దక్షిన తెలంగాణ

ముందడుగు (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అబ్బబ్బ ఏం పనిమనుషులో ఏమిటో? సరిగ్గా టైంకు రానేరాదు. వేగలేక పోతున్నాననుకోండి’ అంటూ ఆధునికతకు అద్దం పట్టేలా వున్న ఆశ అప్పుడే లోపలికి వచ్చింది. ‘అదేం! మీ పనిమనిషి పని శ్రద్ధగా చేస్తుందిగా అన్న లక్ష్మిమాటలకు’ ఔనండీ చెయ్యకేం చేస్తుంది. పిల్లల్ని చదివించాలిగా. భర్త అనుమానంతో సతాయిస్తున్నాడట రోజు. ఫోనే్లండి వాళ్ల గురించి మనకెందుకు. ‘సరే గానీ లక్ష్మక్కా మన పక్కింటి వాటాలోకి దిగిన రమణికి ఉద్యోగం కావాలట. మీ ఆయనకు పలుకుబడి వుందిగా? ఏదైనా చూడమని చెప్పకూడదా? అంది ఆశ. ‘రమణికి ఉద్యోగమా ఎర్రగా బుర్రగా వుందిగా ఇంకా పెళ్లెందుకు కాలేదో? ఏం పాడుపని చేసిందో ఎవరికి తెలుసు. మొన్న మా ఆయన్ను కలిసిందిలే. దాన్తో మాట్లాడితే ఉరేసుకుంటానని మా ఆయనతో చెప్పా. ఆశా మీ ఆయన జాగ్రత్త ముందే హీరోలా ఉంటాడు’ ఆవేశంగా రంగుకళ్లద్దాల్లోంచి చూస్తూ అంది.
లక్ష్మిగారూ ఇంట్లోనే ఉండటానికి సాయంగా మనిషి కావాలన్నారుగా, ఇదిగోండి ఈ అమ్మాయిది మా ఊరే. దిక్కులేనిది. తల్లీదండ్రీపోయారు. అంటూ లోనికి అడుగుపెట్టింది రజని. ‘మరీ చిన్నది. ఏం పనిచేయగలదు’. సర్లే పోనీ నెమ్మదిగా అలవాటు చేసుకుంటుంది అని రజనీతో అంటూనే ‘ఏమ్మా! నీకే పన్లు చెయ్యవచ్చు. డబ్బులెంతివ్వాలి అని లక్ష్మి అనడంతోనే ఆ అమ్మాయి ‘అమ్మగోరు పైసలేమద్దు నాకు..నాకు..అంటూ నాన్చసాగింది. ఏం కావాలేంటి మంచిబట్టలు అన్నీ కొనిస్తాలే ఇల్లు జాగ్రత్తగా చూడాలి. సరేనా అంటూ’ యాదమ్మా! ఈ అమ్మాయికి ఏదోపని చేయడం అలవాటు చెయ్యి ముందు. అని యాదమ్మకు పనిపురమాయించింది.
‘యాదమ్మ అని మావారి ఆఫీసులో పనే్జస్తుంది. పాపం ఒంటరి ఆడది’. నాకెప్పుడైనా పని బాగావున్నప్పుడు వస్తుంది నా దగ్గరికి. అని అంటూనే యాదమ్మా అందరికీ కూల్‌డ్రింక్స్ ఇవ్వవా అని పిలిచింది లక్ష్మి. కూల్ డ్రింక్స్ అందించిన యాదమ్మను చూడగానే మాధురి మొఖం వెలవెలబోయింది. పనుందంటూ కూల్‌డ్రింక్స్ తీసుకోమన్నా తీసుకోకుండానే పోయింది. వారిస్తున్న ఆశతో’ వెళ్లనీ ఆశా. మాధురిని కొడుకు పెళ్లి కుదిరిందిగా. 30 లక్షల కట్నం, కారు, 10 తులాల బంగారం పెళ్లి వచ్చే నెల 2న అనుకుంటా?’ అంది వర్ధనమ్మ మాకెవరీ తెలీదని ఆశ, రజనీలు ఒకే సారి అన్నారు. ఆశ లేస్తూ ఇంక ‘లక్ష్మక్కా రేపటి సమావేశానికి నువ్వే అధ్యక్షురాలివి. అయినా మనం చేసేదేముందిలే. కాస్సేపు కూర్చుని భోజనాలు చేస్తే అయిపాయె. వంటలవీ బాగా ఉండాలి. ఏర్పాట్లు చూసుకో. అని చెప్పుతూ ఇద్దరూ వెళ్లిపోయారు. ‘రేపేం మాట్లాడతావమ్మా లక్ష్మీ అన్న అత్తగారితో’ దగాపడ్డ బడుగు జీవుల గురించి, నిరుద్యోగం స్ర్తిల వెనుకబాటుతనం, స్ర్తిలకు జరుగుతున్న అన్యాయాలు. వాటి గురించి మాట్లాడకపోతే ఏమవుతుంది..