ఉత్తర తెలంగాణ

వరుణ శపథం కథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెళ్లిచూపుల తతంగం ముగిసింది. చూడగానే ఇద్దరికీ ఒకరికొకరు నచ్చారు. తమ పెద్దవాళ్లు ‘ఓకే’ అనుకునే లోపల, వైశాలితో ఏకాంతంగా ఓ పది నిమిషాలు మాట్లాడాలని వరుణ్ అనగానే... ఇద్దర్నీ ఇంటి వెనక పెరట్లోకి పంపారు.
‘వైశాలిగారు! నాకు మీరు బాగా నచ్చారు. పెళ్లికి నాకైతే అభ్యంతరం లేదు. మీరు చెప్పండి... మీకు అంగీకారమేనా?’ వరుణ్ మాటలకు వైశాలి సంతోషంగా తల ఊపి తన సమ్మతాన్ని కూడా తెలియజేసింది.
‘అయితే... నేను కొన్ని విషయాలు మీకు ముందుగానే చెప్పాలనీ... ఇలా ఇక్కడికి రమ్మన్నాను. పెళ్లికి ముందు ఏ దాపరికాలు వుండకూడదని... నాకున్న ఓ రెండు అలవాట్లు - స్మోకింగ్, అకేషనల్ డ్రింకింగ్. ఈ రెండూ చెడ్డవే అని తెలుసు. నేను సైకాలజీ స్పెషలిస్టును. కానీ ఇప్పటికీ ఈ అలవాట్లను వదలలేకపోతున్నాను. మానేయడానికి ప్రయత్నిస్తాను.’
చెప్పాలనుకున్నవి గబగబా చెప్పి వైశాలివైపు చూశాడు. కొంత ఆలోచనలో పడినా... వెంటనే తేరుకుని... తరువాత మెల్లిగా నచ్చచెప్పి మాన్పించవచ్చులే అని... వైశాలి తన సంపూర్ణ అంగీకారాన్ని తెలిపింది.
పెళ్ళయిన మొదటి రాత్రి నుండే వైశాలి వరుణ్‌కు ఉన్న అలవాట్లను... ప్రత్యేకంగా స్మోకింగ్‌ను మాన్పించడానికి చాలా ప్రయత్నాలు చేసి విఫలమై విరమించుకుంది. చివరికి దేవుడిపై భారం వేసింది. ఈ రెండు అలవాట్లు తప్పితే, వరుణ్‌లో మంచి ఆదర్శవంతమైన భర్త ఉన్నాడు.
వరుణ్ - వైశాలికి పెళ్లయి ఇప్పటికి పదేళ్లు. వరుణ్‌కు మంచి ఉద్యోగం... ఉస్మానియా యూనివర్సిటీకి ఓ మంచి పేరున్న అనుబంధ కళాశాలలో సైకాలజీ బోధించే అసిస్టెంట్ ప్రొఫెసర్... ఐదంకెల జీతం... అందమైన భార్య. వైశాలికి కూడా ఇంటి దగ్గరలో వున్న ఓ ప్రైవేటు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో టీచర్ ఉద్యోగం. వీరికి ఒక్కగానొక్క కొడుకు రుషి. వాడికి ఎనిమిదేళ్లు. వైశాలి పనిచేసే స్కూల్ దగ్గరలోనే మంచి పేరున్న ఓ స్కూల్లో మూడవ తరగతి చదువు. ఒక్కడు చాలనుకున్నారు... అల్లారుముద్దుగా పెంచుతున్నారు.
‘వైశాలీ! ఎక్కడున్నావ్! ఈరోజు మనకో శుభవార్త.. నాకు అసోసియేట్ ప్రొఫెసర్‌గా ప్రమోషన్ ఆర్డర్స్ ఇచ్చారు. చాలా పోటీ వున్నా ఈ ప్రమోషన్ నన్ను వరిస్తుందని అనుకోలేదు. ఐయామ్ సో హ్యాపీ’ పొంగుతున్న సంతోషాన్ని ఆపుకోలేక వైశాలిని గట్టిగా వాటేసుకున్నాడు.
‘ఇట్స్ సెలబ్రేషన్ టైం ఫర్ అజ్’ అన్నాడు సంతోషాన్ని ఆపుకోలేని వరుణ్.
ఆ సాయంత్రమే ఓ స్కాచ్ బాటిల్ తెరిచాడు. ఆ సంతోషంలో సిగరెట్ మీద సిగరెట్, గ్లాసు మీద గ్లాసు... మామూలు కన్నా కొంచెం ఎక్కువగానే తాగినట్టున్నాడు. నిలబడబోతే పట్టు తప్పాడు. తూలితే టీపాయ్ మీదున్న గ్లాసు కిందపడి ముక్కలయ్యింది. అది చూసి రుషి ఏడవటం మొదలుపెట్టాడు. ఎంత ఓదార్చినా ఫలితం లేకుంటే... వాడిని అతి కష్టం మీద ఏదో మాటల్లోకి దింపి నిద్రబుచ్చి భర్త వున్న గదిలోకి వచ్చిన వైశాలి కళ్లనిండా నీరు... అప్పటికే వరుణ్ మత్తు ప్రభావమో ఏమో నిద్రలోకి జారుకున్నాడు.
