విశాఖపట్నం

తెలుగుతనం (మినీకథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రా యూనివర్సిటీలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా తెలుగు క్లాసులు ప్రారంభమయ్యాయి. వందలాది మంది క్లాసులకు హాజరయ్యారు. కొందరు ఉద్యోగాలు చేసుకుంటూ క్లాస్‌కు హాజరవగా మరికొందరు కళాశాలకు వెళ్లలేని పరిస్థితిలో డిస్టెన్స్‌లో చదవడానికి ఆసక్తి చూపారు.
వైభవ్ తెలుగు మీద ఆసక్తి వలన డిస్టెన్స్‌లో తెలుగు తీసుకున్నాడు. బయట జాబ్ కూడా చేస్తున్నాడు. మొదటి రోజు అధ్యాపకులు చెప్పిన విషయాలను రాసుకున్నాడు. అప్పుడే శాంతి అనే అమ్మాయిని వైభవ్ చూశాడు. తనకి చాలా నచ్చింది. తర్వాత క్లాసుల్లో వైభవ్ తెలుగు చందస్సు, వ్యాకరణాలు, ఇలా చాలా విషయాలు నేర్చుకున్నాడు. వైభవ్ కళ్లు శాంతి వైపు తిరిగాయి. మోడ్రన్ డ్రెస్ వేసుకున్న మహాలక్ష్మిలా ఉందనుకున్నాడు. ఎలాగైనా సరే తన ప్రేమను తెలియపరచాలనుకుని ఓ ఉత్తరం రాసాడు.
గౌరవనీయులైన శాంతి గారికి -
మిమ్మల్ని తొలిసారి చూసినప్పుడే మీ మీద మంచి అభిప్రాయం కలిగింది. ఇది ప్రేమ అని నాకు అన్పిస్తోంది. మంచి ఉద్యోగంలో ఉన్నాను. మీరు అవునంటే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మీరు ఎలాంటి సమాధానం చెప్పినా నాకు ఏ అభ్యంతరం లేదు. ప్రేమించమని వేధించడం నా అభిమతం కాదు. మీరు మోడ్రన్ డ్రెస్ వేసుకున్న మహాలక్ష్మిలా ఉన్నారు. ఏదో ఒక నిర్ణయం తెలియపరుస్తారని వేడుకుంటున్నాను.
ఇట్లు
మీ ప్రేమను ఆశిస్తూ - వైభవ్
అని ఉత్తరం రాసి కళాశాల అయిపోయన తర్వాత శాంతి చేతికిచ్చి వెళ్లిపోయాడు. శాంతి అయోమయంగా చూసి ఆ ఉత్తరం చదివింది. తర్వాత వైభవ్‌కి ఓ ఉత్తరం రాసింది.
గౌరవనీయులైన వైభవ్‌గారికి,
మీ ఉత్తరం చదివిన తరువాత కొన్ని విషయాలు మీకు తెలియాలి. మీరు అనుకున్నట్లు నేనేం యువతిని కాదు. ఇద్దరు పిల్లల తల్లిని. ఇంట్లో ఉండి ఏమీ తోచక ఇలా చదువుకుంటున్నాను. మీరు అర్థం చేసుకోవడంలో ఎటువంటి లోపం లేదు. నేను అలా మోడ్రన్‌గా ఉండడం నా తప్పే.
ఇట్లు
ఇద్దరు పిల్లల తల్లి - శాంతి
శాంతి రాసిన ఉత్తరాన్ని విజయ అనే మరో ఆవిడకి ఇచ్చి వైభవ్‌కి ఇవ్వమని చెప్పింది. వైభవ్ ఈ ఉత్తరం చదవగానే షాకయ్యాడు. వెంటనే వైభవ్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు.
ఆ తరువాత క్లాస్ నుండి శాంతి నిండైన చీర కట్టుతో మెడలో నల్లపూసలతో కాళ్లకి మట్టెలతో హాజరయింది. ఇది చూసిన వైభవ్‌కి తెలుగుతనంలో నిండైన సాంప్రదాయంలో ఉంటే ఎవ్వరికీ ఎలాంటి ఆలోచన రాదని శాంతికి మనసారా నమస్కరించాడు. శాంతి నిండైన చిరునవ్వుతో ప్రతి నమస్కారం పెట్టింది.

