విజయవాడ

రెక్కలు (నివాళి ..)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శాంత కొడుకు ఆనంద్. అయిదో తరగతి చదువుతున్నాడు. ఏదొచ్చినా పట్టలేని మనస్తత్వం వాడిది. ఆ దశలో ఒకరోజు సాయంత్రం స్కూలు నుంచి వస్తూనే ‘అమ్మా! అమ్మా!’.. అని కేకలు పెడుతూ ఇంట్లోకి ప్రవేశించాడు. కొడుకు పిలుపు విన్న శాంత హడావుడిగా బయటకు వచ్చింది.
‘ఏమిట్రా? కొంపలంటుకున్నట్లు అరుస్తున్నావు!’ అంటూ కొడుకు చేతుల వంక చూసి ‘అరే! ఏమయింది’ అని అడిగింది. ‘ఆ చేతిలో ఉన్నది ఏమిటి? దేన్నో పట్టుకొచ్చావు’ గాబరా పడింది.
‘అమ్మా! ఇది రామచిలుక. నేను స్కూలు నుంచి వస్తుంటే పక్కన పడిపోయి కనిపించిందమ్మా! దానికెవ్వరూ లేరుగదా! పాపం అనిపించి జాలేసి తీసుకొచ్చాను’ చెప్పాడు ఆనంద్.
‘అయ్యో! దెబ్బతగిలినట్లుందే’.. అని దాన్ని పరిశీలనగా చూస్తున్నది శాంత.
అప్పటికే ఆనంద్ లోపలి నుంచి డెట్టాల్, దూది, ప్లాస్టర్ తెచ్చి దానికి ఫస్ట్‌ఎయిడ్ చెయ్యటానికి సిద్ధపడ్డాడు. చికిత్స అయిన తరువాత చిలుకను ఒక చిన్న బుట్టలో పెట్టి చిన్న గినె్నలో నీళ్లు, పండిన జామ, అరటి పండ్ల ముక్కలను ఆహారంగా పెట్టాడు.
స్కూలుకు వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు దాన్ని పలకరించటం, దానితో మాట్లాడటం, దాని సంరక్షణ ఆనంద్ నిత్యకృత్యంగా మారిపోయాయి. అలా ఒక పదిరోజులు గడిచిపోయాయి. ఆనంద్ సంరక్షణలో గాయం నయమయిన చిలుక రెక్కల్లో బలం పుంజుకుంది.
రోజులాగానే ఆనంద్ ఆరోజు చిలుకను పలుకరించి స్కూలుకు వెళ్లాడు. సాయంత్రం బుట్ట దగ్గరకు వచ్చి చూశాడు. అప్పటిదాకా తను ప్రేమగా పెంచుకున్న గారాల చిలుక బుట్టలో కనిపించలేదు. దుఃఖం పొంగుకొచ్చింది. ఏడ్చుకుంటూ తల్లి దగ్గరకు వెళ్లాడు.
ఆనంద్‌ని దగ్గరకు తీసుకున్న శాంత ‘ఏమయింది నాన్నా! ఎందుకు ఏడుస్తున్నావు?’ అని లాలనగా అడిగింది. ఆనంద్‌లో మరింతగా దుఃఖం పొంగుకొస్తోంది.
ఏడుస్తూనే ‘అమ్మా! ఆ చిలుక చూడు ఎంత చెడ్డదో. నేను ఎంత బాగా చూసుకుంటున్నాను కదా! అయినా అది ఎటో ఎగిరి వెళ్లిపోయింది’ అన్నాడు అమాయకంగా. కొడుకు దుఃఖాన్ని చూసిన శాంత కదిలిపోయింది.
