విశాఖపట్నం

కట్నం కాని కట్నం (కథానిక)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెళ్లి ముహూర్తం అర్ధరాత్రికి. ఉదయం తోరు సంబరం కార్యక్రమం జరుగుతోంది. అటు ఆడపెళ్లివారి తరఫున, ఇటు మగపెళ్లి వారి తరఫునా రావలసిన బంధువులంతా వచ్చేశారు. బ్యాండుమేళం కాసేపు మంచి సినిమా పాటలు వాయించి వినిపించారు. పెళ్లి కూతురి పేరు శే్వత. పెళ్లికొడుకు పేరు సూర్యప్రతాప్.
ఆడపెళ్లి వారిది సాధారణ మధ్య తరగతి కుటుంబం. మగపెళ్లి వారితో తూగే స్థాయి కాదు వాళ్లది. నెలరోజుల క్రిందటే పెళ్లిచూపుల కార్యక్రమం జరిగింది. వధూవరులిద్దరూ ఒకరినొకరు బాగా ఇష్టపడ్డారు. తమకు అమ్మాయే ముఖ్యమని, కట్నకానుకలు తీసుకోవడం తమ పద్ధతి కాదని, పెళ్లి ఖర్చులు కూడా తామే పెట్టుకుంటామని ముందుకు వచ్చారు పెళ్లికొడుకు తరఫువారు. పెళ్లి ముహూర్తం కూడా అప్పుడే నిర్ణయించేశారు.
కాబోయే వధూవరులిద్దరూ ఫోనులో సంభాషించుకుంటూ ఈ మధ్య మానసికంగా దగ్గరయ్యారు. శే్వతతో వరుడు సూర్యప్రతాప్ తనకో ముఖ్యమైన స్నేహితుడు శివరాం అనేవాడున్నాడనీ, అతను కిందటి నెలలోనే కట్నకానుకలు లేకుండా చరిత అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని, అతడిని ఆదర్శంగా తీసుకునే తనూ కట్నరహితంగా ఈ వివాహం చేసుకుంటున్నట్లు చెప్పేవాడు.
తోట సంబరం కార్యక్రమం పీటల మీద దగ్గరగా కూర్చున్నపుడు మెల్లిగా అడిగాడు సూర్యప్రతాప్ ‘‘మీ వాళ్లందరూ వచ్చారా?’’
‘‘రావలసిన వాళ్లు అందరూ వచ్చినట్లే’’ అంది శే్వత.
‘‘మావాళ్లు చాలామంది వచ్చారు. కానీ నా ఫ్రెండు శివరాం ఇంకా రాలేదు. ఇందాకా ఫోనులో అడిగితే ఆఫీసులో సెలవు తీసుకుని సాయంత్రానికల్లా వస్తానన్నాడు’’
‘‘అతడి భార్య కూడానా?’’
‘‘అవును సతీసమేతంగా వస్తానన్నాడు’’
‘‘సాయంత్రానికి వస్తామన్నారు కదా. అతడి గురించి ఆలోచిస్తూ ఇప్పుడు మూడ్ పాడు చేసుకోవద్దు’’ అంది శే్వత.
‘‘అతడే నాకు జీవితంలో ఆదర్శం. అతడికి వరకట్నం మీద కచ్చితమైన అభిప్రాయాలున్నాయి. ఈ సామాజిక రుగ్మత తొలగితే దేశం సగం బాగుపడుతుందనేవాడు. ఈ విషయమై రెండు మూడుసార్లు లెక్చర్లిచ్చాడు కూడా. చాలా ఉన్నతాదర్శాలు కలవాడు’’
‘‘అతడి పెళ్లికి మీరు వెళ్లారా?’’
‘‘వెళ్లాను. అదీ ముహూర్తం టైముకే. అతడి అత్తామామలకు అతడి భార్య ఒక్కర్తే సంతానమట’’