అన్న అత్తగారి మాటలకు విస్తుపోయింది. ‘అదేంటత్తయ్యా! స్ర్తికి రక్షణ కొరకు ఎన్ని చట్టాలొచ్చాయని అందరికీ తెలియాలి కదా!’ ‘ఔను లక్ష్మీ స్పీచ్‌లలో సమస్యలు సమసిపోతాయా? ఏం చేయాలి మరి అన్న లక్ష్మిని తేరిపార చూసింది. వర్ధనమ్మ. ‘లక్ష్మీ ఈ చట్టాలు ఎప్పటినుండో వున్నాయి. వాటిని ఉపయోగించుకొనే వారెందరు. మీ స్నేహితులందరి మాటలు విన్నాక నీతో మాట్లాడాలనిపిస్తుంది. నీకు కష్టమని తోచినా నే చెప్పక తప్పదు అన్న దృఢమైన మాటలకు లక్ష్మి ‘సరేనంటూ తలూపింది. ఆమె భర్తనే నీకు తెలుసా? భర్తతో ఇది తప్పు అని చెప్పక దోషాన్ని ఆమెపైనే రుద్దింది. ఏ చట్టాల పరిధిలోనిది ఈ వేధింపు. ఒక సారి ఆలోచించు అంది.
అయితే అత్తయ్యా నేనేం చెయ్యాలి’. రేపు వీటి గురించి మీటింగులో ఎలా చెప్పగలను? అన్న లక్ష్మిని నవ్వుతూ చూస్తున్న భర్త మాట్లాడవద్దని తల్లి చెప్పేది వినమని సైగచేసాడు. ఆ పసిపిల్లను నీ అవసరానికి తెప్పించుకున్నావే. ఆ అమ్మాయి చెప్పేది విన్నావా? ఆ అమ్మాయి మనసులో కోరిక తెలుసా నీకు చదువుకోవాలని.’నాకు ఆ అమ్మాయి కోరికతో ఏం పని అత్తయ్యా! ఆ పిల్ల ఏదో నాల్రోజులుండి వెళ్లిపోతుంది. ‘సరే లక్ష్మీ దిక్కులేనిది ఆ చదువేదో నువ్వే చెప్పించరాదూ’. పనిచేస్తూ చదువుకుంటుంది. యాదమ్మ కూతురు ప్రేమించి మోసపోయింది కదా! నీ స్నేహితురాలు మాధురి కొడుకే వాడు. వచ్చేనెలేగా పెళ్లి. నువ్వు చక్కగా ఆలోచిస్తావు. చదువుకున్నావు. కానీ ఏమీ పట్టనట్టుంటావెందుకు? ‘నేనేమైనా సంఘసంస్కర్తనా ఏమిటి?’ ‘తప్పుచేసేవారిని నిలదీయగలగాలి’ వర్దనమ్మ గట్టిగా ఊపిరితీసుకుంది. ‘మరి అత్తయ్యా! నేను ఇన్ని సమస్యల్ని ఎలా తీర్చగలను? తప్పులు చేసేవాళ్లు చేయకుండా’ అని బేలగా అన్న కోడల్ని జాలిగా చూసింది వర్దనమ్మ. వాళ్లతో మాట కలిపి చూడు. నీ చుట్టూ ఉన్న సమస్యల గురించి తెలుసుకుని వారికి మనస్సు నొచ్చుకోకుండా వాళ్ల సమస్యల మూలాలను తెలుసుకొని తోటి స్ర్తిల కన్నీళ్లను తుడిచే స్నేహహస్తం కావాలి నువ్వు. నీకళ్లముందు జరిగే అన్యాయాలపై ద్వజం ఎత్తు. అందరూ మారరు. ఒక్కమారినా సరే. ఎవరో ఒకరు ముందడుగు వేయాలి. అవి నీ అడుగులే కావాలంటున్నాను. అన్న అత్తగారి మాటలకు నిజమే నేనే ఎందుకు ముందడుగు వేసి అందరికీ కరదీపికను కావాలి. అని అనుకున్న లక్ష్మికి అత్తగారు గీతోపదేశం చేస్తున్న కృష్ణునిలా కనిపించింది. అమ్మ మాటలు శ్రీరామ రక్ష అన్న భర్త మాటల్లో నీవెనుక నేనున్నానన్న భరోసా కనిపించింది లక్ష్మి. రేపటి ప్రణాళికకై ఆలోచించడం మొదలుపెట్టింది. ఉషోదయపు వెలుగులు చిమ్మచీకట్లను పారదోలి నెమ్మదిగా జగమంతా వ్యాపించాయి.

