విశాఖపట్నం

నేనే దోషిని! ( కథానిక)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘కొడుకు బలవంతపు చావుకి తనే కారణం. తనలో సహనగుణం ఉంటే ఇంత అనర్థం జరగకపోను. తన కోపమే తన శత్రువు. తొందరపాటు, అసహనం ఇవన్నీ చేతికి అంది వచ్చిన కొడుకుని నిష్కారణంగా దూరం చేశాయి’ కానిస్టేబుల్ శంకరం బాధగా అనుకున్నాడు.
సమాజంలో అందరూ తమలోని బలహీనతలను బయటికి చేప్పుకోరు. తమ బలాల గురించి మాత్రమే చెప్పుకుంటారు. బలహీనతల గురించి బయటికి చెప్పుకుంటే అంతా నవ్వుతారని, హేళన చేస్తారని భయం. కానీ శంకరం మాత్రం తన బలహీనతని, తప్పుని అంగీకరించాడు. తన తొందరపాటు చర్యని విమర్శించుకున్నాడు.
కొడుకు తనకి తలకొరివి పెడతాడని అనుకుంటే తానే కొడుక్కి తలకొరివి పెట్టాల్సి రావడం అతన్ని నిలువనీయడం లేదు. ఆలోచనల్లో కొట్టుకుపోతున్న శంకరం చితి వైపు చూశాడు. ‘నాన్నా నన్ను కొట్టకు. కాళ్లతో తనె్నయ్యకు. నేను చచ్చిపోతాను’ కొడుకు మధు అరుస్తున్నట్లే శంకరానికి భ్రమ కలిగింది.
తోటి కానిస్టేబుల్ సూర్యం అతన్ని నడిపించుకుంటూ వెళ్లాడు.
‘నా కొడుకుని రాక్షసత్వంతో క్రూరంగా చంపేశాను’ అనుకున్నాడు శంకరం. అతని భార్య పార్వతి శాపనార్థాలు పెడుతోంది. ‘నా కొడుకుని నువ్వే చంపేశావు నువ్వే చంపేశావు’ అని ఆక్రోశించింది.
అతను కళ్లు నులుముకుని చూశాడు.
అక్కడెవరూ లేరు. అంతా తన భ్రమ అనుకున్నాడు.
తన కొడుకు చెడిపోతున్నాడని తోటి కానిస్టేబుల్ సూర్యం చెబితే శంకరానికి కూడా తన కొడుకు గుర్తుకొచ్చాడు. ఈ మధ్య వాడి ప్రవర్తన బాగులేదని భార్య పార్వతి అనడం గుర్తుకొచ్చింది. అతనికి కూడా కొడుకు మధు ప్రవర్తనలో తేడా తెలిసి వస్తోంది. సూర్యం తన కొడుకు గురించి చెప్పి బాధపడుతుంటే శంకరం ఎలాగైనా తన కొడుకుని సరైన దారిలో పెట్టాలని అనుకున్నాడు.
