ఉత్తర తెలంగాణ

ఇది కథ కాదు! (కథ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లావణ్యకు శ్రీరాంతో పెళ్లై పది సంవత్సరాలు కావస్తుంది. ఇద్దరికీ హైదరాబాదులోనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు. కారు, స్వంత ప్లాటు..ఈలోగా ఇద్దరు పిల్లలు. అమ్మాయికి ఆరేళ్లు, అబ్బాయికి నాలుగేళ్లు. సాఫీగా సాగుతున్న సంసారం. పెళ్లి పదవ వార్షికోత్సవానికి లావణ్యకు ఓ మంచి గిఫ్ట్ కింద నాలుగు లక్షల పైన ఖరీదు చేసే ‘నెక్లెస్’ ఇవ్వాలనుకున్నాడు. ఇద్దరు కలిసి అప్పటిదాకా మార్కెట్‌లో లేని ఓ కొత్త నమూనాను డిజైన్ చేసి ఆర్డర్ ఇచ్చారు. నెక్లెస్ ఖరీదు కన్నా దాని శ్రీరామ్ లావణ్యకు బహూకరించే సందర్భం చాలా విలువైనది. ఎంతో ప్రత్యేకత సంతరించుకున్న ఆ నెక్లెస్ అంటే లావణ్యకు ఎనలేని ఇష్టం..ప్రాణం! పెళ్లిరోజున బహూకరించిన తనకిష్టమైన జ్ఞాపిక!
ఆ తరువాత ఓ నెల రోజులకు ఎవరో లావణ్య దగ్గర బంధువుల అబ్బాయి పెళ్లికి అలంకరణలో భాగంగా ఆ నెక్లెస్ ధరించి చంపాపేటలో ఓ కళ్యాణ మండపానికి వెళ్లారు. పెళ్లి తంతు ముగిసింది. భోజనాలు ముగించుకొని కారులో ఇంటికి తిరుగుముఖం పట్టారు. కారు అలా గేటు దాటిందోలేదో..అనుకోకుండా ఓ సారి మెడ తడుముకున్న లావణ్య గట్టిగా అరిచింది.
‘ఏమండీ..నా నెక్లెస్! కొంప మునిగిందండి! ఏడుస్తూ అరుస్తూనే వుంది లావణ్య. అర్థంగాక అయోమయంలో శ్రీరామ్ కారుని పక్కకు ఆపి..‘ఓకే..లావణ్యా! వర్రీ అవకు..ఎక్కడో పడిపోయి వుంటుంది. వెనక్కి వెళ్లి వెతుకుదాం. ఓదార్పుగా అన్నాడు శ్రీరామ్.
‘లేదండి! ఇంకెక్కడి నెక్లెస్ అండి! ఎవడో దొంగ వెధవ
కొట్టేసుంటాడు. ఒకవేళ పడిపోయినా ఎవరో ఒకరు తీసుకెళ్లి వుంటారు. వెతికినా లాభం లేదు.’ లావణ్యకు నమ్మకం పోయింది. ఏడుపు తన్నుకు వస్తుంది. ఇద్దరు కలిసి ఓ నిర్ణయానికి వచ్చి దగ్గరలో వున్న ఓ పోలీస్ స్టేషన్‌లో రిపోర్ట్ ఇచ్చారు. రిపోర్ట్‌తో బాటు ఆ నెక్లెస్ డిజైన్ ఫోటోను కూడా జత చేసి బరువైన హృదయాలతో ఇంటికి చేరుకున్నారు. తన భర్త ప్రేమతో పెళ్లి రోజునాడు ఇచ్చిన అపూర్వమైన గిఫ్ట్..ఆ నెక్లెస్. ఇలా పోగొట్టుకోవడం..లావణ్యను చాలా రోజులు బాధిస్తూనే వుంది. లావణ్యను ఓదార్చే క్రమంలో అలాంటిదనే ఇంకొకటి కొందామని శ్రీరామ్ లావణ్యను అడిగాడు. లావణ్య ఒప్పుకోలేదు. గడుస్తున్న కాలం..జ్ఞాపకాలు పాతబడి మాసిపోవడానికి అవకాశం. మూడు నాలుగు నెలలు..మధ్య మధ్యలో పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఎంక్వయిరీ.. దొరుకుతుందేమోనని ఆశ! ఇక లాభం లేదని మరిచిపోవడానికి ప్రయత్నం. రొటీన్ లైఫ్‌లో పడిపోయారు. వారాంతం పార్టీలనీ..పెళ్లిళ్లకో, పేరంటాలకో..వీలుని బట్టి వెళ్తున్నారు.
