విశాఖపట్నం

టెక్నిక్ (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోహనరావు ఒక ప్రముఖ డాక్టర్. అతని దగ్గరకి వెళ్లిన వాళ్లకి ఇట్టే నయం చేస్తాడని అతనికి పేరుంది.
ఒకసారి అతని దగ్గరకి శ్రీను అనే కారు మెకానిక్ వెళ్లాడు.
‘‘డాక్టర్‌గారూ! నాకు విపరీతమైన దురదలు, ఆయాసం, కడుపులో మంటగా ఉంటుంది’’ అంటూ తన బాధ చెప్పుకున్నాడు.
‘‘అలాగా’’ అని మోహనరావు అతన్ని బాగా పరీక్షించాడు.
కొన్ని రకాల మాత్రలు, టానిక్ ఇచ్చి ఇంజెక్షన్ చేశాడు.
అయిదు వందల రూపాయలు బిల్లు వసూలు చేసి, మరొక్కసారి రమ్మని చెప్పాడు.
శ్రీను డాక్టర్ రాసిచ్చిన మందులు రెండు రోజులు వాడాడు. టానిక్ కూడా వదిలిపెట్టకుండా తాగాడు.
అతనికి నీరసం తగ్గింది.
డాక్టర్ దగ్గరకి వెళ్లాడు శ్రీను.
‘‘ఇప్పుడు ఎలా ఉంది?’’ శ్రీనుని చూడగానే అడిగాడు డాక్టర్.
‘‘పూర్తిగా తగ్గిపోయింది సార్’’ చెప్పాడు శ్రీను.
‘‘మంచిది’’ అన్నాడు డాక్టర్.
‘‘సార్ ఇందులో రహస్యం ఏమిటి సార్? మీరు రాసిన మందులు అంత బాగా ఎలా పని చేసాయి? ఏదైనా సీక్రేట్ ఉందా?’’ అడిగాడు శ్రీను.
దానికి డాక్టర్ నవ్వి ‘‘అది నువ్వు అడగకూడదు.. మేము చెప్పకూడదు’’ అన్నాడు.
శ్రీను అక్కడి నుండి వెనుదిరిగాడు.
కొన్ని రోజుల తర్వాత డాక్టర్ బయటికి వెళ్లేందుకు రెడీ అయ్యాడు. కారులో కూర్చుని స్టార్ట్ చేశాడు. అయితే అది స్టార్ట్ కాలేదు.
అలా జరగడం వారంలో అది మూడవసారి.
అతను దగ్గరలో ఎవరైనా మెకానిక్ ఉంటాడేమో అని అలా ముందుకెళ్లాడు.
ఒకచోట మెకానిక్ షెడ్ కనిపించింది.
డాక్టర్ అందులోకి వెళ్లాడు. తన కారు గురించి చెప్పాలని అనుకున్నాడు.
ఎదురుగా కనిపించిన వ్యక్తిని చూసి గుర్తుపట్టాడు.
అతను తన దగ్గరకి వైద్యానికి వచ్చిన శ్రీను.
శ్రీను డాక్టర్‌ని చూసి పలకరించాడు.
‘‘షెడ్డు నీదేనా?’’ అడిగాడు డాక్టర్.
‘‘అవును సార్’’ చెప్పాడు శ్రీను.
‘‘నా కారు స్టార్ట్ కావడంలేదు. కాస్త చూస్తావా?’’ అడిగాడు డాక్టర్.
‘‘చూస్తాను సార్! కారెక్కడ ఉంది?’’ అడిగాడు శ్రీను.
‘‘ఇక్కడికి దగ్గరలోనే మా ఇల్లుంది. అక్కడే ఉంది కారు’’ అన్నాడు డాక్టర్.
ఇద్దరూ డాక్టర్ గారింటికి వెళ్లారు.
శ్రీను కారు మొత్తం చూసిన తర్వాత అరగంటలో రిపేరు చేసాడు. డ్రైవింగ్ సీట్లో కూర్చుని స్టార్ట్ చేయగానే కారు స్టార్టయింది.
‘‘గుడ్’’ అన్నాడు డాక్టర్.
శ్రీను చిరునవ్వు నవ్వాడు.
‘‘బిల్లెంతయింది?’’
‘‘వెయ్యి రూపాయలు సార్’’
డాక్టర్ శ్రీనుకి వెయ్యి రూపాయలు ఇచ్చాడు.
‘‘వారం రోజులు వాడండి. ఒకసారి కారుని షెడ్డుకి తీసుకు రండి. ఏదైనా ప్రాబ్లం ఉంటే చూద్దాం’’ అన్నాడు.
‘‘అలాగే’’ అని డాక్టర్ కారుతో పాటు వెళ్లిపోయాడు.
రిపేరు చేసిన తర్వాత కారు చాలా బాగా పని చేస్తోంది.
ఒకరోజు శ్రీను డాక్టర్ దగ్గరకి వెళ్లాడు.
‘‘ఇంతకుముందు కన్నా నువ్వు రిపేర్ చేసిన తర్వాత కారు బాగుంది. ఏమిటి టెక్నిక్?’’ అంటూ ప్రశ్నించాడు.
దానికి శ్రీను నవ్వి ‘‘అది మీరు అడగకూడదు... మేము చెప్పకూడదు’’ అన్నాడు.
దానికి డాక్టర్ కూడా నవ్వేసి ‘‘అవునులే ఎవరి టెక్నిక్ వారిది. లేకపోతే బతకలేము’’ అనేసి అక్కడి నుండి వెళ్లిపోయాడు.