అతని చదువు గురించి పట్టించుకోవాలని భావించాడు. ఇప్పుడు పని ఒత్తిడి వల్ల ఇంట్లో సమస్యలు పట్టించుకోవడం లేదు కానీ, ఉద్యోగం వచ్చిన కొత్తలో, పెళ్లి కాక ముందు తన పై అధికారి ఇంట్లో అన్ని పనులు చేసేవాడు. చివరికి అతని కొడుకు బాగా చదవడంలేదని అంటే, వాడికి చదువు కూడా చెప్పేవాడు. కానీ ఇప్పుడు తన కొడుక్కి మాత్రం చదువు చెప్పలేకపోతున్నాడు. వాడు ఏం చదువుతున్నాడు, ఎలా చదువుతున్నాడో కూడా తెలియదు. అదే తను చేసిన తప్పు. తల్లి మాట ఖాతరు చేయని కొడుకు మొండిగా, జులాయిగా తయారయ్యాడు. సూర్యం కొడుకు గురించి విని ఎలాగైనా తన కొడుకు గురించి పట్టించుకోవాలని అనుకున్నాడు గానీ, అప్పటికే సమయం మించిపోయింది.
ఆ రోజు నాలుగు రోజుల పని ముగించుకుని ఇంటికి వచ్చాడు శంకరం. భార్య పార్వతి మధు గురించి ఫిర్యాదు చేసింది. ‘‘వాడు చిల్లర దొంగతనాలకు కూడా అలవాటు పడ్డాడు. ఈ అలవాటు మొగ్గలోనే తుంచేయాలి. లేదంటే కష్టం’’ అంది భార్య.
‘‘మధు వచ్చాడా?’’ అడిగాడు.
‘‘లేదు! శ్రీను దగ్గరకి వెళ్లాడు. వాళ్ల అమ్మానాన్న ఊర్లో లేరని, మనవాడిని తోడు తీసుకెళ్లాడు’’ చెప్పింది పార్వతి.
శ్రీను మీద శంకరానికి మంచి అభిప్రాయం లేదు. తల్లీదండ్రీ ఇద్దరూ ఉద్యోగస్తులు కావడం వల్ల శ్రీను అడిగింది ఇస్తారు వాళ్లు. గారాబంగా పెరుగుతున్న శ్రీనుతో కూడి మధు చెడిపోతున్నాడు అనుకున్నాడు శంకరం. గబగబా శ్రీను వాళ్ల ఇంటి వైపు నడిచాడు.
అతను వెళ్లేసరికి తలుపులు మూసి ఉన్నాయి.
తట్టాడు శంకరం.
కొద్దిసేపటికి తెరచుకున్నాయి. లోపలున్న పిల్లలందరిలో భయాందోళన.
శంకరం గదిని కలియజూశాడు. గది నిండా సిగరెట్టు పీకలు. ఎదురుగా టేబులు మీద మద్యం బాటిళ్లు, ఎదురుగా నెట్ ఆపు చేసి ఉంది కాని ఆ నెట్‌ని పిల్లలు ఎలా ఉపయోగించుకుని ఉంటారో అతనికి అర్థమయింది. అశ్లీల చిత్రాలు చూసి ఎంజాయ్ చేసి ఉంటారు.
మధు బిక్కుబిక్కుమంటూ తండ్రి వైపు చూశాడు. శంకరానికి కోపం వచ్చినా తమాయించుకున్నాడు.
కొడుకు చెయ్యి పట్టుకుని ఇంటి వైపు నడిచాడు.
అతను భయంతో వణుకుతున్నాడు.
