విజయవాడ

స్ట్రీట్ సింగర్ (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెట్రో సిటీలో నిత్యం రద్దీగా వుండే ఫుట్‌పాత్‌పై ఓ దివ్యాంగురాలు రెండు కాళ్లూ కోల్పోయిన దీనస్థితిలో వినసొంపుగా పాటలు పాడుతూ వుంది. ఆమె చుట్టూ జనం చేరడంతో ట్రాఫిక్ కానిస్టేబుల్ పాటలు వింటూ నిల్చున్నాడు. సంగీత ప్రియుడైన ఒక జర్నలిస్టు హడావుడిగా బైక్‌పై వచ్చి పాటలు పాడుతున్న దివ్యాంగురాలిని నీడకు తీసుకెళ్లాడు.
‘మీది ఏ ఊరమ్మా?’.. ప్రశ్నించాడు యువ జర్నలిస్టు, గాయకుడైన రాజు.
‘మాది కర్నూలు జిల్లాలోని ఒక మారుమూల గ్రామం ముత్యాలంపాడయ్యా!’ చెప్పిందామె. ‘రైలు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయాను. నేను మాత్రం రెండు కాళ్లూ పోగొట్టుకొని ప్రాణాలతో బైటపడ్డాను సార్’ అంటూ తన దీనస్థితిని కన్నీటి పర్యంతమై వివరించిందామె.
‘నీ పేరేమిటి?’ ప్రశ్నించాడు.
‘రాణి అని పిలుస్తారు’ చెప్పింది.
ప్రభుత్వం సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ‘ఇళ్లు లేని పేదల’కు నిర్వహిస్తున్న వసతి గృహంలో రాణికి ఆశ్రయం కల్పించాడు జర్నలిస్టు రాజు.
‘చూడమ్మా! నీ పాటలు వినడానికి సిటీకేబుల్ నిర్వాహకులు వస్తున్నారు. ఒక మంచి పాట పాడు. సెల్‌ఫోన్‌లో రికార్డు చేసి వారికి వినిపిస్తాను. ఈ పాటల ద్వారా నీకు బతుకుదెరువు కల్పిస్తాను’ అని ధైర్యం చెప్పాడు.
రాణి ‘వైకుంఠ నాథా.. నన్ను బ్రోవ రావా’.. అంటూ చక్కని రాగంలో లయబద్ధంగా పాడింది. రాణి పాటను రాజు తన సెల్‌ఫోన్‌లోని సంగీత బాణీలతో మిక్సింగ్ చేశాడు.
ఇంతలో సిటీకేబుల్ నిర్వాహకులు వసతిగృహంలోకి ప్రవేశించారు.
‘రండి రామారావు గారూ!’ ఆహ్వానించాడు రాజు. రాణి పాడిన పాటను సెల్‌ఫోన్ ద్వారా సిటీకేబుల్ ఆపరేటర్లకు వినిపించాడు.
‘చూడమ్మా! నేటి కుర్రకారుకు హుషారు కలిగించే ఒక సినిమా పాట పాడగలవా?’ అని లోకల్ ఛానల్ ఆపరేటర్ రామారావు అడిగాడు.
వెంటనే ఎలాంటి సంకోచం లేకుండా ఎంతో జోష్ నింపుతూ ఇటీవల అందరూ కొత్త ముఖాలతో తీసిన ఒక సినిమా పాటను పాడింది రాణి. సిటీకేబుల్ నిర్వాహకులు విని సంతృప్తి చెందారు.
