దక్షిన తెలంగాణ

దూరపు కొండలు (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుమార్ అంటే సినిమా పిచ్చోడని ఆ వూళ్లో అందరికీ తెలుసు. చిన్నప్పటి నుండి కుమార్‌కు సినిమాలంటే తగని పిచ్చి. ఊళ్లోకి పబ్లిసిటీ రిక్షా వచ్చిందంటే కుమార్ దాని వెంబడే వుండేవాడు. హీరోల ఫోటోలు చూస్తూ తన్ను తాను ఆ హీరోగా ఊహించుకునేవాడు. ఆ సినిమా పిచ్చి ఇంతింతై వటుడింతయై అన్నట్లు కుమార్‌తో పాటే పెరిగి పెద్దదైంది. సినిమాల్లో చేరాలన్న ఆలోచన అంతకంతకు ఎక్కువైంది. బంగారం లాంటి ఉద్యోగాన్ని నిర్లక్ష్యం చేసి స్టూడియోల చుట్టూ, నిర్మాతల చుట్టూ ప్రదక్షిణలు ప్రారంభించాడు. ఫలితం కనిపించలేదు. సరిగ్గా ఉద్యోగం చేయనందువల్ల జీతం సరిగ్గా రాకపోవడం, వచ్చిందీ భాగ్యనగరం, మదరాసు తిరుగుళ్లకే సరిపోక పోవడం వల్ల అప్పులపాలు కాక తప్పలేదు.
కుమార్‌కు ఎన్ని ప్రయత్నాలు చేసినా సినిమా ‘్ఛన్స్’ రాలేదు కానీ సినిమా షూటింగ్ చూసే అవకాశం ఒకసారి వచ్చింది. సినిమాల్లో అరంగేట్రానికి ఇది నాంది అనుకుంటూ ఊహల్లో విహరిస్తున్నాడు.
***
కుమార్ ఎదురుచూస్తున్న ఆ రోజు రానే వచ్చింది. తెలుగు సినిమా హీరోలా ముస్తాబై షూటింగ్ స్పాట్‌కు బయలుదేరాడు. గూర్ఖాకు పాస్ చూపించగానే వినయంగా లోపలికి పంపించిండు. కుమార్ ఆనందంగా గూర్ఖా చేతిలో ఓ యాభై నోటుంచి స్టూడియో లోపలికి వెళ్లాడు. అక్కడంతా ఓ అందమైన ప్రపంచం కనిపించింది కుమార్‌కు. పెద్ద హీరోతో తీస్తున్న పెద్ద బడ్జెట్ సినిమా స్టూడియోలోనే భారీ సెట్టింగు వేశారు. వందల మంది జనం హడావిడిగా అటూ ఇటూ తిరుగుతున్నారు. కెమెరాలతో కొందరు పరుగులు తీస్తున్నారు. కొందరు అందంగా వేసిన సెట్టింగుకు తుది మెరుగులు దిద్దుతున్నారు. చిన్న చిన్న నటులు, డూప్‌లు అక్కడక్కడ కూచుని తమ అవసరం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నారు. జూనియర్ ఆర్టిస్టులు కొందరు అటూ ఇటూ పచార్లు చేస్తున్నారు.
అందమైన లోకాన్ని ఆనందంగా పరిశీలిస్తున్న కుమార్ దృష్టి దూరంగా ఓ సిమెంటు బల్లపై కూచున్న ఓ సీనియర్ నటునిపై పడింది. ఒంటరిగా కూచున్నాడు. చుట్టూ ఎవరూ లేరు. తనకిష్టమైన ఆ నటునితో ముచ్చటించాలనుకున్నాడు.
‘నమస్కారం సార్! బాగున్నారా?’ పలకరించాడు వినయంగా.
‘ఏదో ఇలా వున్నాను. ఇంతకూ ఎవరు బాబు నువ్వు?’ పలకరించాడు ఆత్మీయంగా ఆ సీనియర్ నటుడు.
‘నా పేరు కుమార్! నేను చిన్నప్పటి నుండి మీ వీరాభిమానిని. ఈ సినిమాలో మీరేనా సార్! హీరో’ ఆసక్తిగా అడిగాడు.