ఇంటికి వెళ్లిన తర్వాత శంకరం బెల్టు తీసి కొడుకుని బండబూతులు తిడుతూ కొట్టడం మొదలుపెట్టాడు. మధు బాధగా అరుస్తున్నాడు. ‘నాన్నగారూ! కొట్టకండి మీరు చెప్పినట్లే వింటాను’ అని తండ్రి కాళ్ల మీద పడి ఏడుస్తున్నాడు. పార్వతి అడ్డుకోబోయింది. ఆమెని ఒక్క తోపు తోశాడు శంకరం. ఆమె దూరంగా వెళ్లి పడింది.
మధు ఏడుస్తున్నాడు. తనని తాను రక్షించుకోవడానికి అరుస్తున్నాడు. చేతులు అడ్డు పెట్టుకుంటున్నాడు. అయినా అశక్తుడయ్యాడు. అతని అరుపులు ఆగిపోయాయి. రాక్షసత్వం నుండి బయటపడ్డ శంకరం కొడుకు వైపు చూశాడు. ఆ తండ్రికి కొడుకు ప్రాణాలు అనంతవాయువుల్లో కలసిపోయాయని తెలిసింది.
అతనిలో పుత్రప్రేమ పుట్టుకొచ్చింది. ‘‘మధూ’’ అంటూ కొడుకు నిర్జీవ శరీరంపై వాలిపోయాడు. ‘‘నా కొడుకుని నేనే చంపుకున్నాను’’ అని రోదిస్తున్నాడు.
‘‘నా కొడుకుని చంపేశావు కదయ్యా’’ అంటూ అతన్ని ఒక్క తోపు తోసి కొడుకు మృతదేహంపై ఏడుస్తూ వాలిపోయింది పార్వతి.
అన్ని శవాలకీ పోస్టుమార్టం సమయంలో బయట నిలబడి డ్యూటీ నిర్వహించే శంకరానికి ఈనాడు కొడుకు పోస్టుమార్టం జరుగుతూ ఉంటే బయట నిలబడి కొడుకు శవం కోసం నిరీక్షించాల్సి వచ్చింది.
‘‘శంకరం మన కోపమే మన శత్రువు. మా అబ్బాయి మీద ఎంత కోపం వచ్చినా నేను తమాయించుకుంటాను. నీవు రాక్షసత్వంతో ప్రవర్తించావు. నువ్వు చాలా తప్పు చేశావు’’ సూర్యం మాటలు శంకరం చెవిలో పడుతున్నాయి.
‘సూర్యం తన కొడుకు గురించి చెప్పడం వల్ల కదా నేను మధు ఎడల అంత క్రూరంగా ప్రవర్తించాను. వాడి ప్రాణాలు తీశాను. సూర్యం తన కొడుకు గురించి అలా చెప్పి ఉండకపోతే నేను మధు మీద చేయి చేసుకుని ఉండేవాడిని కాదు. మధు బ్రతికే ఉండేవాడు’ అనుకున్నాడు శంకరం.
ఆలోచనల నుండి తేరుకున్న శంకరం చితి వైపు చూశాడు. బూడిద తప్ప ఏం మిగల్లేదు. భారమైన అడుగులతో బాధని దిగమింగుకుంటూ నడుస్తున్నాడు.
‘ఇలా జరగడానికి నేనే కారణం. నేను దోషిని’ అనుకున్నాడు.