- నల్లపాటి సురేంద్ర,
అచ్యుతాపురం, సెల్ : 9490792553

కథానిక

మరణ మృదంగం

ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ గోదావరి బ్రిడ్జిమీద దడదడమని శబ్దం చేస్తూ పట్టాలపై పరుగుతీస్తోంది. చల్లని గాలి రివ్వున కంపార్టుమెంటులోకి దూసుకొస్తోంది. ఎదురుగా గోదావరి ఉరకలు వేస్తూ పరుగులు పెడ్తోంది. చిన్న చిన్న అలలు ఎగిసిపడుతున్నాయి.
నా మదినిండా రకరకాల ఆలోచనలు. అవీ నా బాల్య స్నేహితుడు సురేశ్ గురించి.
మా బాల్యంలో సురేశ్‌తో ఆడిన ఆటలూ, పాడుకున్న పాటలూ, చేసిన చిలిపి పనులూ అన్నీ గుర్తుకు వస్తున్నాయి.
మా బాల్య జ్ఞాపకాలు కళ్ళెదుట కదలాడుతూ ఉంటే ఆ జ్ఞాపకాలు నాకు సంతోషాన్ని కలిగించడానికి బదులు మనస్తాపానికి గురి చేస్తున్నాయి. గ్రామానికి వస్తున్నప్పటి సంతోషం ఇప్పుడు వెళ్తున్న సమయంలో మచ్చుకైనా కానరావడంలేదు.
సురేశ్ జ్ఞాపకాలు నన్ను మరింత ఆవేదనకు గురి చేస్తున్నాయి. ‘సంక్రాంతి సెలవులకి నేను మన గ్రామానికి హైదరాబాదు నుండి వస్తున్నాను. నీవు బెంగుళూరు నుండి సెలవు పెట్టుకుని రా’ అని సురేశ్ అన్న మాటలు నా చెవిలో ఇప్పుడు కూడా గింగుర్లాడుతున్నాయి.
ఉవ్వెత్తున ఎగిసిపడ్తున్న భోగి మంటలు, ఆ మంటల్లో వేస్తున్న భోగి పిడకల దండలు, ప్రతి ఇంటి ముంగిట రకరకాల ముగ్గులు, ఆ ముగ్గుల మధ్య శోభాయమానంగా అలరారుతున్న గొబ్బెళ్ళు, కోడిపందాలు, గంగిరెద్దుల వాళ్ళ సన్నాయి వాయిద్యాలు, ఆకాశంలో ఎగురుతున్న వివిధ రంగుల గాలిపటాలూ ఇవన్నీ పరిసరాలకి వింత శోభ తెచ్చిపెట్టేవి. తిరిగి ఇన్ని సంవత్సరాల తరువాత ఆ సంబరాల్ని చూసి ఆనందించే అవకాశం కలుగుతోందని సురేశ్ ప్రస్తావనకు నేనూ అంగీకరించి బెంగుళూరు నుండి మా గ్రామానికి బయలుదేరాను. నేను బెంగుళూరు నుండి, సురేశ్ హైదరాబాదు నుండి బయలుదేరి మా గ్రామంలో వాలాము.
రైల్లోని బిచ్చగాడి పాటతో ఆ ఆలోచన్లు చెల్లాచెదురయ్యాయి.
తిరిగి ఆలోచన్లు నన్ను చుట్టుముడ్తున్నాయి. గ్రామంలో జరిగిన సంఘటనలు గుర్తుకు వస్తుంటే నా హృదయం బాధగా మూలిగింది. వచ్చినప్పుడు ఆనందంగా ఉత్సాహంగా గ్రామానికి వచ్చిన నేను ఇప్పుడు వెళ్తున్న సమయంలో పిడికెడంత గుండెలో ఒకింత ఆవేదన, కళ్ళల్లో కన్నీరు నింపుకుని వెళ్ళవల్సి వచ్చింది.
సురేశ్, నేనూ ఓ సాయంత్ర సమయంలో పొలాల గట్ల మీద నడుస్తూ కబుర్లు చెప్పుకుంటున్నాము. ఓ రైతు పొలం వద్ద విద్యుత్ తీగెల కింద కొబ్బరి చెట్లున్నాయి. ఆ కొబ్బరి చెట్టు మట్టలకి తీగెలు తగిలి మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న చెరుకు తోటకు మంటలు వ్యాపించాయి. తోట కాలిపోతోందని గ్రామస్థులు తోట దగ్గరకు పరుగులు తీశారు.
