రాజమండ్రి

గురివిందలు (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘డిఇఓ కార్యాలయానికి తీసుకెళ్లాల్సిన ఫైళ్లు తీసుకుని రమ్మన్నారు’’ అన్న అటెండర్ వర్తమానంతో కొంత కాలం క్రితమే ఆ ప్రైవేటు కానె్వంట్‌లో గుమస్తాగా చేరిన గుర్నాథం అనబడే నేను వినయంగా ప్రిన్సిపాల్ రూంలోకి ప్రవేశించాను.
నేను రూములోకి ప్రవేశించే సరికి మా ప్రిన్సిపాల్‌గారు ఫోనులో ఎవరితోనో మాట్లాడుతున్నారు.
‘‘ఎస్సార్! అలాగే సార్... తప్పకుండా సార్’’ అంటూ అత్యంత వినయంగా బదులిస్తున్నారు. మొహం మాత్రం కాస్త ఎర్రబడిందనే చెప్పాలి.
పక్కనే వినయంగా నిలబడ్డ నన్ను చూసి ‘‘పద’’ అంటూ బయటికి దారి తీశారు. ఫైళ్లతో పాటు నేను అతన్ని అనుసరించాను.
ఇద్దరం డిఇఓ కార్యాలయానికి చేరుకున్నాం.
‘‘ఈసారి పని ఎలాగైనా పూర్తి కావాలోయ్ గుర్నాథం. అవతల కరస్పాండెంట్‌గారు అగ్గి మీద గుగ్గిలం అయిపోతున్నారు’’ అంటూ అంతకు ముందు రెండు సార్లు కొర్రీలతో తిప్పి పంపిన వాటిని మరలా సాధ్యమైనంత సరిచేసి కొత్తగా తయారు చేసిన ఫైళ్లను స్కూల్ రికగ్నిషన్ చేసే సెక్షన్ గుమస్తాకు ఇమ్మని నాకు అందించారు.
నేను వాటిని అందించాను. గుమస్తా కొద్దిసేపు వాటిని పరిశీలించి మా ఫైళ్లను సంబంధిత సెక్షన్ సూపరింటెండెంట్ వద్దకు తీసుకెళ్లాడు.
పావుగంట తర్వాత మా ఫైళ్లపై మరికొన్ని కొర్రీలు వేసి యథాతథంగా మాకిచ్చాడు. ఆ కొర్రీలు ఏ ప్రైవేట్ మేనేజ్‌మెంట్ వారూ తల్లకిందులుగా తపస్సు చేసినా పూర్తి చేయలేరు.
అప్పటికే స్కూల్ కరస్పాండెంట్ చేత తలంటించుకున్న మా ప్రిన్సిపాల్‌గారు ఉసూరుమంటూ చేసేది లేక గుమస్తాతో బేరానికి దిగారు. చివరికి ఆ సెక్షన్ సూపరింటెండెంట్‌తో గుమస్తా మంతనాలు జరిపి బేరం సెటిల్ చేశాడు. బయటికి వచ్చి ఎటిఎం దగ్గరకు వెళ్లి ఆ మొత్తం తీసి సగౌరవంగా తాంబూలం సమర్పించుకున్నాం. దక్షిణ సరిగ్గా సరిపోయిందో లేదో గుమస్తా చూసుకుని వారం తర్వాత వచ్చి ఆర్డర్స్ తీసుకువెళ్లండి’’ అని చెప్పడంతో బతుకుజీవుడా అనుకుంటూ బయటికి వచ్చి దగ్గరలో ఉన్న టీ కొట్లోకి వెళ్లాం. టీ తాగుతూ ‘‘చూడు గుర్నాథం అంతా కాల మహిమ. వాళ్లు చేయాల్సిన పనికి వాళ్లు అంతంత జీతాలు తీసుకుంటూ మళ్లీ తాంబూలం కావాలి అంటూ వేధిస్తున్నారు. వెధవల్ని ఎసిబి వాళ్లకి పట్టించాలి’’ తన అక్కసునంతా వెళ్లగక్కారు ప్రిన్సిపాల్‌గారు.
ఆఫీసుకి వెళ్లిన తర్వాత స్కూల్ రికగ్నిషన్ ఎక్స్‌పెన్సస్ ఖాతాలో పాతికవేలు ఖర్చు రాయడం చూసి అదనంగా రాసిన పదివేలు ప్రిన్సిపాల్ జేబులోకి అన్నమాట అని నవ్వుకున్నాను.
వారం తర్వాత మళ్లీ ఆఫీసుకి పోయాం. పని పూర్తయింది. మా కరస్పాండెంట్ దగ్గర ఆ పని తానెంత సమర్థవంతంగా, ఎంత చాకచక్యంగా ఒకటికి పది కల్పించి చెప్పుకుని తన లాభాన్ని తాను పొందారు ప్రిన్సిపాల్‌గారు.
పని జరిగిన మంచి మూడ్‌లో ఆయన ఉండడం చూసి అప్పటికి కొంత కాలంగా నలుగుతున్న నా జీతం పెంపుదల గురించి కరస్పాండెంట్ గారితో చెప్పి పని జరిగేలా చూడవలసినదిగా మా ప్రిన్సిపాల్‌గారిని అభ్యర్ధించాను. ఆయన ‘‘తప్పకుండానోయ్ గుర్నాథం’’ అంటూ నసిగాడు.
విషయం నాకు అర్ధమయింది.
పని జరిగేందుకు దక్షిణ ఎంతో తెలుసుకుని సగౌరవంగా సమర్పించుకున్నాను. ఆ నెల జీతంతోనే నేను నా పెరిగిన జీతం చూసి ‘ఇంత కాలంగా నా పని అవకపోవడానికి కారణం మా ప్రిన్సిపాల్ గారికి నేను తాంబూలం సమర్పించకపోవడమే’ అని గ్రహించి హతాశుడినయ్యాను. ‘్ఛ గురివిందలు’ అని మనసులో చీదరించుకుని బయటికి నవ్వుతూ ‘‘్థ్యంక్స్’’ అన్నాను.