- గూడూరు గోపాలకృష్ణమూర్తి,
పాల్‌నగర్, విజయనగరం-3.
సెల్ : 7382445284.

కథ

అంతులేని కథ!

‘‘అత్తయ్యలో అమ్మనీ, మామయల్లో నాన్నని చూసుకోమన్నారు కదా మీ అమ్మానాన్న. మరిప్పుడు అత్తయ్యలో దెయ్యాన్ని, మామయ్యలో భూతాన్ని చూస్తున్నట్లు ఫీలవుతున్నావెందుకు?’’ భార్యను ప్రశ్నించాడు నీలకంఠరావు ఏమీ తెలియని వెర్రిబాగులాడిలా.
‘‘చెప్పడానికి, వినడానికి బాగుంటాయి నీతులు. పాటించవలసి వచ్చినప్పుడే సమస్యలు ఎదురవుతాయి. అయినా మీ అమ్మానాన్నలకు కూడా చెప్పారు మా పేరెంట్స్ నన్ను సొంత కూతురిలా చూసుకోమని. మరి అలా చూసుకుంటున్నారా మీ తల్లిదండ్రులు?’’ ఎదురు ప్రశ్న వేసింది నీలకంఠరావు భార్య సుందరి.
‘‘మీ ఆడవాళ్లతో వచ్చిన సమస్యే ఇది. ఎడ్డెమంటే తెడ్డెమంటారు. అయినా నువ్వైనా మా అమ్మానాన్నలతో రాజీ పడిపోవచ్చు కదా’’
‘‘రాజీపడక ఢీ అంటూ ప్రతిసారీ తగవులకు పోతున్నామా ఏంటి? అత్తామామలంటే ఇంత నరకం చూపిస్తారని అనుకోలేదు. సినిమాలు, టివిల్లోనే ఇలాంటివి చూసాం’’ అంది సుందరి రోషంగా.
భార్య మూడ్ బాగా లేదని గ్రహించిన నీలకంఠరావు మారు మాటాడకుండా ముఖాన్ని కందదుంపలా పెట్టుకుంటూ బజారుకి పోయాడు.
* * *
నీలకంఠరావు తల్లి అన్నపూర్ణమ్మ పేరుకే అన్నపూర్ణమ్మ. తీరుకు మాత్రం బ్రహ్మరాక్షసి. నీలకంఠరావు తండ్రి వామనరావు పేరు బాగున్నా నరరూప రాక్షసుడు అంటే ఇతనేనేమో అన్నట్లు ఉంటాడు. నీలకంఠరావు స్కూలు మాస్టర్. జీతభత్యాలు బాగానే ఉంటాయి. తల్లిదండ్రులతో పనేముంది. పెళ్లి అయిన నెలరోజులకే అల్లుడూ, కూతురు విశాఖపట్నం వెళ్లిపోతారు కదా. అల్లుడి తల్లిదండ్రులు పల్లెలో ఉంటారు పండగలకి పబ్బాలకు తప్ప తరచూ కలుసుకునేదే ఉండదు. అయినా ముసలివాళ్లు ఎన్నాళ్లు ఉండిపోతారు’’ అని మనసులో అనుకుంటూ గవర్నమెంట్ ఉద్యోగి అల్లుడు కాబోతున్నాడనే ఆనందంతో బి.టెక్ చదువుతున్న సుందరిని బిఎబిఎడ్ చేసి విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్లో స్కూల్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న నీలకంఠరావుకిచ్చి కట్టబెట్టారు సుందరి తల్లిదండ్రులు.