ఆ మరునాడు రాత్రి వైశాలిని దగ్గరకు తీస్తూ వరుణ్...
‘సారీ వైశాలీ! ఆ డ్రింక్ మత్తులో బడి నీతో నా సంతోషాన్ని పంచుకోలేక పోయినందుకు సిగ్గుగా వుంది. నన్ను క్షమించు!’ అంటుంటే వైశాలి సున్నితంగా వారించి...
‘మీతో చాలా రోజులనుండి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు వింటానంటే చెప్తాను’ అప్పటికే గిల్టీగా వున్న వరుణ్ చెప్పమన్నట్లు తలూపాడు.
‘నేను ఒకరోజు స్కూలునుండి వచ్చేసరికి మన రుషి మీరు రోజూ కూర్చునే వరండా కుర్చీలో కూర్చొని ఓ తెల్ల చాక్‌పీసు వాడి కుడిచేయి వేళ్ల నడుమ పెట్టుకొని మీరు సిగరెట్ తాగినట్టు పోజు పెట్టాడు. ఇలా చాలామార్లు చేశాడు...’ ఇంకా చెబుతుంటే... వరుణ్...
‘దానిదేముంది... సరదాగా చేసి వుంటాడు’ అన్నాడు.
‘అయ్యో... కాదండి! అలా అయితే బాగానే వుండను. కానీ, నేనొక రోజు వాడ్ని నిలదీసి అలా ఎందుకు చేస్తున్నావు? అదేం ఆటరా? అని అడిగితే - వాడేమన్నాడో తెలుసా? డాడీలా పెద్దయ్యాక నేనూ సిగరెట్టు ఇలాగే తాగాలిగా అని చెప్పాడు. నేను షాక్ అయ్యానండి. కొన్ని రోజులుగా ఈ విషయం మీకు చెప్పాలని ప్రయత్నించాను. కానీ కుదరలేదు’ చెప్పడం ముగిసిన తరువాత వరుణ్ ఒక్కసారి షాక్ తిన్నవాడిలా -
‘వ్హాట్...’ అంటూ అరిచినంత పనిచేశాడు.
‘కానీ... నిన్న వాడు ఏడుస్తూ చెప్పింది ఇంకా ఘోరం’ వైశాలి చెబుతూనే వుంది.
‘ఏంటది... వైశాలి’ ఆతృతగా అడిగాడు వరుణ్.
‘డాడీ మందు తాగే గ్లాసు పగులగొట్టాడు. మరి నేను పెద్దయ్యాక ఎలా తాగాలి’
అంతే... ఇది విన్న వరుణ్ నిశే్చష్టుడయ్యాడు. కాసేపు నోట మాట రాలేదు. సైకాలజీ బోధకుడైన తనకు, ‘పిల్లల మనస్తత్వాలు అతి సున్నితం... చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి’ అనే తెలుసు. కానీ వారి మెదడు ఒక కంప్యూటర్ డిస్కు, ఒక రికార్డింగ్ టేపు అని, వారి ముందు జరిగేవన్నీ అందులో రికార్డవుతాయనీ... మొదటిసారి తన కొడుకు రుషి రుచి చూపించాడు.
వెంటనే వరుణ్ లేచి తను స్టాక్ చేసుకున్న సిగరెట్టు డబ్బాలు, మందు సీసాలు అన్నీ తీసి నోటిలో వున్న సగం కాలిన సిగరెట్‌తో సహా చెత్తబుట్టలో వేశాడు. వైశాలిని దగ్గరకు తీసుకొని.. రుషి పడుకున్న గదిలోకి నడిచారు.
‘ఇకపై ఈ ఇంట్లోగాని... ఇంకెక్కడైనా గాని... నేను ఈ జన్మలో సిగరెట్, ఆల్కహాల్ ముట్టుకోను! మన రుషి మీద ఒట్టు’ అని వరుణ్ శపథం చేశాడు. ‘హమ్మయ్య’ పెళ్ళయిన నాటినుండి ఈ పదేళ్లలో తను సాధించలేని పనిని రుషి ద్వారా తీర్చినందుకు దేవుడికి... కాదు కాదు... దేవుడిలా అగుపించిన రుషికి కోటి దండాలు పెట్టుకుంది వైశాలి.