‘లేదు బాబూ! ఏదైనా చిన్న వేషం దొరుకుతుందేమోనని డైరెక్టరు కోసం ఎదురు చూస్తున్నాను’ నిర్లిప్తంగా అన్నాడు ఆ నటుడు.
‘అదేంటి సార్! మీరేమిటి చిన్న వేషం కోసం ఇలా ఎదురు చూడటమేమిటి?’
‘ఒకప్పుడు సాంఘికాలలో, పౌరాణికాలలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు వేశారు. ధర్మరాజంటే మీరేనని ఆంధ్రా ప్రేక్షకులలో చెరగని ముద్ర వేశారు. ఒకప్పుడు మీరు లేని సినిమా లేదంటే అతిశయోక్తి కాదు. అలాంటి మీకు ఇదేం పరిస్థితి?’ ఆశ్చర్యపోతూ అన్నాడు కుమార్.
‘అదంతే బాబూ! మా బతుకులు ఎప్పుడు వెలిగేది, ఎప్పుడు రాలేదీ తెలియదు. అందుకే మమ్మల్ని ‘స్టార్స్’ అంటారు. నిరాశగా అన్నాడు ఆ వృద్ధ నటుడు.
‘అవకాశాలంటే రాకపోవచ్చు. ఇనే్నళ్లుగా నటించినా ఈ ఆర్థిక ఇబ్బందులేమిటి? సినిమా నటులంటే లక్షలు, కోట్లు సంపాదిస్తారని అందరూ అనుకుంటారు. అలా అనుకుంటారు గానీ, అదంతా నిజం కాదు. ఏ ఒక్కరిద్దరో తప్ప ఆర్థికంగా బాగుపడ్డవాళ్లు తక్కువే ఈ రంగంలో. మా కాలంలో అయితే లక్షలు, కోట్లు లేనే లేవు. తక్కువ జీతానికే పనిచేసేవాళ్లం. పెద్ద బంగళా, కారు లాంటి అన్ని హంగులుంటే తప్ప పలకరించరు నిర్మాతలు. అందుకే సంపాదించిందంతా ఎప్పటికప్పుడు హరించుకుపోతుంది. నాకు, నాలాంటి ఎంతో మంది నటులకు ఎప్పటికప్పుడు కూటికోసం వెతుక్కోక తప్పదు. ఏ ఒక్కరిద్దరికో తప్ప ఈ రంగంలో ఇదే పరిస్థితి’ అంటూ తన ఎండిపోయిన డొక్క వంక చూపించాడు.
కుమార్ మనస్సు చివుక్కుమనిపించింది. సినీ రంగమంటే ఓ అద్భుతమైన రంగుల ప్రపంచమనుకున్నాడు. కానీ, నటుల పరిస్థితి ఇంత అధ్వాన్నంగా వుంటుందనుకోలేదు. సినీ రంగమా! నీకో నమస్కారం’ నా ఉద్యోగమే నాకు శ్రీరామ రక్ష అనుకున్నాడు. తన అభిమాన నటుడి చేతిలో ఐదు వందల నోటుంచి చెమర్చిన తన కళ్లను కర్చ్ఫీతో తుడుచుకుంటూ అక్కడి నుండి కదిలాడు.
స్టూడియోలో కలకలం బయలుదేరింది. అప్పుడే వచ్చిన నిర్మాత చుట్టూ చిన్న చిన్న నటుల నుండి సీనియర్ నటుల దాకా చిన్న చిన్న వేషాల కోసం చుట్టుముట్టారు.
‘హీరోగారు వచ్చే టైమ్ అయింది. అందరు దూరంగా తప్పుకోండి’ అంటూ విసుక్కుంటూ గూర్ఖాను పిలిచాడు నిర్మాత. ఆ సంఘటనతో కుమార్‌లో చాలా మార్పు వచ్చింది. సినిమాల పిచ్చి పూర్తిగా తొలగిపోయింది. దూరపు కొండలు నునుపుగా కన్పిస్తాయి. దగ్గరగా వెళ్లి చూస్తేనే వాటి నిజస్వరూపం తెలుస్తుంది.
ఇప్పుడు కుమార్ బుద్ధిగా ఉద్యోగం చేసుకుంటున్నాడు. సినిమాలు చేయాలనుకోవడం లేదు. ఉద్యోగం చేస్తున్నాడు.