- నల్లపాటి సురేంద్ర,
కొత్తగాజువాక,
విశాఖపట్నం.
సెల్ : 9490792553.

లోపలి మనిషి!
బదిలీ మీద గణితోపాధ్యయునిగా ఆ ఊరొచ్చాడు నాగేంద్ర. పనిచేసే చోటే నివాసముంటూ నిబద్ధతతో తన విధుల్ని నిర్వర్తిస్తూ అనతికాలంలోనే అందరి మన్ననలు పొందాడు. ఇలా ఉండగా ఆ ఏడు బడిలో జరిగే స్వాతంత్య్ర దినోత్సవానికి ప్రధానోపాధ్యాయుడి ఆహ్వానం మేరకు ఆ ఊరి సర్పంచ్ జెండా ఎగరేయడానికి, ముఖ్య అతిథిగా మండలాధికారి హాజరయ్యారు.
బెల్ అవడంతోనే విద్యార్థులందరినీ వరుసక్రమంలో నిలబెట్టారు పిఇటి మాస్టారు. పిల్లలు గొడవ చేయకుండా ఉండేందుకు ఉపాధ్యాయులంతా వారి వెనకే నిలబడ్డారు.
సర్పంచ్‌గారు జాతీయ జెండా లాగగానే అందరూ సెల్యూట్ చేశారు.
ప్రార్థన అనంతరం తాను తెచ్చిన పళ్లు, చాక్లెట్లు ప్రధానోపాధ్యాయుల వారికి అందజేశాడు మండలాధికారి. అక్కడితో ఊరుకోకుండా పిల్లలకు కావలసిన పెన్నులు, నోట్ పుస్తకాలు సర్పంచ్ చేతుల మీదుగా పంపిణీ చేశాడు. అతడి ఉదారతను ప్రధానోపాధ్యాయునితో పాటు ఊరి పెద్దలంతా వేనోళ్ల కొనియాడారు. స్కూలుకే కాదు ఆ ఊళ్లో ఎప్పుడు ఏ ఉత్సవం జరిగినా ఆ అధికారి భారీగా విరాళం ఇవ్వడంతో పాటు అందులో భాగస్వామి కావడం విశేషం.
సొంత డబ్బు వెచ్చిస్తూ సమాజం కోసం పాటుపడుతున్న ఆ అధికారి మీద నాగేంద్రకి అమితమైన గౌరవం ఏర్పడింది. ప్రభుత్వాధికారులంతా ఆయనలాగే ఉంటే ఎంత బావుండును అనిపించింది.
సంక్రాంతి సెలవులకి సొంత ఊరు వెళ్లాడు నాగేంద్ర. అక్కడ అందరికీ తను పని చేస్తున్న మండలం అధికారి గురించి ఎంతో గొప్పగా చెప్పసాగాడు.
‘‘అలాగా! మాకిది వింతగా ఉంది. అతని పేరు ఏమిటన్నావు?’’ అని అడిగారు ఊరి జనం.
‘‘్ధర్మారావు’’ గొప్పగా చెప్పాడు నాగేంద్ర.
‘‘వాడా! ఆ లంచగొండి ధర్మారావు గురించేనా నువ్వు చెబుతుంది. పేరేమో ధర్మారావు, అధర్మం అతని నైజం. అలాంటి వాడినా నువ్వు పొగుడుతున్నావు? అతగాడిక్కడ పని చేసి అక్కడికి వెళ్లినవాడే. వాడి భాగోతం ఎవరికి తెలీదు? ఇక్కడ ఉన్నన్నాళ్లు అందరినీ చంపుకుతిన్నాడు. చేతిలో పైసా పెడితే గానీ ఎవరి పనీ చేసేవాడు కాదు. వట్టి నికృష్ఠుడు. వాడితో విసిగిపోయిన జనం మూకుమ్మడిగాపై అధికారులకు ఫిర్యాదు చేయడంతో ప్రభుత్వం అతడిని అంత దూరం బదిలీ చేసేసింది. మేమంతా సస్పెండైపోతాడనే అనుకున్నాం. అదృష్టం బావుండి పనిష్‌మెంట్ ట్రాన్స్‌ఫర్‌తో బయటపడ్డాడు’’ అన్నారు చీదరించుకుంటున్నట్లు.
వారి మాటలకు ఖంగుతిన్నాడు నాగేంద్ర.
‘‘నువ్వలా నోరు వెళ్లబెట్టనక్కరలేదు. మేం చెప్పేది అక్షరసత్యం. నీ మాటల్ని బట్టి మరో మారు ప్రజల వ్యతిరేకతను చవిచూడవలసి వస్తే ఈ మారు ఉన్న ఉద్యోగం ఊడిపోవడం ఖాయం. అందుకని దొరికిన కాడ దోచినంత దోచేస్తూ కొన్ని చిన్నచిన్న మంచి పనులతో ప్రజల దృష్టిని మళ్లించి తానో ధర్మాత్ముడనే విశ్వాసాన్ని పాదుగొలిపే ప్రయత్నం చేస్తున్నాడన్న మాట. అంత మాత్రాన వాడు మారాడని అనుకోనక్కరలేదు. పుట్టిన బుద్ధి ఎక్కడికి పోతుంది?’’ ముక్తకంఠంతో అన్నారంతా.
వారి మాటలు నమ్మబుద్ధి కాలేదు నాగేంద్రకి. ‘మనుషులు ఇలా కూడా ఉంటారా? బయటికి ఒకలా... లోపల మరోలా ఎలా ఉండగలరు?’ అనుకున్నాడు.