సురేశ్ ఆ దృశ్యం చూశాడు. చలించిపోయాడు. ఉద్వేగంతో ఊగిపోయాడు. ఆ సమయంలో కేవలం వాడి ఆలోచన ఒక్కటే తనవంతు సహాయం అందించాలని, నన్ను వదిలిపెట్టి అడ్డదారిలో పరుగుతీశాడు. అప్పటికే తెగిన విద్యుత్ తీగ కింద పడి ఉంది. పరుగు తీస్తున్న సురేశ్ కాలికి ఆ తీగ తగలడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే అసువులుబాశాడు.
‘‘మన పాలేరు రామయ్య పొలంలో ఫ్యూజ్ పోయిందని ఫ్యూజ్ వేస్తూంటే షాక్ తగిలి చనిపోయాడు. భర్త చనిపోయిన తరువాత మనో వేదనతో భార్యకి పక్షవాతం వచ్చింది. వితంతు పింఛను ఆమెకి రాలేదు. వెంకటేశం మామయ్యా అని పిలిచేవాడివి గుర్తుందా? అతను కూడా పొలానికి వెళ్ళి మోటర్ ఆన్ చేస్తుండగానే మృత్యువాత పడ్డాడు.
మెట్ట్భూమి ఉన్నా బోరు పాడయి పంటలు వేయలేని స్థితి ఆ కుటుంబానిది. గేదెపాలు అమ్ముకుని ఆ కుటుంబం జీవన యాత్ర సాగిస్తోంది. ఇంకా విను. మనకి సరుకులు ఇచ్చే షావుకారు కామరాజు పరిస్థితి మరో విధంగా ఉంది. అతను ద్విచక్ర వాహనంపై వెళ్తూ ఉండగా విద్యుత్ తీగలు తెగి అతనిపై పడ్డాయి. అతనికి రెండు కాళ్ళూ చేతులూ తొలగించవలసి వచ్చింది. మంచంపై పడి ఉన్నాడు. అతని కుటుంబానికి కూడా తగిన సాయం అందలేదు. అలాగే సింహాద్రిది మరో విషాద సంఘటన. విద్యుదాఘాతానికి గురైన అతను మంచంపై పడి ఉన్నాడు. భార్య, కొడుకు కూలి పనులకి వెళ్తున్నారు’’ నాన్నగారు గ్రామంలో జరిగిన ఒక్కొక్క సంఘటన చెప్తూ ఉంటే నా మనస్సంతా ఆవేదనతో నిండిపోయింది.
పోస్టుమార్టం చేసిన తరువాత సురేశ్ ప్రాణం లేని శరీరాన్ని ఓమారు కుటుంబ సభ్యులకి చివరిసారిగా చూపించడానికి అవకాశం కలిగించారు. వాడి నిర్జీవ శరీరాన్ని చూసి వెక్కివెక్కి ఏడ్చాను. వాడి భార్య దు:ఖాన్ని దూరం చేయడం ఎవ్వరికీ సాధ్యపడలేదు.
‘‘దిన వారాలు అయ్యేవరకూ సెలవు పెట్టుకుని ఉండు. నీకు ప్రాణ స్నేహితుడు కూడా సురేశ్’’ అన్నారు నాన్నగారు. అయితే ఆ పరిసరాలలో ఒక్క క్షణం కూడా ఉండబుద్ధి వేయలేదు. వస్తున్నప్పుడు ఇద్దరం ఆ గ్రామంలో అడుగుపెట్టాం. వెళ్తున్నప్పుడు ఒక్కడినే వెళ్తున్నాను. మనిషి పుట్టినపుడూ ఒంటరిగానే పుడ్తాడు. చనిపోయినపుడు కూడా ఒంటరే. విరక్తిగా అనుకున్నాను. వెంటనే గ్రామంలో ఉండలేక ప్రయాణమయ్యాను.
స్టేషన్లో నాన్నగారు నాతో... ‘‘సూర్యం! నీవు స్థిమితపడు. అయిందేదో అయిపోయింది. అయిందానికి ఎవ్వరూ ఏం చేయలేరు’’
