రాజమండ్రి

పక్కింటి నుండి ఫేస్‌బుక్ దాకా! (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఎంతసేపే ఆ కంప్యూటర్‌తో కబుర్లు? కాసేపు చేతిలో పనందుకోవడం ఏమైనా వుందా లేదా?’ హాల్లో నుండి తల్లి అరుపులు విని గబగబ స్విచ్ ఆఫ్‌చేసి ‘ఏంటమ్మా?’ అంటూ తల్లి దగ్గరకొచ్చింది అపర్ణ. ‘ఇదిగో ఆడపిల్ల అన్నాక కాస్త ఆ పని, ఈ పని అందుకోవాలి. చదువొక్కటేనా? ఇట్లా రా! ఈ బీరకాయలు కాస్త తరిగియ్యి. నాన్నగార్కి ఆఫీసు వేళ అవుతోంది. ఒక్కదాన్ని ఎన్ని పనులు చేయగలను చెప్పు?’
తల్లి మాటలకు విసురుగా బీరకాయలు తరగటం మొదలెట్టింది అపర్ణ.
‘నీకీ రోజు కాలేజీ లేదన్నావుగా! తమ్ముడికి, నాన్న గార్కి, భోజనం క్యారేజీలు సర్దిపెట్టు. ఇదిగో ఈ ఇడ్లీలు తీసి ఇద్దరికి టిఫిన్ పెట్టి, నీవు కూడా తిను. ఇదిగో ఆ డబ్బాలో కారప్పొడి, నెయ్యి పట్టుకెళ్లు’ ఆగకుండా పనులు పురమాయిస్తోంది తల్లి. తల్లి చెప్పిన పనులన్నీ చేసేసి, తండ్రి, తమ్ముడు వెళ్లాక తాను, తల్లి టిఫిన్ తినేసి అన్నీ సర్ది కంప్యూటర్ ఆన్ చేసింది అపర్ణ.
డిగ్రీ పూర్తయ్యి ఎంబిఏ చదువుతోంది. తెలివైనది. ఇంట్లో కంప్యూటర్, ఇంటర్నెట్ ఉంటే లైబ్రరీకెళ్లి నోట్సు రాసుకోనక్కర్లేదని తండ్రితో కొనిపించింది. కాలేజీలో అంతా నెట్ కబుర్లే. ఫేస్‌బుక్‌తో ఎంతమంది పరిచయాలవుతారో, ఎనె్నన్ని మంచి విషయాలు తెలుసుకోవచ్చునో పెద్దపెద్ద వాళ్లు కూడా ఈ ఫేస్‌బుక్ ద్వారా పరిచయం అవుతారని చెప్పుకుంటున్నారు ప్రతిరోజూ. దాంతో అపర్ణ కూడా ఫేస్‌బుక్ ఖాతా తెరిచింది. తన వివరాలు జత చేసింది. చదువుతోపాటు ప్రతిరోజు ఎవరెవరు ఫేస్‌బుక్‌కి మెసేజ్‌లు పెడుతున్నారో చూసుకోవటం, ఆవిధంగా ఫేస్‌బుక్ ప్రయాణంలో ఒకరి అభిరుచులు ఒకరికి, ఒకరి వ్యక్తిగతం మరొకరికి నచ్చటంతో మధుకర్‌తో ఫేస్‌బుక్‌లో పరిచయం పెరిగింది. ఇక ప్రతీరోజు చాటింగ్‌లు, షేరింగ్‌లు మొదలయ్యాయి. త్వరలో కలుసుకుందామని ప్లాన్ చేసుకుంటున్నారిరువురూ.
ఓ రోజు రాత్రి అపర్ణ చాటింగ్ చేస్తుండగా, తమ్ముడు రవి వెనుకగా వచ్చి ‘అక్కా! ఎవరు నీ స్నేహితులా? చాటింగ్ చేస్తున్నావ్?’ అడిగాడు. ‘ఔనురా నా ఫ్రెండ్ మధుతో చేస్తున్నాను. ఈ మధ్యలో ఫేస్‌బుక్‌లో పరిచయం అయ్యింది’ కాస్త అబద్ధం జోడించింది. చిన్నవాడు నమ్మేశాడు. దినదిన ప్రవర్ధమానం అయ్యింది వారి ఫేస్‌బుక్ పరిచయం. మధుకర్ బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. రెండేళ్లయ్యింది ఉద్యోగంలోచేరి. అలా వీరిరువురు స్నేహాన్ని మించి ప్రేమించుకొంటున్నారు.