‘ఈ పాటను మేం రాత్రి ప్రసారాల్లో వినిపిస్తాం. మీరూ వినండి రాజుగారూ’ అంటూ వసతిగృహం నుండి వారు బైటకు నడిచారు.
‘అమ్మా రాణీ! త్వరలో ఒక పేరుమోసిన సినిమా సంస్థ వారు కొత్త నటులతో ఒక సరికొత్త సినిమాను ఆధునిక సాంకేతిక రీతుల్లో నిర్మిస్తున్నారు. ఆ చిత్రంలో రెండు ప్రేమగీతాలను నీతో పాడిస్తామని నాకు మాట కూడా ఇచ్చారు. జీవితాన్ని గురించి నీకు దిగులు అక్కరలేదు. కాళ్లు లేవని నువ్వు కలత పడవద్దు. మన ప్రభుత్వ సహకారంతో నీకు జయపూర్ వారి కృత్రిమ కాళ్లు అమర్చే ఏర్పాటు చేస్తున్నాను. భోజన వసతికి ఏలోటూ రాదు. వసతిగృహం నిర్వాహకులకు అన్ని వివరాలు చెప్తాను. రేపు నిన్ను స్టూడియోకు తీసుకెళ్తాను’ అంటూ జర్నలిస్టు రాజు ఆమెకు కొండంత భరోసా ఇచ్చాడు.
దివ్యాంగురాలైన 20 సంవత్సరాల యువతి రాణికి వైద్యులు జయపూర్ కృత్రిమ కాళ్లను అమర్చారు. ఆమె ఆనందానికి హద్దుల్లేవు.
ఎంతో సంతోషంతో జర్నలిస్టు రాజు ఆమెను పాటల ‘ఆడిషన్’ కోసం స్టూడియోకు తీసుకెళ్లాడు. సినిమా నిర్మాతలు రాణి పాడిన పాటలు విని సంతృప్తి చెందారు. మంచి పారితోషికం ఇస్తామని కూడా ప్రకటించారు. ఒక ఒప్పంద పత్రం రాసి గాయని రాణి, జర్నలిస్టు రాజుతో సంతకాలు చేయించుకున్నారు. సినిమా నిర్మాణం కోసం స్టూడియోలో అన్ని హంగులతో ‘సెట్’ ఏర్పాటు చేసి షూటింగ్‌కు బయలుదేరారు.
జర్నలిస్టు రాజు సినీ నిర్మాత రాయుడమ్మతో మాటలు కలిపాడు. తన మనసులోని మాటను బయటపెట్టాడు. తాను దివ్యాంగురాలు రాణిని ప్రేమ వివాహం చేసుకొని ఆమె జీవితానికి ఏలోటూ రాకుండా ఒక భరోసా కల్పించబోతున్నట్లు వివరించాడు. ఈ నిర్ణయాన్ని హర్షిస్తూ రాజును ఆయన హృదయపూర్వకంగా అభినందించారు.
నిర్మాత రాయుడమ్మ మదిలోనూ వెంటనే ఒక ఆలోచన తళుక్కుమంది. వీరిద్దరికీ తానే ఆదర్శ వివాహం చేయాలనుకున్నారు.
సినిమా బృందంతో స్టూడియోలోనే రాజు-రాణిల పెళ్లి వేడుకలను రాయుడమ్మ వైభవంగా జరిపించారు. రాణికి చెందాల్సిన సినీ పాటల పారితోషికం చెక్కును నూతన వధూవరులకు అందజేశారు.
‘రాణి ఇప్పుడు స్ట్రీట్ సింగర్ కాదు.. ‘మాస్ అండ్ క్లాస్ సింగర్’ అంటూ హర్షధ్వానాల మధ్య ప్రకటించారు రాయుడమ్మ.