- గరిశకుర్తి రాజేంద్ర
కామారెడ్డి, సెల్.నం.9493702652

మనోగీతికలు

ఆజాది !
బరి గీసి బంధించిన
పద్మ వ్యూహాన్ని ఛేదించాలని
తరాలుగా పోరాడుతునే ఉన్నాం!
కాలం గుమ్మం ముందు
చేతులు చాచి ఆర్థిస్తూనే ఉన్నాం!
ఆంక్షల వేధింపుల్లో!
స్ర్తి సహనానికి మారు పేరు
అనుకున్నపుడల్లా..
మూగగా రోదిస్తూనే ఉన్నాం!
పిడికిలి బిగించి నినదిస్తూనే ఉన్నాం
అరాచకం హద్దు మీరినపుడల్లా
ఆవేశం కట్టలు తెంచుకున్నపుడల్లా
విశ్వ ప్రయత్నం చేస్తూనే ఉన్నాం!
బానిస సంకెళ్లు తెంపుకుని
స్వేచ్ఛా వాయువు పీల్చాలని!
ఇంకెంత దూరం నువ్వు
హమ్ లేకే రహేంగే
లేంగే ఝరూర్ హమ్
కిసీబీ తరహా హక్‌సే..
ఓ ఆజాది!!

- రామానుజం సుజాత
కరీంనగర్
సెల్.నం.9701149302

ఇదేనా...
నేటి పరిస్థితి?
అమృతమే తాగాలనుకుంటే
కడువెడు కావాలా?
వజ్రానే్న చూడలేని వాడికి
కళ్లెందుకు?
మారిన నేరస్తున్ని శిక్షించడానికి
చట్టం కావాలా?
రాబిన్‌హుడ్‌ది దారిదోపిడే
అయినా...
నేరస్తుడు కాదు... హీరోయే!
కుబేరుడు అత్యంత ధనవంతుడైనా
ఇటు దానకర్ణుడు కాదు
అటు శిబి చక్రవర్తి కాదు
అప్పులిచ్చేవాడే
మంచిని ప్రోత్సహించని వాడు
నింగికెగిరితేనేం? నేలకొరిగితేనేం?
జైల్లో ఉండాల్సిన వాళ్లు... జనాల్లో!
జనాల్లో ఉండాల్సిన వాళ్ళు... జైల్లో!
ఇదేనా... నేటి పరిస్థితి?

- ఆచార్య కడారు వీరారెడ్డి
హైదరాబాద్, 7893366363

కొత్త జన్యువు!

ఏదో ఒక జన్యువు నుండి
జీవాన్ని తొడుక్కొని
ఈ వస్తు వినిమయ ప్రపంచానికి
సుదూర తీరాలను దాటి వచ్చాడో మనిషి!
వింతలు, విలాసాలు అబ్బురపరిచే
అసాధారణ ప్రజ్ఞాశీలుర నడుమ
అగాథాల నుండి పరిచయం లేని
కుప్పలు తెప్పలు
ఉత్తత్పుల వినిమయ ప్రపంచంలోకి
నెట్టి వేయబడినాడో మనిషి!
ఎంత తోడినా పూర్తిగాని జ్ఞానదాహానికి
వారధి లేని గమ్యాన్ని నిర్మిస్తూ,
ఏడేడు సముద్రాల్ని ఆలింగనం చేసికొని
డాలర్ల బూజులో వస్తువుల మోజులో
ఇంటింటా నేడు పునరావృతమవుతున్నదీ కొత్త జన్యువు!
అర్రులు జాచిన ఆశల హర్మ్యాల్లో..
అందని వీసా ఆకాశానికి నిచ్చెనలేస్తూ,
మమతానుబంధాల్ని,
అనురాగ ఆప్యాయతల్ని
డిక్షనరీల్లోంచి కన్నీటి సంద్రానికి
టాటా వీడ్కోలంటూ..
ఎలక్ట్రానిక్ డిజిటల్ మేళాలో..
లాప్‌టాప్ ఒడిలో..
అంతరాత్మను తనఖాపెట్టి
పరపరాగ సంపర్కంలో
నవనాగరికతా నిర్మాణంలో,
ఆత్మలేని మనిషిలా..
ఆధీన బతుకు పోరులోని
కొత్త జన్యువర్ణ పటంలో,
వస్తు వినిమయ ప్రపంచంలో..
మరణించాడో మనిషి!!

