ఉత్తర తెలంగాణ

సొంత ఇల్లు (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉంటున్నది అద్దె ఇల్లయినా..సొంత ఇంటి కన్నా.. ఎక్కువగా చూసుకునే శంకరయ్య గుండెపోటుతో ఆకస్మిక మరణానికి గురయ్యాడు. గట్టిగా ఏడుపులు విన్న ఇంటి యజమాని రామారావు ఖంగారు పడుతూ వచ్చాడు. ఆయనతో పాటు ఆయన భార్య కూడా ఆదుర్ధాగా ‘అయ్యో! ఎంత ఘోరం జరిగింది! చెట్టంత మనిషిని కాలం పొట్టన పెట్టుకుందని’ బాధపడుతూ పార్వతమ్మకు ధైర్యం చెప్పారు. అన్నీ అయ్యాక ‘శవాన్ని మాత్రం ఇక్కడ వుంచకండి! మా ఆచారం ఒప్పుకోదు. ఏ సత్రానికో తీసుకెళ్లండి’ అంటూ ఖచ్చితంగా చెప్పి అక్కడ్నుంచి కదిలారు.
‘అదేంటండీ! నిన్నటి దాకా ఇక్కడ తిరిగిన మనిషే కదా! శవంలా మారాక కొన్ని గంటలు కూడా ఈ నేలమీద పడుకునే అర్హత లేదా! ఇప్పుడే కదా! దేవుడిలాంటి మనిషని అన్నారు. దేవుడు ఇక్కడ వుండ కూడదా? కొడుకు ప్రసాద్ అడిగేశాడు కళ్లు తుడుచుకుంటూ! ‘నీకు తెలియదు ప్రసాద్! మా ఇంట్లో ఇలా శవానికి ఏర్పాట్లు అవీ చెయ్యకూడదు అంతే’ ఖచ్చితంగా చెప్పాడు రామారావు.
‘మరి మీ ఇంట్లో ఎవరైనా పోతే!’ అన్నాడు చిన్న కొడుకు కృష్ణ కోపంగా.
‘ఇది మా సొంత ఇల్లు. మేము ఏదైనా చేసకునే హక్కు మాకుంది’. అనవసరంగా వాదించక బాడీని ముందు తరలించండి అన్నాడు రామారావు కోపంగా.
చేసేదేం లేక అందరూ వౌనం వహించారు. అందరి మనసుల్లో బాధ. ఆవేశం పెల్లుబుకుతున్నా ఏం చేయలేని పరిస్థితి. కారణం వాళ్లు ఉండేది అద్దె ఇల్లు కనుక.
చివరికి శవాన్ని ఓ సత్రానికి తరలించారు. ఇంట్లో వాళ్లు, బంధువులు, కావలసిన వాళ్లు అందరూ సత్రానికి బయల్దేరారు.
పదేళ్ల నుండి ఆ ఇంట్లోనే అద్దెకుంటున్నారు శంకరయ్య కుటుంబం. కలెక్టర్ ఆఫీసులో గుమాస్తాగా పనిచేసి రిటైరయ్యాడు శంకరయ్య. ఆయన సంపాదనతోనే పిల్లలకి మంచి చదువులు చెప్పించాడు. పెళ్లిళ్లు జరిపించాడు. ఇవన్నీ చెయ్యగలిగాడు కానీ తను ఉండేందుకు, తనకంటూ ఒక సొంత ఇంటిని అమర్చుకోలేకపోయాడు. వచ్చినదంతా కుటుంబ ఖర్చులకే సరిపోయేది. పిల్లలు వృద్ధిలోకి వస్తే చాలు! అంటూ సంపాదించినదంతా పిల్లల చదువులకీ, వాళ్ల పెళ్లిళ్లకీ ఖర్చు పెట్టేశాడు.
‘పార్వతీ మన పిల్లలు కడతారు లేవే సొంత ఇల్లు. అప్పుడు మనిద్దరం హాయిగా కాలు మీద కాలేసుకుని కూర్చుందాం’ అంటూ గల గల నవ్వేసేవాడు శంకరయ్య.
పిల్లలకు మంచి వుద్యోగాలు వచ్చి ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్నారు. నాన్న కోరిక తీర్చాలని కొడుకులకూ ఉంది. కానీ ఇప్పుడు ఇల్లు కట్టడమంటే మాటల్లో పనికాదు. అపార్ట్‌మెంట్ తీసుకోవాలన్నా లక్షలతో పని. ఎంత లోన్ తీసుకున్నా స్వంత డబ్బు చేతిలో కొంతైనా వుంటే మంచిదని వాళ్ల వుద్ధేశం. అందుకే ఆగారు. దాన్ని శంకరయ్య కూడా సమర్థించాడు.
ఇప్పుడు మనిషి పోయాక ప్రాణం లేని శరీరంపైన ఈ ఆంక్షలు, ఆచారాలు, కట్టుబాట్లు, వాటిని వదిలించడం చాలా కష్టం అని అర్థమయింది పిల్లలకి.