సురేశ్‌కి పెళ్ళయి సంవత్సరం కూడా అవలేదు. సురేశ్ భార్య గర్భవతి కూడా. ఈ సంఘటన నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. నా కళ్ళు బైర్లుకమ్ముతున్నాయి. పడబోతున్న నన్ను తిరిగి ఎవరో పట్టుకున్నారు. నన్ను మా ఇంటికి తీసుకువచ్చారు. ఇవన్నీ నాకు గుర్తే లేదు.
నాకు తెలివి వచ్చిన తరువాత సురేశ్ మరణ దృశ్యం జ్ఞప్తికి వచ్చి నాకు దు:ఖం ఆగడం లేదు. వెక్కివెక్కి ఏడుస్తున్నాను చిన్నపిల్లాడిలా. మా కుటుంబ సభ్యులు నన్ను ఓదారుస్తున్నారు.
‘‘ఈ సంఘటనకే నీవు ఇలా డీలాపడిపోయావు. మన గ్రామంలో జరిగిన ఒక్కొక్క సంఘటన చెప్తే నీవు తట్టుకోలేవు’’ అన్నారు నాన్నగారు నాతో. ‘‘ఏ సంఘటనలు?’’ నేను నాన్నగారిని అడిగాను. ‘‘అదే! సరస్వతి పిన్ని అని చిన్నప్పుడు నీవు పిలిచేవాడివి. ఆ సరస్వతి పిన్ని గుర్తుందా?’’ నాన్నగారి మాటలు విన్న నేను సరస్వతి పిన్నిని గుర్తుకు తెచ్చుకోడానికి ప్రయత్నిస్తున్నాను. ఆ సరస్వతి పిన్ని భర్త రామారావు విద్యుత్ మోటారు వేయడానికి పొలానికి వెళ్ళాడు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడ్డం వలన ట్రాన్స్‌ఫారం దగ్గరకు వెళ్ళాడు. దాన్ని చూస్తున్న సమయంలో మృత్యువాత పడ్డాడు. భర్త మరణించడం వలన ఆ ఇంటి భారమంతా సరస్వతి పిన్నిమీదే పడింది. అసలే చిన్న పిల్లలు. వాళ్లని చదివించడంలో తీవ్ర ఇబ్బంది పడుతోంది. ఆర్థిక స్తోమత లేక చివరికి కూలి పనికి కూడా వెళ్తోంది సరస్వతి పిన్ని’’ నాన్నగారు అన్నారు.
‘అయ్యో’ బాధగా మూలిగింది నా హృదయం.
ట్రైను కదిలింది. భారమైన హృదయంతో నాన్నగారికి వీడ్కోలిచ్చాను.
నేను నాదైన శైలిలో ఆలోచిస్తున్నాను. ముఖ్యంగా ఉచిత విద్యుత్ విషయంలో మొదట రైతుల్ని చైతన్యవంతుల్ని చేయాలి. వారికి సురక్షిత చర్యల గురించి తెలపాలి. వర్షం పడినప్పుడు నేల తడిగా ఉంటుంది. అందుకే రైతు చూసుకుని పంపుసెట్ ఆన్ చేయాలి. నాణ్యతా ప్రమాణాలు కలిగిన పంపుసెట్లనే వాడాలి. వైరింగులోనూ నాణ్యత చూసుకోవాలి. రైతులకి బీమా చేయించాలి. విద్యుత్ లైన్ల తనిఖీ ప్రక్రియ నిరంతరం కొనసాగాలి. లైన్ ఇన్‌స్పెక్టర్లు కూడా లూజయిన లైన్లను సరిచేయాలి. ట్రాన్స్‌ఫార్మర్ల దగ్గర ఎర్తింగ్ సరిగా ఉందో లేదో చూడాలి. ప్రమాదం జరిగినప్పుడు దానిపై అధ్యయనం జరగాలి. కారణం తెలుసుకోవాలి. ప్రభుత్వం విచారణ జరిపించాలి. తిరిగి ప్రమాదాలు జరగనీయకుండా జాగ్రత్తపడాలి’
నేను ఇలా ఆలోచిస్తున్నాను కాని, వాస్తవానికి, వాటిలో సగమైనా అమలు అవుతున్నాయా? లేదే! అందుకే అన్నదాతలు కరెంటు తీగలపై శవాలవుతున్నారు. వారి కుటుంబాలు వీధిన పడుతున్నాయి’ నా ఆలోచనలతో సంబంధం లేకుండా ట్రైను పట్టాలమీద దడదడ శబ్దం చేస్తూ ముందుకు దూసుకుపోతోంది.