కానీ కథ అడ్డం తిరిగింది.
* * *
నీలకంఠరావు తండ్రి మోతుబరి రైతు. ‘‘వ్యవసాయం చూసుకుంటూ ఉద్యోగం చేసుకో’’ అంటూ కొడుకుని ఆదేశించాడు. నీలకంఠరావు తండ్రి వామనరావుకి అన్నీ కోతిచేష్టలే. వయసు అరవై దాటినా కనిపించిన ఏ ఆడపిల్లతోనూ వెటకారం ఆడకుండా ఉండలేడు. కోడల్ని లొంగదీసుకుని అనుభవించాలి అన్న దురుద్దేశ్యంతో ఉండేవాడు. కొడుకు లేనప్పుడు సుందరి మీద చేతులు వేసి బలవంతం చేయబోయేవాడు. సుందరి అత్తకు ఫిర్యాదు చేస్తే ‘‘అదేమంత నేరమో ఘోరమో అన్నట్లు తులుక్కుపడతావెందుకు. మామే కదా. ముచ్చట పడుతున్నాడు. గుట్టుచప్పుడు కాకుండా ఉండిపో లేకపోతే నీ పరువే పోతుంది. ఈ ఊరిలో అతడిని ఎదిరించే మగాడే లేడు. అందరూ నినే్న తప్పుపడతారు’’ అని చాలా తేలిగ్గా తీసుకుంది ఆ మహాతల్లి అత్త అన్నపూర్ణమ్మ.
సుందరి ఊరుకోలేదు. గొడవ చేసింది. తన తల్లిదండ్రుల్ని పిలిపించి పంచాయతీ పెట్టింది. సుందరి తల్లిదండ్రులు నెత్తీనోరూ బాదుకున్నారు. అయినా వామనరావుని ఎదిరించే మనిషే లేక, చేసేదేమీ లేక వెనుదిరిగిపోయారు.
నీలకంఠరావుకి అన్నీ తెలిసినా తేలుకుట్టిన దొంగలా చప్పుడు చెయ్యకుండా ఉండిపోయాడు. అప్పటి నుండి వామనరావు ఆగడాలు మితిమీరిపోయాయి. నేరుగా సుందరిని బలవంతం చేయడానికే సిద్ధపడేవాడు. అందుకు అత్త అన్నపూర్ణమ్మ సహకరించడమే రాక్షసత్వం. మొగుడు తల్లిదండ్రులను ఎదిరించలేడు. తనని పట్టణం తీసుకుపోయి వేరు కాపురం పెట్టలేడు. అలాగని పుట్టింటికి పోదామంటే నాన్నకి ఆరోగ్యం అంతంతమాత్రమే. అమ్మ టైలరింగ్ చేస్తూ తండ్రిని పోషిస్తుంది. ఉన్న ఒక ఎకరం తన చదువులకి, పెళ్లికి కరిగిపోయింది. ఇందిరమ్మ ఇల్లు అయింది. మానసిక క్షోభ అనుభవిస్తూనే మామకి లొంగకుండా మానమర్యాదలు కాపాడుకునేది.
ఒకరోజు సుందరి ఒక నిర్ణయానికి వచ్చి తనని శారీరకంగా హింసిస్తున్న సమయంలోనే పోలీసులకి ఫోన్ చేసింది. కథ మరో రూట్‌లోకి పోయింది.