ఇదంతా చూస్తున్న పార్వతమ్మా కుళ్లి కుళ్లి ఏడుస్తున్నది. ‘మీకు ఈ విధంగా జరగాలని రాసి వున్నదండీ. అంటూ కన్నీరు మున్నీరవుతున్నది.
తతంగాలన్నీ పూర్తి చేశాక..పాడెను లేవనెత్తారు. హరోం హర మహదేవ, శంభోశంకర అంటూ కొడుకులు, కొంత మంది బంధువులు, మిత్రులు అంతిమ యాత్రలో పాల్గొన్నారు.
అప్పుడు కూడా తల్లిదండ్రులు ఉన్న వాళ్లు కానీ, ఆడవాళ్లు కానీ అంతిమయాత్రలో పాల్గొనకూడదని ఆంక్షలు పెట్టారు.
దహన కార్యక్రమానికి వెళ్లిన వాళ్లంతా తిరిగి వచ్చాక స్నానాలు చేసి దీపం చూశారు. తరువాత భోజనాలు మొదలయ్యాయి. ఇంతలో ఇంటియజమాని రామారావు నుండి ప్రసాద్ మేనమామకు ఫోన్ వచ్చింది. ఫోన్‌లో మాట్లాడుతుంటేనే ఆయన మొహం వివర్ణమయింది.
‘ఏమయింది మామయ్యా!’ అంటూ ఆదుర్ధాగా ప్రసాద్, కృష్ణ అడిగారు.
‘ప్రసాదూ! మీ ఇంటి యజమాని ఫోన్ చేశాడు. అమ్మను వాళ్ల ఇంటికి తీసుకెళ్ల కూడదట. ఈ పది రోజులు పూర్తయి కర్మకాండలయ్యేంతవరకు ఆవిడను మీరే ఎవరైనా తీసుకెళ్లండి అన్నాడు రా’ అన్నాడు గోపాల రావు.
‘మామయ్యా! మనుషులు మరీ ఇంత దారుణంగా వుంటారా? అన్నారు. అన్నదమ్ములిద్దరూ బాధపడుతూ. అవునురా కొంత మంది మనుషుల కన్నా, ప్రాణాల కన్నా ఆచారలకే విలువనిస్తారు. ఆ విషయాలలో వాళ్లు రాజీపడరు. తమ ఇంటికి అరిష్టం చుట్టుకోకూడదు అని అనుకుంటారు వాళ్లు బాగుండాలి అనుకుంటారే కానీ ఎదుటి వాళ్ల ఇబ్బందులను పట్టించుకోరు’ అన్నాడు గోపాల రావు అనుభవాలతో పండిన వయసుతో. మనుషులకన్నా పశువులూ పక్షులే నయం’! వాటిల్లో ఏదైనా చనిపోతే అరచి గోలపెట్టి అన్నింటినీ పిలుచుకుంటాయి. వాటి భాషలో ఏడుస్తాయి. వాటికన్నా హీనంగా తయారయ్యాడు మనిషి.
సరే మామయ్యా! ఇప్పుడేం చేద్దాం! అన్నాడు ప్రసాద్. ‘ఏం చెద్దాంరా! మీ అమ్మను ఎవరింటికైనా తీసుకెళ్లమని అడగడం, వాళ్లు కాదేనలేక ఇబ్బంది పడడం, మనం అడిగి లేదనిపించుకోవడం కంటే వేరే మార్గం ఆలోచిద్దాం అన్నాడు’ ఆయన.
చివరికి ఆవిడని ఆ సత్రంలోనే ఓ రూం తీసుకుని అక్కడే ఉంచడానికి నిర్ణయించారు.
ఏ రోజూ భర్తను వదిలి పరాయి ఇంటికి కూడా వెళ్లని పార్వతమ్మ మొట్టమొదటిసారిగా బయట ఉండాల్సి వచ్చింది.
‘పచ్చని చెట్టులా వుంటావమ్మా! పొద్దున లేస్తే నీ మొహం చూస్తే అంతా మంచే జరుగుతుందని’ పొగిడిన నోళ్లే ఇప్పుడు వౌనం వహించాయి. ఎవరి దోవన వాళ్లు వెళ్లిపోయారు.
శుభకార్యాలకు నాలుగు రోజులు ముందుగా వచ్చి నాలుగు రోజుల తర్వాత వెళ్లే వాళ్లు. మనిషి కష్టాలలో వున్నప్పుడు ఒంటరిని చేసి వదిలి వెళ్తారు.
వారం రోజులకే పార్వతమ్మ జీవచ్ఛవంలా తయారయింది. ‘అమ్మా! ఇలా అన్నం నీళ్లు ముట్టుకోకుండా ఏడుస్తూ కూర్చుంటే నీ ఆరోగ్యం ఏమవుతుంది’ అంటూ తల్లిని దగ్గరకు తీసుకుంది మాధవి.
ఈ పరిస్థితులలో ఉన్న అమ్మను చూశాక సొంత ఇల్లు అనేది ఎంత అవసరమో కొడుకులిద్దరికే అర్థం అయింది. అమ్మ పరిస్థితి నాన్నలా కాకూడదని గట్టి నిర్ణయానికొచ్చారు!

