దక్షిన తెలంగాణ

బంగారు ప్రేమ (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘రాణి.. నీకోసం గంట నుండి చూస్తున్నా..అర్ధ రాత్రయింది, మరో అరగంటలో రైలు వచ్చేస్తుంది. ఇక ఆ తరువాత మన జీవితమే వేరు. నాకు నువ్వు, నీకు నేను..ఇక ఈ లోకం మనల్నేం చేయలేదు.. మనల్నెవ్వరూ వేరు చేయలేరు. ఐ లవ్ యు రాణీ..
‘ఏంటి రాణీ నేనింత మాట్లాడుతున్నా నువ్వేం మాట్లాడవు..అమ్మా నాన్నల నొదిలి వచ్చేస్తున్నావని బెంగా..నీకు ఆ లోటు రాకుండా వారిని మరిపించేలా నే చూసుకుంటాగా..అయినా కొన్ని రోజులలాగే ఉంటుందిలే..ఇంతకీ నీ నగలు అన్నీ తెచ్చావా..
‘ఏంటి నేనిన్ని మాట్లాడుతున్నా ఒక్క మాట మాట్లాడటం లేదు’
‘నగలన్నీ లాకర్లో పెట్టారట.. బీరువాలో లేవు.. కాబట్టి తీసుకురాలేదు.. ప్రవీణ్.. పోనీలే వెధవ నగలు.. చెరో కష్టం చేసుకుని బ్రతుకుదాం. నాకేం వాటిపై మోజు లేదు...’
‘అదేంటి రాణి..ముందే అనుకున్నాం కదా..ఆ నగలతో ఒక నాలుగు నెలలు ఎలాగో గడిస్తే, ఈ లోపు నాకు ఏదో ఉద్యోగం దొరుకుతుంది కదా’
‘నిజమే.. ప్రవీణ్.. కానీ నాకు తెలీదు నాన్న నగలు దొంగల భయానికి లాకర్లో పెట్టిన సంగతి.. మరి నువ్వు ఇవ్వాళే వెళ్లిపోదామన్నావు కదాని వచ్చేశాను.’
‘ఎంత పని చేశావు. నువ్వు వచ్చేప్పుడెవరైనా చూసారా..’
‘లేదు.. అంతా పడుకున్నారు. నెమ్మదిగా తలుపు దగ్గిరకేసి వచ్చాను’
‘అయితే వెంటనే వెళ్లిపో.. ఏమాత్రం ఎవరికీ అనుమానం రావద్దు. మనం ఇప్పుడు చేతిలో చిల్లిగవ్వ లేకుండా వెళితే ఎక్కడుంటాం.. ఏం తింటాం... అందుకే మరోసారి లాకర్ నుండి నగలు తెచ్చినప్పుడు ట్రై చేద్దాం లే.. ఎందుకంటే మనం నిలదొక్కుకోవడానికి కొంత టైమ్ పడుతుంది.
రాణికి అరగంట క్రిందటి సంఘటన కళ్ల ముందుమెదిలింది.
నగలన్నీ తీసి తన బ్యాగ్‌లో పెట్టుకుని ఇటు తిరిగేసరికి అమ్మ నిల్చుని ఉంది. భయంతో వణికిపోయింది.
‘ఏమ్మా.. నగలు తీసుకుని రా పారిపోదాం’ అన్నాడా.. నాకెలా తెలిసిందనుకుంటున్నావా.. నీ మానసిక పరిస్థితి ఇలాంటిదేదో జరుగుతుందని చెప్పింది. తల్లిని ఆ మాత్రం గుర్తు పట్టలేనా.. చూడు తల్లీ.. ఇప్పుడు నువ్వనుకుంటున్నది ఈ వయసులో ప్రేమ కాదు.. ఆకర్షణ.. అంత ప్రేమ ఉన్నవాడయితే నిన్ను నగలెందుకు తీసుకురమ్మంటాడు. నగలయిపోయేంతవరకు నీతో ప్రేమగానే ఉంటాడు. ఆ తరువాత అసలు స్వరూపం బయట పడుతుంది.’
‘ప్రవీణ్ అలాంటి వాడు కాదు.. నన్ను ప్రాణం కన్నా మిన్నగా ప్రేమిస్తాడు’
‘ఆకర్షణలో మునిగిన ప్రతీవారు అనే మాటే ఇది’
‘ప్రేమించిన వారి ప్రతీ తల్లీదండ్రి అనే మాటే నీది కూడా’
‘సరే తల్లీ.. ప్రేమ మైకంలో మునిగిన వారికి ఎంత మంచి చెప్పినా అలాగే అనిపిస్తుంది. ఈ నగలు తీసుకుని పో.. ఏమనను.. కానీ తీసుకు రాలేదని అబద్ధం ఆడి చూడు నీకే తెలుస్తుంది. ఇంకా ఒక్కొక్కరు నగలు తీసుకురమ్మనకపోయినా, కొందరు వాడుకుని వదిలేస్తారు. కొందరు అమ్మేస్తారు. కొందరు ఫోటోలు తీసి బ్లాక్‌మెయిల్ చేస్తారు. ఇలా రకరకాలుగా ఉంటారు. నువ్వు చూసిన లోకం చాలా చిన్నది. మాకున్న అనుభవం చాలా పెద్దది. వెళ్లి చూడు నీకే తెలుస్తుంది’.
రాణికి ఒకసారి భయం వేసింది. తల్లి చెప్పింది నిజమైనా కాకపోయినా వెళ్లకూడదనుకుంది. అయినా తండ్రిని పంపించి అతనికి బుద్ధి చెప్పమని పంపించింది.
‘ఏంటి రాణి.. ఇంకా ఆలోచిస్తున్నావ్..ఎవ్వరూ లేవకముందే తొందరగా వెళ్లిపో’ గాబరాగా అంటున్న అతని చెంపపై ఒకటిచ్చి, ‘ఇంకెవరికీ ఇలా చేయకుండా కంప్లయింట్ ఇస్తాను రాస్కెల్’ అని వీధి చివర్లో నిల్చున్న తండ్రి దగ్గరకు చేరుకుంది.