- ఆచార్య కడారు వీరారెడ్డి,
హైదరాబాద్, మొబైల్ : 7893366363

పుస్తక సమీక్ష

‘సబ్బని’ జంట...
నానీల పంట!
పేజీలు: 47
వెల: రు.50/-
ప్రతులకు:
సబ్బని లక్ష్మీనారాయణ
6-6-302, సాయినగర్,
కరీంనగర్- 505001
9247270941
72427270941

గత మూడు దశాబ్దాలకు పైగా కవిత్వ సేద్యం చేస్తున్న సబ్బని లక్ష్మీనారాయణ తన సతీమణి శారదగారితో కలిసి ‘‘దంపతి నానీల’’ను ప్రకటించారు. ఈ గ్రంథంలో ‘శారద నానీలు’... ‘సబ్బని నానీలు’ విడివిడిగా వున్నప్పటికీ... ఇద్దరి ఆలోచనల్లో... రచనా వైచిత్రిలో... భావ ప్రకటనలో సారూప్యాన్ని వీక్షిస్తాము. సంసారం సరిగమలను దాంపత్య జీవిత మధురిమలను నానీల్లో అక్కడక్కడా ప్రతిబింబింపజేయడంలో వారి ప్రతిభను, సృజనాత్మకతను ప్రశంసించకుండా ఉండలేము! సమకాలీన అంశాలకు పెద్దపీట వేస్తూ రాయబడిన ఉభయుల నానీల్లో... జీవితం ఉంది... కవిత్వంలో జీవం ఉంది!
మొదట శారద నానీలను పరిశీలిస్తే... కొన్ని వస్తుంటాయి/ వెనక్కెళ్ళి పోతుంటాయి/ అలల సముద్రం జీవితం అంటూ శారదగారు తమ తాత్త్వికతను చాటుకున్నారు..
కాలం కర్పూరంలా/ కరిగిపోతుంది/ కరిగిపోనిది / మనసేనని తేల్చి చెప్పిన తీరు బాగుంది.
‘అబ్బో! మా సబ్బని!
ఓ బతుకు పదం
ఓ నదీ ప్రవాహం
వౌన సముద్రం’’ అంటూ ఆమె శ్రీవారు లక్ష్మీనారాయణగారి కలం నుండి జాలువారిన గ్రంథాలను నానీలో నిక్షిప్తం చేశారు.
కన్నీళ్ళ ప్రాధాన్యతను.. కన్నీళ్ళతో మనం పొందే సాంత్వనను తెలుపుతూ శారదగారు రాసిన నానీ అందరినీ ఆకట్టుకుంటుంది.
బాధకు ఓదార్పు / కన్నీళ్ళే
అవి లేకుంటే / బతుకు ఎడారే! - అని కవయిత్రి అనడంలోని ఔచిత్యాన్ని మనం గ్రహించవచ్చు.
‘‘మా సబ్బని / వొట్టి అమాయకుడు
నాకు / తన సగం పేరిచ్చిండు’’ అంటూ మరో నానీలో శారదగారు చమత్కరించారు.