- పాతూరి అన్నపూర్ణ
నెల్లూరు, సెల్.నం.9490230939

కథ

పురస్కారమా.. నీకో నమస్కారం

జంబులింగం, బోడిలింగం బాల్యమిత్రులు, బాల్య మిత్రులు. ఏదో తంటాలు పడి పట్ట్భద్రులయ్యారు. బతుకు దెరువుకోసం ఆఫీసుల మెట్లు లెక్కపెట్టలేక విసిగివేసారి అరిగిన చెప్పులను ముందేసుకొని లబోదిబోమని సొంతంగా ఏదన్నా చేయాలన్న ఉద్దేశంతో ఓ నిర్ణయానికి వచ్చారు. ధనవేటలో వారు వాడిన తూటా నెంబరు -1 డింగ్‌డాంగ్ సాహితీ సంస్థ. అధ్యక్షుడుగా జంబులింగం, ప్రధాన కార్యదర్శిగా బోడిలింగం. సాహిత్యాభిమానం తక్కువైనా బిల్డప్పులేమి తక్కువకాదు. ఫలితంగా ప్రతిభ అనే ఎలక్ట్రిసిటి తక్కువైనా కీర్తి అనే పబ్లిసిటి పెరిగిపోయింది. డింగ్‌డాంగ్ సాహితీ పురస్కారాలకు ఆహ్వానము పలుకుతూ ప్రముఖ దినపత్రికలలో వార్త వెలువడింది. మరుసటి రోజుకల్లా కవికాకులు వీరి ముందు వాలిపోయాయి. జంబులింగం వారి వివరాలను నోట్ చేసుకొంటున్నాడు.
ఒక కవి గారితో
‘‘అయ్యా తమరి నామధేయం’’ అడిగాడు జంబులింగం.
‘‘అ ఆ లు రావు’’
‘‘సర్లే నీకు అ ఆ లు రాకపోతే మాకేంటి లకారం ఉంది కదా. మాకది చాలులే.
అన్నాడు’’ జంబులింగం.
‘‘అయ్యా తమరు పొరబడ్డారు. నాపేరే అ ఆ లరావు’’.
‘‘అదేం పేరు విడ్డూరంగా’’ అన్నాడు బోడిలింగం.
నాపేరు అరటిపండు ఆంజనేయులు రావు. షార్ట్ కట్‌లో అందరూ అలా పిలుస్తారు.
‘‘సర్లే మీరు ఏమి రాసారు’’ అడిగాడు జంబులింగం.
‘‘ఓ పది రాసా’’ గొప్పగా చెప్పాడు ఆరావు.
‘‘ఏంటి పుస్తకాలా (అరకొర పుస్తకాలు రాసిన కవులను సత్కరించే వీరికి పది పుస్తకాల రచయిత దొరికాడన్న సంబ్రమంతో)’’ అడిగాడు బోడిలింగం.
‘‘కాదు కవితలు అన్నాడు’’ అ ఆలురావు.
‘‘అబ్బో చాలా ఎక్కువ రాసారే!
ఇప్పటికి మీకు చాలా ఆలస్యమైనది పురస్కారము అందుకోవడానికి’’ అన్నాడు జంబులింగం. ‘‘అవును అండి నాకు చాలా ఆలస్యముగా తెలిసింది దిగులుగా’’ అన్నాడు అ ఆలురావు. 10 కవితలకే పెద్ద రైటరు అయిపోయినట్లు ఆ ఫోజు చూడు అని మనసులో అనుకొని జంబులింగం... అయ్యా తమరి కవితలు పేర్లు చెబుతారా అన్నాడు.
నీ మొహం మండా
రాఎట్టికోడతా
తంతాజాగ్రత్త