- దూరి వెంకటరావు,
దాసన్నపేట మెయిన్‌రోడ్డు,
విజయనగరం-535002.
సెల్ : 9666991929.

మధుర స్మృతులు!

మా నాన్న ఓ మధుర జ్ఞాపకం
నేడు ఫాదర్స్‌డే సందర్భంగా!

మా నాన్న ఒక మధుర జ్ఞాపకం. మరపురాని మధుర స్మృతులకు నిలువెత్తు సాక్ష్యం. కాలం గతించినా నా మదిలోని ఆ మధుర స్మృతుల గుబాళింపుల వనె్న తగ్గునా?
సంసారం అనే రథానికి అమ్మానాన్న ఇద్దరూ రెండు చక్రాలు. అయితే అమ్మ పాత్రంతా నాన్న ప్రతిరూపంగా భ్రమించిన పసిమొగ్గను వికసిత కుసుమంగా తీర్చిదిద్దే ఒక మహోన్నత కార్యానికి రూపశిల్పి. మరి నాన్న... ఆ వికసిత కుసుమానికి వ్యక్తిత్వం అనే తావి తేర్చి బతుకు బాటలో పయనించే శక్తి సామర్థ్యాలను ఇచ్చి వారి దారిలో ముళ్లను సైతం పూవులవలె మార్చే ఆకుంఠిత దీక్షాతత్పరుడు.
నేటి నా ఈ ఉన్నతికి అహోరాత్రాలు నాన్న పడిన తపన, శ్రమే కారణం. నాన్నా! నీ త్యాగం, ప్రతి మాటలో, ప్రతి అడుగులో కనిపిస్తుంది. సదా నీ విశ్వరూప విన్యాసపద భంగిమలే అనుక్షణం సాక్షాత్కరిస్తాయి.
ఈ సమాజంలో నేను అన్న ఈ రూపాన్ని రూపుదిద్దిన నీ త్యాగానికి వెలకట్టలేని ఆత్మసంపద నిచ్చిన నాన్నా ఈ నీ రుణం తీర్చుకునేదెలా? నీవు లేని నేను లేనన్నది నిజమైనప్పుడు మరి నేను ఎవరిని? అది నీవే కదా! అందుకే నాన్నా నీకన్నా ఈ ఇలను నాకేదీ కాదు మిన్న.
నాన్నా నాకింకా గుర్తే. నీ రెక్కల కష్టాన్ని నా బొమ్మల రైలుకు ధారపోసినప్పుడు నా కళ్లలో మెరిసిన ఆనందం చూడడం కోసం ఆర్తిగా ఎదురు చూసిన నీ కళ్లలోని ఆ ప్రేమానురాగాల్ని నేనెలా మరువగలను? నన్ను నీ భుజాలపై కూర్చుండబెట్టుకుని వీధిబడిలో చేర్పించి పలకా బలపంతో నన్ను, నా రూపాన్ని కరెక్టుగా ఊహించుకుంటున్న నీ కళ్లలోని ఆనందబాష్పాల్ని నేనెలా మరువగలను? నా ప్రతి విజయాన్ని చూసినప్పుడు నీవు పడే సంబరం ఇంకా నా కనుల ముందు సజీవంగా మెరుస్తూనే ఉంది. నీవెంత శ్రమించినా నాకు తెలిస్తే చదువుపై నా దృష్టి చెదురుతుందేమో అన్న భయం నీ కళ్లలో కనిపిస్తూనే ఉంటుంది. అందుకేనేమో నాన్నా నీ పెదవులపై నిరంతరం చెరగని చిరునవ్వు, కష్టాలెన్ని వచ్చినా కొండంత గుండె ధైర్యం నన్ను ఏ నాటికైనా మంచి స్థితికి చేరేలా చేయగలవన్న నీ మనోనిబ్బరం, నీ ఆశీర్వాదం ఇవే నా ప్రగతికి సోపానాలు. అన్యాయంగా ఆస్తులు పోతున్నా, మాటకు, మంచితనానికి కట్టుబడిన నీ త్యాగం నాకెప్పటికీ శిరోధార్యం!
కన్నా! ఒక మెట్టు మనం దిగితే జీవితంలో చాలా మెట్లు పైకి ఎక్కవచ్చురా! అన్న నీ మాట అనుక్షణం నా గుండె లోతుల్లో ప్రతిధ్వనిస్తూ, నా ప్రతి అడుగూ విజయపథం వైపు సాగుతుందంటే అదంతా నీవు నాకిచ్చిన ఆత్మస్థైర్యమే!
నాన్నా భౌతికంగా నీవు నా ముందు లేకున్నా నా అంతరంగంలో సదా నీ రూపు చెరగని చెదరని శిలాచిత్తరువే!

ఇట్లు
నిరంతరం నీ తలపులలో జీవిస్తున్న
- నీ కన్నా!

- మండా శ్రీ్ధర్,
శ్రీకాకుళం.
సెల్ : 9493309030.