ఇలా.. శారదగారన్నట్లు... ఆమె నానీలు నవరసాలు.. అనుభవ సత్యాలు.. మీగడ ముత్యాలేనని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు!
బతుకును నెమరేసుకుంటూ ఆమె రాసిన నానీల్లో జీవన సత్యాలను అందంగా ఆవిష్కరించారు. ఆమె అన్నట్లు... ఆమె మనసు రాగాలు ఆలపించగా... నానీల కుసుమాలు వికసించాయి! మధుర స్మృతులు... మాయని గాయాలు.. బతుకును వెలిగిస్తాయి.. మరికొన్ని బాధిస్తాయన్న వాస్తవాన్ని తెలియజేసేలా శారదగారి నానీలున్నాయి. ఇక... సబ్బని లక్ష్మీనారాయణారి.. నానీలను పరిశీలిస్తే... కవిత్వం హృదయాల భాష అనీ... కన్నీటి సారం... బతుకు సారాంశమనీ ఇట్టే తెలుసుకుంటాం. బతుకే పెద్ద కాన్వాసు కనుక కవిత్వానికి వస్తువు కరువుండదనీ... బతుకును ప్రతిఫలిస్తూ హృదయ వనంలో పూచిన సుందర పుష్పంలా కవిత్వాన్ని పండించాలన్న ఆయన ఆలోచన అభినందనీయం!
‘‘రాసిన ప్రతివాడు / కవి కాడు
తిలక్ నడుగు / చెపుతాడు’’ అని హితవు పలికారు. సబ్బని ఆయన సతీమణి శారదపై రాసిన నానీలు వారి అన్యోన్య దాంపత్యాన్ని సూచించేలా వున్నాయి.
‘‘మా ఆవిడ / దేన్నీ వేస్ట్ చేయదు
పాలు, నీళ్ళు సహా/ ఆవిడ పొదుపు లక్ష్మి’’ అంటూ ఓ నానీలో కొనియాడారు.
‘‘మా శారద / సత్యాలే వర్షిస్తుంది
ముత్యాలే రాలుస్తుంది / ఆమె నీరద కదా’’ అని వ్యాఖ్యానించారు.
కన్నీటి విలువ, కష్టాల సారం తెలిసిన కవి సబ్బని లక్ష్మీనారాయణ కనుక బతుకులో నాని.. హాలాహలం మింగి.. అమృతాన్ని పంచినట్లు తమ భావాలను ఈ నానీల్లో ప్రకటించారు.
వాదమేదైతేనేం?
మానవత్వానికి
మించిందా?
బతుకు పునాది కావాలని కాంక్షించే ఆయన తన అనుభవాలను రంగరించి.. రాసిన ఇందలి నానీలు సందేశాత్మకంగా వున్నాయి! ఇలా ఇద్దరు కలిసి పండించిన నానీల పంట సాహితీ ప్రియులను అలరించగలదన్న విశ్వాసముంది!