- నామని సుజనాదేవి, వరంగల్
సెల్.నం.7799305575

మనోగీతికలు

ఆకాశంలో ప్రకృతి చిత్రాలు
నిర్మలమైన నీలాకాశంలో
చెల్లాచెదురుగా మబ్బుల తునకలు
సాగిపోయే మేఘాల అద్భుత దృశ్యాలు
గగనంలో తేలిపోవాలన్న ఉద్వేగం!
మేఘాలన్నీ ప్రకృతి ఆకృతులకు ప్రతికృతులే
అవి సేంద్రియ నిరీంద్రియ రూపాలే
అనుభవ వైవిధ్యం పంచుకుందామంటే
కాలయవనికపై అన్నీ అశాశ్విత దృశ్యాలే
ప్రకృతి గీసిన చిత్రాలు క్షణాల్లో అదృశ్యవౌతాయి
మేఘాలంటేనే సుందర చైతన్యాకృతులు
నిరీంద్రియ రూపాలైనా అవి చేతనారూపాలే
రంగురంగుల కలయికతో రమ్యంగా కనిపిస్తాయి
రంగుల కలగలుపుల శాసించేది వాతావరణం
వాటి కదలికల కట్టడి చేసే చోదక శక్తి గాలి
ఘీంకారం చేసే ఏనుగులా, ఎగిరే పక్షిలా,
వెంటాడి వేటాడే క్రూరమృగాల్లా
మందలుగా సాగిపోయే జంతుసమూహాల్లా
ఎదురెదురుగా మాట్లాడుకునే మనుషుల్లా
దట్టమైన అడవిలా, కొండల్లా లోయల్లా
నిశ్చల సముద్రంలా, సెలయేరుల్లా
మైదాన ప్రదేశాల్లా గలగల పారే నదిలా
అక్కడక్కడ స్వాగతం పలికే తోరణాల్లా
మేఘాలు గడియ గడియకు రూపాలు మారుస్తూ
రోజూ చూసే మేఘాలే అయినా అన్నీ అపురూపాలే
మేఘాలు కరుణించి వర్షిస్తే చాలు
రైతుకు వ్యవసాయం వ్యవస్థితమే
సమస్త ప్రాణికోటికి జీవామృతమే

- ఆచార్య పసుల వెంకటరెడ్డి, వరంగల్
సెల్.నం.9849695603

పూల భాష
మల్లెపూవు చెప్పింది
ఆడపిల్లలు నాలాగే
సుకుమారమనీ...
గులాబీలు చెప్పాయి
ఆడపిల్లల సోయగం
నా అందం ఒకటే.. అనీ
ముట్టుకుంటే గుచ్చుకుంటాయి,
పరిమాళాలతో కవ్విస్తాయనీ..
బంతిపూవు చెప్పింది
అమ్మ పసుపు కుంకుమల
పచ్చదనం నాదేనని...
మొగలిపూవు చెప్పింది
మాటువేసి మీరుంటే
కాటువేసే నాగును నేనైతాననీ...
గునుగు పూవు చెప్పింది
ఎండావానా ఏదైనా సరే
ఝాన్సీరాణిలా
తట్టుకునే ధైర్యం నాకుందనీ...
తంగేడు పూవు చెప్పింది
తెలంగాణ ఆడబిడ్డల
అస్తిత్వం చాటే బతుకమ్మను నేనేననీ..!