‘హలో..లావణ్య! బాగున్నావా? నేను రజనీ, బెంగుళూరు నుండి మా ఆయనకు హైదరాబాద్ హైటెక్ సిటీకి ట్రాన్స్‌ఫర్ కావడం, నేను ప్రెగ్నెంట్ కనుక నా జాబ్‌కు తిలోదకాలిచ్చి, ఆయన వెంటే వచ్చేసాను. డెలివరీ తరువాత ఇక్కడే ఏదైనా జాబ్‌లో చేరుతా’. గడ గడా..మారు ప్రశ్నలకు తావివ్వకుండా రజని చెపుతూనే వుంది. తను ఎప్పుడూ ఇంతే! గ్యాప్ లేకుండా, మిషిన్ గన్ లాగా తను చెప్పాల్సినవన్నీ కక్కేసి..ఎగపోసుకుంటూ ఆగుతుంది. లావణ్యకు రజని ఇంజనీరింగ్‌లో క్లాస్మేట్..మంచి క్లోజ్ ఫ్రెండ్. తన పెళ్లి తరువాత రెండేళ్లకు పెళ్లి. పెళ్లయినంక దాదాపు ఎనిమిదేళ్లకు ప్రెగ్నెంట్.
‘ఓహో..రజనీ! నన్ను కూడా కాస్త మాట్లాడనీయవే! కంగ్రాట్స్! ఎన్నాళ్లకే..ఇంత మంచి వార్త చెప్పినందుకు సంతోషం! పట్టలేనంత సంతోషంతో జవాబిచ్చింది లావణ్య.
‘అన్నట్టు..చెప్పడం మరిచిపోయా..వచ్చే ఆదివారమే నాకు సీమంతం. మాపేరెంట్స్ ఓ హోటల్‌లో ఏర్పాటు చేశారు. తప్పకుండా మీ శ్రీవారితో రావాలి. అప్పుడు తీరిగ్గా అన్ని విషయాలు మాట్లాడుకుందాము. బై! రజనీ మాటల వర్షం కురిసి వెలసింది.
సీమంతం రోజు ఫ్రెండ్స్, బంధుబలగంతో ఉండాల్సినంత హడావుడి వుంది. భోజనాలయ్యాయి. వేళ్లొస్తామని చెపుతూంటే లావణ్య దృష్టి హఠాత్తుగా రజని మెడలో వున్న నెక్లెస్‌పై బడింది. అచ్చు ఆ నెక్లెస్ తను పోగొట్టుకున్న దానిలాగానే అనిపించింది. అదే విషయం శ్రీరామ్‌తో అంది. లోలోపల అనుమానం పీకుతుంది. ఎందుకంటే..అట్లాంటి డిజైన్మార్కెట్లో అరుదు. శ్రీరామ్, తను కలిసి చేసిన డిజైన్! ఆపుకోలేక లావణ్య అడిగేసింది..
‘రజనీ! నెక్లెస్ చాలా బాగుందే! డిజైన్ ఈజ్ సూపర్! మీ ఆయన గిఫ్టా? ఎక్కడ కొన్నారే? నోనో! ఇది మేము కొనలేదే. మా నాన్న నా కిచ్చిన సీమంతం గిఫ్ట్! పోలీస్ ఆఫీసర్ కదా..ఏ జీవల్ మర్చెంట్ నో పిలిచి మంచి డిజైన్‌తో చేయించి తెప్పించి ఉంటాడు. ‘రజనీ చెపుతూనే ఉంది.
అంతలోనే అక్కడికి వచ్చిన వాళ్ల నాన్నను పరిచయం చేసింది.
‘నమస్కారమండీ! మిమ్మల్నీ మేము ఓసారి పోలీస్ స్టేషన్‌లో కలిసామనుకుంటా! ‘శ్రీరామ్, లావణ్య అదోరకంగా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ‘మంచిదండీ! మళ్లీ కలుద్దాం!’ అంటూ అక్కడ నుండి సాధ్యమైనంత త్వరగా నిష్క్రమించారు.