- సాన్వి, కరీంనగర్, 9440525544

మనోగీతికలు

ఎప్పుడు?
నీ స్వప్న సౌధం పూర్తవ్వడానికి
వాళ్లంతా రోజు చెమట బిందువులవ్వాలి
కానీ నీ గృహ ప్రవేశానికి మాత్రం
ఆహ్వాన జాబితాలో వారి పేరుండదు
నీ ఇంట్లో మొదటి అడుగు వాళ్లదేననీ
నీ మూర్ఖత్వానికి ఎప్పుడు తెలిసొస్తుందో ఏమో?
వాళ్ల నైపుణ్యాలన్నీ నీకు పనికిరావాలి
కానీ కూలీ డబ్బులిచ్చేటప్పుడు మాత్రం
ఏదో ఒక నైపుణ్యానే్న మరిగణనలోకి తీసుకోవాలనుకునే
నీ దుష్ట ఆలోచన ఇంకెప్పుడు మారుతుందో ఏమో?
వాళ్లకు శరీర సౌష్టవముండాలి
పనిలో మెరికలై మెరుస్తుండాలి
సిమెంటు బస్తాలు గాల్లో తేలాలి
గోడలు నీ ముందే మేడలవ్వాలి
నీవిచ్చే కూలీ మాత్రం
పెరుగులో ఉప్పులాగ కొంచెమై వుండాలన్న
నీ వికృత మేధస్సు మరింకెప్పుడు మేల్కొంటుందో ఏమో?
రోజు వీళ్ల చెమట బిందువులు
చౌకగా నీ ఇంటి గోడకే వల్లె వేయబడతాయి
కానీ పనిగంటల లెక్కల్లో యాక్యురసీ లేని
నీ పాషాణ హృదయం అసలెప్పుడు చలిస్తుందో ఏమో?
కర్షక ఘర్మజల దోపిడి స్వలాభమేమో
కానీ సంస్కారమెప్పటికి కానీ కాబోదు

- అశోక్ అవారి
సిద్దిపేట, మెదక్ జిల్లా
సెల్.నం.9000576581

సుప్రభాత గీతికవై...

ఒకసారి మనసు ముక్కలయ్యాక
ప్రశ్నార్థకమైన జీవితంతో
ప్రణయానికిక చోటెక్కడిది?
అంతరాంతరాల్లోంచి
సాగిపోతున్న బ్రతుకు నావకు
ఉపద్రవాల ప్రమాదం పొంచి ఉన్నట్లు
హృదయ కవాటాలను ఛేదించుకుని
అనుమానాల లావా ప్రవహిస్తోంది!
నిగూఢమైన నీ తలపుల్లో
గూఢార్థాల నిప్పు రాజుకుంటోంది
తొలి జాము వేళలో
సుప్రభాత గీతికవై మేలుకొలుపుతావని
అనురాగ కాంతులతో నిండిన నా గుండె గూటిని
వెలుగు పూల తోరణాలతో అలంకరించాను
నీ కోసం నిదురకాచిన కన్నులపై
కాంతి కిరణాలతో కవితలు అల్లుతావనీ
పగటి కలల గాలిపటాలను ఎగరేశాను
కానీ... నీ తోడు వీడాకే అర్థమైంది!
నేను నడుస్తున్న దారిలో
ఆటంకాల కంటకాలు దారికాస్తున్నాయనీ
నీ సహచర్యంలో పురివిప్పిన మది
నేడు మలి పొద్దులా మసకబారి పోయిందనీ
నడిరాతిరి వేళ గుండెను గురిచూసే
చేదు స్వప్నాలను తలచుకుని వణికిపోతున్నాను
చివరికి... చిగురించడం మరచిన అడవిలో
ఆమని రాకకై అలమటిస్తున్న కోయిలలా..!

- పొద్దుటూరి మాధవీలత
ఎడవల్లి గ్రామం, నిజామాబాద్ జిల్లా
7386483664

ఊహాలోకాల్లోకి...