‘పోనీలే నాన్నా! దానికి బాగయింది కదా! అందుకని దాని దోవన అది ఎగిరిపోయిందిలే!’ అని సముదాయించింది.
శాంత ఎంత చెప్పినా ఆనంద్ మనస్సులో దిగులు పోలేదు.
చిలుక మీద ధ్యాసతో తిండి సరిగా తినకపోవడమే కాక చదువులో కూడా వెనకపడ్డాడు.
ఆ పసి మనసు పడే బాధను గమనించిన తల్లి ఒకరోజు కొడుకును తన దగ్గర కూర్చోపెట్టుకుని ఇలా అడిగింది.
‘ఆనంద్! ఎందుకలా దిగులు పడతావు. చిలుక గురించా?’ అడిగింది.
‘అవును’ అన్నాడు ముభావంగా.
‘నే అడిగిందానికి సమాధానం చెప్పు’ అంది శాంత.
‘సరే!’ అన్నాడు ఆనంద్.
‘ఇప్పుడు నువ్వేం చదువుతున్నావు?’ అడిగింది.
‘అదేంటి? అయిదో తరగతి కదా!’ అన్నాడు.
‘సరే! ఆ తరువాత ఇంకో స్కూల్లో ఆరో తరగతిలో చేరతావా!’ అడిగింది.
‘ఆఁ చేరతాను’ అన్నాడు.
‘ఆ తరువాత?’ ప్రశ్నించాడు.
‘కాలేజీలో చేరి చదువుకుంటా. పెద్ద చదువులు చదువుకొని ఎంచక్కా అమెరికా వెళ్లి అక్కడే ఉద్యోగం చేస్తా!’ బదులిచ్చాడు.
‘సరే! నువ్వేమో పెద్ద చదువులు చదివి, పెద్ద రెక్కలున్న విమానంలో మమ్ముల్నందరినీ వదిలి ఎగిరి వెళ్లిపోతానంటున్నావే.. మరి ఆ చిలుక కూడా దాని రెక్కల్లో బలం వచ్చిన తరువాత స్వయంగా దాని తిండి సంపాదించుకోటానికి ఎగిరిపోయింది. దాంట్లో నువు బాధపడాల్సింది ఏముంది?. ఆ చిన్న బుట్టలో ఎన్నాళ్లుంటుంది చెప్పు?’ అన్నది శాంత.
ఏదో ఆలోచనలో పడ్డాడు ఆనంద్.
‘అవునా! అలాగా అమ్మా!’ ప్రశ్నించాడు.
‘అంతేకదా మరి! నువ్వే ఆలోచించు! బాగా చదువుకుని, మమ్ముల్ని అందర్నీ వదిలిపోతానంటున్నావు కదా. ఎవరైనా సరే వారి కాళ్ల మీద వారు నిలబడగలిగిన శక్తి వచ్చింతరువాత ఎవరికీ భారంగా వుండరు. అలాగే నువు తెచ్చిన రామచిలుక కూడా దాని రెక్కల్లో శక్తి రాగానే ఎగిరిపోయింది. సరేనా? వేరే ఆలోచించక బాగా చదువుకో!’ చెప్పింది శాంత.
‘ఇందులో నీకు తెలిసిన నీతి ఏమిటి?’ ప్రశ్నించింది ఆనంద్‌ను.
‘శక్తి వచ్చిన తరువాత ఎవరి కాళ్ల మీద వాళ్లు నిలబడాలి గాని సోమరిగా ఉండకూడదు’ స్థిరంగా బదులిచ్చాడు ఆనంద్.
‘వెరీ గుడ్! నువు చాలా మంచివాడవు. బాగా చదువుకో రేపటి నుంచి’ కుమారుడికి కర్తవ్య బోధ చేసింది శాంత.