- ఆచార్య కడారు వీరారెడ్డి
కరీంనగర్, సెల్.నం.7893366363

కథ

దారి చూపిన దేవుడు

‘గిదేందయ్యా.. వూర్లోళ్లందరూ మన గుళ్లో బ్రహ్మోత్సవాలు అయితున్నాయని, అందరూ మంచిగా తయారై ఎలుతుంటే, నువ్వేంది గిట్ట సిన్నబోయి కూసున్నావ్.. లే..లే.. లేసి తానం సేసి.. ఆ పంచె కట్టుకో.. ఆ అంచు కండువేసుకో.. మేమందరం తయారయినమ్.. అగో మంత్రాలు గూడ ఇనిపిత్తనయి’ గౌరమ్మ హడావుడి పెట్టేసరికి శివయ్య వాళ్లకోసమన్నట్లు లేచి, వాళ్లు చెప్పినట్టే చేశాడు.
వాళ్లతో గుడికి నడుస్తున్నాడన్నమాటే గాని, శివయ్య ఆలోచనలన్నీ నిన్న షాప్‌ల సేటు అన్న మాటల చుట్టే తిరుగుతున్నాయి.
‘్భయి.. ఇన్ని రోజులు మన మధ్య ఉన్న దోస్తీ తోని, నేను నీకు లాభం కొంచెమైనా వచ్చేలాగా తీసుకున్నాను.. కానీ ఇప్పుడీ పోటీ తట్టుకోలేక పోతున్నాను.. ముంబై నుండి సప్తా ధరలకు బట్టలోస్తుంటే.. నాణ్యమైనా ఎక్కువ ధర పెట్టి ఎవరు కొంటారు.. ఇయ్యాల రేపు అందరూ.. నాలుగు రోజులు వాడి పక్కకు పడేసి మళ్లీ కొత్తది కొనాలనుకుంటున్నారు.. కొత్త కొత్త ఫ్యాషన్లు.. మీ నార బట్టలకు అంత గిరాకీ లేదు.. మరేమనుకోకు భాయి.. ఈసారికి తీసుకుంటాను.. అంటూ చెప్పలేక చెప్పాడు.
ఈ నేత పని తప్పితే తనకింకేమి చేతకాదు.. రేపటి నుండి తన సంసారం ఎలా గడవాలి. పెళ్లి చేయాల్సిన బిడ్డ, సదువుకునే కొడుకు, ఇల్లు గడవడం.. మ్రోగిన జేగంట చప్పుడుకు ఆలోచనల నుండి తేరుకున్నాడు.
భక్తులందరికి.. విన్నపం.. దయసేసి.. అందరూ.. ముఖ్యంగా.. మగవాళ్లందరూ నార అంటే చేనేత దుస్తులు వేసుకుని రావాలి.. మర్చిపోతున్న మన సంస్కృతి సాంప్రదాయాలను మనమే పరిరక్షించుకోవాలి.. అలనాడు గాంధీజి విదేశీ వస్తు బహిష్కరణ చేసినట్లు. ఇప్పుడు మళ్లీ మనమంతా ఈ పవిత్రమైన గుడిలో సంకల్పం చేసి కనీసం గుడి కొచ్చేప్పుడైనా చేనేత బట్టలు ధరించి వస్తే..మన నేతన్నల ఆకలి చావులను కాపాడిన వాళ్లమైతాం.. దేవుడికి ఇష్టమైన బట్టలతో ఆనందం కలిగించిన వాళ్లమైతాం..’ అయ్యగారు మైకులో అరుస్తున్నారు. శివయ్య ఉలిక్కిపడ్డాడు. తమ వూర్లో చాలా మంది వూరికొయ్యలకు వేలాడిన నేత కార్మికులు గుర్తొచ్చారు.