- డాక్టర్ అడువాల సుజాత
కరీంనగర్, సెల్.నం.9989558678

నిర్భయ !
నేను నిర్భయను..
దినచర్యతో నింగిన నా అడుగులు
మొరాయిస్తూనే ఉన్నాయి!
ఏ ‘రాక్షస’ చూపుతో
‘ముళ్లై’ గుచ్చుకుంటాయోననీ!
ఓ చల్లని చిరుగాలి
సాగుతూ నన్ను స్పర్శిస్తూనే..
ఉంది, నీది సుదీర్ఘకాల
ప్రయాణం అనీ!
ఇది ఆఖరి
శ్వాస కాకూడదని
ఈ నల్లటి తారు రోడ్డు
నన్ను భయపెడుతూనే ఉంది!
జాగ్రత్త సుమా అంటూ..
ఇది కాళరాత్రి కాకూడదనీ!
ఓ పోట్రాయి గుద్ది గుద్ది
చెబుతూనే ఉంది..
ఇది ‘మృగ’శిరకాలం
ఒంటరి యుద్ధం
అనివార్యమనీ..!
ధైర్యానికి అధైర్యానికి
మధ్య దూరం ఓ క్షణ కాలమనీ!
నాలో నేను తెలుసుకునే లోపే
నన్ను నేను వెతుక్కునే లోపే..
ఇంతటి దుఃఖజ్వాలల్లో
కాలిపోయాను!
కానరాని లోకాలకు వెళ్లిపోయాను!

- రామానుజం సుజాత
కరీంనగర్
సెల్.నం.9701149302

తెలుగుకైత
తమ్మిచూలి ఏమన్నాడు?
చదువుల తల్లికి తాను మగడినన్నాడు
వెన్నుడు పాలకడలిలో పడుకొని
సిరికి తానే పెనిమిటినన్నాడు
వెండికొండపై ముక్కంటి ఏమన్నాడు?
చలిమలకూతురికి సగమేను తానన్నాడు
గుజ్జువేలుపును కొలువకుండా ఉంటే
ఏ వేలుపూ రానంటాడు
వేలుపుగమికాడు అన్నతో పోటీపడి
వేగంగా ఓడిపోయాడు
జాబిల్లి వలరాజును పిలిస్తే..
వేలుపుమచ్చకంటులు పరుగెత్తుకొనివస్తారు!
ఒడలిచూపొడియడు కదలివస్తాడు
గాలినెచ్చెలి తొంగిచూస్తాడు
ప్రొద్దుకొమరుడు పలుకరిస్తాడు
సోకుమూకలరేడు సోకులుపోతాడు
నీళ్ల రాయడూ నీకుగారిపోతాడు
సుడిగొట్టు సుడులు తిరుగుతాడు
జక్కుల దొర ఆటగాడౌతాడు
జడముడిజంగానికి మాత్రం కోపం వస్తుంది
గుడి వేలుపులంతా ఇలాగే ఉంటారు
తొలుపలుకుల మాటలు వింటారు
దీవెనల వెల్పుబువ్వలను
తీరుబడిగా చేతులతో ఇస్తారు
చల్లని చూపులతో చూస్తారు!

- డాక్టర్ ఆయాచితం
నటేశ్వర శర్మ
కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా
సెల్.నం.9440468557

ఆశ్చర్యం
నా దేశ ప్రజలు
కళ్లున్నా
గ్రుడ్డివారైపోతున్నారు!
చెవులున్నా
చెవిటివారైపోతున్నారు!
నోరున్నా
మూగవారైపోతున్నారు!
జీవమున్నా
జీవచ్ఛవాలుగా జీవిస్తున్నారు!
సజీవ దహనాల
అగ్నికోరలకు కూడా..
చలనం లేదు
చైతన్యం రాలేదు
యుక్తి శక్తి విముక్తి లేదు
ఓ భగవంతుడా!
నా దేశాన్ని నా ప్రజల్ని మేల్కొల్పు!!
నవ లోకానికి దారిచూపు!!