- డా. మైలవరపు లలితకుమారి,
గుంటూరు. చరవాణి : 9959510422

చిన్న కథ

మగాళ్లు.. వట్టి మోసగాళ్లే!

సిటీబస్ కోసం నిలబడ్డ ఇందిర, శశాంకలు పదిరోజులు ఒకరినొకరు చూసుకుని, తరువాత పలకరించుకుని, ఆనక స్నేహంగా మారిన తరువాత ‘నాకు చదువుకోవాలని లేదు. మా అమ్మ కోసమే కాలేజీకి వెళుతున్నాను’ అన్నాడు.
‘ఇరవై రెండేళ్ల వయసులో చదువుకోకుండా ఏం చేద్దామని?’ అడిగింది ఇందిర.
‘పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఏదో చిన్న జాబ్ సంపాదించి, నాలాగే ఏదో జాబ్ చేస్తున్న పిల్లను పెళ్లి చేసుకుని..’ చెపుతున్నాడు. సిగ్గు పడింది ఇందిర. ‘నాకు జాబ్ చెయ్యాల్సిన అవసరం లేదు. మా నాన్నగారి ఫ్రెండ్ ఆఫీసులో సరదాగా జాబ్ చేస్తున్నా. నీకు కూడా చిన్న జాబ్ ఇప్పిస్తా. రేపు నాతో రా’ అంది.
ఇందిర రికమండేషన్‌తో పరశురాం గారు ఒక ఉద్యోగం కల్పించారు. శశాంక జీతం పనె్నండు వేలు.
‘నీ తెలివితేటలతో నన్ను మెప్పిస్తే జీతం త్వరలోనే పెంచుతాను’ అన్నారు పరశురాం గారు.
సిటీబస్ వదిలి స్కూటర్ మీద రోజూ ఆఫీసుకొస్తున్నాడు శశాంక.
‘ఇంక పెళ్లెప్పుడు?’ అడిగింది ఇందిర.
‘క్రిందటి ఆదివారం మా మేనమామ కూతురితో నిశ్చితార్థం జరిగింది. నీకు చెప్పలేదు కదూ..! ఉద్యోగం సంపాదిస్తేనే సీతనిచ్చి పెళ్లి చేస్తానని మామయ్య అన్నారు. ఒక్కతే కూతురు. వాళ్ళది పుస్తకాల షాపు. షాపులో పుస్తకాలు అమ్ముతూ కూర్చోవటం.. అబ్బే! నాకలా నచ్చక జాబ్ సంపాదించాను.
ఆశ్చర్యంగా చూసింది ఇందిర అతన్ని. నిజమే! తనే అపార్థం చేసుకుందా? అతనే జాబ్ కోసం అడిగాడు. ఏమైనా అతను తననెప్పుడూ తాకనైనా లేదు. మనసుని తాకేడు. జాబ్ కోసం స్నేహం చేశాడంతే.. అనుకుంది మనసులోనే!
‘నేను ఊహించిన దానికంటే నీకు ఎక్కువ తెలివితేటలున్నాయి. జాబ్ ఇందిర కోసం ఇచ్చాను. అది వద్దంది. అందుకే నీకీ ఊష్టింగ్ ఆర్డర్’ అంటున్న బాస్ వంక ఆశ్చర్యంగా చూశాడు శశాంక.
‘మగాళ్లు.. వట్టి మోసగాళ్లే’ పాట ఎఫ్.ఎమ్‌లో..
కళ్లు తుడుచుకుంది ఇందిర.

- కొత్తపల్లి పార్వతి,
విజయవాడ.