‘‘అదేమిటండి బాబు మిమ్మల్ని నేనేమన్నానని (మనసులో అనుకొన్నది గ్రహించే విద్య వీడికేమన్నా తెలుసా అని మనసులో భయపడుతూ)’’ అన్నాడు జంబులింగం.
‘‘అపార్ధం చేసుకోబోకండి. అవి నా కవితలు పేర్లు అన్నాడు’’ అ ఆలురావు.
‘‘అమ్మయ్యా బతికించారు. భయపడి చచ్చాను. సర్లే మీ రచనతో మాకేమి పనిగాని మీకే పురస్కారం కావాలి.
ఎన్ని రకాలు ఉన్నాయి ఆశ్చర్యంగా అడిగాడు’’ అ ఆలురావు.
‘‘పిండికొద్దీ రొట్టె’’ అన్నాడు మర్మగర్బంగా జంబులింగం.
‘‘వివరంగా చెబుతారా’’ అన్నాడు అ ఆలురావు.
‘‘మేమున్నదే అందుకు అంటూ ఓ లిస్టు తీసాడు’’ బోడిలింగం.
5వేలుకు ఇచ్చే పురస్కారాలు
కవికాకి, కవిజంబులింగం, కవిజీమ్బుతం, కవిగార్ధబం, కవిపాషణం
‘‘ఆగండాగండి నాకు కవి బోషాణం కావాలి’’ అన్నాడు అ ఆలురావు.
‘‘కవిబోషాణమా ఎందుకు ఇది కావాలనుకుంటున్నారు’’ అడిగాడు జంబులింగం.
‘‘కవిబోషాణమ్ లాంటివాడు, కవితారత్నాలను తీసి పంచిపెడతాడు’’ అన్నాడు అ ఆలురావు.
ఒకరి మొఖం ఒకరు చూసుకొన్నారు జంబులింగం, బోడిలింగం. ఇందులో ఇంత అర్ధముందా అన్నట్లుగా.
‘‘అయ్యా ఆ బిరుదుకి 10వేలు’’ అన్నాడు బోడిలింగం.
‘‘మరీ ఎక్కువగా అడుగుతున్నారు’’ అన్నాడు అ ఆలురావు.
‘‘ఆ బిరుదుకి ఎంత విలువో మాకన్నా మీకే బాగా తెలుసు’’ అన్నాడు బోడిలింగం.
డబ్బుకట్టి రసీదు తీసుకొని వెళ్ళిపోయాడు అ ఆలురావు.
సాయంత్రంలోపు ఓ 50మంది వచ్చారు.
రాత్రి ఇరువురు డబ్బులెక్కపుడుతూ ఇక ఈ ఉగాది నుంచి దసరా వరకూ మన జీవనానికి తిరుగులేదు అనుకొన్నారు.
‘‘ఈమధ్య సాహిత్య సభలకు జనం పెద్దగా రావడంలేదు’’ అన్నాడు జంబులింగం.
‘‘రాజకీయ నాయకుల మీటింగులకు తోలినట్లు లారీలలో జనాలను తెచ్చి సారా, బిర్యానీ పొట్లాలను ఇద్దామా’’ అన్నాడు బోడిలింగం.
‘‘ఖర్చు ఎక్కువ అవుతుంది. ప్రార్ధనా గీతానికి బదులు ఐటం సాంగ్ పెడితే చాలు జనాలకు కూర్చోవడానికి కూడా ఖాళీ ఉండదు’’ అన్నాడు జంబులింగం.
శాలువాలకి, పూలమాలలకి, సన్మాన పత్రానికి ఇలా ఓ రెండుముడు వేలు ఖర్చుపెట్టి మిగిలింది గుటకాయస్వాహా చేశారు.
ఇలా అడ్డదారిలో పేరుకు పాకులడే కవికాకులున్నంతకాలం ఇలాంటి డింగ్ డాంగ్ సంస్థలు ఎన్నో బ్రతికిపోతాయ్.

