రీష్మమందలి మల్లెల్లో!
వసంతమందలి కోకిల గీతంలో!
బృందావన మందలి పేణుగానంలో!
విరబూసిన మందారంలో!
రవివర్మ గీతంలో!
నిశీధియందలి కమలాల్లో!
వేకువయందలి భానుడిలో!
విషాదమందు ఆర్ద్రమైన మనస్సులో!
ఆర్ణవమైనప్పుడు అంబరాన!
సురలిచ్చే సుధలో!
గోవులిచ్చే క్షీరంలో!
తేటతెలుగు భాషలో!
తేనెలొలుకు తియ్యదనంలో!
కడకు సర్వాంతర్యామియై!
విరించిచే విరచితమైన సృష్టిలో!
మూర్త్భీవించిన మానవత్వంలో!
వెరసి సిరివెనె్నలగా ప్రకాశించేదే!
ఈ అమ్మ మనస్సు!
అదే సదా ఈ సృష్టికి
సువర్ణమైన ‘ఇంద్ర ధనస్సు!

- దోసపాటి సత్యనారాయణమూర్తి
రాజమండ్రి, సెల్: 98666 31877

ఎదురుచూసే
రెండు హృదయాలు
ఒకప్పుడు
పల్లె వాకిట అడుగుపెడితే చాలు
ఆ మట్టి వాసనకు
హృదయమంతా
ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యేది
ఊరి శివార్లలోకి
అడుగుపెట్టింది మొదలు
తాతగారింట్లోకి ప్రవేశించేదాకా
దారిపొడవునా
ఆత్మీయుల పలకరింపులు
మల్లెపూల పరిమళంలా
మనసంతా పరచుకొనేవి
మనం తెలియకపోయినా
మనం పలకరించక పోయినా
ఎవరింటికి బాబూ అని
ఆదరంగా ప్రశ్నించే
అపరిచితుల అమాయకత్వంతో
మనసెంతో
ఉల్లాసంగా అనిపించేది
ఉదయం మేతకి
సాయంత్రం ఇంటికి
వెళ్లే ఆలమందల
అంబారావాలతో
పల్లె పల్లె అంతా ప్రతిధ్వనించేది
ఊరంతా రుషి వాటికల్లా
ఎక్కడ చూసినా
చల్లని తాటాకు
లోగిళ్లే దర్శనమిచ్చేవి
అక్కడక్కడ ఐదారు
పెంకుటిళ్లు వీధికో మండువాలోగిలి
ఊరికో మేడ
మాత్రం తళుక్కుమంటూ మెరిసేవి
ఆ రోజుల్లో
తాతయ్య, అమ్మమ్మ
మామయ్యలు, అత్తయ్యలు
బావలు - మరదళ్లతో
ప్రతి ఇల్లూ కోలాహలమే
మరి ఇప్పుడో
నగరీకరణ పేరుతో
పల్లె - పట్నంగా
మారిపోవాలనుకొంటోంది
పట్నం - సిటీ అయిపోవాలని
కలలు కంటోంది
సిటీ - స్మార్ట్ సిటీగా మారాలని
మహా ఉబలాటపడుతోంది
ఇక స్మార్ట్ సిటీ
అమెరికా - సింగపూర్‌గా
అవతారమెత్తాలని తెగ
తహతహలాడిపోతోంది
అందుకే ఇప్పుడు
పల్లెనిశ్శబ్దంగా మారుతోంది
ఏ ఇంట్లో అడుగుపెట్టినా
మా పిల్లలు
అమెరికాలో ఉన్నారంటూ
పైకి ఎంతో నిబ్బరంగా,
గొప్పగా చెప్పినా
లోలోపల కుమిలిపోతూ
ఆ ఇంటికి - ఆస్తికి
కాపలాగా ఉండే రెండు
ముసలి ప్రాణాలే కనిపిస్తాయి
కనీసం
కడసారి చూపుకన్నా
తమ బిడ్డలు కనికరంతో
కదలి వస్తారా? అన్న బెంగతో
దీనంగా ఎదురుచూసే
కొడిగట్టిన దీపాల్లాంటి
రెండు కన్న హృదయాలే
ఎక్కువగా దర్శనమిస్తాయి

- డాక్టర్ జోశ్యుల కృష్ణబాబు
పెద్దాపురం
చరవాణి: 98664 54340

ఆహ్లాద గీతం
నీవైతే నవ్వులు చల్లిపోతావు
మేతకోసం వెంటపడే కోడి పిల్లల్లాగ
నీ వెంట ఆత్రం పడతారు
సారంలేని మొఖంతో
భావాలు పండించకుండా
దిగాలుపడిపోయే నా వెనుక
నీ అడుగులు సందిగ్ధమవుతుంటాయి
దగ్ధమయ్యే మది మంటలో
దిగులు కాలిపోతుంటుంది
ఆలోచనల నడకలో
అవాంతరాలెన్నున్నా
అంతరంగమంతా నీ రూపం
ఆక్రమించుకొని
ఆహ్లాద గీతం పాడుతుంది

- అమృత్
సెల్: 94948 42274

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

email: merupurjy@andhrabhoomi.net

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, నేషనల్ హైవే, ధవళేశ్వరం, తూ.గో.జిల్లా. email: merupurjy@andhrabhoomi.net

- సుధా శశిరేఖ