- బి.కళాగోపాల్
నిజామాబాద్
సెల్.నం.9441631029

ఆలుమగలు!
అమ్మా నాన్నలను మరిచి
అర్ధాంగి అయ్యేది ఆమె!
అత్తా మామలను
అప్పగించేది ఆయన!
అనురాగం పంచేది ఆమె!
అధికార స్వరం వినిపించేది ఆయన!
ఆప్యాయతతో అల్లుకునేది ఆమె!
ఆలంబనై నిలిచేది ఆయన!
నవమాసాలు మోసేది ఆమె!
ఆ ఘనత నాదేనని గర్వపడేది ఆయన!
ప్రసవ వేదనతో నరకాన్ని అనుభవించేది ఆమె!
నా వంశాంకురమని మురిసేది ఆయన!
ఉపవాసాలు, వ్రతాలు పూజలు చేసేది ఆమె!
వాటి ఫలాలు అనుభవించేది ఆయన!
పిల్లల రాకకై కళ్లలో వత్తులు వేసుకుని
నిరీక్షించేది ఆమె!
లోలోన ఆందోళన పడుతూ
చాటుగా కళ్లలో నీళ్లు త్రిప్పుకునేది ఆయన!
ముత్తయిదువులా సాగాలని ఆమె!
తనకంటే ముందుండాలని ఆయన!
ఇలా..ఇలలో సాగే ఆలుమగల ప్రస్థానం!
కావాలి అందరికీ ఆదర్శం!

- పోపూరి మాధవీలత
హైదరాబాద్, సెల్.నం.8125115667

తొలుసూరు బిడ్డ
మారెడు మొక్క కోసం
మట్టి తవ్వినప్పుడే తెలిసింది
రైతు చేతులు పడ్డ కష్టం సంగతేందో!
చారెడు నీళ్లు చెట్టుకు పోసినప్పుడే తెలిసింది
వానకోసం చూసే తడిసిన రైతు కళ్ల సంగతేందో!
చిన్న చిన్న పాదులు చెట్టు సుట్టు తీసినప్పుడే తెలిసింది
గట్లు గట్టినప్పుడు పడ్డ రైతు పాట్ల సంగతేందో!
సుట్టు పెరిగిన పిచ్చిమొక్కలు పీకినప్పుడే తెలిసింది
వంచిన నడుమును ఎత్తకుండా
రైతు కాలుపుదీసే సంగతేందో!
మస్తు పూలు పూయాలని
మందేసినప్పుడే తెలిసింది
మాయదారి మందులు పనె్జయ్యక
రైతు పానాలు దీస్కున్న సంగతేందో!
ఊరికిబోతే నా చెట్టెట్ల అనుకున్నప్పుడే తెలిసింది
ఆరుగాలం ఆత్రపడి కాశిన రైతు కాపలా సంగతేందో!
శిమాంట పువ్వు పూసినప్పుడే తెలిసింది
తొలుసూరు బిడ్డ పుట్టినట్టు రైతుపడ్డ సంబరమేందో!

- పెనుగొండ సరసిజ
కరీంనగర్, సెల్.నం.7386806499

నా మనసు..!
స్పందనలూ ప్రతిస్పందనలూ లేని
మనసున్న మనుషుల మధ్య
మరమనుషుల్లో ఒక మనిషినై
జీవన భ్రాంతితో జీవచ్ఛవంలా
పొట్టతిప్పలు పుష్కలంగా పడడానికి
పుట్టని బుద్ధిగల బుద్ధిజీవిగా
బ్రతకాలని శాసించే నవజీవన చేతనత్వాన్ని
ప్రసాదించమని భగవంతుని వేడుకోవడంతో
శాంతించక ఎనె్నన్నో
కొత్త కోర్కెలను తొడుక్కుంటూ
సాధనాదిశగా పయనించమని
అనుక్షణం శాసిస్తుంది నా మనసు
అది మెచ్చేరీతిలో
అత్యంత వేగవంతంగా
పరుగులాంటి నడకతో..
నిరంతరాయంగా పయనిస్తుంటాను
ఎన్ని అవరోధాలనైనా ఎదుర్కొంటూ..
ఎనె్నన్ని ఆటంకాలనైనా ప్రతిఘటిస్తూ..
- కొడుకుల సూర్య సుబ్రహ్మణ్యం
జగిత్యాల, సెల్.నం.9492457262