- ఘాలి లలిత
చరవాణి : 7386362476

పుస్తక సమీక్ష

‘కోట్ల’ కవిత్వం..
స్వాభిమాన భరితం!
పేజీలు: 183, వెల : 150/-
ప్రతులకు: కోట్ల వెంకటేశ్వర రెడ్డి
4-31/1/2, భగీరథ కాలనీ
మహబూబ్‌నగర్
సెల్.నం.9440233261

‘గుండె కింద తడి’ గ్రంథంతో సాహితీ లోకంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని పదిలపరుచుకున్న కవి కోట్ల వెంకటేశ్వర రెడ్డి. తన ఎనిమిదో పుస్తకంగా ‘బ్రేకింగ్ వ్యూస్’ను పాఠకులకు అందించారు. తెలంగాణ మట్టి వాసనల గుబాళింపుతో రాసిన కవితలు వలసలకు నెలవైన పాలమూరు జిల్లా కార్మికుల వ్యథలను, ప్రతిబింభించే కవితలు, ప్రపంచీకణ వెతలను ఏకరువుపెట్టే కవితలు ఇందులో ఉన్నాయి..మనుషులను కలపడం, మేల్కొల్పడం, చైతన్యపరచడం వంటి కవితలూ వున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం..ఉద్యమ ఫలితాన్ని కీర్తిస్తూ రాసిన రచనలు కూడా ఈ గ్రంథంలో చోటు చేసుకున్నాయి.
ఎప్పుడో ఒకప్పుడు రాలిపోక తప్పదు..పువ్వై వికసించాలని, పరిమళమై విస్తరించాలన్న కోట్ల గారి కవిత్వపు సంతకాలు ఈ గ్రంథంలో కన్పిస్తాయి.
ఆధునిక, సాంకేతిక ప్రగతి పుణ్యమా అని..ముట్టీమే దునియా మునిగిపోయిందనీ..కొత్త కోడలులా స్మార్ట్ ఫోనొచ్చి..టివి ఆధిపత్యానికి గండికొట్టిన వైనాన్ని కవిత్వీకరించారు.
‘ఇది తెలంగాణ మట్టి’ కవితలో కవి తెలంగాణ మట్టిని అభివర్ణించడంలో స్వాభిమానం తొణికిసలాడింది..మల్లెపువ్వుల్నే కాదు..తంగేడు పూలనైనా..తలకెత్తుకునే ఆత్మీయ అచ్చ తెనుగు మట్టిగా..ఆవిష్కరించిన తీరు బాగుంది.
‘వేరుపడిన తర్వాత కూడా..ఏమిటీ వెన్నుపోటు చతురత?’ అంటూ ‘పాత కాపు కన్నీళ్లు’లో ప్రశ్నించారు. ఇప్పుడు తెలంగాణ..ఎగిసి పడుతున్న చైతన్య కెరటమనీ..హైదరాబాద్..ఓ పురాతన సౌందర్య రాశి అనీ..నీ నీడే దాని వైభవానికి అంటిన చెరగని మకిలి అనీ..నీతులు వల్లిస్తూ గోతులు తీయొద్దని రెండు రాష్ట్రాలుగా విడిపోయాక కూడా వలస పాలకులు పెత్తనం చెలాయించడంపై ధ్వజమెత్తారు. ట్యాంకుబండ్‌పై కొలువుదీరిన పెద్దల విగ్రహాలకు దండం పెట్టి..పుట్టింటికి వెంటనే సాగనంపుదామని ‘ఖాళీ చేయాల్సిందే’ కవితలో కవి పిలుపునిచ్చారు. మా నగరానికి మీ హైటెక్ నగలొద్దు.. మీ ఒగలొద్దు.. మా మొగలాయి నగరం మాకు చాలంటూ ఇంకో కవితలో నినదించారు.