- శ్రీమతి బి.హరిరమణ
నిజామాబాద్
సెల్.నం.9490148904

పుస్తక సమీక్ష

సోమిశెట్టి భావాలు
జ్వలించిన రాగాలు
పేజీలు : 108, వెల : 120/-
ప్రతులకు:
సోమిశెట్టి నరసింహారావు
ఫ్లాట్ నం : 1502, జి.బ్లాక్
సేథిమ్యాక్స్ రాయల్
సెక్టార్-76, నొయిడా,
ఉత్తరప్రదేశ్
సెల్.నం.09958960068
హృదయానికి, మనస్సుకి తాకేదే కవిత్వం! అనుభూతి కొన్నిసార్లు కవిత్వమైతే..మరి కొన్నిసార్లు ఆగ్రహం కవిత్వమవుతుంది. కవిత్వం పాఠకులను ఆలోచింపజేయాలి.. లోక పరిశీలనతో పాటు.. జీవితానుభవాల్లోంచి ఆవిర్భవించే కవిత్వం మరింత గాఢంగా రూపుదిద్దుకుంటుంది.. ఇదే క్రమంలో.. కవయిత్రి సోమిశెట్టి స్వర్ణలత తన మనసులోని భావాలకు అక్షర రూపమిస్తూ ‘జ్వలించిన రాగాలు’ గ్రంథాన్ని వెలువరించారు. నల్లగొండ జిల్లాకు చెందిన ఆమె వృత్తిరీత్యా ఉత్తర ప్రదేశ్‌లోని నొయిడాలో ఉంటున్నారు. 2012లో సాహితీ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆమె అనతి కాలంలోనే కవయిత్రిగా తెలుగు పాఠకుల హృదయాల్లో ఓ ప్రత్యేక స్థానాన్ని పదిలపరుచుకున్నారు. ‘శ్రీ స్వర్ణకిరణాలు’ ‘పూలపిట్ట’ గ్రంథాలతో కవయిత్రిగా స్థిరపడిన ఆమె ఇప్పుడు ప్రకటిస్తున్న ‘జ్వలించిన రాగాలు’ కవితా సంపుటిలో..కొత్తదనం, ఆవేశం, ధ్వని ముప్పేటా అల్లుకుపోయిన కవితలు మనకు కనిపిస్తాయి..్భవ కవిత్వంతో పాటు..్భవోద్వేగ కవితలూ ఇందులో చోటు చేసుకున్నాయి..ఆమె కలం నుండి జాలువారిన కవితా పంక్తులు ‘వానతో వసంతమై’ మైమరిపిస్తాయి..లేలేత కిరణాల వోలే..ఆర్తిగా తనువంతా తామరాకులతో కప్పేస్తాయి..్భవాల లేమితో కృంగిపోయే మనసుకు. తడి ఆరని కవిత్వాన్ని కురిపిస్తాయి..
ఆమె కవిత్వపు మధురిమలు ‘వృక్షదీపమై’ పత్రహరితపు దొనె్నలతో ధరణికి నీరాజనాలు సమర్పిస్తాయి.. జగతికి ‘చిగురు’దీపాలతో కాంతుల కాగడాలు అందిస్తాయి..సప్తవర్ణాలు నిండిన నీటి బుడగలు..పూలబుట్టలో పట్టుకొచ్చి..