ఇంతలో ఆ వూరి ప్రెసిడెంట్ మైకు అందుకున్నాడు. ‘ప్రియమైన పెజలారా.. ఇటీవల మన వూళ్లో శానామంది ఉరేసుకుని సచ్చిపోయినందుకు బాధ్యతవహిస్తూ..మన మినిష్టరును కలిసిన..అక్కడ కొన్ని తీర్మాణాలు తీసుకున్నాము.. ఈ బ్రహ్మోత్సవాల సందర్భాన అందరూ వత్తారని ఇక్కడే చెప్పాలని అనుకున్నా..గవేంటంటే..పెభుత్వం నేతబట్టలకు సబ్సిడీ ఇత్తానంది. అంటే అవి కొనే వారికి తక్కువ ధరకె ఇయ్యటమన్నమాట.. గట్లనే, ఆఫీసులల్లా, ఇస్కూళ్లల్లా అన్నింటికీ నేత బట్టలు వేసుకునే వారికి కొంత రాయితీ ఇయ్యాలని.. ఇలా శానా శానా చెప్పారు. గందుకే.. మన వూర్లో నేనే వారికెవరికి ఎలాంటి ఇబ్బందులున్నా నాకు చెప్పాల్సిందిగా కోరుకుంటున్నా..అందుకే రేపు జరిగే స్వామి వారి కళ్యాణానికి అందరూ చేనేత బట్టలే వేసుకోవాలని మనవి సెస్తున్నా..తొందరలో చేనేత విక్రయ కేంద్రం మన వూర్లో పెట్టి అందరూ నేసిన బట్టలు ఇక్కడే కొని, పైకి ఎగుమతి చేస్తాం.
అందరూ చప్పట్లు కొట్టారు.
ఆ వూరి షావుకారు అందుకున్నారు ‘నేను ఇప్పుడే చెపుతున్నాను..నా దుకాణంలో పనిచేసే వారందరికి ఏడాదికోసారి బట్టలు కొనిస్తుంటా.. ఈసారి నుండి నేను కూడా చేనేత బట్టలే కొనిస్తాను.. మళ్లీ చప్పట్లు.
‘నేను వాగ్ధానం చేస్తున్నాను.. నా ఆఫీసులో పనిచేసేవారికి ఏడాదికోసారి ఇచ్చే బట్టలు నేను చేనేతనే ఇస్తానని’ మేనేజర్ అన్నాడు, మళ్లీ చప్పట్లు.
‘అయ్యా.. పవిత్రమైన ఈ గుడిలో ఆ దేవుడు అందరికీ ఇలా మంచి సంకల్పాన్ని కల్పించినందుకు ఒక్కసారి జై కొట్టండి.. అందరి జేజేలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.
తనకు దోవ సూపించిన దేవునికి బిగ్గరగా గొంతు చించుకుని జై కొడుతున్న శివయ్యను ఇచిత్రంగా సూశారు ఇంటివాళ్లు, ఇప్పటివరకు నోరు విప్పని మడిసి ఒకేసారి అలా అయినందుకు.
గుడిలోని జేగంటల సప్పుడు తమకు వచ్చిన మంచి రోజులకు, దేవుడిచ్చిన దీవెనలా అనిపించింది శివయ్యకు, మనసారా దండమెట్టుకున్నాడు.

- నామని సుజనాదేవి
వరంగల్, సెల్.నం.7799305575

పుస్తక సమీక్ష

మధుర భావాలు.. ‘స్వర్ణ’ కిరణాలు!