- గూడూరు గోపాలకృష్ణమూర్తి,
విజయనగరం. ఫోన్ : 08922231605.

పుస్తక సమీక్ష

ఆదిత్య వైభవం

సువిశాలమైన ఈ విశ్వానికి చైతన్య కారకుడు శ్రీ సూర్యభగవానుడు. సూర్యుడు లేని ఆకాశాన్ని ఊహించలేం. ప్రత్యక్ష దైవంగా పూజలందుకుంటున్నాడు. సూర్యుడు తన దివ్యమైన శక్తులను కిరణాల ద్వారా ప్రసారం చేస్తున్నాడు. ప్రాతఃకాలానికి జాగృతి కలిగించే శక్తి గల ఆ సూర్యుణ్ణి ఆరాధించే సంప్రదాయం యుగ యుగాల నుంచి కొనసాగుతోంది. మానవ జాతి మనుగడకు, పశుపక్ష్యాదులకు, వృక్ష సంపదకు జీవన మాధుర్యాన్ని పంచిపెడుతున్న అమృత దాతగా సృష్టిలో స్థానం పొందాడు. ఆదిత్య ఆరాధనలో మంచి ఆరోగ్యం సమకూరుతుంది. చేపట్టిన సర్వ కార్యాలు నెరవేరుతాయి. అన్నదాత, ఆరోగ్య ప్రదాత అయిన సూర్యుడు అసమానంగా ప్రకాశిస్తూ భూమితో పాటు ఇతర గ్రహాలకు వెలుగును, శక్తిని అందిస్తున్నాడు. ‘‘ఓం అదిత్యాయ విద్మహే/ సహస్ర కిరణాయ ధీమహి/ తన్నో సూర్య ప్రబోదయాత్’’ అని ఉపనిషత్తులు పేర్కొంటున్నాయి. సూర్య మండలం రుగ్వేదమని, సూర్యుని దేహం యజుర్వేదమని, కిరణాలు సామవేదమని మంత్ర మహోర్ణవంలో వివరించడమైంది.
ఇలా ఆదిత్య వైభవం పేరుతో విశాఖపట్నం బివికె కళాశాల విశ్రాంత తెలుగు విభాగాధిపతి డాక్టర్ డివి సూర్యారావు రాసిన ఈ పుస్తకం ఆద్యంతం పాఠకుణ్ణి చదివిస్తుంది. భక్తి సాగరంలో ముంచెత్తివేస్తుంది. సూర్యారాధన వైశిష్ట్యాన్ని సరళమైన భాషలో రాశారు. సంపూర్ణమైన ఆరోగ్యం పొందడానికి సూర్య నమస్కారాల ప్రాధాన్యతను తేటతెల్లంగా వివరించారు. శ్రీమన్నారాయణుడు- శ్రీరామునిగా, శ్రీకృష్ణునిగా అవతారాలు దాల్చి భూలోకమందు, అనేక సమయాల్లో ఆదిత్యుని అనుగ్రహం కోసం ఉపాసించిన వైనాన్ని చక్కగా వివరించారు. మన కళ్ళకు ఏదైనా కావాలంటే జ్యోతిస్సు కావాలి. ఆ జ్యోతిస్సు తొలుత మన కంటిని ఆకర్షిస్తుంది. అంచేత మనకు కనబరిచే విశ్వవ్యాప్త శక్తి వెలుగు. ఆ వెలుగు పరమాత్మ స్వరూపం. జ్యోతి స్వరూపుడై ఆత్మతత్వాన్ని బోధించే పరంజ్యోతి సూర్యుడని డాక్టర్ సూర్యారావు అభివర్ణించారు.