‘‘అతని మామగారు ఏం చేస్తారు?’’
‘‘నాకు తెలీదు. ఏదో వ్యాపారం చేస్తున్నారని మాత్రమే తెలుసు. పెళ్లి తర్వాత వాడు హనీమూన్ వెళ్లడం, తర్వాత జాబ్‌లో బిజీ అయిపోవడంతో మేము స్వేచ్ఛగా మాట్లాడుకునే పరిస్థితి రాలేదు. అందుకే అన్ని విషయాలు పూర్తిగా తెలీదు’’
ఇంతలో పురోహితుడు తోటలో తంతు ప్రారంభించాడు. అది గంటన్నరలో ముగిసింది.
అదే సమయంలో సూర్యప్రతాప్ చేతిలో ఫోన్ మోగితే మాట్లాడాడు. అతని మొహం సంతోషంతో వెలిగింది.
‘‘మావాడు వచ్చేసాడట’’ అన్నాడు శే్వతతో.
‘‘స్నేహితుడి కోసం బాగా ఆరాట పడుతున్నారే’’ అంది.
వేదిక మీద తన ముందున్న వ్యక్తి శుభాకాంక్షలు తెలిపి కదలగానే తర్వాతి వ్యక్తిని చూసి ఆనందపడిపోయాడు సూర్యప్రతాప్.
అతడు శివరాం.
లేచి నిలబడి అతడిని కౌగలించుకుని ‘‘ ఇప్పటికైనా వచ్చావు సంతోషం. నీ శ్రీమతి ఏదీ?’’ అనడిగాడు.
అతడి వెనకనే నిలబడ్డ ఆమె సూర్యప్రతాప్‌కు నమస్కరించి ‘బెస్ట్ విషెస్’ అంది ముక్తసరిగా. తర్వాత శే్వత వైపు తిరిగి ‘‘నా పేరు చరిత’’ అంటూ ఆమె చేతిని సుతారంగా నొక్కింది. సూర్యప్రతాప్ శే్వత వైపు చూసి ‘‘నా బెస్టు ఫ్రెండు... ఆదర్శవాది అన్నాను కదా వీడే’’ అన్నాడు.
శే్వత అతడికి నమస్కరించబోయి అతడి కళ్లలోకి ఆశ్చర్యంగా చూసింది. శివరాం కూడా ఆమెకు నమస్కరించబోయి ఏదో ప్రతిఘటన ఎదురైనట్లు ముక్తసరిగా చేతులు జోడించి మొహం పక్కకు తిప్పుకున్నాడు. అదేమీ గమనించని సూర్యప్రతాప్ శివరాంతో ‘‘జీవితంలో నువ్వు చెప్పే సూక్తులు ఎప్పుడూ మరిచిపోను. నీ బాటలోనే నడిచి ఈమెను అర్ధాంగిగా స్వీకరిస్తున్నాను’’ అన్నాడు.
శివరాం ఇబ్బందిగా మొహం పెట్టాడు. ‘‘అవతల నీకు విషెస్ చెప్పడానికి చాలా మంది ఎదురుచూస్తున్నారు’’ అన్నాడు.
‘‘అవునవును. మీరు కిందకి వెళ్లి భోజనాలు కానివ్వండి. ముహూర్తం టైముకి తప్పకుండా ఉండాలి సుమా’’ అన్నాడు.
‘‘ఓ తప్పకుండా ఉంటాము’’ అన్నాడు శివరాం.
ముహూర్తం సమయంలో వధూవరులిద్దరూ పీటల మీద కూర్చున్నారు. కాసేపు తంతు అయాక పురోహితుడు కానిస్తున్నాడు. సూర్యప్రతాప్ శివరాం కోసం చుట్టూ చూసాడు. ఎక్కడా అతను కనిపించలేదు.