పరీక్షలు దగ్గరకొస్తున్నాయి. అపర్ణ దీక్షగా చదువుతోంది. పరీక్షలు పూర్తయ్యే దాకా ఇక మాటలు వద్దని మధుకర్‌కి చెప్పేసింది. ఆమెకి చదువుమీదున్న శ్రద్ధకి ముచ్చటేసింది. పరీక్షల రోజు రానే వచ్చింది. పెందరాళే లేచి, స్నానం అదీ చేసి, గుడికెళ్లి వచ్చింది. కాసేపు చదువుకుని టిఫిన్ తిని, ‘అమ్మా! పరీక్షకి బయలుదేరుతున్నాను’ అంటూ చెప్పి బయటకు వెళ్లింది. ‘ఆటోలో వెళ్లమ్మా! ఈ బస్సులు టైంకి వస్తాయో లేదో’ అంది తల్లి. ‘అలాగేనమ్మా’ అంటూ బయలుదేరింది. రెండడుగులు వేసిందో లేదో, పక్కనే కారొచ్చి ఆగింది. ‘రామ్మా! అపర్ణా!’ అంటూ తమ పక్క ఫ్లాట్‌లో ఉన్న రమేష్‌గారు పిలిచారు. ‘్ఫర్వాలేదంకుల్, ఆటోలో వెడ్తాను’ మొహమాటంగా అంది. ‘నేనటువైపుగా వెళ్తున్నాను రామ్మా’ అంటూ కారులో ఎక్కించుకున్నారు. పరీక్ష హాలు దగ్గర దింపి వెళ్లారు. ఆయనకి అపర్ణని చూస్తుంటే ఎంతో సంతోషంగా అన్పించింది. మహలక్ష్మిలా ఉంది. మా సాయికిచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది. పక్కింట్లోనే ఇనే్నళ్ల నుండి ఉన్నా గమనించనే లేదు. ఎంత వినయంగా ఉంటుంది. మా సాయిని అపర్ణ పరీక్షలయ్యాక రమ్మని చెప్పాలి అనుకున్నారు. అలా ఆయన ఇంటికి వెళ్లాక భార్యతో కలిసి ఈ విషయం చర్చించాడు. అలా పక్కింటి అబ్బాయితో అపర్ణ పెళ్లి అని ఆ నోట, ఈ నోట పాకింది. ఓ రోజు లాంఛనంగా పిల్లను చూడటానికి వెళ్లారు. పరీక్షలైపోయాయి. హాయిగా ప్రశాంతంగా ఈ రోజు రాత్రికి మధుకర్‌తో ఛాటింగ్ చేసుకోవచ్చనుకుంది అపర్ణ. ఈలోగా రమేష్ గారు వాళ్లు వచ్చారు. పక్కింటాళ్లన్న మాటేగాని ఒకరింటికి ఒకరు వెళ్లిందే లేదు. నగరాల్లో ఇది మామూలే. ఒకరి పేర్లు, ఊర్లు మరొకరికి తెలియవు. ఎనె్నన్నో షాది.కామ్స్ కొడుకుకి పెళ్లి సంబంధాలు వెదికారు. అయితే వాళ్లకి పక్కింట్లోనే పిల్ల ఉందని తెలియనే లేదు. ‘ఊరికే పరిచయాలు చేసుకుందామని వచ్చాం. ఇదిగో మా అమ్మాయి. మా అబ్బాయి బెంగుళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. మీ పిల్లలేం చదువుతున్నారు?’ రమేష్ అడిగాడు.
‘అమ్మా! అపర్ణా! ఇలారా’ అంటూ ‘తమ్ముడేడమ్మా’ అడిగాడు తండ్రి. ‘ఆడుకోటానికి వెళ్లాడు నాన్నా!’ అని ‘నమస్తే అంకుల్, ఆంటీ’ అంటూ పలుకరించింది వారిని.
‘కూర్చోమ్మా! ఎప్పుడూ మీరు మా ఇంటికి రాలేదు సరే. ఓసారి కల్సుకుంటే, బాగుంటుంది’ అని వచ్చామమ్మా అన్నాడు రమేష్. అపర్ణ లోపలికెళ్లి కాఫీలు తెచ్చింది. అంతా సరదాగా మాట్లాడుకున్నారు.