- మండా శ్రీధర్,
శ్రీకాకుళం. సెల్ : 9493309030.

పుస్తక పరిచయం

ధిక్కార ఖడ్గాన్ని
ఝళిపించిన ‘పినిపే’

ఒక మనసు ధిక్కారం వైపు అడుగులు వేసిందంటే అక్కడేదో వేదన ఉండి ఉండాలి. గుండె గాయపడి ఉండాలి. ఆ కలం పట్టిన చేయి ఎంతో బాధననుభవించి ఉండాలి. ఎడతెగని, ఊపిరాడని సమస్యలతో సతమతమై ఉండాలి. ఆ బాధల్లోంచి, వేదనల్లోంచి బయటపడటానికి విపరీతమైన శ్రమను, ఒత్తిడిని ఎదుర్కొని ఉండాలి. ఆ బాధల్ని, ఆ వేదనల్ని నేరుగా ఎవ్వరితోనూ పంచుకోలేనప్పుడు ఇదిగో! పినిపే సత్యనారాయణ లాంటి యువకవి, ఇలా కవిత్వ రూపంలో ధిక్కార ఖడ్గాన్ని ఝళిపిస్తాడు.
90వ దశకంలో దళిత కవిత్వం ఒక ఉద్యమంగా విస్ఫోటించింది. వరద గోదావరిలా కట్టలు తెంచుకొని ప్రవహించింది. చిక్కనవుతున్న పాట, పదునెక్కిన పాట వంటి కవితా సంకలనాలు దళితుల జీవితాలలోని అన్ని పార్శ్వాలను అన్ని కోణాలను బలంగా స్పృశించాయి, ప్రశ్నించాయి. స్ర్తివాద, దళితవాద కవిత్వాలు ఉధృతంగా ఉన్న ఆ రోజుల్లో ఇదీ ఒక కవిత్వమేనా? ఇది ఎన్నాళ్లుంటుంది అన్నవాళ్లూ లేకపోలేదు. ఏ కవిత్వం ఎన్నాళ్లున్నా అది చేయవలసిన పని అంతో ఇంతో చేసే తీరుతుంది. అయితే ఆ కవిత్వం అక్కడితో ఆగిపోదు. మళ్లీ అలాంటి సంఘటనలు ఎదురైనపుడు అది తలెత్తుతూనే ఉంటుంది. అలా తలెత్తిన కవితా సంకలనమే కోనసీమ యువకవి పినిపే సత్యనారాయణ రాసిన ధిక్కార ఖడ్గం. ఇందులో మొత్తం 41 కవితలున్నాయి. అయితే అన్నీ కేవలం దళిత స్పృహతో రాసినవి మాత్రమే కావు. సమాజంలోని ఇంకా అనేక అస్తవ్యస్త ధోరణుల్ని కవి ఇందులో చీల్చి చెండాటం జరిగింది.
రాజ్యాంగ నిర్మాత, దళితుల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌ని పినిపే చాలా కవితల్లో స్పృశించారు. ‘గోరుముద్ద’ అనే కవితతో ఈ సంకలనం ప్రారంభమవుతుంది. రాజ్యాంగాన్ని చేత్తోపట్టుకొని, తన వేలితో వెలుగువైపు చూపిస్తూన్నట్లుంటుంది ఆయన విగ్రహం. ‘ఆ చూపుడువేలే స్ఫూర్తికి సంకేతమై / ‘గొఱ్ఱెల్ని’ కూడా ‘గెరిల్లా’లా మార్చే శకె్తై నిలుస్తుంది / మెడలో చెప్పుల దండవేసి ద్వేషించే పశువును కూడా / ప్రేమించడమెలాగో ఓర్పుగా నేర్పే / కన్నతల్లి చేతిస్పర్శలా ఉంటుంది / అసలు ఆ విగ్రహమే అమ్మ చేతిలోని కమ్మని గోరుముద్దలా ఉంటుంది /’ అంటారు కవి. అజ్ఞానంతో, అహంకారంతో ఆ మహానుభావుని అవమానించాలనుకునే వారిపై కవి సంధించిన తొలి కవితాస్త్రం ఇది.