అరగంట తర్వాత మాంగళ్యధారణ కార్యక్రమం మొదలయింది. బ్యాండు మేళం సీతారాముల కల్యాణం పాట వాయిస్తున్నారు. వధువు మెడలో మూడు ముళ్లు పడ్డాయి. హాల్లో ఉన్న పెద్దలు సుతారంగా పోటీ పడుతూ వేదిక మీద వధూవరులను ఆశీర్వదిస్తూ ఫొటోలు దిగారు.
సూర్యప్రతాప్‌కు ఎక్కడా శివరాం కనిపించలేదు.
‘‘శివరాం ఏమయినట్లు?’’ శే్వతతో అన్నాడు సూర్యప్రతాప్.
శే్వత అంది ‘‘మీ స్నేహితుడు నాకు ముందే తెలుసు. మా నాన్నగారు నాకు సంబంధాలు చూసే రోజుల్లో మీతో పెళ్లిచూపులు జరగక ముందు కొన్ని నెలల కిందట నన్ను చూసుకుందుకు వచ్చాడు. అతడికి నేను నచ్చానట. కానీ అతడి తరఫు వ్యక్తులు కట్నం కింద ఏడెనిమిది లక్షలు ఇస్తేనే ఈ సంబంధం చేసుకుంటామని కబురు పెట్టారు. దానికి తూగలేక మా నాన్నగారు ఆ సంబంధాన్ని రద్దు చేసుకున్నారు’’
‘‘అలాగా! మరి కట్నం లేకుండానే వాడు పెళ్లి చేసుకున్నాడే’’ ఆశ్చర్యంగా అన్నాడు సూర్యప్రతాప్.
‘‘చేసుకోవచ్చు. అతడి భార్యతో నాకు పరిచయం లేదు కానీ వారి కుటుంబం గురించి నాకు తెలుసు. ఆమె తల్లిదండ్రులు మంచి స్థితిమంతులు. వారి ఒక్కతే కుమార్తె. తండ్రి బిజినెస్ చాలా పెద్దది. రాబడి బాగా ఎక్కువగానే ఉంటుంది. సంఘంలో మంచి హోదా, పరపతీ ఉంది. వారి తదనంతరం ఆస్తి అంతా కుమార్తెకే చెందుతుంది. అంటే శివరాం భార్యకే. అటువంటి వారి దగ్గర కట్నం తీసుకోకుండా ఆదర్శజీవి అనిపించుకున్నాడు మీ స్నేహితుడు’’
‘‘మరి వాడేడి?’’
‘‘నేను అతడిని గుర్తుపట్టాను కదా. ఎదుట పడడానికి మొహం చెల్లక వెళ్లిపోయుంటాడు’’
‘‘ఇప్పుడు మొహం చెల్లకపోవడమేమిటి? శుభలేఖలో నీ పేరు, ఫోటో వివరాలు చూసే ఉంటాడు కదా’’
‘‘మీకు పెళ్లి అన్న దృష్టితోనే ఉన్నాడు తప్ప కార్డులో పెళ్లి కూతురి వివరాలు వివరంగా చూసి ఉండడు. చూసి ఉంటే అసలీ పెళ్లికి వచ్చి ఉండేవాడు కాదని నా నమ్మకం’’ అంది శే్వత.
‘‘వాడి కోసం మరోసారి ప్రయత్నిస్తాను’’ అంటూ ఫోన్ చేశాడు.
‘మీరు కాల్ చేసిన వ్యక్తి స్పందించుటలేదు. దయచేసి కాసేపాగి ప్రయత్నించండి’ అని వినిపించింది.
‘‘సందేహం లేదు. వాడు వెళ్లిపోయాడు. ఏమైనా నిన్ను నాకు వదిలిపెట్టినందుకు వాడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి’’ అన్నాడు సూర్యప్రతాప్.
శే్వత ఆనందంతో క్రీగంట అతడిని చూసింది. వేదికనంతా పరుచుకున్న మల్లెపూల గుబాళింపులో ఆమె నేత్రాలు బంగారు మీనాల్లా మెరిసాయి.