* * *
పోలీసులు వచ్చి వామనరావుని, అన్నపూర్ణని, నీలకంఠరావుని, సుందరిని కూర్చోబెట్టి కౌనె్సలింగ్ ఇచ్చారు. ఈసారి సుందరి ఫిర్యాదు చేస్తే వామనరావు, అన్నపూర్ణమ్మ, నీలకంఠరావులకి కోటింగ్ తప్పదని తమదైన శైలిలో చెప్పి వెళ్లిపోయారు.
* * *
కాకలు తీరిన కామాంధుడు వామనరావుకి పోలీసుల ముందు పరువు పోయేసరికి గుండెపోటు వచ్చింది. ఆడదై కూడా కూతురు లాంటి కోడల్ని సొంత మొగుడే బలవంతం చేయబోతున్నా కాపలా కాయడానికే పరిమితమైన బ్రహ్మరాక్షసి అన్నపూర్ణమ్మ పోలీసుస్టేషన్ వూచల భయంతో వణికిపోయింది. ‘‘నీ పెళ్లాన్ని తీసుకునిపోరా’’ అంటూ కొడుక్కి అనుమతి ఇచ్చింది.
* * *
చాలాకాలం అత్తమామల ముఖాలు చూడలేదు సుందరి. ఇంతవరకు జరిగిన కథ ఇది. కథ జరిగి పదిహేను సంవత్సరాలైంది. ఇప్పుడందరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు. వామనరావు మంచానపడ్డాడు. అయినా అతని నోరు మంచిది కాదు. చూపు మంచిది కాదు. నిత్యం కోడల్ని సూటిపోటి మాటాలాడుతూనే ఉంటాడు. ఇక అన్నపూర్ణమ్మ కథ వేరు. దుబారా మనిషి. కోడలు గుట్టుగా, గుత్తంగా సంసారం చేసుకుంటూ కుటుంబాన్ని నడుపుతుంటే లేనిపోని పెద్దరికాలు చేస్తూ నిత్యం చుట్టాలు, బంధువులను పిలిపించుకుంటూ తానే కాకుండా తన చుట్టాలు, బంధువుల చేత కూడా కోడల్ని తిట్టించే రకం. ఈ వయసులో వైద్య సదుపాయం లేన ఆ పల్లెలో ఎందుకు మనతోనే ఉంచుకుందామని భర్త బ్రతిమిలాడి ఏడిస్తే కాదనలేక, అయిష్టంగానే సుందరి అత్తామామలను తన ఇంట్లో ఉంచింది కానీ ఎంత కాదన్నా పాత రోజుల్ని ఆమె గుర్తు చేసుకుంటూనే ఉంటుంది. అందుకే ఆమె అత్తామామలను అమ్మానాన్నల్లా చూడలేకపోతోంది. అత్తామామలు ఆమెని కూతురిలా చూడడంలేదు. ఇక నీలకంఠరావు పేరుకే మగాడు. కానీ మృగాల్లాంటి మూర్ఖపు తల్లిదండ్రులను ఎదిరించలేడు. నడివయసు దాటిన మనిషై భవిష్యత్‌లో మంచి రోజుల కోసం ఎదురుచూసే అవకాశవాది అతడు. ఇలాంటి కథలు ఎన్నో చూస్తున్నాం. ఇది అంతులేని కథ... అంతం లేని వ్యథ!