పుస్తక పరిచయం

భరతమాతకు ఖ్యాతి.. రేపటి పౌరులకు స్ఫూర్తి!
గబ్బిట దుర్గాప్రసాద్,
ప్రెసిడెంట్: సరసభారతి
ఇంటి నం: 2-405,
శివాలయం వీధి, ఉయ్యూరు,
కృష్ణా జిల్లా - 521165
చరవాణి : 9989066375
సరసభారతి అధ్యక్షులు గబ్బిట దుర్గాప్రసాద్ రచించిన గ్రంథాల గురించి గతంలో మనం తెలుసుకున్నాం. కానీ ఇటీవల ఆయన విడుదల చేసిన ‘కెమోటాలజీ పిత కొలచల సీతారామయ్య’ (పుల్లేరు నుండి వోల్గా దాకా) పుస్తక రచన అందులో భిన్నమైనది. గతంలో ఆయన కవితా సంకలనాలు, ఉయ్యూరు ముచ్చట్లు, ఆధ్యాత్మిక గ్రంథాలు ప్రచురించారుగాని ఒక సైంటిస్ట్ గురించి తెలిపే పుస్తకం రాయటం ఇదే మొదటసారి. కొలచల సీతారామయ్యగారి గురించి చాలామంది తెలుగువారికి తెలియదు. అమెరికా, రష్యా దేశాలలో మన భారతదేశ ఘనతని చాటిన తెలుగుబిడ్డ, అందులో మన కృష్ణాజిల్లా నివాసి కొలచల సీతారామయ్య అంటే అందరికీ ఆశ్చర్యపోక తప్పదు. ఆయన గురించి అనేక విషయాలు ఈ పుస్తకంలో చదివిన ప్రతి విద్యార్థికీ మనస్సు ఉత్తేజం, ఉత్సాహం కలిగి తామూ అంతటి గొప్పవారమవ్వాలనే తలంపు కలగడం తథ్యం.
అంతటి సీతారామయ్య గారి గురించి క్లుప్తంగా..
బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సీతారామయ్య, తాను అనుకున్న లక్ష్యం కోసం తమ కుటుంబీకులకు ఇష్టం లేకున్నా వారిని బలవంతంగా ఒప్పించి, తన ఆశయసాధన కోసం కృష్ణాజిల్లా ఉయ్యూరు నుంచి మద్రాస్ మహానగరానికి నడిచి వెళ్ళిన మహనీయుడు. అక్కడి నుండి అష్టకష్టాలు పడి షిప్‌లో అమెరికా చేరి, అక్కడ తాను కనిపెట్టిన లూబ్రికెంట్ ఉత్పత్తి జీవితకాలం మనే్నవిధంగా తయారు చేసిన ఘనుడు. అయితే దానికి పైఅధికారి తక్కువ కాలం మనే్నవిధంగా తయారు చేయమని ఉత్పత్తిదారుడి యొక్క సహజ లక్షణాన్ని బయటపెట్టి హుకుం జారీ చేస్తే.. దానిని ధిక్కరించిన సీతారామయ్య, రష్యా తన ఆలోచనలకు జీవంపోస్తుందని భావించారు. అనేక ఆర్థిక ఒడుదుడుకులతో సతమతమవుతున్న రష్యాకు తన అవసరం ఉందని గుర్తించారు. అమెరికా నుండి ఆయన రష్యాకు వలసపోయారు. అక్కడ తాను అనుకున్న ఆశయాల్ని సాధించుకుని ప్రజలకు ఉపయోగపడటమే కాకుండా దేశానికీ ఎంతో పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చారు. రష్యా, భారత్ మైత్రికి ఆయన ఎంతో కృషి సల్పారు.
అంతటి ఘనచరిత్ర కలిగిన సీతారామయ్య ఒకసారి భారతదేశ యాత్రకు బయలుదేరి, రైల్లో తన ఊరుకి వెళుతున్నారు. మార్గమధ్యంలో రైలు ఆపి రైతు ప్రతినిధులు ఆయన్ని గుర్తించి ఎంతో అభిమానంతో సన్మానించారట. ఆ స్పందనకు తాను పడిన కష్టాలను మరిచి ఆయన ఎంతో తన్మయత్వంతో పులకంచిపోయారట. అటువంటి మహనీయుడు పుట్టిన తెలుగునేల మన కృష్ణాజిల్లా. ఆయన గురించి ఎవరూ పట్టించుకోకపోయినా, తెలుగులో మొట్టమొదటిసారిగా ఈ పుస్తకం తీసుకురావడం ద్వారా ఆయన గురించి ఎన్నో విషయాలు, విశేషాలు అందించే ప్రయత్నం చేసిన గబ్బిట దుర్గాప్రసాద్ చేసిన కృషికి, ఈ పుస్తకాన్ని వెలుగులోకి రావడానికి ఆర్థిక సహకారం అందించిన ఉయ్యూరు ఎమ్మెల్సీ యలమంచిలి బాబూ రాజేంద్ర ప్రపసాద్ గారు ఎంతో అభినందనీయులు, ఒక తెలుగువాడు సాధించిన అంతర్జాతీయ ఖ్యాతిని వెలుగులోకి తీసుకురావడం ద్వారా , మరెంతోమంది విద్యార్థులకు స్ఫూర్తినిచ్చే విధంగా ఈ పుస్తకం ఒక బహుమతి కాగలదనటంలో ఏమాత్రం సందేహం లేదు.