- డా. బి.ఎస్.ఎన్. మూర్తి,
కొంకివీధి, సాలూరు-535591.
సెల్ : 94401 83216.

మినీ కథలు

గురివిందలు

‘‘డిఇఒ కార్యాలయానికి తీసుకెళ్లాల్సిన ఫైళ్లు తీసుకుని రమ్మన్నారు’’ అన్న అటెండర్ వర్తమానంతో కొంత కాలం క్రితమే ఆ ప్రైవేటు కానె్వంట్‌లో గుమస్తాగా చేరిన గుర్నాథం అనబడే నేను వినయంగా ప్రిన్సిపాల్ రూంలోకి ప్రవేశించాను.
నేను రూములోకి ప్రవేశించే సరికి మా ప్రిన్సిపాల్‌గారు ఫోనులో ఎవరితోనో మాట్లాడుతున్నారు.
‘‘ ఎస్సార్! అలాగే సార్... తప్పకుండా సార్’’ అంటూ అత్యంత వినయంగా బదులిస్తున్నారు. మొహం మాత్రం కాస్త ఎర్రబడిందనే చెప్పాలి.
పక్కనే వినయంగా నిలబడ్డ నన్ను చూసి ‘‘పద’’ అంటూ బయటికి దారి తీశారు. ఫైళ్లతో పాటు నేను అతన్ని అనుసరించాను.
ఇద్దరం డి ఇ ఒ కార్యాలయానికి చేరుకున్నాం.
‘‘ ఈసారి పని ఎలాగైనా పూర్తి కావాలోయ్ గుర్నాథం. అవతల కరస్పాండెంట్‌గారు అగ్గి మీద గుగ్గిలం అయిపోతున్నారు’’ అంటూ అంతకు ముందు రెండు సార్లు కొర్రీలతో తిప్పి పంపిన వాటిని మరలా సాధ్యమైనంత సరిచేసి కొత్తగా తయారు చేసిన ఫైళ్లను స్కూల్ రికగ్నిషన్ చేసే సెక్షన్ గుమస్తాకు ఇమ్మని నాకు అందించారు.
నేను వాటిని అందించాను. గుమస్తా కొద్దిసేపు వాటిని పరిశీలించి మా ఫైళ్లను సంబంధిత సెక్షన్ సూపర్నెంట్ వద్దకు తీసుకెళ్లాడు.
పావుగంట తర్వాత మా ఫైళ్లపై మరికొన్ని కొర్రీలు వేసి యథాతథంగా మాకిచ్చాడు. ఆ కొర్రీలు ఏ ప్రైవేట్ మేనేజ్‌మెంట్ వారూ తల్లకిందులుగా తపస్సు చేసినా పూర్తి చేయలేరు.
అప్పటికే స్కూల్ కరస్పాండెంట్ చేత తలంటించుకున్న మా ప్రిన్సిపాల్‌గారు ఉసూరుమంటూ చేసేది లేక గుమస్తాతో బేరానికి దిగారు. చివరికి ఆ సెక్షన్ సూపర్నెంట్‌తో గుమస్తా మంతనాలు జరిపి బేరం సెటిల్ చేశాడు. బయటికి వచ్చి ఎటి ఎం దగ్గరకు వెళ్లి ఆ మొత్తం తీసి సగౌరవంగా తాంబూలం సమర్పించుకున్నాం. దక్షిణ సరిగ్గా సరిపోయిందో లేదో గుమస్తా చూసుకుని వారం తర్వాత వచ్చి ఆర్డర్స్ తీసుకువెళ్లండి’’ అని చెప్పడంతో బతుకుజీవుడా అనుకుంటూ బయటికి వచ్చి దగ్గరలో ఉన్న టీ కొట్లోకి వెళ్లాం. టీ తాగుతూ ‘‘చూడు గుర్నాథం అంతా కాల మహిమ. వాళ్లు చేయాల్సిన పనికి వాళ్లు అంతంత జీతాలు తీసుకుంటూ మళ్లీ తాంబూలం కావాలి అంటూ వేధిస్తున్నారు. వెధవల్ని ఎసబి వాళ్లకి పట్టించాలి’’ తన అక్కసునంతా వెళ్లగక్కారు ప్రిన్సిపాల్‌గారు.
ఆఫీసుకి వెళ్లిన తర్వాత స్కూల్ రికగ్నిషన్ ఎక్స్‌పెన్సస్ ఖాతాలో పాతికవేలు ఖర్చు రాయడం చూసి అదనంగా రాసిన పదివేలు ప్రిన్సిపాల్ జేబులోకి అన్నమాట అని నవ్వుకున్నాను.
వారం తర్వాత మళ్లీ ఆఫీసుకి పోయాం. పని పూర్తయింది. మా కరస్పాండెంట్ దగ్గర ఆ పని తానెంత సమర్థవంతంగా, ఎంత చాకచక్యంగా ఒకటికి పది కల్పించి చెప్పుకుని తన లాభాన్ని తాను పొందారు ప్రిన్సిపాల్‌గారు.
పని జరిగిన మంచి మూడ్‌లో ఆయన ఉండడం చూసి అప్పటికి కొంత కాలంగా నలుగుతున్న నా జీతం పెంపుదల గురించి కరస్పాండెంట్ గారితో చెప్పి పని జరిగేలా చూడవలసినదిగా మా ప్రిన్సిపాల్‌గారిని అభ్యర్ధించాను. ఆయన ‘‘తప్పకుండానోయ్ గుర్నాథం’’ అంటూ నసిగాడు.
విషయం నాకు అర్ధమయింది.
పని జరిగేందుకు దక్షిణ ఎంతో తెలుసుకుని సగౌరవంగా సమర్పించుకున్నాను. ఆ నెల జీతంతోనే నేను నా పెరిగిన జీతం చూసి ‘ఇంత కాలంగా నా పని అవకపోవడానికి కారణం మా ప్రిన్సిపాల్ గారికి నేను తాంబూలం సమర్పించకపోవడమే’ అని గ్రహించి హతాశుడినయ్యాను. ‘్ఛ గురివిందలు’ అని మనసులో చీదరించుకుని బయటికి నవ్వుతూ ‘‘్థ్యంక్స్’’ అన్నాను.