ప్రతులకు:
స్వర్ణలతానాయుడు సోమిశెట్టి
ఇం.నెం.71, సెక్టర్-71,
డి-బ్లాక్, పోస్ట్ నోయిడా-201305
ఫోన్ నం.09958960068
పేజీలు: 171 వెల : రూ.100

‘నా భావాలు అనునిత్యం... అక్షర సుమాలతో నందన వనంలో ఆడుతూ.... బిగి బిగి అల్లికలతో.... అందమైన కవితా మాలికలుగా ఆవిష్కరించబడాలని తపన పడుతుంటాయని’ స్వయంగా ప్రకటించుకున్న కవయిత్రి శ్రీ స్వర్ణ మధుర భావాల సమాహారంగా ‘శ్రీ స్వర్ణకిరణాలు’ కవితా సంపుటిని వెలువరించారు. ‘శ్రీ స్వర్ణ’ కలం పేరుతో సాహితీ సేద్యం చేస్తున్న అమె అసలు పేరు సోమిశెట్టి స్వర్ణలతానాయుడు. నల్లగొండ జిల్లాకు చెందిన ఆమె ప్రస్తుతం వృత్తిరీత్యా ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఉంటున్నారు. ఫేస్‌బుక్ ద్వారా కవయిత్రిగా అందరికీ పరిచయమైన ఆమె కవిత్వంలోని అందమైన భావాలు పున్నమి వెలుగులను తలపిస్తాయి. అలసిన హృదయాలపై పన్నీటి జల్లులు కురిపిస్తాయి... నక్షత్రాల ఉనికినే ప్రశ్నించేలా ఆమె కలం నుండి జాలువారే భావాలు తళుకు తళుకుమని మెరుస్తాయి! గుండెలోతుల్లోని ఆర్ద్రతను నింపుకుని పురుడు పోసుకునే ఆమె అక్షర తరంగాలు అనురాగ మాలికల్ని పంచుతాయి! ‘శ్రీ స్వర్ణకిరణాలు’లోని కవితలు సంక్రాంతి శోభకు అద్దం పడతాయి! పాలబుగ్గల పసినవ్వులను భోగిపళ్లతో అభిషేకిస్తాయి! ప్రకృతి కన్యసిగలో జాజి గంధాలతో గుబాళిస్తాయి. నిర్భయంగా వుండుమని స్ర్తిలకు అభయం అందించే ఆమె అక్షరాలు కామ పిశాచులపై ఉప్పెనలా విరుచుకుపడతాయి! మృగాళ్ల మస్కిష్కంలో ‘్భయ’ మన జన్యువులు మేల్కొనేలా చేస్తాయి! మనోవల్మీకంలో గూడుకట్టుకున్న దిగులుకు స్నేహ హస్తాన్ని అందించి..ఆమె అక్షరాలు మణిదీప కాంతులు వెదజల్లుతాయి! ఆమెలో మమేకమైన భావాలు అంబరాన్ని చుంబిం చి.. మది ఆకాశంలో హరివిల్లు. ఊయలపై విహరింపజేస్తాయి! మనసులు ఏకమై.. తనువులు దూరమైన ప్రేమికులకు పున్నమి వెలుగులు పరచి పాల పుంతలులను చూపిస్తాయి! కవిత్వం కోసం స్వర్ణ గారు ఎంపిక చేసుకున్న కవితా వస్తువులు వైవిధ్యంగా ఉన్నాయి.. అభివ్యక్తిలో నవ్యత పాటించారు. శిల్పం విషయంలో ఆమె తీసుకున్న చొరవ అభినందనీయం!