వసంత రుతువులో సూర్యుడు కపిలవర్ణం, గ్రీష్మ రుతువులో స్వర్ణ వర్ణం, వర్ష రుతువులో శే్వతవర్ణం, శరత్కాలంలో తెలుపు, పసుపు కలిపిన వర్ణం, హేమంతంలో రాగి వర్ణం, శిశిరంలో అరుణ వర్ణం కలిగి ఉంటాడని పేర్కొన్నారు.
సాహిత్యంలో సూర్యుడు అనే అధ్యాయంలో మయూరుని సూర్య శతకం, తిక్కన మహాభారతంలో విరాట పర్వం కీచక వధ ఘట్టంలో సూర్యోదయ వర్ణన, శ్రీనాథుని కాశీ ఖండంలో సూర్యోదయ వర్ణన, నాచన సోమనాథుని ఉత్తర హరి వంశంలో సూర్యాస్తమయ వర్ణన, బమ్మెర పోతన భాగవతం దశమ స్కంధంలో సూర్యాస్తమయ వర్ణనలను రచయిత ఉటంకించారు. విప్లవ కవులు సూర్యుణ్ణి విప్లవానికి, క్రాంతికి ప్రతీకగా భావించారు. శివసాగర్ అనే ప్రముఖ రచయిత నరుడో భాస్కరుడో, ఉదయించే సూర్యుడు తదితర కవితలు ఈ దృక్పథాన్ని ప్రతిబింబిస్తాయని ఆయన ఉదహరించారు.
అన్నింటికి మించి మన దేశంలో వివిధ రాష్ట్రాల్లో వెలసిన సూర్య దేవాలయాల గూర్చి ఈ పుస్తకంలో మంచి సమాచారాన్ని అందించారు. శ్రీకాకుళం జిల్లాలోని అరసవిల్లి, సామర్లకోట సమీపంలోని పాండవుల మెట్ట, తూర్పుగోదావరి జిల్లా గొల్లల మామిడాడ రామాలయంలో గల సూర్య విగ్రహం, మహబూబ్ నగర్ జిల్లా అలంపురం, హన్మకొండ వేయి స్తంభాల గుడిలోగల సూర్య విగ్రహం గూర్చి ప్రస్తావించారు. ఒడిశా రాష్ట్రంలోని కోణార్క్, హర్యానా రాష్ట్రంలో కురుక్షేత్ర వద్ద గల సూర్య దేవాలయం, గుజరాత్, జమ్ము కాశ్మీర్, అసోం, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో గల సూర్య దేవాలయాల స్థల పురాణాలను వివరించారు. వేదాల్లో సూర్యుడు, పురాణేతిహాసాల్లో సూర్యుడు, సూర్య నామావళి, సూర్యగమనం, ఆదిత్య హృదయం, సూర్యుడు- పండగలు, సూర్య నమస్కారాలు, సూర్యుడు వైజ్ఞానిక దృక్పథం, నేత్రోపనిషత్, సూర్య అష్టోత్తరం తదితర అధ్యాయాల్లో అవే అంశాలను ఆసక్తికరంగా రాశారు. ప్రతి ఒక్కరూ చదవదగ్గ పుస్తకంగా డాక్టర్ డివి సూర్యారావు తీర్చిదిద్దారు. ఈ పుస్తకాన్ని విశాఖపట్నంలోని శ్రీ ప్రభా సాంబ సాహితీ పీఠం 2015లో ప్రచురించింది. ఈ పుస్తకాన్ని చదవాలనుకునేవారు సాహితీపీఠం సెల్ 9403031615ని గాని, రచయిత సూర్యారావు సెల్ 9885188431కు గాని సంప్రదించవచ్చు.