- మండా శ్రీ్ధర్,
శ్రీకాకుళం.
సెల్ : 9493309030.
ఆత్మదీపం

‘‘ఎవరు మీరు?’’ అయోమయంగా చూస్తూ అడిగాడు సృజన్.
‘‘ఇది సావిత్రి ఇల్లేనా?’’ మళ్లీ అడిగాడు అతను.
‘‘అవును’’ అతన్ని పరిశీలనగా చూస్తూ చెప్పాడు సృజన్.
మాసిన గడ్డం, బట్టతల చుట్టూ ముగ్గుబుట్టయిన జుత్తు, లోతుకు పోయిన కళ్లు, లంకణాలు చేస్తున్నట్టు పీక్కుపోయిన ముఖం, మాసిన బట్టలతో, కంపు కొడుతూ అసహ్యంగా ఉన్నాడు అతను.
‘‘మా అమ్మ డ్యూటీకెళ్లింది. మీరు తర్వాత రండి’’ అంటూ తలుపు వేయబోయాడు సృజన్.
‘‘బాబూ ఆగాగు! సావిత్రి వచ్చే వరకు ఇక్కడే ఉంటాను’’ అన్నాడు అతను.
తప్పలేదు సృజన్‌కి. స్టూల్ వేసి లోపల కూర్చోమన్నాడు.
టీవీ ఆన్ చేసి చానల్స్ మారుస్తూ సోఫాలో కూర్చున్నాడు సృజన్.
కొద్దిసేపు అలా గడిపాక చిరాగ్గా అనిపించి తల్లికి ఫోన్ చేశాడు.
‘‘సృజన్ ఏమిట్రా చెప్పు’’ అట్నుంచి తల్లి గొంతు వినిపించింది.
‘‘ ఎవరో పెద్దాయన నీ కోసం వచ్చాడు. ఇక్కడే కూర్చున్నాడు’’ చెప్పాడు సృజన్.
‘‘ ఎవర్రా కనుక్కోలేకపోయావా? ఫోను అతనికి ఇవ్వు మాట్లాడతాను’’ అంది సావిత్రమ్మ. సెల్ అతనికి అందించాడు సృజన్.
‘‘హలో సావిత్రి నేను... నేనేనే’’ అతని కంఠం ఒణుకుతుంటే గొంతు జీరబోయింది. కళ్లలో సన్నటి కన్నీటిపొర నిలిచింది.
అతని మాటలకు తల్లి ఏం సమాధానం చెబుతుందో సృజన్‌కి అర్ధం కాలేదు.
అతను మాటలు ఆపేసి సృజన్ కేసి ప్రేమగా చూస్తున్నాడు.
సృజన్ కూడా అతని కేసి చూశాడు.
‘‘ ఏమిటి బాబూ అలా చూస్తున్నావు. నేను మీ నాన్నని’’ అన్నాడతను ఆర్ద్రంగా.
ఆ మాట విన్న వెంటనే సృజన్ అతని వైపు కోసంగా చూసాడు. ముఖం మాడ్చుకుని వౌనంగా ఉండిపోయాడు.
ఇంతలో ‘‘అన్నయ్యా! అమ్మ ఇంకా రాలేదా?’’ అంటూ వచ్చింది సృజన్ చెల్లెలు సువర్ణ.
వస్తూనే ఇంట్లో కూర్చుని ఉన్న వ్యక్తిని ‘ ఎవరు?’ అన్నట్లు సృజన్ వైపు చూసి కళ్లెగరేసింది.
‘‘నాన్న’’ చిన్నగా గొణిగాడు సృజన్.
‘‘మనకి అమ్మ ఉంది కానీ నాన్నక్కడెన్నాడ్రా?’’ గట్టిగానే సాగదీసింది. సృజన్ మాట్లాడలేదు.
‘‘అద్గదీ సంగతి! ఎప్పటికైనా మీ నాన్నకి మనమే దిక్కవుతాం. ఈ ఇల్లే అతనికి శాంతినివాసం అవుతుంది అని పదేపదే అమ్మ అంటుండేది కదా. అందుకే వెతుక్కుంటూ వచ్చాడ్లాగుంది’’ నిష్టూరంగా అంది సువర్ణ.
‘‘బాగా చెప్పావు. ఇన్నాళ్లూ అమ్మ గురించి, మన గురించి పట్టించుకోని ఈయనకి ఇప్పుడు మన మీద ఇంత హఠాత్తుగా ఎలా ప్రేమ పుట్టుకొచ్చిందో’’ అన్నాడు సృజన్.
‘‘బయటికి పంపించెయ్’’ అంది సువర్ణ.
‘‘లే లేచి బయటికి నడు’’ గొంతు చించుకున్నాడు సృజన్.