నాలో మధుర భావాలు
మెరిసేలా...
ఎందుకో ఈ రేయిలో కురిసే
శశికాంతులు పులకరింపజేస్తున్నాయి!
జిలుగు వెలుగులో...
హృదిలోని తరంగాలు
అంతరంగాన్ని ఆవిష్కరిస్తుంటే...
మనసు దోబూచులాడుతోంది!
ఇంకేముంది?
కనులు మూసినా, తెరిచినా
నీ రూపమే నా మనోఫలకంపై
ముగ్ధ మనోహరమై
నాట్యమాడుతుంటే...
నీ రాకకై... నిదురలో కలవరింతలు
మెలకువలో పలవరింతలు
వలపుల గింతలు పెడుతూ...
నన్ను...
ఊహాలోకాల్లోకి లాక్కొని వెళ్తున్నాయి!

- హనుమాండ్ల రమాదేవి,
బెల్లంపల్లి, ఆదిలాబాద్ జిల్లా
9959835745

కవితంటే...?
మనసులోని భావాలకు ప్రతి రూపం కవిత
మనసుకు అద్దంపట్టే ప్రతి అక్షరం కవిత!

మానస చక్షువులతో వీక్షించునది కవిత
మానవత్వన్ని మదిలో మేల్కొల్పునది కవిత

స్పందించే మది సడియే కవిత
మారిన హృది సవ్వడే కవిత

కుళ్ళిన సమాజాన్ని ఎత్తిచూపునది కవిత
సమాజపుహితాన్ని కోరునది కవిత

అక్షరమను ఆయుధపు సరికొత్త రూపు కవిత
అందరిలో కుటిలత్వాన్ని రూపుమాపుతుంది కవిత

రవి కాంచనిది కవికాంచుననుటకు ఉదాహరణ కవిత
సమస్యల పరిష్కారానికి ఒక తార్కాణం కవిత

జనుల హృదయాలను కదిలించునది కవిత
అందరికీ దిశానిర్దేశాన్ని చేసేది కవిత

కవియొక్క సామాజిక చింతనకు ప్రతీక కవిత
జన చైతన్యానికి కరదీపిక కవిత
- సల్వాజి వాణి, 9000282372

కల చెదిరిన శిల!
అవును అచ్చంగా
నేనిప్పుడు కల చెదిరిన ఓ శిలను
అంబేద్కర్‌గా నాలుగు కూడళ్ల మధ్య
నన్ను నించోబెట్టి
నా రాజ్యాంగాన్ని నా చేతుల్లోనే పెట్టి
మీరు చేతులు దులిపేసుకుంటారు
పుట్టిన రోజు వస్తే చచ్చినట్టు
మీటింగుల్లో మైకులు పెట్టి
నేలమీద కూచున్న కిందిజాతి వాళ్లంటే
మాకు వల్లమాలిన ప్రేమంటూ
వేదిక ‘పైన’ ‘ఉన్న’వాళ్లంతా
గొంతులు చించుకుంటారు
అఖండ సమైక్య భారతాన్ని కోరిన నన్ను
మా వాడంటే... మావాడంటూ
ముక్కలుగ కోసి వేరు చేసి
మిఠాయిలా పంచుకుంటారు
సహపంక్తి భోజనాలతో
కాసేపు సందడి చేసి
ఫొటోగ్రాఫర్లకు ఆలింగనాలతో ఫోజులిస్తారు
నా పుస్తకానికి పడుతున్న
చెదను చూసి
మా మస్తకం మరిగిపోతోంది
ఇదేనా నేను కోరుకున్న
సర్వమానవ సమానత్వ సమాజం?
ఆరు దశాబ్దాలు దాటినా
అక్షరాల్లో పొందుపరచిన సమానత్వం
ఆధిపత్యమై అణిచివేతై
వెర్రిగా ఇంకా వెక్కిరిస్తూనే ఉంది
దాహం కోసం వెళితే దౌర్జన్యంగా
ఉరిమి తరిమికొట్టిన దాష్టీకం
కోరుకున్న దైవాన్ని మొక్కేందుకు
కోవెలకు రానివ్వని దైన్యం
అన్నదమ్ములమంటూనే ఊరవతల
ఇళ్లు విసిరేసిన అన్యాయం
ఇలా చెబుతూ పోతే ఎన్నో ఇంకా
భరత జాతి ఒంటిపై అక్కడక్కడ
రాచపుండులా రాజుకుంటూనే ఉన్నాయి
విగ్రహారాధన వద్దన్న నాకు
ఎన్ని అడుగుల విగ్రహం పెట్టాలా
అని పోటీలు పడక్కర్లేదు
అజ్ఞానంలోకి నెట్టబడి
అణగదొక్కబడి అన్నీ కోల్పోయి
బతుకు పోరులో వెనకబడ్డ
నీ సోదరులను నీతో కలిసి
నాలుగడుగులు వేయనివ్వు
ఈ దేశపు వారసత్వపు జెండాను
నీతో సమానంగా భుజం కలిపి
గర్వంగా మోయనివ్వు
అప్పటిదాక నేను కల చెదిరిన ఓ శిలనే!