పారిజాతాల పందిరి వేసి పరిణయమాడాలని పన్నీటి తలంబ్రాలను వెదజల్లుతాయి. నీటి శిల్పాన్ని చెక్కి మనకు ‘అరుదైన బహుమానం’ ఇవ్వాలని కవయిత్రి స్వర్ణలత కవిత్వపు సొబగులు ఆరాటపడతాయి! మనసుకే మనసుంటుందని..అందమైన ఆకృతినిచ్చి పూజిస్తే.. లోకమంతా పారిజాతాల వనమేనని గుర్తు చేస్తాయి.. పరిమళ తీగల తోరణాలు కట్టి మనల్ని పదే పదే పరుగులు పెట్టిస్తాయి! నిట్టూర్పులతో నిలకడగా నిలబడలేక.. వొంగి పోయే మనసుకి ఏ రకంగా చేయూతనివ్వాలని ప్రశ్నిస్తాయి!
కవయిత్రి సోమిశెట్టి స్వర్ణలత చక్కని భావుకతలో రాసిన కవితలు కొన్ని మనకు దర్శనమిస్తాయి! ‘ముక్కుపుడక’ కవితలో అందమైన భావాలను ఆవిష్కరించారు. కవయిత్రి తమ బాల్యంలోని మధుర స్మృతులను నెమరువేసుకుంటూ..‘పొన్నాయి జ్ఞాపకాలు’ కవితను చక్కగా తీర్చిదిద్దారు. పొన్నాయి పూల జ్ఞాపకాలను, అనుభూతులను ఈ కవితలో ఏకరువు పెట్టారు.
‘ప్రపంచీకరణ’ కవితలో గుప్పెడు మమతలద్దిన పలుకులతో ఆప్యాయతలు రంగరించలేక పోతున్నారనీ.. అలసిన గుండెలకు సాంత్వన నివ్వలేకపోతున్నారని కవయిత్రి వాపోయారు. జీవన సంద్రంలో ఒంటరి పయనం ఎంత దుర్లభమో..పడి లేచిన పడవకే తెలుస్తుందనీ..తీరం చేరే లోపే..అడ్డు తగిలే వారధులెన్నింటినో..మనోధైర్యంతో నవ్య చైతన్య శక్తిని పుంజుకుని పసిఫిక్ సముద్రాన్నైనా అవలీలగా దాటేస్తానన్న ధీమా వ్యక్తం చేస్తూ రాసిన కవిత అందరినీ ఆకట్టుకుంటుంది. కవయిత్రి ‘మా నాన్నమ్మ’ పేరుతో రాసిన కవితలో నాయినమ్మపై తమకు గల గౌరవభావాన్ని చాటుకున్నారు..నాన్నమ్మ ఆమెకో పెద్ద బాలశిక్ష అని అభివర్ణించారు. ‘కాలానికి రంగులద్దుకోవాలి’ కవిత మనలో స్వాభిమానాన్ని నింపుతుంది.. కవితలోని ఒక్కో ఫంక్తి చైతన్య దీపికై.. మనలో ఆశవాహ దృక్పథాన్ని నింపుతుంది. ‘అడుగులు’ మరియు‘నా శ్వాసమందిరం’ కవితల్లో కవయిత్రి పండించిన భావాలు రమణీయంగా ఉన్నాయి. ‘నగరంలో ఒక రోజు’ కవితలో పద్మవ్యూహం లాంటి నగరంలో..ఆటో చక్రాలకే కాలం అతుక్కుపోతుందని వాపోయారు. శత్రువుల్ని చీల్చి చెండాడమని..