పుస్తక సమీక్ష

మహిమాన్వితం ఏకలవ్య ప్రబంధం
సంప్రదాయ సాహిత్యానికి పెద్దపీట వేసి గద్యపద్య యుక్త సలక్షణ సరళభాషలో ప్రబంధ కావ్యరచన చేసి పలువురు పండితులనే కాక సామాన్యులను కూడా అబ్బురపరిచే ఏకలవ్య ప్రబంధ మహిమాన్విత వృత్తాంతాన్ని కళ్లకు కట్టినట్లు దృశ్యమానం గావించిన సత్తాగల కవి డాక్టర్ అమ్మళ్లదినె్న వెంకట రమణప్రసాద్. వీరు చెప్పుకోదగిన ప్రతిభాపాటవాలతో ప్రాచీన ఆధునిక ఆంధ్ర సాహిత్యాన్ని అధ్యయన, పరిశీలన, పరిశోధనాత్మక వ్యాసంగంతో కాచి వడబోసి నిగ్గును తీసి ఆంధ్ర పాఠకులకందించి ప్రశంసలనందిన సాహితీ ఘనాపాటి సరస్వతీ వరప్రసాది.
వీరి ఏకలవ్య ప్రబంధ కావ్యం మూడు అశ్వాశాల వివిధ వృత్తాల త్రిశత గద్యపద్యాలతో అలరారుచూ సంపూర్ణ కావ్యలక్షణాలను పుణికిపుచ్చుకొని సాహితీ ప్రియులకు కమనీయ విందునందిస్తుంది. ఇక కావ్య విషయానికొస్తే సాధారణంగా జనసామాన్యానికి తెలిసిన ఏకవలవ్యుని గాథ అతి స్వల్పమని నా భావము. కవి ఏకలవ్యుని వృత్తాంతాన్ని లోతుగా పరిశీలించి కమనీయ కావ్యంగా మల్చిన తీరు అభినందనీయము.
‘వసుదేవుని చెల్లెలు శ్రుతదేవకున్ గేకయేశ్వరుని వలన ఏకలవ్యుడు పుట్టి నిషాదులలొనంబెరిగె’ యన్న హరివంశకర్త ఎర్రన మహాకవి పలుకు ఈ కావ్యానికి నాందిగా నిల్చింది. సంస్కృత ఆంధ్రమహాభారతములందలి సఖా, ఉద్యోగ ద్రోణపర్వాల్లో పేర్కొనబడిన వృత్తాంతాలనొకచోట చేర్చి కూర్చి రూపొందించబడిందీ కావ్యమని కవి స్పష్టం చేశారు. దీని ద్వారా మరుగునపడిన మహనీయుడు ఏకలవ్యుని గాథ విశదమవుతుందిలా. పాండవుల మాత కుంతీదేవి, ఏకలవ్యుని తల్లి శ్రుతదేవ, సోదరీమణులేయని పాండవులు, శ్రీకృష్ణుడు, ఏకలవ్యుడు, కీచకుడు, సుధేష్ణ, ఉత్తరుడు మున్నగు వీరందరూ రక్త సంబంధీకులే యని వెల్లడవుతుంది. గేకయేశ్వరుడు (కేకయరాజు) అకారణముగా ఏకలవ్యుడు నిషాదులలో వాని ప్రియపుత్రుడై పెరిగెను. వినూత్న విలుకాడై ఎదిగెను.