ఇక పొట్టకూటి కోసం శరీరాన్ని అమ్ముకొనే వేశ్య గురించి చెబుతూ ఆమె మానం తప్ప మనస్సుని మలినం కానివ్వని నిప్పుల సెగ అని, ఆమె పిల్లల ఆకలితీర్చే అమ్మేకాని, అంగడిబొమ్మ కాదని అనటంలో కవికి ఆమె పట్ల ఉన్న సానుభూతి, జాలి, దయ వెల్లడవుతాయి.
ఇక ‘ఐదువేళ్ల ఏకలవ్యుడు’ అనే కవితలో ‘ఎందరు ద్రోణులు ద్రోహులై / నాపై ఎన్ని కుట్రల అస్త్రాలను సంధించినా / విల్లునై ఎదుర్కొనే ఏకలవ్యుణ్ణి నేను’/ అంటాడు. విశ్వవిద్యాలయాల్లో ఇప్పటికీ మనకి ద్రోణులూ, ఏకలవ్యులూ కనిపిస్తూనే ఉన్నారు.
ఇక ఢిల్లీలో జరిగిన నిర్భయ దుస్సంఘటన మొత్తం దేశానే్న కుదిపింది. మనిషి-మానవత్వం మాయమైపోతున్నాయేమోనన్న భయం, సందేహం చాలామందిలో ప్రవేశించాయి. దీన్ని అడ్డుకోవడం ఎలా? దీనికి శిక్ష ఏంటి? అన్న వాటిపై ఎన్నో చర్చలు జరిగాయి. అదిగో ఆ చర్చలో భాగంగానే కవి తనకు తోచిన పరిష్కారాన్ని సూచిస్తాడు. ‘ఐదేళ్ల గుడియా నుండి / అరవై ఏళ్ల అవ్వదాకా హింసే కదా!’ అంటూ బాధపడతాడు. పశుపక్ష్యాదులకు కూడా ఆయా రుతువుల్లో మాత్రమే కామవికారం కలుగుతుంది. మాయదారి మనిషికే వేళాపాళాలేదని వాపోతాడు.
అందుకే! ఓ కన్నతల్లుల్లారా! నిర్భయ, ఆయేషా, ప్రణీత, శ్రీలక్ష్మిలను కనకండి. ఆ కామాంధ పందుల కామపు మూలాల్ని కసిగా తెగ నరకటానికి కత్తుల్ని కనండి! అంటూ వాళ్లకు ఎటువంటి శిక్ష వేయాలో పరోక్షంగా సూచిస్తాడు కవి. పేదవాడు ఇంకా ఇంకా పేదవాడిగా మిగిలిపోవటానికి, అవినీతితో ధనవంతుడు ఇంకా ధనవంతుడై పోవడానికి కారణాల్ని వివరిస్తూ ‘్భఫోర్స్ బీభత్సం మరువకముందే / ‘జగన్’ నాటక సూత్రధారుల సాక్షిగా/ గాలిపాలైన కోట్ల గనుల సంపద/ మంచాలపై లంచాలు మరిగే రోగం’ అనటంలో ఎవ్వరినీ వదలలేదు ఈ కవి. అయితే ఇలాంటి పెద్ద దొంగలపై ఏ సెక్షన్లూ పనిచేయవని, చిన్న చిన్న జేబుదొంగల్ని, చిల్లర దొంగల్ని మాత్రం సవాలక్ష సెక్షన్లు బనాయించి శిక్షించడం జరుగుతుందని కవి తన క్రోధాన్ని వెళ్లగక్కుతాడు. అదే సమయంలో లోక్‌పాల్ బిల్లుకోసం అవినీతికి వ్యతిరేకంగా పోరాడే అన్నాహజారేని హృదయానికి హత్తుకొంటాడు కూడా.