్భర్త బాహులతలకు మనోబలపు కవచమై ధర్మభూమి ముద్దుల పుత్రికవు..నీవేనని చాటిచెప్పే వీరపత్ని అంటూ సైనిక పత్నికి వందనం సమర్పించారు. ‘ఎర్రదీపం’ కవిత ఆర్ద్రంగా మలచబడింది. గుప్పెడు మెతుకుల కోసం..గుండెను తాకట్టు పెట్టే అబలల వ్యధలకు అద్దం పట్టే విధంగా ఈ కవితను రూపుదిద్దారు. అందమంటే ఆరు మూరల పూలలోను..అవయవాల నిగారింపులోనూ ఉండదని ఈ ‘మృగజాతి’ ఎప్పుడు తెలుసుకుంటుందో మరీ అంటూ తమ ఆవేదనను వ్యక్తపరిచారు. మనసు స్పర్శ తెలియని మృగాళ్లు ఆకళ్లకి, జానెడు పొట్టకోసం మనసును జార్చుకుంటున్న మగువల వైనాన్ని ప్రతిబింబిస్తూ రాసిన పంక్తులు అందరినీ కదిలిస్తాయి. వేల మమతల ప్రతిబింబాలను.. మరువలేని ‘బంధాల’ బహుమతినిచ్చే వాడు అన్న అని ‘రక్షాబంధన్’ కవితలో తేల్చిచెప్పారు. ‘మరణం అంచుల్లో..’కవిత తాత్త్వికంగా మలచబడింది. ‘లక్ష్యం’ కవిత సందేశాత్మకంగా ఉంది.
‘మొదటి లేఖ చదివిన క్షణం..’ కవితలో కవయిత్రి పండించిన భావాలు..పాఠకుల్ని అక్షరాల మేనాలో ఊరేగిస్తాయి! ఇలా కవయిత్రి స్వర్ణలత తన మనసులో కదలాడే భావాలకు అక్షర రూపాలిచ్చి అందరినీ మెప్పించే యత్నం చేశారు. అయితే..‘కోడలు’ కవితలో ఆమె ప్రకటించిన భావాలు భావోద్వేగంతో రూపుదిద్దుకున్నప్పటికీ..అందరూ ఏకీభవించక పోవచ్చు. మారుతున్న సమాజంలో అత్తమామల్ని ఇంకా..పాత పద్ధతిలోనే చూడటం భావ్యం కాదు. ఇప్పటికీ ఎక్కడైనా అటువంటి వారున్నా..వారిలోనూ పాజిటివ్ మార్పు తెచ్చేందుకు కవయిత్రి తమ కవిత్వం ద్వారా చైతన్యపరిస్తే బాగుండేది! గ్రంథం ఆరంభంలో పొందుపరిచిన ముందుమాటలు ఎక్కువైనాయి..కాయను మించి ‘తొడిమె’ ఉందన్న భావన పాఠకుల్లో వచ్చే అవకాశముంది..సార్వజనీన వస్తువుతో పాటు..వైవిధ్య భరితమైన అభివ్యక్తిలో ఇంకా కవయిత్రి శ్రద్ధ చూపాల్సి వుంది. మున్ముందు సందర్భాన్ని ఉన్నతీకరింపజేయగల పదబంధాలతో కూడిన భావ చిత్రాలు ఆమె కవిత్వంలో ప్రతిబింబింపజేయాలని కోరుకుందాం.
- సాన్వి, కరీంనగర్, సెల్.నం.9440525544