- ఎం.వి. స్వామి,
చోడవరం-531036.
సెల్ : 9441571505.

మక్కికి మక్కి!
‘‘మీరు రాసిన కొత్త నవలలో ప్రాంతాలన్నీ ఇంగ్లీషువే. ఎందుకలా రాశారు?’’ అడిగాడు సోంబాబు రచయిత రామారావుని.
దానికి రచయిత రామారావు ఇలా అన్నాడు ‘‘మరేం చేయను ఆ పేర్లని తెలుగులోకి మార్చి ఏం పేరు పెట్టాలో తోచలేదు మరి’’

పుస్తక సమీక్ష

స్వచ్ఛంద కవిత్వం -
శ్రీశ్రీ నానీలు

ఎస్. ఆర్. పృధ్వీ మూడవ నానీల సంపుటం స్వచ్ఛంద కవిత్వతంతో గోచరిస్తాయి. ఇరవైకి పైబడిన వీరి రచనల్లో అధిక శాతం కవిత్వానికే పెద్ద పీట వేసింది. ఇటీవల వెలువడిన వీరి ‘శ్రీశ్రీ నానీలు’ శ్రీశ్రీ స్మృతి చిహ్నంగా వారికే అంకితమీయడం సముచితంగా ఉంది. దీనిలో ముందు మాట రాసిన నానీల జనకుడు ఆచార్య ఎన్. గోపి పంక్తులు సమాదరణీయం.
ఇక నానీల్లోకి వెళితే 108 నానీలు శ్రీశ్రీ కవితల్లోని ఆంతర్యాన్ని అదిమిపట్టి తనదైన శైలిలో సరళతరంగా, భావగర్భితంగా, చైతన్యభరితంగా సాగిన అక్షరాల్లో అమర్చిన నానీల కవిత్వం పాఠకులని పలకరిస్తాయి. ద్రోణుడికి ఒక్కడే ఏకలవ్యుడు. శ్రీశ్రీకి వందలు వేలు అనడంలో శ్రీశ్రీ ఘనత ఎట్టిదో ఊహించవచ్చు. అలాగే కమ్మరికొలిమి, కుమ్మరి చక్రం, అయ్యో! చేతివృత్తులు మటాష్! అనడంలో వాస్తవానికి దన్నై అక్షర రూపమీయబడింది. మరోచోట ఎంత అందమైంది ఈ దేశం! మానవుడే ఆయన సందేశం! ఈ పంక్తులు చదవగానే మహాకవులు బంకించంద్ర, శంకరంబాడి, రాయప్రోలు, గురజాడ, మహమ్మద్ అక్బాల్ వంటి కవుల కలాల గళాలు చెవుల్లో ప్రతిధ్వనిస్తాయి. ఉత్సాహాన్ని, ఆనందాన్ని అందిస్తాయి. కవిత్వమొక తీరని దాహం/తీరిందా అది నిర్జీవదేహం/అన్న పంక్తులు అంతరాత్మను తట్టేదిగా ఉంది.
ప్రాచీనత, నెత్తురులో కరిగింది/ నవ్యత, కొత్త నెత్తురు చిమ్మింది/ అన్న దాంట్లో కవితాధార కదం తొక్కింది. కదలిక కనిపిస్తుంది. చైత్రం వచ్చింది, ఉగాది అయింది/ కోకిల గానం లేదు/ ఆశలపల్లకీ లేదు / ఇందులో కలుషిత మనస్తత్వాలు, వాతావరణం, కాలమార్పు, యుగధర్మం, అపసవ్య ధోరణలు వంటివి ఎన్నో అవగతమవుతాయి.
నేడు చేతివృత్తి పతనమయింది/కవిత్వం తిరుగుబాటయింది/ ఇందులో సాహిత్యం సమాజ శ్రేయస్సు, వికాసం, చైతన్యం కోసమేనన్న సత్యం తేటతెల్లమవుతుంది. శ్రామికుల బ్రతుకులు/ కూలిన గోడలు/ పునర్నిర్మాణం ఎప్పుడని? ప్రశ్నించడంలో, వారికి కొంత ఊరటనిచ్చి శాంతపరుస్తుంది. నేటి విలువలు దహనం/ నవనెత్తురుడికింది/ ఇందులో యువతకి సందేశం ఉంది. ప్రేరణ ఉంది. స్పందన కనిపిస్తుంది.
ఆకాశవీధుల/ విహారం ఆగింది/ సాహితీరథం, నేలమీదకి దిగింది/ ఇందులో కల్పనల రథం ఆగిందని, వాస్తవ జగత్థ్రం నేలమీదకి వచ్చిందన్న (ప్రాచీన సాహిత్యం పకక్కకు ఒరిగిందని, నవ్యసాహితీ పెరిగిందన్న భావం) హృద్యంగా ఉంది.
కాలాన్ని జయించినవాడు కవియని, యుగాన్ని తట్టినవాడు మహా కవియని, కనుకనే ఈ శతాబ్ది నాదేయన్న శ్రీశ్రీ మాటకు కవి పెద్దపీట వేశాడు. చెడు గాలి పీలుస్తున్నావ్ ఆరోగ్య జాగ్రత్తఅంటూ రాజకీయ నేతను హెచ్చరించడం బాగుంది. కాలం కౌగిలిలో జీవితం కరిగిపోవడం తథ్యం అంటూ ఆధ్యాత్మిక చింతనను రగిలించడం కొసమెరుపుగా వీరి నానీలన్నీ చైతన్యపు వెలుగు బాటలై అలరిస్తాయి. వీరిని అభినందిస్తూ వీరి నుండి మరిన్ని కావ్యాలను ఆశిద్దాం!