ప్రేమ ఎవరిదైతేనేమి..అది రెండు హృదయాల నిశ్శబ్ధ సంభాషణ అనీ..ప్రేమ ఒక అవ్యక్త అనుభూతి అనీ..దాన్ని అక్షరాలతో వాచ్యం చెయ్యొద్దని హితవు పలికారు.
‘పరమార్థం’ కవితలో..కష్ట్ఫేలి! శ్రమయేవజయతే! ఇవే సుఖ జీవన సూత్రాలని తేల్చిచెప్పారు.
గాయమొక జీవితానుభమమనీ.. కాలానిదేముంది.. తన దారిన తాను కరిగిపోతనే ఉంటది! జీవించాలంటే..మనం కాలానికెదురీదాలని సూచించారు.
అతను రూపంలో నరుడు..ఈనాటి కవులకు ఇంకా స్పూర్తినిచ్చే నారాయణుడని సినారెను ఒక కవితలో అభివర్ణించారు.
‘దుఃఖమొక ఊబి’ కవితలో కవి వెలుబుచ్చిన భావాలు తాత్త్వికతను మోసుకొచ్చాయి. మాటకూ చేతకూ అభేదం పాటించి జీవితాంతం లోకంతో గొడవపడిన మనిషి కాళోజీకి ఓ కవితలో నివాళి ప్రకటించారు.
పాలమూరు కార్మికుల కష్టాలను ఏకరువు పెడుతూ..పాలమూరింట..కరువు మొండి సుట్టమై కూసుందని వాపోయారు. తిరుపతి ప్రపంచ తెలుగు మహా సభలకు వెళ్లిన తెలంగాణ కవులు, రచయితలపై తమ కలాన్ని ఎక్కు పెడుతూ ‘సప్తగిరుల సభల నానీల’ శీర్షికన నానీలు రాశారు.
శాలువాకూ..మెమొంటోకే..తెలంగాణ తాకట్టా..ఏడు కొండల వాడా! అంటూ వ్యాఖ్యానించారు.
‘దేశమంటే మనిషి కాదోయ్’ కవితలో కవి కోట్ల భావోద్వేగంతో రాసిన పంక్తులు ఆలోచనాత్మకంగా ఉన్నాయి. స్వపరిపాలనలో రాష్ట్రం ప్రగతి పథాన పరుగులు తీయడానికి..బంగారు తెలంగాణ కోసం పాలకులు మరింత సమర్థంగా పని చేసేందుకు.. జనాన్ని చైతన్యపరిచేలా కోట్ల తమ కవిత్వాన్ని పండించాలని కోరుకుందాం.

- సాన్వి, కరీంనగర్, సెల్.నం.9440525544

సాహిత్య సమాచారం

ఆచార్య కడారు వీరారెడ్డి గ్రంథావిష్కరణ 11న
తేజ ఆర్ట్ క్రియేషన్స్ నిర్వహణలో ఆచార్య కడారు వీరారెడ్డి దీర్ఘకవిత ‘అందమా... నిను వర్ణింపతరమా!’ ఆవిష్కరణ కార్యక్రమం ఈ నెల 11న హైదరాబాద్‌లోని తెలంగాణ సారస్వత పరిషత్తులో జరగనుంది. ఈ గ్రంథాన్ని డా. సి.నారాయణరెడ్డి ఆవిష్కరిస్తారు. ప్రభుత్వ సలహాదారు డా. కె.వి.రమణాచారి సభకు అధ్యక్షత వహిస్తారు. ఈ సందర్భంగా ఎం.వి.నరసింహారెడ్డి, బైస దేవదాసు, దాస్యం సేనాధిపతి, గిరిజా మనోహర్ బాబు, కడారి అనంతరెడ్డిలకు విశిష్ట పురస్కారాలు అందజేయనున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు.