మనోగీతికలు

ఏవీ చల్లని జల్లులు?
ఇటు నీరు అటు నీరు
ఎటు చూసినా నీరే
జలకళ కళ కళ
విలసిల్లే పచ్చదనం
ఏదీ ఆ దృశ్యం?
ఎందుకైంది అదృశ్యం?
ఏమిటీ పొగలు?
ఎక్కడివీ సెగలు?
పగలూ నిప్పులే
రాత్రీ నిప్పులే
ఏవీ చల్లని జల్లులు?
ఏవీ ఉల్లంలో మల్లెలు?
కమనీయ దృశ్యాల స్థానంలో
కరాళ కంకాళాలా?
విస్తరించే నగరాలతో
విస్తుపోతున్న పచ్చదనాలు
ఏదిరా చల్లదనం?
ఏదిరా పచ్చ‘్ధనం’?
కలలోనేనా?
ఇలలో శూన్యమేనా?

- అయాచితం నటేశ్వర శర్మ
కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా
సెల్.నం. 9440468557

ఎంత గొప్పది అమ్మ!
మెత్తని నేత చీరలో
నిండైన రైకలో
నుదుటన సిందూరం
చంద్రబింబంలా
సిగనిండా విరులతో
అమ్మే ఇంటికి వెలుగులా!

ముక్కుకు ముక్కెర
సెవులకు గంటీలు
కాల్లకు కడియాలు
చేతినిండా మట్టిగాజుల్లో
అమ్మ అందం ఎంతో ఒద్దికైనది!

పొద్దు పొడవకముందే
ఇల్లంతా తానై
ఇంటిల్లిపాదికి తోడై
రెక్కల్ల, బొక్కల్ల బాధల్ని
బంధించి పొడసూరిన అమ్మ త్యాగం
ఎంతో ఉన్నతమైనది!
సింతపండు కారమైనా
మమకారాన్ని నింపి
యాల్ల పొద్దుగాల్నే
కడుపు నింపిన అమ్మ
అనురాగం ఎంతో కమ్మనైనది!

బిడ్డ బీమారైందని
బుజానేసుకుని
ఎట్లున్నదట్లు, గాయగాయగా
పరిగెత్తె అమ్మను చూస్తే
కళ్లు చెమ్మగిల్లే దృశ్యం
ఎంతో ఆర్ద్రమైనది!

సుట్టాలని పక్కాలని ఆపదల్ల
అరుసుకుంటూ...
కష్టాలను కలెగలుపుగా
బ్రతికిన అమ్మ జీవన చిత్రం
ఎంతో ఆత్మీయమైనది!

బిడ్డల బతుకు ఎట్లుంటదోయని
గుట్టనక, సెట్టనక
కనిపించని దేవుళ్ల
కన్నీళ్ల పర్యంతమయ్యే అమ్మ...
ఎంతో గొప్పనైనది!

- రామానుజం సుజాత, కరీంనగర్
సెల్.నం.9701149302

సంకల్పం!
అడుగులు చిన్నవైనా..
ఆకాశమంత ఆశయాలను
చేరేందుకు సంకల్పించాను!
అక్షరాలను అల్లుకుంటూ
మనుషుల మస్తిష్కాలలో
పేలే అణుబాంబులను తయారు చేస్తున్నాను!
సమాజంలోని ఒక్కో మిణుగురును..
ఒక్కచోట ఏకం చేస్తున్నాను
ఉగ్రవాదంపై..
ఉక్కుపాదం మోపడానికి
యువకులను చైతన్యపరుస్తున్నాను!
కుల, మత, వర్ణాలొక్కటేనని
చాటి చెప్పడానికి..
గీత, బైబిల్, ఖురాన్, మహాగ్రంధాలను
వడబోస్తున్నాను!
అయితే..
తుదకు తేలిందొక్కటే..
కుళ్లిపోతున్న స్వార్థ దేహాలపై
మట్టి దుప్పట్లు కప్పేందుకు
అక్షర సేద్యం చేయ
కలానికి పని పెట్టాలనుకుంటున్నాను!