- డిఆర్ రాజ్‌పాల్,
తెనాలి, గుంటూరు జిల్లా.
చరవాణి : 9502632202

ఛిన్న కథ

మరణం
‘ఏమిటీ మాటిమాటికీ వెనక్కి చూస్తున్నావు?’ అడిగేడు శ్యాంబాబు శారదని.
‘మన వెనుక అమ్మ కూర్చుందిరా’ భయంగా అన్నది అక్క శారద.
శ్యాంబాబు వెనక్కి తిరిగి చూశాడు.
అతను కూడా భయంతో వణికిపోయాడు.
కారణం తల్లి చనిపోయి ఇరవై రోజులైంది.
ఆవిడ బతికున్నన్ని రోజులూ బద్దశత్రువుల్లా బతికారు అక్కాతమ్ముళ్లు. వాళ్లిద్దరినీ కలపాలని దుర్గాంబ చాలాసార్లు ప్రయత్నించి విఫలమైంది.
ఆడపిల్లకి ఆస్తిహక్కు వుందంటూ సగం ఆస్తి శారదకి రాసిందావిడ. అక్కయ్య తల్లిని మభ్యపెట్టి ఆస్తి రాయించుకుందని.. ఆరేళ్ల నుంచీ వాళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.
తల్లి చనిపోయిందని తమ్ముడు ఫోన్ చేయగానే ఆటోలో వచ్చి దిగాడు. తమ్ముడిని కౌగిలించుకుని బావురుమంది శారద. ఆరేళ్ల తరువాత అక్క, ఆమె ఓదార్పు శ్యాంబాబుని కరిగించి వేశాయి. ఎప్పుడూ ‘అక్కయ్యా’.. అంటూ అంటిపెట్టుకు తిరుగుతున్న భర్తని చూసి ఆశ్చర్యపోయింది శ్యాంబాబు ఇల్లాలు. వాళ్ల అనుబంధం చూసి ఇంత ప్రేమున్న వాళ్లు ఇనే్నళ్లు ఎలా దూరంగా వున్నారో అనుకుంది.
అత్తగారు తనతో చెప్పుకుని బాధపడేది. ఆమె చనిపోగానే వాళ్లు ఇలా ప్రేమగా కలిసిపోవడం ఆమెకి చిత్రమనిపించింది.
‘అమ్మకి సినిమా పిచ్చి ఎక్కువ. కానీ చనిపోయినా కూడా ఆత్మ సినిమాకి ఇలా వచ్చిందేమో?’ చిన్న గొంతుతో తమ్ముడితో అంది శారద.
మరోసారి వెనక్కి చూసిన శ్యాంబాబు ఆమె తల్లి కాదని గ్రహించి ‘అది నీ భ్రమ. అమ్మకాదామె’ అన్నాడు మెల్లగా.
‘మీ ఇద్దరినీ కలపాలని బతికుండగా ఎంతగా ప్రయత్నించానో! చివరికి నేనిలా చనిపోయాకానైనా మీరు కలిసినందునకు సంతోషం. నా మరణం మీ ఇద్దరినీ కలుపుతుందని తెలిస్తే ఎప్పుడో మరణించేదాన్ని’ చిన్నగా వినిపించాయి మాటలు. వెనక్కి తిరిగి చూశారిద్దరూ. అక్కడ ఎవరూ లేరు!
- చావలి నాగ శ్యామల,
విజయవాడ.

పుస్తక పరిచయం

శ్రీ వినాయక వైజ్ఞానిక వివరం, శ్రీ కనకదుర్గకి ఖడ్గమాలార్చన
శ్రీ వినాయక వైజ్ఞానిక వివరం
వెల : రూ.42/-
శ్రీ కనకదుర్గ ఖడ్గమాలార్చన
వెల: రూ.76/-
ప్రతులకు: బలభద్రపాత్రుని
భానుమతి కేశవరావు,
శ్రీ లలితా జ్ఞానపీఠము,
డోర్ నెం.14-10-73,
మారీసుపేట, శివాలయం వీధి, తెనాలి, గుంటూరు జిల్లా.