అంతర్వేదన

మూగ జీవాలమైన మేము
ఏం నేరం చేసామని
మాకు ఈ బలవంతపు
చావుల శిక్షలు
మీ భాష రాదనా..!
మీకు లాగా మేము కూడా
ఓ తల్లి గర్భం నుండే కదా వచ్చా
మీలా మాకు విడివిడి పేర్లు
బర్త్‌డేలు లేవనా..!
మా మస్తిష్కమంటే
మీకు ఇందుకంత మక్కువా
మరి..
మేము మీలా చదువుకోలేదనా
గడ్డి గాదం తినే
మా దేహంపై
మీకెందుకంత మోజు
మీలా ఫాస్ట్ఫుడ్ తినలేదనా
మా తోల్లు తీసి
మా దేహాన్ని ముక్కలు ముక్కలు చేసి
ఉప్పుకారం రాస్తారు
మేం మీలా ఉప్పుకారం తినలేదనా..
మా కీళ్లు, మా బొక్కలను
మీ కీళ్లు మీ బొక్కలకు వాడతారేం
ఓ మేం మీలా
కాల్షియం షాండోజులు వాడలేదనా!
గొర్రెలమైన మమ్ము చూసి
గొర్రెదాటు అని వెక్కిరిస్తారేం..!
మాలోని ఐక్యత మీకుందా?
అందుకేనా ఆ యమధర్మరాజు
మాకు ఈ బలవంతపు చావులనిచ్చినా
మిమ్మల్ని కూడా నూనెలో వేయిస్తాడట కదా..!
మీ పాపాల లెక్కలు చూస్తాడట కదా..!

- గంప ఉమాపతి
కరీంనగర్, సెల్.నం.9849467551

మార్పు - తీర్పు
నగరాలకు ఎప్పుడూ అలజడే!
నిశ్శబ్ధంగా ఎప్పుడూ ఉండవు
రాత్రి వేళ హాయిగా నిద్రించవు
పల్లెలకు ఎప్పుడూ వౌనమే
ఉల్లం విప్పుకొనే ఏకాంత ధ్యానమే
పొద్దు గుంకితే చాలు
నిద్దురలోకి జారుకోవడమే
నగరవాసులకు పల్లెలంటే ఇష్టం
అయినా ఒక్కనాడు పల్లెలో ఉండడం కష్టం
పల్లెవాసులకు నగరాలంటే మోజు
అందుకే సందర్శన ప్రతి రోజు
పల్లె ఆదుకోనప్పుడు
పట్నం వైపే మనిషి చూపు
నేటి పల్లె రేపు పట్నం అవుతుంది
నేటి నగరం రేపు విశ్వంగా మారుతుంది
మార్పే కదా భవిష్యత్తు!
ఓర్పే కదా భవిష్యత్తు!

- డా. అయాచితం నటేశ్వర శర్మ
కామారెడ్డి, సెల్.నం.9440468557

పుస్తక సమీక్ష

సుమధుర భావాల
సమాహారం!

ప్రతులకు:
డాక్టర్ వాణి దేవులపల్లి,
2-6-1485, శ్రీనివాస కాలనీ,
సుమంగళి ఫంక్షన్ హాల్ వెనుక,
హన్మకొండ-506001
వరంగల్ జిల్లా
ఫోన్ నెం: 8702554855
పేజీలు: 79, వెల : 90/-