ఓ గంట కూర్చుని వాళ్లు వెళ్లారు. వాళ్లు వెళ్లాక అపర్ణ కంప్యూటర్ ముందు కూర్చుని మధుతో చాటింగ్ మొదలుపెట్టి ఈరోజు పక్కింటి వాళ్ల కబుర్లు అవి ఇవీ చెప్పింది. ఎప్పుడొస్తావని అడిగింది. సస్పెన్స్ అన్నాడు. అలా ఓ గంట దాకా చాలా కబుర్లు చెప్పుకున్నారు.
మర్నాడు ఉదయం తండ్రి ఆఫీస్‌కెళ్లాక తన స్నేహితురాలైన రాధ దగ్గరకెళ్లింది. ‘ఏమ్మా! అపర్ణా! చాలా రొజులకొచ్చావ్? పరీక్షలకి తిండి, నిద్ర లేక చదివి చిక్కిపోయవమ్మా’ అంటూ రాధ తల్లి గుమ్మంలోనే అపర్ణని పలకరించింది. ‘ఇదిగో రాధా! అపర్ణ వచ్చింది’ అంటూ దొడ్లోకి వినిపించేలా కేకపెట్టింది. ‘నేను లోపలకెడ్తాను లెండి, అది పనిలో ఉన్నట్టుంది’ అంటూ పెరట్లోకెళ్లింది అపర్ణ. ఓ మంచం వాల్చి, ‘కూర్చోవే, నినే్న వస్తావనుకున్నాను’ అంది రాధ. ‘వచ్చేదానే్న మా పక్కింటి వాళ్లు మా ఇంటికి వచ్చారు. ఏదో పిచ్చాపాటి కబుర్లు. దాంతో గడచిపోయింది నిన్న. ఇంకా ఏంటి కబుర్లు? పరీక్షలయ్యాయి కదా! తర్వాత ఏం చేద్దామని? పెళ్లా? ఉద్యోగమా?’ అడిగింది అపర్ణ.
‘నేను బ్యాంకు పరీక్షలు రాస్తాను. దానికోసం కోచింగ్ తీసుకుందామనుకుంటున్నాను’ అంది రాధ. ‘మరి నీ సంగతేమిటి? నేను జాబ్ చేయాలనే అనుకుంటున్నాను. కానీ అంటూ...’ నసిగింది.
‘ఏంటి సంగతి? ఏమైనా ప్రేమలో పడ్డావా?’ అల్లరిగా అడిగింది. ‘ఔనే! అది ఎలా చెప్పాలో ఇంట్లో...’ అంటూ తన ఫేస్‌బుక్ ద్వారా మధు పరిచయం, ఒకరినొకరు చూసుకోకుండానే ప్రేమించుకుంటున్నాం. త్వరలో ఇంట్లో చెప్పి పరిచయం, ఒకరినొకరు పెళ్లి చేసుకుందామనుకుంటున్నాం అంది.
‘నిజమా? ఇంత అమాయకంగా ఉండే నీవు ప్రేమలో మునిగావా?’ ఆశ్చర్యంగా అడిగింది రాధ.
‘ఎల్లుండి నా పుట్టినరోజు. మధుకర్ వస్తానన్నాడు. ఏదైనా పార్కులోనో, గుళ్లోనో కల్సుకుందామనుకుంటున్నాం. నీవుకూడా నాతో రావాలే. ప్లీజ్!’ అని అడిగింది రాధని.
‘మీ ఇద్దరి మధ్య నేనెందుకే!’ అల్లరిగా అంది రాధ.
‘నాకు భయంగా ఉంది. తోడు రావే’ అంది అపర్ణ.
‘సరేలే! తప్పక వస్తాను’ అంది రాధ.
కాస్సేపుండి ఇంటికి వచ్చేసింది అపర్ణ. మర్నాడు అమ్మానాన్న హాల్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. రవి కూడా. ‘నాన్నా! అక్కకు పెళ్లా?’ అడుగుతున్నాడు.
షాకయ్యింది అపర్ణ. అయినా సందేహ నివృత్తి చేసుకుంటామని, ‘ఏంటమ్మా విషయం?’ అడిగింది.
మన పక్కింటి రమేష్ గారబ్బాయిని, నీకిచ్చి పెళ్లి చేయాలని మేమంతా నిర్ణయించాము. అబ్బాయి పని మీద నాలుగు రోజులు ఇక్కడికి వస్తున్నాడట. రేపు పెళ్లి చూపులు ఏర్పాటు చేయమని చెప్పారు. అదీ సంగతి.