మనోగీతికలు

తెలుగు మాధుర్యం
పలుకు రాగమధురం నా తెలుగు భాష వైనము
తేనెలూరు తియ్యదనం నాదు తెలుగు మాధుర్యం
అన్నయయ్య గొంతులోన భక్తి భావ యుక్తమై
త్యాగయ్యా గళములోన తారాడు నాదమై
నన్నయ్య కలములోన ఆదికావ్య కిరణమై
శ్రీనాథుని కలము నందు శృంగార నైషధమై
వేమన్న పలుకు నీటి తేట తెలుగు పదములై
తిక్కన్న కలము నందు తీపి సుధా ఝరులై
పోతన్న కవితలోన మధుర మధుర భావనలై
ముక్కు తిమ్మనార్యు నోట ముద్దు ముద్దు పలుకులై
పాల్కూరికి సోమనాథ పదగతుల లాహిరి
విశ్వనాథ కవితలతా విరిసిన పుతావి
అల్లసాని అల్లికలా పదకవితల వేణి
కందుకూరి గురజాడ గద్యరచన ప్రవాహినీ
ఆయని కోయిల కూసే కమ్మని మృదుగానము
నింగిలోన విరిసిన శశికాంతుల వైనము
దేశ భాషలందు లెస్స తేట తెలుగు భాష
లలిత లలిత మృదు పదముల పదకోమల మీ భాష

- దాసరి శ్రీనివాస్ గౌడ్
మందమర్రి, ఆదిలాబాద్ జిల్లా
సెల్.నం.9701781696

రూపాలు వేరైనా..
ప్రతి ఇంటి గోడలపై
ప్రభుత్వ కార్యాలయాల్లోనూ
ఆఫీసు ఆవరణలలో
అందరి చేతి మణికట్టుపై
అలంకారమై భాసిల్లుతూ..
రూపాలు వేరైనా..
నీ కర్తవ్యం ఒక్కటే అన్పిస్తూ..
నిమిషాలను గంటలుగా
గంటలను రోజులుగా
రోజులను యుగాలుగా
మారుస్తూ.. మలుస్తూ..
మూడు ముళ్లనూ ఒక దాని వెనుక ఒకటిగా
అంకెలపై నడిపిస్తూ.. పగలు రేయిలను తెలుపుతూ
కాలాన్ని పరుగులెత్తిస్తూ..
లోకాన్ని పరుగులు తీయిస్తూ..
వారి వారి విధి నిర్వహణలు
సమయానుకూలంగా తెలియజేస్తూ..
సక్రమంగా నిర్వర్తించేట్టు చేయిస్తూ..
సమయపాలన నేర్పుతూ నడిపించగలవు..
కానీ.. గడిచిన కాలం తిరిగి పొందలేము
మానవునికి హృదయం ఎంత ముఖ్యమో?
జగానికి, కాలానికి నీ పాత్ర అంత ముఖ్యమే!
గుండె ఆగిననాడు మనిషి మనుగడ ఆగినట్లే..
నువ్వు ఆగిననాడు లోకమూ స్తంభించినట్లే!!