ఇక పరువు హత్యలపై ఈ కవి స్పందించిన తీరు, చాలా తీవ్రంగా ఉంటుంది. తమ బిడ్డ వేరే కులంవాణ్ణి ప్రేమించిందనో, పెళ్లి చేసుకుందనో కోపంతో తల్లిదండ్రులిద్దరూ కలిసి సొంత కూతురు పీక పిసికి చంపేసిన సంఘటనలు వెలుగులోకొచ్చాయి. ఆ సంఘటనకి అక్షర రూపాన్నిస్తూ, ఆ అమ్మాయి ‘దీప్తి’ తరపున వకాల్తా పుచ్చుకొని ‘ఓ నా కసాయి తండ్రీ!/ మీ కులపోడి దేహంలో ఉన్న అంగాంగాలన్నీ / నే ప్రేమించిన వానికీ నిఖార్సుగా ఉన్నాయి / ఇంకా అతని మనసులో నాపై / అణువణువునా ప్రేమే దాగి ఉంది’/ అనిపిస్తాడు. అంతేకాదు ప్రేమను విషంగా మార్చుకొన్న ఓ నా తల్లిదండ్రులారా! మరో జన్మంటూ ఉంటే నా బిడ్డల్లా పుట్టండి. అప్పుడు అమ్మానాన్నల ప్రేమంటే ఏంటో మీకు రుచి చూపిస్తానని ఆ అమ్మాయి తరుపున ఆ తల్లిదండ్రులను ప్రశ్నిస్తాడు.
ఇక ఇటీవల రిజర్వేషన్ల వర్గీకరణ రెండువర్గాల మధ్య వైరుధ్యాన్ని పెంచి చిచ్చురేపుతోంది. ఆ విషయానే్న కవి, ఒకే అమ్మకు పుట్టి రెక్కలు తెగిన పక్షులమై ముక్కలౌతున్నాం. ఇప్పటికైనా కళ్లు తెరవండి! ఈ హైటెక్ కుట్రలను భగ్నం చేయండి, లేకపోతే మనముందు తరాలవాళ్లకు మళ్లీ మూతికి ముంతా, నడ్డికి తాటాకులు తప్పవంటాడు. మనమిద్దరం గెద్దల్లా కాకుండా జంట ఎద్దుల్లా కలిసి ఒక్కటై నడిస్తే రాజ్యాధికారం చేజిక్కించుకోవచ్చు అంటూ సోదర వర్గాన్ని హెచ్చరిస్తాడు. అంతేకాదు హైకోర్టు, సుప్రీంకోర్టుల తీర్పుకన్నా ముందు మనం మనుష్యులుగా ఒక్కటై బంధాల్ని బలపరుచుకొందాం. ముందుతరాలకు ఆదర్శమవుదాం అంటాడు.
ఇక పాటకు పుస్తె, కాళ్లకు గజ్జె కట్టి ఎర్ర దండై రగిలే గద్దర్ గురించి చెబుతూ తరతరాల అంతరాలపై పోరుబాటై, పాటై, ఈటై, ఉదయిస్తున్న నగ్న సూరీడేరా గద్దరంటే అంటాడు. అంతేకాదు ఆ పాటకు వృద్ధాప్యంగాని, మరణంగాని లేవంటాడు.
ఇందులోని కవితలన్నీ కేవలం ధిక్కార స్వరానే్న వినిపించవు. కొన్ని ప్రేమగా మనసును తడుముతాయి. కొన్ని ఆత్మీయంగా హృదయాన్ని స్పర్శిస్తాయి. మరికొన్ని మానవ సంబంధాల్ని పటిష్టం చేస్తాయి. కవికి మంచి భవిష్యత్తు ఉంది. వయసుతోపాటు సంయమనమూ అలవడుతుంది అప్పుడు కవిత్వం మరింత శిల్ప శోభితమవుతుంది.