‘తీపి తెలుగు’ కవితలో తెలుగు భాష తీయదనాన్ని విశే్లషించిన తీరు బాగుంది. అక్షరాల వెలుగులు పంచేవాడు గురువనీ.. అక్షరాలతో గారడీ చేయించే ఇంద్రజాలికుడు కూడా ఆయనేనని ‘గురువు’ కవితలో గురువును ఉన్నతంగా చిత్రించారు. ‘నవనీతం’, ‘వెలుగుల స్పర్శ’, ‘నిరీక్షణ’ కవితల్లో కవయిత్రి నిరీక్షణలోని అనుభూతులకు అక్షర రూపమిచ్చారు. ‘ముగ్ధ సౌందర్యం’ కవితలో కోమలాంగి అందచందాలను దృశ్యమానం చేసిన తీరు అభినందనీయం! ‘అనుమానం’ కవితలో అహంకారంతో విర్రవీగే మగ మహారాజులపై కవయిత్రి తమ కలాన్ని సంధించారు. ‘నాలో నీవే సర్వం’, ‘ఎలా తట్టుకోనూ’, ‘ఒక చిన్ని ఆశ’ కవితలు హాయిగా చదువుకోవడానికి యోగ్యంగా తీర్చిదిద్దారు. ‘ఇష్టం’, ‘నవచైతన్యం’ కవితలు కవయిత్రి చక్కని భావుకతకు అద్దం పట్టేలా వున్నాయి. అలాగే ‘తొలిపరిచయం’ కవితలోని ప్రతి పంక్తీ కవయిత్రి ప్రతిభకు పట్టం కట్టేలా కొలువుదీరడం విశేషం! ‘ఆనందం’, ‘నాతోడు’ కవితల్లో కవయిత్రి తన హృదిలో గుట్టుగా గూడుకట్టుకున్న భావాల గుట్టు విప్పారు. ‘సంక్రాంతి’, ‘ఉగాది’, ‘వసంత శోభ’, ‘గంగోత్రి’, ‘నూతన సంవత్సరం’ ఇలా ఏ కవిత చూసినా కవయిత్రి సృజనాత్మకత ఉట్టిపడేలా వున్నాయి!
ఈ కవితా సంపుటిలో స్వర్ణగారు భావ కవిత్వానికి పెద్దపీట వేశారు. తీపి వలపులు ప్రకటిస్తూ.. వలపుల సంద్రానే్న తలపించేలా తమ కవిత్వాన్ని పండించారు. పరిమళానికి భాష్యం చెప్పే గులాబీల గుబాళింపులు కవిత్వం రూపంలో పాఠకుల్ని పరవశింపజేసేలా స్వర్ణగారు చేసిన ప్రయత్నం ప్రశంసనీయం! ‘మనసు’ గురించి చెప్పినా.. ‘అమ్మ’ గురించి చెప్పినా..‘చీర’ గురించి చెప్పినా..ప్రతి కవితలోనూ ఆమె తనకంటూ ఓ శైలిని కలిగి వుండటం విశేషం!
ఆలిగా, తల్లిగా బాధ్యతల్ని నిర్వర్తించడమేగాక..అతివలు అన్ని రంగాల్లో రాణిస్తున్న సంగతిని ‘మహిళ’ కవితలో ఏకరువుపెట్టారు. ఇలా..ఈ సంపుటిలో చాలా కవితలు ఉదహరించడానికి యోగ్యంగా వున్నాయి! ఈ కావ్యంలో రసరమ్యంగా సాగే ఆమె అక్షర విన్యాసాలు..సుస్వర్ణ భావాలతో పాఠకుల్ని అలరిస్తాయి! స్వర్ణగారిని సాహితీ లోకంలో కవయిత్రిగా సుస్థిరపడటానికి దోహదపడతాయి! అయితే..తమ కలానికి ఇంకా పదును పెట్టుకొని..అధ్యయనంపై మక్కువ చూపాలని కోరుకుందాం. క్రొత్త క్రొత్త మెలకువలు తెలుసుకుని..కవిత్వం మరింత గాఢంగా ప్రకటించడానికి కృషి చేయాలని ఆకాంక్షిద్దాం.