- పోపూరి మాధవీలత
హైదరాబాద్, సెల్.నం.8125115667

మా నాన్న
నాన్నంటే నాకిష్టం
ఎందుకంటే
నాన్నంటే ఆకాశం
అన్నివేళల్లో రక్షణ గొడుగై
నా జీవితమంతా ఆవరించి ఉన్నాడు
వేల తారకలనయనాలతో
అనుక్షణం నావైపే శ్రద్ధగా చూస్తున్నాడు
నేను తనను చూస్తున్నా చూడకున్నా
తన చూపుల్ని నాపై నుండి తిప్పుకోవడం లేదు
నానడకను, నడతను ఎంత నిశితంగా గమనిస్తున్నాడో!
నేనెక్కడికి వెళ్లినా తను నావెంటే
నేనలా నిద్రలేవగానే
నాకోసం బాల భాస్కరున్ని పంపించి
నాలోని ఉత్సాహానికూపిరులూదడం
అంతకంటే ఎంతో ముందుగానే
కర్తవ్యాన్ని మరవొద్దనే సందేశాన్ని
కర్మ సాక్షితో పంపించడం
నాన్నకే సాధ్యమయ్యింది
చందమామను నా కోసం పంపిస్తూ
చల్లని వెనె్నలను ప్రేమగా నాపై కురిపించడం
అంతకంటే ఎంతో ముందుగానే
వెనె్నలలోని అమృతాన్ని ఆస్వాదించే
అంతరంగాన్ని ఆప్యాయంగా అనుగ్రహించడం
నాన్నకే చెల్లింది
అంతెందుకు
సంతోషాల ‘చిరుజల్లు’లతో పలకరించినా
అంతులేని ఆశీస్సులను నిరంతరంగా వర్షించినా
ఆనంద‘వాహని’లో అనునిత్యం ఓలలాడించినా
జీవితాన్ని సప్తవర్ణాల ‘హరివిల్లు’లతో ఆవిష్కరించినా
అదంతా ‘మానాన్న’ చలవే
నా వ్యక్తిత్వానికి వనె్నలు దిద్దడం
మనస్తత్వానికి మమతల సుగంధాల్ని అద్దడం
నాన్న కెంతిష్టమో!
జీవితానికి నిజమైన సార్థకత
నాన్నతీర్చిన శిల్పంగా నిలిచినప్పుడే కదా!

- ఎస్.ఎస్.రాజు
సెల్.నం.9963499137

ఓ నేస్తమా!

ఓ..నేస్తమా
నా..స్నేహమా!
పరిమళాలు వెదజల్లే..
రంగు రంగుల
అందమైన
పూవ్వులనిచ్చిన
పూల రెమ్మలు రాలాలి
నేల తల్లిని చేరాలి
పూల చెట్టును
వీడాలి..
ఓ..బంధమా
నా..ప్రాణమా!
నీలాకాశమున
కదిలె మేఘం
ఎంత ఉరికినా..
కరగాల్సిందే
చివరికి వర్షపు
చినుకులై
కురవాల్సిందే
పంట పొలాలని
తాకాల్సిందే
పచ్చదనాన్ని
పెంచాల్సిందే!!

- కె.శ్యామ్
ఆరుగొండ
సెల్. 9000011435

చెల్లీ..!

ఎక్కడ చెల్లీ నీ ప్రాణం
ఎక్కడుంది నీ ఆయువు?
ఏ వూరి పొలిమేరలో
ఏ రోడ్డు ప్రయాణంలో
ఏ రథసారథి చేతిలో
నీ మరణ రహస్యం?
ఆడపిల్లలా
ఎందుకు పుట్టానని
బాధపడుతున్నావా?
కుళ్లు కుతంత్రము తెలియని
ఓ కుసుమ కోమలీ..!
అడుగడుగునా
పల్లేర్లుంటాయి
కంటపడకు తల్లీ!
పువ్వులని భ్రమచెందకు
సుకుమారపు చేతులతో
తడుమకు సుమా!
పువ్వులు కావవి
ప్లాస్టిక్ పరిమళాలు
నవ్వకు తల్లీ!
కనె్నత్తి చూడకు మళ్లీ!
కనబడే నవ్వుల్లో విషం దాగుంది చెల్లీ!

- హనుమాండ్ల రమాదేవి
బెల్లంపల్లి
ఆదిలాబాద్ జిల్లా

email : merupuknr@andhrabhoomi.net

ఈ శీర్షికకు కవితలు, కథలు, సాహితీ వ్యాసాలు, కొత్త పుస్తకాల సమీక్ష/పరిచయం, కార్టూన్లు ఈ క్రింది చిరునామాకు లేదా ఈ-మెయల్‌కు పంపండి.

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, జగిత్యాల రోడ్, కరీంనగర్. merupuknr@andhrabhoomi.net

నిర్వహణ : దాస్యం సేనాధిపతి dasyamsenadhipathi10@gmail.com

- పాతూరి అన్నపూర్ణ