అతను లేచి నిలబడి బయటికి వెళ్లిపోవడానికి సిద్ధమయ్యాడు.
సరిగ్గా అప్పుడే వచ్చింది సావిత్రి.
‘‘అరెరె ఎక్కడికి వెళ్లిపోతున్నారు? నేను వస్తున్నానని చెప్పాను కదా’’ అతని రెండు చేతులు పట్టుకుని లోపలికి తీసుకెళుతూ అంది సావిత్రి. గ్లాసుతో మంచినీళ్లు తీసుకొచ్చి ఇచ్చింది. సృజన్, సువర్ణ వౌనంగా చూస్తుండిపోయారు.
వేడినీళ్లు పెట్టి అతనికి బాత్రూం చూపించింది. స్నానం చేసి రమ్మని పంపించింది.
అతను స్నానం చేసి వచ్చాక అతని తల తుడిచింది.
‘‘ఎలా ఉన్నారు? ఏమిటిలా చిక్కిపోయారు’’ అంది.
‘‘బాగానే ఉన్నాను. నువ్వూ, పిల్లలు ఎలా ఉన్నారు?’’ అడిగాడు అతను.
‘‘్ఫరవాలేదండీ! సృజన్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. సువర్ణ చదువు కూడా పూర్తి కావస్తుంది. నన్ను అన్యాయం చేసినట్లే మిమ్మల్నే నమ్ముకున్న ఆవిడనీ వదిలేసి వచ్చారా? అదే తప్పు మళ్లీ చేయలేదు కదా’’ ప్రశ్నించింది.
‘‘లేదు సావిత్రి! సుందరి చచ్చిపోయింది. పిల్లాజెల్లా లేరు. నిన్నూ, పిల్లల్ని ఒకసారి చూసి వెళ్లిపోదామని వచ్చాను’’
‘‘చూసి పోవడానికి వచ్చారా? వీల్లేదు. మీరు జీవితాంతం మాతో ఉండాల్సిందే. సృజన్, సువర్ణా ఇలా రండి. అందరికీ నాన్న ఉన్నాడు. మాకేరి? అని అడిగేవారు కదా. ఇదిగో మీ నాన్నగారు... విశ్వంగారు’’ చెప్పింది సావిత్రి.
అయితే వాళ్లిద్దరిలో ఎలాంటి స్పందనా లేదు.
ఆ రాత్రి విశ్వానికి సంతృప్తికరంగా భోజనం వండి వడ్డించింది సావిత్రి.
రాత్రి పిల్లలు ఇద్దరూ ఆమె దగ్గరకి చేరారు. ‘‘మనల్ని వదిలేసి అష్టకష్టాల పాల్జేసిన నాన్న మనకి ఎందుకమ్మా’’ అని మనసులో మాట చెప్పారు.
‘‘తప్పు అలా మాట్లాడకూడదు. మనం మనుషులుగా పుట్టినందుకు మనుషులుగానే బతకాలి. మనిషిగా నాన్న చేసిన తప్పును ఆయనకు కాలం తెలియజేసింది. మీకు జన్మనిచ్చిన మీ నాన్న పట్ల ప్రేమ చూపించాలి గానీ, ప్రతీకారం కాదు. ఆత్మదీపాన్ని దృఢంగా వెలిగించుకుని ముందుకు నడవాలి’’ ఉద్వేగంగా చెప్పింది సావిత్రి.
సావిత్రి మాటలను గుమ్మం దగ్గరే ఉండి విన్న విశ్వానికి కళ్లు చెమర్చాయి.
సావిత్రి అలవాటు ప్రకారం ఉదయం అయిదు గంటలకే నిద్ర లేచి మంచం వైపు చూసింది. అయితే ఆమెకు భర్త కనిపించలేదు. బాత్రూంలో, హాల్లో, గుమ్మంలో చూసింది. ఎక్కడా అతను లేడు.
అద్దంలో నుదుట కుంకుమ దిద్దుకోవాలని వెళ్లి తిలకంతో రాసిన ఆత్మదీపం వెలిగించు అన్న వాక్యాన్ని చూసి నిర్ఘాంతపోయింది.
ఆమె కంటి నుండి జారిన నీటిచుక్కలను బుగ్గలు కూడా జారవిడిచాయి.