- డా. జోశ్యుల కృష్ణబాబు
పెద్దాపురం సెల్: 9866454340

ఆరోజు మాతృ దినోత్సవం. ఈసందర్భంగా కొత్తగా కట్టిన అనాధాశ్రమాన్ని ప్రారంభిస్తున్నారు. అందులో వృద్ధుల్ని, మరోవైపు అనాధల్ని చేర్చుకొని భోజనాలు, దుస్తులు, ఇతర అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. ఎంతోమంది తమ తల్లుల్ని సరిగా చూడక, పట్టించుకోకుండా ఆశ్రమాల్లో చేర్పిస్తున్నారు. ఆరోజు కొత్తగా ఎన్నికయిన ప్రజాప్రతినిధి గురునాథం గార్ని ప్రారంభోత్సవానికి పిలిచారు. ఉదయం నుంచే అనాధలు, వృద్ధులంతా పడిగాపులు కాస్తున్నారు. వాళ్లకొక ఆశ్రయం దొరుకుతోందని ఆశగా ఎదురుచూస్తున్నారు. సభా కార్యక్రమం ప్రారంభమైంది. ముఖ్య అతిధులంతా వచ్చారు. ప్రసంగాలు వినిపించారు.
‘దిక్కూమొక్కూ లేక చెప్పుకోటానికి నా అనే వాళ్లు లేని రోడ్ల మీద తిరిగే బిచ్చగత్తెల్ని, వృద్ధుల్ని చూస్తుంటే మా కడుపు తరుక్కు పోయింది. అందుకే అలాంటివారి కోసం ఈ ఆశ్రమాన్ని ఏర్పాటు చేశాం. మీకందరికీ ఇక్కడ రక్షణ కల్పిస్తాం. ఈరోజు నుంచి మీరంతా ఇక్కడ నిర్భయంగా ఉండవచ్చు. ఇక్కడ మీకు కావలసిన సదుపాయాలన్నీ సమకూరుస్తారు. మీ లాంటి అనాధల కోసం, వృద్ధుల కోసమే ఈ భవనం కట్టించారు’ అంటూ గురునాథం గారు వేదికపై చేసిన ప్రసంగానికి జనం చప్పట్లు కొట్టారు.
ఒకసారి ఆయన అందరి వైపూ తేరిపార చూసి ‘నేను ఊరికే ఉపన్యాసం చెప్పే వాడిననుకొంటున్నారా? ఏదైనా చెప్పేటప్పుడు ఆచరించి చెప్పాలి అంటారు. అలాంటి వారిలో నేను మొదటి రకం వాడిని. ఇక్కడ చేరే వృద్ధులందరూ నా తల్లి లాంటివారు. నాకేమాత్రం స్వార్థం లేదు. అందుకే చేర్పిస్తున్నాను. మా అమ్మగారు నా మాట ఎప్పుడూ జవదాటదు. ఇక్కడుండే మహిళలందరికీ చేదోడువాదోడుగా ఉంటుందని మీకందరికీ మాట ఇస్తున్నాను’.. అనగానే మళ్లీ చప్పట్లు మార్మోగాయి. ఆ తర్వాత అందరూ ముక్కున వేలేసుకున్నారు.
‘్ఛ! దుర్మార్గుడా! తల్లినని కూడా చూడకుండా నన్ను వృద్ధాశ్రమంలో చేర్పించి ఆదర్శవంతుడను అనిపించుకోవాలని చూస్తున్నావా? ఈరకంగా నన్ను వదిలించుకోవాలనుకున్నావా?’ అని మనసులోనే తిట్టుకుంటూ వేదికపైకి వచ్చింది సుబ్బాయమ్మ గారు.