- జిందం అశోక్, సిరిసిల్ల
సెల్.నం.8978532225

ఆత్మసాక్షిగా..
ఓ..
నవ యువకా
ఆగిపోకుమా
అలసి పోకుమా
నిదురబోకుమా
గెలిచేదాకా..
అదిరిపోవద్దు
అదర గొడితే
బెదిరిపోవద్దు
బెదరగొడితే
నిన్ను..
కన్న తల్లిదండ్రుల
కన్నీటి బొట్టుపై
ఇప్పటికిప్పుడే
ఒట్టుపెట్టురా..
నిను కన్నవాళ్ల
ఆత్మసాక్షిగా..
గమ్య సాధనలో
విజయానే్న
దిక్సూచిగా
నింగికేగరా!
నిశ్చయముగా
నిజమైన మానవునిగ
మానవతకే
మంచి అర్థమవ్వరా
నీతోటి మనిషికి
ఆసరాగా నిలవరా..!!

- కె.శ్యామ్, అరుగొండ
నిజామాబాద్ జిల్లా
సెల్.నం.9000011435

పారా హుషార్
అంజనం వేసి చూస్తున్నా
అగుపించడం లేదిప్పుడు అడవులు!
కాంక్షల దాహానికి బలై
కంకాళాలుగా మారుతున్నది గుట్టలు!
విష రసాయనాల సంగమంతో
రోగగ్రస్థమవుతున్నవి నదులు
ముందొచ్చిన చెవులకన్నా
వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టు..
అవని తల్లి ఎదపై
సమున్నతంగా నిలిచిన గిరులను
అది మానవ చరితను
కళ్లముందు నిల్పిన కొండా కోనలను
మనిషి మనుగడకు మూలాలైన
గిరులు తరులు ఝరులు
పంచభూతాలను
నడమంత్రపు సుఖాల కాశపడి..
నాశనం చేస్తున్న మానవుడు
ప్రకృతి హెచ్చరిస్తున్నా అప్రతిహతంగా
సాగిస్తున్నాడు విధ్వంసం!
గిరుల గాథలను తరుల త్యాగాన్ని మరిచి
కోరికలు నెగళ్లకు ఆహుతిచ్చి
కోరి ఆపదను ఆహ్వానిస్తున్నాడు!
అభినవ బకాసురుడై
అన్నింటిని స్వాహా చేస్తూ..
వివేకం విచక్షణ మరచి
రేపటి తరానికి కాలుష్యాన్ని
కాలుతున్న భూగోళాన్ని
కానుకగా ఇస్తున్నాడు!
ప్రకృతిలో భాగమైన మనిషి
పర్యావరణాన్ని సహజ వనరులను
కాపాడుకోకపోతే...
కరువు కాటకాలు
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
కనువిప్పు కలిగించక పోతే
చివరికి మిగిలేది..
హిరోషిమా నాగసాకి
విధ్వంసక అనుభవాలే సుమా!

- వురిమళ సునంద
బుర్హాన్‌పురం
సెల్.నం.9441815722

నేనొక..!
కలను కాదు నేను..
కలలోనైనా మరువని కళాకారుణ్ణినేను!
విరులను తరులను
ఇట్టే చిత్రీకరిస్తా!
అందమైన దృశ్యాలను
జీవం పోస్తా!
ఏరులు సెలయేరులను
అలవోకగా..
ప్రవహింపజేస్తా!
అందరి హృదయాలను దోచుకునేలా
చిత్రకళను ఆవిష్కరిస్తా!

నేతనై..చేనేతనై..
కళ నేతనై అతివల వస్త్రాలకు
అందాలను ఆరబోస్తా!
మనసులో విరబూసే
మధుర భావాలకు..
కుంచెతో..అందరు మెచ్చేలా..
వివిధ వర్ణాలను అద్దుతా!
పనికి రాని చెక్కను
ఏం చక్కా బొమ్మగా మలుస్తా!
బండ రాయిని సైతం...
సుందర శిల్పంగా మారుస్తా!!

- హనుమాండ్ల రమాదేవి
బెల్లంపల్లి, ఆదిలాబాద్ జిల్లా
సెల్.నం.9959835745

పుస్తక సమీక్ష

సాదాసీదాగా వికసించిన.. నానీల పుష్పాలు!