- చెళ్లపిళ్ల సన్యాసిరావు, సెల్ : 9293327394.

మనోగీతికలు

అనంతరాగం
ప్రేమించే హృదయం లేనప్పుడు
ఆకర్షించే అందం ఎందుకు?
పారేటి నీరే లేనప్పుడు
తోవ చూపే ఏరెందుకు?
వెనె్నల తోడెరుగని చందమామలా
నీవు లేని నేనెలా జీవిక సాగించగలను?
ప్లీజ్! ప్రేమ అనేది ఆట కాదు
పలకపైన గీసే గీత కాదు
చెరిపితే చెరిగిపోయేదా
మరలితే మరిచిపోయేదా?
ప్రియా!
అలల ప్రయాణం తీరం వరకు
కలల ప్రయాణం మెలకువ వరకు
ప్రేమ ప్రయాణం కడవరకు!

- పి. కరుణ్‌కుమార్,
ఇంటర్ ద్వితీయ, సాలూరు.
సెల్ : 94911 24418.

అద్దంలో
జీవిత ముఖచిత్రం!
స్వప్న సాగరతీరంలో తేలుతూ తూలుతూ
ఆడుతూ పాడుతూ, గగన విహంగంలో
విహరిస్తూ, నవ్వుతూ కవ్విస్తూ
జాము రాతిరి జాబిలిని కౌగిలిస్తూ
మురుస్తూ మురిపిస్తూ!
కటిక చీకటి కనుమరుగవుతున్న వేళ!
స్వప్న సాగర తీరం దాటి
ఒడ్డుకు వస్తున్న సమయాన
రెక్కొల స్వప్న చిత్రం
కనుల ముందు కదులుతున్న వేళ!
కొక్కొరోకో కోడికూత విని ఉలిక్కిపడి
కలల కాపురాన్ని కూల్చుకుంటూ
నిజసాగర తీరంలో తొలి సంధ్యా కిరణాలకు
ఊగుతూ ఊకొడుతూ
కనురెప్పల మధ్య బందీ అయిన స్వప్న చిత్రాలు!
చెల్లా చెదురై డ్రీమ్‌లైఫ్‌కి గుడ్‌బై చెప్పి
రియల్ లైఫ్‌కి వెల్‌కమ్ పలుకుతూ
బరువు బాధ్యతలు అనే వాహనంలో విహరించి
విహరించలేక అలసిసొలసిన
కనులకు ఆహ్వానం
పంపుతూ వెల్‌కమ్ చెబుతుంది డ్రీమ్‌లైఫ్!
సూర్యుని చుట్టూ
భూమి పరిభ్రమించినట్లు
డ్రీమ్‌లైఫ్ అండ్ రియల్‌లైఫ్ చుట్టూ మానవుడు
నిరంతరం పరిభమ్రిస్తాడన్నది మాత్రం
స్వప్నం కాదు వాస్తవం!!

- మజ్జి పాపినాయుడు
గడసాం (విలేజ్ పోస్టు)
మం. దత్తిరాజేరు, విజయనగరం (జిల్లా)
ఫోన్: 9100475182

న్యాయం ఎక్కడ?
ఇక్కడంతా స్వార్ధమే
ఎవరూ ఎవరి కోసం
ఒక్క క్షణం ఆలోచించరు
ప్రజల బతుకులు బాగు చేయాల్సిన నేతలు తమ బాగు చూసుకుంటారు...
తమ జేబులు నింపుకుంటారు!
అయ్యవార్లు సర్కారీ జీతాలు తీసుకుని పాఠాలు మాత్రం ఇంటి దగ్గర ట్యూషన్లలోనే చెబుతారు
పోలీసులు లంచమిస్తేనే న్యాయం చేస్తారు
ఇక న్యాయం ఎక్కడ! అడవిలోనా?

- లావణ్యా ప్రసాద్, విశాఖపట్నం

జాగృతి
మెదడు క్షీర సాగరాన్ని
లక్ష్యం కవ్వంతో తిప్పు
ఆలోచ నామృతం దక్కుతుంది
మనసు గుర్రాన్ని
బుద్ధిరౌతు స్వాధీనంలో ఉంచు
గమ్యం చక్కగా చేరగలమ్...
గుండెడప్పుపై
సమస్యలు భేరిమ్రోగిస్తున్నాయని
వెరవనక్కరలేదు!
అరిషడ్వర్గాలు
అక్రమదాడులు చేసినా ఆవిరైపోకు!
చేతనా స్థితి మాత్రమే
మనిషిని
మహాత్మునిగా మార్చుతుంది
చేతగాని స్థితి మాత్రం
మనిషిని పాతరేస్తుంది సుమా!

- కిలపర్తి దాలినాయుడు, 9491763261

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) ఎడిటర్, మెరుపు, ఆంధ్రభూమి దినపత్రిక, సెక్టర్-9, ఎం.వి.పి.కాలనీ, విశాఖపట్నం-17. అనే చిరునామాకు పంపండి. ళ్ఘౄజ: ౄళూఖఔఖ్పఒఔబ్ఘశజ్ద్ఘూఇ్ద్య్యౄజ.శళఆ ఇ-మెయల్‌కు పిడిఎఫ్‌లో పంపించవచ్చు.

- గూడూరు గోపాలకృష్ణమూర్తి