‘అందరికీ నమస్కారం! ఇది వృద్ధాశ్రమం. కొడుకులుండి కూడా తల్లుల్ని సరిగ్గా చూడకుండా, పట్టించుకోకుండా, మంచానపడితే ఎక్కడ చాకిరీ చేయాల్సి వస్తుందోనని కన్నతల్లుల్ని వదిలించుకోవాలని మిమ్మల్ని ఈ ఆశ్రమంలో చేర్పిస్తున్నారు. అలాగే నా కొడుకు కూడా! ఎంతో ఆదర్శవంతుడు. ఏ పనైనా ఆచరించి చూపిన తర్వాతనే దాన్ని ఆచరణలో పెట్టే మనస్తత్వం వీడిది. చిన్నప్పటి నుంచీ రామాయణ, మహాభారత గాథలన్నీ, దేశ నాయకుల జీవిత చరిత్రలన్నీ విని వంట బట్టించుకున్నవాడు. ఈ ఆశ్రమంలో వృద్ధులే కాక మతిస్థిమితం లేని వాళ్లు, వికలాంగులు, ఎంతోమంది అనాధలున్నారు. నా కొడుకు గురునాథం కూడా మానసిక వికలాంగుడు. ఏం మాట్లాడతాడో పాపం.. తెలియని స్థితిలో ఉన్నాడు. నా కొడుకు బాగుపడాలని, వాడి మానసిక పరిస్థితి పూర్తిగా నయం కావాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఏ తల్లయినా బిడ్డల క్షేమం కోరుకుంటుంది. అందుకే నా కొడుకుని ఇదే ఆశ్రమంలో చేర్పించి సరైన వైద్యం అందిస్తే తిరిగి బాగుపడతాడని ఆశిస్తూ ఇక్కడున్న అనాధలతో పాటు నా కొడుకు గురునాథంను కూడా చేర్పిస్తున్నాను. ఈరోజు నుంచి అనాధాశ్రమంలో నా బిడ్డకింత చోటు కల్పించాలని కోరుకుంటున్నాను’ అంటూ నిర్వాహకులను వేడుకుంది.
వేదికపై వున్న గురునాథం తల్లి మాటలకు షాకయ్యాడు. పళ్లు పటపటా కొరుకుతూ కోపంతో తల్లివైపు చూశాడు.
‘అమ్మా! ఏమిటి నువ్వు చేసిన పని. నన్ను ఈ అనాధాశ్రమంలో చేర్పిస్తావా? అసలు నువ్వు తల్లివేనా? నాకేం ఖర్మ ఇక్కడ చేరటానికి? నా ఇంట్లో సకల సౌకర్యాలతో రాజభోగం అనుభవిస్తున్నాను. అసలు నీకేం హక్కుంది నన్ను ఇక్కడ చేర్పించటానికి?.. అంటూ తల్లి మీద విరుచుకుపడ్డాడు.
‘ఒరే! అదే ప్రశ్న నేను నిన్నడుగుతున్నాను. పది నెలలు మోసి, కని, పెంచి, పెద్దచేసి ఇంతవాడిని చేస్తే తల్లి అనే గౌరవం కూడా లేకుండా ఈ ఆశ్రమంలో నన్ను చేర్చాలని తీసుకొచ్చావు. నిన్ను కూడా చేర్పిస్తే ఆ బాధ ఎలా ఉంటుందో నీ కర్థమవుతుంది. మీనాన్న సంపాదించిన ఆస్తిలో సగం వాటా నాది. ఆస్తి వదులుకుని అనాధాశ్రమంలో ఉండాల్సిన అవసరం నాకు లేదు. నీలాంటి కొడుకులకు బుద్ధి చెప్పాలంటే ఒకటే మార్గం. నా వంతు ఆస్తిని ఈ ఆశ్రమానికి విరాళంగా రాస్తున్నాను. నేను ఇక్కడే ఉండటానికి నిర్ణయించుకున్నాను’ అంటూ వేదిక పైనుంచి దిగి వృద్ధుల్లో కలిసిపోయింది సుబ్బాయమ్మ. గురునాథం గుండె ఆగిపోయినంత పనైంది.