- గాలి మురళీధర్, ముంబయి, సెల్.నం.09967829399

మనిషా ? రాయా?
వద్దు.. ఇంకెప్పుడు
మనిషిని రాయితో పోల్చకు
రాయి పగులుతుంది
నీటితో పరుగెడుతుంది
నునుపూ..దేలుతుంది
ఇసుక రేణువుగా మారుతుంది
నీటితో జేరి తడవుతుంది
మనిషి తొక్కే మెట్టవుతుంది!
మొక్కే విరాట్టవుతుంది
అదే
ప్రేమ లేని మనిషి హృదయం
రాయిలా పగలదు
కన్నీటితో కూడా తడవదు
అందుకే
మనిషిని రాయితో పోల్చి
దాన్ని అవమానించకు సుమా!

- పెనుగొండ సరసిజ
కరీంనగర్
సెల్.నం.7386806499

కృతజ్ఞతలు

ఔను.. నన్ను ద్వేషించే శత్రువుకై
నేను అనే్వషిస్తున్నానన్నది పచ్చి నిజం!
అప్రమత్తంగా ఉండటమెలాగో
నాకు అతడు మాత్రమే నేర్పగలడు
స్వావలంబన దిశగా నన్ను పయనింపజేసేది
అతని ప్రతీకారమే కదా..!
నన్ను నన్నుగా అభిమానించే స్నేహితుడు
ఆత్మీయతల రుచిని చూపగలడు కానీ
నాలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించేది
నా శత్రువే కదా..!
కాలంతో పాటు కష్టాన్ని ఎదుర్కొవడం
అతని నిర్బంధంలో నేను అభ్యసించగలను!
అసాధ్యమైన విజయాన్ని సైతం
అతని సహవాసంతోనే
నా సొంతం చేసుకోగలను!
నా ఎదుగుదలపైనే దృష్టి సారించిన
అతని దృష్టి లోపాన్ని నేనర్థం చేసుకోగలను!
కనుమరుగవుతున్న మానవత్వాన్ని
అతని కరుకు వాఖ్యానాల కోణాల్లో
నేను దర్శించగలను!
అడ్డుకుంటారన్న అనుమానాన్ని
నాలో మొలకెత్తించి, గెలిచి తీరాలన్న పట్టుదలను
నాలో విస్తరింపజేసిన
శత్రురూపంలో వున్న నా మిత్రునికి కృతజ్ఞతలు