ఫోటో చూపించారు. ‘బాగున్నాడు అబ్బాయి. మంచి ఉద్యోగం. అంతా బాగుంది. కాదనటానికేం లేదమ్మా’ అన్నారు.
‘నాన్నగారూ! మీకో విషయం చెప్పాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడు సమయం, సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. ఓసారి ఇలా రండి!’ అంటూ తన కంప్యూటర్ ఆన్‌చేసి అతని ఫోటో, వివరాలు చూపెట్టి మేమిద్దరం సంవత్సరం నుండి స్నేహితులం. తర్వాత ప్రేమికులుగా మారాం. ఇతను కూడా మంచి ఉద్యోగం చేస్తున్నాడు. ఒకరినొకరు చూసుకోకుండానే పరస్పరం ఇలా ఫేస్‌బుక్ ద్వారానే ఒకరి విషయాలు మరొకరు తెల్సుకున్నాం. అతను రేపు సాయంత్రం గుడికొచ్చి నాకు ఫోన్‌చేసి కలుస్తానని చెప్పారు. ఇదీ నాన్న విషయం’ అంది అపర్ణ. ఆ అబ్బాయి ఫోటో, వివరాలు అన్నీ చూసి, తల్లీ తండ్రి ఒకరి ముఖం ఒకరు చూసుకుని నవ్వుకున్నారు. ‘తల్లీ! రమేష్ గారు బలవంతం చేయడంతో ఒప్పుకున్నాను. వాళ్ళ అబ్బాయి కూడా వంకలేని చందమామలా ఉన్నాడు. ఊరికే కాస్త పరిచయం చేసుకోండి చాలు. ఎందుకంటే మన సంస్కారం నిలుపుకోవాలి కదా! సాయంత్రం కదా అతను గుడికొచ్చేది. పగలు రమేష్ గారి కుటుంబం వస్తారు. ఓ గంటమ్మా! ఊరికే సరదాగా మాట్లాడుకుందాం. నీకిష్టం లేనిదే ఏదీ జరగదమ్మా. కంగారు పడకు’ అన్నారాయన. ‘సరే నాన్నా! మీరు చెప్పినట్లే చేద్దాం’ అంది. అపర్ణ రాధకి ఫోన్‌చేసి రేపు పది గంటలకల్లా రావాలి, ఇదీ పరిస్థితి అని చెప్పింది.
అలా ఆ రాత్రి గడిచింది. మర్నాడు ఆదివారం. అంతా అపర్ణని విష్ చేశారు హేపీబర్త్‌డే అంటూ.
తొమ్మిదికల్లా రాధ వచ్చింది. ‘ఏమే! నీకు రెండు పెళ్లిచూపులా పుట్టిన రోజున’ అంటూ ఆటపట్టించింది.
కొత్త పింక్ చీర కట్టుకుని అమ్మానాన్నల ఆశీస్సులు తీసుకుంది. ఇద్దరు స్నేహితురాళ్లు కబుర్లు చెప్పుకుంటున్నారు.
ఈలోగా తలుపు చప్పుడైంది. రండి అమ్మా, నాన్నలు ఆహ్వానించడం విన్పించింది.
అమ్మా, రాధా! మీ స్నేహితురాల్ని తీసుకురా. పరిచయం చేద్దామన్నారు అపర్ణ తండ్రి. ఇద్దరూ హాల్లోకొచ్చారు.
‘రమేష్ గారి అబ్బాయి చాలా బాగున్నాడు’ చెవిలో గుసగుసగా అంది రాధ. ‘రామ్మా కూర్చో! కొత్తవాళ్లు ఎవరూ లేరు’ అంటూ రమేష్ దంపతులు ఆహ్వానించారు అపర్ణని.
అపర్ణ వెళ్లి కూర్చుంది. రమేష్ గారి అబ్బాయిని పరిచయం చేశారు మా అబ్బాయి సాయిమధుకర్ అని. చివ్వున తలెత్తి చూసింది తల్లీ, తండ్రి వైపు. వాళ్లు నవ్వుతున్నారు. అంతా చప్పట్లు కొట్టారు.
పక్కింటి అబ్బాయిని ఫేస్‌బుక్ ద్వారా పరిచయం చేసుకుని పెళ్లి చేసుకోబోతున్న అపర్ణని చూసి ఇద్దరూ ఒకరివైపు ఒకరు చూసి నవ్వుకున్నారు.