నాయకుని
- తాటికోల పద్మావతి, చరవాణి : 9441753376 ఆదర్శం

సాంకేతిక సౌరభాలు
అందమైన గులాబీలు మనసును హత్తుకుంటే
జన్మలకు క్షేత్రమైన ఒక అమ్మను చెత్తకుప్పలో చూసి
మూగగా నలిగిపోయింది మనసు
మల్లెల వాసన మదిని మత్తెక్కిస్తే
ఊపిరాడక విలవిలలాడి
విషవాయువులో అశువులు బాసిన
మురికి కుహరాల్లోని నిర్భాగ్య శ్రామిక శవాల దృశ్యం
హృదిని నిశ్శబ్దంగా ఛిద్రం చేసింది

సాయంకాల ఫలహార శాలల ఘుమఘుమలు
జిహ్వను ద్రవింపచేస్తే
సరిహద్దుల ప్రాణం త్యాగం చేసిన
వీరజవాను శవపేటిక యాత్ర
కడుపులో కలవరపరచి ప్రశ్నించింది

నాగరికతా సాంకేతిక సౌరభాలు
అవినీతి కోరల నుండి బయటపడి
ఈ అనాగరిక మనోదౌర్బల్యాలను
అంతం చేసే రోజు కోసం
ఎంతకాలం వేచి చూడాలో!

- వారణాశి వెంకట సూర్యకామేశ్వరరావు
సీతంపేట, రాజమహేంద్రవరం
చరవాణి: 9491171327

అతనెవరు?

అతనెవరు? మొదట నా చూపుని తాకాడు
ఇప్పుడు నా మనసుని తాకాడు
అసలు నా జీవితంలోకి ఎందుకొచ్చాడు?
అతనెవరు?

నన్ను ప్రేమిస్తాడు అమ్మలాగా
నాకు జాగ్రత్తలు చెప్తాడు నాన్నలాగా
నన్ను నవ్విస్తాడు స్నేహితుడి లాగా
నా బాధను తీరుస్తాడు దేవుడి లాగా
అసలు అతనెవరు?

నా కోసం ఎదురుచూస్తాడు.
అందులో సహనం ఉంటుంది.
నన్ను కోప్పడతాడు. అందులో ప్రేమ ఉంటుంది.
నాకు సలహాలిస్తాడు.
అతను ఉన్నాడన్న ధైర్యం ఉంటుంది.
నాకు మాటిస్తాడు.
ఈ జీవితాన్ని అందమైన పువ్వులాగా
మార్చి ఇస్తాడనే భరోసా ఉంటుంది.
నాకోసం ఇన్నిచేసే అతనెవరు?

- పిల్లా రమణబాబు
శనివారపుపేట, ఏలూరు. సెల్: 9652659027

మనోగీతికలు

జాగ్రత్త! నేస్తమా!
మిత్రమా! మేలుకో! కావివి మంచిరోజులు
తెలుసుకో మసలుతున్నాయ్ గోముఖ వ్యాఘ్రాలు!
నీరాజనాలర్పిస్తారు నీతో పనిపడితే
మోసం చెయ్యడానికి సిద్ధం మెత్తదనం చూపితే!