- పొద్దుటూరి మాధవీలత
ఎడపల్లి, నిజామాబాద్ జిల్లా
సెల్.నం.9030573354

ప్రకృతి మాత!
ప్రకృతి మాత పురుటి నొప్పులతో అల్లాడుతుంది
ఆదుకునే వారు లేక ఆక్రోశిస్తుంది
ఓ భూమాత నాకు పురుడు పోయి తల్లీ,
అంటూ వేడుకొంది
కానీ పుడమి తల్లి
నిస్సహాయురాలై జీవచ్ఛవంగా ఉంది
‘అయ్యో అంటూ ప్రకృతి మాత ఆక్రోశిస్తుంది’
ఓ పంచభూతాల్లారా
నాపై కనికరం చూపండి అంటూ
వేడుకొంటుంది -
కానీ ఆదుకునే వారే లేరు?
ఓ వరుణా వాహంగా ఉంది,
కాసిని నీళ్లియ్యవయ్యా
అంటె వరుణుడు మొహం చాటేశాడు
ఓ వాయువా నన్ను చల్లగాలిలో సేద తీర్చవయ్యా
అంటే వాయువు జీవం లేని వాడిలా ఉన్నాడు
ఓ వృక్షరాజమా నాకు కాస్తా నీడయినా ఇవ్వందే
అంటూ తిరుగుతుంది ప్రకృతి మాత
కానీ వృక్షరాజాలన్ని
మొదలు నరికి కుప్పలుగా ఉన్నాయి
అయ్యో అంటు ప్రకృతి మాత ఆక్రోశిస్తుంది
ఆకాశంలో సూరీడు కోపంతో రగులుతున్నాడు
మానవ తప్పిదాలకు ప్రకృతి మాత బలి అవుతుంది
అంటూ నిప్పులు కురిపిస్తున్నాడు
చివరకు ప్రకృతి మాత ప్రసవించింది
ఒక ప్రాణం లేని మృత శిశువును
దీనికి కారణం మన మానవజాతే

- చిలకమర్రి విజయలక్ష్మి
ఇటిక్యాల, సెల్.నం.9493210293

వరం !
ప్రాణికోటి ప్రతిది వరంగా పొందాలి
నాటి పురాతన కట్టడాల అద్భుతాలు నేడు
మనం చూడడం ఓ వరం!
మాయ తెరలు తొలగి మనిషి మనిషిగా
జీవించడం ఓ వరం!
నేటి కాలుష్యపు విషవలయంలో, ఎక్కడైనా
కాస్త ప్రశాంతమైన పచ్చని ప్రదేశం దొరికితే
మనసు ఆహ్లాదభరితమై అందంగా నవ్వుకుంటే
అది ఓ వరం!
పిచ్చుకల అరుపులు, చిన్న పిల్లల కేరింతలు
ఆవుల మందల పరుగులు నిండివుండే పల్లెల్లో
పంట చేల పైరగాలుల్లో నిర్మలత్వపు నిలువుటద్దంలా
మనుషుల గుణాలు కనిపిస్తే
కల్తిలేని పాలు దొరికినట్టే!
మల్లెపూల తెల్లదనం మసిబారిన, పరిమళం గుబాళించినట్టు
మేత దొరకని పశువులు, ఐనా బుడ్డెడు పాలిచ్చినట్టు
భూమాత మీద భరోసాతో ప్రపంచం నడిచినట్టు
ఆలోచించడం నా మెదడు కోవరం!
ఏతం, ఎడ్లబండ్లు మెల్లమెల్లగా మాయం
హైటెక్ వ్యవసాయం, నిల్వ చేసిన పండ్లు, కూరగాయలు
తాజావని మురిసికొనుక్కొని, ఇంట్లో పెట్టి
వారానికి వండుకోవడం వరమా!
అదీ దొరకని జనం, మనకు తెలవని వైనం!
మనిషిగా ఎదిగానే గాని, మాటలెన్నో నేర్చానేగానీ
ఇరుగు పొరుగు ముచ్చట లేదు..
కాలక్షేపానికి కంప్యూటరే వరం!
గురువులు నాడు ఏం వరం పొందారోగాని
నేటి మానవునికి గురువు మూలాలే మరి...

- బొమ్మదేని రాజేశ్వరి
పెద్దపల్లి, సెల్.నం.9160908045

ఈ శీర్షికకు కవితలు, కథలు, సాహితీ వ్యాసాలు, కొత్త పుస్తకాల సమీక్ష/పరిచయం, కార్టూన్లు ఈ క్రింది చిరునామాకు లేదా ఈ-మెయల్‌కు పంపండి.

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, జగిత్యాల రోడ్, కరీంనగర్. merupuknr@andhrabhoomi.net

email : merupuknr@andhrabhoomi.net

నిర్వహణ : దాస్యం సేనాధిపతి dasyamsenadhipathi10@gmail.com

- శ్రీమతి బి.హరిరమణ