- యల్. రాజాగణేష్,
పాతగాజువాక, సెల్ : 9247483700.

మనోగీతికలు

అమ్మతనమా?
అరాచకత్వమా?
అమ్మంటే,
అంతం లేని మమకారానికి ప్రతిరూపం
కానీ,
అదే అమ్మ,
మన అదృష్టాన్ని మసి చేసేదయితే
పడే ఆవేదనను తెలపడానికి
మనస్సుకు భాష లేదు
ఆవేదనకు హద్దు లేదు
కన్నతల్లి కసాయిగా మారిన క్షణం
మమకారానికి మాధుర్యం దూరం అవుతుంది
ఆకాశపందిరిలా అమ్మ ఉంటే
నేలపై ఒదిగి చెట్టులా బిడ్డలు ఉండే నాటితో పాటు
అదే అమ్మ చెట్లను పెళ్లగించే జడివానలా మారితే
బిడ్డల పయనం... నేలకు ఒరిగిపోవడం
అమ్మా అనే పదాన్ని
వివరించడానికి భాష లేదు అనే క్షణం నుండి,
అమ్మ అంటే హంతకురాలు అనే భావం
ఎందుకు ఇలాంటి మాతృమూర్తులు ఉంటారు?
పిల్లలను చెత్తకుండీలు, రోడ్డుపక్కన, రైల్వేట్రాక్‌లపైకి విసిరేసే మాతృమూర్తులు
ఎందుకు ఈ సమాజానికి?
పసి హృదయాలను
పసిప్రాయంలోనే హరిస్తున్నారు
అమ్మతనం కల్తీ లేకుండా ఉండాలి
ఆబాలగోపాలం ఆ ప్రేమను ఆస్వాదించాలి
అప్పుడే ఈ దివి ప్రేమతత్వంతో వెల్లివిరుస్తుంది
అంతా శాంతి, సౌఖ్యంతో అలరారుతుంది!

- పెద్దకోట ఉమాదేవి,
లక్ష్మీనగర్ వెనుక వీధి, ఆమదాలవలస,
సెల్ : 9652262212.