- చలపాక ప్రకాష్,
విజయవాడ.
చరవాణి : 9247475975

మనోగీతికలు

ప్రేమికులారా..!
మొదటి చూపులోనే మనసు పడ్డానని
మాయమాటలు తియ్యగా పలికి
అభిమానం అభినయించి
ఏవేవో ఊసులతో మభ్యపెట్టి
చల్లగాలికి బైక్ మీద షికార్లు తిప్పి
వెనె్నల రాత్రుల్లో విహరిద్దామని
పబ్బులు, పార్కుల వెంట సరదాలు
సరసాలతో ఐస్‌క్రీములు తినిపించి
ఆలింగనాలు చుంబనాలతో
మైమరపించి మత్తెక్కించి
నువ్వే నా ప్రాణమంటూ
పెళ్లాడతానని ప్రేమను నటించి
నువ్వే నా లోకమంటూ
స్వర్గపుటంచులు చూపిస్తానంటే
అందాలకు మరింత మెరుగులు దిద్ది
మురిసిపోతూ అమాయకురాలిలా వెళ్లావంటే
అందంతోపాటు అన్నీ ఆరగించిపోయాక
తెల్లవారి వెనె్నలంతా కరిగిపోయి
కళ్లు తెరచి నిజం తెలుసుకొనేలోపు
ఆ గండు తుమ్మెద మకరందం కోసం
మరో తోటలో పూలపై వాలుతుంది
కనె్నదనాన్ని కాటేసిన యవ్వనం
తాళి కట్టకుండానే తల్లిని చేస్తుంది!
ప్రేమను గుడ్డిగా నమ్మితే
పగలే చీకటి బతుకవుతుంది
సెల్‌ఫోన్‌లో సోది మాటలతో
కాలేజీ పక్కన కబుర్లాడటం
చదువుకోమని కాలేజీకి పంపితే
తల్లిదండ్రుల శ్రమను దోచుకుంటూ
నెట్‌లో చాటింగ్‌లంటూ
అశ్లీల చిత్రాలనాకర్షించి
ప్రేమించకపోతే ప్రాణాలు తీయటం
రోజూ అమ్మాయిల వెంటపడి వేధించటం
ర్యాగింగ్‌లతో రాక్షసంగా ప్రవర్తించటం
ఇది ప్రేమంటారా!
ప్రేమంటే ఏమిటి?
రెండు హృదయాల కలయిక
ఒకరు ఊపిరి.. ఒకరు శ్వాస!
ఆరాధించే, అర్థం చేసుకునే మనసుండాలి
రెండక్షరాల ప్రేమ కోసం
రెండు క్షణాల ఆవేశంలో
హద్దులుమీరి జీవితం నాశనం కావటం
ప్రేమంటారా?
ప్రేమంటే రగిలే మంటకాదు తెల్లని మంచుపల్లకి
మూన్నాళ్ల ముచ్చట తీరాక
విసిరిపారేసే పూలచెండు కాదు
ప్రేమంటే సుగంధ పరిమళాల జల్లు
నిజమైన ప్రేమను ప్రేమించాలి
ప్రేమికులారా.. వాస్తవం తెలుసుకోండి!