- వాండ్రంగి కొండలరావు, పొందూరు, శ్రీకాకుళం జిల్లా. సెల్ : 9490528730.

మనోగీతికలు

కొన్ని దేహాలు
ఉక్కు కడ్డీలుగా మారి కొన్ని దేహాలు
దేశ రక్షణకు కంచెలౌతాయి!
మట్టి ముద్దలైన కొన్ని దేహాలు
మంచినీటి కడవలౌతాయి!

కొలిమిలో కరిగిన కొన్ని దేహాలు
చక్రమో, చట్రమో చిత్రమో, శిల్పమో ఔతాయి!

నాగలైన కొన్ని దేహాలు
ఆకలి తీర్చే ఆపన్న హస్తాలౌతాయి!

నీలి తెరలమాటున బందీలైన
కొన్ని దేహాలు
కామాంధుల కబేళాలో గోవులౌతాయి!

ఎండలో మరిగి మరిగి
తిరుగాడుతున్న కొన్ని దేహాలు
ఏ బహుళ జాతి కంపెనీకో
ప్రచార కరపత్రాలౌతాయి!

కొన్ని లేత దేహాలు బరువైన బస్తాల కిందనో
లారీ టెర్ల కిందనో నలిగిపోతాయి!

కొన్ని యువ దేహాలు దేశాన్ని విడిచి
డాలరు తేనెలో పడిన ఈగలౌతాయి!

ఎక్కడో కొన్ని దేహాలు మాత్రం
తెగిపోతున్న శరీర భాగాల మధ్య
వారథులై మొలుస్తాయి
ధన్యజీవులౌతాయి!

- కిలపర్తి దాలినాయుడు
సెల్ : 9495783261

శ్రీయుత నేతాశ్రీల్లారా!
ఆయుత చండీయాగాలేం చూస్తారు గానీ
ఆకలి మండే యాగాలు చూద్దురు రండి!
అన్నదాత కర్తగా... అతడే సమిధగా...
అహరహం సాగే అఖండ
త్యాగయాగాల్ని చూడండి.
చూసేందుకు కనులు విప్పార్చండి.
ప్రతీ పంట క్షేత్రమూ నిత్యాగ్ని హోత్రమే.
యజ్ఞకర్త అంగాంగమూ క్షతగాత్రమే.
రుజు భేదమే లేని,
రుధిర, స్విదాశ్రు అభిషేకాలతో
చల్లారని కఠిన జఠరాగ్ని కీలలతో
నిరంతరమూ మండే యజ్ఞ గుండాన్ని చూడండి.
తన పూర్ణ ఓజస్సు, వయస్సులను
హవిస్సుగా మార్చినాడు కర్షక మహర్షి
యాగఫలం అందకుండానే
తానే అవుతున్నాడు పూర్ణాహుతి.
ఒక్కపరి తిలకించండి...
సిగ్గుతో ఒక్క క్షణం తలదించండి.

- డా. డివిజి శంకరరావు,
సెల్: 9440836931.

నమ్మకం కాని నమ్మకం
తెలిసిన మనిషే కదా అనుకొని
సెల్‌ఫోన్ ఇచ్చి దైవ దర్శనానికి వెళ్లిన అమ్మాయి
కొన్నాళ్ల తరువాత
‘అంతర్జాలంలో అమ్మాయి ఫొటోలు’
అంటూ బ్లాక్‌మెయిల్ కాల్ వచ్చింది!
...
జంతువులున్న అడవే కదా అనుకుని
అడవికి కాపలా కాయడం మానేసాడు గార్డు
కొన్నాళ్ల తరువాత
జంతువులన్నీ జనావాసాల్లోకి
మనుషులు ఎర్రచందనం అడవుల్లో
ప్రత్యక్షమయ్యారు!
...
స్వర్గానికి నిచ్చెన వేయడానికి
కష్ట్ఫలాన్ని ‘రివర్ గోల్డ్’లో మదుపుచేశాడు
కొనే్నళ్ల తరువాత
అది ‘రోల్డ్‌గోల్డ్’గా మారి ‘రివర్’లో మునిగిపోయింది!
...
వెనకబడిన దేశమని అనుకొని
జన్మభూమిని వదిలేసి
విదేశాలకెళ్లాడు మనిషి
అక్కడి వెనుకబడిన ప్రజలు వెంటబెట్టేసరికి
స్వదేశానికి తిరిగొచ్చాడు అయోమయంతో!

- బడబాగ్ని శంకరరాజు

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) ఎడిటర్, మెరుపు, ఆంధ్రభూమి దినపత్రిక, సెక్టర్-9, ఎం.వి.పి.కాలనీ, విశాఖపట్నం-17. అనే చిరునామాకు పంపండి.email: merupuvsp@andhrabhoomi.net ఇ-మెయల్‌కు పిడిఎఫ్‌లో పంపించవచ్చు.

email: merupuvsp@andhrabhoomi.net

- నల్లపాటి సురేంద్ర