- సాన్వి, కరీంనగర్, సెల్.నం.9440525544

మనోగీతికలు

సిరియా
బాల్యం!

నిన్నటి రాతిరి వరకు
వాడు
తల్లి గుండెల్లో తలదాచి
హాయిగా స్వేచ్ఛగా నిదురించినవాడు
ఏ చింతలు లేని
నిన్నటి రోజు నాడు
మురిపంగా, తండ్రిఎదపైన
ఒదిగిన వాడు
వాడు దోస్తులతో హుషారుగా
గల్లీలో గోలీలాడుతూ
ఆ వూరే
తనదనుకున్నవాడు
అంతలోనే..
వాడు బిత్తర పోయాడు!
తనదనుకున్న రాజ్యం
మత ఛాందసుల
మారణ హోమం సృష్టించిన
విధ్వంసపు
మానవ శకలాలు
నెత్తుటి మడుగులో
తేలియాడితే!
రక్షించే రాజే లేడని
ఆ బిడ్డ పుట్టిన గడ్డను వీడి..
ప్రాణాలు అరచేతిలో
అమ్మతోడ
నాన్న వెంట
చేరదీసే మానవీయతను
వెతుక్కుంటూ
సముద్ర మార్గాన పయనమై
గమ్యం చేరకనే..
ఆ మూడేళ్ల సిరియా బాల్యం
సముద్రపు ఒడ్డున
విగత జీవిగా!
వాడు పిడికిళ్లు బిగించి
విప్లవ శంఖం పూరించి
చీకటి తత్వాన్ని చెబుతూ
ఉత్త చేతులను చూపిస్తూ..
ముఖాన్ని మట్టిలో కప్పుకుంటే గానీ
దేశాధిపతులు
మానవత్వాన్ని
మనిషికింత
పంచుకో లేదు!
బాల్యం బలైతే గానీ
కనికరం కళ్లు తెరువలేదు!

- రామానుజం సుజాత
కరీంనగర్
సెల్.నం.9701149302

తలారి
వాడు.. నీకంటే ఎప్పుడూ
ఒక మెట్టుపైనే ఉంటాడు
మడుపు పట్టుకుని మడికట్టుకుని
భక్తిశ్రద్ధలతో నిల్చున్న నిన్ను
ధర్మదర్శనం నుండి దారి మళ్లించి
నీతి న్యాయం నుండి దృష్టి మళ్లించి
ఆపద్ధర్మ దేవుడిలా అవతారమెత్తి
పనిగట్టుకుని పట్టుబట్టి
చేతులు మారిన చెమటపైసల సాక్షిగా
కదిలే మెరుపు మెట్లపైనే..
స్వామిని సాక్షాత్కరింపజేస్తాడు!
వాడు..నీకంటే ఎప్పుడూ
ఓ గజం ఎక్కువే విస్తరించి ఉంటాడు
ఆవైపున ఐటి పార్కు..
ఈ వైపున ‘సెజ్’లంటూ
అరచేతిలో వైకుంఠం చూపించి
ఊహకందని అభివృద్ధిని చకచకా
ప్లాస్టిక్ కోటెడ్ బ్రోచర్‌లోనే ‘బ్రౌజ్’చేసి
వాడి కమీషన్ కోసం..నీ కష్టార్జితాన్ని
కనికట్టు చేసి..ఖర్చు పెట్టించేస్తాడు!
వాడు..నీకంటే ఎప్పుడూ
నాలుగక్షరాలు ఎక్కువే చదివుంటాడు
అడ్మిషనో, లైసెన్సో,
బ్యాంకు లోనో, చాలానో
ఆఖరికి ఆధార్‌కార్డో..పని ఏదయితేనేం
ఆఫ్టరాల్ ఒక అప్లికేషన్ నింపటానికి
అసిస్టెంట్ ప్రొఫెసర్‌నైనా
అన్‌ఫిట్‌గాడ్ని చేసి
అగమ్యగోచరపు అజ్ఞానంలోకి నెట్టేసి
వాడిమీద ఆధారపడేలా ఆదేశించి
దోషపూరిత దస్తూరితో గళ్లను నింపి
మన కళ్లకు గంతలు కట్టకుండానే
మన జేబులోని సొమ్మును
మనకు తెలీకుండానే
వాడి చేతికొచ్చేలా చేతివాటం చూపిస్తాడు
అచ్చ తెలుగులో చెప్పాలంటే
వాడు దళారీ!
నీతి నియమాలకు నిలువెత్తు తలారి!!

- పెనుగొండ బసవేశ్వర్, కరీంనగర్, సెల్.నం.9059568432

ఫిర్ బీ దిల్ హై హిందుస్తానీ!!