- పెనుగొండ బసవేశ్వర్
కరీంనగర్, 9059568432

స్వాగతం
కవిగాయక నటవరులకు ఇదే ఇదే స్వాగతం
భావభరిత సుమధురవౌ సుస్వరాల సాహిత్యం
నవరసాలు ఒలికించే కావ్య సుధా కలశం
తేటతెలుగు గీతికలు పాలనురుగు పదములతో
పరవశించి కావ్య సుధలు వర్షించిన హృదయాలకు స్వాగతం!

యువత లోన నవశకితని నింపగలుగు గీతాలు
సమసమాజ స్థాపనకు మేలుకొలుపు కవనాలు
లలిత లలిత మృదు పదముల భావభరిత కావ్యాలు
సాహిత్యమే సంపదగా మురిసిపోవు కవి వరులకు స్వాగతం!

వచనమైన పద్యమైన కథలైనా కవితలైనా
హితము కూర్చు రచన గదా సాహిత్యం అను మాట
ఏ హృదిలో ఏ భావం కదలాడునో ఆ తరుణం
కోకిలమ్మ కువకువలై వినిపించగ నలుదిశల స్వాగతం!
తెలుగు నాట సాహిత్యపు మధురిమలు పంచడానికి
భావభరిత రచన సుధలు కురిపించే కవివరులు
శరత్కాల చంద్రికలై ప్రసరించగ దశదిశలా
పరివ్యాప్తి చేసే యువతకు స్వాగతం!

- దాసరి శ్రీనాథ్‌గౌడ్
మందమర్రి, ఆదిలాబాద్ జిల్లా, 9701781696

మనం...!
ఉవ్వెత్తున ఎగిసిన
సాగర కెరటంలా...
మనం ఎగురగలమా?
అదీగాక... సముద్రంలో...
ఉరకలేసే కెరటాలను లెక్కించగలమా?
సాగర గర్భాన
నిక్షిప్తంగా ఉన్న నిధి నిక్షేపాలను
మనం కనుగొనగలమా?
ఆధునికంగా...
ఎంత ముందుకు సాగుతేనేం?
ప్రకృతి ముందు
మనం నిమిత్తమాత్రులమే కదా!

- కె.మధుసూదన్
హన్మకొండ, వరంగల్
8374084396

ఈ శీర్షికకు కవితలు, కథలు, సాహితీ వ్యాసాలు, కొత్త పుస్తకాల సమీక్ష/పరిచయం, కార్టూన్లు ఈ క్రింది చిరునామాకు లేదా ఈ-మెయల్‌కు పంపండి.

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, జగిత్యాల రోడ్, కరీంనగర్. merupuknr@andhrabhoomi.net

నిర్వహణ : దాస్యం సేనాధిపతి dasyamsenadhipathi10@gmail.com
email : merupuknr@andhrabhoomi.net

- ఆచార్య కడారు వీరారెడ్డి