గాయం చేస్తారు మనసు మోమాటంగ వుంటే
ముంచుతారు సుమా! మంచితనమే మేలనుకుంటే
పొగుడుతూ చేయించుకొంటారు పనులు
పనైపోయాక పెడతారు పెడముఖాలు!

ప్రశంసలెన్నో జాలిపడి సాయంచేస్తే
తిట్టుకుంటారు ఇచ్చింది తిరిగి ఇమ్మంటే!
చూస్తూనే వుంటారు ఎదురుచూపులు ఎంతచేసినా
స్తబ్ధవౌతారు తృప్తిలేక ఎంతపెట్టినా

నీతులు వల్లెవేసే వారే తవ్వుతారు గోతులు
మల్లెలా నవ్వుతూ గుచ్చుతారు ముల్లులు!
పాలుపోసిన వానిపైనే పాము విషం చిమ్మినట్టు
తమ బాగుచూసిన వాడు పతనమైతే పరిహసిస్తారు!

మన దగ్గరవుంటూ తింటూ మనల్నే విమర్శిస్తారు
సాయమందించిన వారినే నిందిస్తారు!
సోదరా! ఆటలాడతారు హృదయంతో అలుసిస్తే
అగాధంలోకి గెంటుతారు మనవాళ్లే అని అందర్నీ నమ్మితే!

చూడు నేస్తం! ప్రదర్శిస్తున్నాడు మనిషి అతి తెలివి
తెలుసుకు మసలకుంటే తారుమారవుతుంది నీ వాసి

- మల్లెమొగ్గల గోపాలరావు
రాజమహేంద్రవరం, సెల్: 9885743834

అవే పెదాలు.. పలికే పదాలు

‘హలో’ కంటికి కనిపించగానే
అదో పలకరింపు
‘పూర్ ఫెలో’
వాడు కాస్త పక్కకు తప్పుకోగానే
ఇదో వెక్కిరింపు

‘సారీ’అంటే చాలు
నువ్వెన్ని చెడ్డపనులు చేసినా
దానితో సరి,
మరి ‘్థ్యంక్స్’2చివర చెప్పి
చేయించుకోవచ్చు
ఎంతైనా వెట్టిచాకిరీ,

ముందు - కొంచెం చోటిస్తారా సార్2
తరువాత్తరువాత -
మీ బాబుగారి సొత్తా?2
మొదలవుతుంది వార్,
ఆవిడ ముందు మెచ్చుకుంటూ
మీది చాలా సోషల్ బిహేవియర్2
తను ఆవిడ ముందు మొత్తుకుంటూ
ఏదీ ఇలా మగాళ్లందరితోటీనా..
ఐ హేట్ హెర్!

- తటవర్తి రాఘవరాజు
రామచంద్రపురం
సెల్: 9963610243

చిగురు మెరుపు
మట్టి సుగంధంలో
విత్తు చైతన్యంగా
మొక్కగా కొత్త అనుభూతులతో
అందమైన చిగురు హరివిల్లు జల్లు
మట్టి తడి కనురెప్పల కింద
వేళ్లు
అమ్మ వెచ్చని స్పర్శకు
కాలంతో నిరంతరం
పోరాటం
పువ్వుల నవ్వుల్ని
రక్షించుకోటానికి
ఎండాకాలం
నీటి వంతెనపై ప్రయాణం
చినుకు అద్దంలో
చిగురు నిశ్శబ్దంగా
తన అందాన్ని తనివితీరా
చూసుకుంటోంది
తడిలేని మట్టి హృదయంలో
కన్నీటి చిరుజల్లు
వానాకాలంలోకి
జారిపోవాలని ఆకాంక్ష
నిద్రపోని గాలితో
నిద్రపోవాలని చిగురుతపన
శూన్యంలో
అనుభవంతో వేళ్లు చేసే ప్రయాణం
చిగురుకు మెరుపు

- నల్లా నరసింహమూర్తి
అమలాపురం
చరవాణి: 9247577501

email: merupurjy@andhrabhoomi.net

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, నేషనల్ హైవే, ధవళేశ్వరం, తూ.గో.జిల్లా. email: merupurjy@andhrabhoomi.net

- మండా శ్రీధర్