శ్రీమతి బలభద్రపాత్రుని భానుమతి కేశవరావు కలం నుండి వెలువడిన ఆధ్యాత్మిక గ్రంథాల్లో ఒకటి శ్రీ వినాయక వైజ్ఞానిక వివరం. పూజల్లో మొదటి పూజను అందుకునేవాడు విఘ్ననాయకుడు గణపతి. గణపతిని పూజించనిదే ఎలాంటి పనులు చేయరు. కారణం ఈయనకు గణాధిపత్యం ఇవ్వటమే. గణపతిని గురించి అనేక మంది అనేక గ్రంథాలు రచించారు. శ్రీ దేవీ ఉపాసకురాలు కావటం వల్ల తనకు కలిగిన అనుభవాల ద్వారా భానుమతి కేశవరావు అనేక పుస్తకాలను రచించారు. వీటిలో గణపతిపై తన మనస్సులో కలిగిన భావనలను ఈ పుస్తకం ద్వారా అక్షరాలుగా మలిచారు. ఈ పుస్తకంలో వినాయక చవితిపై వైజ్ఞానిక విజ్ఞాన వివరణ ఇచ్చారు. వినాయకునికి సంబంధించిన ఎన్నో విషయాలను పుస్తకంలో పొందుపరిచారు. శివుని ఢమరుకం నుండి ఓంకారం ఉత్పన్నమై వినాయకునిగా పరిణామం పొందిన ఆయనే ఓంకార గణపతి అయ్యారు. శీఘ్ర కార్యసిద్ధికి గణపతిని చతుర్థి రోజన పూజించాలి. 21 నామాలు, 21 గణపతులు, వాటిని పూజించే విధానాన్ని ఇందులో తెలియజేశారు. అలాగే కాణిపాకం వరసిద్ధి వినాయకుని గురించి, మహారాష్టల్రో ఎనిమిది రూపాల్లో అష్టవిధ గణపతులు వెలిసిన దాని గురించి వివరించటమే కాకుండా శిరస్సును ఉత్తర దిక్కున వుంచి ఎందుకు నిద్రపోరాదు?, గణపతికి అంత పెద్ద తొండమున్నందువల్ల ఉపయోగమేమి? దుర్వార యుగ్మముతో పూజిస్తే స్వామికి ప్రియతమమని చెపుతారు, కారణం? గణపతి పూజకు గరిక ప్రధానమని ఎందుకు చెప్పారు? వంటి అనేక ధర్మ సందేహాలకు సమాధానం ఈ పుస్తకంలో లభిస్తుంది. వివిధ గణపతుల పేర్లను, చివరిగా వినాయక వ్రతకల్పాన్ని అందించారు రచయిత్రి. వినాయకుని వివిధ రూపాలు, ఆయన మహిమలనే కాకుండా వినాయక వ్రతకల్పం కూడా ప్రచురించటం వల్ల వినాయకుని మహిమలు తెలుసుకునే అవకాశం
***
ఈ సృష్టిలో తియ్యనైన మాట అమ్మ (తల్లి). మనం అడగకుండా మనకు అన్నీ సమకూర్చేది కన్నతల్లి. అలాగే మనం ప్రార్థించిన వెంటనే మన కోర్కెలను తీర్చే చల్లని తల్లి ఆ జగన్మాత. ఆ జగన్మాతను మనం ప్రసన్నం చేసుకోవాలంటే ఆమెను అనేక రకాలుగా పూజించాలి, ఆరాధించాలి. ఆమెను ప్రసన్నం చేసుకోవాలి. అందుకోసం మనం ఏమి చేయాలి? జగన్మాతను ఎలా ప్రసన్నం చేసుకోవాలి? ఆ తల్లిని ఏవిధంగా పూజిస్తే మన కోరికలు తీరుతాయి? పూజా విధానం ఏమిటి? పూజలో పాటించవలసిన పద్ధతులేమిటి? వంటి అనేక విషయాలను పాఠకులకు తెలియజేయటానికి కారణం ఆ మాత కృప, స్వీయ అనుభవమే అని అంటున్నారు రచయిత్రి శ్రీమతి బలభద్రపాత్రుని భానుమతి కేశవరావు. ఈ పుస్తకం మొత్తం ఆ జగన్మాతకు సంబంధించిన పూజా విధానమే. మహాశక్తి స్వరూపిణి అయిన జగన్మాత (కనకదుర్గమ్మ)ను సులభంగా ప్రసన్నం చేసుకోవటానికి ఉపయోగపడే ఖడ్గమాలా పూజా విధానం గురించి విపులంగా, పరిశోధనాత్మకంగా వివరించారు రచయిత్రి. శ్రీచక్ర రూపంలో ఉండే మాతను ఏవిధంగా పూజించాలి? శ్రీచక్రంలో వివిధ దేవతా స్వరూపాలను ఎక్కడ ప్రతిష్ఠించాలనే విధానం గురించి అనుమానం లేకుండా అనేక చక్రాలను చక్కగా అందించారు. ఉదాహరణకు సర్వసంక్షోభణ చక్రము అష్టదళ పద్మస్థిత త్రిపురసుందరి చక్రం మధ్యలో త్రిపుర సుందరిని ఉంచి మిగిలిన ఎనిమిది కోణాల్లో ఏఏ దేవతలను ఉంచాలో చక్కగా అందరికీ అర్థమయ్యేలా బొమ్మతో సహా ప్రచురించారు. ఆ తల్లిని ఏ బీజ మంత్రాల్లో పూజించాలో కూడా ఇచ్చారు. ఇలా నవచక్రములు, బొమ్మలు పూజా విధానంలో ఇచ్చారు. ఇందులో చివరిగా లలిత సహస్ర నామావళి, త్రిశతి, అష్టోత్తర శత నామావళి, శ్రీసూక్తమ్, దుర్గాసూక్తం, సరస్వతీ సూక్తంతో ఫలశ్రుతి ఇచ్చారు. అతి లఘు విధానంలో ఖడ్గమాలా మంత్ర శ్రీచక్ర నవావరణార్చన ఇచ్చారు. ఖడ్గమాలా పూజను ఆచరించలేని పరిస్థితుల్లో ఈ లఘు పద్ధతిని పాటించాలి. దీంతోపాటు వివిధ దేవతల స్తుతిలను అందించారు రచయిత్రి. దేవీ ఉపాసకులకిది మంచి ఉపయుక్తం.