ఏకలవ్యుని సమగ్ర జీవన విధానంతో పాటు ఎన్నో మహత్తర విషయముల నందిస్తుందీ కావ్యం. వాని ఏకాగ్రత నిరంతర సాధన, ప్రతిభా పాటవాలు, సహానుభూతి, తోటి విలుకానిపై ఎనలేని గౌరవం, ఆత్మస్థైర్యం, అవిరళకృషి, ఈశ్వర భక్తితో పాటు వికలాంగుడనైతినీని, విధివంచితుడనని కుములుతూ కూర్చోకుండా అవిరళకృషితో, ఆత్మస్థైర్యంతో, రెట్టింపైన ఉత్సాహంతో ధనుర్విద్యలో పూర్వవైభవాన్ని సంతరించుకొని, నిత్యనవచైతన్యశీలుడై సామాజిక స్పృహను తరతరాల యువతకందించి ఆదర్శ మార్గాన్ని చూపిన ఏకలవ్యుని జీవితం ధన్యాతి ధన్యముగా దర్శనీయమవుతుంది.
బలరాముడితో ఏకలవ్యుడు సాగించిన భీకర యుద్ధంలో కేవలం ధనుర్తారి మాత్రమే కాకుండా గత, కార్ముక, ప్రాస, అసి, తొమర, కుంత, శక్త్యాది సర్వవిద్యల ప్రయోగ ప్రవీణుడని తెలుస్తుంది. శ్రీకృష్ణుని చేతిలో కైవల్యాన్ని కాంక్షించిన జ్ఞానిగా, ఈశ్వరానుగ్రహాన్ని పొందిన మహనీయుడిగా, అర్జునునికే పాశుపతాస్త్రాన్ని ప్రసాదించమని కోరిన దివ్య వ్యక్తిత్వంగల వీరునిగా ఏకలవ్యుని సద్గుణ సంపన్నత రాశీభూతమై కన్పర్చిన వృత్తాంతాన్ని వీరి ఏకలవ్య ప్రబంధం జాతికందించింది. ఏకలవ్య ప్రబంధానికి, విద్వాన్ చక్రాల లక్ష్మీకాంతరాజారావు, విద్వాన్ గండ్లూరి దత్తాత్రేయ శర్మ, ఇంద్రగంటి శ్రీకాంతశర్మ, ఆచార్య బేతవోలు రామబ్రహ్మం, ఆచార్య శలాక రఘునాథశర్మ, ఆచార్య తుమ్మపూడి కోటేశ్వరరావు, అవధాన సరస్వతి డాక్టర్ మాడుగుల నాగభూషణశర్మ, మహాపండిత మానాప్రగడ శేషశాయి వంటి మహోన్నత పండిత ప్రముఖులు ముందు మాటల మూటలు దీపకాంతులై అలరారుతాయి. ప్రతులకు : 9440596127లో సంప్రదించగలరు.