చుట్టూ పర్వత కనుమల పహారా..
పహారాకి సముద్రాల సపోర్టు...
ఉపఖండంగా ఖ్యాతి గడిస్తోంది..
ప్రపంచంలో ప్రతి నాలుగో వ్యక్తికీ
నిలువ నీడ పట్టెడన్నం
వర్ధిల్లే జీవన వైవిధ్య రంగం మొదలై
ఆరున్నర దశాబ్దాలు దాటుతున్నాయి!
అయినా.. ఎక్కడో ఏ మూలో
జాతి జీవ ధాతువులో
వణుకు ప్రకంపనలు కుదుపులు..
అలుపెరుగని సత్యశోధన
సంధించే ప్రశ్నల పరంపర
ఫలితంగా
అసహనాలు కుతార్కిక కుళ్లు బుద్ధులూ...
అసంబద్ధ ఛాందస పిడివాదాలు
ప్రజాస్వామ్య సౌధం పునాదుల్ని
డిస్టర్బ్ చేయాలనీ
వ్యర్థ ప్రవచనాలు..
వృధా ప్రయత్నాలు జరుగుతున్నాయి!
విమర్శ సహించాలి
ఓర్పు జరూరత్
అవమానాల్ని అవహేళనల్ని
మరికొంత కాలం ఇలాగే
మోయక తప్పదు
పారిపోవద్దు
దేశ సరిహద్దుల్ని సముద్రాల్ని దాటి..
మనం ప్రాథమికంగా
భారత పౌరులం వారసులం!
సహనం జన్మతః సిద్ధించిన
వజ్ర కవచం!
దాంతో గెలుద్దాం
ఉగ్ర భూతాల కోరలు దీసే యుద్ధాన్ని..
ధరిత్రిలో ఏ కోనలో మనగలుగుతున్నా
జన్మనిచ్చిన దేశ గుణం రుణం
గానం చేయడానికి
వెరవొద్దు మరవొద్దు!
మనలో మనకు
ఎన్ని వైరుధ్యాలున్నా..
ఫిర్ బీ దిల్ హై హిందూస్తానీ!

- డా. దామెర రాములు, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లా సెల్.నం.9866422494

జల సిరులతో..!
ఎండిన చెరువు నెర్రెలు
నోరు తెరిచి దాహంతో
దీనంగా చూస్తుండగానే
తుమ్మవనం ఆక్రమించింది
నీటి ఊట ఎటువెళ్లిందో
జాడనే తెలియకుంది
చెరువుల కుంటల
ఎల్లలు చెరిగిపోయి
పచ్చని పంటపొలాలు తగ్గిపోయి
బీడుగా మారిన భూముల్లో
ఆవాస కట్టడాలు పెరిగిపోయి
భూగర్భ జలరాశులు
అడుగంటిపోయి
భూసారమంతా దెబ్బతినిపోయి
నీటికోసం పరితపిస్తున్న
ప్రజలంతా
మిషన్ కాకతీయ పిలుపుకు
ప్రజాస్వామ్య స్పూర్తితో
ఉపక్రమిస్తే..
తడారిపోయి ఎడారైన
చెరువుగట్లన్నీ
జల సిరులతో తళతళ లాడుతాయి!
జలపుష్పాల కోసం మళ్లీ
బుడుబుంగలు, కొంగలు
సందడి చేస్తాయి!
రైతుల గుండెలు ఆనందంతో
నిండిపోతాయి!

- నూజెట్టి రవీంద్రనాథ్
జగిత్యాల
సెల్.నం.9948748982

ఈ శీర్షికకు కవితలు, కథలు, సాహితీ వ్యాసాలు, కొత్త పుస్తకాల సమీక్ష/పరిచయం, కార్టూన్లు ఈ క్రింది చిరునామాకు లేదా ఈ-మెయల్‌కు పంపండి.

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, జగిత్యాల రోడ్, కరీంనగర్. merupuknr@andhrabhoomi.net

email : merupuknr@andhrabhoomi.net

నిర్వహణ : దాస్యం సేనాధిపతి dasyamsenadhipathi10@gmail.com

- ఆచార్య కడారు వీరారెడ్డి