- విష్ణ్భుట్ల రామకృష్ణ,
విజయవాడ.
చరవాణి : 9440618122

మనోగీతికలు

రీ కౌంటింగ్!
విద్యార్థుల్ని భావిభారత పౌరులుగా
తీర్చిదిద్దాల్సిన విద్యాలయాలు
వ్యాపార సంస్థల్లా మారిపోయాయి
రాత్రిళ్లంతా కష్టపడి చదివి పరీక్ష రాస్తే
పాస్ మార్కులు మాత్రం వేసి
వేదనకు గురిచేస్తున్నారు
మాస్‌కాపీ కొట్టినవారు,
ముందుగానే ప్రశ్నపత్రాలు
వేలకువేలు పెట్టి కొని
చదవకుండానే పరీక్ష రాసినవారు
ర్యాంకులు సాధిస్తున్నారు!
విద్యతో వ్యాపారమా?
విద్యార్థులతో చెలగాటమా?
ఇన్నాళ్లూ కష్టపడి చదివినందుకు
ఫలితం రాక హడావుడిగా దిద్దిన
ఆన్సర్ పేపర్లు చూసి కన్నీళ్లు
ఎంతోమంది విద్యార్థులు
మనస్తాపం భరించలేక
బలవన్మరణం చెందుతున్నారు
దయచేసి విద్యార్థుల్ని బలిచేయకండి
విద్యని వ్యాపార దృష్టితో చూడకండి
రీకౌంటింగ్ పేరుతో డబ్బులు వసూలు చేసి
మార్కుల్ని కొనుక్కునే దుస్థితిని మార్చండి!
దిగజారిపోతున్న విద్యాసంస్థలూ..
ఇకనైనా మేలుకోండి
డబ్బు కోసం ఆశపడి
రీకౌంటింగ్‌ని ప్రోత్సహించకండి
ఎవరి మీదనో వున్న కోపాన్ని
ఆన్సర్ పేపర్ల మీద చూపించి
విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడకండి
మా రేపటి ఆశల్ని, కలల్నీ సమూలంగా తుంచి
మా భవిష్యత్తును చిదిమేయకండి
మా కష్టానికి నిజాయతీగా
ఫలితాన్ని అందించండి
మా కోరిక అదొక్కటేనండి!