జాగృతి
మెదడు క్షీర సాగరాన్ని
లక్ష్యం కవ్వంతో తిప్పు
ఆలోచనామృతం దక్కుతుంది
మనసు గుర్రాన్ని
బుద్ధిరౌతు స్వాధీనంలో ఉంచు
గమ్యం చక్కగా చేరగలమ్...
గుండెడప్పుపై
సమస్యలు భేరి మ్రోగిస్తున్నాయని
వెరవనక్కరలేదు!
అరిషడ్వర్గాలు
అక్రమదాడులు చేసినా ఆవిరైపోకు!
చేతనా స్థితి మాత్రమే మనిషిని
మహాత్మునిగా మార్చుతుంది
చేతగాని స్థితి మాత్రం
మనిషిని పాతరేస్తుంది సుమా!

- కిలపర్తి దాలినాయుడు
సెల్ : 9491763261.

ఆడబ్రతుకు
మొగ్గతొడిగిన నాడే చిదిమేసి
గర్భంలోనే బందీగా దాచి ఉంచిన మనుషులు
తల్లి మనసు గొప్పదని పేలే నరరూప రాక్షసుల నడుమ
అంకురించలేక నిస్సహాయనైతి
ప్రపంచ పుట్టుక మరచి సమత్వం చూపలేక
ఆడబ్రతుకు ఆశలను ఆవిరిగా చేసి
పురుష సామ్రాజ్య స్థాపనకు
అణువణువూ శ్రమించిన మనుషులు
వరకట్న సాకు చూపి ఆడబ్రతుకే భారమని
ముళ్ల పొదల మాటున మూగుతూ ఉన్న నాకు
స్వేచ్ఛ లేదా ఈ ప్రపంచంలో!

- కుబిరెడ్డి చెల్లారావు
చోడవరం, సెల్ : 9885090752.

అందరూ చదువుకోవాలి
చదువంటే ఉదయించే సూర్యుడు
యుద్ధంలో గెలుపొందిన వీరుడు
నీవు చదువుకుంటే అన్నింటా గెలుపు
లేదంటే ప్రశ్నార్థకం బతుకు
చదువు లేకుంటే ధనమున్నా బికారే
చదువు నడిపించును అభివృద్ధి వైపు
చదువే కావాలి సర్వస్వం ఎల్లరకు
భుక్తిని, శక్తిని ఇచ్చేది చదువే
చదువుకుంటేనే అందరికీ భవిత!

- నాగాస్త్రం నాగు,
వడ్డపూడి, విశాఖపట్నం.

ఎదురుచూపులు
ఏమిటి ఈ ఆకర్షణ
ఎందుకు ఈ నిరీక్షణ
దేనికోసమీ అనే్వషణ
మారిపోతోంది సుమీ
నా మనోవర్తన!
ఏదో కావాలని ఆరాటం
మనసులో దానికై పోరాటం
ఆపుతున్నా ఆగని ఆత్రం
మనో ఫలకంపై చెరగని చిత్రం!
నీ చెంతన గడిచే కాలం
గంటలు గంటలైనా క్షణమాత్రం!
ఎప్పడిస్తారో కదా నాన్న పైకం
త్వరగా ఎక్కించాలి అంతర్జాల వ్యూహం!!

- గుమ్మా నాగమంజరి
వెంకటరమణపేట, శృంగవరపుకోట-535145.
విజయనగరం జిల్లా.

విశాఖ రచయతల సంఘం

విశాఖ రచయతల సంఘం ఆధ్వర్యంలో 14 మే, 2016న విశాఖ పౌర గ్రంథాలయంలో ‘విశాఖ కథా తరంగాలు’ ఆవిష్కరణ సభలో కథా రచయతలు ఆనందరావు పట్నాయక్, చందు సుబ్బారావు, సంకలనకర్త అడపా రామకృష్ణ, ద్విభాష్యం రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

email: merupuvsp@andhrabhoomi.net

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) ఎడిటర్, మెరుపు, ఆంధ్రభూమి దినపత్రిక, సెక్టర్-9, ఎం.వి.పి.కాలనీ, విశాఖపట్నం-17. అనే చిరునామాకు పంపండి. email: merupuvsp@andhrabhoomi.net ఇ-మెయల్‌కు పిడిఎఫ్‌లో పంపించవచ్చు.

- డా. బి.ఎస్.ఎన్. మూర్తి