- యు. శైలజ, రాజమహేంద్రవరం

పుస్తక పరిచయం

మనకు బతుకు పాఠం
‘వుప్పల బతుకు పుస్తకం’

ఈ తరం చదువరులకు బతుకు పుస్తకం అవసరత ఎంతో ఉందని తలచి ఆ పుస్తక ముద్రణ కోసం ఎన్నో వ్యయ ప్రయాసలొనర్చి ద్వితీయ ముద్రణకు తీవ్ర కృషి చేసిన వెలమాటి సత్యనారాయణని అభినందించుకొనే డాక్టర్ వుప్పల లక్ష్మణరావు బతుకు పుస్తకం పరిచయంలోకి వెళ్లడం సబబు. రాజమండ్రిలో స్థిర నివాస మేర్పరచుకొని సాహిత్యకారులందరితోను సాహిత్య అభిమానులతోనూ సన్నిహిత సంబంధాలున్న వ్యక్తి వెలమాటి. ఆయనెంత పుస్తక ప్రియులో పఠన పరులో బతుకు పుస్తంపై పెట్టిన శ్రద్ధకు నిదర్శనం. ఆ క్రమంలోనే ఆయన దగ్గరకు వెళ్లినప్పుడు ఎంతో ఆప్యాయంగా అందించిన పుస్తకం ఇది. భావితరానికి ముఖ్యంగా యువతకు మరింత దగ్గరగా చేరాల్సిన బాధ్యతగా దాన్ని అందుకున్నారు. ఎన్నో వాస్తవకర విషయాలు మరెన్నో ఆసక్తికర సంగతులు చదువుతూ పోతుంటే ఆనాటి కాలానికి మనల్ని లాక్కుపోయిన అనుభూతి కలుగుతుంది.
తొంభై నాలుగేళ్ల వయసుకల సాహితీ మిత్రుని ఆలోచనకు అవకాశం కలిగించే ప్రయత్నంగా ఈ పుస్తకాన్ని ముద్రించడం జరిగింది. క్వాలిటీ పరంగా చాలా క్లారిటీతో పుస్తకాన్ని తీర్చిదిద్దటంలో సాహితీమిత్రులు కృషి ప్రశంసనీయమనే చెప్పాలి. 1982లో ఆంధ్రజ్యోతి వీక్లీలో సీరియల్‌గా వచ్చింది. ఆ తర్వాత 1983లో పుస్తకంగా వచ్చింది. 32 ఏళ్ల తర్వాత ఒక ఉత్తమ పుస్తకం తెలుగు పాఠకులకు దూరం కాకూడదనే కృతనిశ్చయంతో బతుకు2 పుస్తకాన్ని అందుబాటులోకి తెచ్చారు సాహితీమిత్రులు.
వుప్పల లక్ష్మణరావు లాంటి నిస్వార్ధపరజీవి గురించి, ఆచరణవాది గురించి తెలుసుకొనే వీలు ఈ పుస్తకం ద్వారా కలుగుతుంది. అనేకానేక మార్పులు, సవాళ్లు, తనకు ఎదురైన అనుభవాలు గుదిగుచ్చి అందించారు. వెనుకటి తరంవారి ఆలోచనలు, ఆశయాలు, దానివల్ల సమాజ స్థితిగతులపై అంచనాలు, ఆనాటి సామాజిక సంబంధాలు, వైరుధ్యాలు ఎలా ఉన్నాయో, వాటినెలా ఎదుర్కొన్నారో లాంటి సంగతులు దీనిలో పుష్కలంగా దొరుకుతాయి. దేశాంతర, కులాంతర, మతాంతర వివాహంతో ఎన్నో మార్పులకు కొన్ని కొన్ని సంస్కరణలకు మార్గాన్ని సుగమం చేశారు లక్ష్మణరావు. ఆయనొక వృక్షశాస్త్ర శాస్తజ్ఞ్రుడు అయినప్పటికీ ప్రాపంచిక దృక్పథంతో సంగీత సాహిత్య కళాభిరుచులు ఏర్పరచుకున్నారు. వామపక్ష భావజాలంతో తన అభిప్రాయాలను, ఆలోచనలను స్థిరపరుచుకోవడంతోపాటు ఈ దేశ దౌర్భాగ్యకర పరిస్థితులను, స్థితిగతులను పరిశీలన దృష్టితో గమనించినవారు కనుకనే మన పరిశోధనలు దేశానికి ఉపయోగపడినా సామాన్యుడి జీవితంలో ఏ మార్పు తీసుకురాలేదని ఆవేదన పడతారు.