- ఉపద్రష్ట మానస, బిఎస్సీ
గుంటూరు.
చరవాణి : 9059018832

హైకూలు
మెరుపు కొడ్తే
మేఘం విలపిస్తోంది
బయట వర్షం

మనసులు దూరం
మనుషులే దగ్గర
మానవ నైజం

పుస్తకం మూశా
పాత్రలు కళ్ళముందు
కథ సజీవం

మాటే సంస్కారం
అతివలు కన్పిస్తే
కళ్ళలో కామం

కుల సంఘాలు
నాందీ ప్రస్తావనలు
మత రాజ్యానికి

నాన్న మనసు
ఈడొచ్చిన కొడుకు
భిన్న ధృవాలు

- సూదా శివరామకృష్ణ
కొప్పురావూరు, గుంటూరు
చరవాణి: 9885404009

విచిత్ర భూతం
చెదిరిన బాల్యపు స్మృతులపై
నవయవ్వనపు తేజస్సును కప్పుకొని
అడుగడుగున పరచిన
ఆశల రహదారిలో
కళాశాల వైపునకు పయనిస్తున్నావా
జగమెరుగని బంగారు తల్లీ!
నీ ఆశలన్నిటినీ
ఆశయాశలవకుండానే
చిదిమేసే వారక్కడ రెడీగా ఉంటారు
ర్యాగింగ్ అనబడే ‘విచిత్ర భూతం’
పాత విద్యార్థులలోకి
పరకాయప్రవేశం చేస్తుంది
దాన్ని అంతమొందించడానికి
విద్యావిజ్ఞాన స్వరూపిణి
అపరకాళిగా అవతారమెత్తదు
అప్పుడిక వాళ్ళకి
తిరుగేముంటుంది?
వాళ్ళు ఆడించే విచిత్ర క్రీడలకు
స్వాగతం పలకాల్సిందే
నిన్న సాధించిన విజయాలకు
సరికొత్త రూపాన్నిద్దామనుకుంటే
ఇక్కడ విజయమనే త్రాసులో
కొత్త పాతలను తూచినప్పుడు
అది పాత వైపుకే మొగ్గుచూపుతుంది
ఇక పాతకు తిరుగేముంటుంది?
విజయగర్వంతో
వికటాట్టహాసం చేస్తుంది
పాత విద్యార్థుల మొరటుతనం
కొత్త జీవితాలను మొగ్గల్లోనే
తుంచేస్తుంది
ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్‌లా
కారులో షికారుగాళ్లకు సీటుబెల్టులా
ప్రమాదాల బారినపడే విద్యార్థినులకు
అక్కడేవీ రక్షణ కవచాలుండవు
తాతాజీ చెప్పిన కచ్చడాలను
మళ్ళీ తెస్తారా?
వద్దు, వద్దు పాత రోతను
వదిలేయండి
పాత విద్యార్థులను కొత్తదారికి తెచ్చే
ప్రిన్సిపుల్సేమయినా
ప్రిన్సిపాల్స్ కనిపెట్టాలి
కొత్తపాతల మేలుకలయికతో
క్రొమ్మెరుంగులు చిందినట్లుగా
పాతకొత్త విద్యార్థుల కలయిక
ర్యాగింగ్ బంధనాన్ని తుంచి
అనురాగబంధాన్ని పెంచాలి!

- పొత్తూరి సుబ్బారావు,
పొత్తూరు.
చరవాణి : 9490751681

గురువు
గురువు మన అజ్ఞానాన్ని
తొలిగించి
జ్ఞానజ్యోతి వెలిగిస్తాడు
తల్లిదండ్రులకన్నా మిన్నగా
గురువును గౌరవించాలి
తల్లిదండ్రులు కేవలం జన్మనిస్తారు
గురువులు గొప్ప మలుపు
తిప్పుతారు
గురువులను మనం గౌరవిద్దాం
గురువులను మనం పూజిద్దాం
మనకు గురువులు
ఎన్నో మంచి విషయాలు
నేర్పుతారు
గురువులను దేవుడిలా
పూజిద్దాం
గురువులు మన మేలు కోరతారు
‘గురువు లేని విద్య గుడ్డి విద్య’
గురువు ప్రేమ
మాతృప్రేమతో సమానం
గురువుకు నమస్కరిస్తే
అందరు దేవతలకీ
నమస్కరించినట్లే
అందరం గురువులను
గౌరవిద్దాం
ఆశీర్వాద బలంలో
ఉన్నతికి ఎదుగుదాం

- ఎస్‌కె జాస్మిన్

email: merupuvj@andhrabhoomi.net

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, ప్లాట్ నంబర్ సి- 3, 4, ఇండస్ట్రియల్ ఎస్టేట్, విజయవాడ - 520 007. vijmerupu@gmail.com

- డిఆర్ రాజ్‌పాల్