‘అభినందించడమంటే..నిన్ను నువ్వు పరిమళించడమే’ అంటూ మంచితనపుప్పొడికి ‘మనిషి తనాన్ని’ అద్దిన కవయిత్రి డాక్టర్ వాణి దేవులపల్లి ‘జ్ఞాపకాల చేద బొక్కైన’ కవితా సంపుటిని ప్రకటించి..తమ అంతరంగంలో సవ్వడి చేసే జ్ఞాపకాలను మనతో పంచుకున్నారు! లాల పోసేటి అమ్మ చేతుల ఘనాన్ని, జోలపాట పాడే అమ్మ గొంతు మాధుర్యాన్ని ‘అమ్మ’ కవితలో ఆవిష్కరించారు. ముప్పయి ఒక్క కవితలతో కొలువుదీరిన ఈ గ్రంథం.. కవయిత్రి యొక్క లోక పరిశీలనను, సామాజిక బాధ్యతను తెలియజేస్తుంది. ‘చెరువంటే మా ఊరి అక్షయకుండ’ అంటూ చెరువు యొక్క గొప్పతనాన్ని ఇందలి కవితలు తెలుపుతాయి! కాలమాన, దేశ ప్రాంతాలకతీతంగా స్ర్తి జాతి నిర్భయంగా సంచరించే మరో ప్రపంచానికి దారులు తెరవండని హితవుపలుకుతాయి. కలల తెలంగాణలో మానవత్వమే గీటురాయి కావాలని సూచిస్తాయి! ఈ కవితల్లోని మరికొన్ని పంక్తులు.. అక్షరాలతో అడుగంటిన వాడి మనసు పొరల్లో మంచితనపు పుప్పొడినద్దుమని కవులను కోరుతాయి! అందాల ఆరాధ్య దేవతగా ప్రేక్షకులకు వెలుగులు పంచే నటీమణులు వ్యధలను ఏకరువు పెడతాయి! ఆంధ్రా, తెలంగాణ విడిపోతేనేం? కలిసుందామన్న నాలుగు మంచి మాటలు ఇందులోని కవితలు పంచుతాయి! ‘సహచరి’ కవితలో కవయిత్రి ప్రకటించిన భావాలు బాగున్నాయి! నీ మనుగడ..తన ఒడిగా చేసుకొని, నీడనిచ్చే చల్లని వృక్షమై అనుక్షణం నీకు అండగా ఉండే సహచరిని అహాలు, భేషజాలు పక్కనపెట్టి ఒక్కసారి ఆర్తిగా, ఆత్మీయంగా అక్కున జేర్చుకొమ్మని చెప్పడం బాగుంది. ‘బతుకిచ్చిన మా బతుకమ్మ’ నువ్వు చల్లంగా ఉండమ్మా! అంటూ ప్రార్థించారు. ఒక్కసారి ‘మాటల పందిరి’లో మల్లె తీగై అల్లుకో.. గుబాళింపుల గుసగుసలు మోసుకొచ్చే జీవ పరిమళాలు నీ నిలువెల్లా ప్రవహించి.. నిన్ను మనిషిని చేస్తాయని ‘శబ్దరాగం’లో చక్కగా తెలియజెప్పారు. డాక్టర్ వాణి ‘వాలు కుర్చీ’పై కవితను రాసి పాఠకులను మెప్పించారు. గతం వర్తమానం కన్నా గొప్పదైనా ఫర్వాలేదు. ఆ గతం తిరిగి రావాలని కోరుకోనంటూ ‘ఆశ’ కవితలో కవయిత్రి తమ మనోగతాన్ని చెప్పిన తీరు బాగుంది. ‘రాజకీయ నాయకులను’ మన వ్యక్తిత్వాన్ని ఎగురేసుకుపోయే గద్దలుగా అభివర్ణించారు. ‘మా వూరు’ కవితలో కవయిత్రి తమ బాల్య జ్ఞాపకాలను దృశ్యమానం చేశారు. ఈ కవిత యందు ప్రాసకోసం పదాలను బలవంతంగా పొదిగించినట్లు మనకు కనిపించినప్పటికీ.. అమాయకత్వం.. మానవత్వం అసలు సిసలైన సిరులని చెప్పి.. ఊరు గొప్పతనాన్ని చెప్పిన తీరును అభినందించకుండా ఉండలేము! పలుకు పలుకులోన స్వచ్ఛ తేనెలొలికే ‘తెలుగు భాషను’ తెలుగు భాష యొక్క తియ్యందనాన్ని పాఠకులకు పంచి పెట్టారు. ‘ఏ కళ అయితేనేం? మనసుకు తట్టిలేపు.. హృదిని కట్టి పడేయాలని కాంక్షించారు. ‘దిండు’ను ‘పూలచెండు’గా అభివర్ణిస్తూ.. ఒంటరి పోరాటంలో.. అనుక్షణం వెంట ఉంటూ భద్రతతో పాటు భరోసానిస్తుందని ‘పూలచెండు’ కవితకు చక్కని ముగింపునిచ్చారు. సమకాలీన సంఘటనలతో, సుమధుర భావాలతో రూపుదిద్దుకున్న.. ఇందులోని చాల కవితలు ఉదహరించడానికి యోగ్యంగా వున్నాయి.. కొన్ని కవితల్లో కవిత్వాంశ అసలే లేకపోయినప్పటికీ.. కవయిత్రి ఉత్తమ వ్యక్తిత్వాన్ని అభినందించకుండా ఉండలేము! వస్తు ఎంపికలో చూపిన శ్రద్ధ శిల్పం, అభివ్యక్తిలో చూపకపోయినప్పటికీ.. కవయిత్రి తమ జ్ఞాపకాలను మనతో పంచుకోవాలన్న ఆసక్తి మనల్ని కట్టిపడేస్తుంది.. మున్ముందు గాఢమైన కవిత్వాన్ని మనకు అందించడానికి డాక్టర్ వాణి గారు కృషి చేస్తారని విశ్వసిద్దాం.