1898లో పుట్టిన ఓ వ్యక్తి ఆత్మ కథ ఎంత ప్రభావశీలమయిందో, ఎంత పరిశీలనాత్మకమయిందో పుస్తకాన్ని చదువుతుంటే తెలుస్తుంది. విసుగురాని పరిచయాలు, విరామం తెలీని పాత్రలు, వినోదం పంచే సంఘటనలు ఆత్మకథను ఆనందానుభూతిగా చదువుకొని హాయిని పొందుతాం. అయితే ఇప్పటితరం పాఠకులు అర్ధం చేసుకోవాలంటే వారికి కనీస ప్రపంచ చరిత్ర తెలిసి ఉండాలనటం ఓల్గా అన్నట్టు నిజం. అలా ఇది అత్యంత అవసరకరమైన పుస్తకం అవుతుంది ప్రతి సమాజానికి. అయితే బతుకు పుస్తకం చదవడమంటే ప్రపంచ చరిత్రను చదవడమే మరి.
పర్లాకిమిడికి చెందిన కుర్రాడు మాస్కో వరకు వెళ్లిన ఆయన సాగించిన బతుకు పాఠం కనిపిస్తుంది మనకు. సనాతన బ్రాహ్మణ కుటుంబానికి చెందిన పిల్లాడు దేశ విదేశాలు తిరిగి ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల వ్యాప్తికి తన తెలివితేటలు ఉపయోగించడం ఆ కుటుంబ అభ్యుదయ భావజాల దీపికకు తార్కాణం. జాతీయోద్యమంలో పాల్గొనటమే కాకుండా ఖద్దరు ఉద్యమంలోను తనదైన ముద్రతో నూలు వడికే చరఖాను రూపొందించటం. పెంటబండి కథ, స్విస్ వనిత మెల్లీ సోలింగర్‌తో వివాహం, ముందు సాహచర్యం, భారతదేశ సాంప్రదాయాలతో మెల్లీకి పరిచయం, ఆమోదం, మెల్లీ కోరిక మేరకు మాస్కోలో పెళ్లి.. ఈ ఘట్టాలు వెనుక నిలిచిన బలమైన వ్యక్తిత్వాలు, విశ్వాసాలు పాఠకులకు జీవితం పట్ల ఉండవలసిన వైఖరికి తప్పక మార్గదర్శకాలవుతాయి.
వుప్పల లక్ష్మణరావు ఎడిన్‌బరోలో చదువుకున్నారు. జర్మనీలో డాక్టరేట్ చేశారు. భారతదేశం వచ్చారు. కాకినాడ మొదలుకొని కోల్‌కత్తా, ఆలీఘడ్ ప్రాంతాల్లో ఉద్యోగాలు.. పరిశోధనలు చేశారు. పేచీలూ పడ్డారు. సబర్మతి సందర్శించారు. చరఖాను ఆధునికీకరించడంలో కృషిచేశారు. కాంగ్రెస్ సమావేశాలకు హాజరయ్యారు. దేశ స్థితిగతులను జర్మనీలోకి అనువదించి వ్యాసాలు పంపారు. విజయవాడలో సిమెంటు ఫ్యాక్టరీ నిర్మాణానికి ఊహకందని కృషిచేశారు. బతుకు అంతా వైవిధ్యమే. నాటి ప్రముఖులందరూ సుపరిచితులే. లక్ష్మణరావు ప్రచారం కోరని ప్రముఖులు. మెల్లీ ఈత కథ ఒళ్లు గగుర్పొడిచే సంఘటన. శాస్తజ్ఞ్రుడిగా అనేక పరిశోధనలు చేసిన ఆయన అనేక దేశాల్లో ఉన్న విశ్వ విద్యాలయాలకు విజిటింగ్ ప్రొఫెసరుగా పనిచేశారు. ఆయన ప్రతిభకు నీరాజనాలు అందుకున్నారు. అయినా ఎక్కడో వెలితి. సాహిత్యంలోనే తన మనసుకు సంతృప్తి అనుకున్నారు. అలా మాస్కో వెళ్లిన ఆయన 12 సంవత్సరాలు ప్రగతి ప్రచురణాలయంలో అనువాదకునిగా ఒక ముఖ్యభూమిక వహించారు. చెంగిజ్ ఐత్ మాతోవ్ రాసిన 3జమీల్యా, 3తల్లీ భూదేవి2 లాంటి రచనలు తెలుగు పాఠక హృదయాలను ఎంత హత్తుకున్నాయో చెప్పనలవికావు. దాదాపు 40 రష్యన్ పుస్తకాలు తెలుగులోకి అనువదించారు. అలాగే ఆర్మేనియన్ సాహిత్యాన్ని కూడా తెనుగించారు. గోర్కె తనకు పెద్ద అభిమాన రచయిత అంటారు లక్ష్మణరావు.
మన తెలుగు భాషలోని గొప్పతనం, మనోభావాలు అర్ధవంతం కావటానికి వుప్పల లక్ష్మణరావు వంటి మహనీయుల రచనలు ఎంతెలా తోడ్పడతాయో బతుకు పుస్తకం చదివితే అర్థవంతం అవుతుంది.