- చెళ్లపిళ్ల సన్యాసిరావు
సెల్ : 9293327394.

మనోగీతికలు

మనసు
మనుగడ
ప్రేమగా పలకరించడం
ప్రేమతో మాట్లాడడం
అది చేతగానపుడు
వౌనంగా ఉండిపో, కదిలిపో!
నిన్ను పొగడాలనుకోకు
ప్రశంసలు ఆశించకు
నీ ప్రేమనో, ప్రతిభనో, నిన్నో
గుర్తించాలని ఏనాడూ కోరకు!
ఇక్కడే అందరికీ ఇబ్బంది
గుర్తింపుకై ఒకటే ఆరాటం
ఆరాట, పోరాటాలు నిరంతరం
ఆశ నిరాశలు జీవితాంతం!
లభించని దానిని
పట్టించుకోకపోవడం
దొరకని దానికై
నిత్యమూ వెతుకులాట
ఎంతసేపూ ఊహల్లో జీవించడం
ఎప్పటికీ సత్యాన్ని గుర్తించకపోవడం!
ఎదుటి వారిలో సుగుణాలను
వారు చేసే మంచి పనులను
గుర్తించగలగాలి ఆమోదించాలి
ఎంతసేపూ నేను,
నా ఘనత అనుకుంటే ఎలా?
శరీరం సహకరించకపోవచ్చు
అవయవం ఏదైనా కుంటుపడవచ్చు
అంత మాత్రం అచేతనులవరు
మనసు వికలమైతేనే
మనుగడ ఇబ్బంది!

- శ్రీమతి గంటి కృష్ణకుమారి,
బాబామెట్ట, విజయనగరం.
సెల్ : 9441567395.

గురుశబ్దం!
చీకటిని తొలగించి కాంతినిచ్చేవాడే గురువు!
మన గురు పరంపర మహోన్నతమైనది
వాత్సల్యాభిమానాలతో లాలించి పాలించి
ఉత్తమోత్తముల్ని చేసి సంతసించారు!
మారుతున్న కాలంలో గురుశబ్దం పవిత్రత
దిగజారుతోంది
వెలుగునిచ్చే దీపాలకే చీకటి అంటుతోంది!
వెర్రితలల సంస్కృతితో
తలవంపులు తెస్తున్నారు
పవిత్ర గురుచరిత్రనే
కళంకితం చేస్తున్నారు
పవిత్ర గురుశబ్దాన్ని అపవిత్రం చేయకండి!

- విద్వాన్ ఆండ్రకవిమూర్తి,
అనకాపల్లి.
సెల్ : 9246666585.

బతుకు బంగారుమయం
మంచులో, మంటల్లో శ్రమించే
కార్మిక బతుకులు చూడు
కష్టాలు, కన్నీళ్లు, బాధలు, వెతలే
కనిపిస్తాయి నేడు
శ్రమజీవులంతా ఎవరికి వారు
యమునాతీరే అన్నట్లు కాక
సమైక్యంగా ఉద్యమిస్తే
కలసికట్టుగా సాగిపోతే
విజయం తథ్యం బతుకు ఫలప్రదం
తెలుసుకుని అడుగు ముందుకెయ్
భవితను బంగారుమయం కానీయవోయ్!

- యడ్ల శ్రీనివాసరావు,
విజయనగరం జిల్లా.
సెల్ : 9493707592.

మినీ
మెరుపులు
ఆకాశం నిండా
వర్షించని మబ్బులు
పిసినారి
చేతి నిండా డబ్బులు
అవి ఉన్నా లేనట్లే!
అడ్డాలనాడు బిడ్డలే కానీ
గెడ్డాలొచ్చాక కాదనడానికి
నిదర్శనం నేడు
ఊరూరా వెలుస్తున్న
వృద్ధాశ్రమాలు!

- కాళ్ల గోవిందరావు,
ఆముదాలవలస,
శ్రీకాకుళం జిల్లా.
సెల్ : 9550443449.