- సాన్వి, కరీంనగర్, సెల్.నం.9440525544

రచనలకు ఆహ్వానం

నవ, యువ, ఔత్సాహిక రచయితలూ ఈ పేజీ మీది...
మీ ఆలోచనలకు అక్షర రూపం...
సమాజానికి కావాలి మణిదీపం! మీరు కథలు, కవితలు,
కథానికలు, కార్టూన్లు, జోకులు, పుస్తక
సమీక్షలు, పుస్తకావిష్కరణలు, ఇలా ఏదైనా,
మీరు రాసిన అక్షరానికి అచ్చురూపం ఇచ్చి, ఆవిష్కరించే
అద్భుత అవకాశమే ఈ ‘మెరుపు’.
మీ కలాలకు పదును పెట్టండి... నిస్తేజంగా ఉన్న భావుకతను
మేల్కొలపండి. ఈ ‘మెరుపు’లో మీరు తళుకులీనండి.
మీ రచనలను కింది చిరునామాకు పంపండి.

సాహిత్య సమాచారం

నిర్వాసితులకు అండగా
10న ‘అక్షరాల మద్దతు’
ఆదిలాబాద్ జిల్లా మందమర్రి మండలంలోని ఎర్రగుంట్లపల్లె పరిసర ప్రాంతాల్లో ఓపెన్‌కాస్ట్ తవ్వకాలు జరుగుతున్నాయ. వీటివల్ల నిర్వాసితులవుతున్న వేలాదిమందికి అండగా నిలిచేందుకు ఈ నెల 10న ‘అక్షరాల మద్దతు’ పేర అక్కడ కవి సమ్మేళనం ఏర్పాటుచేయాలని వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల తెలంగాణ రచయతల వేదిక (తెరవే) సంకల్పించింది. ఈ తవ్వకాల వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లడంతో పాటు ఎంతోమంది నిలువ నీడ కోల్పోతున్న తరుణంలో కవులు, రచయతలు, మేధావులు మద్దతు నివ్వాలని తెరవే ఒక ప్రకటనలో పిలుపునిచ్చింది. దీక్షలు, ధర్నా శిబిరాలతో గొంతు విప్పిన నిర్వాసితులకు మనోధైర్యాన్ని కల్పించేందుకు కవులు, రచయతలు, మేధావులు హాజరు కావాలని కోరింది. ఈ నెల 10వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు కవి సమ్మేళనం ప్రారంభం అవుతుందని తెరవే పేర్కొంది.

ఈ శీర్షికకు కవితలు, కథలు, సాహితీ వ్యాసాలు, కొత్త పుస్తకాల సమీక్ష/పరిచయం, కార్టూన్లు ఈ క్రింది చిరునామాకు లేదా ఈ-మెయల్‌కు పంపండి.

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, జగిత్యాల రోడ్, కరీంనగర్.
merupuknr@andhrabhoomi.net

నిర్వహణ : దాస్యం సేనాధిపతి dasyamsenadhipathi10@gmail.com
email : merupuknr@andhrabhoomi.net

- గరిశకుర్తి రాజేంద్ర