- రవికాంత్, సెల్: 9642489244

పేజీలు - 208, వెల - 150/-
ప్రతులకు:
సాహితీ మిత్రులు
28-10-16
మసీదువీధి, అరండల్‌పేట
విజయవాడ - 520002
సెల్: 9490634849

మనోగీతికలు

నువ్వు మారి తీరాలి

ఒక్క
అక్షరాన్ని
అంతం చేయాలనుకొంటే
అది వందల, వేల అగ్ని కణాలై
నిన్ను దహించివేస్తుంది
ఒక్క
ప్రశ్నించే గొంతును నులిమేస్తే
అది
వేల, లక్షల శతఘు్నలుగా మారి
నీ గుండెల్లో ప్రతిధ్వనిస్తుంది
కుల-మత ఛాందసాలపై
ఒక్క
తిరుగుబాటును అడ్డుకొంటే
అది లక్షల, కోట్ల
హృదయ విస్ఫోటనలుగా మారి
కులం మూలాల్నీ,
మతం పునాదుల్నీ,
పెకలించి వేస్తుంది
నువ్వే ఒప్పుకొన్న
ఇంతమంది మేధావులంతా
ఇది అమానుషం అంటూ
తమ కీర్తి కిరీటాల కుబుసాల్ని
డులిచేస్తుంటే
ఇంకా నువ్వు
మారననటంలో అర్థం లేదు
స్వేచ్ఛగా, విజ్ఞతతో
తన భావాన్ని ప్రకటించే
మనిషివాదాన్ని వాదంతో
గెలవలేని ఒక
అసమర్ధుడివి నువ్వు
అక్షరాన్ని అక్షరంతో
ఎదుర్కోలేని ఒక పిరికిపందవి నువ్వు
అందుకే
అక్షర స్రష్టను చంపి
అంతులేని అపజయాన్ని
తిరుగులేని అపఖ్యాతిని
మూటకట్టుకొన్నావు
ఇప్పటికైనా నువ్వుమారాలి
ఎందుకంటే రేపు నీ కడుపునే
మరో భావ ప్రకటనాధీరుడు
పుట్టినా పుడతాడు
వాణ్ణి నీలాంటి మరో
భీరువు కడతేర్చకుండా
కాపాడుకోవాలిగా
అందుకే నువ్వు మారి తీరాలి.