కలుపు మొక్కలు!
కెరటాలను మోస్తూ
కన్నీళ్లను పూసుకున్నాను
నా జీవిత గమనంలో!
ఎడారులు, అరణ్యాల్లో
అడ్డంగా పెరిగే
అనాకారీ వ్యక్తులు
పొలాల్లోని కలుపుమొక్కలు!

- కోనే సతీష్,
సెల్ : 7675924944.

అక్షర సంపద!
మంచికన్నా చెడు
చేయడమే సులువంటారు
మనుషులను ఏకం
చేసినంత సులువుగా
మనసుల మధ్య
చిచ్చు రగిలించలేవు
అభిమానం
రాజ్యమేలుతున్నప్పుడు
అరాచకాన్ని సృష్టించలేవు
కలాన్ని కదిల్చినంత సులువుగా
అక్షరాలను చెరిపేయలేవు
విత్తు విసిరేసినంత తేలిగ్గా
వృక్షాన్ని నరికేయలేవు
- గగనం శ్రీనుకుమార్,
పాతవీధి, యలమంచిలి.
సెల్ - 8008262514.

నానీలు
ఒకప్పుడు
ఆకాశంలో చుక్కలు
ప్రస్తుతం అవే
నిత్యావసర ధరలు
క్షణిక సుఖానికై
చేసే అత్యాచారం
అబలకు అదే
జీవన హాహాకారం!
ప్రజలకే అంటూ
సంక్షేమ పథకాలు
రేపటి నాయకుల
ఓటు బ్యాంకులు!
భూమాత వణుకుతోంది
చలికి కాదు
కబ్జాదారుల
కబంధ హస్తాలకు!

- రఫీ (ఈవేమన),
శ్రీకాకుళం.
సెల్ : 7893451307.

నీ కోసం
చంద్రబాల పందిరికి అల్లుకున్న శారద రాత్రిళ్లు
ఊహల ఆశల జరీ దారాలతో బంధిస్తున్న తారామణిహారాలు
కోరికల ఇంద్రధనస్సులు
మదిలో కలలకు విచిత్ర రంగులద్దుతుంటే
విరహాల మధురిమలో, నీ జాడకై నా మనసు
లగ్నమై సైకత వేదికపై నిలిచి నీ రాకకై
నిరీక్షిస్తున్నా నువ్వు నడిచొచ్చే రహదారంతా
నీ నవ్వుల పువ్వులు పరచి ఉంచాను!
ఏ దిశగా వచ్చినా నా దశ పండాలని
నా భక్త్భివం నీకు చేరాలని, అభిమానధారాల
గాలిపటాలనెగురవేస్తూ నీ రాక కోసమై ఎదురుచూస్తూ...

- శివానీ, శృంగవరపుకోట. ఫోన్ : 08966266384.

సైజు మోసం
వ్యాపార ప్రకటనల్లోని ఊరించే
ఆల్‌ఫ్రీ తాటికాయంత
అక్షరాలు కనిపించినట్లు
షరతుల చిన్నక్షరాల
సూక్ష్మక్రిములు కనిపించవు
కనులు
రోజూ పుస్తకాల పూవులపై వాలిపోయి
వాటిలోని భావాల
పూదేనెను ఆస్వాదించే
సీతాకోక చిలుకలు చదువరుల కనులు!

- మాధవీ సనారా,
సెల్ : 9440103134.

దోపిడీ రాజ్యం!
అంతా దోపిడీయే
సినిమాకి వెళితే
టిక్కెట్ల రేట్లు దోపిడీ
క్యాంటీన్‌లో ధరల దోపిడీ
బజారుకెళితే తూకాల దోపిడీ
కల్తీమందులు, సరకులతో
వ్యాపారుల దోపిడీ
దీనికి అంతెప్పుడు?
సామాన్యుడికి
సుఖమెప్పుడు?

- ప్రసాద్,
విశాఖపట్నం-530016.
సెల్ : 9502 937 180.

email: merupuvsp@andhrabhoomi.net

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) ఎడిటర్, మెరుపు, ఆంధ్రభూమి దినపత్రిక, సెక్టర్-9, ఎం.వి.పి.కాలనీ, విశాఖపట్నం-17. అనే చిరునామాకు పంపండి. email: merupuvsp@andhrabhoomi.net ఇ-మెయల్‌కు పిడిఎఫ్‌లో పంపించవచ్చు.

- నల్లపాటి సురేంద్ర