పేజీలు: 34 వెల : 60/-
ప్రతులకు: నవోదయ బుక్ హౌజ్,
ఆర్య సమాజ్ ఎదురుగా,
కాచిగూడ,
హైదరాబాద్-27

బహుగ్రంథకర్త, విశ్రాంత అర్ధశాస్త్ర ఉపన్యాసకులు కవి, రచయిత డాక్టర్ కర్నాటి లింగయ్య ‘నానీల పుష్పాలు’ పేరుతో ఓ చిన్ని కావ్యాన్ని వెలువరించి నానీల ప్రక్రియ పట్ల ఆయనకున్న మక్కువను చాటుకున్నారు. ఇదివరకే ఇరవై గ్రంధాలను ప్రకటించిన ఆయన ఈ కావ్యంలో నానీల ద్వారా తమ ఉత్తమ వ్యక్తిత్వాన్ని చాటుకున్నారు.
‘వౌనాన్ని
ఎంత తవ్వితే అంత శాంతి
నిశ్చల సరోవరంలో
ప్రశాంతి’ అంటూ వెలుబుచ్చిన భావాలు ఆయన అనుభవానికి నిదర్శనాలుగా పేర్కొనవచ్చు.
మనం మాట్లాడే మాట ఎలా వుండాలో విడమరిచి చెబుతూ రాసిన నానీ బాగుంది.
‘మల్లెపూవు చూడు
ఎలా పరిమళిస్తుందో
అలా ఉండాలి
మాట్లాడితే’ అంటారు నిజమే కదా!
మరో నానీలో..
‘మాటలో ఉందా?
మనిషి విలువ
అది వౌనంలో
పూచే కలువ’గా అభివర్ణించారు.
‘మనసు పంచుకోవటమే
స్నేహమంటే
మరి ప్రేమ?
మనసును అర్పించుకోవటం’ అని తేల్చి చెప్పారు. అయితే..ఈ నానీ నానీల ప్రక్రియకు సంబంధించిన సంఖ్య నియమం పాటించకుండా రాయబడింది. కనీసం ఇరవై, గరిష్టం ఇరవై ఐదు అక్షరాలు నానీకి సంబంధించిన నియమం..ఈ నానీలో ఇరవై ఐదు అక్షరాలు దాటాడు..అలాగే..
‘సనాతనం
పురాతనమే
ఎప్పటికైనా
నిత్య నూతనం’ అన్న నానీలు కనీసం ఇరవై అక్షరాలు లేవు! ఇలా అక్కడక్కడా నానీల ప్రక్రియ సంఖ్యా నియమం తప్పినప్పటికీ..కవి యొక్క మధుర భావాలను పాఠకులు మెచ్చుకోకుండా ఉండలేరు.
‘శిలను చెక్కితే
శిల్పమవుతుందిలే
చెక్కుకోవేం?
మని నీ మనసుని’ అని ఓ నానీలో ప్రశ్నించారు.
‘ఎక్కడుందోయ్ / ఆనందం?
సరిగ్గా చూడు
ఎదుటి జీవి కళ్లలో’ అని హితవు పలికారు.
‘నీ బడి, గుడి
అమ్మ ఒడి
ఆరనీయకుమా
నీ గుండె తడి’ అని ఓ నానీలో చెప్పిన తీరు బాగుంది.
ఇలా ఎన్నో నానీలు ఉదహరించవచ్చు. అయితే చాలా నానీలు హితోక్తులుగా రూపుదిద్దుకున్నాయి. మరికొన్ని ఓ వాక్యాన్ని నాలుగు ఖండికలుగా అమర్చినట్లు కానవస్తాయి. కవి లంగయ్యగారు తమ అపార అనుభవాన్ని రంగరించి రాసిన ఈ నానీల్లో ఆయన లోక పరిశీలన కానవస్తోంది. సామాజిక దృక్పథం కనిపిస్తుంది. కానీ..కవిత్వాంశ పెద్దగా కనబడదు, వేళ్లపై లెక్కపెట్టే నానీలు తప్ప చాలా నానీలు స్టేట్‌మెంట్స్‌గా రూపుదిద్దుకున్నాయి!
ఇలా ఈ గ్రంథంలో నానీలు సాదాసీదాగా వికసించాయి. ఆయన ఓ నానీలో..
‘పంచితే / తరిగేది కాదు
పంచుతుంటే పెరిగేది
మంచితనం’ అన్నట్లు.. ఆయన అనుభవ సారాన్ని పంచి తన మంచితనాన్ని పెంచుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేద్దాం.

- సాన్వి, కరీంనగర్
సెల్.నం.9440525544

ఈ శీర్షికకు కవితలు, కథలు, సాహితీ వ్యాసాలు, కొత్త పుస్తకాల సమీక్ష/పరిచయం, కార్టూన్లు ఈ క్రింది చిరునామాకు లేదా ఈ-మెయల్‌కు పంపండి.

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, జగిత్యాల రోడ్, కరీంనగర్. merupuknr@andhrabhoomi.net
email : merupuknr@andhrabhoomi.net
నిర్వహణ : దాస్యం సేనాధిపతి dasyamsenadhipathi10@gmail.com

- నామని సుజనాదేవి