- జోశ్యుల కృష్ణబాబు
పెద్దాపురం, తూ.గో.జిల్లా
సెల్: 9866454340

హైకూలు
రాత్రి
రాలిన పూలు
ఉదయమై వికసించాయి

పూలతోటలో
సీతాకోక
చిరునవ్వుల నాయిక

ఆకాశం నుండి జారుతున్న
వాన చినుకుల
వెలుగు

తోటలో
పూల కళ్లు
కొత్త దృశ్యాలకు నకళ్లు

తెల్లవారింది
అక్షరాల పక్షులు
కాలం కాగితంపై పరుగు
చిన్నప్పటి దీపం
పుస్తకంలో వెలుగుతోంది
నెమలీకలా

రాలిన చిగురు
మట్టి గుండెలో
సుగంధం నింపుతోంది

- నల్లా నరసింహమూర్తి
అమలాపురం
9247577501

అద్దంలో
జీవిత ముఖచిత్రం!
స్వప్న సాగరతీరంలో తేలుతూ తూలుతూ
ఆడుతూ పాడుతూ, గగన విహంగంలో
విహరిస్తూ, నవ్వుతూ కవ్విస్తూ
జాము రాతిరి జాబిలిని కౌగిలిస్తూ
మురుస్తూ మురిపిస్తూ!
కటిక చీకటి కనుమరుగవుతున్న వేళ!
స్వప్న సాగర తీరం దాటి
ఒడ్డుకు వస్తున్న సమయాన
రెక్కొల స్వప్న చిత్రం
కనుల ముందు కదులుతున్న వేళ!
కొక్కొరోకో కోడికూత విని ఉలిక్కిపడి
కలల కాపురాన్ని కూల్చుకుంటూ
నిజసాగర తీరంలో తొలి సంధ్యా కిరణాలకు
ఊగుతూ ఊకొడుతూ
కనురెప్పల మధ్య బందీ అయిన స్వప్న చిత్రాలు!
చెల్లా చెదురై డ్రీమ్‌లైఫ్‌కి గుడ్‌బై చెప్పి
రియల్ లైఫ్‌కి వెల్‌కమ్ పలుకుతూ
బరువు బాధ్యతలు అనే వాహనంలో విహరించి
విహరించలేక అలసిసొలసిన
కనులకు ఆహ్వానం
పంపుతూ వెల్‌కమ్ చెబుతుంది డ్రీమ్‌లైఫ్!
సూర్యుని చుట్టూ
భూమి పరిభ్రమించినట్లు
డ్రీమ్‌లైఫ్ అండ్ రియల్‌లైఫ్ చుట్టూ మానవుడు
నిరంతరం పరిభమ్రిస్తాడన్నది మాత్రం
స్వప్నం కాదు వాస్తవం!!

- మజ్జి పాపినాయుడు
గడసాం (విలేజ్ పోస్టు)
మం. దత్తిరాజేరు, విజయనగరం (జిల్లా)
ఫోన్: 9100475182

అనంతరాగం
ప్రేమించే హృదయం లేనప్పుడు
ఆకర్షించే అందం ఎందుకు?
పారేటి నీరే లేనప్పుడు
తోవ చూపే ఏరెందుకు?
వెనె్నల తోడెరుగని చందమామలా
నీవు లేని నేనెలా జీవిక సాగించగలను?
ప్లీజ్! ప్రేమ అనేది ఆట కాదు
పలకపైన గీసే గీత కాదు
చెరిపితే చెరిగిపోయేదా
మరలితే మరిచిపోయేదా?
ప్రియా!
అలల ప్రయాణం తీరం వరకు
కలల ప్రయాణం మెలకువ వరకు
ప్రేమ ప్రయాణం కడవరకు!

- పి. కరుణ్‌కుమార్, సాలూరు. సెల్ : 94911 24418

న్యాయం ఎక్కడ?
ఇక్కడంతా స్వార్థమే
ఎవరూ ఎవరి కోసం
ఒక్క క్షణం ఆలోచించరు
ప్రజల బతుకులు బాగు చేయాల్సిన నేతలు
తమ బాగు చూసుకుంటారు...
తమ జేబులు నింపుకుంటారు!
అయ్యవార్లు సర్కారీ జీతాలు తీసుకుని
పాఠాలు మాత్రం
ఇంటి దగ్గర ట్యూషన్లలోనే చెబుతారు
పోలీసులు లంచమిస్తేనే న్యాయం చేస్తారు
ఇక న్యాయం ఎక్కడ! అడవిలోనా?

- లావణ్యా ప్రసాద్, విశాఖపట్నం

email: merupurjy@andhrabhoomi.net

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, నేషనల్ హైవే, ధవళేశ్వరం, తూ.గో.జిల్లా. email: merupurjy@andhrabhoomi.net

- యు. శైలజ