- తాటికోల పద్మావతి, గుంటూరు.
చరవాణి : 9441753376

భాషల్లో రాజేంద్రమై ..
కవిత్రయ కవుల కలాలతో
సుధాబిందువులను చిలికించి
ధారాపాతంగా కురిసినట్టి కావ్యమై
అక్షర గాంభీర్యంతో
పోతన ఘాంటానుసీమలో భాగవతమై
అక్షయంబైన పదసంపదతో
విభావిభవాభిరామమైన
జీవభాషగా దీపించి
వీరబ్రహ్మేంద్రుని
కాలజ్ఞానమై వేమన్న శతకమై
అన్నమయ్య సంకీర్తనమై అలరారి
కృష్ణరాయని ఆమూక్తమాల్యదతో
ప్రబంధ ఒరవడిని సృష్టించి
ప్రాసయతుల ప్రాభవంతో
పద్యకవితయై పల్లవించి
జాషువ సీసమై దాశరథి గేయమై
వేటూరి, సినారె కలాల్లో పాటయై
గోరేటి నోట జానపదమై
గలగల పారే వాహినిగా
సిరివెనె్నలలు కురిపించి
శాంతికపోతంలా క్రాంతి జలపాతంలా
కడలి అంచులు దాటి
ప్రపంచీకరణ ప్రభావాన
అంతర్జాల అవనికపై బ్లాగుల రూపమై
భాషల్లో రాజేంద్రమై నిలిచింది నా తెలుగు
తరతరాలు నిండు జాబిల్లిలా
వెలుగులు పంచు నా తెలుగు!

- సిద్ధాంతపు
ప్రభాకరాచార్యులు
అశ్వారావుపేట, ఖమ్మం జిల్లా.
చరవాణి : 9491357842

పనికిరాని చదువు
బిచ్చమెత్తుచు తిరుగగా - వీలులేదు
బాల కార్మికుడౌటయు - పాడిగాదు
నాన్న వృత్తికి సాయమ్మొ - నర్చరాదు
ఊరకే యింటగూర్చుని - యుండరాదు
అనుచు నిర్బంధముగ నాకు - పనికిరాని
పిచ్చిచదువు చితముగ నేర్పించినావు
నా నరేంద్రుని నా శివాజీని గూర్చి
నాదు రాముని ప్రహ్లాదు నాదు కృష్ణ
నాదు సాధ్వీమతల్లుల - నాదు ఋషుల
నా భగత్‌సింహు నా సుభాష్ - నా ప్రతాప
రుద్రు గూఱిచి వారి వీరోచితమ్ము
లైన కృత్యములను జెప్పవైతివకట
‘ఆ’కు ‘ఆవు’ను జూపుట ఆపి వైచి
‘ఎ’ ఫర్ యాస్ అను విషయము నెక్కించినావు
‘గ’కు గణనాథ్ బొమ్మను కత్తిరించి
‘గధా’ గాడిదనుంజూప గడగినావు.
ఏడుచుచు మొత్తుకొన్నను ఏడువఱకు
ఉచిత విద్యను నేర్పించి ఊసుపోక
ఆపయిన నన్ను బయటికి అంపినావు
దిక్కుదఱి దోచని స్థితిన్ - దెచ్చినావు.
ఓ ప్రభుత్వమ! ఈ రీతి అప్రశస్త
శుష్క కూపమ్మునంద్రోచి చోద్యమేమొ
జూచుచున్నావు నిను నమ్మి శోచనీయ
వౌ అవస్థను గ్రుందుచు-న్నాను నేను
వైద్యుడో ఇంజనీయరో బ్యాంకు క్లర్కొ
కానిచో వాడు మనిషియే గాడటన్న
దుస్థితికి నేటి యువతను ద్రోసినావు
దేశమునకది ఏమి యం-దించగలదు
కేవలము పొట్ట మాత్రమే - కేంద్ర బిందు
వైన సంఘాన మనిషికి - పశువునకును
ఆకృతి వ్యత్యయమునకన్న
- అన్యమైన
భేదమేముండు పశుమయం
బీజగమ్ము!

- డా. మాదిరాజు రామసుందర్రావు,
విజయవాడ.
చరవాణి : 9441026360

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, ప్లాట్ నంబర్ సి- 3, 4, ఇండస్ట్రియల్ ఎస్టేట్, విజయవాడ - 520 007. పజీౄళూఖఔఖబఘౄజ.ష్యౄ

- డా. మైలవరపు లలితకుమారి